ప్రపంచం మారిపోతుంది

1
6

[సంచిక 2022 దీపావళి పోటీకి అందిన కథ.]

[dropcap]“ప్ర[/dropcap]పంచం మారిపోతుంది, ప్రపంచం మారిపోతుంది, నా కళ్ళ ముందే నాశనం అయిపోతుంది” ఫేస్‌బుక్ చదువుతూ విపరీతంగా బాధపడుతున్నాడు త్రిమూర్తులు.

“అబ్బో ఫేస్‌బుక్‌లో అక్షరాలే సరిగ్గా కనపడవు. మీ కంటికి నాశనం అయితున్న ప్రపంచం కనపడుతుందే, తీరిగ్గా కూర్చొని టీలు, టిఫినీలు, లంచ్‍లు, డిన్నర్‍లు కానిస్తే అలాగే అనిపిస్తుంది. అలా పాఠశాలలో ప్రయివేట్‍కి కుదురుకోండి, కాస్త కాలక్షేపం అవుతుంది.”

“గౌరీ నీ వేళాకోళంకి ఏమి కానీ, ప్రయివేట్ పాఠశాల కాదే ఈ ప్రభుత్వాన్నే ప్రయివేట్‍కి అప్పచెప్పుదాం అన్న పథకంలో ఉన్నారు నేటి పాలకులు. నాడు స్వరాజ్యం కోసం ఎంత కష్టపడ్డారో, మా తాతయ్య కథలు కథలుగా చెప్తుంటే రక్తం ఉప్పొంగేది తెలుసా, నేడు మళ్ళీ ప్రయివేట్ పరం చేస్తున్నారు అంటే, రక్తం మరిగిపోతుంది.”

“రిటైర్ అయి పదిహేను నెలలు అయింది. ఇంకా రక్తాన్ని మరిగించుకుంటూ కూర్చుంటే ఆ తరువాత నిప్పు మీద కుండలు మరిగించుకోవాలి మేము. ఈ ఉన్న నాలుగేళ్లు కృష్ణా రామా అంటు కూర్చోకుండా ఎందుకచ్చిన ప్రాపంచిక పైత్యం. అక్కడికేదో ఈ భూ ప్రాపంచికం మీద మీకొక్కరికే తాతగారు ఉన్నట్టు హెచ్చులొక్కటి.”

“ఛీ ఛీ నీకు ప్రపంచజ్ఞానం చెప్పాలనుకున్నాను చూడు, నాది బుద్ది తక్కువ.”

“మరే ఆ కాలం లోనే ఇరవై లక్షలు వెచ్చించి మరీ మిమ్మల్ని నాకు కొనిచ్చాడు చూడు, ఆ మహానుభావుడు అదే మా నాన్న గారి కంటేనా. ప్రపంచం జ్ఞానం చాలు గాని వెళ్లి స్నానము చెయ్యండి, తిరుపతి పండక్కి వస్తాను అని ఫోన్ చేశాడు కదా. ఈరోజే వచ్చేది మరిచి పోయారా.”

“అవును కదూ, సరే పద” అని వెళ్ళాడు.

***

“తాతయ్య మనకు ఇంత మంది Gods ఎందుకు ఒక్కరు సరిపోరా. మా స్కూల్లో ఇలా చాలా మంది దేవుళ్ళకు పూజలు చేస్తున్నాం అని చెప్పితే పనిష్మెంట్ ఇస్తారు తెలుసా” అని త్రిమూర్తులు మనమడు (పేరు క్వశ్చన్) అనగానే –

త్రిమూర్తులు కొడుకుతో “ఏరా అమెరికాలో మన సరస్వతి శిశుమందిర్ లాంటివి లేవా, ఏ క్రిస్టియన్ స్కూల్‍లో చేర్చావా ఏమీ?” అని అడగ్గా

“లేదు నాన్నా, మా బాస్ దగ్గర పేరు రావాలి అంటే క్రిస్టియన్ స్కూల్ లోనే చేర్చాలి” అన్నాడు త్రిమూర్తులు కొడుకు తిరుపతి.

అని వెంటనే “ఏ క్వశ్చన్, తాతయ్యని ఇలాంటివి అడగొద్దు అని చెప్పానా లేదా?” అన్నాడు కొడుకుతో.

“ఏంటి క్వశ్చనా, అదేం పేరు రా. నేను లక్షణంగా కృష్ణా అని ఆ దేవదేవుని పేరు పెడితే ఈ క్వశ్చన్, ఆన్సర్, పజిల్ ఏంటి రా దరిద్రంగా.”

“అయ్యో నాన్నా.. ట్రెండ్ నాన్నా. పేరు కొత్తగా ఉండాలి, ఎవ్వరు పెట్టుకోనిదై ఉండాలి.” అనగానే

త్రిమూర్తులు “నీ తలకాయలా ఉండాలి. అలా అంటే జగద్వంధ్య, జగత్పాల అని సంస్కృతంలో పెట్టుకోవాల్సింది. ఈ ఆంగ్ల భాషలో ఈ పిచ్చి పేరు ఏంటి రా.” అన్నాడు.

“చెప్పా కదా నాన్నా, బాస్ కోసమని.”

“మాట్లాడితే బాస్ అంటావు, నీకంటూ జీవితం ఉండదా.” అనగానే

“ఇక మాట్లాడింది చాలు కానీ, ఫోన్‍లో ఛార్జింగ్ నిండింది, ఈ ఫోన్ పట్టుకొని ఇక ప్రపంచ యాత్రకి బయలుదేరండి, రాక రాక కొడుకు ఇంటికొస్తే, మీరూ, మీ యక్ష ప్రశ్నలు. అదిగో వాడెవడో కుల నిర్మూలన అసాధ్యం అని పోస్ట్ పెట్టి తగలడ్డాడు. ఇక వాని మీద పడండి. ఎందుకు అసాధ్యం అంటూ వాదిస్తూ.” అని చేతిలో ఫోన్ పెట్టి వెళ్ళిపోయింది గౌరీ.

“అదేంటి నాన్నమ్మ, తాతయ్య ఫోన్‍లో చార్జింగ్ లేనప్పుడే బయట వాళ్లతో మాట్లాడతారా.” అడిగాడు మనవడు.

“అంతేరా అదో మాయరోగం వచ్చింది ఇండియా జనాలకు. ఇంట్లో అంతా ఎదురు ఎదురుగానే కూర్చుంటారు కానీ ఒక్కడూ నోట్లోంచి ఒక్క మాట మాట్లాడడు. కానీ అదేదో ఫేస్‌బుక్ అంట, దాంట్లో పనికిమాలిన చెత్తంతా టిక్కు టిక్కు అని ఒత్తుకుంటూ కూర్చుంటారు. అవన్నీ నీకెందుకు కానీ పద పాలు పోస్తాను” అని తీసుకొని వెళ్ళింది.

“ఏంటి తాతయ్య మీరు మాంసాహారం తింటారా. అది పాపం కదా.” అని ఆ పిల్లాడు అనగానే

“గాడిద గుడ్డేం కాదు, మాంసం తినకుంటే బలం ఎలా వస్తుంది, కష్టపడి పని చేసేవాళ్ళకి శక్తి ఎలా.” అంది గౌరి.

మనవడు అందుకుని “ప్రాణులను చంపడం పాపం కదా నానమ్మా.” అన్నాడు.

“మొక్కలకి కూడా ప్రాణం ఉంది కదారా” అంది గౌరీ.

“అయినా చైనాలో అమెరికాలో కప్పలు, గబ్బిలాలు తింటారు అంటారు కదరా, ఈ శాకాహారం పిచ్చి ఎవరు అంటించాడు.” అనగానే

కొడుకు తిరుపతి “అదేదో వేగాను అని సంస్కృతి అమ్మా, శాకాహారం తినాలి, జీవులను ప్రేమించాలి అని చెప్తుంది. పాటిస్తే మంచిదే కదా.” అన్నాడు.

“నీ తలకాయ మంచిది. ఇంత జీతం ఇంత జీవితం పెట్టుకొని ఓ కోడిని కోసుకొని తినడానికి ఆలోచిస్తావా ఎందుకు. నువ్వు చంపకుంటే మాత్రం ఆ కోడి వెయ్యేళ్ళు వర్ధిల్లుతుందా ఏమీ. మన ఇండియాలో రోడ్డు ప్రమాదాల్లో ప్రతీ ఏడాదికి 5 లక్షలమంది చస్తున్నారంట, దాన్నెవ్వడన్నా పట్టించుకున్న పాపాన పోయాడా. ఈ భూమి మీద మనుషులకే దిక్కు లేదురా అంటే నువ్వు కోళ్లు, మేకల కోసం నా మనమడిని ఎండ పెడతావా.” అని గౌరీ అనగానే

పక్కనుండి త్రిమూర్తులు “పాపం వాడికి కూడా తినాలనే ఉంటుంది కాకపోతే వాళ్ళ బాస్ ఒప్పుకోవద్దు.” అనగానే తిరుపతి మొహంలో రంగులు మారాయి.

“అది సరేగాని ఫారిదా రాలేదేమి?”

“అంటే తానొక సామాజిక కార్యకర్త నాన్న. ఏదో దేశంలో బుర్కా బాన్ చెయ్యాలి అని ప్రభుత్వం తీర్పు ఇచ్చినందుకు, దాన్ని ఖండిస్తూ ర్యాలీలు చేస్తుంది, అందుకే రాలేదు.” అనగానే

“ఏంటి బుర్కా బాన్ వద్దా, ఇంకా నయం పర్దా వెనకాలే కూర్చుంటాం. మూడేళ్ళకే బాల్య వివాహాలు చెయ్యాలి అంటూ ర్యాలీలు తియ్యట్లేదా పాపం. చదువుకుంటే ఉన్న మతి పోయినట్టు ఇదేమి జాడ్యం రా.” అనగానే

తిరుపతి “నాన్నా, మీకు మతాంతర వివాహం ఇష్టం లేదు అని నాకు తెలుసు. అయినా నాకు ఫారిదా అంటే ప్రాణం, కాబట్టి మిమ్మల్ని కాదని పెండ్లి చేసుకున్నాను. అది మనుసులో పెట్టుకొని ఇలా తిట్టడం బాగోలేదు.” అంటాడు.

వెంటనే గౌరీ “అయ్యిందా, అప్పుడెప్పుడో పెళ్లికి ఒప్పుకోలేదని అలిగి వెళ్లి ఇన్నేళ్లకు ఇంటికి వచ్చిన వాడిని ఇలాంటి మాటలా అనడం.” అని, కొడుకుతో..

“పోనీ నాన్నా, మీ నాన్న కి ఈ మధ్య బుర్ర పని చెయ్యడం లేదు. రోజంతా ఫేస్‌బుక్‍లో కూర్చొని పిచ్చోడయ్యాడు, వారసత్వ పాలన పోవాలి అంటాడు, మళ్ళీ రాహుల్ గాంధీకి అధికారం ఇవ్వాలి అంటాడు. బీజేపీ హిందూ మతాన్ని కులాలుగా విడగొడుతుంది అంటాడు. దేశాన్ని దక్షిణ ఉత్తర భారత్ లాగా చెయ్యాల్సిందే, ఆర్యులు వేరే ద్రావిడులు వేరే అంటాడు. అసలు ఏం మాట్లాడుతున్నాడో తనకే అర్ధం కావడం లేదు. వదిలేసి భోజనం చెయ్యి నాన్నా” అని గౌరీ తిరుపతిని శాంతింప చేసింది.

***

రాత్రి నిద్ర పోతున్నప్పుడు క్వశ్చన్ తాతయ్యతో, “తాతయ్య నాకేమన్నా కథలు చెప్పవా” అనగానే

“చెప్తారా, నాకు చెప్పాలనే ఉంది వినేవారు లేక బాధ పడుతున్నాను. అసలు ఈ సృష్టి ఎలా వచ్చింది తెలుసా దేవుని వల్ల కాదు, ఏక కణం జీవి నుండి ఇంత పెద్ద మనిషి దాకా వచ్చాడు.”

“Yes i know it. It is Darwin theory.”

“మరి క్రీస్తుని ఎందుకు పూజిస్తావ్?”

“It’s a culture.”

“ఓకే. అయితే. మన ఇండియానే తీసుకో. ఇంత మంది ఇన్నిరకాలుగా కులాలు, మతాల పేరుతో బతకడం ఎందుకు అందరూ ఒక్కటిగా ఉండచ్చు కదా?”

“Yes it’s a good thought.”

“దానికి ఏం చెయ్యాలంటావ్.”

“Each and every people have to think themselves తాతా. There is no Allauddin deepam to change all at a time.”

“అది కాదురా మన వంతు ప్రయత్నం ఉండాలి కదా.”

“Yes, it’s our responsibility. But showing right path is called greatness. If you order the people to walk in that single path only, is nothing but fascism. By order we can’t achieve reforms తాతా.”

“ఆమ్మో చాలా తెలివుందే. అయితే నాకెందుకో ప్రపంచం మొత్తం ఉల్టా ఐతున్నట్టు, గతం ఏదో గొప్పదన్న భ్రమల్లో జనాలు ఆదిమ కాలానికి వెళ్తున్నట్టు అనిపిస్తుంది.” అనగానే పిల్లాడు నవ్వుతూ

“Old is gold తాతా” అని పడుకున్నాడు.

వెంటనే గౌరీ “సరిపోయిందా డెబ్భై ఐదేళ్ల మీ టీచర్ తెలివి, ఐదేళ్ల పిల్లాడి ముందు ఉష్ కాకి. మళ్ళీ ఫేస్‌బుక్‍లో మీరో పెద్ద ఫిలాసఫర్. మీ పోస్ట్ లకు వేలాది మంది ఫాలోయర్స్ కూడాను. పండుకోండి.” అని నిద్ర పోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here