ఒక సరికొత్త ప్రయత్నం – ‘సినీ కథ’

0
4

[dropcap]యూ[/dropcap]రప్‌లో, అమెరికా వంటి దేశాల దినపత్రికలలో ‘టుడే ఇన్ హిస్టరీ’, ‘దిస్ డే దట్ ఇయర్’ శీర్షికలతో సంవత్సరం పొడవునా ప్రత్యేక కాలమ్‌లు, ఫీచర్లు ప్రచురింపబడేవి. ఆయా దేశాలలోనూ, మొత్తం ప్రపంచంలోను వివిధ సంవత్సరాలలో ఆ రోజు జరిగిన శాస్త్ర సాంకేతిక, వైజ్ఞానిక, రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాహిత్య, సాంస్కృతిక విశేషాలను రేఖామాత్రంగా ఈ శీర్షికలలో పరిచయం చేస్తారు. దీని వల్ల ఆ రోజుకు చరిత్రలో ఉన్న విశిష్ట స్థానం పాఠకులకు అర్థమవుతుంది.

ఈ పద్ధతిని మన తెలుగు దినపత్రికలు కూడా ఆచరించాయి. కానీ దీన్ని పాఠకులు పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. ఇలాంటివి పుస్తక రూపంలో వస్తే తప్ప పాఠకులను ఆకర్షించలేవు. కొన్ని సాహిత్య, సాంస్కృతిక సంస్థలు ప్రముఖ సాహితీవేత్తల జయంతి – వర్ధంతులతో క్యాలెండర్‌ను ఏర్పాటు చేసుకుంటారు. ఇలా కాకుండా ఒక విస్తృతమైన పద్ధతిలో, ప్రణాళికా బద్దంగా పెన్నా శివరామకృష్ణ 2005లో ‘రోజు రోజుకో చరిత్ర’ పేరిట ఒక పుస్తకం వెలువరించారు. ఇందులో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ సంఘటనలు, ప్రముఖుల జయంతులను – వర్ధంతులను తెలియజేశారు. వీరే 2011లో ‘జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు’ పేరిట చరిత్రను మలుపు తిప్పిన సంఘటనలను వివరంగా అందజేశారు. ఇవిగాక పెన్నా 2019లో ‘తారీకుల్లో తెలంగాణ’ అనే పుస్తకాన్ని తీసుకువచ్చారు. ఇందులో సమకాలీన తెలంగాణ ఉద్యమం – చరిత్రలోని ప్రధాన ఘట్టాలు, వ్యక్తుల గురించిన సంక్షిప్త పరిచయం- సమాచారం ఉంది. ఇది కొండను అద్దంలో చూపించే ప్రయత్నమే అయినప్పటికీ, తెలంగాణ ఉద్యమం -చరిత్రను తెలుసుకోవాలనుకునే వారికి, వివిధ పోటీ పరీక్షల ఉద్యోగార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది.

కాలచక్రంలో దొర్లిపోతున్న చరిత్రను, అందులోని ముఖ్యమైన చారిత్రిక ఘట్టాలను గుర్తించడం, వాటన్నింటినీ కాలక్రమానుగుణంగా క్రమ పద్ధతిలో ఒకచోట ఇమడ్చటం చాలా కష్టమైన పని. చాలావరకు ఇలాంటి ప్రయత్నాలు చరిత్ర, సంస్కృతిల వరకే పరిమితమవుతాయి. ఓపిక, ఉత్సాహం ఉన్నవారు ఇతర రంగాలలో కూడా ఇలాంటి ప్రయత్నాలను చేపడతారు. అలాంటి సాహసం చేసిన వారిలో పాలకోడేటి సత్యనారాయణ రావు గారు ఒకరు. వీరు మొదటిసారిగా సినీ రంగ చరిత్రను సంవత్సర కొలమానాన్ని కాదని, 13 నెలల కాలాన్ని తీసుకొని సినీ రంగ చరిత్ర – వివరణలను రోజువారీగా అందజేయడం విశేషం.

కథకుడిగా, నవలాకారుడిగా సుప్రసిద్ధుడైన పాలకోడేటి సత్యనారాయణ రావు గారు దాదాపు 20 సంవత్సరాల పాటు ఈనాడు దినపత్రికలో అనేక శీర్షికలను నిర్వహించారు. ఏజి ఆఫీసులో పనిచేసిన అనుభవంతో ‘జిపిఎఫ్, ఏపీ జి ఎల్ ఐ, లీవ్ రూల్స్’ హ్యాండ్ బుక్స్ ను రూపొందించి ఉద్యోగులకు ఎంతో మేలు చేశారు. తిరుమల, తిరుపతి, తిరుచానూరులలో ఏం చూడాలి? వాటి విశిష్టత ఏమిటి?లాంటి అనేక ఆసక్తికరమైన అంశాలతో ‘శ్రీవారి సన్నిధి’ అనే వినూత్నమైన పుస్తకాన్ని విలువరించారు. ఇవి కాకుండా ఎన్నో టెలీ సీరియల్ లకు వీరు రచన, దర్శకత్వ బాధ్యతలను నిర్వహించారు.

సినిమాలు – సినీ రంగంపై పూర్తి సాధికారత కలిగిన పాలకోడేటి వారు ‘బాలీవుడ్ క్లాసిక్స్’ పేరిట మేలిమి హిందీ చిత్రాల పరిచయాన్ని, ‘హాలీవుడ్ క్లాసిక్స్’ పేరిట పేరెన్నిక గల ఆంగ్ల చిత్రాల విశ్లేషణలను అందజేసి విస్తృతంగా అభిమానుల సంఖ్యను పెంచుకోగలిగారు. వీరిని ప్రేరణగా తీసుకొని మరికొంతమంది ఇలాంటి రచనలు చేసినా, వీరి స్థాయిని అందుకోలేకపోయారు. దటీజ్ పాలకోడేటి. అలాగే వీరి ‘భారతీయ చలనచిత్ర కథన శాస్త్రం పై హాలీవుడ్ ప్రభావం’ అనే పీహెచ్డీ సిద్ధాంత గ్రంథం రిఫరెన్స్ బుక్‌గా నిలిచిపోయింది.

సినీ ప్రియుడు, సినీ విమర్శకుడైన పాలకోడేటి తలపెట్టిన సరికొత్త ప్రయత్నమే ఈ సినిమా డైరీ. ఫోటోల నుండి కదిలే బొమ్మలు, మూకీ టాకీల నుండి పానా విజన్ 3D ల వరకు సినిమా రంగంలో జరిగిన శాస్త్రం సాంకేతిక పురోగతిని, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన ఉత్తమ చిత్రాలను, సినీ రంగ ప్రముఖులను – విశేషాలను ఆసక్తికరంగా రూపొందించి ఇలా డైరీ రూపంలో అందజేయడం అపూర్వం, అద్భుతం.

ఇందులో ప్రధానంగా తెలుగు, హిందీ,ఇంగ్లీష్ భాషలలో వచ్చిన ఉత్తమ లేదా సంచలన చిత్రాల వివరాలు, విశేషాలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో వివిధ భాషలలో వచ్చిన తొలి చిత్రాలను, అక్కడి ప్రముఖులను వారి కృషిని తెలియజేస్తారు. అంతర్జాతీయంగా వివిధ దేశాలలో వచ్చిన మంచి చిత్రాలను, చిత్రరంగ విశేషాలను తెలియజేశారు.

సినిమాలు – సినీ ప్రముఖుల గురించి వ్యాసాలు రాసేవారు అప్పటికే తెలిసిన విషయాలను మళ్లీమళ్లీ రాసుకుంటూ పోవడం కనిపిస్తుంది. కానీ పాలకోడేటి వారు అందుకు భిన్నంగా ఎవరికి తెలియని విషయాలను అందజేయడానికి ప్రయత్నించడం బాగుంది. అక్కినేని ప్రసక్తి వచ్చినప్పుడు ఆయన గురించి కొత్త విషయాలను చెబుతారు. మళ్ళీ ‘విప్రనారాయణ’ సినిమా దగ్గరికి వచ్చేసరికి ‘విప్రనారాయణ’ నాటకంలో దేవదేవి పాత్రను పోషించిన అక్కినేని, సినిమాలో విప్రనారాయణ పాత్రను పోషించడం ఆశ్చర్యం అని చెబుతారు. అలాగే గాయకుడు కిషోర్ కుమార్ గురించి నాలాంటి అభిమానులకు కూడా తెలియని విషయాలను వివరిస్తారు. జెమిని బాలనాగమ్మకు పోటీగా ‘శాంత బాలనాగమ్మ’ వచ్చిందన్న సంగతి ఎవరికీ తెలియదు. ఎస్పీ బాలసుబ్రమణ్యం ఒక రోజున ఏకధాటిగా ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఏకంగా 21 పాటలను ఉపేంద్ర కుమార్ సంగీత దర్శకత్వంలో పాడారని తెలియజేయడం నిజంగా ఆశ్చర్యకరమే. 28 దేశాలలో మొత్తం 17 భాషల సబ్ టైటిల్స్‌తో ఒకేసారి విడుదలై సంచలనం సృష్టించిన చిత్రం ‘ఆన్’ అట. చికాగో నగరంలోనీ థియేటర్లో అగ్నిప్రమాదం జరిగి 62 మంది చనిపోయారు. అప్పటినుండి థియేటర్లలో రక్షణ చర్యలను చేపట్టారని చెప్పడం, ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న బాలనటి షిర్లీ టెంపుల్ అనే విషయాన్ని తెలియజేయడం పాఠకుల్ని సంబ్రమాశ్చర్యంలో ముంచెత్తుతాయి.

భాషా భేదం లేకుండా సినిమాలు – సినీ రంగం పట్ల అమిత ఆసక్తి చూపించే పాలకోడేటి వారు ఎప్పటికప్పుడు వినూత్నంగా ఆలోచించి రచనలను, కార్యక్రమాలను రూపొందించడంలో అందరికంటే ముందే ఉంటారు. ముఖ్యంగా విస్తృతమైన సమాచారాన్ని సేకరించడం, దాన్ని వింగడించి విశ్లేషించుకొని వివరించడం ఇందులో కనిపిస్తుంది. ప్రామాణికంగా రూపొందిన ఈ వివరాలు సమాచారాత్మకంగా విజ్ఞానాత్మకంగా ఉన్నాయి. డైరీ అంటే ఎంపిక చేసిన తేదీలను తిరగేసి సమాచారం కోసం చూసేవాళ్ళు ఉంటారు. ఆ సమాచారం చూసిన వాళ్లు మిగతా తేదీలలో ఏముందో చూడాలని ఉత్సుకత తప్పక చూపిస్తారు. అంత ఆసక్తికరంగా సాగిన ఈ పుస్తకం సినీ అభిమానులనే కాదు, ఇతర పాఠకులను కూడా అలరిస్తుంది. ఈ దిశగా పాలకోడేటి వారు చేసిన కృషి ప్రశంసనీయం.

***

‘సినీ కథ’
సంకలనం: డా. పాలకోడేటి సత్యనారాయణ రావు.
శ్రీ అనుపమ సాహితి.,
నిజాంపేట్, హైదరాబాద్ 90.
వెల ₹ 275/-
పేజీలు క్రౌన్ సైజ్ లో 206.
సోల్ డిస్ట్రిబ్యూషన్ – నవోదయ, హైదరాబాద్.
090004 13413

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here