నియో రిచ్-32

0
3

[ప్రసిద్ధ రచయిత చావా శివకోటి గారి చివరి నవల ‘నియో రిచ్’‍ను ధారావాహికంగా అందిస్తున్నాము.]

[పోస్ట్‌మాన్ తెచ్చిన ఉత్తరాలలో ఒకటి తన పేరు మీద ఉండడంతో దాన్ని తీసి చదువుతుంది శారద. అది తన చిన్ననాటి స్నేహితురాలు ఉమ వ్రాసినది. తనని తాను గుర్తు చేస్తూ, జయంతి నేర ప్రవృత్తిని బహిర్గతం చేస్తుంది ఉమ. జయంతి చేసే/చేయించే చీకటి వ్యాపారాలు పోలీసుల దృష్టిలో ఉన్నాయని, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తుందా లేఖలో. అనుమానం కలిగిన శారద – జయంతికి వచ్చిన ఓ ఉత్తరం చదువుతుంది. దొంగనోట్ల మార్పిడి గురించి హరేరామ్ రాసిన ఉత్తరం అది. తాను ఓ నేరస్థుడి భార్యనని గ్రహించిన శారద నిర్ఘాంత పోతుంది. శివరాం కూడా ఈ రాకెట్టులో భాగస్థుడని గ్రహించి విస్తుపోతుంది. తాను మోస్తున్న పిండం కూడా నేరస్థునిదేనని కుమిలిపోతుంది. ఏడుస్తూ కూర్చుంటుంది. కాసేపయ్యాకా, జయంతి వచ్చి ఆమెను లేపడానికి ప్రయత్నిస్తే తానని తాకవద్దని హెచ్చరిస్తూ, స్పృహ తప్పుతుంది. క్రింద పడబోతున్న శారద నడుం భాగం‍కు సోఫా తగిలి ఆమె అడ్డదిడ్డంగా పడుతుంది. హాస్పటల్‍కు తీసుకువెళ్తాడు జయంతి. రాత్రికి స్పృహ వస్తుంది. ఏదో షాక్ తిన్నదని డాక్టర్ చెబుతుంది. కలత నిద్రలో కేకలు పెడుతుంది శారద. మళ్ళీ స్పృహ తప్పుతుంది. కాసేపయ్యాకా, మెలకువ వచ్చి తన పక్కన జయంతిని చూసి అరుస్తుంది. డాక్టర్ జయంతిని వెళ్ళిపోమంటుంది. ఇంటికొచ్చి తన ఉత్తరాలను చదువుకున్నాక అతనికి పరిస్థితి అర్థమవుతుంది. లాయర్ ముకుందం ఇంటికి పరామార్శించబోతే కోపగించుకుంటాడు జయంతి. రామలింగం విషయంలో మాటామాటా వచ్చి, ముకుందాన్ని బయటకు నెట్టేస్తాడు జయంతి. కాసేపయ్యాకా, డాక్టర్ ఫోన్ చేసి శారదకు గర్భం పోయిందని చెప్తుంది. జయంతి బాధపడతాడు. వెళ్ళి శారదను చూడాలనుకున్నా, డాక్టర్ రావద్దన్న విషయం గుర్తొచ్చి ఆగిపోతాడు. ఇక చదవండి.]

[dropcap]కా[/dropcap]దు ఆగుదాం అనిపించింది. తలంతా తెల్ల కాగితమైంది.

కానీ ఓపికగా స్నానం చేసి వెళ్లాడు. కిటికీ దగ్గర నుండి శారదను చూసాడు దొంగతనంగా. మగతలోనే ఉంది. సన్నగా మూలుగుతున్నది.

మనసాగక మంచం దగ్గర కెళ్ళాడు. చేయి పట్టు కోవాలనిపించింది. చేయి దగ్గరకు చాచాడు మనసాగాక.

అంతలో శారదలో కొద్దిగా కదలిక కనిపించింది.

కళ్లు తెరవకముందే బయటకెళ్లాలని నడచాడు భారంగా.

కారెక్కాడు. ఇంటికి దగ్గర దిగి గదిలోకెళ్లి మందు బాటిల్ విప్పాడు.

పొద్దస్తమానం అదే పనిలో ఉన్నాడు.

ఎంత తాగినా ‘శారద’ ధ్యాస వదలలేదు. మత్తు రావడం లేదు.

ఆవిడ కేం చెప్పాలో అని అర్థమూ గాలేదు. జరిగిన దానికి ఎలా ఊరడించాలో కూడా? ఎలా? ఎలా? బాగా దగ్గరగా తీసుకొని కూర్చోవాలనిపించింది. కాని..

హారేరామ్ పైన అంతులేని కోపం వచ్చింది.

ఉత్తరం వ్రాయాల్సిన అవసరమేమొచ్చింది? Stupid.

అసలీ ‘ఉమ’ ఎవరు?

అనుమానాల్ని వ్యక్తం చేయాల్సిన అవసరం ఆవిడకెందుకొచ్చింది. ఏమిటిదంతా?

ఇన్ని విన్నాక శారద నన్ను ఇంకా నమ్ముతుందా?

పార్వతికి, శివరామ్‍కీ ఫోన్ చేసి చెప్తే?

ఇది బాగనిపించింది. వెంటనే చేసాడు. రవి ఎత్తాడు.

“నాన్న ఉన్నాడా?”

“ఆఁ!”

“అమ్మ?”

“అమ్మ ఆంటీకి ఒంట్లో బాగోలేదని తెల్సి ఆసుపత్రి కెళ్లింది. నువ్వెక్కడ నుంచి మాట్లాడుతున్నట్లు?” అడిగాడు.

“చెప్తాగానీ నాన్నకివ్వు.”

“అలాగే” అని ఇచ్చాడు.

“జయంతి నువ్వు వెంటనే ఇంటికొకసారిరా!” అన్నాడు శివరాం.

“ఆఁ!” అని ఫోను పెట్టేసి బయలుదేరాడు అయోమయంగా.

కారు స్టార్టయింది. శివరాం ఇంటి ముందు పార్కు చేసి లోనకొచ్చాడు.

“శారద ఆంటీకెలా ఉంది?” అడిగాడు రవి.

తల ఊపుతూ వచ్చి, సోఫాలో కూర్చుండిపోయాడు జయంతి.

శివరాం పై గది నుంచి దిగి వస్తూ ‘జయంతీ అసలు నిన్ను నువ్వు ఏమనుకుంటున్నావు?మేము ఏం అయిపోయామునుకున్నావు? కనీసం దానికలా ఉంటే కబురు చేయాలని అని కూడా అనిపించలేదా?” అన్నాడు నిష్ఠూరంగా. శివరాం జీవితంలో ఇలా మాటాడడం ఇది మొదటిసారేమో? అది జయంతితో.

“తోచలేదు. పిచ్చి వాడినయ్యాను. సారీ శివరాం.”

“ఇప్పటిదాకానా”

మాటాడలేదు. తల పట్టుకున్నాడు.

“పార్వతి అక్కడే ఉంది.”

“ఉందిగదా చాలు. ఉంటుంది. పార్వతికి నేనంటే ప్రాణం. అందుకే ఉంది. శారద కొంచమైనా బాగుంటుంది. బాగుపడాలి. చాలు చాలు.”

“అసలేం జరిగింది?”

నెమ్మదిగా చెప్పాడు. చెప్పడం పూర్తి అయ్యాక అది గుర్తుకొచ్చి “స్పృహరాగానే మళ్లా upset అవుతుంది. ఏం చేయాలో తోచడం లేదు. ఇలా మూడో సారి.” అన్నాడు.

“మరి ఏం చేద్దాం?”

“నాకు తెలీదు. కానీ శివరాం శారద బావుడాలి. బావుండాలి. That’s all. అంతే. శారదకేం జరగకూడదు. ఇప్పటికే చాలా నష్టపోయింది. బాబు కల్గుతాడని ఎన్ని కలలు కన్నది. శివరాం ఆ కలా కల్లే అయింది. పిచ్చిది బ్రతుకు పై నిరాసక్తతను పెంచుకుంటుందేమో? భయంగా ఉంది. శివరాం పార్వతితో చెప్పు. ఆవిడదే బాధ్యత అంతా..”

జయంతి పడుతున్న వేదన అర్థమైంది శివరాంకు.

ఇతని స్థితి చూస్తే శారదతో పాటు దిగజారేట్టు అనిపించింది.

“జయంతి please control yourself. మనమే లేనప్పుడు మనవాళ్లేమైపోతారన్నది అప్రస్తతమౌతది” అన్నాడు.

“నేన ధైర్యంగా ఉండగలను కాని, ఆ పిచ్చిది తట్టుకోలేదు. ఎలా” అని ఏడ్చాడు.

“దైర్యంగా ఉండమంటే ఇదా?” అన్నాడు శివరాం, జయంతి భజం పై చేయి వేసి.

ఫోన్ మోగింది. ఎత్తాడు. “పార్వతి మాటాడుతోంది” అన్నాడు శివరాం.

శారద స్పృహలోనే ఉందట. కన్నీరు మాత్రం ఆగడం లేదట. పార్వతితోనూ ఒకటి రెండు మాటలు తప్ప మాటాడలేదట. బయటకు చూస్తూందట.

ఇది పార్వతి సంభాషణ సారాంశం.

ఫోను పెట్టేసి “పార్వతి మాటాడింది. శారద కోలుకుంటోందట” అన్నాడు శివరాం.

ఈ మాట కొంత ఉపశమనం కల్గించింది జయంతికి.

ఓ నిమిషం ఆగి “పద చూసొద్దాం” అని లేచాడు.

“జయంతి ఆగు. పార్వతి ఇక్కడకొచ్చాక కనుక్కొని వెళ్దాం. తొందర పడొద్దు.”

లేచిన వాడు కూర్చోలేకపోయాడు.

“నేనేంత నేరం ఏం చేసాను శివరాం?” అన్నాడు. మళ్ళీ తనే మాట్లాడుతూ –

“నా భార్య నా ప్రాణం. ఆమె ఆపదలో ఉన్నప్పుడు నేను చూసుకోలేనంత తప్పు చేశానంటావా? సంపాదించడం తప్పా? ఎంత సంపాదించాడో చూసి లెక్కలు వేసే వాళ్లే తప్ప ఎలాగని అడిగేవాళ్లు లేని లోకమిది. చేతకాక చతికిలబడితే అపహాస్యం చేసే లోకం. ఈ లోకాన నేనొక్కణ్ణేనా ఎందరు లేరు? ఎందరు లేరు? అందర్నీ ఇలాగే నేరస్థులలా చూస్తున్నరా? ఎన్ని లక్షల మందిలో నేనొకడ్ని. ఆవిడ వచ్చాక చేస్తున్నానా? లేదే? కొత్తగా చేసిందీ లేదు. ఇదేక్కడి పాపం. ఇది న్యాయార్జితం కాదనుకొని ఆవిడనావిడ శిక్షించుకోవడం ఏమిటి? శివరాం..” అన్నాడు.

మళ్ళీ అందుకుని – “please వెళ్లు. వెళ్లి నువ్వైయినా చెప్పు. ఆవిడకు ఇష్టం లేదు కనుక అంతా మానుకుంటానని చెప్పు. దూరంగా ఎక్కడికైనా వెళ్లి బ్రతుకుదామని చెప్పు. నువ్వు పార్వతి కనబడకపోతే ఆ పిచ్చిది నమ్మదు. నేనేదో మోసం చేసాననుకుంటుంది.” అని శివరాం భుజంపై తల పెట్టి వలవలా ఎడ్చాడు.

జయంతి స్థితికి అప్రతిభుడయ్యాడు శివరాం. ఇట్లా చూడాల్సిన రోజు జయంతి జీవితంలో ఒకటుందని ఊహించలేదు. ఊహ కందేది గాదు.

ఓదార్చాడు. ఓదార్చిన శివరాం కళ్లలో నీరు నిండింది.

“ఇట్లారా” అని జయంతిని చేయి పట్టుకుని డైనింగ్ టేబుల్ వద్దకు తీసుకెళ్ళాడు.

“భోం చేసి బయటకి వెళ్ళొద్దాం” అన్నాడు కూర్చోబెట్టి.

బలవంతం చేసి ఎంగిలి పడేలా చేయగలిగాడు.

శారదను జయంతి ఎంతగా కోరుకున్నాడో ఇప్పుడు బాగా అర్థమైయింది.

ఏదీ పట్టనట్,టు ఏదో బయట పనిలోనే నిమగ్నమై ఉన్నట్టున కనిపించే జయంతిలో ఇంత అనురాగం, ప్రేమ ఉన్నాయా? నిజంగా ఆశ్చర్యపోయాడు. ఎంతటి స్నేహం చేసినా మనిషి రెండో వైపు అంతు పట్టడం ఏదో కొన్ని సందర్భాలు దొర్లితే తప్ప, అంతు దొరకదనిపించింది.

ఇద్దరు కలిసి ఆఫీసు కెళ్ళారు. ఓ గంట కూర్చున్నారు. అక్కడ నుంచి వస్తూ కెఫెటేరియా దగ్గర ఆగారు. కాఫీ త్రాగారు. ఇంటికి వచ్చారు.

ఆ రాత్రంతా ఎవరి ప్రక్క మీద వారు కూర్చునే ఉన్నారు.

అప్పుడప్పుడు మాట్లాడుకున్నారు. ఓదార్చుకున్నారు. ధైర్యం చెప్పుకున్నారు.

తెల్లవారాక పార్వతి వచ్చింది. ఇద్దర్నీ పలకరించింది. కాఫీ కలిపిచ్చింది.

వారు మాత్రం ఏమైనా చెపుతుందేమోనని ఆతృతగా చూసారు.

ఇద్దరి పరిస్థితినీ గమనించి “తిండి తిన్నారా? నిరాహారంగానే?” అడిగింది.

“ఆఁ!” అన్నాడు శివరాం.

 “శారద..” అన్నాడు జయంతి.

“ఫర్వాలేదు. భయపడాల్సిందేమీ లేదు. కాకపోతే అకాలంలో పిండం పోయింది. కనుక పురిటి బాధలు లాంటివి కొత్తగదా, ఉంటాయి. కొత్త గనుక బాగా బాధిస్తాయి. “

“ఇంటికెప్పుడు తీసుకెళ్లవచ్చునో తెల్సుకున్నావా?”

“బహుశా నాల్గురోజులైనా అక్కడ ఉండాల్సి ఉంటుంది.”

“డాక్టరు ఏమనా అన్నదా? “

“వేరే చెప్పేదేముంటుంది.”

“అంటే?”

“అంటేనా? ఇప్పటికీ శారద పెదవి విప్పడానికి సుమఖంగా కనిపించడం లేదు. ఆలోచనలతోనే ఉంటున్నది. బిడ్డ పోయిందనే వేదన ఒక ప్రక్క. నువ్వెలా ఉన్నావో అన్నది మరో ప్రక్క. అసలలాంటి బ్రతుక్కు ఎందుకు అలవాటు పడ్డావు అనేది తెగక మరో ప్రక్క సతమతమవుతున్నది. ఎంత పిచ్చిదంటే నిన్ను శ్రీరామచంద్రుడు అనుకున్నది. నువ్వు దొరకడమే ఒక ‘వరం’గా తలపోసింది. నీకు డబ్బు ఉందనీ, కుబేరుడవనీ ఎన్నడూ తలచలేదు. ఆ నమ్మకం హఠాత్తుగా ముక్కలయింది. అది అంత త్వరగా అతుకుంటుందనే భావన నాకు లేదు. ఎప్పటికప్పుడు ‘ఏంటిది? ఎందుకిలా జరిగింది?’ అని ప్రశ్నించుకుంటున్నది. సమాధానం దొరకడం లేదు. నిజానికి ఆమె దగ్గర లేదు గదా.” అంది.

మళ్ళీ మాట్లాడుతూ – “ ‘మోసగించబడ్డానా? నన్ను ఎవరు మోసం చేసారు? నా ఇంగితం ఏమయింది?’ వీటికి సమాధానం దొరక్క ఏడుస్తుంది. అందుకే కన్నీరు ఆగడం లేదు. నేను నా శక్తి మేరకు సముదాయించాను. నాల్గురకాలుగా సందర్భాన్ని బట్టి చెప్పాను. అసలు మనిషి సమగ్రడు కాదనీ, చెడు, మంచీ ఉంటుందనీ. చెడ్డను అదుపు చేసుకొనగల్గినవాడు మంచివానిగా కనిపిస్తాడనీ. ఇంకా ఇలా చాలా చాలా. విన్నది. నే చెప్పే వాటిలో సమాధానం దొరకుతుందేమోనని వెతికింది. మళ్లా ఇంతకుముందులా చెప్పబోతే వినలేదు. శారదని ఇంటికి తీసుకుని రాగానే నువ్వు మాత్రమే సమాధానపరచాలి. మరెవ్వరు ఆవిడ జోలికి వెళ్లడం మంచిది కాదు. బాధలో మునిగి ఉన్నది. మానసికంగా పూర్తి అసంతృప్తి ఆవరించి ఉంది. పైగా అనారోగ్యం. ఆవిడను ఎలా తోవకు తెచ్చుకోవాలో ఆలోచించు. చెక్కు పుస్తకాలతో, బంగారంతో అయ్యే పనులు కావివి. గుండె దిటవు చేసుకో. నువ్వు బేలగా మారావో, శారద మనకు దక్కుతుందని నేను అనుకోను. నా ప్రయత్నం నేను నువ్వు చెప్పకున్నా చెస్తాను. నాకు చేతనయిన పని కాదనిపించింది. శారదకు ఇక వేరే ధైర్యం అవసరం లేదు. నువ్వే మందు. అమృతమైనా, హాలాహలమైనా వచ్చేది నీ నుంచే.” అని కళ్లు తుడుచుకుంటూ వంటింట్లోకి నడచింది. లోలోపల ఎలా వేగిపోతుందో.

ఇద్దరూ విన్నారు.

కర్తవ్యమేమిటో బోధపడ్డట్టు మాత్రం అనిపించలేదు.

ఇద్దరు ఆలోచనలో పడ్డారు.

శారదను దక్కించుకోవాలి అన్నది ఇద్దరి కోరికా.

జయంతి అకస్మాత్తుగా లేచి ‘వస్తాను’ అని చెప్పి కారు దగ్గరకు నడిచాడు.

కారు స్పీడుగా కదిలింది. ఎక్కడికెళ్తున్నాడు అనేది అర్థం కాలేదు శివరాంకు.

పిలుస్తూ బయటకొచ్చినా వినిపించుకోలేదు. కారు కదిలిపోయింది.

పాణి హోటలు ముందు కారాపి “ఉన్నాడా” అని అడిగాడు జయంతి.

“ఉండొచ్చును” అన్నాడు కౌంటరున ఉన్నతను జయంతిని గమనించక.

ఇంతలో మేనేజరు జయంతిని గమనించి “సారీ” అంటూ దగ్గరకు వచ్చాడు వినయంగా.

“పాణీ” అన్నాడు.

“రండి” వెంట తీసుకెళ్లాడు.

నాల్గో అంతస్తులోని ఓ పెద్ద గది ముందు ఆగి బెల్ నొక్కడు. తలుపులు తెరుచుకోగానే వెనక్కు మళ్లాడు. జయంతి లోనకొచ్చాడు.

జయంతి ఎదురుగా ముగ్గురు బెంగాలీ యువతున్నారు.

పాణి లేచి “రా జయంతీ” అంటూ ఎదురు వచ్చాడు ఆనందంగా.

సోఫాలో కూర్చోబెట్టాడు. మౌనంగా కూర్చున్నాడు జయంతి. అంతటి అందాల్ని ఎదురుగా ఉన్నా కన్నెత్తి చూడలేదు.

“ఏమిటీ అకాల వర్షం” అన్నాడు తన ధోరణిన.

పెదవి విప్పలేదు జయంతి.

ఈ మౌనం పాణిని భయంలోకి నడిపింది. “తంబీ నీకంటే నాకున్నది ఎవరు? దాపరికమొద్దు దా?” అని ప్రక్కన A.C. రూంలోకి తీసుకొచ్చాడు. జయంతి నుదుటన చెమట కనిపించింది.

నెమ్మదిగా భుజంపై చేయి వేసి “తంబీ నేనుంటిని కదా చెప్పు నన్ను నేను తాకట్టు పెట్టుకొని విడిపిస్తును. నువ్వుదా నోరు తెరవక అట్టాననే ఉండిపోతివా నా తల నరాలు చిట్లును” అన్నాడు గడ్డం పుచ్చుకొని బ్రతిమిలాడుతూ.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here