[dropcap]‘ఫె[/dropcap]మినిజం’ అన్న పదానికి ‘స్త్రీవాదం’ అనే పేరుతో తెలుగు సాహిత్యంలో ఎనభయ్యో దశకంలో కవితలు, కథలు, నవలలు పెను సంచలనాత్మకంగా వెలువడ్డాయి. ఈ పేరుతో లేకపోయినా తత్పూర్వమే రచయిత్రులు కొందరు ‘స్త్రీల ఆత్మగౌరవాని’కి భంగం కలిగించే సమస్యలను, వాటి పరిష్కారాలను గురించి కూడా రచించారు.
అలాంటి ఒక మంచి కథ ‘అవేద్యాలు’.
సెప్టెంబర్ 14, 1960 నాటి ఆంధ్రప్రభలో ప్రచురించబడింది నిడదవోలు మాలతి గారి కథ ‘అవేద్యాలు’. 70 ఏళ్ళ క్రితమే మాలతి గారు కథలు రాయడం ప్రారంభించారు. ఇప్పుడు కూడా రాస్తూన్న రచయిత్రి బహుశా ఆమె ఒక్కరే నేమో! తన కథలనన్నిటినీ ఆరు సంపుటాలుగా తన బ్లాగులో ఉంచారు. తన అనుభవాలను, జ్ఞాపకాలను ‘ఎన్నెమ్మ కతలు’ పేర బ్లాగులో భద్రపరిచారు. (tethulika.wordpress.com లో చూడవచ్చు.)
కథ విషయానికి వస్తే – సుందరంకి తన మేనత్త కూతురు పదిహేడేళ్ళ శారదతో పెళ్లి నిశ్చితార్థం జరిగింది. శారదకి చిన్నప్పుడే తల్లి చనిపోయింది. ఫోర్త్ ఫారం వరకు స్కూల్‌కి వెళ్ళి, ఆ సిలబస్‌లు నచ్చక, పరీక్షల కోసం చదవడం ఇష్టం లేక స్కూల్ మానేసింది. తండ్రి చేత అమరకోశం తెప్పించుకొని, ఇంకా తనకిష్టమైన తెలుగు సాహిత్యాన్ని చదువుకోసాగింది. ఈ విషయం లోనే శారదకి ఏదో ఒక చట్రంలో ఇమిడిపోవడం ఇష్టం లేదని, తనకు నచ్చిన విధంగా వ్యక్తిత్వాన్ని పెంపొందించుకొంటుందని తెలుస్తోంది.
తాంబూలాలు పుచ్చుకొన్న మూడో రోజే సుందరం తండ్రి హఠాత్తుగా గుండెపోటుతో మరణించాడు. “ఒక్కొక్కరి జన్మ విశేషం..” అని అమ్మలక్కలు అన్నారు. “పుట్టగానే తల్లి చనిపోవడం, చదువు ఒంట పెట్టకపోవడం, తండ్రి కవిగా రాణించలేక పోవడం” మొదలైన విషయాలన్నీ ఈ పెళ్లి ఆగిపోవడంతో పైకి వచ్చాయి. అమ్మాయి ‘నష్టజాతకురాలు’ అని నిర్ధారించేసారు.
ఏడాది పూర్తయ్యాక దశరథరామ్మూర్తి పెళ్లి విషయం కదిపితే పెద్దవాడు చలపతి ఇంచుమించుగా అదే ఉద్దేశంతో “మా అమ్మవి అవో రకం నమ్మకాలు. మేం చెప్పలేం” అని తల్లి మీదకు తోసేసి ఊరుకొన్నాడు. ఆ దెబ్బకు వారం రోజులు మామూలు మనిషి కాలేక పోయాడాయన. ఆడపిల్ల తండ్రిగా శక్తిని కూడదీసుకొని సంబంధాలు చూడసాగాడు. పెళ్లి చెడిపోయిన విషయం చుట్టుపక్కల ఊళ్ళలో చాలామందికి తెలిసిపోయింది. రిటైర్ అయి, ఆ పెద్ద వయసులో దూరప్రాంతాలకు తండ్రి సంబంధాల కోసం తిరగడం శారద మనసును క్రుంగదీస్తోంది.
ఆ సమయంలో చలపతి వచ్చాడో రోజు. తన కొడుకు బాగా చదివాడని, తీరా డిగ్రీ పరీక్షల ముందు సుస్తీ చేయడంతో మార్కులు సరిగ్గా రాలేదని, ఏదైనా సహాయం చేయమని అడిగాడు. పిల్లవాడి విషయం కాబట్టి శారద కఠినంగా మాట్లాడలేక పోయింది. కానీ చలపతి “మేనత్త కూతురువి, నువ్వు వచ్చి అమ్మని అడగలేక పోయావా” అని అవివేకపు మాట జారేసరికి ఆమె గుండెలో ఆత్మాభిమానం చివ్వున ఎగజిమ్మింది. అప్పటికే సుందరానికి డిప్యూటీ కలెక్టర్ గారి అమ్మాయితో పెళ్లి నిశ్చయం అయిందని ఊరందరితో పాటు ఆమెకీ తెలుసు.
ఆ తర్వాత అనుకోకుండా శారదను కలిసిన సుందరానికి శారద పట్ల తాను అన్యాయంగా ప్రవర్తించానని, ఈ మాణిక్యాన్ని చేజార్చుకోనే పొరపాటును సరిదిద్దుకోవాలని ‘జ్ఞానోదయం’ అయింది. ఇంటికి వెళ్ళి డిప్యూటీ కలెక్టర్ గారి అమ్మాయిని చేసుకోనని, శారదనే చేసుకొంటానని డిక్లేర్ చేసాడు. ఆ చిన్న ఊరులో ప్రతి చిన్న విషయం వెంటనే పాకిపోతుంది. శారదకీ తెలిసింది.
బావ.., పైగా పెళ్లి నిశ్చయం అయింది.., అపార్థాలుతో ఆగినా.., ఇప్పుడు ఒప్పుకొన్నాడని.. ఎగిరి గంతేయలేదు శారద.
“పొరపాటు దిద్దుకుంటానంటూ అదే పొరపాటు చేయడం తెలివైన పని కాదని నాకు తోస్తోంది. ఇంతదాకా రావడమే పొరపాటు. జానకిని క్షమాపణ వేడుకోవడం సమంజసం” అని చీటీ రాసి పంపింది.
1960ల్లో శారద అలా తనను తాను కోల్పోకుండా, ఆత్మాభిమానంతో గట్టిగా నిలబడడం అరుదు. అలాంటి వ్యక్తిత్వం గల స్త్రీ పాత్రను సృజించడం (అప్పటికి ‘కుమారి’ అయిన) మాలతి గారి అభ్యుదయ భావాలకు, నిబద్ధతకు నిదర్శనం. అప్పటి నుండి ఇప్పటి వరకు తన సైద్ధాంతిక మార్గానికి ఏ మాత్రం అటూ ఇటూ కాకుండా, ఎవరి మెచ్చుకోలు ఆశించకుండా రాస్తున్న మాలతి గారు అభినందనీయురాలు.
పద్మప్రియ ప్రచురణలో ‘కల్పన’ అనే పేరుతో 1962 వచ్చిన తొమ్మిది మంది రచయిత్రుల కథా సంకలనంలో ఈ కథ చోటు చేసుకుంది. కొమ్మూరి ఉషారాణి, మందరపు పద్మ, లలిత, కె. రామలక్ష్మి, ఇల్లిందల సరస్వతి దేవి, చాగంటి తులసి, ముప్పాళ్ళ రంగనాయకమ్మ, యన్.యన్. ప్రసూన, తురగా జానకీరాణి మిగిలినవారు.
తర్వాత ప్రఖ్యాతమైనా, ఆనాటికి వర్ధమాన రచయిత్రులే వీరు. అయినా నేటి స్త్రీవాదంకి ఏమాత్రం తగ్గలేదీ కథలు. అందులోనూ ఆణిముత్యం మాలతి గారి ఈ ‘అవేద్యాలు’ కథ.