[వాల్మీకి రామాయణం ఆధారంగా శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘ఆదికావ్యంలోని ఆణిముత్యాలు’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]
ఆదికావ్యంలోని ఆణిముత్యాలు
114. శ్లో.
యద్ద్రవ్యం బాంధవానాం వా మిత్రాణాం వాక్షయే భవేత్।
నాహం తత్ ప్రతి గృహ్ణేయాం భక్షాన్ విష కృతానివ॥
నే యం మమ మహీ సౌమ్య! దుర్లభా సాగరాంబరా।
న హీచ్ఛేయమధర్మేణ శక్రత్వమపి లక్ష్మణ॥
(అయోధ్యకాండ, 97. 4, 7)
లక్ష్మణుడు దూరంగా కనిపిస్తున్న భరతుని, అతని సైన్యాన్ని చూసి కృద్ధుడైనప్పుడు శ్రీరాముడు శాంతపరుస్తాడు. ఆ సందర్భంలో అతనితో అంటాడు:
ఓ లక్ష్మణా! బంధువులు గాని, మిత్రులు గాని నశించుట వలన లభించెడి ద్రవ్యము విషపూరితమైన భక్ష్యములతో సమానము. అట్టిదానిని నెను ఎన్నడూ స్వీకరింపను.
నేను కోరుకున్నచో సముద్రాల వరకును వ్యాపించియున్న ఈ సమస్త భూమండలమూ నాకు దుర్లభము గాదు. కానీ అధర్మముగా ఇంద్ర పదవి వచ్చినను దానికి నేను ఇష్టపడను.
115. శ్లో.
బాష్పాపిహిత కంఠశ్చ ప్రేక్ష్య రామం యశస్వినమ్।
ఆర్యేత్యే నాథ సంక్రుశ్య వ్యాహర్తుం నాశకత్ తదా॥
శత్రుఘ్నాశ్చాపి రామస్య వవందే చరణౌ రుదన్।
తావుభౌ స సమాలింగ్య రామశ్చా శ్రూణ్యావర్తయత్॥
(అయోధ్యకాండ, 99. 39, 40)
మహాత్ముడైన శ్రీరాముని చూడగానే భరతుడు కన్నీరు మున్నీరు అయ్యాడు. కంఠం రుద్ధమయినది. ఎట్టకేలకు ‘అన్నా’ అని బిగ్గరగా పలికాడు. ఇంకా ఏమీ మాట్లాడలేకపోయాడు.
శత్రుఘ్నుడు ఏడుస్తూ శ్రీరాముని పాదాలకు ప్రణామం చేశాడు. శ్రీరాముడు ఆ ఇరువురిని లేవనెత్తి అక్కున జేర్చుకున్నాడు. అంతట ఆయన నేత్రముల నుండి కూడా అశ్రువులు ధారలు కట్టాయి..
ఎంత హృదయ విదారకమైన దృశ్యం? మహారాజు కుమరులైన నలుగురు అడవిలో ఒక పర్వతం మీద ఒకరొనొకరు పట్టుకుని భోరున విలపిస్తుంటే వనవాసులైన ఋషీశ్వరులు కూడా శోకంతో కంట తడిపెట్టారుట!
116. శ్లో.
కచ్చిత్ తే సుకృతాన్యేవ కృత రూపాణి వా పునః।
విదుస్తే సర్వ కార్యాణి న కర్తవ్యాని పార్థివాః॥
సహస్రాణ్యాపి మూర్ఖాణాం యద్యుపాస్తే మహీపతిః।
అథ వాప్యయుతాన్యేవ నాస్తి తేషు సహాయతా॥
ఎకోప్యామాత్యో మేధావీ శూరో దక్షో విచక్షణః।
రాజానం రాజపుత్రం వా ప్రాపయేన్మహతీం శ్రియమ్॥
(అయోధ్యకాండ, 100. 21, 24, 25)
శ్రీరాముడు భరతునితో: భరతా! నీవు చేపట్టిన కార్యములలో పూర్తియైనవియు, దాదాపు పూర్తి కానున్నవియు మాత్రమే సామంతరాజులకు తెలియచున్నవి కదా? మున్ముందు నిర్వహింపదలచిన కార్యములను గూర్చి వారికి తెలియుట లేదు కదా?
ఏ ప్రభువైనను మూర్ఖులకు వేయిమందికి – అంత మాత్రమే కాదు, పదివేల మందికి ఆశ్రయమిచ్చినను సమయము వచ్చినప్పుడు వారి వలన ఒనగూడు ప్రయోజనము శూన్యము.
ఎదుటివారి అభిప్రాయములను బాగుగా గుర్తింపగలవాడును, స్థిరబుద్ధితో సముచితముగా ఆలోచించుటలో సమర్థుడు అయిన అమాత్యుడు ఒక్కడైనను, రాజునకు, రాజపుత్రునకు మహా సంపదలను లభింపజేయగలడు.
117. శ్లో.
కచిద్బలస్య భక్తం చ వేతనం చ యథోచితమ్।
సంప్రాప్త కాలం దాతవ్యం దదాసి న విలంబసే॥
కచ్చిన్న సర్వే కర్మాంతాః ప్రత్యక్షాస్తేవి శంకయా।
సర్వే వా పునరుత్సృష్టా మధ్యమేవాత్ర కారణమ్॥
కచ్చిదార్యో విశుద్ధాత్మా క్షారితశ్చోర కర్మణా।
అపృష్టః శాస్త్ర కుశలైః న లోభాద్వధ్యతే శుచిః॥
కచ్చిత్ తే బ్రాహ్మణాః శర్మ సర్వ శాస్త్రార్థ కోవిదాః।
ఆశంసంతే మహాప్రాజ్ఞ! పౌర జానపదైః సహ॥
(అయోధ్యకాండ, 100. 33, 53, 57, 65)
నీ సేనలోని యోధులు బలపరీక్షలో నెగ్గినవారేనా? వారిని పారితోషికములతో సత్కరించుచున్నావా? సకాలంలో వేతనములు ఇచ్చుచున్నావా?
ఉద్యోగులు జంకు లేకుండా పూర్తిగా నీ దగ్గరకు సమీపిస్తున్నారా లేక పూర్తిగా జంకుతో దూరంగా ఉంటున్నారా? (మధ్యమార్గం ఉండాలి).
సజ్జనులు, ఉత్తమ స్వభావము గల వారు, త్రికరణ శుద్ధి గలవారు, దొంగతనము మొదలగు నేరారోపణలకు లోనైనప్పుడు న్యాయశాస్త్ర నిపుణుల చేత లోతుగా విచారణ చేయింపకయే లోభవశమున వారికి శిక్షలు విధించుట లేదు కదా?
మహాప్రాజ్ఞా! సమస్త శాస్త్రములను, వాటి విశేషణములను బాగుగా ఎరిగిన బ్రాహ్మణోత్తములు పౌరుల తోడను, జానపదుల తోడను గూడి నీ శ్రేయోలాభములనే అభిలషించుచున్నారు గదా?
118. శ్లో.
పురా భ్రాతః పితా నహః స మాతరం తే సముద్వహన్।
మాతామహే సమాశ్రౌషీత్ రాజ్య శుల్కమనుత్తమమ్॥
(అయోధ్యకాండ, 107. 3)
సోదరా! పూర్వము మన తండ్రి గారు మీ తల్లి కైకేయిని వివాహం చేసుకొను సందర్భములో ‘కైకేయీ దేవి యందు కల్గిన పుత్రునకే రాజ్యాధికారము ఇత్తును’ అని మీ మాతామహునకు మాట ఇచ్చెను!
(ఆ తరువాత దేవాసుర సంగ్రామం, వరములు, ఆ వ్యవహారము జరిగినది).
119. శ్లో.
అధర్మం ధర్మ వేషేణ యదీమం లోకసంకరమ్।
అభిపత్స్యే శుభం హిత్వా క్రియా విధి వివర్జితమ్॥
(అయోధ్యకాండ, 109. 6)
జాబాలి నాస్తికత్వ వాదమును ఖండించుచు శ్రీరాముడు పలికినవి: నీవు పల్కినవి ధర్మవేషమును దాల్చిన అధర్మము. ఇది లోకసంకరానికి దారి తీయును. ఈ అధర్మ మార్గమును నేను స్వీకరించను.
120. శ్లో.
కామ వృత్తస్వయం లోకః కృత్స్నః సముపవర్తతే।
యద్వృత్తాః సంతి రాజానః తద్వృత్తాః సంతి హి ప్రజా॥
(అయోధ్యకాండ, 109. 9)
నీవు చెప్పినట్లు నడచినచో ధర్మమును తప్పి విచ్చలవిడిగా ప్రవర్తించినవాడగుదును. నన్ను జూచి లోకమంతా ఇలాగే ప్రవర్తిస్తుంది. పాలకుల ప్రవర్తననే ప్రజలు అనుసరిస్తారు (యథారాజా తథా ప్రజా).
121. శ్లో.
సత్యమేవానృశంసం చ రాజ వృత్తం సనాతనమ్।
తస్మాత్ సత్యాత్మకం రాజ్యం సత్యే లోకః ప్రతిష్ఠితః॥
ఋషయశ్చైవ దేవాః చ సత్యమేవహి మేనిరే।
సత్యవాదీ హి లోకేస్మిన్ పరమం గచ్ఛతి క్షయమ్॥
సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా।
సత్య మూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరం పదమ్॥
(అయోధ్యకాండ, 109. 10, 11, 13)
పరంపరంగా వస్తున్న ఈ రాజధర్మము సత్యస్వరూపము. ఇందులో క్రౌర్యానికి చోటు లేదు. లోకమంతయూ సత్యము మీదనే ఆధారపడి యున్నది.
లోకమున సత్యమే భగవత్స్వరూపము. సంపదలన్నియును సత్యము మీదనే ఆధారపడి యున్నాయి. అన్నింటికి సత్యమే మూలము. సత్యము కంటే శ్రేష్ఠమైనది లేదు.
122. శ్లో.
ప్రత్యగాత్మమిమం ధర్మం సత్యం పశ్యామ్యమహం స్వయమ్।
భారః సత్పురుషాచీర్ణః తదర్థం అభినంద్యతే॥
(అయోధ్యకాండ, 109. 19)
సూర్యుని వలె ఇది ప్రత్యక్షమైన ధర్మము. నేను స్వయంగా చూచినది. అందుచేత సత్పురుషుల వలె నేనును జటావల్కలములను దాల్చి తాపస ధర్మములను అనుసరిస్తున్నాను.
123. శ్లో.
కర్మభూమి మిహం ప్రాప్య కర్తవ్యం కర్మ యచ్ఛుభమ్।
అగ్నిర్వాయుశ్చ సోమశ్చ కర్మణాం ఫల భాగినః॥
సత్యం చ ధర్మం చ పరాక్రమం చ భూతానుకంపాం ప్రియవాదితాం చ।
ద్విజాతి దేవాతిథిపూజనం చ పంథాన మాహుః త్రిదివస్య సంతః॥
ధర్మే రతాః సత్పురుషైః సమేతాః తేజస్వినో దాన గుణ ప్రధానాః।
అహింసకా వీత మలాశ్చ లోకే భవంతి పూజ్యా మునయః ప్రధానాః॥
(అయోధ్యకాండ, 109. 28, 31, 36)
ఈ కర్మభూమిలో జన్మించిన వారందరూ శోభకర్మలను ఆచరించి తీరవలెను. దాని వలన అత్యంత శోభ ఫలములను పొందుతారు. అగ్ని, వాయువు, సోముడు సత్కర్మల చేతనే ఉత్తమ ఫలితములను పొందియున్నారు.
సత్యమును పలుకుట, ధర్మమును ఆచరించుట, పరాక్రమం ప్రదర్శించుట, భూతదయ కలిగి యుండుట, ప్రియముగా మాట్లాడుట, బ్రాహ్మణోత్తములను, అతిథులను, దేవతలను పూజించుట వంటివి స్వర్గమునకు మార్గములను సత్పురుషులు చెప్పియున్నారు.
తేజోమూర్తులను, అత్యంత దానపరులును, ఏ విధముగను ప్రాణిహింస చేయనివారు, ఎట్టి కళంకమూ లేనివారును ఐన మునీశ్వరులు సత్పురుషులతో గూడి, వైదిక ధర్మనిరతులై లోకమున పూజ్యులవుతున్నారు.
(ఇలా శ్రీరాముడు పలికిన తరువాత జాబాలి తాను పలికిన నాస్తికత్వపు మాటలకు క్షమించమని కోరుతాడు. అయోధ్యకు తిరిగి ఎలాగైనా శ్రీరాముని రప్పించాలని అలా పలికాను కానీ నేను స్వయంగా నాస్తికుడను కానని చెబుతాడు).
124. శ్లో.
బ్రాహ్మణో హ్యేకపార్శ్వేన నరాన్ రొద్ధుమిహార్హతి।
న తు మూర్ధాభిషిక్తానాం విధిః ప్రత్యుపవేశనే॥
(అయోధ్యకాండ, 111. 17)
శ్రీరాముని ఒప్పించుటకు భరతుదు దర్భాసనం మీద కూర్చున్నాడు (దీక్ష చేయుటకు). అప్పుడు శ్రీరాముడు చెప్పాడు: బ్రాహ్మణుడు ఒక ప్రక్కకు వాలి పరుండి, అన్యాయమునకు పాల్పడిన వారిని అడ్డగించుట యుక్తమే. కానీ పట్టాభిషిక్తులు కానున్న క్షత్రియులు ఇట్లు అడ్డగించుట తగదు.
(ఈ సందర్భం సముద్రుడి ముందర శ్రీరాముడు దర్భశయనం గావించినప్పుడు తిరిగి చర్చకు వస్తుంది. భరతునికి తగదని చెప్పి తానెలా చేశాడు? శ్రీరాముడు పట్టాభిషేకానికి సిద్ధపడలేదు అప్పటికి. రెండవది, శ్రీరాముడు వనవాసంలో ముని వేషధారిగా ఆ నియమాలకు కట్టుబడి యున్నాడు).
125. శ్లో.
వృత్తో రాజా హి కైకేయ్యా మయా తద్వచనం కృతమ్।
అనృతాన్మోచయానేన పితరం తం మహీపతిమ్॥
(అయోధ్యకాండ, 111. 32)
ఓ భరతా! కైకేయి మహారాజును వరముల నడిగెను. ప్రభువు ఆమోదించెను. ఆయన మాటలను పాటిస్తూ వనవాసం చేస్తున్నాను. నీవు కూడా అయోధ్యాపతియైన మన తండ్రి గారి మాటలను తలదాల్చి ఆయనకు అసత్య దోషము అంటకుండా చేయుము.
ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ వనవాసం వలన నలుగురు సోదరులు, ఇక్ష్వాకు వంశం యావత్తూ సత్యధర్మ పరాక్రమవంతులుగా కీర్తి ప్రతిష్ఠలు పొందుతారు!
(ఇంకా ఉంది)