అమెరికా ముచ్చట్లు-25

0
3

[box type=’note’ fontsize=’16’] తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల శాఖలో ఓఎస్‌డిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ శ్రీధర్ రావు దేశ్‌పాండే తమ అమెరికా యాత్ర విశేషాలు సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

అమెరికన్ల నుంచి మనం నేర్చుకోవలసిన అంశాలు:

[dropcap]నే[/dropcap]ను అమెరికాలో ఉండగా “అమెరికా ప్రజల నుంచి మనం నేర్చుకోవలసిన అంశాలు ఏవైనా ఉన్నాయా?” అని ఒక మిత్రుడు అడిగాడు. తప్పకుండా ఉన్నాయి. అదే సమయంలో తృణీకరించ వలసిన అంశాలు కూడా ఉన్నాయని అన్నాను. వీటి గురించి ఈ శీర్షికలో చివరి వ్యాసంగా రాయాలని అనుకున్నాను.

సాధారణ జన జీవితంలో ఆమెరికాలో అమల్లో ఉన్న టెక్నాలజీని మనం అందిపుచ్చుకోవడానికి ఇంకా చాలా కాలం పడుతుంది. మానవ శ్రమకు దూరం చేస్తున్న ఈ టెక్నాలజీ వినియోగం వాంఛనీయమా? అన్న ఒక ప్రశ్న ఒకటి మన మధ్య చర్చలో ఉన్నది. ఆ చర్చ మంచి చెడ్డలు వదిలేస్తే.. ఇండియాలో ఈ టెక్నాలజీ వినియోగం ఇప్పట్లో ఆచరణ సాధ్యం కాదని నా అభిప్రాయం. ఎందుకంటే అమెరికాలో అభివృద్ది అయిన సర్వీస్ సెక్టార్ మన వద్ద లేదు. అయితే అమెరికన్లు నిత్య జీవితంలో ఆచరిస్తున్నకొన్ని అంశాలు మాత్రం ఆచరణనీయమే. వాటిని మనం కూడా నిత్య జీవితంలో ఆచరించడం ఏ మాత్రం అసాధ్యం కాదు. ఇక్కడికి వచ్చిన ప్రవాస భారతీయులు వాటిని ఆచరిస్తున్నారు కూడా. నా దృష్టికి వచ్చిన కొన్నింటిని ఇక్కడ ప్రస్తావించ దలుచుకున్నాను.

  • అమెరికన్లు.. చిన్న పిల్లలు కూడా.. చెత్తని ఎక్కడ అంటే అక్కడ వెయ్యరు. వాటికి కేటాయించిన డబ్బాల్లోనే వేస్తారు.
  • ఇంట్లో జమ అయిన చెత్తను వీధుల్లో విసిరి వేయరు. జాగ్రత్తగా ప్లాస్టిక్ బ్యాగ్‌లో నింపి ఇంటి ముందు పెడతారు. ప్రతి రోజు మున్సిపాలిటీ వారి చెత్త వాహనం వచ్చి చెత్తను కలెక్ట్ చేసుకొని వెళుతుంది.
  • ట్రాఫిక్ రూల్స్ తు.చ. తప్పక పాటిస్తారు. రెడ్ లైట్ పడితే అవతల నుంచి ఏ వాహనం రాకున్నా, అర్ధరాత్రి అయినా సరే ఆగిపోతారు. గ్రీన్ లైట్ పడిన తర్వాతనే వెళతారు. నిర్దేశించిన స్పీడ్ లిమిట్ దాటరు. దాటితే భారీ ఫైన్ చెల్లించాల్సి ఉంటుందన్న భయంతోనో.. ట్రాఫిక్ రూల్స్‌పై చిన్నప్పటి నుంచి కలిగిన అవగాహన కారణంగా రూల్స్‌ను ఉల్లంఘించరు. పాదచారులు కూడా జీబ్రా క్రాసింగ్ వద్దనే రోడ్డు దాటుతారు.
  • ట్రాఫిక్ లైట్లు లేని రోడ్లపై పిల్లలు, వృద్ధులు, పాదచారులు రోడ్డు దాటుతుంటే వాహనాన్ని ఆపేస్తారు. వారు వెళ్ళిన తర్వాతనే కారును ముందుకు పోనిస్తారు. వారికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తారు. ట్రాఫిక్ సిగ్నల్స్ లేని కూడళ్ళ వద్ద ముందు వచ్చిన వాహనం వెళ్ళిన తర్వాతనే వెళతారు. First come first రూల్ విధిగా పాటిస్తారు.
  • వాహనాలను ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయరు. పార్కింగ్‌కు నిర్దేశించిన జాగాలోనే చేస్తారు. ఇక్కడ పబ్లిక్ ప్లేసెస్‌లో విస్తారమైన పార్కింగ్ స్థలం ఫ్రీగానే విధిగా ఏర్పాటు చేస్తారు. అమెరికా విస్తీర్ణం మన దేశం కంటే రెండింతలు పెద్దది. అందుకే విశాలమైన రోడ్లు వేసుకోవడానికి, విశాలమైన పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసుకోవడానికి వీలు అవుతున్నమాట వాస్తవమే. అయినప్పటికీ దూరం అయినా కూడా వాహనాలని ఎక్కడంటే అక్కడ పార్క్ చేయకుండా నిర్దేశిత స్థలంలోనే పార్క్ చేస్తారు. లేదంటే మనం పని చేసుకొని తిరిగి వచ్చేటప్పటికి పోలీసులు మన వాహనాన్ని టోయింగ్ చేసి తీసుకుపోతారు. కోర్టుకు వెళ్ళి భారీ జుర్మానా చెల్లించి వాహనాన్ని విడిపించుకోవాలి. ట్రాఫిక్ ఉల్లంఘనలకు కూడా ఇదే పద్ధతిలో భారీ జుర్మానా చెల్లించాలి.
  • అపరిచితులను కూడా ఎక్కడ తారసపడినా.. లిఫ్ట్‌లో, పార్కులో, షాపుల్లో.. తదితర పబ్లిక్ ప్లేసెస్‌లో.. “హాయ్” అని విష్ చేస్తారు. మనం ప్రతిస్పందించకపోతే అనాగరికులుగా పరిగణిస్తారు
  • ఎక్కడైనా, ఎవరైనా సరే ఏ చిన్న సహాయం చేసినా థాంక్స్ చెపుతారు. రెస్టారెంట్‌లో సర్వర్‌కు కూడా థాంక్స్ చెపుతారు.
  • రోడ్ల మీద ఉమ్మరు. పబ్లిక్ ప్లేసెస్‌లో సిగరెట్లు తాగరు. టాయిలెట్లలో తప్ప బహిరంగ ప్రదేశాలలో మూత్ర విసర్జన, మల విసర్జన చేయరు. తమ పరిసరాలను, పబ్లిక్ ప్లేసెస్‌ను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రాధాన్యత ఇస్తారు. ప్రతీ వ్యాపార సంస్థలో, రెస్టారెంట్లలో, మాల్స్‌లో, ప్రతీ భవనంలో పబ్లిక్ టాయిలెట్లు ఉంటాయి. ఎవరైనా ఈ టాయిలెట్లను వినియోగించుకోవచ్చు.
  • నదులలో, చెరువులలో చెత్త చెదారాన్ని వేయరు. నదుల పట్ల భారతీయులకు ఉన్నపవిత్ర భావన అమెరికన్లకు లేకపోయినా వాటిని అత్యంత శ్రద్ధతో కాపాడుకుంటారు. పరిశుభ్రంగా ఉంచుతారు.
  • మహిళలని వారు ఎలాంటి వేషధారణతో ఉన్నా కూడా పట్టించుకోరు. Staring చెయ్యరు. Judge చేయరు.
  • ఎక్కడైనా క్యూ పద్ధతి పాటిస్తారు. దొడ్డిదారి ప్రవేశాలు ఉండవు. క్యూ పద్ధతి పాటించక పోవడాన్ని అమెరికన్లు అనాగరికమైన చర్యగా భావిస్తారు.
  • సహాయం అడిగితే, సమాచారం అడిగితే బాధ్యతతో చెపుతారు. సహాయం చేస్తారు.
  • డ్యూటీ వేళకు ఆఫీస్‌లకు, పని స్థలాలకు చేరుకుంటారు. ఒక్క క్షణం కూడా వృథా చెయ్యకుండా పని చేస్తారు.
  • ఉచ్చమైన పని, నీచమైన పని అనే భేదాభిప్రాయాలు వ్యక్తం చెయ్యరు. అమెరికాలో Dignity of Labour ఎక్కువ. మరుగు దొడ్లు కడిగే పని చేసేవారు కూడా వారి పని ముగిసిన తర్వాత మనతో కలిసి భోజనం చేస్తారు. పని చేయాలనుకునే వాళ్ళందరికీ చిన్నదో పెద్దదో పని దొరుకుతుంది. అమెరికాలో సర్వీస్ సెక్టార్‌లో ఉన్న విస్తృతి కారణంగా ఇది సాధ్యం అవుతున్నది.
  • నల్ల జాతి ప్రజలను వివక్షతో చూసే రేసిజం అమెరికాలో ఉన్నప్పటికీ కుల భేదాలు, కుల వివక్ష మన దేశంలో ఉన్నంత తీవ్రంగా ఉండవు. మన దేశంలో షెడ్యూల్డ్ కులాల వారికి ప్రత్యేక కాలనీలు, వాడలు ఉన్నట్టు అమెరికాలో నల్లజాతి ప్రజలకు ప్రత్యేకమైన కాలనీలు ఉండవు. ఎక్కడైనా వారు నివసించ వచ్చు.
  • వీధుల్లో, బహిరంగ ప్రదేశాలలో ఇతరులకు ఇబ్బంది కలిగించే పనులు.. ఊరేగింపులు తీయడం, రోడ్లకు అడ్డంగా టెంట్లు, మండపాలు ఏర్పాటు చేయడం, డిజెలు పెట్టి శబ్దాలు చేయడం, పటాకులు కాల్చడం, లౌడ్ స్పీకర్లు పెట్టడం.. లాంటివి చేయరు. ఇట్లా చేస్తే ఇతరులు చేస్తే సహించరు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. అటువంటి ఉత్సవాలకు ముందస్తు అనుమతి విధిగా తీసుకోవాలి. వాటి కోసం నిర్దేశించిన ప్రదేశాలలో మాత్రమే జరుపుకోవాలి.
  • పిల్లలను కొట్టరు. దండించరు. తల్లిదండ్రులు సహా అట్లా ఎవరైనా చేస్తున్నట్టు తెలిసినా పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. బాలల హక్కులపై అమెరికన్లు చాలా సున్నితంగా ఉంటారు.
  • ఇతరుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించరు. తమ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే వారిని సహించరు.. అది ప్రభుత్వం చేసినా సరే. ఎంతటి వారైనా చట్టాన్ని, రూల్స్‌ను పాటించక తప్పదు.

శుభ్రత పట్ల మనం ఆచరణ ఎట్లా ఉన్నది?

ఈ సందర్భంగా పరిశుభ్రత పట్ల మన అలవాట్లు, మన ఆచరణ గురించి సీరియస్‌గా చర్చించుకోవాలి.

మనం నదులను పవిత్రంగా భావిస్తాము తప్ప వాటి స్వచ్ఛత గురించి మనం అలోచించం. నదులను, పరిసరాలను అపరిశుభ్రం చేయడంలో భారతీయుల కంటే మించిన వారు లేరు.

ఇది మన మూసి నది పరిస్థితి
మనం పవిత్రంగా భావించే నదుల్లోకి విసరేస్తున్న చెత్త
దిల్లీలో యమునా నది దుస్థితి ఇది

మనకు వ్యక్తిగత శుభ్రత పట్ల ఉన్న మక్కువ మన పరిసరాల పట్ల ఉండదు. ఇంటి నుంచి తీసుకొచ్చి చెత్తను వీధుల్లో, నదుల్లో, చెరువుల్లో పడేస్తాము.

వీధుల్లో బాధ్యత లేకుండా పడేసిన చెత్త

మా బోథ్ పెద్ద వాగు పరిసరాలు చూస్తే తెలుస్తుంది. మొత్తం ఊరిలో జమ అయ్యే బీడీ ఆకు వేస్టేజ్ అంతా మన పెద్ద వాగులోకి వెళుతున్నది. బోథ్ సమీపంలో ఉండే పొచ్చెర, కుంటాల వాటర్ ఫాల్స్ చూస్తే మన జనాల వైఖరిపై అసహ్యం కలుగుతుంది. ఎక్కడ చూసిన ప్లాస్టిక్ సీసాలు, బ్యాగ్‌లు, విస్తర్లు, బొక్కలు, నానా చెత్త కనిపిస్తుంది. చెత్త కుండీలు లేక కాదు. ఉన్నా కూడా అందులో వేయం. మన ఇల్లు వాకిలి ఊడ్చుకుంటాము. ఆ చెత్త నంతా వీధుల్లో తోసేస్తాము. హైదరాబాద్‌లో ఇంటి నుంచి బ్యాగుల్లో తెచ్చిన చెత్తను మూసీలో వేస్తారు. లేదంటే హుసేన్ సాగర్‌లో, ఇతర చెరువులలో పడేస్తారు. అట్లా వేయకుండా నిరోధించడానికి జిహెచ్ఏంసి వారు 10 అడుగుల ఎత్తైన కంచె కట్టినా దానిపై నుంచి విసురుతారు. అవి కంచెకు తట్టుకొని తోరణాల లాగా వేలాడుతూ ఉంటాయి.

ఇంటి నుంచి తెచ్చిన చెత్తను వీధిలో పడేస్తున్న దృశ్యం

మేము ఉండే గుర్రంగూడ శ్రీ శ్రీ అవెన్యూ కాలనీలో ప్రతీ రోజు మునిసిపాలిటీ వారి చెత్త బండి వస్తుంది. చెత్త తీసుకు పోతారు. అయినా వీధుల్లో చెత్త వేస్తారు. ఓపెన్ ప్లాట్లు అన్నీ చెత్త కుండీలే. ప్రతి రోజు చెత్త బండి వస్తున్నప్పుడు వీధుల్లో, ఓపెన్ ప్లాట్లలో చెత్త ఎందుకు వేయాలి?

ఇప్పుడు ఊర్లలో ఒక కొత్త పద్ధతి వచ్చింది. వ్యక్తి మరణించిన తర్వాత మూడో రోజు చితిని ఎత్తిపోయడం మరణానంతర కర్మకాండల్లో ఒక ఆచారం. చితిని ఎత్తిపోసిన తర్వాత ఆ బూడిదను అంతా సంచుల్లో నింపి సోన్ వద్ద గోదావరిలో కలుపుతున్నారట. గతంలో కొన్ని ఆస్తికలు మాత్రమే తీసుకుపోయి గంగలో కలిపేవారు. మనం పవిత్రంగా భావించే నదిని ఈ రకంగా కలుషితం చేసే హక్కు మనకు లేదు. నదికి కూడా హక్కులు ఉంటాయి. దానికి కూడా మనుషుల లెక్క బతికే హక్కు ఉంది. అందులో బతికే జీవాలకు, నది మీద ఆధారపడి ఉండే ఇతర పశు పక్ష్యాదులకు కూడా బతికే హక్కు ఉంది. ఈ అంశాన్ని నదిని పవిత్రంగా భావించే మనం విస్మరిస్తాము. ఇవి మన ఆచారాల్లో, అలవాట్లలో ఉన్నాయి. కాశీలో గంగా నది సగం కాలిన శవాలతో, చితుల బూడిదతో ఎట్లా కలుషితమవుతున్నదో మనందరికీ తెలిసిందే.

చెత్త వేయరాదు అన్న బ్యానర్ వద్ద పేరుకుపోయిన చెత్త

యూరప్, అమెరికా, ఇతర తూర్పు ఆసియా దేశాలలో నదులు, చెరువులు అత్యంత శుభ్రంగా ఉంటాయి. లండన్ మహానగరం మధ్యలో నుంచి ప్రవహించే థేమ్స్ నది, పారిస్ నగరం మధ్యలో నుంచి ప్రవహించే సీన్ నది, అమెరికాలో రోజుకు వేలాది మంది సందర్శించే నయాగారా జలపాత పరిసరాలు, న్యూయార్క్‌లో ఉండే Statue of Liberty పరిసరాలు ఎంత శుభ్రంగా ఉంటాయో ఇంతకు ముందు రాసి ఉన్నాను.

లండన్ మహా నగరం మధ్యలో నుంచి ప్రవహిస్తున్న స్వచ్ఛమైన థేమ్స్ నది
డాలస్ మెకనీ రాలే హౌజ్ కమ్యూనిటీలో ఉన్న స్వచ్ఛమైన చెరువు
డాలస్ నగర శివారులో ఉన్న శుభ్రమైన రాక్ వాల్ సరస్సు

చిన్నపిల్లలు సహా అందరూ చెత్తను చెత్త కుండీల్లో మాత్రమే వేస్తారు. వాటి నిర్వాహకులు చెత్త కుండీలను ప్రతీ గంటకు ఒకసారి ఖాళీ చేసి కొత్త బ్యాగులు తగిలించి పోతారు. సందర్శకులు, నిర్వాహకులు ఇద్దరూ బాధ్యతాయుతంగా ఉంటారు కనుక అక్కడి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి.

అమెరికాలో చెత్తను సేకరిస్తున్న మునిసిపాలిటీ ట్రక్

మన నగరాల మధ్య నుంచి ప్రవహిస్తున్న మూసీ (హైదారాబాద్), సాబర్మతి (అహమ్మదాబాద్), గంగా (వారణాసి, కాన్పూర్, అలహాబాద్), యమునా (డిల్లీ), ముఠా(పుణే) తదితర నదుల పరిస్థితి ఏమిటో మనందరికీ తెలిసిందే. ఈ స్థితి మారాలంటే ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా ఉండటమే కాదు ప్రజలూ అంతే బాధ్యతగా ఉండాలి. అప్పుడే మన నగరాలు, పట్టణాలు, గ్రామాలు, మన పరిసరాలు, మన నదులు, జలపాతాలు, పర్యాటక కేంద్రాలు శుభ్రంగా ఉంటాయి. ప్రభుత్వం ఎంత చేసినా ప్రజలు సహకరించకపోతే ప్రభుత్వాలు సాధించేది ఏమి ఉండదు.

రాహుల్ సాంకృత్యాయన్ ఏమన్నాడు?

భారతీయుల శుభ్రతపై ప్రముఖ రచయిత, తత్వవేత్త, చరిత్రకారుడు రాహుల్ సాంకృత్యాయన్ 1954లో రాసిన ‘బహురంగీ మధుపురి’ అనువాద కథల సంపుటి ‘మధుపురి కథలు’లో ఉన్న ‘చంపూ” అన్న కథలో భారతీయుల పరిశుభ్రతపై ఆయన చేసిన వ్యాఖ్యానాలు ఇవి.

“ప్రతీ దేశంలోనూ పట్టణాలు, నగరాలు ఉంటాయి. ప్రతీ పట్టణంలోనూ కొన్ని వేల కుటుంబాలు ఉంటాయి. శుభ్రతను పాటించే దేశాలు తమ పట్టణాలనే కాకుండా పల్లెలను కూడా చాలా శుభ్రంగా ఉంచుకుంటాయి. భారతీయులు శుచి శుభ్రతల్లో ప్రపంచంలోనే తాము అద్వితీయులమని భావిస్తూ ఉంటారు. కానీ భారతదేశంలో పల్లెలు ఎంత అపరిశుభ్రంగా ఉంటాయో చెప్పలేను. ప్రపంచంలోని మరి ఏ దేశమే కానీ, ఎంత వెనుకబడ్డ దేశమో కానీ తమ గ్రామాలని ఇంత అసహ్యంగా, ఇంత అశుభ్రంగా ఉంచుకోదు. ఒక రకంగా భారతీయులు అశుభ్రతకు చక్కని ఉదాహరణగా పనికి వస్తారు. వ్యక్తిగత శుభ్రతకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి సామూహిక శుభ్రతను, సామాజిక శుభ్రతను అతి నిర్లక్ష్యంగా చూసే జాతి ప్రపంచంలో మరొకటి లేదు. భారత జాతి ఒక్కటే ఇలా చేస్తుంది. ఈ దేశంలో గ్రామం పక్కన ఉన్న ఖాళీ బయలు ప్రదేశాలను మలమూత్రాదులను విసర్జించడానికి నిరభ్యంతరంగా వాడేస్తుంటారు. లక్షల సంఖ్యలో మానవులు నివసిస్తూ ఉండే నగరాలలోనూ ఇలాగే చేస్తే అంటూ రోగాలను ఆహ్వానించటమే అవుతుంది. కాబట్టే నగరాలలో పాయిఖానాల ఏర్పాట్లు ఉన్నాయి కొంతవరకు. నన్నడిగితే ఈనాటి కంటే రెండు వేల సంవత్సరాల క్రితం భారతదేశంలో శుభ్రతకు సంబందించి నియమాలు చాలా ఎక్కువగా పాటించేవారని అనుకుంటాను. ఆనాడు మన నగరాలు కానీ, పట్టణాలు కానీ, ఇంత అశుభ్రంగా ఉండేవి కావు. ప్రపంచంలోని ఇతర దేశాలలో శుభ్రతకు సంబంధించిన వృత్తులను అవలంభించే వారిని నీచంగా చూడటం గానీ, అసహ్యించుకోవడంగానీ చేయరు. అయితే ఇతర దేశాల్లోనూ ఇలాంటి వృత్తులను చేసే వారికి జీతం కొద్దిగానే ఇచ్చినా శుభ్రం చేసినాకా చేతులు కడిగేసుకుంటారు. అవసరం అయితే బట్టలు మార్చుకుంటారు. ఇంకా అతనితో కలిసి భోజనం చేయడానికి ఎవరికీ అభ్యంతరం ఉండదు. మన దేశంలో శుభ్రతకు సంబందించిన పనులు చేసేవారిని హీనులుగా చూడటం పరిపాటి అయ్యింది.”

మన దృక్పథంలో మార్పు రావాలి:

రాహుల్జీ వ్యాఖ్యానాల్లో అబద్ధం ఉందని నేను అనుకోవడం లేదు. చిన్నప్పటి నుంచి నా అనుభవంలో ఉన్నవే. ఇప్పటికీ వాటిని చూస్తూనే ఉన్నాను. వ్యక్తిగత శుభ్రత, పరిసరాల శుభ్రత గురించి మనము మారాలి, మన దృక్పథం మారాలి. మన పిల్లలకు ఉగ్గుపాలతో ఈ విషయాలు నేర్పాలి. జపాన్‌లో చిన్నప్పటి నుంచి పిల్లలకు శుచి శుభ్రతపై విద్యా బోధనలో భాగంగా నేర్పుతారట. మహారాష్ట్రలో అహ్మద్ నగర్ జిల్లాలో ఉన్న హివ్రే బాజార్ గ్రామంలో కూడా పోపట్ రావు పాటిల్ ఈ విధానాన్ని అమలు పరచడం నేను ఆ గ్రామం సందర్శించినప్పుడు చూశాను. ఆ గ్రామం ఐఐటి, ఐఐఎం, గ్రామీణాభివృద్ది సంస్థలు, వివిధ యూనివర్సిటీల సోషియాలజీ విద్యార్థులకు అధ్యయన కేంద్రంగా మారింది. ఈ విషయంలో యూరప్, అమెరికా, చైనా, జపాన్ ఇతర తూర్పు ఆసియా దేశాలతో పోలిస్తే మనం చాలా వెనుకబడి ఉన్నాము. అభివృద్ధిలో ఇది కూడా ఒక భాగమే. ఈ విషయంలో ఆమెరికన్ల నుంచి మనం నేర్చుకోవలసింది ఎంతో ఉన్నది.

అమెరికాలో ఆహార దుబారా:

ఇన్ని మంచి విషయాల్లో రుచించని అంశాలు కూడా ప్రస్తావిస్తాను. అమెరికన్లు ఆహారాన్ని విపరీతంగా దుబారా చేస్తారు. ప్రపంచంలో ఆహారాన్ని అత్యధికంగా దుబారా చేసే 15 దేశాలలో ఆస్ట్రేలియా, ఆమెరికా దేశాలు అగ్ర స్థానంలో ఉన్నాయి. సంవత్సరానికి ఒక మనిషి చేసే ఆహార దుబారా (Per Capita Food Wastage per year) ఆస్ట్రేలియాలో 361 కిలోలు, అమెరికాలో 278 కిలోలు. యూరప్ దేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, స్వీడన్ దేశాలు కలిపి ఉత్పత్తి చేసే దుబారా ఒక్క అమెరికాలోనే ఉత్పత్తి అవుతుందని earth.org వారి అధ్యయనంలో వెల్లడి అయ్యింది. భారతీయులు కూడా ఈ విషయంలో తక్కువేమీ లేరు. అయితే అమెరికాతో పోల్చినప్పుడు మన ఆహార దుబారా చాలా చాలా తక్కువ.

ఇబ్బంది కలిగించే శృంగార చేష్టలు:

అమెరికన్లు బహిరంగ ప్రదేశాలలో కూడా శృంగార చేష్టలకు పాల్పడుతారు. ప్రజలు తిరిగే ప్రదేశాలలో, పార్కుల్లో, విమానాల్లో, రైళ్లలో ముద్దులు పెట్టుకుంటారు. భారతీయులుగా మనం అసలే సహించరాని విషయం. ఇది అందరికీ ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. కానీ వారిని ఎవరూ నిరోధించరు. అది వ్యక్తిగత అవతలి వారి స్వేచ్ఛలో భాగంగా చూస్తారు.

టీనేజ్ లోనే తల్లులవుతున్న అమెరికన్ అమ్మాయిలు:

పిల్లలు చాలా చిన్న వయసులోనే బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ కలిగి ఉంటారు. స్కూళ్ళలో వారికి లైంగిక విజ్ఞానం బోధిస్తున్నారా లేదా తెలియదు. వారి లైంగిక చర్యల వల్ల కలిగే అనర్థాలను అమెరికా సమాజం ఎదుర్కొంటున్నది. అమ్మాయిలు 14, 15 ఏళ్లకే గర్భం దాల్చడం జరుగుతున్నది. అమెరికాలో చాలా రాష్ట్రాలలో అబార్షన్ చట్ట విరుద్ధం కావడంతో అంత చిన్న వయసులోనే అమ్మాయిలు తల్లులు అవుతున్నారు. లేదంటే చట్ట విరుద్ధంగా, అశాస్త్రీయ పద్ధతుల్లో అబార్షన్లు చేసుకొని అనారోగ్యాల పాలవుతున్నారు. ఇటీవలే అమెరికా సుప్రీం కోర్టు అబార్షన్‌లు చట్ట విరుద్ధం అని వెలువరించిన తీర్పు పట్ల అమెరికన్ యువత తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ తీర్పు కూడా అమెరికన్ సమాజంపై తీవ్ర ప్రభావం చూపబోతున్నది. ఈ విష వలయంలో నుంచి తమ పిల్లలను కాపాడుకోవడం ఎట్లా అన్నది ఇప్పుడు ప్రవాస భారతీయ తల్లిదండ్రులకు పెద్ద తలనొప్పిగా మారింది.

***

‘అమెరికా ముచ్చట్లు’ శీర్షికతో గత 25 వారాలుగా ధారావాహికంగా వస్తున్న వ్యాసాలలో ఇది చివరిది. అమెరికాలో విద్యా వ్యవస్థని, వైద్య వ్యవస్థని అధ్యయనం చేయడానికి అవకాశం చిక్కలేదు. అట్లనే తల్లిదండ్రులను వదిలేసి అమెరికా వెళ్ళిపోయిన తర్వాత తల్లిదండ్రుల స్థితిగతుల మీద కూడా రాయవలసి ఉండింది. అమెరికా ముచ్చట్లు పుస్తక రూపంలో ప్రచురించినప్పుడు వీటిపై కూడా వ్యాసాలని రాసి ప్రచురిస్తాను. 25 వారాలుగా ఆదరించిన పాఠక మహాశయులకు ధన్యవాదాలు. ప్రచురించిన సంచిక అంతర్జాల పత్రిక సంపాదకులు కస్తూరి మురళీకృష్ణ, పత్రిక కోసం పని చేస్తున్న కొల్లూరి సోమ శంకర్ గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు.

సెలవు – శ్రీధర్ రావు దేశ్‌పాండే

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here