వివిధ రంగాలలో సేవలందిన మహిళా మంత్రి డా. రాజేంద్ర కుమారి బాజ్‌పాయ్

3
3

[dropcap]క్వి[/dropcap]ట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని, స్వాతంత్ర్యం లభించిన తరువాత ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం లోను, కేంద్ర మంత్రివర్గం లోను వివిధ శాఖలకు మంత్రిణిగా బాధ్యతలను నిర్వహించా రామె. కళల పట్ల మక్కువ గల వారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖలలో విస్తృతమయిన సేవలనందించినవారు ఆమె. మహిళాభివృద్ధి కోసం కృషి చేసినవారు కూడా! మనదేశం తరపున విదేశాలలో పర్యటించిన బృందాల నాయకురాలు. ఆమె శ్రీమతి డా రాజేంద్ర కుమారి బాజ్‌పాయ్.

ఈమె నేటి బీహార్ (నాటి బెంగాల్ ప్రావిన్సెస్) లోని భాగల్పూర్ జిల్లా లాలూచక్ లో 1925 ఫిబ్రవరి 8 వ తేదీన జన్మించారు. ఈమె ప్రముఖ రాజకీయ కుటుంబంలో జన్మించడం విశేషం. మధ్య ప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి రవిశంకర్ శుక్లా అల్లుడు శ్రీకృష్ణ మిశ్రా ఈమె తండ్రి. ఉన్నత విద్యావంతుల కుటుంబం కావడంతో ఈమె కూడా ఉన్నత విద్యను అభ్యసించేటందుకు అవకాశం కల్గింది. అలహాబాద్ విశ్వవిద్యాలయం నుండి M.A. PHD. పట్టాలను పొందారీమె.

తండ్రిని, తాతగారిని అనుసరించి గాంధీ మహాత్ముని అనుయాయిగా స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారీమె. 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. తరతరాలుగా స్వాతంత్ర్యపోరాటంలో పాల్గొన్న కుటుంబపు వారసత్వాన్ని నిలిపారు.

భారత దేశానికి స్వతంత్రం లభించిన తరువాత రాజకీయ కార్యకలాపాలలో పాల్గొని విశేషమయిన సేవలను అందించారు.

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ మంత్రిత్వ శాఖలను క్యాబినెట్ మంత్రి హోదాలో నిర్వహించారు. విద్య, ఆరోగ్యం, వైద్యం, విద్యుచ్ఛక్తి, కార్మిక, సంక్షేమశాఖను సమర్థవంతంగా నడిపించారు. ఈమె నేతృత్వంలో ఈ శాఖల ద్వారా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించింది.

1980, 1984, 1989 సంవత్సరాలలో ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ నియోజకవర్గం నుండి లోక్‍సభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు.

స్వర్గీయ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధికి అత్యంత సన్నిహితురాలు. ఆమె ఆశయాల కనుగుణంగా విధులను నిర్వహించారు. ఈమె స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ మంత్రివర్గంలో కూడా సంక్షేమశాఖ మంత్రిణిగా బాధ్యతలను నిర్వహించారు. ఈమె నిర్వహించిన పదవులను అన్నింటినీ నిబద్ధతతో, క్రమశిక్షణతో సమర్థవంతంగా నిర్వహించారు.

1995 నుండి 1998 వరకు పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్ కూడా సేవలను అందించారు.

ఈమె వివిధ విశ్వవిద్యాలయాలలో సభ్యురాలిగా సేవలను అందించారు.

ఈమె మన దేశం నుండి విదేశాలలో పర్యటించిన ప్రతినిధి బృందాలకు నాయకత్వం వహించారు. ఐక్యరాజ్య సమితికి పర్యటన బృందానికి 1980లో, ప్రేగ్‌లో జరిగిన ప్రపంచశాంతి సమావేశాలకి, సాంఘిక పునరావాస ఏర్పాట్ల అధ్యయనం కోసం జపాన్ దేశ పర్యటన ఈమె నాయకత్వంలో విజయవంతమయ్యాయి. జెనీవాలో జరిగిన అంతర్జాతీయ కార్మిక సంస్థ (INTERNATINAL LABOUR ORGARINATION) నిర్వహించిన సదస్సుకి హాజరయ్యారు. కార్మికుల అభివృద్ధి కోసం తీసుకోవలసిన చర్యలను అధ్యయనం చేశారు.

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర మంత్రిణిగా, కేంద్రమంత్రిణిగా ఈమె వివిధ రంగాలలో సేవలను అందించారు, శిశు సంక్షేమం, అణగారిన స్త్రీల అభివృద్ధి కోసం ఈమె అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఈ వర్గాల అభివృద్ధి కోసం విద్యాసంస్థలను కూడా స్థాపించారు. దీర్ఘ కాలం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి, మన దేశానికి వివిధ శాఖలలో సభ్యురాలిగా, మంత్రిణిగా సేవలనందించే అవకాశం లభించడం ఈమె అదృష్టం. ఆమె కష్టానికి తగిన ఫలితం ఈ విధంగా వివిధ రంగాలని సుసంపన్నం చేసింది.

ఈమెకి పుస్తకపఠనం, సంగీతాన్ని ఆస్వాదించడం ముఖ్యమైన హాబీలు.

ప్రముఖ విద్యావేత్త D.N. బాజ్‌పాయ్‌తో ఈమె వివాహం జరిగింది, వీరి పిల్లలు శ్రీ అశోక్ బాజ్‌పాయ్, శ్రీమతి మనీషా ద్వివేది కూడా కాంగ్రెస్ పార్టీకి సేవలను అందించారు.

ఈమె జీవిత చరమాంకంలో మూత్ర పిండాల వ్యాధికి గురయ్యారు. ఈ వ్యాధి తోనే 1999 జూలై 17 వ తేదీన తన కార్యక్షేత్రమైన అలహాబాద్ లోనే మరణించారు.

భారత తపాలా శాఖ ఈమె జయంతి సందర్భంగా 2021 ఫిబ్రవరి 8వ తేదీన ప్రత్యేక తపాలా కవర్‌ను విడుదల చేసి గౌరవించింది.

క్యాన్సిలేషన్ ముద్రలోను, కవర్ మీద ఎడమవైపున డా. రాజేంద్ర కుమారి బాజ్‍‍పాయ్ చిత్రాన్ని ముద్రించారు. ఈ చిత్రం కళకళలాడుతూ వెలిగిపోతూ కనువిందు చేస్తుంది.

ఆజాదీ కా అమృత మహోత్సవ్ సందర్భంగా ఈ నివాళి.

***

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here