యువభారతి వారి ‘పగలే వెన్నెల’ – పరిచయం

0
4

[తెలుగు సాహిత్యం పట్ల కొన్ని తరాలలో ఆసక్తి రగిలించి, ఆధునిక తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తూ, యువతకు ఉత్తమ సాహిత్యం ద్వారా ఉత్తమ వ్యక్తిత్వాన్నివ్వాలని నిరంతరం తపించే యువభారతి సంస్థ స్థాపించి వచ్చే దసరాకు 60 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సాహిత్యానికి, సమాజానికి యువభారతి చేసిన సేవను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశంతో ప్రతి ఆదివారం సంచికలో యువభారతి ప్రచురించిన పుస్తకాల పరిచయం వుంటుంది. ఈ శీర్షిక వచ్చే సంవత్సరం విజయదశమి వరకూ సాగుతుంది.]

పగలే వెన్నెల

[dropcap]వా[/dropcap]డుకలో ఉండే పదాలూ, పదబంధాలూ, లోకోక్తులూ – చిత్ర సాహితీ నిర్మాణానికి జీవగర్రలు. అందరికీ అర్థమయ్యేటట్లు, చిత్రకథా వాతావరణానికి సరిపోయేటట్లు మాత్రమే కాక, సాహితీ మర్యాదలను కూడా సంతరించుకునేటట్లు వ్రాయగలగడం అందరికీ సాధ్యంకాని పని. ఐతే యువభారతికి ఆప్తులు, యువభారతి ప్రారంభదశలో మా  కార్యక్రమాలలో చురుకుగా పాలు పంచుకుని మార్గనిర్దేశనం చేసిన  జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణరెడ్డి గారికి అది నల్లేరుమీద బండి నడక లాంటిదే..!!

నారాయణరెడ్డి గారి ‘నన్ను దోచుకొందువటే – వన్నెల దొరసాని’ అనే పాట గులేబకావళి లో గుబాళించింది. ఆ ఒక్క పాటతో సినిమాలోకం ఆయనను గుర్తించింది. ఆ దోచుకొన్న పాట తర్వాత ఆయన కలం రెక్కలు జాచుకొని, ఎక్కడ పడితే అక్కడ ఆగి పాటలల్లుకొంది. రెడ్డిగారి రచనా పటిమ, ప్రావీణ్యత, పాండిత్య గరిమ, ఏ రచనలో చూసినా ద్యోతకమౌతుంది. ప్రతి పాటలోనూ బూరుగు దూది లాంటి మెత్తని పదాలు కనిపిస్తాయి. వీటిలో పరిమళం అపరిమితం.

పాటకు ప్రాణాలు రెండు – ఒకటి వాణి..!! రెండు బాణీ..!! రెడ్డిగారి పాటలలో ఆయన మాటలు సంగీతాన్ని మచ్చిక చేసుకుంటాయి. మాలిమితో కులుకుతూ ముందుకు సాగుతాయి. మాధుర్యాన్ని గ్రుమ్మరిస్తాయి. మనసులను అలరిస్తాయి. భావానికి అనువైన భాషను తెచ్చి, ఆకర్షణీయంగా మలచడంలో ఈయన సిద్ధ హస్తుడు. ఆయన పాటలలో – యమునా తరంగాలు, నందన వనాలు, సిరి మల్లెలు, మరు మల్లెలు, బృందావనాలు, నవ పారిజాతాలు, నవ గీతాలు, సైకత వేదికలు, వీణలు, వేణుగానాలు ఇలా ఎన్నెన్నో మధుర రవళులు జాలువారుతూ వుంటాయి.

‘నా పేరు సెలయేరు – నన్నెవ్వరాపలేరు’ వంటి తేలిక పదాలతో భావ శబలతలు కల్పించగలరు. ‘ఆడవే మయూరి – నటనమాడవే మయూరి’ పాటలో ఆయన భాషా పటిమ వెల్లార్చుకోవడం జరిగింది. ‘పసిడి యంచు పైట జార, పయనించే మేఘబాల’ – ఇందులో ఎంత కవితా హృదయముంది..!!

‘నీ పేరు తలచినా చాలు – మదిలో పొంగు శతకోటి యమునా తరంగాలు’ – అన్నారాయన ఇక్కడ కధా సంవిధానంలో పేరెవరిదయినా  కావచ్చు. కాని కవి పరంగా తలిస్తే ఆ పేరు గాన సరస్వతిదే అవుతుంది. శతకోటి తరంగాలుగా పొంగిన మది కవి పుంగవునిదే అవుతుంది.

‘మల్లియలారా మాలికలారా – మౌనముగా ఉన్నారా? మా కథలే విన్నారా’ అన్న పాటలో బాహ్య, అంతర ప్రకృతులను ఒకటి చేసి, ముడివేసి, నిలవేసి కథ చెప్పుకున్న రీతి కనిపిస్తుంది.

‘ఈ నల్లని రాలలో, ఏ కన్నులు దాగెనో – ఈ బండల మాటున, ఏ గుండెలు మ్రోగెనో’ ఈ ప్రశ్నకు జవాబు ఎన్ని యుగాల వెనకకో వెళ్లి వెతుక్కోవాలనిపిస్తుంది. ఆ స్థాణువులకు ప్రాణాలున్నాయని, పలుకరించగలవని, నవ్వులు గిలుకరించగలవని, పువ్వులు పూయించగలవని ఆయన గ్రహించి ఈ పాటను రాసారు.

ఇలా నారాయణరెడ్డి గారి పాటలు ఎన్నెన్నో ఉన్నాయి. మలచిన రీతులు, గతులు – అనంతం. భావాలు తాకేది – దిశాంతం. హృదయాలకు కల్పించేది – ప్రశాంతం.  ఆయన రచించిన వేలాది సినీ గీతాలనుండి చక్కని సాహిత్య విలువలు గల 225  సినీ గీతాల సంకలనమే ఈ ‘పగలే వెన్నెల’ పుస్తకం.

పుస్తకాన్ని పూర్తిగా చదువుకోవాలంటే  ఈ క్రింద ఇచ్చిన link ను ఉపయోగించుకోవచ్చు.

https://archive.org/download/pagaley-venala/pagaley%20venala_text.pdf

లేదా క్రింద ఇచ్చిన QR code ను scan చేసి అయినా ఈ పుస్తకాన్ని చదువుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here