అలనాటి అపురూపాలు-149

0
3

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

మధుర గాయని, చక్కని నటి అమీర్‍బాయి కర్నాటకి:

హిందీ సినీరంగంలో తొలినాటి గాయనీమణుల్లో అమీర్‍బాయి కర్నాటకి ఒకరు. అమె 150 సినిమాల్లో 380 పాటలు పాడారు. ‘మై తో పవన్ చలీ హూఁ బోలే పపిహా’, ‘బైరన్ నిందియా క్యూ నహీ ఆయే’ వంటి మరపురాని పాటలను పాడారామె. అమీర్‌బాయి కర్నాటకలోని బీజాపూర్‍లో జన్మించారు. 1930లలో సురయ్యా, శంషాద్ బేగం, నూర్‍జహాన్, జోహ్రాబాయ్ అంబేవాలి తో పాటుగా అమీర్‍బాయి పేరు కూడా విశేషంగా వినబడేది.

కళాకారుల కుటుంబంలో పుట్టిన అమీర్‍బాయి తల్లిదండ్రులు అమీన్‍బీ, హుస్సేన్ సాబ్‍లు. వారు ఒక రంగస్థల కంపెనీ కోసం పనిచేసేవారు. మరో సంస్థని ఎన్నో ఏళ్ళ పాటు నడిపారు. అమీర్‍బాయి, ఆమె అయిదురు తోబుట్టువుల ఎదుగుదల సంగీతం, రంగస్థలం మధ్య జరిగింది. ఆమె రక్తసంబధీకులు ఎందరో రంగస్థలంపై ప్రసిద్ధ సంగీతజ్ఞులు, నటులునూ. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోతే, హతేల్ సాహెబ్ పిల్లల సంరక్షణ బాధ్యత వహించారు.

ఆ కాలంలో బీజాపూర్ ముంబయి ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది. సంగీతం, నాటక రంగాల కార్యక్రమాలు గొప్పగా జరిగేవి. సుప్రసిద్ధ బాలగంగాధర కంపెనీ, మరి కొన్ని ఇతర నాటకరంగ సంస్థలు బీజాపూర్‍లో ప్రదర్శనలిచ్చేవి. అమీర్‌బాయి, సోదరి గోహర్‍బాయిలకు శాస్త్రీయ సంగీతంలో శిక్షణ లభించింది. వీరిద్దరూ తమ గాన నైపుణ్యంతో ఈ నాటక సంస్థలను ఆకట్టుకున్నారు. ఆ ప్రదర్శనలలో పాడడమే కాక, నటించసాగారు.

అమీర్‍బాయి కర్నాటకీ జీవితకథ రచించిన రహ్మత్ తరికెరె వెల్లడించిన వివరాల ప్రకారం – అనతి కాలంలోనే అమీర్‍బాయి – రంగస్థలం నుంచి సినిమాలకి మళ్ళారు. అయితే ఈ ప్రయాణం యొక్క ఖచ్చితమైన తేదీలు, మార్పులు చెప్పడం కష్టమయ్యాయి. ఒక చారిత్రక సమయంలో ఎన్నో ఘటనలు జరిగినందున అన్నిటినీ సేకరించడం సాధ్యం కాకపోయింది, పైగా చాలావాటికి ఆధారాలు లేవు. అయితే రహ్మత్ తరికెరె అతి కష్టం మీద విలువైన పత్రాలు అవీ సేకరించి – అమీర్‍బాయి జీవితాన్ని గ్రంథస్థం చేశారు. ఆయన వెల్లడించిన ప్రకారం – అమీర్‍బాయి బొంబాయి చేరి సినీరంగంలో ప్రవేశించిన రోజులలో (అది బహుశా ఆలమ్ అరా సినిమా విడుదలయిన ఏడాది 1931 కావచ్చు), సినీ, సంగీత, నాటక రంగాలలో పనిచేసే స్త్రీలను సమాజం చిన్నచూపు చూసేది.

ప్రచారంలో ఉన్న విభిన్నమైన కథనాల ప్రకారం, ఆమె, ఆమె కుటుంబ సభ్యులు బొంబాయికి వలస వెళ్ళారు. జరిగిన సంఘటనల ఒక కథనం ప్రకారం ఆమె తనకి 15 ఏళ్ళ వయసులో బొంబాయి చేరారు.. అంటే అది 1921. మరో కథనం ప్రకారం ఆమె బొంబాయికి 1931లో  ఆలమ్ అరా సినిమా విడుదలయినప్పుడు వచ్చారు. ఈ కథనాలు ఎలా ఉన్నా, అమీర్‌బాయి నటించిన తొలి చిత్రం ‘విష్ణు భక్తి’ (1934). జి.ఆర్. సేథీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అవకాశం ఆమెకి ఆమె పెద్దక్కయ్య వల్ల దక్కింది. నటిగా, గాయనిగా ఆమె తొలి రోజులలో ఎలాంటి ప్రభావమూ చూపలేకపోయారు. కానీ ‘ఇస్ పాప్ కీ దునియా సే అబ్ ఔర్ కహీఁ లే చల్’ (జమానా, 1938), ‘పరేషాన్ హుఁ కీ క్యూం మేరీ పరేషాన్ నహీ జాతీ’ (పర్బత్ పే అప్నా డేరా, 1944), ‘ఆజ్ కర్ లే జీ భర్ సింగార్’ (మాబాప్, 1944) వంటి పాటలు అమిత ప్రజాదరణ పొందాయి. గుజరాతీ సినిమా ‘రానక్‍దేవి’ (1946) లో ఆమె పాడిన ‘మారే తే గామ్రే ఏక్ బార్ ఆవ్‍జో’ పాట గొప్ప హిట్ అయింది.

ఆమె హిందీ, కన్నడ సినీ పరిశ్రమలలో సమానంగా పనిచేశారు. రెండు భాషలలోనూ విజయవంతమయ్యారు. ‘చిరంజీవి’ (1936) సినిమాలో ‘మధుర వీనె మధుర వీనె ప్రేమ’ అనే పాట జనాలని విశేషంగా ఆకట్టుకుంది. ఆమెను ‘కన్నడ కోకిల’ అని పిలిచేవారు. అయితే హిందీ చిత్రరంగంలో ఆమెను సాటిలేని గాయనిగా చేసినది మాత్రం బొంబే టాకీస్ వారి ‘కిస్మత్’ (1943) చిత్రం. ఈ సినిమాలో ఉన్న మొత్తం 8 పాటలలో 6 ఆమె పాడారు. ఈ సినిమాకి అనీల్ బిస్వాస్ సంగీత దర్శకత్వం వహించారు. ఆనాటి బ్రిటీష్ పాలకుల పాలనలో కూడా – ఓ పాటలో – బ్రిటీష్ వారిని దేశం వదిలి వెళ్ళాలని కోరారు. అప్పట్లో స్వాతంత్ర్యోద్యమం పతాకస్థాయిలో ఉంది. అందరిలోనూ దేశభక్తి ప్రజ్వరిల్లేది.

‘దూర్ హఠో అయే దునియావాలో హిందూస్థాన్ హమారా హై’ అనేది ఓ గొప్ప సంచలనం. అశోక్ కుమార్‍తో పాడిన ‘ధీరే ధీరే ఆ రే బాదల్’ అనే యుగళ గీతం గొప్ప హిట్ అయింది. బసంత్ (1942) సినిమాలోని ‘హువా క్యా కుసూర్ జో హమ్ సే దూర్’ అనే పాట కూడా జనాదరణ పొందినదే.

మహిళా కళాకారులను ‘స్వేచ్ఛాసంచారులు’గా హేళన చేసేవారు. ఎందరో కళాకారిణులతో సహా అమీర్‍బాయి, గోహర్‍బాయి కూడా ఈ మచ్చని చెరిపేందుకు ప్రయత్నించారు. ఆ రోజుల్లో ఇటువంటి కళాకారిణులను కుటుంబాలు వెలివేసేవి.. కొందరైతే చంపబడ్డారు కూడా.

ఇటువంటి సామాజిక దురవస్థలని ఎదుర్కుంటూ మహిళా కళాకారులు సాగించిన పోరు స్వాతంత్ర్య సమరానికి ఏమీ తీసిపోదని అంటారు రెహ్మత్ తరికెరి. నేటి నటీమణులు, కళాకారిణులు, గాయనీమణులు అనుభవిస్తున్న కీర్తి ప్రతిష్ఠలన్నీ పాత తరం కళాకారిణుల త్యాగాల ఫలితమే అని అంటారాయన. అమీర్‍బాయి నటించిన రెండు హిట్ సినిమాలు – బసంత్, కిస్మత్ – నటీమణుల అవస్థల మీద తీసినవి కావడం విశేషం.

తన కాలంలో పేరుమోసిన గాయని, నటి అయ్యారు అమీర్‍బాయి. ఆమెకి గొప్ప పారితోషికం లభించేది. దానితో ఆమె బీజాపూర్‍లో ఒక అమర్ టాకీస్ అనే థియేటర్ నిర్మించారు. సినిమా, నాటక రంగాలకి సంబంధించిన ప్రదర్శనలిస్తూ ఆమె మొత్తం ఉత్తర కర్నాటక అంతా పర్యటించారు.

అత్యంత మధురమైన ప్రేమ గీతాలు పాడిన గాయనికి నిజజీవితంలో ప్రేమ విఫలమైంది. ఆమె భర్త హిమాలయ్‍వాలా, ఓ పార్శీ నటుడనీ, విలన్ పాత్రలు పోషించేవారనీ రెహ్మత్ తరికెరి తెలిపారు. ఆయన ఆమెను శారీరకంగానూ, మానసికంగాను వేధించేవారట. ఎన్నో బాధలకి గురైన తర్వాత, ఆయనతో విడిపోయారట. తెర మీద చెడ్డ పాత్రలు పోషించే వ్యక్తి నిజజీవితంలో కూడా చెడ్డవాడిగా ఉండడం ఆ రోజుల్లో అరుదు. ఎంతో పోరాటం చేశాకా, చేల్ శంకర్ వ్యాస్ అనే గుజరాతీ న్యాయవాది సహాయంతో ఆమె విడాకులు పొందగలిగారు. ఎడిటర్ బద్రీ కాంచన్‍వాలా గారిని ద్వితీయ వివాహం చేసుకున్నారు. ఈ వివాహం ద్వారా ఆమె సంతోషాన్ని, ప్రశాంతతను పొందారు. మొదటి వివాహం వల్ల కలిగిన వేదనని తట్టుకోలేక కొన్నేళ్ళు ఆమె అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారట. బద్రీ కాంచన్‍వాలాతో జరిగిన రెండో పెళ్ళి ఆమెను కుదుటపరిచింది. జీవితంలో శాంతిని కలగజేసింది. 1960లలో సినిమా ఆల్బమ్ కాని ఓ కన్నడ ప్రైవేట్ ఆల్బమ్‍లో అమీర్‍బాయ్ పాడిన ఓ పాట రేడియోలో గొప్ప ఆదరణ పొందింది. అదే ‘నిన్ననే నేనేయుత రాత్రియ కలెదె’ (సారీ సారీ రాత్ – హిందీలో లత పాడారు). 1950 నుంచి లతా మంగేష్కర్ విజృంభించడంతో అమీర్‍బాయి వంటి గాయనీమణుల ప్రభ మసకబారింది.

1965లో 55 ఏళ్ళ వయసులో అమీర్‍బాయి కన్నుమూశారు.  అప్పటికే కర్నాటక రాష్ట్రం ఏకీకృతమైంది. కానీ ఆ కొత్త రాష్ట్రంలో ఆమె గురించి చాలా తక్కువ మందికి తెలుసు. దినపత్రికలు కూడా ఆమె మరణించిన నాల్గవ రోజున వార్తని అందించాయి. ఆ తరువాతనే జనాలు ఆమె గొప్పతనం తెలుసుకున్నారు. ‘వైష్ణవ జనతో’ భజన ఆమె పాడితే మహాత్మునికి ఎంతో నచ్చేది. 40వ, 50వ దశకాలలో అమీర్‍బాయికి ఎంతో పేరు తెచ్చిపెట్టిన ఈ భజన – అప్పట్లో – ఇప్పుడు మనకి తెలిసిన బాణీలో ఉండేది కాదుట.

తన కాలంలోనే గొప్ప ప్రతిభాశాలి అని అనిపించుకున్నారు అమీర్‍బాయి.

ఈ క్రింది లింక్ లలో ఆమె పాటలు వినవచ్చు.

https://www.youtube.com/watch?v=PtVxdWJH-CM

https://www.youtube.com/watch?v=7YytpghO9kk

https://www.youtube.com/watch?v=OOGAWarcf7w


దేబ్ ముఖర్జీ:

1930ల నుండి నాలుగు తరాలుగా సినిమా రంగాన్నే వృత్తిగా చేసుకుని జీవించిన ముఖర్జీ కుటుంబానికి చెందినవారు దేబ్. ఆయన తండ్రి శశ్‌ధర్ ముఖర్జీ, ఫిల్మాలయ సంస్థ యజమాని. తల్లి సీతాదేవి ముఖర్జీ ప్రముఖ నటులు, గాయకులు అయిన – కిషోర్ కుమార్, అశోక్ కుమార్, అనూప్ కుమార్‍ల ఏకైక సోదరి. ప్రసిద్ధ నటుడు జోయ్ ముఖర్జీ, నటి తనూజ భర్త శోమూ ముఖర్జీ – దేబ్ సోదరులు. కాజోల్, తనీషా – ఆయన మేనకోడళ్ళు. రాణి ముఖర్జీ, శర్వాణీ ముఖర్జీ సమీప బంధువులు. దేబ్ ముఖర్జీ కూతురు (మొదటి భార్య సంతానం) సునీత ప్రముఖ దర్శకుడు అశుతోష్ గోవారికర్‍ను వివాహం చేసుకున్నారు. దేబ్ ముఖర్జీ కొడుకు (రెండవ భార్య సంతానం) దర్శకుడు అయాన్ ముఖర్జీ.

తన గురించి, తన తండ్రి గురించి కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు అయాన్.

శశ్‌ధర్ ముఖర్జీ మనవడు, దేబ్ ముఖర్జీ కొడుకు అంటే కపూర్ వంశస్తుల లాంటి వాడు కాదని అన్నారు అయాన్. తనకి చిన్నప్పుటి అందమైన జ్ఞాపకాలు లేవని చెప్పారు. సినీ పరిశ్రమలోని గొప్పవాళ్లతో కలిసి పనిచేయాలనే కోరికతోనే పెరిగి పెద్దయినట్టు తెలిపారు. తను పడిన కష్టాల గురించి చెబుతూ, తనకు పరిశ్రమలోని కీలక వ్యక్తులతో మెసిలే అవకాశం రాలేదని అన్నారు.

“నాకు ఉత్తమమైన సినీ సెట్లకీ వెళ్ళే అవకాశం గాని, కీలకమైన వ్యక్తులను కలిసే అవకాశం గాని లభించలేదు. సినీ పరిశ్రమకి చెందిన కుర్రాడిగా పరిశ్రమలో రాణించాలని కోరుకున్నాను, కీలకమైన వ్యక్తులతో కలిసి పని చేయాలనుకున్నాను” చెప్పారీ దర్శకుడు. కరణ్ జోహార్ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించగా, ఈయన దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘వేక్ అప్ సిద్’ అంచనాలను అందుకుని రాణించింది.

అయితే ముఖర్జీ అనే ఇంటిపేరు తనకి పెద్దగా ఉపయోగపడలేదని అంటారీయన.

“నేను ఎదుగుతున్నప్పుడు ముఖర్జీల పేరు పెద్దగా వినిపించలేదు. మా ఈ పరిశ్రమ ఎలా పనిచేస్తుందంటే, ఎప్పుడో 20-30 నాళ్ళ నాటి విజయాలను గురించి మాట్లాడదు. ఇదో కఠినమైన పరిశ్రమ. నేను పెరుగుతున్నప్పుడు నా మనోభావాలు ఇలానే ఉండేవి.” అన్నారాయన.

“సినిమాలతో సంబంధం ఉండి కూడా నాకు పెద్దగా ఉపయోగం లేకపోయింది. నేను కరణ్ (జోహార్) దగ్గర సహాయ దర్శకుడిగా చేయాలనుకున్నప్పుడు నాకు మావాళ్ళెవరూ ఉపయోగపడలేదు.. మిగతావారిలానే నేను నా అంతట నేను సాధించాను. నేను ఫలానా వారి అబ్బాయిని అని తెలిసాకా, ఆయన గొప్పగా భావించి ఉంటారు. అయితే నిజాయితీగా చెప్పాలంటే, అలాంటి కుటుంబం నుంచి వచ్చినందుకు నాకు అదనపు ప్రయోజనం ఏమీ కలగలేదు”  చెప్పారు అయాన్.

తన చిన్ననాటి రోజుల గురించి మాట్లాడుతూ – తమ కుటుంబం సినిమా పరిశ్రమకి చెందినది కావడం తనకి ఇబ్బందిగా ఉండేదని అన్నారు.

“మా కుటుంబం సినీరంగానికి చెందినది కావడం నాకు ఎందుకో ఇబ్బందిగా ఉండేది. మంచి కుటుంబాలు హిందీ సినిమాలని చిన్న చూపు చేసే రోజులని నేను అనుకునేవాడిని. కానీ నేను సినీ రంగంలో ప్రవేశించాకా, ఇక్కడున్న వారు ఎంత ఆధునికులో, మంచి పనిని ఎంతగా ఇష్టపడతారో, ఎదగడానికి ప్రోత్సహిస్తారో తెలిసింది” అన్నారు.

“నేనీ రోజు ఇలా ఉన్నానంటే అందుకు కారణం మా నాన్నతో నాకున్న బంధమే. మా మొదటి సినిమా ‘వేక్ అప్ సిద్’ లో తండ్రీ కొడుకుల సంబంధాన్ని హృద్యంగా చూపించాను. అలాంటిదే నాన్నతో నా బంధం. నా జీవితంలో నాన్న ప్రభావం ఎంతో ఉంది” అన్నారు.

“ఆయన ప్రపంచానికి నేనే కేంద్రం. నేను ఎంచుకున్న రంగంలో రాణించడమే ఆయన కోరుకున్నారు. నేనీ రోజు ఇలా ఉండడానికి అదే కారణం” చెప్పారు అయాన్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here