దేవుని సొంత దేశం కేరళ యాత్రానుభవాలు-1

8
3

[2022 సెప్టెంబరు నెలలో కేరళ రాష్ట్రంలో పర్యటించి, ఆ అనుభూతులను పాఠకులతో పంచుకుంటున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]

[dropcap]చా[/dropcap]లా కాలం నుంచి కేరళ ప్రకృతి సౌందర్యాన్ని చూసి రావాలనే కోరిక ఉండింది. అక్టోబరు నుండి పీక్ సీజన్ ప్రారంభమవుతుంది. సెప్టెంబరులో ఐతే టూర్ ప్యాకేజీలు చౌకగా లభిస్తాయని తెలిసింది. నెట్‍లో వెతికితే కొచ్చి బేస్డ్ కంపెనీ ‘డొనాటో ట్రావెల్స్’ కనబడింది. దాని రేటింగ్స్ బాగున్నాయి. టూరిస్టుల కామెంట్స్ కూడా అనుకూలంగా ఉన్నాయి.

హైదరాబాద్ నుంచి కొచ్చి (కొచ్చిన్, ఎర్నాకుళం)కు డైరక్ట్‌గా విమానం ఉంది. దాని ఛార్జీ ఆరువేలు చూపించింది. మా తరం వాళ్ళకు డబ్బు తగినంత ఉన్నా, పిల్లలు పెడతామన్నా, ఎందుకో దుబారా ఖర్చులు గిట్టవు. పైగా ఎయిర్‍పోర్టులకు వెళ్ళడానికి, రావడానికి క్యాబ్ ఛార్జీలు, అక్కడ కాఫీ/టీ రెండు వందలు, రెండిడ్లీ వడ 350, వాటర్ బాటిల్ వంద ఇలా ఉంటాయి కదా రేట్లు! పోనీ డబ్బుకు తగిన క్వాలిటీ ఉంటుందా అంటే అదీ లేదు. విమాన ప్రయాణ సమయం తక్కువే గాని, ముందు వెనక చెరో మూడు గంటలు వెయిటింగ్. అంతా కలసి ఏడెనిమిది గంటలు అవనే అవుతుంది. దసరా సీజను, రైళ్ళు అన్నీ ఫుల్. ఎ.సి. కోచ్‍లలో దొరకలేదు. మామూలు స్లీపర్ క్లాస్ దొరికింది. “ఎండాకాలం ఏమీ కాదు కదా, చేసెయ్యి రా” అని చెప్పాను మా వాడికి. సికిందరబాదు – తిరువనంతరపురం ఎక్స్‌ప్రెస్‌లో బెర్తులు దొరికాయి నాకూ, నా బాల్యమిత్రుడు యోగానంద్‍కూ. వాడూ నా లాగే సీనియర్ సిటిజనే. ఇద్దరం 65+ నాట్ ఔట్!

రిజర్వేషన్ తేదీలు ట్రావెల్స్ వారికి తెలిపాము. దానికి తగ్గట్టుగా వారు ఏర్పాట్లు చేస్తారు. మొత్తం ఆరు రాత్రులు, ఆరు పగళ్ళట. అదేమిటో! ఆరు రోజులు అనొచ్చు కదా! ఇద్దరికీ త్రి స్టార్ అకామడేషన్, ఎ.సి. సెడాన్ (సెడాన్ అంటే కారట!) డ్రైవర్ కమ్ గైడ్, కాంప్లిమెంటారీ బ్రేక్‍ఫాస్ట్. పార్కింగ్ ఛార్జీలు, టోల్ గేట్ ఛార్జీలు ఇన్‍క్లూడెడ్! మొత్తం రూ. 29,870/- అవుతుందట. ముందు రూ. 10,000 అడ్వాన్స్ వారికి బదిలీ చేశాము.

సెప్టెంబరు 20వ తేదీ సికింద్రాబాద్‍లో ‘శబరి’ రైలెక్కాం మధ్యాహ్నం 12.20కి. ఇంటి నుండి వాంగీ బాత్, అలసందల వడలు, వాము కారప్పూస, చపాతీలు, ఆ రోజు రాత్రికి ఆలూ కూర, మర్నాడు ఉదయానికి మామిడికాయ తురుము పచ్చడి, వేరు శనక్కాయల పొడి సర్దుకున్నాము. మా చాదస్తాలు ఇలాగే ఉంటాయి మరి. మర్నాడు లంచ్ వరకూ ఇంటి తిండే!

రైలు బయల్దేరింది. ఇద్దరికీ క్రింది బెర్తులు వచ్చాయి. వాతావరణం మబ్బులు పట్టి చల్లగా ఉంది. ఒకటిన్నరకు వాంగీ బాత్ పొట్లాలు విప్పుకుని శుభ్రంగా తిన్నాం. నాలుగు గంటల వరకు పడక సీను. ఐదుకు గుంటూరు వచ్చింది. మధ్యలో నల్గొండ. అక్కడ పది నిమిషాలు ఆపారు. టీ తాగాము. శ్రీరామ నవమి రోజు ప్రసాదంగా ఇచ్చే బెల్లం పానకంలా ఉందది. లోపల ఆల్రెడీ షుగర్ ఫ్యాక్టరీయే ఉంది కదా; ఈ అదనపు చక్కెర ఏమిట్రా బాబూ! అనుకున్నాం. డబ్బులిచ్చాం కదా, సగం తాగి పడేశాం.

అలసందల వడలు చెరో నాలుగు తిని, కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం. తెనాలి, ఒంగోలు దాటింది రైలు. చపాతీల పాకెట్ తీసి వాటి పని పట్టాం. మజ్జిగ పాకెట్లు కొనుక్కుని తాగాం. మిడిల్ బెర్త్‌లు పైకి లేపించి హాయిగా పడుకున్నాం. మర్నాడు అంటే 21వ తేదీ నిదానంగా నిద్ర లేచాం. రైలు తిరుపతి దాటి తమిళనాడులో వెళుతూ ఉంది. ఫోన్‍లో ‘వేర్ ఈజ్ మై ట్రెయిన్’ యాప్‍లో చూస్తే సరైన సమయంలోనే నడుస్తుంది. ముఖాలు కడుక్కుని, రాత్రి మిగిలించి ఉంచుకున్న చపాతీలు తలా రెండూ తిన్నాం – పచ్చడి, పొడి నంచుకుని. పొడి గొంతుకు అడ్డం పడకుండా పొడిలో నెయ్యి కలిపి ఇచ్చింది మా ఆవిడ. ఆడవాళ్ళు అటువంటి విషయాలలో అసలు  కాంప్రమైజ్ కారండి!

సేలం దాటింది రైలు. కోయంబత్తూరు కూడా వెళ్ళిపోయింది. పానకానికి భయపడి టీ కాఫీలు తాగలేదు. టూర్ మేనేజర్లు ఇద్దరు. ఒకాయన జిజో, ఇంకొకాయన సందీప్. రెండ్రోజులకు ముందే జిజీ ఫోన్ చేసి “సార్, మీరు ఎర్నాకుళం వరకు వెళ్ళకండి. గంటన్నర ముందే త్రిశూర్ వస్తుంది. అక్కడ దిగిపోంది. అక్కడ మా డ్రైవర్/గైడ్ మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాడు. అక్కడ నుంచి గురువాయూర్ గంట కూడా పట్టదు” అని చెప్పాడు.

పదకొండు నలభైకి త్రిశూర్ వచ్చింది. దిగాము. చక్రాలున్న బ్యాగులు. సునాయసంగా లాక్కుంటూ స్టేషన్ బయటకి వచ్చాము.

‘బస్సొచ్చి, బండోడి కడుపు కొట్టిందోయ్’ అన్నట్లుగా, ఈ వీల్స్ లగేజ్ వచ్చి పోర్టర్ల పొట్ట కొట్టింది! ఫోన్ రింగైంది.

“సాబ్, మై సురేష్, ఫ్రం డొనాటో ట్రావెల్స్. స్టేషన్ కే బాహర్ పికప్ పాయింట్ మే గాడీ రఖ్ కర్ ఆప్ కే లీయే ఇంతజార్ కర్ రహా హుఁ” అని వినబడింది అట్నుంచి.

“అభీ ఆ రహే హైఁ” అన్నాను. ‘హైఁ’ నా, ‘హుఁ’ అని రాజేంద్రప్రసాద్ కొచ్చినట్లు అనుమానం వచ్చింది. ఇద్దరం కాబట్టి ‘హైఁ’ కరక్టన్నాడు మా యోగానందు. నా హిందీ అంత పర్‍ఫెక్ట్ కాదు. మొత్తం మీద మ్యానేజ్ చేయగలను.

డ్రైవర్ మాకు నమస్కారం పెట్టాడు. కారు నెంబరు ముందే చెప్పాడు. కత్తిలా ఉన్నాడు కుర్రాడు.

“డూ యూ నో ఇంగ్లీష్?” అని అడిగాను.

“తోడా తోడా ఐ టాక్ సార్” అన్నాడు నవ్వుతూ. అతడి హిందీ కూడా మలయాళం యాక్సెంట్‌లో ఉంది. నిదానంగా వింటే తప్ప అర్థం కాదు. తనది వాలక్కాడ్ అనీ, ఈ కంపెనీలో ఆరేళ్ళ బట్టి పని చేస్తున్నానని చెప్పాడు. “మీకేం ఇబ్బంది కలుగకుండా అన్నీ చూపిస్తాను సార్” అని భరోసా యిచ్చాడు. మంచివాడే పాపం!

ఒంటిగంటంబావుకు గురువాయూర్ చేరుకొన్నాము. మాకిచ్చిన హోటల్ పేరు ‘సీతా రీజన్సీ’. సెంటర్లో ఉంది. “మీరు ఫ్రెష్ అవండి, లంచ్‍కి వెడదాం” అన్నాడు. మేం స్నానాలు చేసి, బట్టలు మార్చుకుని క్రిందకి దిగాం. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘మయూరి భవన్’కు తీసుకువెళ్ళాడు సురేష్. బోర్డు మీద ‘Pure Veg’ అని చూసి సంతోష పడ్డాం. మా ఫ్రెండ్ నాతో –

“Pure కాని Veg కూడా ఉంటుందా శర్మా? ‘వెజ్’ అంటే సరిపోదూ!” అన్నాడు నవ్వుతూ.

“నిజమేరోయ్ యోగా!” అన్నా.

భోజనం రూ.130/- రైస్ దొడ్డుగా ముతకగా ఉంది. “సన్నబియ్యం అన్నం దొరకదా!” అని సర్వర్‍ని అడిగితే, “కేరళ మీల్స్‌లో ఇదే, మీరు లోపల కూర్చోండి” అని చెప్పి, భోజనం ప్లేట్లు తెచ్చాడు. రైస్ సన్నగా ఉంది కానీ బాగా పొడి పొడిగా ఉంది. ఏది పప్పో, ఏది సాంబారో అర్థం కాలేదు. క్యాబేజీ కూర. రసం మాత్రం సూపర్. పెరుగు మరీ చిన్న కప్పులో ఇచ్చారు. అలాంటి కప్పులు నాలుగయితే గాని మాకు సరిపోవు. కాని మజ్జిగ కావలసినంత పోశారు.

రూమ్‍కి వచ్చి విశ్రాంతి తీసుకొన్నాం. తాను ఐదు గంటలకు వస్తానని, గురువాయూర్ దర్శనానికి వెళదామని చెప్పాడు డ్రైవర్. ముందే చెప్పారు కాబట్టి, పట్టు పంచె, కండువా ధరించాం.

దారిలో ‘మమ్మియూర్ మహాదేవ్ టెంపుల్’ దగ్గర ఆపి, దర్శనం చేసుకుని రమ్మన్నాడు. అది చాలా పెద్ద, పురాతన శివాలయం. స్వామి జ్యోతి స్వరూపుడు. శివలింగం చుట్టూ ఒక ఫ్రేమ్, ఆర్చ్‌ల ఇత్తడితో కట్టి, దీపాలు వెలిగించారు. అద్భుతంగా ఉన్నాడు శివుడు.

‘వందే శంభుముపాపతిం సురగురుం వందే జగత్కారణం’ అన్న శ్లోకాన్ని బిగ్గరగా చదివాను. కొందరు భక్తులు నా దగ్గరకి వచ్చి శ్రద్ధగా విన్నారు. శ్లోకాలను పద్యాలను చక్కగా రాగయుక్తంగా చదవగలిగే నేర్పు ఆ భగవంతుడు నాకిచ్చాడు.

అక్కడి నుంచి మరో కిలోమీటరు దూరంలోనే గురువాయూరప్పన్ గుడి ఉంది. అక్కడి మూల విరాట్టు శ్రీకృష్ణ పరమాత్మ. ఉచిత దర్శనం క్యూ కాంప్లెక్స్ లన్నీ నిండిపోయి ఉన్నాయి. చెప్పులు, సెల్ ఫోన్లు లాకర్‍లో భద్రపరిచుకొని రసీదులు తీసుకొన్నాము.

అక్కడ, క్యూలోకి భక్తులను వదులుతూన్న సెక్యూరిటీ గార్డును అడిగాను, దర్శనం అవడానికి ఎంత సేపు పడుతుందని. రెండు గంటలు పట్టవచ్చు అన్నాడతడు. “ఇక్కడ ‘శీఘ్ర దర్శనం’ వసతి లేదా” అనడిగితే దూరంగా కనబడుతున్న ఒక కౌంటర్ చూపించాడు.

ఆ కౌంటర్ తెరిచే ఉంది. ‘ప్రత్యేక దర్శనం తలకు వెయ్యి రూపాయలు’ అని ఇంగ్లీషులో, మలయాళంలో రాసి ఉంది. లోపల అతను విద్యావంతుడిలా ఉన్నాడు.

“ప్రత్యేక దర్శనం ఎంత సేపు పడుతుంది సర్?” అని ఆయనను ఇంగ్లీషులో ప్రశ్నించాను.

“అర గంట లోపే” అన్నాడాయన. “మరి మీరు రాత్రి తొమ్మిది గంటలకు జరిగే ‘మహా గజపరిక్రమ’ చూడరా?” అని అడిగాడు.

“అదేమిటి సార్?”

“దర్శనాలు అయింతర్వాత దేవస్వం (దేవస్థానం) ఏనుగులు ఐదు ఉత్సవ విగ్రహాలను ధరించి, చక్కగా అలంకరించుకుని, ఛత్ర, చామర, భేరీలతో గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తాయి. తప్పక చూడవలసిన ఉత్సవం అది. నన్నడిగితే, ఇద్దరికీ రెండు వేలు పెట్టడం అనవసరం అండి. గజపరిక్రమ ఎలాగూ చూడాలి కాబట్టి ఉచిత దర్శనం క్యూలోనే వెళ్ళండి” అని సలహా యిచ్చాడాయన. ఆయన పేరు షణ్ముగన్ నంబూద్రి అట. ఎంత చక్కగా భక్తులను గైడ్ చేశాడో మహానుభావుడు! ఆయనకు థాంక్స్ చెప్పి క్యూలో నిలుచున్నాము. చక్కగా స్టీలు పైపులతో కూర్చోవడానికి బెంచీలున్నాయి. పైన మా జీవితంలో అంతవరకూ చూడనంత పెద్ద ఫాన్లున్నాయి. అవి ఎంత పెద్దవంటే మొత్తం క్యూ కాంపెక్స్‌కు అంతటికీ కలిపి రెండే. వాటి రెక్కలు ఒక్కోటి ఇరవై, ముప్ఫై అడుగుల పొడవున్నాయి. అవి మెల్లగా తిరుగుతున్నా చల్లని గాలిని భక్తులకు పంచుతున్నాయి.

ఆరున్నరకు మేం క్యూలో ప్రవేశించాం. కొందరు  భక్తులు జయదేవుని అష్టపదులను భజన రూపంలో గానం చేస్తున్నారు. వెంట తాళాలు, చిన్న డక్కీలు కూడా తెచ్చుకున్నారు. రెండు మూడు వందల మందిని ఒకసారి లోపలికి వదిలి, పావు గంట క్యూ ఆపేస్తున్నారు. మేమూ భజనలో గొంతు కలిపాము.

తిరిగే కాలూ, పాడే నోరూ ఊరుకోవు కదా! నేను గొంతెత్తి అన్నమయ్య కీర్తన ‘గోవింద గోవింద యని కొలువరే’ అందుకొన్నాను. తమిళనాడులో, కేరళలో మన త్యాగరాజు, అన్నమయ్యల కీర్తనలు బాగా ప్రసిద్ధి. వెంటనే కొందరు నాకు ‘వాద్య సహకారం’ అందించారు.

కీర్తన పూర్తి చేసే సరికి చాలామంది నన్ను అభినందించారు. ‘చేటా’ అంటూ మలయాళంలో ఏదో చెబుతున్నారు. ‘చేటా’ అనేది గౌరవ సంబోధన అని మాకు అర్థమయింది. ఒక తెల్లని ఉత్తరాది పిల్ల పదిమందిని దాటుకొని వచ్చి, చిరునవ్వుతో, నా చేయి పట్టుకుని –

“ఆప్ కా ఆవాజ్ బహుత్ సుందర్ హై, కాకా” అని, నా చేయి ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది.

కొంతమంది నా వైపు చూస్తూ ఏదో అంటున్నారు. ఇంకో పాట పాడమని అడుగుతున్నారని అర్థమైంది. వెంటనే

‘బ్రూహి ముకుందేతి! రసనే! బ్రూహి ముకుందేతి!’ అన్న సదాశివబ్రహ్మేంద్రుల కీర్తన అందుకున్నాను. కురింజ రాగంలో ఆదితాళంలో స్వరపరిచిన అద్భుత కీర్తన అది. నా శక్తి మేరకు దానికి న్యాయం చేశాను. చివర, మాంచి ఊపులో

‘కృష్ణ కృష్ణ ముకుంద జనార్దన

సచ్చిదానంద నారాయణా హరే

అచ్యుతానంద గోవింద కేశవ

సచ్చిదానందా నారాయణా హరే’

అని భజన సంప్రదాయంలో పాడుతూంటే చాలామంది గొంతు కలిపారు. తన్మయత్వంతో ఊగిపోయారు. భజన కున్న శక్తి అది. ఒకాయన నన్ను అడిగాడు, పల్లవికి అర్థం ఏమిటని. ఇంగ్లీషులో “O! Tongue! Say Mukunda, Mukunda” అని చెప్పాను (ఓ నాలుకా! ముకుందా ముకుందా అని అను!).

ఎనిమిది యాభైకి మాకు ఆ జగన్మోహనుని దర్శనం లభించింది. కేవలం రెండు అడుగుల విగ్రహం. శ్రీ కృష్ణ పరమాత్మ రెందు చేతులతో వేణువు ధరించి, వ్యత్యస్త పాదారవిందుడై, భక్తులకు పరవశాన్ని కలిగిస్తున్నాడు. వారు గొంతులు గద్గదమవుతుండగా, కన్నీళ్ళతో, ‘గురువాయురప్పనే’ అంటూ అరుస్తున్నారు. నేను, నా స్నేహితుడు కళ్ళనిండా స్వామిని నింపుకుని, బయటకు వచ్చాము. మా జన్మ ధన్యమైనట్టు అనిపించింది.

గుడి బయట, ప్రాకారం లోపల, ఐదు మహా గజములు నిలబడి ఉన్నాయి. సర్వాలంకార భూషితములై ఉన్నాయి ఆ గజరాజులు. వాటి ముఖాన్ని కప్పుతూ మంచి పనితనంతో చేసిన ఖరీదైన వస్త్రాలు వేలాడదీశారు. అంతమంది జనం ఉన్నా, అవి నిర్వికారంగా నిలబడి ఉన్నాయి. వాటి ముందు వేసిన అరటి బోదెలను, ఒక కాలితో నొక్కిపట్టి, తొండంతో నార చీల్చి, నోటి కందించుకుంటున్నాయి. అతి సమీపంలోకి వెళ్ళినా, ఏమీ అనడం లేదు.

తొమ్మిదిన్నరకు మహా గజపరిక్రమ ప్రారంభమయింది. ఐదింటిలో నాయక గజం ముందు భాగాన, స్వామివారి ఉత్సవ విగ్రహాలను మూపున ధరించింది. మావటీలు ఎక్కినప్పుడు దిగినపుడు, వారికి వీలుగా వెనుక కాలునొకదాన్ని బాగా పైకి లేపుతున్నాయి. గర్భగుడి దగ్గరకు వచ్చిన వెంటనే తొండము లెత్తి, ఘీంకారాలు చేస్తూ, శ్రీకృష్ణ పరమాత్మకు జోత లిడుతున్నాయి. వాటి భక్తి, క్రమశిక్షణ, చూడవలసిందే కాని చెప్పనలవి కాదు. ‘గురువాయూరప్పనే’ అన్న స్వామి వారి నామం మారుమ్రోగుతూంది.

బయటకు వచ్చాము. గజపరిక్రమ దృశ్యం కలిగించిన అద్భుతమైన అనుభూతి లోంచి ఇంకా తేరుకోలేదు మేము. బయట ఒక ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం ఉంది. అందులో కొందరు ఆడవాళ్లు శాస్త్రీయ సంగీత కచేరీ చేస్తూన్నారు.

గుడి బయట రకరకాల దుకాణాలు బారులు తీరాయి. మేం బయట పడేసరికి పదిన్నర. డ్రైవర్ మా కోసం కాచుకొని ఉన్నాడు. మేము సంప్రదాయ దుస్తులలోనే తిరుగుతున్నాము.

“సార్, పక్కనే ‘శరవణ భవన్’ ఉంది. భోజనం చాలా బాగుంటుంది. పదండి తీసుకు వెళతాను” అన్నాడు సురేష్.

‘శరవణ భవన్’ ఆ టైమ్ లో కూడా కిటకిటలాడుతోంది.

“రా సురేష్, నీవు కూడా!” అని పిలుస్తే, సున్నితంగా తిరస్కరించాడా అబ్బాయి. మధ్యాహ్నం లంచ్ అప్పుడు కూడా అంతే!

“కంపెనీ నాకు ఫుడ్ అలవెన్స్ ఇస్తుంది సార్! మీరు కానివ్వండి” అన్నాడు వినయంగా! దటీజ్ కల్చర్!

మా యోగానంద, “ఈ టైమ్‍లో భోజనం వద్దు శర్మా! టిఫిన్ చేద్దాం” అన్నాడు.

పక్క టేబుళ్ళ మీద కొందరు మసాలా దోసెలు తింటున్నారు. లేత బంగారం రంగులో స్పృహణీయంగా ఉన్నాయవి. మాకూ అవే తినాలనిపించి ఆర్డర్ ఇచ్చాము. రెండు చట్నీలు, సాంబారు కూడా ఇచ్చాడు. ఆ సాంబారు అమృతోపమానంగా ఉందంటే నమ్మండి! అదేమిటో గాని, దోసె మీద ఒక పెద్ద వడ పెట్టుకొని వచ్చాడు. తర్వాత కూడా మేం గమనించామది, టూర్ పొడుగునా.

వడ, దోసె పూర్తయ్యేసరికి ముసలి పొట్టలు నిండిపోయాయి. బిల్లు తెమ్మంటే, “కాఫీ చాలా బాగుంతుంది. వన్ బై టు తాగండి సార్” అన్నాడు సర్వరు. సాక్షాత్తు ప్రమథగణాల్లో ఒకరిలా ఉన్నాడు. విభూతి రేఖలు, గంధము, కుంకుమ నుదుటన ధరించి ఉన్నాడు.

కాఫీ అద్భుతం! అడయార్ ఆనందభవన్ రేంజిలో ఉంది. వితవుట్ షుగరే తెచ్చాడు. ఎలా తెలుసుకొన్నాడో! రేట్లు కూడా రీజనబుల్‍గానే ఉన్నాయి. దోసె, వడ కలిపి తొంభై రూపాయలు. కాఫీ ఇరవై. రూం చేరి, పడుకున్నాము.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here