[dropcap]గ[/dropcap]దిలో గోడ మీద పారుతున్న జలపాతం బొమ్మ
చేయెత్తితే చాలు అందుతుంది
జలజలమని నాలోకి తడితడి జ్ఞాపకాలు
ఎంతకీ వాడని పూల తాజాతనం
గుండె గడియారపు లోలక శబ్దం
జీవించే క్షణాల్ని లెక్కించుకుంటున్నాను
గడుస్తున్న కాలం
కరిగిపోయిన కాలంతో పోటీ పడుతోంది
వెలిసిపోయిన రంగులు
చేదు మరకలుగా తలపోస్తున్నాను.
సాయం సంధ్యవేళ
ఆకాశానికి ఆరేసిన సిందూరం చీర
నాకెలా అందుతుందో నేనెలా పట్టుకోగలనో
ఎడతెగని సుడుల గోదారి చెంత
వలకు చిక్కని చేపల ఈదులాట.
నదీతీరం వెంట నడుస్తున్నపుడు
నిదురించే నదిలోకి పడవెళ్లిపోతున్న దృశ్యం
నీటిదారిలో వెండి జలతారు ముక్కలు
నేనే నురగైపోతాను చేపపిల్లై చిందులేస్తాను.
జలకాలాటల సయ్యాటలు.
అలల నదిలో కలల ఒడి
తడిసి వణుకుతున్న చంద్రబింబం
నేనూ తడవకుండా మునకలేస్తాను.
ఆరని చెమ్మ ఊరిస్తుంటే
నదీ ఆకాశం కలిసేచోటును కనుగొన్నాను
ప్రాకృతిక సంలీనం.. మనిషితనం
నది కెరటాల చిరు సవ్వడులు
కరచాలనాలు.. ఆత్మీయ ఆలింగనాలు.
లోలోపలి వెలుగుల్ని తీరానికి చేరుస్తున్నపుడు
బతుకు చెమ్మల హృదయం విశాలమౌతుంది
నాలోకి నదిని ప్రవహించనీయండి
కాలం తీరాన అలలుగా ఊరేగుతూ ఊగుతూ
విలువల జగత్తులో భాగమౌతాను.