అమెరికా ముచ్చట్లు-24

0
3

[box type=’note’ fontsize=’16’] తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల శాఖలో ఓఎస్‌డిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ శ్రీధర్ రావు దేశ్‌పాండే తమ అమెరికా యాత్ర విశేషాలు సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

అమెరికాలో జీవితాలు ఎవరికి వారే యమునా తీరే:

[dropcap]మా[/dropcap] పిల్లలు ఉండే డాలస్‌లో ఉదయం 6 గంటలకే లేచి చాయ్ తాగి లాప్టాప్ ముందు వేసుకుని కూసునేవాడిని. ఇంటర్నెట్‌లో తెలుగు పత్రికలు అన్నీ చదివేసరికి 8.30 అయ్యేది. అప్పటికి పిల్లలు లేవనే లేవరు. ఎండాకాలం అమెరికాలో పగటి నిడివి రాత్రి 9 వరకు ఉండడంతో రాత్రి చాలా ఆలస్యంగా నిద్ర పోతారు. ఆలస్యంగానే నిద్ర లేస్తారు. పైగా వర్క్ ఫ్రమ్ హోమ్. కాబట్టి ఎప్పుడన్నా లేవచ్చు. ఎప్పుడన్నా పడుకోవచ్చు. మనలని అడిగేవారు ఉండరు. నిద్ర లేపే వారు ఎవరు రారు. పాలవాడు, పేపర్ వాడు, పని మనిషి, చెత్త తీసుకుపోయే సఫాయి వాళ్ళు, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు ఎవరు రారు. ఎవరి జీవితం వారిది. మన పక్కింట్లో ఎవరు ఉంటున్నది కూడా తెలువది. వాళ్ళ మొఖాలు కూడా కనపడవు. కొరియర్ వాడు కూడా మనం ఆర్డర్ చేసిన వస్తువులను ఇంటి ముందు పెట్టి వెళ్ళిపోతాడు. డెలివరి చేసినట్టు కంపనీ వాడు మనకు మెసేజ్ ఇస్తాడు. మనం నిద్ర లేచినప్పుడు ఇంట్లోకి తెచ్చుకోవాలి. సాధారణంగా దొంగతనాలు జరగవు. అన్ని అపార్ట్మెంట్స్ సిసి కెమెరాలు అమర్చి ఉంటాయి కాబట్టి అపార్ట్మెంట్స్‌లో దొంగతనాలు సాధారణంగా జరగవు. అమెరికాలో దొంగతనాలు అసలే లేవని కాదు. బయట ఒంటరిగా ఉన్న వాళ్ళని ఆపి డాలర్లు, సెల్ ఫోన్లు, బంగారం దోచుకుంటారు నల్ల వాళ్ళు, మెక్సికన్ అక్రమ వలసదారులు. కొన్ని సందర్భాలలో హత్యలు కూడా జరుగుతాయి. అమెరికాలో నిరుద్యోగులు, పేదవాళ్ళు వీళ్ళే. స్థానికులమైన తమ ఉద్యోగ అవకాశాలను కొల్లగొడుతున్నారని మన ఇండియన్ కమ్యూనిటీ అంటే విపరీతమైన కోపం వీళ్ళకు.

వలసల దేశం అమెరికా:

ఒక రోజు సాయంత్రం మేము ఉండే మెకని ప్రాంతంలోనే దగ్గరలో ఉన్న ఒక యూరోపియన్ ఆర్కిటెక్చర్‌తో నిర్మించిన ఒక గ్రామాన్ని చూసాము. దాన్ని అడ్రియాటికా యూరోపియన్ విలేజ్ అంటారు. యూరోపియన్ రియల్ ఎస్టేట్ కంపనీ ఏదో ఈ గ్రామాన్ని నిర్మించింది.

అడ్రియాటికా యూరోపియన్ గ్రామం

యూరోపియన్‌లే కాదు ఈ విలేజ్‌లో ఎవరైనా ఇల్లు కిరాయికి తీసుకోవచ్చు. ఇక్కడ ఇల్లు కిరాయికి దొరకడం కష్టమట. ఏదైనా ఇల్లు ఖాళీ అయితే వెయిటింగ్ లిస్ట్ ప్రకారం ఇల్లు కేటాయిస్తారు. అయితే నిజంగా కూడా విలేజ్ చాలా బాగున్నది. ఒక చెరువు, ఒక ప్రకృతి వనం, ఒక చర్చ్, ఒక క్లాక్ టవర్, ఒక విండ్ మిల్.. ఇట్లా యూరోపియన్ గ్రామాన్ని తలపించే విధంగా నిర్మించారు.

అడ్రియాటికా యూరోపియన్ గ్రామంలో చర్చ్

ఇక్కడ నిర్మించిన అపార్ట్మెంట్స్‌లో ఒక బ్లాక్ మొత్తం వృద్దులా కోసమే కేటాయించినారు. వృద్ధ దంపతులు, భర్తలు పోయిన వృద్ధ మహిళలు, భార్యలు పోయిన వృద్ధ భర్తలు.. వీరికే ఈ అపార్ట్మెంట్స్ కేటాయిస్తారు. అమెరికాకు వచ్చిన తెల్లవారు అందరు యూరప్ మూలాలు కలిగిన వారే. వారు వలస వచ్చి ఇక్కడ సెటిల్మెంట్స్ ఏర్పాటు చేసుకున్నప్పుడు యూరప్ గ్రామాల పేర్లనే పెట్టుకున్నారు. యూరప్ దేశాలలో ఉండే గ్రామాలు, నగరాల పేర్లు వేలాదిగా అమెరికాలో కనిపిస్తాయి.

అడ్రియాటికా యూరోపియన్ గ్రామంలో ఫ్లాట్స్

లూసియానా రాష్ట్రంలో ఇప్పటికీ ఫ్రెంచి వారి సంస్కృతి కొనసాగుతున్నదట. స్థలాల పేర్లు, భవనాల డిజైన్లు, ఆహార అలవాట్లు.. అన్ని ఫ్రెంచి వారి లెక్కనే ఉంటాయట. అది సహజమే కదా. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో మునిగిపోయిన గ్రామాల ప్రజలు తమ పునరావాస గ్రామాలకు పాత పేర్లే పెట్టుకున్నారు. అది ఊరితో ఉండే మోహబంధం. యూరప్ వలసవాదులు కూడా విశాలమైన అమెరికా ఖండాన్ని ఆక్రమించి ఇక్కడి స్థానిక ప్రజలను ఊచకోత కోసి, ఆఫ్రికా నుంచి వేలాది నల్లవారిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి బానిసలుగా మార్చి అమెరికా ఖండాన్ని అభివృద్ధి చేసినారు. ఈ అభివృద్ధికి దోహదం చేసింది వారు ఆసియా, ఆఫ్రికా వలస దేశాల నుంచి తరలించిన సొమ్మే. అమెరికా అభివృద్ధి చరిత్ర ఒక రక్తసిక్త చరిత్ర. ఇది గతంలో ఒక భాగంలో రాసి ఉన్నాను.

అడ్రియాటికా యూరోపియన్ గ్రామంలో రచయిత, వారి శ్రీమతి భారతి (డా. గీతాంజలి)

యూరప్ దేశాలతో పోలిస్తే అమెరికాలో ఇమ్మిగ్రేషన్ చట్టాలు కఠినంగా ఉండవు. ఈ సరళత కారణంగా ఇక్కడికి ఎవరైనా వచ్చి స్వేచ్ఛగా స్థిరపడిపోతారు. ఇది వలసల దేశం కాబట్టి. నిజానికి ఇక్కడ రెడ్ ఇండియన్స్ అని పిలువబడే స్థానిక అమెరికా జాతుల ప్రజలు తప్ప నల్లవారితో సహా ఎవరూ స్థానికులు కారు. ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి వలస వచ్చి ఇక్కడ స్థిరపడిన వారే. తొలి వలసవాదులు యూరోపియన్లు. అందుకే తెల్లవారి జనాభా ఎక్కువ. ఆ తర్వాత యూరోపియన్ వలసవాదులు దొంగతనంగా ఆఫ్రికా నుంచి తీసుకొచ్చిన నల్లజాతి ప్రజల జనాభా ఎక్కువ. ఐటి రంగం, సర్వీస్ సెక్టార్ అభివృద్ది మొదలైన తర్వాత అంటే 1970వ దశకం నుంచి ఇండియా నుంచి, ఇతర ఆసియా, లాటిన్ అమెరికా దేశాల నుంచి వలసలు బాగా పెరిగాయి. దానికి 1965లో వచ్చిన సరళీకృత నేషనాలిటి & ఇమ్మిగ్రేషన్ ఆక్ట్ బాగా దోహదం చేసింది. ఇక్కడ టెక్సాస్ రాష్ట్రంలో తెలుగు వారు వేల సంఖ్యలో ఉన్నారు. ఇక్కడి స్థానిక యువత ఉన్నత విద్యలో వెనుకబడి ఉన్నారు. అమెరికాలో యూనివర్సిటీలు నడవాలంటే విదేశీ విద్యార్థులు అమెరికా రాక తప్పదు. మన తెలుగు విద్యార్థులు ఈ అవకాశాలను బాగా అంది పుచ్చుకుంటున్నారు. ఐటి రంగంలో మన వారిదే ఆధిపత్యం. అమెరికాలో ఐటి రంగానికి కేంద్రాలుగా ఉన్న సాన్ ఫ్రాన్సిస్కో, సియాటిల్, డల్లాస్ లాంటి నగరాల్లో మన వాళ్ళే వేల సంఖ్యలో కనిపిస్తారు. స్టూడెంట్స్ దేశమంతటా అన్ని యూనివర్సిటీల్లో ఉంటారు.

అమెరికాలో భారతీయ తల్లిదండ్రులు బేబీ సిట్టర్స్

అమెరికాలో ఉన్నప్పుడు వేల్పురి సుజాత గారు ఆటా సావనీర్ కోసం రాసిన ఒక కథ ‘పుట్టలోని చెదలు’ ఫేస్‌బుక్‌లో చదివాను. అందులో అమెరికాలో భారతీయ తల్లిదండ్రుల స్థితిగతులను కళ్ళకు కట్టినట్టు వర్ణించారు. బహుశా అది ఆమె తన అనుభవంలోకి వచ్చిన ఒక నిజ సంఘటన ఆధారంగానే రాసి ఉంటారని నేను భావిస్తున్నాను. కథ సంక్షిప్తంగా.. ఇండియాలో ఉన్నతోద్యోగం చేసి రిటైర్ అయిన తర్వాత ఇండియాలో మొత్తం ఆస్తులు అమ్మేసి అమెరికాలో ఉంటున్న ఒకతే కూతురు వద్దకు భార్యాభర్తలు వెళతారు. కూతురు అల్లుడు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కాబట్టి వారి పేరెంట్స్‌గా ఇద్దరు వృద్ధ దంపతులకు కూడా గ్రీన్ కార్డ్ కూడా వస్తుంది. అక్కడ వారిని ఇంట్లో ఊరికే కూచోనివ్వదు కూతురు. ఒక పెద్ద షాపింగ్ మాల్‌లో సేల్స్‌మన్‌గా ఉద్యోగంలో చేరతాడు తండ్రి. తల్లి ఇండియా కుటుంబాల ఫంక్షన్ లకు వంటలు చేసే పెట్టే పనికి కుదురుతుంది. అట్లా వారు కొంత డబ్బు సంపాదిస్తూ ఉంటారు. ఇద్దరు అ వయసులో తమకు చేతకాని పనులు చేస్తూ భారంగా కాలం వెళ్ళదీస్తూ ఉంటారు. షాపింగ్ మాల్‌లో రోజు దింపడం తీసుకు రావడం అల్లుడికి కష్టం అవుతుందని ఆయన డ్రైవింగ్ కూడా నేర్చుకుంటాడు. ఈ నిర్బంధపు జీవితం నుంచి విముక్తి పొందాలని ఒక రోజు ఇద్దరు అనుకోని ప్లాన్ ప్రకారం తమకు తెలిసిన వారిచే ఇండియాకు ఫ్లైట్ బుక్ చేసుకొని పిల్లలకు చెప్పకుండా ఇండియా వచ్చేస్తారు. వారికి అనుకోకుండా ఇండియాలో తాతగారి ఆస్తిలో కొంత సొమ్ము కలిసి వస్తుంది. ఆ డబ్బుతో చిన్న ఇల్లు కట్టుకొని జీవితం గడుపుతారు. ఇది అమెరికాలో చాలా మంది తల్లిదండ్రులు అనుభవిస్తున్న వేదన. అమెరికా వెళ్ళిన తమ పిల్లల పిల్లలకు బేబీ సిట్టర్స్ మారిపోయి వారికి సేవలు చేస్తూ రిటైర్మెంట్ జీవితాన్ని అత్యంత భారంగా గడిపేస్తున్న తల్లిదండ్రులు ఎందరో. ఇండియాలో ఎంత ఘనమైన, ఉన్నతమైన జీవితం గడిపిన వాళ్ళకైనా అమెరికాలో బేబీ సిట్టర్స్‌గా మారక తప్పడం లేదు. పిల్లలకు పురుళ్ళు పోయడానికి వంతుల వారీగా తల్లిదండ్రులు అమెరికా వెళతారు. పిల్లలు స్కూల్ వెళ్ళే దాకా వీరే ఆలనా పాలనా చూస్తారు. స్కూల్‌కు వెళ్ళే వయసు వస్తే స్కూల్‌లో దింపడం, మళ్ళీ తీసుకు రావడం వీళ్ళ పనే.

వృద్దులను అమెరికా మోసుకుపోతున్న విమానాలు:

నేను అమెరికా వెళ్లిన ఖతార్ ఎయిర్‌వేస్ విమానంలో సగం కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఈలాంటి వారే ఉన్నారు. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో నిత్యం కనిపించే దృశ్యాలు ఇవే. కుటుంబాలు గుంపులు గుంపులుగా.. కొత్తగా అమెరికా వెళుతున్న పిల్లలు, పెళ్లి చేసుకొని వెళ్తున్న కొత్త దంపతులను పంపడానికి వచ్చిన అమ్మల, అమ్మమ్మ, నాయనమ్మల ఏడుపులు, నాన్నల జాగ్రత్తలు.. బిడ్డల ఓదార్పులు.. మేనమామల సంతోషాలు.. సెల్ఫీలు, ఫొటోలు.. ఇవన్నీ ఇక్కడ రోజూ కనబడే దృశ్యాలు. బిడ్డల కోసం అమెరికా వెళుతున్న తల్లిదండ్రులు, ఒంటరి అమ్మలు, నాలాగా ఒంటరి నాన్నలు కూడా కనిపించారు. పాత గుంపులు చెదిరి పోతున్నాయి. కొత్త గుంపులు ఏర్పాటు అవుతున్నాయి. అమ్మల నాన్నల ముద్దులు.. దోస్తుల కౌగిలింతలు.. కొత్తగా పెళ్లి చేసుకొని అమెరికా వెళుతున్న అమ్మాయి తరపు కుటుంబ సభ్యుల ఏడుపులు వర్ణనాతీతం. పెళ్లికొడుకు మాత్రం సామాన్ల వద్ద నిలుచుని మౌనంగా చూస్తూ ఉంటాడు.

మొత్తం మీద జరుగుతున్నదేమిటంటే మన దేశపు తల్లిదండ్రులు అమెరికాలో స్థిరపడిన పిల్లల సంతానానికి బేబీ సిట్టర్స్‌గా మారిపోతున్నారు. ఇది నిర్బంధంగా జరుగుతున్నాదా లేక స్వచ్ఛందమా అన్నది ఎవరి అనుభవాన్ని బట్టి వారే విశ్లేషించుకోవాలి. అయితే వేల్పూరి సుజాత గారి కథలో పేర్కొన్న నిర్బంధ జీవితాలు గడుపుతున్న తల్లిదండ్రులు కూడా అమెరికాలో ఉన్నారని చెప్పడానికి సందేహం అవసరం లేదు. అమెరికా వెళ్ళే విమానాల్లో స్టూడెంట్స్ ఎంత మంది ఉంటారో 60 దాటిన ముసలి తల్లిదండ్రులు అంతే మంది కనిపిస్తారు. అమెరికాలో పుట్టిన పిల్లలకు చట్టం ప్రకారం సహజ సిద్ధ పౌరసత్వం వస్తుందని ఇక్కడే పిల్లలని కంటారు. వారి పిల్లలను చూసుకోవడానికి మన తల్లిదండ్రులు వంతుల వారీగా అమెరికా వెళుతుంటారు. ఎందుకంటే 6 నెలల కంటే ఎక్కువ ఉండడానికి వీలు లేదు. పిల్లలకు గ్రీన్ కార్డ్ వస్తే తల్లిదండ్రులకు ఇప్పిస్తారు. గ్రీన్ కార్డ్ వస్తే ఎన్నిరోజులైనా ఉండవచ్చు. ఇండియాలో ఎంత ఉన్నత హోదాలో పని చేసి రిటైర్ అయినా చివరికి రిటైర్మెంట్ అనంతరం అమెరికాలో బేబీ సిట్టర్స్‌గా మారిపోతున్న ఒక విచిత్ర స్థితి ఏర్పడింది. అప్పుడప్పుడు బంధువులు, స్నేహితుల ఇళ్లకు, ఫంక్షన్ లకు, టూర్ లకు వెళతారు.

అమెరికాలో తెలుగు సంఘాలు:

అమెరికాలో తెలుగు వాళ్ళు ఏర్పాటు చేసుకున్న సంస్థలు చాలానే ఉన్నాయి. ఆ సంస్థలు ఉత్సవాలు ఘనంగానే జరుపుతాయి. 2019లో మొదటిసారి అమెరికా వెళ్ళినప్పుడు మేము నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (NATS) వారు 3 రోజుల పాటు డాలస్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన సాహితి సాంస్కృతిక ఉత్సవాల్లో పాల్గొన్నాము. అమెరికాలో వివిధ రాష్ట్రాల నుండి ముఖ్యంగా టెక్సాస్ రాష్ట్రం వివిధ నగరాల నుండి తెలుగు వాళ్ళు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆ సమావేశాల్లో అమెరికాలో చాలా కాలం నుంచి నివసిస్తున్న ప్రముఖ కవి అఫ్సర్, ఆయన సహచరి రెంటాల కల్పన గార్లు కలిశారు.

నాట్స్ సాహిత్య సభలో అఫ్సర్, రెంటాల కల్పన గార్లతో

గీతాంజలి కథల సంపుటి ‘హస్బండ్ స్టిచ్’ ఆవిష్కరణ కూడా ఆ సమావేశాల్లో జరిగింది. ఆటా, తానా సమావేశాలు రెండేండ్లకు ఒకసారి ఘనంగా జరుపుతారు.

నార్త్ అమెరికా తెలుగు సొసైటీ సాహిత్య సభలో హస్బండ్ స్టిచ్ పుస్తకావిష్కరణ

ఇండియా నుంచి ప్రముఖ సాహిత్యకారులు, కళాకారులు, సిని నటులు, రాజకీయ నాయకులు కూడా పాల్గొంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత తెలంగాణ వాసులు అమెరికాలో బతుకమ్మ ఉత్సవాలు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు జరుపుతున్నారు. డాలస్‌లో 2022 జూన్ 2న ఒక పార్క్‌లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో కూడా మేము పాల్గొన్నాము.

అయినా కూడా అమెరికాలో జీవితాలు మాత్రం ‘ఎవరికి వారే యమునా తీరే’ అన్న చందంగానే ఉంటాయి. ఇదీ స్థూలంగా అమెరికాలో భారతీయుల సామాజిక జీవితం. రెండు సార్లు అమెరికాలో పర్యటించి 5 నెలలు అక్కడ గడిపిన కాలంలో నేను చూసిన, నా అనుభవంలోకి వచ్చిన అంశాలు ఇవి. ఇంతకు మించి నేను చూడని జీవితం కూడా ఉండవచ్చు. ఇదే అమెరికాలో భారతీయుల జీవితం అని నేను ప్రకటించడం లేదని పాఠకులు గమనించాలని కోరుతున్నాను.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here