[శ్రీ శివానంద మహారాజ్ రచించిన వ్యాఖ్యానం, వ్యాసాశ్రమ శ్రీ మలయాళ స్వామివారి వ్యాఖ్యానం ఆధారంగా శ్రీమతి సంధ్యా యల్లాప్రగడ అందిస్తున్న ఆధ్యాత్మిక సుమమాలిక ‘నారద భక్తి సూత్రాలు’]
నారద భక్తి సూత్రాలు
6. యద్జ్ఞాత్వామత్తో భవతి స్తబ్ధో భవతి ఆత్మారామో భవతి
[dropcap]ఏ[/dropcap] భక్తి చేత తెలియవలసిన భగవంతుని తెలుసుకొని మత్తుతో ఉన్మత్తుడు అవుతాడో, నిశ్చేష్టుడవుతాడో అతను తనలో తాను రమించుతూ స్వాత్మాలో ఆనందంలో మునుగుతాడు. ఇదే పరాభక్తి యొక్క స్వరూపము.
ఈ సూత్రంలో నారదుల వారు మనకు పరాభక్తి గురించి, ఆ భక్తి పొందిన భక్తుని అవస్థ గురించి చెబుతున్నారు.
ప్రేమ లక్షణమైన భక్తి కలిగినప్పుడు ఆ భక్తునికి కావలసినదంతా సిద్ధించేస్తుంది.
భక్తుని నవ్వు, దుఃఖం, నృత్యం, భజనం ఇతరులు పట్టించుకుంటున్నారా లేదా అని చూడక చేస్తారు. మరోమారు మౌనంలోకి జారుతారు. బ్రహ్మానందాన్ని పొందుతూ మౌనంలో తరిస్తారు.
ఇతరుల మెప్పు వారికి అవసరం లేదు.
వారి సంతోషం హద్దులు లేనిది. ఈ స్థితిలో పరమాత్మతో మమైక్యమవుతారు. వారు పరమాత్మకు పూర్తిగా ఆత్మార్పణ చేస్తారు. ఆ పరిస్థితిలో వారు పరమాత్మ నుంచి మాత్రమే ఆజ్ఞలు స్వీకరిస్తారు.
నయనార్లు పరమభక్తులు.
ఒక నయనారు శివునికి దీపం వెలిగించటానికి నూనె లేకపోతే తల వెంట్రుకలు అంటించుకున్నాడు.
మరో నయనారు మోచేతులను అరగదీసి గంధం తీశాడు.
వారి భక్తి తీవ్రతలో వారికి శరీరం మతి ఉండదు. ఉన్నత్తులై ప్రవర్తిస్తారు.
సెయింట్ ప్రాన్సిస్ 12 శతాబ్దపు క్రైస్తవ మత గురువు. క్రీస్తు భక్తుడు. ఆయన తన భక్తితో తన క్రీస్తు వలెనే భావన చేసేవాడు. క్రీస్తుకు శిలువ వెయ్యటం వలన ఆయన గాయాలు సెయింట్ ప్రాన్సిస్ శరీరంపై కూడా అదే ప్రదేశాలలో పొడచూపాయి. వాటి నుంచి వచ్చిన నెప్పి కాని రక్తస్రావం కాని ఆయన సంతోషంగా భరించేవాడు. క్రైస్తవ యోగులకు ఈ విధమైన క్రూసిఫికేషన్ గాయాలు పొడచూపుతూ ఉండటం సామాన్యం.
పరమాత్మ దివ్య ప్రేమను త్రాగిన భక్తులకు కలిగే మత్తు మరే ద్రావకం ఇవ్వదు.
అందుకే ఉపనిషత్తులలో ఆత్మ గురించి వివరించేటప్పుడు మధువు అని, తేనె యని చెబుతారు.
సూఫీ సాధువులు పరమాత్మ యొక్క ఈ ప్రేమను మధువైన దాక్షరసం (వైన్) తో పోల్చారు. వేదాలలో సోమరసమన్నారు. ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క ప్రేమ తత్త్వాన్ని గురించి చెబుతున్నవే.
ఈ పరమాత్మ యొక్క ప్రేమ రసం త్రాగిన భక్తుని అవస్థ అతనికే అందనిది. అది పరమాత్మ చేత నడిపించబడుతుంది.
ఉన్మత్త భక్తులు బయట ఎలా ఉన్నా అంతరంగంలో పరమ శాంతంగా ఉంటారు.
‘ఆత్మారామో భవతిః’
మానవులు తమ సంతోషం కోసం భౌతికమైన విషయాలపై ఆధారపడి ఉంటారు. ఆ విషయాలు మార్పు వలన వారికి ఎల్లప్పుడూ దుఃఖమే అనుభవమతూ ఉంటుంది.
భార్యా భర్తలో, పిల్లలు మాట వినలేదనో, బ్యాంకులో డబ్బు గల్లంతు అయిందనో.. ఇలా ఎన్నో సంసారిక విషయాలకై దుఃఖపడటం మానవుల లక్షణమైయింది.
అందుకే క్షణ మాత్రం సంతోషానిచ్చే ఈ విషయాలపై నుంచి నిరంతర ఆనంద ప్రవాహంగా నిలచు పరమాత్మ భక్తి ఆనంద ప్రవాహం, సదా నిలచి ఉండే ఆ సంతోషం కోసమే మానవులు ప్రయత్నించాలి.
‘వాసనలు’ అంటే కోరికలు, మనిషిని బయటి వ్యామోహాలపైకి ఉసికొలుపుతాయి. అవిద్య అదే విక్షేపణశక్తి వలన బయటి ప్రపంచం మాయ అని తెలుసుకోరు. ఈ అవిద్య వలన బయటి వ్యామోహాలు నిజాలుగా తోచి వాటి వెనక పడతారు. ఆ కోరికలకు అంతు ఉండదు. ఒకదాని తరువాత ఒకటిగా ఊటబావిలో నీరులా వస్తూనే ఉంటాయి. వాటి వలన క్షణమాత్ర సంతోషం మాత్రమే ఉంటుంది.
ఎప్పుడైతే నిరంతరం ధారగా ఉండే సంతోష ప్రవాహం భగవన్ భక్తి వలన పొందుతారో వారు బహిర్ విషయాలపై మక్కువ కోల్పోతారు. వారికి భగవన్ భక్తి వలన కలిగిన మత్తు మరొకటి ఇవ్వదు.
భాగవతంలో ఈ ఉన్మత్త భక్తితో మునిగిన ప్రహ్లాదుని ప్రవర్తన గురించి ఇలా చెబుతారు:
“వైకుంఠ చింతా వివర్జితచేష్టుడై
యొక్కడు నేడుచు నొక్కచోట
నశ్రాంత హరిభావ నారూఢచిత్తుడై
యుద్దతుడై పాడు నొక్కచోట
విష్ణుడింతియ కాని వేఱొండు లేడని
యొత్తిలి నగుచుండు నొక్కచోట
నలినాక్షుడను నిధానము గంటి నేనని
యుబ్బి గంతులువైచు నొక్కచోట
బలుకు నొక్కచోట బరమేశు గేశవు
బ్రణయ హర్షజనిత బాష్పసలిల
మిళిత పులకుడై నిమీలిత నేత్రుడే
యొక్కచోట నిలిచి యూరకుండు”
7. “సాన కామయమానా నిరోధరూపత్వాత్”
అర్థం: భక్తి కలిగిన వారికి కామ్య కర్మల మీద ప్రసరింపనీయదు.
భక్తి అంటే ప్రపంచ మీద మమకారము కాదు. భక్తి కలిగిన ఉత్తర క్షణములో మిగిలిన కోరికలు చెదిరిపోతాయి.
కోరికలతో భగవంతుని పూజలు చెయ్యటం మనకు జనసామాన్యం. మరి నారదుల వారు ఏంటి ఇలా చెబుతున్నారు అని అనుమానం కలుగుతుంది.
దీనికి సమాధానం కోరికలతో భగవంతుని చేరటం పూజించటము జనసామాన్యం. కాని కర్మల యందు ఆసక్తి సన్నగిల్లు పరమాత్మను హృదయంలో నింపుకోవటం జరిగి తరువాత కోరికల మీద ఆసక్తి సన్నగిల్లుతుంది.
నిజ భక్తి కోరికలు కోరదు. పరమాత్మ నామం చాలు వారికి ఆనందం కలగచేయ్యటానికి.
కోరికలను నిరోధించుకోవటము బహుకష్టం. ఈ విషయవాసనలు కోరికలు సాధకులను పడవేసే అడ్డంకులు. అందుకే భగవంతుని మీద ఆసక్తిని పెంచుకుంటే ఈ కోరికలు తగ్గిపోతాయని పెద్దలు చెబుతారు.
భాగవతంలో ఈ విషయం గురించే చెబుతూ
“మందార మకరంద మాధుర్యమున దేలు
మధురపంబు బోవునే మదనములకు
నిర్మల మందాకినీ వీచికల దూగు
రాయంచ జనునె తరంగిణులకు
లలుత రసాల పల్లవఖాదియై చొక్కు
కోయిల సేరునే కుటజములకు
పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం
బరుగునే సాంద్ర నీహారములకు
అంబుజోదర దివ్యపాదారవింద
చింతనామృత పానని శేషమత్త
చిత్త మేరీతి నితరంబు జేరనేర్చు
వినుతగుణశీల మాటలు వేయు నేల?” అంటుంది.
అమృత మయమైన పరమాత్మ భక్తి కలిగిన తరువాత క్రియలతో పని యేమి?
భక్తి కలిగిన తరువాత మరి మిగిలిన వాటితో పని లేదని భావన ఈ సూత్రంలో నారదుల వారు సూచించారు.
8. “నిరోధస్తు లోక వేదవ్యాపార న్యాసః”
చిత్త నిరోధస్థితి వస్తే, ప్రపంచ వ్యాపారాన్ని, వేదవ్యాపారాన్ని కూడా వదిలేసి అనన్యభక్తిని చేరుకోవాలి.
కోరికలను వదులుకోవాలంటే వాటిని అణిచిపెట్టటం కాదు. నిరోధించుకోవాలి. కాని దేనిని వదిలెయ్యమంటామో, మనస్సు దానినే చింతిస్తూ ఉంటుంది. కోరికలను నిరోధించటమంటే అణచటం కాదు. అణిచే కొద్ది అగ్నిలాగా దావానలంలా పెరుగుతాయి కోరికలు. మొదటికే ముప్పు వచ్చే ప్రమాదం ఉంటుంది.
మరి కోరికలను అదుపులోకి తేవటం ఎలా? లోక వ్యాపారాన్ని నిరోధించుకోమని నారదుల వారు చెబుతున్నారు. అంటే బయటి పనులు తగ్గించుకోవటము మార్గం.
బహిర్విషయాలపై ఆసక్తి తగ్గించుకోవటము, భగవంతు వైపుకు మ్రొగ్గటంతో మొదలుపెట్టి, పూజ, జపం వంటివి చేయ్యటం వలన నెమ్మదిగా భగవంతునిపై ప్రేమ పెరుగుతుంది.
ఈ బహిర్ లోక వ్యాపారాలు తగ్గుతాయి. భగవంతునిపై ప్రేమ పెరిగే కొద్ది ఆ ప్రేమ మత్తులో పడ్డాక ఇక అది తప్ప మరో ధ్యాస లేని స్థితికి చేరుతాడు భక్తుడు.
లోక వ్యవహారాలలో ఏదో ఒక ఫలాపేక్ష కోరుతాడు. కావాలని కోరిక, దాని కొరకు తరన, చేసిన పనికి ఫలాపేక్ష ఇటువంటివి సహజం. కాని భగవంతుని మీద ప్రేమతో ఆయనను చేరితే వారికి కోరికలు తగ్గి తదనుగుణంగా ఫలాపేక్ష వంటివి మనసుకు రావు. దాని వలన పుణ్య కర్మలు చేస్తాడు.
మనోవాక్కాయ కర్మలతో కూడిన భక్తి మూడు రకాలుగా ఉంటుంది. అవి లౌకిక భక్తి, వైదిక భక్తి, ఆధ్యాత్మిక భక్తి. ఏకాంత భక్తులు ఆధ్యాత్మిక భక్తిని మాత్రమే గ్రహిస్తారు.
యోగశాస్త్రంలో సూత్రమైన ‘యోగ శ్చిత్తవృత్తి నిరోధః’ చెప్పినట్లుగా యోగము ద్వారా అంతఃకరణాల శుద్ధి పొందవచ్చు. దీని వల్ల సంస్కారాలు, వృత్తులు వాసనలు సంస్కరించబడతాయి. సమాధి స్థితి, సాధన వలన కుదురుతుంది.
భోగాల మీద ఆసక్తి ఉన్న వారికి పరమాత్మ మీద గురి కుదరదు. అందుకే ఆ విషయ వాసనలను యోగం ద్వారా కాని, జపతపాదుల ద్వారా గాని తగ్గించుకోమన్నాడు ముని ఇక్కడ. అహంకారాన్ని వదిలివెయ్యాలి.
ద్రౌపది కృష్ణ భక్తురాలు. ఆమె జీవితంలో ప్రతి కష్టంలో కృష్ణుడిని శరణు వేడింది. రక్షణ పొందింది. కురుసభలో ఆమె వస్త్రాలను లాగేటప్పుడు తన రెండుచేతులతో పట్టుకొని తన వస్త్రాలను పట్టుకొని స్వామిని పిలిచింది. కృష్ణుడు పలకలేదు. చేతులు వదిలేసి ‘అంతా నీవే చూసుకో’ అంటూ సర్వస్యశరణాగతి చేసింది. ఆమె వస్త్రాలను కౌరవులు లాగలేకపోయారు. అంటే ‘నేను చేస్తాను నీవు సాయం పట్టు’ లా కాకుండా, ‘సర్వం నీవే చేయి, నేను నిమిత్తమాత్రంగా ఉన్నా’నన్న స్పృహ ఉండి, అహంకారాన్ని పరమాత్మకు అంకితం చేస్తే వారిని సదా తోడుండి చూసుకుంటానని పరమాత్మే గీతలో “తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం” అంటూ చెప్పాడు.
9. “తస్మిన్ అనన్యతా తద్విరోధిషూదాసీనతా చ”
భగవంతుని యందు అనన్య భక్తి కలిగి, ఆ భక్తికి విరోధములైన కార్యాలందు ఉదాసీనతతో అంటే సంబంధం లేనట్లుగా సాక్షివలె ఉండటం శ్రేయస్కరం.
అనన్య భక్తి అంటే ఏకదృష్టి కలిగి ఉండటం. ఏ చింతన లేక తన అహంకారం, చిత్తం భగవంతుని యందు సమర్పించటము.
చేసే ప్రతి పని కూడా ఆ భగవంతునికి చేసే సేవగానే భావన చెయ్యాలి. ప్రతి పని భగవంతుడు చేయిస్తున్నాడని, మనము కేవలం ‘మాధ్యమంగా’ ఆ పనిని పరమాత్మ చేస్తున్నడన్న భావన సాధన చెయ్యాలి. ఈ విధమైన సాధన వలన అహంకారం నెమ్మదిస్తుంది.
సాధకునికి ప్రధాన శత్రువు కూడా అహంకారమే. భక్తికి కూడా ఇదే ప్రధాన శత్రువు. అహంకారాన్ని భగవంతుని యందు సమర్పించిన తరువాత నెమ్మదించిన మనస్సుకు భగవంతుని యందు నిలుస్తుంది.
బిడ్డడికి తల్లి మాత్రమే కావాలి. తల్లి తప్ప మరో విషయం అడగడు. పతివ్రత భర్త యందు మాత్రమే మనస్సు లగ్నం చేసి ఉంటుంది. పిసినారికి మనస్సు ధనం యందు లగ్నమై ఉంటుంది. అలాగే భక్తుడు మనస్సు భగవంతుని యందు మాత్రమే లీనమై ఉంటుంది.
ఉదాసీనంగా ఉండటమంటే భౌతికమైన ఆనందాల మీద ఆరాటం లేకపోవటం. ధనం కుటుంబము, పిల్లలు, పరపతి మొదలగు వాటి మీద వ్యామోహాన్ని వదలుకోవాలి.
ఉదాసీనంగా ఉండటం వలన అనంతమైన ఆనందాలు కలుగుతాయి. ప్రపంచ భోగాల పట్ల వ్యామోహం లేనివారు తనకు ఇష్టులని భగవానుడు గీతలో చెబుతాడు.
ఉదాసీనతన్నది మానసిక స్థితి.
ఎంతటి ధనమాన్యాలున్నా వాటి మీద వ్యామోహ పడక, ఆకు మీద నీటి బొట్టులా ఉండటమే ఉదాసీనత.
జనక మహారాజును ఇందుకు ఉదాహరణగా తీసుకుంటారు. ఆయన తన రాజ్య పదవికి, ధనానికి గర్వించక ఉదాసీనంగా ఉండిపోతాడు. ఆయనను రాజర్షి అని అంటారు.
వస్తువుల మిథ్య అన్న ఎరుక కలిగినప్పుడు ఈ ఉదాసీనత సంభవిస్తుంది.
ఉదాసీనత వలన సాక్షీభూతునిగా ఉండి, తన స్వరూపం నుంచి కదలక ఉంటాడు సాధకుడు. ఈ సూత్రం ద్వారా నారదమహర్షి చెబుతున్నది కూడా ఇదే.
10. “అన్యాశ్రయాణాం త్యాగోఽనన్యతా”
పూర్తిగా భగవంతుడిని ఆశ్రయించి ఇతరములైనవి వదిలెయ్యమని నారద మహర్షి చెబుతున్నాడు.
భక్తుడు భగవంతుని యందు మాత్రమే దృష్టి నిలిపి ఉండాలి. ఇతర చింతలు వదిలివెయ్యాలి.
ప్రపంచ వ్యవహారాలు మనస్సును నిలబడనియ్యవు. వాటిని వదిలివెయ్యటం అభ్యాసం చెయ్యాలి.
ప్రపంచంలో వస్తువులన్నీమార్పు చెందేవే. ప్రతీది నశించేదే. మార్పు చెందనిది, సత్యమైనది భగవంతుడొక్కడే.
వైరాగ్యము పెంపొందించుకోవటానికి, ఈ నిత్యానిత్య వస్తు వివేకం సహాయం చేస్తుంది.
వివేకంతో వైరాగ్యం పొందిన వానికి అభ్యాసం, జపం, భగవంతుని యందు మనస్సు నిలపటానికి సహాయం చేస్తాయి.
గీతలో “అసపేక్షశ్శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యథః
సర్వారంభపరిత్యాగీ యో మద్బక్తస్స మే ప్రియః॥” అంటాడు.
“ఏ భక్తుడు దేని యందు ఆపేక్ష లేనివాడే, బాహ్యాభ్యన్తరశుద్ధి గలవాడై, కార్యదీక్ష గలవాడై, ఉదాసీనుడిగా, మనోవ్యాకులత లేక సమస్త కర్మలు వదలి ఉన్నాడో వాడు నాకు ప్రియమైన వాడు” అని చెప్పాడు.
కాబట్టి భగవంతుణ్ని ఆశ్రయిస్తే మరి దేనికీ వెతక వలసినది లేదు.
(సశేషం)