జగన్నాథ పండితరాయలు-12

4
3

[తెలుగు సాహిత్య ప్రపంచంలో చారిత్రిక కాల్పనిక కథా రచనకు ఎంతో చరిత్ర వుంది. ఆ రచనా సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ సంచిక అందిస్తోంది ప్రముఖ రచయిత విహారి రచించిన చారిత్రిక కాల్పనిక నవల ‘జగన్నాథ పండితరాయలు’.]

[ఆజ్మీరులో విద్య గరిపి జగన్నాథుడు కాశీకి తిరిగి వస్తాడు. బిడ్డ చనిపోయిన దుఃఖం కామేశ్వరిని వెన్నాడుతోందని గ్రహిస్తాడు. ఆమెను ఓదారుస్తాడు. కాశీలో మౌల్వీలు రచ్చకెక్కుతారు. జయపురం మహారాజు ఏర్పాటు చేసిన పండిత సభలో జగన్నాథుడు మౌల్వీలను ఓడిస్తాడు. మహారాజు జగన్నాథుడికి సత్కారం చేసి ‘కవిసార్వభౌమ’ బిరుదు ప్రదానం చేస్తాడు. కాశీలోని తమ సంస్కృత కళాశాలలో ప్రధానాచార్యునిగా నియమిస్తాడు. ఈ విజయోత్సవ వార్తలు జనం నాలుకలపై నర్తించసాగాయి. సలీం అనే వడ్రంగి జగన్నాథుడి వద్దకు వచ్చి తన కొడుకు సయ్యద్‍ను – జగన్నాథుడి గురుకులంలో చేర్చుకోవల్సిందిగా అభ్యర్థిస్తాడు. జగన్నాథుడు, కామేశ్వరీ, శేషవీరేశ్వరుడూ, పర్వతవర్థనీ  తర్జన భర్జనలు పడతారు. చివరికి అందరూ ఏకాభిప్రయానికి వచ్చి సయ్యద్‍ను చేర్చుకుంటామని చెప్తారు. ఈ విషయంలో కాశీలో చర్చలు జరుగుతాయి. రాజుగారి అభిమానం పొందినందున, ఫౌజుదారు భయం వల్ల ఎవరూ ఏమీ మాట్లాడరు. ఇక చదవండి.]

అధ్యాయం-19

[dropcap]తె[/dropcap]ల్లవారుతూనే ఢిల్లీ నుండి రాజోద్యోగులు వచ్చారు. అప్పటికే అనుష్ఠానాలు పూర్తిచేసుకుని, వచ్చిన శిష్యులతో ముచ్చటిస్తున్నారు – జగన్నాథుడూ, శేషవీరేశ్వరుడూ. మరికొంతమంది శిష్యులు చేరుకుంటున్నారు. వచ్చిన రాజోద్యోగులు పాదుషావారి ఫర్మానాను చదివి వినిపించారు. దాని ప్రకారం మర్నాడే జగన్నాథుడు ఢిల్లీకి బయలుదేరాలి.

పరిస్థితి పూర్తిగా అర్థమైంది. పాదుషా వారి అభిమానానికీ, పండితవర్గం పట్ల అపేక్షకూ మనసులోనే ధన్యవాదాలు తెలుపుకున్నాడు జగన్నాథుడు.

అయితే, అసలు సమస్య అప్పుడే తలెత్తింది. తనతో కామేశ్వరిని ఢిల్లీ తీసుకువెళ్లటమా లేదా? పాదుషా వారి ఆహ్వానంలో భార్యా సమేతంగా అనే వివరణ లేదు. జగన్నాథుని సంసారం సంగతి వారికి తెలిసి ఉండకపోవచ్చు అనిపించింది. శేషవీరేశ్వరుడూ, పర్వతవర్థనీ కామేశ్వరిని ఢిల్లీకి తీసుకుని వెళ్లమనే అభిప్రాయాన్ని సూచించారు.

నిజానికి వీరిద్దరి మనసుల్లోనూ అదే కోరిక ఉన్నది.

“సరే.. ప్రయాణపు సంగతి నిర్ణయించుకుని ఏర్పాట్లు కానీయండి. ఈ వేళ నేనూ, నాగేశుడూ, శాస్త్రీ శిష్యుల పాఠాల సంగతి చూసుకుంటాం” అన్నాడు శేష వీరేశ్వరుడు.

మధ్యాహ్నం వరకూ కామేశ్వరి తాను ఢిల్లీ వెళ్లటంలోని అవసరానవసరాల్ని గురించి మాట్లాడుతూనే ఉన్నది. సాధారణంగా ఆమె ఇంత డోలాయమానంగా ఆలోచన చేయదు. అయితే, ఇప్పటి పరిస్థితి వేరు. ఢిల్లీ దేశం కాని దేశం. పాలకులు ముస్లింలు, వారిలో మత సామరస్యం ఉన్నట్లే కనిపించినా, అది ప్రజల స్థాయికి వ్యాపించలేదు. సహజ మాత్సర్యాలు ఏ ఇక్కట్లను తెచ్చిపెడతాయో అని ఆమె భయం. తనతో తీసుకువెళ్లవలసిన గ్రంథాల్ని కావిడిపెట్టెలో నుంచీ తీసి పరిశీలిస్తున్నాడు -జగన్నాథుడు.

“మీ ఆలోచన స్థిరంగా ఉన్నది. నేనే ఎటూ తేల్చుకోలేకపోతున్నాను” అన్నది కామేశ్వరి. జగన్నాథుడు తలపైకెత్తి ఆమె వైపు ఆరాధనగా చూస్తూ నవ్వాడు. ‘పిచ్చిపిల్లా! నిన్ను ఇక్కడ వదిలివెళ్లి ఒంటరిగా నేను ఢిల్లీలో ఆనందంగా ఉండగలనా?”

“అవును. అది జరగని పని. ఊరికే ఆలోచనలతో పొద్దుపుచ్చక చకచకా ఇద్దరి ప్రయాణపు ఏర్పాట్లు కానీ తల్లీ” అంటూ శేషవీరేశ్వరుడు ప్రవేశించాడు.

“అదీ విషయం. అదే నిర్ణయం! గురువుగారు చెప్పారు కదా.. ఇక సిద్ధమవు” జగన్నాథుని మాటలకు ‘సరే’ అని దీర్ఘం తీసి వంట ఇంట్లోకి వెళ్లింది కామేశ్వరి.

“జగన్నాథా, పాదుషా వారి దర్బారులో రాయముకుందుడు పండిత పక్షపాతి. రాజకీయంగా కూడా పలుకుబడి కలిగినవాడు. ఇక, కవీంద్రాచార్య సరస్వతి, హరినారాయణ మిశ్రా, మునీశ్వర పండితుడు వంటి మహావిద్వాంసులు, కవులు అరుదుగా ఢిల్లీ వచ్చి వెళుతూ వుంటారు. వారి ప్రతిభ గురించి నీకు తెలుసుకదా! వాళ్లు నీకు తటస్థపడవచ్చు. జహంగీర్ పాదుషా కళా ప్రియుడే అయినా నూర్జహాన్ మహారాణి అన్ని రంగాల్లోనూ వ్యూహకర్త్రి. మనసు’లో’ వున్నది తెలియదు. అందుకనే, విద్వాంసులు పాదుషావారి కొలువులో స్థిరవాసులు కారు” అని ఆగి మళ్లీ చెప్పాడు. “అయినా- ఎప్పటికెయ్యది ప్రస్తుతమో దాన్ని పాటించే సమయజ్ఞత, ఆచరించే ఉచితజ్ఞత నీకు వున్నాయి.. నేను ప్రత్యేకంగా జాగ్రత్తలేం చెప్పగలను..”

పాఠశాలలో శిక్షణా తరగతుల సమయం ముగిసింది. శాస్ర్తీ, నాగేశుడూ.. లోపలికి వచ్చారు. వారి సంభాషణ చాలాసేపు ఢిల్లీ ప్రయాణం గురించే సాగింది. నాగేశుడు జగన్నాథుని శ్లోకాన్ని ఎత్తుకున్నాడు. ‘గమ్యతే యది మృగేంద్ర మందిరమ్ లభ్యతే ద్విరద కుంభ మౌక్తికమ్/జంబుకాలయ గతేన లభ్యతే/వత్సపుచ్ఛ ఖుర చర్మ ఖండనమ్’.

(వెడితే సింహం గుహకే వెళ్లాలి. ఏనుగు కుంభస్థలాలలో ఉండే అపురూపమైన ముత్యాలు దొరుకుతాయి. గుంటనక్కల బొరియలు వెతికితే ఏముంటుందీ? ఏ దూడ తోకో, డెక్కో, తోలు ముక్కో!)

***

కాశీ నుండి ఢిల్లీ..

జగన్నాథ దంపతుల స్థానచలనం ఏవిధంగా పరిణమించనున్నదో..?!! కాలం గమనిస్తూనే ఉన్నది!

***

జగన్నాథునికీ, కామేశ్వరికీ ఢిల్లీలో మంచి స్వాగతమే లభించింది.

రాజోద్యోగులు వచ్చి కావలసిన ఏర్పాట్లు చేసి వెళ్లారు. వాళ్ల ఆదరణ సందర్భంలో ప్రసక్తానుప్రసక్తంగా వినపడిన మాటల్ని బట్టి-నూర్జహాన్ ప్రాబల్యమే అక్కడ ఎక్కువ చెల్లుబడిలో వుందని ప్రత్యక్షంగానే తెలుసుకున్నాడు జగన్నాథుడు.

రోజులు జరుగుతుంటే విషయాలు అర్థమవుతున్నై. ప్రజల సంగతి సరే. రాజవంశంలోని అంతశ్శత్రువులు కూడా మహారాణి దృష్టి నుంచీ తప్పించుకోలేరు. సైనికులు గానీ, ఉద్యోగులు గానీ, తప్పు చేశారని తెలిస్తే- ‘ఇంతే సంగతులు’గా వారిని శిక్షిస్తుందామె. అవిధేయత అంటే మండిపడుతుంది.. ఇవీ.. తేటతెల్లమైన కొన్ని వాస్తవాలు. గతంలో విన్నవి, నేడు తెలుస్తున్నవి!

జహంగీర్ పెద్ద కొడుకు ఖుస్రూ తండ్రిపై తిరుగుబాటు ప్రయత్నం చేసి విఫలుడైనాడు. మహారాజు పేరుతో తానే అతనికి ఒక కన్ను తీసేయించింది మహారాణి! జాలి తలచి జహంగీరు అతనికి వైద్యం చేయించాడు. జహంగీర్ ప్రేమపాత్రుడూ మూడవ కొడుకూ అయిన ఖుర్రం ఖుస్రూని తీసుకుని దక్కన్ వెళ్లాడు. ఆ తర్వాత ఖుస్రూని ఖుర్రమే వధింపజేశాడని వదంతి. కాంగ్రా విజయాన్ని సాధించాడు ఖుర్రం. అక్కడి నుండి అతన్ని ఖాందహార్‌కి పంపింది నూర్జహాన్. అక్కడ ఇతను పర్ష్యా బలంకి దాసోహమనక తప్పలేదు. ఈ పరిణామానికి నూర్జహాన్ ఖుర్రంపై కారాలూ, మిరియాలు నూరుతున్నదని పసిగట్టిన ఖుర్రం-ఆగ్రాకి గానీ, ఢిల్లీకి గానీ తిరిగిరాలేదు. ఎక్కడికి వెళ్లాడో తెలియని పరిస్థితి నడుస్తున్నది ప్రస్తుతం. రాజ్యపాలన ఈ రెండు నగరాల నుండి జరుగుతూ వుంటుంది. అయితే ప్రస్తుతం ఢిల్లీ.

నూర్జహాన్ అంటే ఖుర్రంకి భయం. ఖుర్రం అంటే నూర్జహాన్‍కి అనుమానం. ఎప్పటికైనా అతడు తన అల్లుడు షరియార్ (జహంగీర్ నాలుగో కొడుకు) సింహాసనాన్ని అధిష్టించటానికి అడ్డుపడతాడనే భావన ఆమెలో బాగా పాతుకుపోయి వుంది.

ఢిల్లీలో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా జాగ్రత్తగా మెలగాలని తనను తాను హెచ్చరించుకున్నాడు జగన్నాథుడు. తనకు అయాచితంగా వచ్చిన అవకాశం -మహారాజు ప్రాపకం, పోషణ, గౌరవం. ఇది తన సాహిత్య కృషికీ, పాండిత్య వృద్ధికీ తగిన ఆసరా కావాలి.

చాలాకాలం గడించింది.

జగన్నాథుడికి జయపురం వార్తలూ తెలుస్తూనే ఉన్నాయి.

జగన్నాథుడు ఇప్పుడు ఎనిమిది భాషలలో విశారదుడై విరాజిల్లుతున్నాడు. ఢిల్లీలోని రాజోద్యోగుల్లో చాలామందికి జగన్నాథుడు గురువై ఉన్నాడు. అఫ్జల్ లాంటి మొగలాయీ ప్రముఖులు – అతనికి సన్నిహితులైనారు. ప్రత్యేకించి అఫ్ఘల్ -రాజమందిరాల్లో జరిగే చర్చల గురించీ, నిర్ణయాల గురించీ, రాజ్యంలో జరిగే పరిణామాల గురించీ జగన్నాథుడికి తెలుపుతూ ఉన్నాడు.

జయసింహ మహారాజు ఆహ్వానం మేరకు, జహంగీర్ అంగీకారంతో అప్పటికే జగన్నాథుడు జయపురం తరచుగా వెళ్లివస్తున్నాడు. మౌల్వీలను గెలిచిన తర్వాత తొలిసారి జయపురం వెళ్లినప్పుడు జయసింహమహారాజు స్వయంగా ‘కనకాభిషేకమే’ చేశాడనీ, ‘కవిసార్వభౌమ’ బిరుదాన్ని ప్రదానం చేసి సత్కరించాడనీ రాచవారికి వివరంగానే తెలుసు.

జగన్నాథుడికి లభించిన ఈ గౌరవాలన్నీ ఢిల్లీ కొలువులో అతని స్థానాన్ని మరింత ఉన్నతీకరించాయి. ఇప్పుడు జగన్నాథుడు జహంగీరు ముఖ్యసలహాదారుల్లో ఒకడుగా ప్రాముఖ్యాన్నీ పొందాడు.

నూర్జహాన్ మాత్రం జగన్నాథునికి పాదుషా ఇచ్చినంత గౌరవాదరణలని ఇవ్వలేకపోతోంది. ఆమె సందేహాలూ, అనుమానాలూ ఆమెకు ఉన్నాయి. వాటికి కారణం – జగన్నాథుడికి రాజపుత్రులు పట్టే బ్రహ్మరథమే కావచ్చు!

ఆరోజు శుక్రవారం. ప్రతి శుక్రవారం జహంగీర్ మహారాజు పండిత గోష్ఠి జరుపుతాడు. మహారాజు పర్షియన్, తుర్కి, అరబ్బీ, హిందీ భాషల్లో ప్రావీణ్యం ఉన్న సాహిత్యకారుడు. శిల్పి, చిత్రకారుడు కూడా. కవి, పండితుల పట్ల మర్యాదా మన్ననా ఉన్నవాడు. విద్వాంసుల్ని పోషించి ఆదరిస్తున్నవాడు.

ఈ సమావేశానికి కామేశ్వరి సమేతంగా వచ్చాడు జగన్నాథుడు. పండితుల వరుసలో వెనగ్గా కూచున్నాడు. ఆమె సాధారణ శ్రోతల మధ్య మహిళల వరుసలో కూచుంది.

మహారాజు, మహారాజుకి పక్కగా నూర్జహాన్ తమ సింహాసనాల మీద ఆసీనులై ఉన్నారు. వారి గద్దెలకు దిగువన ఉన్నతాసనంలో వజీర్ అసఫ్‍ఖాన్.

గోష్ఠికి చాలామంది బహుభాషా విద్వాంసులు వచ్చారు. మహారాజాశ్రితులు, మాన్యులు నియంతుల్లా- నజీబ్ ఖాన్, అబ్దుల్ హక్, డెల్వీ వంటివారు ముందు వరుసలో ఉన్నారు. రాయముకుందుడు, కవీంద్రాచార్య సరస్వతి రాలేదు. జగన్నాథుడికి మనసులో సందేహం కలిగింది. ఎవరితోనూ అనలేని పరిస్థితి.

ఒక అరబిక్ కవి-పేరు- జకు గోష్ఠికి వచ్చాడు. అలాగే పర్షియన్ కవి తబ్రిజి అనే ఆయనా వచ్చాడు. హిందీ, సంస్కృత విద్వాంసులు చాలామంది ఉన్నారు.

పరిచయాలూ, వివిధ కవిత్వ విశేషాలూ మాట్లాడిన తరువాత, జహంగీర్ జకుని తన కవిత్వం వినిపించమన్నాడు. ఆయన కవిత్వాన్ని వీనులవిందుగా, విలక్షణ ఫణితిలో గానంచేశాడు. కవితావస్తువు క్లుప్తంగా భావనాశ్రయంగా వున్నది. ప్రేమ, ఇస్లాం మతం, మనిషి మరణానంతరస్థితి వంటి తాత్విక భావాలు చోటుచేసుకున్నాయి. ప్రక్రియ ముక్తక విధానం. జకు తన కవితాగానంతో సభని రంజింపజేశాడు. ఆ కవితల్ని మరోమారు చదవాల్సిందిగా గోష్ఠిలోని విద్వాంసుల్లో ఎవరో.. ఆయన్ని అడిగారు. జహంగీర్ ఆ విద్వాంసునివైపు అసహనంగా చూసి మొహం చిట్లించాడు. నూర్జహాన్ కవళికలూ అలాగే వున్నాయి.

జగన్నాథుడు లేచి నిలిచాడు. “గౌరవనీయులైన కవుల్ని తాము చదివిన కవిత్వాన్ని మళ్లీ చదవమనటం భావ్యంకాదు. అంటే మనం దాన్ని అర్థం చేసుకోలేకపోయామనా, లేక వారు చదువుతుంటే వినలేదనా? ఏమి సందేశం ఇస్తాం మనం?” అని క్షణం ఆగి అందర్నీ కలయజూచి “ప్రభువులు అనుమతిస్తే నేను వాటిని చదువుతాను” అన్నాడు.

సభలో గుసగుసలు వినవచ్చాయి. ఆశ్చర్యంతో అందరూ జగన్నాథుని వైపు చూశారు. జహంగీర్ తాను కూడా ఆశ్చర్యంతోనే, “అచ్ఛా.. బహుత్ పసంద్ కీ బాత్.. బతాయియే” అన్నాడు; చిరునవ్వుతో తలపంకిస్తూ..

భుజం మీది శాలువను సర్దుకుని, గంభీరంగా జకు చదివిన కవితల్ని అన్నింటినీ పొల్లుపోకుండా, ఉదాత్తానుదాత్త స్వర ప్రస్తారంతో తిరిగి చదివాడు జగన్నాథుడు. సభ సంభ్రమాశ్చర్యాలతో అట్టిట్టయిపోయింది.

మహారాజూ, నూర్జహాన్ ఇరువురూ లేచి నిలబడి తమ ‘వహ్వా’ కరతాళ ధ్వనులతో “షుక్రియా..” పలికారు. జకు స్వయంగా లేచి వచ్చి జగన్నాథుడిని అక్కున జేర్చుకుని “అపూర్వమైన ఆనందాన్నీ, అనుభూతినీ ఇచ్చారు మహాశయా.. ఇంతవరకూ మా ప్రపంచంలో ఇలాంటి ఘట్టాన్ని విని ఎరుగము. చూడలేదు.” అని ప్రశంసించాడు.

జహంగీర్ జగన్నాథుడిని దగ్గరికి ఆహ్వానించాడు. తన కంఠహారాన్ని బహుకరించి అభినందించాడు. ఆ సమయంలోనే జహంగీర్ జగన్నాథుడిని పరీక్షగా చూశాడు. ఫాలం సూర్యతేజస్సుతో వెలిగిపోతోంది. కళ్లు ధీ ప్రజ్ఞాప్రకాశాన్ని నిశితంగా వెలువరిస్తున్నాయి. శిఖ తుమ్మెదల గుంపులా దట్టంగా ఉన్నది. జగన్నాథుని యజ్ఞోపవీతం కూడా పాదుషావారి దృష్టిని ఆకర్షించింది.

వెంటనే నవ్వుతూ అడిగాడు. “విద్వాంసులవారి యజ్ఞోపనీతం అంత నల్లగా ఉన్నదేమిటి? ఎక్కడిదా మసి?”

సద్యః స్ఫూర్తి ప్రదర్శనలో జగన్నాథుడు ఘటికుడు. “యమునా నదీ జలాల్లో స్నానం చేసినప్పుడు అంటింది ప్రభూ!”

“ఆశ్చర్యంగా ఉన్నదే. యమునా జలాలకు నలువెలా వచ్చింది”.

“ఆ నీళ్లల్లో కాటుక కళ్ల నీళ్లు కలిసినై జహాపనా! నూర్‌దీన్ ప్రభువు తాను శత్రు సంహారం చేస్తే, వారి భార్యలు తమ కన్నీటి ప్రవాహాల్ని యమునలో కలిసి పోయేట్టు విలపించి, దుఃఖించి పోయారు – ప్రభూ! అందువలన యమునా జలాలు శ్యామవర్ణంలోకి తిరిగాయి” – జగన్నాథుని సమాధానం!

పాదుషాతో పాటు, నూర్జహాన్, అసఫ్‍ఖాన్, ఇతర పండితులు అందరూ లేచి నిలిచి కరతాళ ధ్వనులు చేశారు. నూర్జహాన్ మొహం సంతోషంతో మెరిసింది. “ఇన్నాళ్లకి మొగలాయీ కొలువు గౌరవ ప్రతిష్ఠల్ని ఇనుమడింపజేసే విద్వాంసుడు మాకడ చేరాడు. అదృష్టవంతులం” అని మెప్పు పలికింది.

జగన్నాథుడు వెళ్ళి తన స్థానంలో కూర్చున్నాడు.

జహంగీర్ జగన్నాథుడిని ఉద్దేశించి “ఈ మహాకవి కూడా తమ కవిత్వాన్ని వినిపించాలని కోరుతున్నాను” అన్నాడు.

“హేమ్నఃఖేదో న భేదేన ఛేదన కషణేన వ్యా

తదేవహి పరం దుఃఖం, యద్గుంజా స మతోలనం।।”

(కాల్చినా, కరగించినా, సుత్తితో కొట్టినా, కోసినా, అరగదీసినా బంగారానికి విచారం లేదు. కానీ చివరికి గురివిందలతో సమానంగా తూచినందుకు విచారంట!) సందర్భోచితంగా ఉన్నది కవిత. ‘జకు’ని ఎవరో తన కవితని మళ్లీ చదవమని అడగటం వలన ఆ కవి మనసు ఎంత బాధపడిందో అన్యాపదేశంగా చెప్పినట్లయింది.

పాదుషా ‘సెహబాస్’ అన్నాడు. సభలోని వారంతా సంతోషించారు. గోష్ఠి మళ్లీ మొదలయింది. ఈసారి పర్షియాన్ కవి తబ్రిజి తన కవిత్వాన్ని చదివాడు. ఆయనకి గాన ఫణితి లేదు. గద్యానికి కొంత దీర్ఘత్వాన్ని కూర్చుతూ భావ ప్రకటన ప్రధానంగా చదివాడు. శైలిలో అరబిక్ కవిత్వం కంటే సంపన్నమైనది పర్షియన్ భాషా శైలి. కవితా వస్తువు ఆరాధనా భావన. ఆ ఆరాధన ప్రేయసీ, ప్రేమారాధన కాకుండా, ఎక్కువగా వీరప్రశంసతో ముడిపడి వుంది. కొంత నీతి సూత్ర ప్రధానంగా లౌకిక సూక్తులతో సాగింది.

‘వేలాది మిత్రులంతా కలిసి ఒకటి అనుకుంటే, ఒక్క శత్రువు వేలమంది పెట్టు’, ‘అవివేకపు స్నేహితునికన్నా, తెలివిగల శత్రువే మిన్న’ వంటివి కవిత్వంలో మెరిశాయి. భాష తెలిసిన వారు ‘వహ్వ.. వహ్వ’ అన్నారు. తబ్రిజి కవితా పఠనం ఆగింది. కరతాళధ్వనులతో అభినందించింది సభ. నజీబ్ ఖాన్ లేచి తబ్రిజి కవిత్వంలోని విశేషాల్నీ పర్షియన్ భాషా సాహిత్యాలలోని ప్రధానాంశాల్ని వివరించాడు. సభ్యులు ఆయన ప్రసంగాన్ని శ్రద్ధగా ఆలకించారు.

ఈసారి ఎవ్వరూ అడగకుండానే తబ్రిజి ‘తన కవిత్వాన్ని ఆయన స్వరంలో వినాలని వాంఛిస్తున్నట్టు’గా తానే జగన్నాథుని ఉద్దేశించి అన్నాడు. జహంగీర్ అంగీకార సూచనగా తలపంకించాడు. జగన్నాథుడు లేచి నిలిచి తబ్రిజి కవిత్వాన్ని పునర్వచించాడు. సభ అంతా అభినందనలతో హోరెత్తింది.

మహారాజు ప్రత్యేకంగా ప్రశంసిస్తూ, “ఈ పండితుడు తన మాతృభాష ఆంధ్రమని చెప్పాడు. సంస్కృతంలో విద్వాంసుడు. ఉర్దూలో పండితుడేనట. ఇప్పుడు చూస్తే, అరబిక్ పర్షియన్ భాషల్లో కూడా ప్రజ్ఞావంతుడుగా నిరూపితమైంది. ఇది నిజంగా అనన్య సామాన్యమైన ప్రతిభ” అని “భేష్.. భేష్..” అని చేయెత్తి అభినందించాడు. మహారాణివైపు తిరిగి చిరునవ్వుతో “అవును కదూ..!” అన్నట్టు చూశాడు. ఆమె కను చికిలింపుతో తన హర్షాన్ని పంచింది.

ఈలోగా రాజసేవకుడెవరో సాధారణ శ్రోతల మధ్యలో కూర్చుని ఉన్న కామేశ్వరి దగ్గరికి వెళ్లి ఆమెని వెంట బెట్టుకుని నూర్జహాన్ దగ్గరికి తోడ్కొని వచ్చాడు. నూర్జహాన్ కామేశ్వరిని తన దగ్గరగా పిలిపించుకుని చేయందించి, “అసలైన అభినందనలు నీకు చెందాలి. ఈ బహుమతిని స్వీకరించు” అంటుండగానే, ఒక వెండిపళ్లెంలో కాసులూ, హారాలూ, చీనాంబరాలూ తీసుకువచ్చిందొక చెలికత్తె. వాటిని కామేశ్వరికందించిందామె. వాటిని స్వీకరించి, మహారాణికి వంగి నమస్కరించి, వినయంగా వెనక్కి వచ్చేసింది కామేశ్వరి.

ఆమె ఇటు వస్తుండగానే, అసఫ్‌ఖాన్ గద్దెమీది జహంగీర్ పక్కకి వెళ్లి ఆయన చెవిలో ఏదో చెప్పాడు. మహారాజు మొహం మీద విస్మయం ఛాయ కదలాడింది. నూర్జహాన్‍కి సైగ చేశాడు. ఆందోళన పడుతున్న భంగిమతో ఇద్దరూ పక్కకి కదిలారు. పండిత గోష్ఠీ, సభ ముగిసినట్లు ప్రకటన వెలువడింది.

***

పండిత గోష్ఠిలో వున్నప్పుడు అసఫ్‍ఖాన్ తెచ్చిన వార్త జహంగీర్‌నీ, అంతకంటే ఎక్కువగా నూర్జహాన్‍నీ కలవరపరచింది.

రాజా భీమసింగ్ పాదుషా వారికి విధేయుడే. కానీ, అతడిప్పుడు మానసికంగా ఊగులాటలో ఉన్నాడనీ, ఏ క్షణాన్నయినా పోయి విపక్షంలో చేరటానికి రహస్యాలోచనలు చేస్తున్నాడనేది ఆ వార్త. నిజానికి నూర్జహాన్ నియమించిన గూఢచారుల ద్వారానే చేరిందీ వార్త.

వచ్చిన వార్త వాస్తవమైతే ఎత్తుకు పైఎత్తు వేయటం ఎలా అనే ఆలోచనలో పడింది నూర్జహాన్. త్వరత్వరగా మారిపోతున్న పరిస్థితులని తనదారికి తెచ్చుకోవాలంటే – ‘భీమసింగ్‍ని ప్రలోభానికి గురిచేయటమే ఏకైక ప్రత్యామ్నాయం’- అనుకున్నది. అతణ్ణి పిలిపించింది. “గుజరాతు రాష్ట్రానికి నిన్ను రాజప్రతినిధిగా నియమిస్తున్నాను. వెళ్లి పదవీస్వీకారం చెయ్యి. అసఫ్‍ఖాన్ కావలసిన అన్ని ఏర్పాట్లన్నీ తానే స్వయంగా నిర్వహిస్తాడు” అని భరోసా ఇచ్చింది.

పక్కనే వున్నాడు జహంగీర్, కేవలం ఔనని తల ఊపటం మాత్రమే కాక, “భీమసింగ్ మొగలాయీ చక్రవర్తులకు అత్యంత సన్నిహితుడూ, హితుడూ, మిత్రుడూ కూడా. యథార్థం చెప్పాలంటే రసపుత్ర వీరుల్లో మాకు అత్యంత ఆప్తుడు” అని అసఫ్‍ఖాన్ వైపు చూస్తూ, “మీకూ, నాటి బైరంఖాన్ వంటి యుద్ధ వీరులకు సాటియైన రాజపుత్రవీరుడు భీమసింగే కదూ!” అన్నాడు.

“హాఁ.. జహాపనా! సహీ బాత్” అని దృఢంగా అన్నాడు అసఖాన్.

అప్పుడు నూర్జహాన్ “ఏమంటారు భీమసింగ్. మౌనం ఎందుకు? చెప్పండి. క్లిష్ట సమయాల్లో మీవంటివారే కదా మాకు అండ” అని అతన్ని ఉబ్బేయాలనే ప్రయత్నం చేసింది. తన అవసరాన్ని అవతలివారి గొప్పతనంగా చిత్రించగలిగిన నేర్పు అది. ఆమెకి ఆ నేర్పూ, చాతుర్యమూ తక్కువేమీ లేవు. పైగా శక్తి స్వరూపిణి!

భీమసింగ్ తలపంకిస్తూ, “పరిస్థితులు మీకు తెలియనివి కావు జహాపనాఁ’ అని నూర్జహాన్ వైపు తిరిగి, “పాదుషా బేగం సాహెబా – చిన్న మనవి” అని ఆగాడు. “చెప్పండి. భీమసింగ్”

“మీకు తెలియకుండా ఉండదు”, అని మంద్రస్వరంతో “షరియార్ మొగలాయీ సామ్రాజ్య వారసుడు కావటానికి ప్రజలు విముఖులుగా ఉన్నారు-బేగం సాహెబా” అని పీలగా అనేశాడు.

కోపం పొంగింది నూర్జహాన్‌కి. అయినా తమాయించుకున్నది.

“భీమసింగ్, షహజాదా షరియార్ మా అల్లుడు. నా పుత్రిక షహజాదీ అదే లాడీ బేగం భర్త, అతడు దర్బారుకు దూరమై ఉండటం, జగదేకసుందరి వంటి నా కూతురు సాన్నిహిత్యంలో భోగవిలాసాలలో పొద్దుపుచ్చటం వాస్తవమే కావచ్చు. కానీ, అతడే భావి సామ్రాట్ అనేది నిర్ణయమైపోయిన వాస్తవం” అని క్షణం సేపు భృకుటి బిగించి, కాలుని పీఠంపై ఠక్కుమనిపించి “దీన్ని గుర్తించి మసలుకోవటం- ఎవరికైనా సరే మంచిది” అనేసింది.

లిప్తకాలం కూడా ఆగకుండా “చిత్తం.. జహాపనా” అని కేవలం జహంగీర్‍కు నమస్కరించి ఠకఠకా శబ్దం చేస్తూ వెళ్లిపోయాడు భీమసింగ్.

ఇప్పుడు భీమసింగ్ గమ్యం మహబతాఖాన్ నివాసమే. మహబతాఖాన్ మొగలాయీ సైన్యాధిపతి. అతను తన చలనాన్నీ గమనాన్నీ ఇప్పటికే నిర్ణయించుకుని ఉన్నాడు. భీమసింగ్ రాక కోసమే వేచి చూస్తున్నాడు!

***

తెలతెలవారేలోగానే జగన్నాథుని అనుష్టానం పూర్తయింది. ఇంటి బయటికి వచ్చి అరుగుమీద కూర్చున్నాడు.

ఢిల్లీ మంచు షరాయి కప్పుకుని ముడుచుకుని పడుకుని వున్నది. ప్రకృతిలోని పచ్చదనం వింత శోభని పొందింది. పరిసరాల్ని గమనిస్తూ ఆహ్లాదాన్ని అనుభవిస్తున్నాడు జగన్నాథుడు.

అప్పటికెప్పుడో కామేశ్వరి వాకిలి ముందు రంగవల్లిని తీర్చిదిద్దింది. గోమయంతో కలిసిన మట్టి గాలిలో ఆహ్వాననీయమైన వాసననే వెదజల్లుతోంది. పెరట్లో బంతిపూలు మంచుతెర కప్పుకుని కులుకుతున్నై.

అప్పుడే వచ్చాడు అఫ్జల్. జగన్నాథుడు ఆశ్చర్యపోయాడు, “ఇంత పొద్దుటే ఏమిటీ రాక?” చిరునవ్వుతో అంటూ స్వాగతించాడు. వచ్చి అరుగుమీద కూర్చున్నాడు అఫ్జల్.

జగన్నాథుని తేరిపార చూశాడు. అతని గుణరూప సంపద సమస్తమూ ఫాలభాగాన కేంద్రీకృతమై వున్నది. నుదుట విభూది రేఖలతో మూర్తీభవించిన గాంభీర్యంతో ప్రకాశిస్తున్నాడు.

అఫ్జల్ మనసులో అనుకున్నాడు ‘దుర్నిరీక్ష్యమైన తేజోవంతుడు. సంగీత సాహిత్యాది శాస్త్రచయంలోనే కాక, రాజకీయ, ఆర్థిక, వైజ్ఞానిక విషయాల్లోనూ ఈయన ప్రతిభా ప్రజ్ఞల్ని- గుణగ్రహణ పారీణులు మాత్రమే అర్థంచేసుకోగలరు. వాటి వలన ప్రయోజనాన్ని పొందగలరు. అందువలననే రాయముకుందుడు వంటి పెద్దలు కూడా ఈ విద్వాంసుని సలహాలను కోరుతున్నారు. రేపటి కాలంలో ఈయన అసఫ్‌ఖాన్ అభిమానపాత్రుడు అవుతాడు’.

వచ్చి కూర్చుని, తననే తేరిపార చూస్తూ ఏవో ఆలోచనల్లో నిమగ్నమై మౌనంగా వున్న అఫ్జల్‍ని పరీక్షగా చూశాడు జగన్నాథుడు. అతని మొహంలో సంభ్రమాశ్చర్యాలతో కూడిన భావాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. “వచ్చిన పనిని మరచిపోయావా? లేక మీ బెహన్ చేతి వంటని తిని వెళదామని వచ్చావా?”

జగన్నాథుని ప్రశ్న అఫ్జల్‍ని తట్టి ఆలోచనలలోంచీ బయటపడేసింది. నవ్వాడు

సరిగ్గా ఫలాహారం తినుబండారం పళ్లెంతో రానే వచ్చింది కామేశ్వరి. నవ్వు మొహంతో ఇద్దరికీ ఆకుదొన్నెల్లో చక్కెర పొంగలిని అందించింది. తీసుకున్నారిద్దరూ, తానూ పక్కగా కూర్చుంది కామేశ్వరి. తినటం పూర్తి అయ్యాక మొదలెట్టాడు అఫ్జల్.

“మొన్న పండిత గోష్ఠి తర్వాత చాలా సంఘటనలు జరిగాయి” అని ఆగాడు.

ఉత్సుకతతో అతని మొహంలోకి చూశాడు జగన్నాథుడు. “చాలా మంది విషయంలో తామేమవ్వాలనుకుంటున్నారో వారికి తెలుస్తూనే ఉంటుంది. కానీ, మామిడి పిందెలా చెట్టును కరచుకొని అలాగే ఉండిపోయే తత్త్వం వారిది. పండు పండటమనే దశలోకి ప్రస్థానాన్ని సాగించరు. ఏ గాలి వాటుకో కొట్టుకుపోతారు. ప్రస్తుతం ఢిల్లీ రాచరికంలోనూ కొందరి పరిస్థితి ఇలాగే వుంది”.

“అంత గూఢమైన పరిస్థితులు బయటివారికి తెలియవు కదా!..” అన్నది కామేశ్వరి.

“అదేం లేదు కొన్ని కొన్ని పర్వాలు సులభగ్రాహ్యం గానే వుంటాయి” అని, “రాజమందిరాల్లో మంత్రాంగాలూ, తంత్రాలూ, వ్యూహరచనలూ-ఎంత గోప్యంగా, కట్టుదిట్టంగా జరుగుతూ వుంటాయో, కొన్ని కొన్ని సంభవాలూ, సంఘటనలూ అంతకంత తేలికగానే కొత్తకుండలో నీటి చెమ్మలా బయటికి ఉరుకుతాయి. రహస్య బంధాల్లో, బంధనాల్లో చాలా వదులు ముళ్లూ, కుచ్చులు కూడా వుంటాయి. అందువల్లనే ఇప్పుడు ఢిల్లీలోని రాజకీయ స్థితిగతుల్ని గురించి సామాన్యులు కూడా అంతో ఇంతో అవగాహనకి రాగలుగుతున్నారు” అని మౌనం వహించాడు అఫ్జల్‍.

కొన్ని క్షణాల తర్వాత నూర్జహాన్ – జహంగీర్ లతో భీమసింగ్ వ్యవహారాన్ని జరిగింది జరిగినట్లు – పూసగుచ్చినట్లుగా చెప్పాడు.

ఇంతా చెప్పి, “అదంతా అలా వుంచండి. మీకు త్వరలోనే రాయముకుందుల నుండీ వర్తమానం రావొచ్చు. ఆ వర్తమానం మీకు స్థానచలనాన్నీ కలిగించవచ్చు” అన్నాడు.

కామేశ్వరీ జగన్నాథులు ఒకరి మొహాలొకరు చూసుకున్నారు.

“ఇదేమి వార్త? రాయముకుందులు ఎక్కడ వున్నారో తెలియటం లేదనే కదా-రాజమందిరంలోని వారితో సహా అందరూ అనుకుంటున్నది?” అడిగాడు జగన్నాథుడు. “తెలియవలసిన వారికి తెలుసు” అని ఊరుకున్నాడు అఫ్జల్. సూర్యభగవానుడు ఎర్రని తేజస్సుతో మంచుతెరల్ని ఛేదించుకొని బయటపడ్డాడు. బాగా తెల్లవారింది.

ఆవరణంతా నిశ్శబ్దంలో మునిగింది.

చాలా సేపటి తర్వాత, “శారీరక వ్యవస్థలు కుళ్లిపోతుంటే దుష్టాంగాన్ని ఖండించమన్నట్లు, రాజకీయ వ్యవస్థలు వట్టిపోతుంటే ప్రజల భద్రతనీ, దేశక్షేమాన్నీ కోరుకునేవారు కళ్లు మూసుకుని కూర్చోరు కదా! దక్షులెవ్వరూ అలాంటి స్థితిని ఉపేక్షచేయరు కదా!” అన్నాడు అఫ్జల్‍. వెంటనే సెలవు తీసుకుని వెళ్లిపోయాడు.

ఖుర్రం, మహబత్ ఖాన్, జగత్సింగ్ వంటి ముఖ్యులు జగన్నాథుడి కళ్లముందు. మెదిలారు. అఫ్జల్ చెప్పకయే చెబుతున్న అంశాలు వారిచుట్టూ తిరుగుతున్న వన్నమాట-అనిపించింది. ‘అయితే, వారంతా ఎక్కడ వున్నారు? తనకు కలుగబోయే స్థానచలనం మాటేమిటి?’ మేధలో ఇలా చాలా ప్రశ్నలుదయించినై. అతని దృష్టికి దీర్ఘకాలిక లక్ష్యమేదో దీపశిఖలా ద్యోతకమయింది.

అధ్యాయం-20

వారాలు గడుస్తున్నాయి.

భీమసింగ్ ఏమైనాడో తెలియలేదు.

ఈలోగా కొత్త పరిణామం. జగన్నాథుడిని తన ఆంతరంగిక ముఖ్యుల్లో ఒకనిగా గౌరవించసాగింది-నూర్జహాన్. కళాప్రియుడు, విద్వాంసుడూ, జగన్నాథుని ప్రజ్ఞాప్రాభవాలకి ముగ్ధుడయ్యే జహంగీర్ ప్రభువుకి ఇది సంతోషమే కలిగించింది.

నూర్జహాన్ నిర్ణయానికి ప్రముఖ కారణం- రాజకీయ పరమైన ఆమె వ్యూహరచనాచాతుర్యమే. జగన్నాథుని జగత్సింగ్‌తో సహా ముగ్గురు రాజపుత్ర రాజ్యాధీశులూ గౌరవిస్తున్నారు. అతని మాటకి విలువ, మన్నన ఉంటాయని అర్థమైంది.

షరియార్‌నీ, టోకీనీ సిక్రీ పంపేటప్పుడు కూడా నూర్జహాన్ ఆ నిర్ణయాన్ని జగన్నాథుని ముందే చెప్పింది. నిజానికి అతన్ని సలహా అడిగితే- షరియార్ బాధ్యతా రాహిత్యం గురించీ, దాపరికం లేకుండానే చెప్పాడు. దానికి ప్రతిగా ఆమె, “ఫర్వాలేదు పండితుల వారూ! సర్వసమర్థుడైన టోకీ పక్కనే వుంటారు కదా..!..” అని ఊరుకున్నది. ఆమె నిర్ణయం ప్రకారం ఆ పటాలం సిక్రీవైపు వెళ్లిపోయింది.

ఇప్పుడు చాలా విపరీత వార్తలు గాలిలో తేలుతున్నాయి. రాజమందిరంలో అలజడీ, రాచవారి మనసుల్లో ఆందోళన.

“అయ్యేదేమో అవుతుంది కానీ” అని మొండికేసినట్టు మనసుకు చెప్పుకుంటున్నాడు జహంగీర్. అతని చేతిలో పానపాత్ర వరుసగా ఖాళీ అవుతూ ఉంటుంది. ఉన్నట్టుండి ఎదురుగా ఉన్ననూర్జహాన్ క్రోధారుణిత నేత్రాలతో గర్జిస్తుంది. “ఏం జరుగనున్నదో మీకు తెలుస్తున్నదా జహాపనా? శత్రువులు యుద్ధం ప్రకటిస్తే, మన పరిస్థితి వికటిస్తే, మీరూ నేనూ ఎటూ వధింపబడతాం. కానీ నా కూతురు లాడీబేగం, అల్లుడు షరియార్ పరిస్థితి ఏమిటి?” మాటలు పూర్తి అయ్యేసరికే ఆమె కంఠం రుద్ధమైంది. ముకుపుటాలు అదిరినై. “మీ బుర్రకేమీ ఎక్కదు. వాళ్ళిద్దరూ బతికుంటే అడుక్కుతినాలి. లేదా బందిఖానాలో ప్రభువులు విసిరే మెతుకుల్ని పోగుచేసుకుని తినాలి” అని ఆగింది.

క్షణాల తర్వాత, “విషయాలు తెలిసికూడా మీరిట్లా అంటీముట్టనట్టు ఎందుకుంటున్నారు ప్రభూ!” అన్నది. ఆమె గళంలో దైన్యం తొంగిచూస్తోంది. “ముందు మీరా మధువుని పక్కనపెట్టండి. అటు చూడండి. వచ్చిన వారెవరో, ఎందుకొచ్చారో అదైనా తెలుసుకోండి” అంటూ లేచి వచ్చి పానపాత్రని తానే లాక్కుని బల్లమీద పెట్టింది.

జహంగీర్ స్పృహలోకొచ్చి “ఏమైంది.. ఏమిటిది?.. ఏంచేస్తున్నావు నువ్వు?” అంటూ కళ్లు నులుముకుని చుట్టూ చూశాడు.

మందిరంలో వీరిద్దరికీ కడగా చిన్న పీఠంపై కూర్చుని వున్న జగన్నాథుడు! “ఓహ్.. మీరా.. మీరెప్పుడు వచ్చారు?”

“బేగం సాహెబా ఆజ్ఞ ప్రభూ..”.

నూర్జహాన్ వైపు తిరిగి, “చెప్పు.. చెప్పు..” అన్నాడు.

“వినండి. తెలివి తెచ్చుకుని శ్రద్ధగా వినండి. రాజపుత్ర సమూహమంతా కలిసి మొగలాయీ ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నట్టు తెలుస్తోంది. ఖుర్రం, మహబత్ ఖాన్ సంగతి తెలీదు. గజసింగ్ నుంచీ వర్తమానం లేదు. టోకీనీ, షరియార్‌నీ తగినంత పటాలంతో సిక్రీ పంపాను. వారి నుంచీ ఏ కబురూ లేదు. మన ఆజ్ఞని మన్నించి వెళ్లాడో, మన్నించకుండా ధూమ్‍ధామ్‌గా కోపంతో వెళ్లాడో భీమసింగ్-ఏమైనాడో తెలీదు. అతని గురించి తెలుసుకోవటం మన తక్షణ కర్తవ్యం. అతను మననుంచీ విడివడిపోతే, అగ్నికి ఆజ్యం పోసినట్లే అవుతుంది.”

తన మాటల ధోరణిని ఆపింది నూర్జహాన్. “అవును.. అవును.. భీమసింగ్ అసమానవీరుడు” అని జగన్నాథుని కేసి చూశాడు. జగన్నాథుడు ఏ భావమూ కనపడని ముఖకవళికతో పాదుషావైపు చూశాడు.

కొన్ని నిముషాలు కదిలాయి.

“సరే పండితులవారికి విషయాలన్నీ అర్థమయినై కదా! మీరు మా సముఖంలో ఉన్నా వాస్తవాల్ని దాచకుండా బయటపెట్టాను. ఇప్పుడు మీరొక సహాయం చేయాలి..”

“చెప్పండి మహారాణీ”

“ఇప్పుడో.. కొద్దిసేపటి తర్వాతో భీమసింగ్ ఉనికిని గుర్తించి మనకు వార్తని చేరవేస్తారు-నేను నియోగించిన ఉద్యోగులు. దానిని బట్టి-మీరు భీమసింగ్‌ని కలవాలి. అతనికి మా మాటగా విన్నవించి మనపక్షం నుండీ తొలగిపోకుండా చేయాలి. అతనికి మీరు గురుస్థానీయులు.” వినయపూర్వకంగా తలవంచబోయి ఏదో అడగాలని ఆమె వైపు చూశాడు జగన్నాథుడు. ఇంతలో ఆమే కొనసాగించింది. “మీకు తెలుసు. అతని ఉనికి తెలిస్తే వెంటనే పట్టి బంధించటం పెద్ద కష్టమైనపని కాదు. కానీ, దానివలన మనకు జరిగే లాభమేమీలేదు. యుద్ధవీరునిగా అతను మొగలాయీల విజయానికి సారథి కావాలి…” అని “మీవంటి విజ్ఞులకు, రాజనీతి నెరిగిన ప్రతిభావంతులకు ఇంతకుమించి వివరంగా చెప్పఖ్ఖర్లేదనుకుంటాను.”

“క్లిష్టపరిస్థితుల్లో ఢిల్లీశ్వరుల ఆజ్ఞని శిరసావహించటం మా బాధ్యత. ఆశాజనకమైన ఏ ప్రయత్నాన్నయినా ఆచరించక తప్పదు కదా.. అలాగే..” అని లేచి నిలబడ్డాడు జగన్నాథుడు. “మీ వర్తమానానికి ఎదురుచూస్తూ ఉంటాను” అన్నాడు. “ఈ లోగా అనుకోని మరే పరిణామమూ జరగకపోతే” ఠక్కున అన్నాడు పాదుషా. “మీకింకా మత్తు వదల్లేదు. శుభం పలకటం చేత కాదు..” అని లేచి “పదండి.. పదండి” అన్నది నూర్జహాన్.

ఆమె మాట ప్రభువుకే కాక, తనకూ వర్తిస్తుందని అర్థం చేసుకోలేనివాడా జగన్నాథుడు! తిరిగి చూడకుండా బయటికి వచ్చేశాడు.

బయట కోటంతా కందగడ్డలా ఎర్రబడివుంది. సూర్యుడు మునమున లాడుతున్నాడు!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here