[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
బహుముఖ ప్రజ్ఞాశాలి కె. ఎ. అబ్బాస్:
ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ – ఈ పేరు వినగానే సాధారణ సినీ అభిమానుల మనసులో రెండు విషయాలు మెదలుతాయి. ఒకటి – రాజ్ కపూర్ సినిమాలకు కథ/స్క్రీన్‍ప్లే రచయిత; రెండు – స్టార్ ఆఫ్ ది మిలీనియం – అమితాబ్ బచ్చన్‍ను సినీరంగానికి పరిచయం చేసిన దర్శకులు.
సినీరంగంలోకి రాకముందే ఆయన ప్రసిద్ధ రచయిత. 74 పుస్తకాలు, 90కి పైగా కథలు, 3000 వ్యాసాలు రచించారు. 40 సినిమాలు తీశారు, ఎన్నో నాటకాలకు దర్శకత్వం వహించారు. విస్తారంగా రాశారు, పురోగమనవాదంతో రాశారు.
1950లు, 60లు, 70లలో కన్నా కె. ఎ. అబ్బాస్ ప్రాసంగికత నేడే ఎక్కువ. సినిమా కోసం, దినపత్రికల కోసం, జర్నల్స్ కోసం విస్తృతంగా రాశారు. కథలు, నవలలు, నాటకాలు రాశారు. ఉర్దూ లోనూ, ఇంగ్లీషులోనూ సమానమైన ప్రతిభతో అలవోకగా రాశారు. ఆయన పక్కనే ఓ హిందీ టైపిస్ట్ కూర్చునేవారు, ఆయన చెప్తున్నది వెనువెంటనే టైప్ చేసేవారట.
వీరి కుటుంబం పానిపట్‍కు చెందినది. ప్రసిద్ధ ఉర్దూ కవి, మీర్జా గాలీబ్ శిష్యుడు అయిన ఖ్వాజా అల్తాఫ్ హుస్సేన్ వీరి పూర్వీకులు. అబ్బాస్ గారి తాతగారు ఖ్వాజా గులామ్ అబ్బాస్ 1857 ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నారు. బ్రిటీష్ వారికి దొరికిపోగా, ఆయనకు మరణశిక్ష విధించారు. పానిపట్ యొక్క తొలి అమరుడు ఆయన.
అబ్బాస్ తండ్రి ఖ్వాజా గులామ్-ఉస్-సిబ్‍తియన్, ఆలీఘర్ ముస్లిం యూనివర్శిటీ తొలి గ్రాడ్యుయేట్‍లలో ఒకరు. ఓ యువరాజుకి ట్యూషన్ చెప్పారు. యునానీ ఔషధాలను ఆధునికరీంచి విక్రయించిన వ్యాపారవేత్త కూడా. అబ్బాస్ తల్లి – మస్రూరా ఖాతుమ్ – హాలీ కుమారుడైన ఖ్వాజా సజ్జద్ హుస్సేన్ కుమార్తె. ఆయనకి స్త్రీ విద్యపై గొప్ప విశ్వాసం. పానిపట్‍లో ఆడపిల్లల కోసం మొదటి పాఠశాలను స్థాపించారు.
అబ్బాస్ విద్యాభ్యాసం పానిపట్ లోని హాలీ ముస్లిం హైస్కూల్‍లో జరిగింది. ఆ పాఠశాల కూడా వారి మాతామహులు స్థాపించినదే. అబ్బాస్ వంశవృక్షానికి ఘనమైన చరిత్ర ఉంది. వారి పూర్వీకు ఖ్వాజా ఆయూబ్ అన్సారీ – మెక్కా నుంచి మదీనాకి యాత్ర చేసిన మహ్మద్ ప్రవక్తకి, ఆయన బృందానికి ఆతిథ్యం ఇచ్చిన ఘనత ఉంది.
11 ఏళ్ళ వయసులో అబ్బాస్ వ్రాసిన తొలి రచన లాహోర్ నుంచి వెలువడే ‘ఫూల్’ అనే పిల్లల పత్రికలో 1925లో ప్రచురితమైంది. 15 ఏళ్ళ వయసుకి ఆయన మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. ఇంగ్లీషు లిటరేచర్‍తో బిఎ డిగ్రీని 1933లో పూర్తి చేశారు. 1935లో ఆలీఘర్ ముస్లిం యూనివర్శిటీ నుంచి ఎల్.ఎల్.బి. పట్టా పొందారు.
యువ విలేఖరిగా అబ్బాస్ ఢిల్లీకి చెందిన ‘నేషనల్ కాల్’ అనే పత్రికలో చేరారు. ఎల్.ఎల్.బి. చదువుతుండగా 1934లో ఆయన ‘ఆలీఘర్ ఒపీనియన్’ అనే విద్యార్థి పత్రికని నడిపారు. స్వాతంత్ర్యానికి పూర్వం నడిచిన తొలి విశ్వవిద్యాలయ విద్యార్థుల పత్రిక ఇది.
1935-1939 వరకు అబ్బాస్ బాంబే క్రానికల్ పత్రికలో సబ్ ఎడిటర్/రిపోర్టర్‍గా పని చేశారు. 1939 నుంచి 1940 వరకు ఫిల్మ్ క్రిటిక్‍గాను; 1940 నుంచి 1947 వరకు సంపాదకుడిగానూ వ్యవహరించారు. బాంబే క్రానికల్ పత్రికలో ఉన్న సమయంలో (1935-47) ఆయన ‘లాస్ట్ పేజ్’ అనే కాలమ్ నిర్వహించారు (ఉర్దూ, హిందీ ఎడిషన్‍లలో – ఆజాద్ క్వాలమ్ – పేరిట). అయితే ఈ పత్రిక మూతబడ్డాకా, ఆయన బ్లిట్జ్‌లో చేరినా, అక్కడా ఈ కాలమ్‍ని కొనసాగించారు. ఆయన చివరి రోజుల వరకూ ఈ శీర్షిక నడిచింది.
1936లో బాంబే టాకీస్ వారి కోసం పార్ట్-టైమ్ పబ్లిసిస్ట్‌గా అబ్బాస్ గారు సినీ రంగ ప్రవేశం చేశారు. ఈ సంస్థ హిమాంశు రాయ్, దేవికా రాణి గారిది. తన మొదటి స్క్రీన్ ప్లే ‘నయా సంసార్’ (1941)ని అబ్బాస్ వారికి విక్రయించారు. 1951లో ఆయన తన సొంత నిర్మాణ సంస్థని స్థాపించి దానికి ‘నయా సంసార్’ అని పేరు పెట్టారు. ఈ సంస్థ – షహర్ ఔర్ సప్నా, అన్‍హోనీ, మున్నా, రాహి, సాత్ హిందూస్థానీ వంటి ఎన్నో సామాజిక చిత్రాలను నిర్మించింది. ఈ తరం వారికి అబ్బాస్ గారు అమితాబ్ బచ్చన్‍కి తొలుత గుర్తించిన వ్యక్తిగా గుర్తుంటారు.
అబ్బాస్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘ధర్తీ కా లాల్’. ఈ చిత్రాన్ని ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ (ఐపిటిఎ) బ్యానర్ పై నిర్మించారు. 1949లో ఈ చిత్రం అప్పటి యు.ఎస్.ఎస్.ఆర్.లో విస్తృతంగా ప్రదర్శితమైన చిత్రమైంది.
‘అన్‍హోనీ’ చిత్రం అబ్బాస్ గారి నయా సంసార్ సంస్థ నిర్మించిన తొలి చిత్రం, అంతే కాదు, నర్గీస్ ద్విపాత్రిభినయం చేసిన తొలి చిత్రం కూడా. మున్నా (1954) పాటలు లేని మొదటి సినిమా.
‘ధర్తీ కా లాల్’ చిత్రం సత్యజిత్ రే గారి ‘పథేర్ పాంచాలి’ (1955) కంటే దాదాపు దశాబ్దం ముందరి సినిమా. పరదేశి (1957) ఒక విదేశీ సినీ సంస్థ (మాజ్‍ఫిల్మ్స్)తో సహ-నిర్మాణం జరుపుకున్న సినిమా. ఓ సినీ రచయితగా అబ్బాస్‌ను సమాంతర చిత్రాలు లేదా నియో-రియలిస్టిక్ సినిమాల అగ్రగామిగా భావిస్తారు. ఆయన ఇతర దర్శకుల కోసం స్క్రిప్ట్స్ వ్రాశారు – చేతన్ ఆనంద్ కోసం ‘నీచా నగర్’ (కాన్స్ ఫిలిం ఫెస్టివల్‍లో Palme d’Or పురస్కారం విజేత); వి. శాంతారామ్ గారికి ‘డా. కోట్నీస్ కీ అమర్ కహానీ’ ఇందుకు ఉదాహరణలు. ఆయన రాజ్ కపూర్ గారి పలు సినిమాలకు – ఆవారా, శ్రీ 420, మేరా నామ్ జోకర్, బాబీ, హెన్నా వంటి సినిమాలకు స్క్రిప్ట్స్ ఇచ్చారు.
సాహిత్య కృషి:
అబ్బాస్ గారు 74 పుస్తకాలు, 90కి పైగా కథలు, 3000 వ్యాసాలు రచించారు. స్వాతంత్ర్య పోరాటం పై ఆయన రచించిన చారిత్రిక నవల ‘ఇంక్విలాబ్’ ఆయనకెంతో పేరు తెచ్చింది. ఆశ్చర్యకరంగా ఈ నవల Sen Indie (Son of India) పేరుతో రష్యన్ భాషలోకి అనువాదమై అక్కడ ఘన విజయం సాధించించి. 1955లో ఈ పుస్తకం రష్యాలో ప్రచురితమైనప్పుడు దాదాపు 90,000 కాపీలు అమ్ముడుపోయింది. మరో ఏడాది తర్వాత జర్మన్ ఎడిషన్ విఢుదలై అక్కడా విజయం సాధించింది. ఆ తరువాతే బొంబాయిలోని ప్రచురణకర్త దానిని ఆంగ్లంలో ప్రచురించేందుకు అంగీకరించారు. 1956లో దాదాపు 60 పేజీలకు కుదించిన ఇంగ్లీషు ప్రతిని, అబ్బాస్‍కి రూ. 750/- రాయల్టీగా చెల్లించి విడుదల చేశారు. ఆ డబ్బులు ఆయన టైపిస్ట్ ఖర్చులకి సరిపోయాయి. ఆయన బావగారు మునీష్ నారాయణ్ సక్సేనా ఈ పుస్తకాన్ని హిందీలోకి తెచ్చారు. 1975లో తనకి 61 ఏళ్ళ వయసులో అబ్బాస్ ఈ పుస్తకాన్ని తానే ప్రచురించుకున్నారు. 1982లో ఆయన ‘వరల్డ్ ఈజ్ మై విలేజ్’ రాశారు, ఆయన అభిప్రాయంలో ఇది ‘ఇంక్విలాబ్’కి సీక్వెల్.
ఉర్దూ కథాసాహిత్యానికి ఆయనని దీపధారిగా భావిస్తారు. తనకి 21 ఏళ్ళ వయసులో 1935లో ‘అబాబీల్’ (పిచుకలు) అనే కథ వ్రాశారు. పశ్చిమ జర్మనీలో రూపొందిన ‘ప్రపంచపు ఉత్తమ 100 కథలు’ అనే పుస్తకంలో ఈ కథని చేర్చారు. ఆయన ఎన్నో ఇతర రచనలలానే ఈ కథ కూడా పలు భారతీయ భాషలలోకి, రష్యన్, చైనీస్, జర్మన్, ఫ్రెంచ్, స్వీడిష్, అరబిక్ వంటి విదేశీ భాషలలోకి అనువాదమైంది.
తన సమకాలికులైన సాదత్ హసన్ మంటో, క్రిషన్ చందర్, ఇస్మత్ చుగ్తాయ్, అహ్మద్ నసీం కాస్మీ, రాజీందర్ సింగ్ బేడీ వంటి వారి రచనల సరసన అబ్బాస్ గారి కథలు కూడా పలు సంకలనాలలో చోటు సంపాదించాయి. ఆయన కథలు కూడా ఆయన సమకాలికుల కథల వలె వివాదాలతో ముడిపడి ఉండేవి. ‘ఏక్ ఇన్సాన్ కీ మౌత్’ ప్రచురితమైన తొలి సారి మాత్రమే కాకుండా, పత్రికలలో పునర్ముద్రితమైన ప్రతీ సారి వివాదాలకు కారణమయింది. అది ‘సర్దార్జీ’ అనే పేరుతో ప్రచురితమై, సిక్కుల ఆగ్రహాన్ని చవిచూసింది. అబ్బాస్ అలహాబాద్ హైకోర్టుకు హాజరవవలసి వచ్చింది. తరువాత దాన్ని కుష్వంత్ సింగ్ ‘ది డెత్ ఆఫ్ షేక్ బర్హానుద్దీన్’ పేరుతో అనువదించారు. ఏ పంజాబీ కథల సంకలనమైనా ఈ వివాదాస్పద కథ లేనిదే పరిపూర్ణం కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కథ పూర్తిగా ఉర్దూలో రాయబడడం మరో విశేషం!
అబ్బాస్ – సాహిత్య, సాహిత్యేతర రంగాలలోని ప్రముఖులను ఇంటర్వ్యూలు చేశారు. అప్పటి రష్యన్ ప్రధాని నికిత కృశ్చేవ్, అమెరికా అధ్యక్షుడు థియోడర్ రూజ్‍వెల్ట్, చార్లీ చాప్లిన్, మావో, యూరి గగారిన్ వంటి వారు ఈ జాబితాలో ఉన్నారు. ఇందిరా గాంధీ జీవితగాథని తొలిసారి రాసినది అబ్బాస్ గారే. వాస్తవానికి ఇందిర జీవితంపై మూడు జీవిత గాథలు – ది రిటర్న్ ఆఫ్ రెడ్ రోజ్ (1966), దట్ ఉమన్: హర్ సెవెన్ ఇయర్స్ ఇన్ పవర్ (1973), ఇందిరా గాంధీ: ది లాస్ట్ పోస్ట్ (1975) – ఆయనే రాశారు. నికిత కృశ్చేవ్, యూరి గగారిన్‌ల జీవితగాథలు కూడా ఆయన వ్రాశారు. ఆయన ఆత్మకథ ‘ఐయామ్ నాట్ యాన్ ఐలాండ్’, ఇతర నవలలు పలు భారతీయ భాషలలోనూ, యూరోపియన్ భాషలలోనూ అనువాదమై ప్రపంచవ్యాప్తంగా పాఠకాదరణను పొందాయి.
ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్, ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్‍లతో సంబంధాలు:
అబ్బాస్ తొలి కెరీర్ పురోగమనవాద సంస్కృతి కాలం నాటిది. ఇది భారతదేశంలో 1930, 40, 50 వ దశాబ్దాలలో వర్ధిల్లింది. తన సమకాలీనులలో చాలామంది లానే అబ్బాస్ కూడా 1936లో స్థాపితమైన ‘ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్’ (AIPWA) వ్యవస్థాపకులలో ఒకరు. అలాగే 1943లో ఏర్పాటయిన దాని రంగస్థల సంస్థ అయిన ‘ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్’ (IPTA) స్థాపకులలో ఒకరు. PWA, IPTA ప్రముఖులలో ఒకరైన అబ్బాస్ ‘ధర్తీ కే లాల్’ సినిమాకి దర్శకత్వం వహించడంలో ఆశ్చర్యం లేదు. ఈ సినిమాకి పని చేసిన ఎక్కువ మంది నటీనటులు కూడా IPTAకి చెందినవారే. అది IPTA నిర్మించిన మొదటి చిత్రం కూడా. ఆ శతాబ్దంలోని ఉత్తమ హిందీ చిత్రాలలో ఒకటిగా నిలిచి ఉంది. IPTA నాటకం ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం – బెంగాల్ క్షామం నేపథ్యంలో గ్రామీణ ఋణగ్రస్థత, చెల్లాచెదురైన రైతాంగం జీవితాలపై తీసిన తొలి వాస్తవికవాద చిత్రం. జోహ్రా సెహగల్‍కి ఇది తొలి చిత్రం కాగా, నటులు బల్‍రాజ్ సాహ్నికి మొదటిసారిగా ముఖ్యమైన పాత్ర లభించిన చిత్రం.
అబ్బాస్ IPTA కోసం ‘యే అమృత్ హై’ అనే అరగంట నాటిక వ్రాసారు. దీనిలో ఓ శాస్త్రవేత్త అమృతం కనుగొంటాడు. అప్పుడు సమాజంలో పలువర్గాల ప్రతినిధులు ఆయనని కలుస్తారు. వారిలో సామ్యాజ్యవాది, పెట్టుబడిదారుడు, క్షీణిస్తున్న కవి, సామాజికుడు, మతాభిమాని, నియంత ఉంటారు. కానీ అతను మాత్రం అమృతాన్ని ఓ శ్రామికుడికి ఇవ్వబోతాడు. అయితే తాను ఇప్పటికే అమరుడనని ఆ శ్రామికుడు తిరస్కరిస్తాడు. ఈ నాటిక అమిత ఆదరణ పొందడంతో పూర్తి స్థాయి నాటకంగా రాయమని అబ్బాస్‍పై ఒత్తిడి పెరిగింది. ఈ రకంగా ఆయన ‘జుబైదా’ అనే పూర్తి స్థాయి నాటకం రచించారు. బొంబాయిలోని దేవధర్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ బేస్‌మెంట్ హాల్లోని IPTA రిహార్సల్స్ గదిలో అబ్బాస్ ఈ నాటకాన్ని చదివి వినిపించారు. బల్‌రాజ్ సాహ్ని (1943లో ఆయన ఈ నాటకానికి దర్శకత్వం వహించారు), దమయంతి సాహ్ని, చేతన్ ఆనంద్, దేవ్ ఆనంద్ మున్నగు వారు అప్పుడు ఈ నాటకాన్ని విన్నారు. ఈ నాటకంలోని ముసలి మీర్ సాహెబ్ పాత్రను ధరించేందుకు ముందుకు వచ్చారు అబ్బాస్.
అబ్బాస్ 1 జూన్ 1987న మృతి చెందారు. దాదాపుగా అర్ధ శతాబ్దం పాటు కొనసాగిన కెరీర్ ఆయనది. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై గొప్ప వక్తగా వ్యవహరించారు. ఉన్నత విలువలతో, ఆదర్శాలతో జీవించారు. తమ మేధని సామాన్య, చదువులేని ప్రజల శ్రేయస్సుకి వినియోగించాలని తపించారు. ఎంతో శ్రమించారు. వయసు పెరిగిన కొద్దీ ఆయన ఓ సంస్థలా ఎదిగారు.
నిజానికి ఆయన ఆరోగ్యం 1960లలోనే – మొదటిసారి గుండెపోటు వచ్చినప్పటిని నుంచి క్షీణించింది. అయితే ప్రాణాపాయానికి దారి తీసినది మాత్రం విమానాశ్రయంలో జరిగిన ఓ దుర్ఘటన. ఓ మహిళ లాక్కువెళ్తున్న లగేజ్ ట్రాలీ ఆయన పాదం మీద నుంచి వెళ్ళింది. ఆయన కూలబడిపోయి, బాధతో విలవిలలాడుతుండగా, ఆ మహిళ క్షమాపణలు చెప్పి అక్కడి నుంచి జారుకుంది. అదే ఆయన చరమదశకి ఆరంభం. అప్పడు ఆసుపత్రిలో చేరడం మొదలు, ఎన్నో సార్లు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఆయన చివరి సమావేశానికి – ప్రొడ్యూసర్స్ గిల్డ్ మీటింగ్‌కి – కూడా ఆసుపత్రి నుంచే చక్రాల కుర్చీలో హాజరయ్యారు. ఆసుపత్రి నుంచే నేరుగా కుర్తాపైజామాలో టాక్సీ దిగిన ఆయనని చూసి అందరూ విస్తుపోయారు. ఈ గిల్డ్‌లో ఆయన క్రియాశీలక సభ్యులు, ఒకసారి అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు.
తాను చనిపోవడానికి కొద్ది రోజుల ముందు వరకూ కూడా – తన ఆత్మకథ ఆధారంగా తీస్తున్న ‘ఏక్ ఆద్మీ’ అనే సినిమా షూటింగ్ జరిపారు. అది ఆయన మరణానంతరం 1988లో విడుదలయింది. ఈ సినిమాకి కావల్సినంత డబ్బు సమకూరకపోవడంతో – ఆయన తన బంధువులందరికీ ఉత్తరాలు వ్రాసి నిధులు అడిగారు (నేటి క్రౌడ్ ఫండింగ్ లాగా). వీలైనంత త్వరగా అప్పులు తీర్చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన తన రాజకీయ, సామాజిక విలువలతో ఎన్నడూ రాజీ పడలేదు, వాటికోసం జీవితాంతం పోరాడారు. “వాణిజ్యపరమైన పరాజయాలు ఎదురైనా నా ప్రేరణ నిలిచే ఉంటుంది. వీలైనంత వరకూ నా ఆలోచనలను జనాలకి వెల్లడిస్తాను” అన్నారాయన ఆసుపత్రి నుంచి సురేహ్ కోహ్లీకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో. ఈ ఇంటర్వ్యూ ఆయన మరణాంతరం ఫిల్మ్‌ఫేర్ పత్రికలో (16-30 జూన్ 1987) ప్రచురితమైంది.
మరణానికి కొన్ని వారాల ముందు ఆయన బ్లిట్స్ సంపాదకులు, వ్యవస్థాపకులు అయిన ఆర్.కె. కరంజియా గారి లీవ్ లెటర్ రాశారు. గత 46 ఏళ్ళుగా విరామం లేకుండా వారం వారం రాసిన తన కాలమ్‍ని రాయలేకపోతున్నానని, సెలవు మంజూరు చేయమని మరణం ఛాయల నుండి వేడుకున్నారు అబ్బాస్. అదీ ఆయన నిబద్ధత!
ఇంటర్వ్యూలలో వెల్లడించిన కొన్ని అభిప్రాయాలు:
“దేనిలోనైనా సర్వప్రథముడిగా ఉండాలని నేను అనుకోను. నా సినిమాల్లోను, నవలలోనూ, కథలలోనూ – రెండో స్థానంలో ఉండడంలో తృప్తి పడతాను. నాకు విశ్రాంతి కల్గించుకోడం కోసం మాధ్యమాన్ని మారుస్తుంటాను. ఒకదానిలో విసుగొస్తే, మరోదానికి మారుతాను.”
(ఆకాశవాణి కోసం వి. పి. సాధేకి ఇచ్చిన ఇంటర్వ్యూ)
~
“ఈ విధంగా రక్తసిక్తమైన చరిత్ర ప్రాంగణంలో ప్రవేశించాం. గతం గురించిన స్పష్టమైన దృక్పథం ఉంటే మన భవిష్యత్తు ఉజ్జ్వలంగా ఉంటుంది. గతం అనేది వర్తమానంలో ఉంటుంది, వర్తమానం భవిష్యత్తులో ఉంటుంది. అంతం, ఆరంభం లేనే లేవు.”
(I Write as I Feel నుంచి)
~
“రాజీ అనేది లేకుండా సామాజిక వాస్తవికవాదంపై నేను మూర్ఖంగా ప్రయోగాలు చేస్తున్నాని కొందరు అంటారు. ‘ప్రజలకి కావల్సింది వారికి ఇవ్వండి’ అని సలహా ఇస్తారు. కానీ నేను మాత్రం నాకు ఏది సంతృప్తినిస్తుందో, నా సామాజిక చైతన్యానికి ఏది మంచిదనిపిస్తోందో దాన్నే చేస్తాను. నేను అమరుడున్నవాలనే భావన నాలో లేదు. నా ప్రతీ సినిమా నిర్మాణాన్ని నేను ఆస్వాదించాను.”
(అబ్బాస్ వ్యక్తిగత ఉత్తరపత్యుత్తరాల నుంచి)
~
“నేను తాజ్ మహల్, అజంతా, అక్రోపోలిస్, పార్థనాన్ చూశాను; కశ్మీరులోని ఖిల్లన్‍మార్గ్‌లో పువ్వులతో నిండిన పచ్చికబయళ్ళని చూశాను. న్యూయార్క్ నగరపు చీకటి వెలుగులు చూశాను, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పైకి ఎక్కాను.
సారనాథ్‍లో బుద్ధుడి ప్రశాంతమైన వదనాన్ని చూశాను, మోనాలిసా విచారకరమైన నవ్వుని తిలకించాను. క్రీస్తు బాధని అనుభవించాను, చాప్లిన్‍ని చూసి నవ్వుకున్నాను. భగత్‍సింగ్‍ని ఉరితీసారన్న వార్త తెల్సినప్పుడు నా తోటి విద్యార్థులతో కలిసి ఏడ్చాను. అలాగే 15 ఆగస్టు 1947 నాడు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సందర్భంగా లక్షలాది మందితో కల్సి బొంబాయి వీధుల్లో నాట్యం చేశాను.
వీటన్నింటికి నేను సాక్షిని, వీటిని అనుభవించాను, అనుభూతి చెందాను. ఇవన్నీ నాలో ఒక భాగమే. నేనూ వాటిలో భాగమే. ప్రపంచం నన్ను తయారు చేసింది, నేను ప్రపంచాన్ని రూపొందించాను (కనీసంలో కొంతలో కొంతైనా), నాలో మానవత్వం భాగం అనే కన్నా, నేను మానవత్వంలో ఓ భాగాన్ని అనుకుంటాను, విత్తు చెట్టు నుంచి వచ్చి, ఆ విత్తు నుంచి చెట్టు వచ్చినట్టు.”
(ఆత్మకథ – I am not an Island నుంచి)
ఆయన జీవితం నుంచి కొన్ని ఉదంతాలు:
- అబ్బాస్ గొప్ప ‘కమ్యూనికేటర్’. తన సందేశాన్ని ప్రసారం చేయడానికి అందుబాటులో ఉన్న మాధ్యమాన్ని ఉపయోగించుకునేవారు. ‘ముఝే కుఛ్ కహనా హై’ అనేది ఆయన ఊతపదం. ఆయన రచనా వ్యాసంగమంతా ఈ లక్ష్యం చుట్టూ తిరిగింది. ఆయన ఎక్కువగా చేత్తోనే రాసేవారు, అప్పుడప్పుడు తన పాత టైప్ రైటర్ మీద రెండు వేళ్ళతో టైప్ చేసేవారు. తన ఉద్దేశాన్ని వెల్లడించే ఆలోచన ఎలా ఉన్నా, దాన్ని సులభంగా వ్యక్తీకరించేవారు. ఆయన రచనలు పాఠకుల కళ్ళు తెరిపించేలా, హృదయానికి తాకేలా ఉండేవి. ఇందుకు అబ్బాస్ వ్రాసిన ‘బంబాయి రాత్ కీ బాహోం మే’ నాటకం గొప్ప ఉదాహరణ. కుళ్ళిన సమాజపు ప్రతినిధులను ఇందులో దర్శింపజేస్తారు. ఆలాగే సామాన్య ప్రజానీకంలో ఆశని నింపుతారు. ఆబ్బాస్‌ని అభిమానించే జవహర్ లాల్ నెహ్రూ గారు – పుస్తకాలు చదివో, ఇతరుల ప్రవచనాలు వినో – సిద్ధాంతాలు ఏర్పర్చుకోవద్దని, ముందుగా దేశమంతా విస్తృతంగా పర్యటించమని సలహా ఇచ్చారు. ఈ సలహా కొత్తదేం కాదు. నాగరికత ఉదయించినప్పటి నుంచి ఎందరో మేధావులైన స్త్రీపురుషులు ఇప్పటికే ఈ సలహానిచ్చి ఉన్నారు. ఈ సలహాని అబ్బాస్ పాటించారు. ప్రపంచంతా విస్తృతంగా పర్యటించారు. ఎన్నో అనుభవాలు మూటగట్టుకున్నారు. అవన్నీ ఆయన రచనల్లో ద్యోతకమయ్యాయి.
- తన సొంత గ్రంథాలయం నుంచి మిత్రులు చెప్పకుండా పుస్తకాలు తీసుకువెళ్ళినప్పుడు – ఆయన నవ్వేసి, “పుస్తకాల చోరీ, దొంగతనమే కాదు” అనేవారు. చాలా ఏళ్ళ తరువాత, తాను రాసిన 73 పుస్తకాల ప్రతుల కోసం వెతుకుతూ, “తన పుస్తకాలు మీ దగ్గర ఉంటే ఇవ్వండి, జిరాక్స్ తీసుకుని ఇస్తాను” అని మిత్రులకు, బంధువులకు రాశారు. కానీ తిరిగి వచ్చిన పుస్తకాలు మూడో నాలుగో, అంతే.
- ఆయనకు వ్యక్తిగత ఆస్తుల పట్ల ఆసక్తి లేదు. అద్దె ఇళ్ళలో నివసించేవారు. ఉదాహరణకు 1952లో తన మొదటి చిత్రం ‘అన్‍హోనీ’ తీస్తున్నప్పుడు – ఆయన తన కజిన్లతో కలిసి నివసించేవారు. ఆ ఇంటి యజమాని తమ ఫ్లాట్ యొక్క పై అంతస్తుని అబ్బాస్ గారికి అమ్మజూపగా, ఆయన తిరస్కరించారట.
- బొంబాయి శివారులో ఉన్న చెంబూరు (రాజ్ కపూర్ స్టూడియోస్ తో సహా ఎన్నో స్టూడియోలకి నెలవు)లో షూటింగ్ జరిపేటప్పుడు, అబ్బాస్, తమ యూనిట్ సిబ్బందితో సమీపంలోని మైదానంలో సాయంత్రం పూట హాకీ ఆడేవారు. ‘నయా సంసార్’ టీం లో కుర్రవాళ్ళు సీనియర్లతో కల్సి ఒకే రకం యూనిఫాం వేసుకుని తిరిగేవారు. ఈ సినిమాకి అబ్బాస్ తొలిసారిగా స్క్రిప్ట్ అందించారు. ఇందులో అశోక్ కుమార్ ఓ విలేఖరిగా నటించారు.
- రాజ్ కపూర్‍కి అబ్బాస్ అంటే గురుభావం. ఎన్నోసార్లు ఆ గౌరవాన్ని వ్యక్తం చేశారు. అబ్బాస్ గురించి రాజ్ కపూర్ చెప్పిన ఈ మాటలు చాలా ప్రసిద్ధమయ్యాయి – “లోగ్ కహ్తే హైఁ ఖ్వాజా ఆజ్మీర్ మే హై, మేరా ఖ్వాజా తో యహాఁ హై” (గురువు ఆజ్మీరులో ఉంటారని జనాలు అంటారు, నా గురువు మాత్రం ఇక్కడే ఉన్నారు!).
- పర్యటించడంలో అబ్బాస్ గారు ఎన్నడూ ఇబ్బంది ఎదుర్కోలేదు. వివిధ దేశాలలో అవసరమయ్యే డబ్బుని ఆయన చట్టబధ్ధంగా ఏర్పాటు చేసుకునేవారు. అయితే సోవియట్ యూనియన్‍లో అమ్మిన ఆయన పుస్తకాలు, ప్రదర్శించిన సినిమాల ద్వారా వచ్చిన డబ్బు వెంటనే ఆయన చేతికి అందలేదు. ఎందుకంటే 1970ల తొలినాళ్ల వరకు రూబుల్ – నియంత్రణలు ఉన్న కరెన్సీ. ఎట్టకేలకు అందిన ఆ డబ్బుతో ఆయన ఫస్ట్ క్లాస్ ఎయిర్ టికెట్లు, బంధుమిత్రులకు కానుకలు కొన్నారు.
- అబ్బాస్ రాజ్ కపూర్ – నర్గీస్‍లతో ‘అన్‍హోనీ’ చిత్రం షూటింగ్ జరుపుతున్నప్పుడు హడ్సన్ కారు కొన్నారు. తర్వాతి కాలంలో పృథ్వీరాజ్ కపూర్ ఆయనకు ఒక అంబాసిడర్ కారు బహుమతిగా ఇచ్చారు. అయినా అబ్బాస్ ప్రజారవాణా సౌకర్యాలను ఇష్టపడేవారు. బొంబాయిలో డబుల్ డెకర్ బస్‍లో పైకిక్కి కూర్చునేవారు. రద్దీగా ఉన్న లోకల్ ట్రైన్‌లో సెకండ్ క్లాస్ బోగీలో తలుపు దగ్గర నిలబడి ప్రయాణించేవారు. టాక్సీలో వెళ్ళాల్సి వస్తే ఆ టాక్సీ ఖర్చుకు న్యాయం చేసేలా – వీలైనన్ని ఎక్కువ పనులు చక్కబెట్టుకువచ్చేవారు. అలాగే తక్కువ దూరాలకి రావడానికి నిరాకరించే డ్రైవర్ల టాక్సీలు ఎక్కేవారు కాదు. అలాగే ఓ సారి తన ఇంటి సమీపంలో బస్ స్టాండ్ వద్ద నిలబడి ఉండగా, దేవ్ ఆనంద్ తన కారులో వెళ్తూ చూసి ఆపి రమ్మన్నారట. అప్పుడు అబ్బాస్ సున్నితంగా తిరస్కరించి, బస్‍లో వెళ్తాలని చెప్పారట. నెహ్రూ మరణ శయ్య పై ఉన్నప్పుడు, అత్యవసరంగా ఓ ఆర్టికల్ రాయడానికి బ్లిట్జ్ సంపాదకులు ఆర్. కె. కరంజియా పిలిచారు. అప్పుడు మాత్రం అబ్బాస్ జుహూ నుంచి సౌత్ బాంబేలో ఉన్న బ్లిట్జ్ ఆఫీసు వరకు టాక్సీలో వెళ్ళారు. ఆయన అప్పుడు వ్రాసిన ఆ వ్యాసానికి కరంజియా ‘నెహ్రూ లివ్స్’ అని శీర్షిక పెట్టారు.
- అబ్బాస్ చెల్లెలు ఫాతిమా పాకిస్తాన్‍కి వలస వెళ్ళి కరాచీలో స్థిరపడ్డారు. అయితే అబ్బాస్‌ని పాకిస్తాన్‍కి రాకుండా ప్రభుత్వం బ్లాక్‍లిస్ట్ చేసింది, ఎందుకంటే, ఆయన ద్విజాతి సిద్ధాంతాన్ని వ్యతిరేకించారు. అయితే ఆయన అప్పుడప్పుడూ పాకిస్తాన్ వెళ్ళి తన చెల్లెల్ని, బంధువులని కలిసేవారు. ఎలాగంటే, మాస్కో నుంచి బొంబాయికి, కరాచీ మీదుగా వచ్చే ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కునేవారు. అప్పుడు పాకిస్తాన్‍లో రెండు రోజు ఆగే విరామం దొరికేది. ఆయనని ఎయిర్‍పోర్ట్ హోటల్‌లో గదికి పరిమితం చేసేవారు. ఆయన అక్కడి నుంచే తన సోదరిని, ఇతర బంధువులను కలిసేవారు. 1970లో తన మేనల్లుడి వివాహ వేడుక కోసం రైల్లో కరాచీకి బయల్దేరారు. తీరా అక్కడికి చేరారా వీసా ఇవ్వలేదు. వరుడు కూడా గట్టిగా ప్రయత్నించినా కుదరకలేదు. అప్పడు అబ్బాస్ తిరిగి బొంబాయి వచ్చేసారు. కానీ విదేశాంగ శాఖలోని ఆయన మిత్రులు టి.ఎన్. కౌల్, కేవల్ సింగ్ ప్రయత్నించి వీసా సాధించడంతో, వివాహానికి ఒక రోజు ముందు కరాచీ చేరగలిగారు. వివాదాలకు ఆయన ఎన్నడూ తల ఒగ్గలేదు. పాకిస్తాన్‍లో జరిగిన ఓ పాత్రికేయుల సమావేశంలో “భారత్‍లో ఏ రాష్ట్రంలో ఉర్దూ ప్రథమ భాషగా ఉంది?” అన్న ప్రశ్నకు ఆయన ‘జమ్మూ కాశ్మీర్’ అని జవాబిచ్చారు. అంతే మర్నాడు పత్రికలలో – అబ్బాస్ జమ్మూ కశ్మీర్‍ని భారత్‍లో అంతర్భాగం అని అన్నారు – అని వార్తలొచ్చాయి. అబ్బాస్‌కి తప్పుడు ఉద్దేశాలను అంటగట్టాయి పత్రికలు.
- 1985లో 71 ఏళ్ళ వయసులో – అప్పటికే పక్షవాతంతో బాధ పడుతున్నప్పటికీ – ఇందిరా గాంధీ మరణం తర్వాత ప్రధాని అయిన రాజీవ్ గాంధీని – ఇంటర్వ్యూ చేయడానికి – అబ్బాస్ వెళ్ళారు. అబ్బాస్ వెంట మణిశంకర్ అయ్యర్ ఉన్నారు. ఇంటర్వ్యూ బాగా జరిగింది. అయితే చివర్లో అబ్బాస్ రెండు ఇబ్బందికరమైన ప్రశ్నలు అడిగారు. ఒకటి – మీ అమ్మగారిలో నియంతృత్వ ధోరణి ఉండేదా? రెండు – దేశంలో చిన్న పిల్లల పాల కంటే, సూపర్ కంప్యూటర్లు ముఖ్యమని భావిస్తున్నారా? తొలుత అబ్బాస్ గారిని స్వాగతించడానికి తలుపు దాకా వచ్చిన ప్రధాని ఈ రెండు ప్రశ్నలకి సమాధనం చెప్పక మౌనంగా ఉండిపోయారు.