మేనల్లుడు-15

0
3

[అమ్మూతో అమెరికా చేరిన వివేక్ దివ్యకి ఫోన్ చేసి జరిగినదంతా చెప్తాడు. విపరీతంగా బాధపడుతుంది దివ్య. వివేక్ ఇక తనవాడు కాలేడని భావించి అతనికి దూరంగా ఉండాలనుకుంటుంది. తాతయ్య పేరు మీద ఉత్తరం రాసి పెట్టి, ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోతుంది. కాసేపటికి తాతయ్యకి ఫోన్ చేసి,  చెప్పకుండా ఇంట్లోంచి వచ్చేసినందుకు క్షమించమని అడిగి, బల్ల మీద పెట్టిన ఉత్తరం గురించి చెబుతుంది. అది చదివి ఆయనా బాధపడతాడు. అమెరికాలో అమృతకి అంతా కొత్తగా ఉంటుంది. వివేక్ కూడా కొత్త మనిషిలా అనిపిస్తాడు. టిఫిన్ తినడానికి వివేక్ పిలిస్తే, వద్దంటుంది. ఆమెకు ఎంతగానో నచ్చజెబుతాడు వివేక్. మిత్రులందరూ దివ్య ఎవరికీ చెప్పకుండా ఎక్కడి వెళ్ళిందో, ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసిందో తెలియక కంగారు పడతుంటారు. దివ్య సంగతి వివేక్‍కి ఫోన్ చేద్దామని అనుకుంటారు. ఈలోగా వాళ్ళకి ఎదురవుతాడు వివేక్. – ఇక చదవండి.]

[dropcap]చా[/dropcap]లా చిక్కిపోయి, కళ్ళ కింద గుంటలతో, ఎవరో క్రొత్త వ్యక్తిలా కనబడుతున్న వివేక్‌ని చూసి అందరూ కంగారుగా దగ్గరకు వెళ్ళారు..

“ఏంటి వివేక్?.. అలా అంత వీక్ అయిపోయావు. ఏం జరిగింది? అంకుల్ ఎలా ఉన్నారు?” అన్నాడు సునీల్.

“వివేక్!.. కనీసం వస్తున్నానని ఫోను చేయకుండా సడన్‍గా ఇలా వచ్చాశావు ఏమిటి?.. నిన్ను disturb చేయడం ఎందుకని మేము ఫోన్లు చేయడం లేదు.. నువ్వు వస్తున్నావని తెలిస్తే ఈ రోజు దివ్య ఖచ్చితంగా వచ్చేది. ఉండు! ఇప్పుడే ఫోను దివ్యకి చెస్తాను.. స్విచ్ఛాఫ్‌లో ఉందేమో!.. చూడాలి” అని హడావిడిగా ఫోను తీసింది రాధిక.

“దివ్యకి నేను USA వస్తున్నట్లు తెలుసు. జరిగినదంతా చెప్పాను.. తనతో చెప్పకపోతే ఇంకెవరితో చెప్పగలను?..” అని వివేక్ అంటుండగానే అందరూ కంగారుగా ఒకరి మొఖాలు ఒకరు.. చూసుకున్నారు.

“నువ్వు వస్తున్నట్లు దివ్యకి తెలుసా? జరిగింది తనతో చెప్పకుండా ఇంకెవరితో చెబుతాను అన్నావు.. ఏం జరిగింది?..” అంది కంగారుగా రాధిక.

రాధిక మాటలకు ఆశ్చర్యపోయి.. “దివ్య మీతో ఏం చెప్పలేదా?..” అని అంటుండగానే ఫోను రింగ్ కావడం, గభాలున లిఫ్ట్ చేసి..“చెప్పు అమ్మూ!.. ఇంకా ఇప్పుడే వచ్చాను.. ఈవినింగ్ త్వరగా వచ్చేస్తాను. నీకు ఓల్డ్ పిక్చర్స్ ఇష్టం కదా? కప్ బోర్డులో బోలెడు సీడీలు ఉన్నాయి.. సరే ఉంటాను” అని ఫోను పెట్టేసాడు వివేక్.

అందరూ ఆశ్చర్యంగా వివేక్ వైపు చూసారు.. “ఎవరు నీతో మాటాడింది?” అంది కంగారుగా రాధిక..

“అమ్మూ! అమ్మూ!.. నాతో వచ్చింది..” అన్నాడు వివేక్..

“అమ్మూ!.. అమ్మూ నీతో వస్తున్నట్లు దివ్యకి తెలుసా వివేక్?” అంది రాధిక.

“ఎందుకు తెలియదు?.. అన్నట్లు దివ్య.. నేను ఫోను చేసినా లిఫ్ట్ చేయడం లేదు.. ఎక్కడికి వెళ్ళింది?..” అన్నాడు వివేక్..

‘ఏంటి వివేక్?.. ఇలా మాట్లాడుతున్నాడు.. ఏం జరిగిందో తెలియదు.. కాని జరిగింది దివ్యతో చెప్పాను అంటున్నాడు.. అమ్మూ మరదలని తెలుసు. USAకి తనని తీసుకువచ్చాడు..’

‘అమ్మూతో పెళ్ళయిందా?.. అయినా అవ్వకపోయినా పరిస్థితి దారి తప్పిందని అర్థమయింది. ఇప్పడర్థమయిపోయింది.. దివ్య.. ఎవరికి చెప్పపెట్టకుండా ఎందుకు వెళ్ళిపోయిందో అర్థమయింది..’

‘సారీ దివ్యా!.. నీ ప్రేమకి మధ్యలో ఇంత పెద్ద బ్రేక్ పడుతుందని.. అస్సలు నేను ఊహించలేదు.’

‘ఏ బాధ అయినా కొద్ది రోజులు పడొచ్చు.. తరువాత నెమ్మదిగా బాధ దూరంగా జరుగుతుంది.. కాని నీ మనసంతా వివేక్ పట్ల ప్రేమతో నిండిపోయి ఉంది.. ఇక నీ బాధని ఎవరు పొగొట్టగలరు? I am sorry దివ్య!..’ అని మనసులో అనుకుంది రాధిక.

ఇండియాలో జరిగినదంతా వివేక్ చెప్పడంతో అందరూ ఆశ్చర్యంగా ముఖముఖాలు చూసుకున్నారు. అక్కడ పరిస్థితి ఎలా ఉందో, అందరూ ఏం కోరుకుంటున్నారో చెప్పి, కాసేపు గట్టిగా కళ్ళు మూసుకున్నాడు వివేక్..

ఇక లోపల దాక్కోలేం అన్నట్లు కన్నీటి బొట్లు మూసిన కనురెప్పల కింద నుండి.. జారసాగాయి..

బాధగా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. గభాలున దగ్గరకు వెళ్ళి “వివేక్!.. నువ్వెంత నలిగిపోతున్నావో అర్థమయింది.. విధి జీవితాలతో ఎందుకు ఆడుకుంటుందో నాకైతే అర్థం కావడం లేదు..”

“అసలు ప్రేమ అన్నది మనసులో start కాకుండానే ఉండాలిగాని, ఒకసారి start అయినాక మనసంతా అల్లుకుపోతుంది.”

“ప్రేమ ఎంత మంచి ఫీలింగ్స్ ఇస్తుందో, ఫెయిల్ అయితే డబుల్ హెల్ కనబడుతుంది.. అందుకే పాపం దివ్య..” అని సునీల్ అంటుండగానే కంగారుగా అంది రాధిక..

“వివేక్!.. సారీ!.. అసలు situation ఇంతలా మారిపోతుందని ఎవరు మాత్రం ఊహించగలరు?.. మమ్ములను ఇంటికి రమ్మంటవా?.. అమృత ఒక్కర్తి బోరు ఫీలవుతుందో?..” అని రాధిక అనగానే..

“నో.. నో.. అస్సలు ఎవరు రావద్దు.. ఎందుకు ఇలా చెబుతున్నానంటే అమ్మూ.. అమ్మూ.. ఒంటరిగా ఉండడానికే ఎక్కువ ఇష్టపడుతుంది. ఒకటికి పదిసార్లు ఆలోచించి నాతో మాట్లాడుతుంది. తను బాగా disturb moodలో ఉంది..” అని..“దివ్య!.. ఎక్కడికి వెళ్ళింది?.. ఫోను చేస్తే లిఫ్ట్ చేయడం లేదు” అన్నాడు వివేక్.

గభాలున అంది రాధిక.. “నిన్ననే తెలిసింది తాతగారికి ఫోన్ చేస్తే పిన్నికి health బాగోలేదని, నాలుగురోజులు ఉండి వస్తానని నాతో చెప్పింది..”

“అలానా?.. సరే!.. తను ఎంత Upset అవుతుందో, ఏమవుతుందో అని చాలా కంగారు పడుతున్నాను. పరిస్థితి నా చెయ్యి దాటిపోయింది.. ఏం చేయలేని అసమర్థుడిగా మిగిలిపోయాను” అన్నాడు బాధగా వివేక్.

“వివేక్!.. ఇంకెప్పుడూ అలా అనుకోకు.. నువ్వే కాదు, నేనే కాదు.. ఎవరైనా సరే.. పరిస్థితులకు తల వంచవలసిందే!..” అంది రాధిక.

“ఒకసారి డీన్‌‍ని కలిసి వస్తాను..” అని వివేక్ వెళ్ళడంతో..

“ఏంటి రాధికా!.. నీ బెస్ట్ ఫ్రెండ్ దివ్యని మరిచిపోయావా.. వివేక్‍ని సపోర్టు చేస్తున్నావు.. అఫ్‌కోర్సు.. వివేక్.. very nice guy..” అని సునీల్ అంటుండగానే..

“ఇలాంటి సమయంలో వివేక్‌ని.. ఇంకా.. ఇంకా.. సపోర్టు చేయాలి.. సపోర్టు చేస్తాను.. ఎందుకంటే.. ప్రేమ కన్నా.. పెంచి పెద్ద చేసిన రక్త సంబంధం.. మేనమామ మఖ్యమని ఈ పని చేసాడు.. బాధ తను పడుతున్నాడు.. సంతోషాన్ని వాళ్ళకిచ్చాడు.. ఇంతకన్నా గొప్ప వ్యక్తి ఎవరుంటాడు?.. ఈ మాటలే దివ్యకి చెబుతాను.. వివేక్ మోసం చేయలేదు దివ్యని.. ఇంకా ప్రేమిస్తున్నాడు.. కాని పరిస్థితులు.. వివేక్‍ని అలా చేసేలా చేసాయి.. మనం మనుషులం!.. సపోజ్! నువ్వు ఉన్నావు.. ఫేస్‍బుక్ అమ్మాయిని లవ్ చేస్తున్నావు.. ఆ అమ్మాయి కూడా నిన్ను లైక్ చేస్తుందని.. లవ్ ప్రపోజ్ చేయాలనుకున్నావు. కాని ఏమయిందో తెలియదు.. ఆ అమ్మాయి ఫేస్‍బుక్‍లో తన ప్రొఫైల్ డీలీట్ చేసింది.. కారణం ఏదైనా కావచ్చు. ఆ కారణాన్ని accept చేయాలి. అంతే కాని అనవసరంగా తన కోసం పిచ్చెక్కిపోవు కదా” అంది రాధిక.

“తను నాకు దూరం అయితే ఖచ్చితంగా పిచ్చెక్కుతాను. ఇప్పటికే సగం ఎక్కాను.. అయినా.. ప్రేమలో పడని నువ్వు.. ఇలా కాకపోతే.. ఇంకెలా మాట్లాడుతావు?.. ఒక్కసారి మనస్ఫూర్తిగా ఎవరినైనా ప్రేమించి చూడు.. అప్పటి వరకు.. నువ్వు ఇలాంటి ఉచిత సలహాలివ్వక” అన్నాడు కొంచం కోపంగానే సునీల్..

***

“అమ్మూ!.. అమ్మూ!.. నిన్నే.. లే.. టైమ్ ఎంత అయిందో తెలుసా?.. నైన్ దాటిపోయింది.. డిన్నర్ చేద్దాం” అని బెడ్ దగ్గరకు వెళ్ళి పిలిచాడు వివేక్..

ప్రక్కకు తిరిగి ఆదమరిచి నిద్రపోతుంది.. తిరగవేసి ఉన్న ఫోటో మీద కుడి చెయ్యి వేసి ఉంది. ఎవరిది ఫోటో? అని గభాలున వంగి చేతికింద నుండి ఫోటో తీసి షాకయ్యాడు వివేక్..

నారాయణరావు ఫోటో!.. నవ్వుతూ ఉన్న ఫోటో!..

వృద్ధుల కోసం తన సొంత డబ్బుతో ఆశ్రమం నిర్మించి ఎందరో వృద్ధులకు ఆసరాగా నిలిచిన నారాయణరావుగారి గురించి ఆర్టికల్ వచ్చినప్పుడు తీసిన ఫోటో!..

పసిపిల్లవాడి స్వచ్ఛమైన నవ్వులా నారాయణరావు నవ్వు ఉందని, ‘మా నాన్న హీరో’ అని ఆ ఫోటో ఎన్నో సార్లు చూసి మురిసిపోయేది. ఆ ఫోటో తెచ్చుకుంది అమ్ములు..

గభాలున నిద్రలో నుండి అటు నుండి ఇటు తిరగడం చూసి కంగారుగా “అమ్ములూ!.. లే!..” అని చిన్నగా భుజం మీద తట్టాడు..

“నాన్నా!.. వస్తున్నాను..” అని కంగారుగా లేచి కూర్చోని చుట్టూ చూడసాగింది అమృత..

“అమ్మూ!.. నువ్వు USAలో ఉన్నావు.. ఇండియాలో కాదు..” అన్నాడు వివేక్..

గభాలున మంచం దిగి.. గట్టిగా కళ్ళు మూసుకొని తెరిచి, “మామూ!.. నాన్నని చూడాలనిపిస్తుంది.. అనవసరంగా వచ్చాననిపిస్తుంది.. ఉన్నన్నాళ్ళు.. నాన్నని చూస్తూ.. కబుర్లు చెబుతూ ఉండవలసింది..” అంది..

“ప్చ్!.. అమ్మూ!.. ఒక్కటి మరిచిపోతున్నావు.. ఎప్పటిలా మామయ్య ఉంటే.. నేనే నిన్ను ఇక్కడకు తీసుకురాకపోదును.. ఎలాంటి పరిస్థితిలో మావయ్య ఉన్నాడో నీకు తెలుసు.. మావయ్య కోరిక తెలుసు. నువ్వక్కడ ఉంటే.. అక్కడ జరిగే పరిణామాలు.. అన్నీ నిన్ను బాధపెడతాయే తప్ప.. నిన్ను.. నిన్నుగా ఉండనివ్వవు.. నీ క్షేమం, ఆరోగ్యం.. నాకు ముఖ్యం.. చిన్నప్పటి నిండి నిన్ను జాగ్రత్తగా చూసుకుంటూ, నీ చుట్టూ ఒక రక్షక కవచంలా ఉన్నాను.. ఇప్పుడు నిన్ను అక్కడ ఎలా వదిలేస్తాను చెప్పు? పద పద డిన్నర్ చేద్దాం” అన్నాడు వివేక్.

మౌనంగా వివేక్ వెనకాలే అడుగులు వేసింది అమృత.

మౌనంగా తలదించుకొని తింటున్న అమృతని చూసి ఏదో మాట్లాడాలన్నట్లు అన్నాడు వివేక్..

“అమ్మూ!.. వీకెండ్ కదా?.. ఎక్కడికైనా వెళదామా?”

గభాలున అంది “ఎక్కడికి?”

“ఎక్కడికి అంటే.. ఎక్కడికో ఒక చోటకి..”

“అక్కడికి వెళితే మనం.. హేపీగా ఉండగలమా? ”

కంగారుగా చూసాడు వివేక్..

“ప్చ్! చెప్పలేవు.. వీ.వి.. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా.. మన మనసులు ఇలానే ఉంటాయి.. నాన్న గుర్తురాక మానడు.. మన ప్రోబ్లమ్.. మనతోనే ఉంటుంది.. ఇక దేనికని బయటకు వెళ్ళడం?..”

“అమ్మూ! నువ్వలా మాట్లాడితే ఎలాగు?.. ”

“పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఏ మనిషైనా బ్రతకగలడు!.. అనుకూలంగా లేనప్పుడే మనిషి ఎలా ఎదుర్కొన్నాడన్నదే మనం చూడాలి.”

“సృష్టిలో ఏ మనిషైనా ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేయక తప్పదు..” అని వివేక్ అంటుండగానే..

“ప్చ్!.. ఏమో!.. మామూ!.. ఒక్కటి మాత్రం చెప్పగలను.. నీ అంత సహనం, ఓర్పు.. నాకు లేవు..” అని గభాలున లేచి వెళ్ళబోతున్న అమృత చెయ్యి గట్టిగా పట్టుకొని.. “అమ్మూ!.. నీతో మాట్లాడాలి కాసేపు హాలులో కూర్చుందాం” అన్నాడు..

తన చెయ్యి ఇంకా వివేక్ చేతిలోనే ఉండడం చూసి, “మామూ!.. నా చెయ్యి వదలు..” అంది.

కంగారుగా చెయ్యి వదిలాడు.

“నాకు నిద్ర వస్తుంది.. పడకుంటాను” అని గబగబా గదిలోకి వెళ్ళి తలుపు దగ్గరగా వేసింది అమృత.

ఒక్క నిముషం ఆలోచనలో పడ్డాడు వివేక్..

‘అమ్ముని – జరిగిన సంఘటనల నుండి కనీసం కొంత వరకైనా దూరం చేద్దామని.. అలా అన్నాడు.. తాను ఏమైనా పసిపాప నమ్మడానికి.. పాపం అమ్మూ!’ అని వెళ్ళి గదిలో పడుకున్నాడు వివేక్..

అర్ధరాత్రి అవతుండగా, బలవంతంగా ఆలోచనలకి స్వస్తి చెప్పి నిద్రకుపక్రమించాడు వివేక్..

నిద్దట్లో ప్రక్కకు తిరిగి పడుకున్న వివేక్ చేతికి ఎవరో ప్రక్కన ఉన్నట్టు అనిపించి కంగారుగా లేచి కూర్చొని సెల్ లైట్ లో చూసి ఆశ్చర్యపోయాడు..

అమ్మూ.. అమ్మూ.. ఇక్కడ పడుకుంది ఏమిటి? ఎప్పుడు వచ్చింది?..వివేక్ ఆలోచనలో ఉండగానే..

“మామూ!.. సారీ!.. నాకు భయంకరమైన కల వచ్చింది. నాన్న.. నాన్న.. నారాయణకి.. సీరియస్ అయి..” అని గభాలున మంచం మీద కూర్చొని.. ఏడ్వటం మొదలు పెట్టింది.

“అమ్మూ!.. అమ్మూ.. అర్ధం అయింది.. నాన్నకి.. మావయ్యకి ఏం కాదు..”

“నువ్వు.. నువ్వు.. అలాగే చెబుతావు..” అంది వెక్కిళ్ళు పడుతూ.. అమృత ఏడ్వసాగింది.

గభాలున లేచి లైట్ వేసి గోడనున్న వాచీ పై చూసాడు.

ఐదు కావస్తోంది.. గభాలున ఇండియాకి ఫోను చేసాడు వివేక్!..

“నాన్నా!.. వివేక్!.. ఎలా ఉన్నారు?.. ఎప్పుడు లేనిది ఈ వేళప్పడు ఫోను చేసావు ఏమిటి?.. చెప్పు వివేక్?..” కంగారుగా అంది శారద.

“అమ్మా!.. అనవసరంగా కంగారు పడకు.. ఎందుకో తెలియదు.. ఇద్దరికీ నిద్ర పట్టలేదు.. సరే.. అని మీకు ఫోను చేసాను.. అన్నట్లు మావయ్యతో ఒకసారి మాట్లాడాలి.. వీలవుతుందా?” అన్నాడు.

“ఇప్పటి వరకు అన్నయ్య మీ కబుర్లే.. మీ పెళ్ళి గురించి, arrangements గురించి.. అబ్బో.. ఎన్ని కబుర్లో.. ఒక్క నిమిషం ఫోను ఇస్తున్నాను” అని, ఫోను నారాయణరావు చేతికిచ్చి, “అన్నయ్యా!.. వివేక్.. మాటాడు.” అంది.

“వివేక్ బాబా? ఎలా ఉన్నావు?” అని నారాయణరావు అంటుండగానే స్పీకర్ ఆన్ చేసాడు వివేక్.

“బాగున్నాను మావయ్యా.. నీకెలా ఉంది ఆరోగ్యం? .. మెడిసిన్స్ కరక్ట్ టైమ్‌కి వేసుకుంటున్నావు కదా?” అన్నాడు.

“నేనెలా మరిచిపోతాను.. నేనెంత తొందరగా కోలుకుంటే అంత తొందరగా పెళ్ళి పనులు మొదలు పెట్టాలి కదా?” అన్నాడు నారాయణరావు.

గభాలున పొలమారింది వివేక్‌కి.. కంగారుగా చూసింది అమృత..

“వివేక్ బాబూ!.. ఇంతకీ నా బంగారు తల్లి ఎలాగుంది?.. చిన్నప్పుడే కాదు.. ఇప్పుడు కూడ నిన్ను మూడు చెరువుల నీళ్ళు తాగిస్తుండి ఉంటుంది.. ఎందుకంటే మేమెవరం అక్కడ లేము కదా?” అన్నాడు చిన్నగా నవ్వుతూ నారాయణరావు..

“నాన్నా!.. నేను ఇక్కడే ఉన్నాను. వీ.వి.ని నేనేం కష్టపెట్టడం లేదు.. వంట నేనే చేస్తున్నాను. అన్ని పనులు నేనే చేస్తున్నాను..” అంది కోపంగా అమృత..

“అమ్మూ తల్లి!.. బంగారం.. సారీ అమ్మూ.. మాము దగ్గర నీకు చనువు ఎక్కువ కదా?.. ఆ ఉద్దేశంతో అలా అన్నాను.. ఒకసారి వివేక్ బాబుకి ఫోను ఇయ్యి?” అని.. “వివేక్ బాబూ!.. నువ్వు అర్జంటుగా వీసా పంపిస్తే.. మీ అమ్మగాని, సుమిత్రగాని అక్కడకు వస్తారు.. నా చిట్టి తల్లి పని చేయడం ఏమిటి?” అని నారాయణరావు అంటుండగానే చిరుకోపంతో అంది అమృత..

“నేను ఇంకా చిట్టి తల్లిని కాదు నాన్నా.. పెద్దదాన్ని అయిపోయాను అని అనేకదా పెళ్ళి కూడా నిశ్చయం చేసారు.”

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here