ఆవేదన

0
4

[dropcap]తా[/dropcap]జ్ మహల్ నిర్మాణానికి రాళ్లు ఎత్తిన కూలీలు ఎవరు?
చరిత్రలో నిలిచిపోయింది ఎవరు?

సింహాసనాన్ని తయారు చేసింది ఎవరు
దాని మీద కూర్చుంది ఎవరు?

వాళ్ల స్వార్థం కోసం వాళ్లు సభలు పెడతారు నిస్వార్థంగా నిండు ప్రాణాలు అర్పించేది మీరు.

తొక్కిసలాటలో మరణించేది సామాన్యులు నాయకులు కాదు.

తొక్కిసలాటలో మరణించేది భక్తులు
దేవుడు కాదు.

మీరు చప్పట్లు కొట్టినంత కాలం
వాళ్ళు దుప్పట్లో వెచ్చగా పడుకునే ఉంటారు.

మీరు మీరు కొట్టుకొని చస్తారు
వాళ్లు వాళ్లు నెట్టుకుని నాయకులవుతారు.

భజన చేస్తే మీరు దేవుళ్ళు అవరు
భక్తులుగా మిగిలిపోతారు
కర్పూరంలా కరిగిపోతారు.

మీరు దేశం కోసం ప్రాణ త్యాగం చేస్తారు
వాళ్లు వాళ్ల సింహాసనం కోసం మిమ్మల్ని త్యాగం చేస్తారు.

వాళ్లు పాదయాత్ర చేస్తే వాళ్లు ముందుకు వెళ్తారు మీరు వాళ్ళ వెనకనే ఉంటారు.

మీరు వాళ్ళని అభిమానించినంత కాలం
వాళ్ళు అందలం ఎక్కుతూనే ఉంటారు.

సామాన్యులే చితికి పోతారు
శ్రామికులే ‘చితి’ కి పోతారు
నాయకులే బతికి పోతారు
బయటపడతారు.

మీరు ఎన్ని యుద్ధాలు చేసినా, గెలిచినా నాయకుడి పేరే నానుతుంది చరిత్రలో!

మీ సానుభూతితో వాళ్లు నాయకులవుతారు మీరు మీ అనుభూతితో అనామకులవుతారు.

వెర్రి జనం
వెర్రి అభిమానం.

మురుగు కాలువ కట్టింది నువ్వు
కట్టించింది వాళ్లు
కట్టుకున్నది నీకోసమే, అందుకే అమాంతం
అది నిన్ను మింగేసింది.

మీరు వ్యక్తి పూజ చేసినంత కాలం
వాళ్లు మిమ్మల్ని పీల్చే శక్తులుగా తయారవుతారు.

విగ్రహాలకు దండలేసినంత కాలం
మీరు ఉత్సవ విగ్రహం లాగా మిగిలిపోతారు.

(కందుకూరు సంఘటన చూసి చలించిపోయి)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here