గులాబీ రంగు చీర

8
3

[dropcap]ఆ[/dropcap]టోలో రైల్వే స్టేషన్ చేరుకున్నారు భారతి, రజని. బేరం ఆడకుండా మీటర్ వేసి పద్ధతిగా తమను తీసుకొచ్చిన ఆటో డ్రైవర్‌కి థాంక్స్ చెప్పి డబ్బులు ఇచ్చి పంపించింది భారతి. సికింద్రాబాద్ స్టేషన్ మెయిన్ ఎంట్రెన్స్ అది. ఇంకా టైం పదే అయ్యింది. తాము ఎక్కవలసిన ట్రైన్ పదకొండు గంటలకు. సరిత ఇక్కడే తమను కలుస్తానంది. లోపలికి వెళ్దమా అనుకుంటూ కూడా ఇక్కడే నిలబడి ఉండడం మంచిదేమో అనిపించింది భారతికి. సరితకు తమలా ప్రయాణాలు చేసే అనుభవం లేదు. లోపలకు తాము వెళితే సరిత ఇబ్బంది పడుతుంది. ఆమె ఫోను కూడా తనతో తీసుకురానని చెప్పింది. అందుకని అక్కడ నుంచుని తన కోసం ఎదురు చూడడమే మంచిదని అనిపించింది భారతికి. కాస్త దూరంగా టాక్సీల స్టాండ్ దగ్గరగా నుంచున్నారు ఇద్దరు.

చాలా రోజుల తరువాత వీకెండ్ సరదాగా గడిపే అవకాశం వచ్చింది. ఎంత త్వరగా ట్రైన్ ఎక్కుదామా అని ఉత్సాహంగా ఉంది ఇద్దరికీని. ఎప్పటి నుంచో ఉండవల్లి గుహలు చూడాలన్న కోరిక. తిరువంతపురంలో పద్మనాభ స్వామి విగ్రహం చూసాక, ఇలాంటికి మన ఆంధ్రపదేశ్‌లో ఉండవల్లిలోనే ఉందని తెలిసినప్పటి నుంచి ఆ గుహలు చూడాలని భారతి అనుకుంది. భారతి ఇంట్లో పూజలు పెద్దగా చేయదు. కాని పాత గుడులన్నా, శిల్పకళ అన్నా ఆమెకు చాలా ఇష్టం. ఆ శిల్పసంపదను చూడాలని ఉత్సాహంగా ప్రతి గుడికీ పుణ్యక్షేత్రానికీ వెళుతుంది. సరిత తల్లిగారి ఊరు గుంటూరు. అందుకని గుంటూరు వెళ్ళి, సరిత అన్నగారి కారు తీసుకుని ఉండవల్లి దాకా వెళ్లివద్దాం అన్నది వీళ్ల ప్రస్తుత ప్రోగ్రాం.

ఇక రజనికి భక్తి ఎక్కువ. గుళ్ళన్నా, గోపురాలన్నా, దర్శనాలన్నా చాలా నిష్ఠగా వస్తుంది. ఉండవల్లి గురించి విని “నేను అక్కడకు వచ్చి స్వామి వారిని దర్శించుకుంటాను” అంటూ బైలుదేరింది. ఆమె చాదస్తం తెలిసి “అక్కడ పూజలు జరగట్లేదు. ఆలయం లేదు” అని భారతి చెప్పినా, “పర్లేదు అనంత పద్మస్వామిని దర్శించుకుంటాను” అంటూ తనూ వీరితో కలిసింది. సరిత ఉండేది వారాసిగుడాలో. అందుకే తాను నేరుగా స్టేషనుకు వస్తానని చెప్పింది. భారతి ఇంటి నుండి బైలుదేరి సైనిక్‌పురిలో ఉన్న రజనిని ఆటోలో ఎక్కించుకుని స్టేషనుకు వచ్చింది. ఏ.ఎస్. రావు నగర్ నుంచి రావాలంటే ట్రాఫిక్ ఎక్కువ. పైగా ఏ.ఓ.సీ. లో ఒకోసారి పది గంటలకే గేటు మూసేస్తారు. అందుకని పదికి ముందే స్టేషను చేరేలాగా ప్లాన్ చేసుకుని బైలుదేరారు ఇద్దరు.

అంత హడావిడిలోనూ తలస్నానం చేసి పెద్ద బొట్టుతో ముద్దుగా తయారయి వచ్చిన రజనిని చూసి నవ్వింది భారతి. కాలేజి నుండి ఇంటికి వెళ్లి చేయవలసిన పనులన్నీ పూర్తి చేసుకుని అంత శ్రద్ధగా తయారయి వచ్చిన ఆమెను చూస్తే ముచ్చటేసింది. భారతికి అలంకరించుకోవడం పై పెద్దగా శ్రద్ధ లేదు. పైగా కాలేజి నుండి ఇంటికి వెళ్ళి ఓ సాహిత్య మీటింగ్ అటెండ్ అయి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళి భోంచేసి ఓ రెండు జతల బట్టలు పెట్టుకున్న బాగుని తీసుకుని ఆటో ఎక్కింది. ముఖం కడుక్కునే సమయం కూడా ఇవాళ ఆమెకు దొరకలేదు. తడి తడిగా ఉన్న జుట్టుతో నుదుటున పెద్ద కుంకుమతో, ప్యూర్ సిల్క్ చీరలో, పొడవాటి నల్లపూసలతో సాంప్రదాయబద్దంగా కనిపిస్తున్న రజనిని చూస్తే ఓ కవిత రాయొచ్చు అనిపించింది భారతికి.

“ఇంత చక్కగా తయారయ్యావు నా దిష్టే తగిలేలా ఉంది” అంది భారతి.

రజని ముసి ముసిగా నవ్వుకుంటూ “వెళ్తుంది దేవుని దర్శనానికి కదా. తల స్నానం చేయకుండా బైలుదేరడం నా కిష్టం లేదు” అంది.

భారతి చుట్టూ చూసింది. టాక్సీలు, ఆటోల గోలతో హడావిడిగా ఉంది అక్కడి వాతావరణం. రాత్రి పూట ప్రయాణం అంటే తనకు చాలా ఇష్టం. స్టేషన్ బైట ఆ పసుపు రంగు లైట్లలో అందరూ హడావిడిగా ప్రయాణపు ఉత్సాహంతో కనిపిస్తూ ఉంటే చూడడం బావుంది. రజనికి మాత్రం అక్కడ నుంచోవడం ఇబ్బందిగా అనిపించింది. ప్రతి ఆటో డ్రైవరు వచ్చి ఎక్కడికి వెళ్లాలని అడగడం, వీళ్లు ఆటో వద్దనడం. ఇద్దరికీ ఇది విసుగ్గా అనిపించింది. టాక్సీ స్టాండ్ నుంచి దూరంగా జరుగుదాం అంటూ అటు పక్క ఓ ఖాళీ మూలను చూపించింది రజని. సరే అంటూ భారతి తన బ్యాగుతో ఆమెను అనుసరించింది.

ఎంట్రన్స్ గోడకు ఓ పక్కకు వచ్చారిద్దరు. సామాను అక్కడ పెట్టి వెనక్కు తిరిగిన భారతికి ఓ ఆకారం గోడ చాటు నుండి వచ్చినట్లు అనిపించింది. బాగు గట్టిగా పట్టుకుని వెనక్కు తిరిగి చూసింది. ఆ ఆకారం చీకట్లోంచి ముందుకు వచ్చింది. కాస్త బెదిరినా అది కనిపించనీయకుండా ఆ ఆకారాన్ని పరీక్షగా చూసింది భారతి. పై నుండి పడుతున్న లైట్ల కాంతిలో ఓ గులాబీ రంగు చీర కనిపించింది. ఆ ఆకారం కూడా వీరిని పరీక్షగా చూస్తూ కొంచెం పక్కకు వెళ్ళి నిల్చుంది. చుట్టూ ఏదో వెతుకుతున్నట్లు చూస్తున్న ఆ ఆకారాన్ని పరీక్షగా చూసిన భారతికీ ఏదో తేడా అనిపించింది. ముఖం చాలా లేతగా ఉన్న ఆ అమ్మాయికి పద్నాలుగు పదిహేనేళ్ల కన్నా ఎక్కువ ఉండవేమో. చిన్నపిల్లకు చీర కట్టినట్లు అనిపిస్తుంది. గులాబీ రంగు చీర పెద్దరికాన్ని తీసుకురాలేదు. లూజుగా ఉన్న నల్ల బ్లౌజు, ఓ పోనీటెల్. ఏదో వెతుకుతున్న కళ్ళు. భారతికి ఆ అమ్మాయి పై ఆసక్తి పెరిగింది. ఆమె కనిపించే దిశగా కొంచెం పక్కకు వచ్చి నిలుచుంది.

ఇవేమీ గమనించని రజని హాండ్ బాగ్‌లో ఏవో వెతుకుతూ ఉంది. వెతుకుతున్నది దొరకక కంగారుపడుతున్న ఆమెను చూసి భారతి “ఏం వెతుకుతున్నావ్. ఏదన్నా మర్చిపోయావా” అంది

“బీరువా తాళాలే తల్లి. హడావిడిలో ఏ జిప్‌లో వేసానో తెలీయట్లేదు. అయినా బ్యాగ్‌లో వేసుకున్నానా? ఇంట్లోనే మర్చిపోయానా” అంటూ తెగ హడావిడి పడిపోతుంది.

“బీరువా తాళాలా. ఇంటి తాళాలా. అయినా తాళాల అవసరం నీకేం వచ్చిందే. అరవింద్ ఇంట్లోనే ఉన్నాడుగా” అంది భారతి.

“అదేనే తల్లి భాధ. అరవింద్ ఈ రెండు రోజులు ఇంట్లోనే ఉంటాడనేగా జాగ్రత్తగా బీరువా లాక్ చేసి తాళాలు బాగ్‌లో వేసుకున్నాను” అంది రజని.

అరవింద్ రజని భర్త. మృదు స్వభావి. మంచి ఉద్యోగం, పరపతి ఉన్న వ్యక్తి. చాలా బాధ్యతగా ఉంటాడు. భార్య అంటే ప్రేమ. పెద్దలన్నా అంతే గౌరవం.

“అరవింద్ చూసుకుంటాడులే. కావలంటే ఫోన్ చేసి ఇంట్లో తాళాలు ఎక్కడ ఉండవచ్చో చెప్పు” అని సెల్ ఫోన్ అందివ్వబోయింది భారతి.

“ఛాలు లే. అరవింద్ చేతికి తాళాలు దొరకడమా. అలా ఐతే నేను ఇంటికి తిరిగి వెళ్ళిపోతాను” అంటూ ఇంకా హడావిడి పడిపోతూ ఓ పక్కన కూచుని బ్యాగు వెతుక్కుంటుంది రజని.

ఇంట్లో భర్త, అత్తగారు ఉన్నా కూడా ఇంట్లో బీరువా తాళాలు మర్చిపోయానని అంతగా ఎందుకు రజని హైరానా పడిపోతుందో భారతికి అర్థం కాలేదు.

ఆమె చూపు ఇందాక చూసిన గులాబీ రంగు చీరను వదిలి రాలేకపోతుంది. ఇంతలో నల్లగా ఉన్న ఓ మగ ఆకారం పరుగుతో ఆ గులాబీ రంగు చీరవైపు రావడం చూసింది భారతి. అతన్ని తప్పించుకోవాలని పక్కకు తిరిగిన ఆ అమ్మాయికి అడ్డుగా భారతి, రజని నిలుచుని ఉన్నారు. మరో పక్కన ఆగి ఉన్న టాక్సీ. నిస్సహాయత ఆ అమ్మయి కళ్లల్లో. ఆమెను ఒంటి చేతితో పట్టుకున్నాడు వచ్చినతను. “ఇక్కడున్నావా. గంట నుంచి ఎతుకుతున్నా” అంటూ కుందేలును పట్టుకున్న సింహంలా ఓ నవ్వు నవ్వాడు. ఆ అమ్మాయి అతన్ని వదిలించుకోవాలని పెద్ద చప్పుడు చేయకుండా గింజుకుంటుంది. అతని చేయి ఆమెను వదలట్లేదు. అతని వెనుకే నవ్వుతున్న ఓ ఆటో డ్రైవర్. అతనేసుకున్న ఖాకీ షర్టు అతనో ఆటో డ్రైవర్ అని చెబుతుంది.

“అరేయ్ అలసిపోయానురా. నేను రాలేను రా” అంటుంది ఆ అమ్మాయి.

“మా బుజ్జివిగా. ఒక్క సారి రాయే. ఒక్క పది నిముషాలు” ఒక చేతితో ఆమె జబ్బను పట్టుకుని మరో చేతితో ఆమె బుగ్గలు పిసుకుతూ అంటున్నాడు అతను.

క్రింద కూర్చుండిపోయింది ఆ అమ్మాయి. కొంగు జారిపోయింది. కాళ్లు ముడుచుకుంటూ “నీకు దండం పెడతానురా. నొప్పిగా ఉందిరా” అంటూ శబ్దం రాకుండా ఏడుస్తుంది.

భారతికి కథ అర్థం అయీ కానట్టు ఉంది. అంత బ్రతిమిలాడుతూ ఆ అమ్మాయి ఎందుకు శబ్దం బైటికి రానివ్వట్లేదో మాత్రం అర్థం కవట్లేదు. తానున్న స్థలం నుండి కదిలి ముందుకు రాబోయింది భారతి. “సరే ఓ యాభై ఇస్తా రా” అని ఆ చిన్న శరీరాన్ని ఈడుస్తున్నట్లుగా లాక్కు వెళుతున్నాడు అతను. ఆ ఇద్దరిని అనుసరిస్తున్నాడు వెనుక నవ్వుతున్న ఆటో డ్రైవర్. కడుపులో తిప్పినట్లయింది భారతికి. ముందుకు అడుగేసి ఏమి చేయాలో అర్థం కాక నిలుచుండిపోయింది.

“లగేజి బ్యాగులో పెట్టానే” అంటూ ఆనందంగా తాళాల గుత్తి తీసుకుని భారతి దగ్గరకు వచ్చిన రజని, భారతి ముఖంలో ఆందోళన గమనించి ఆమె చూస్తున్న వైపుకు చూసింది. వెంటనే “ఛీ. అలాంటి ఆడవాళ్లని చూస్తున్నావేంటే” అంటూ అసహ్యంతో మొహం తిప్పుకుంది. ఆమెకు అక్కడ ఓ ఆడదే తప్ప ఆమెను తీసుకు వెళుతున్న మగవాళ్ళు కనిపించలేదు ఎందుకో.

“ఇలాంటి చోట అందుకే ఒంటరి ఆడవాళ్లం నిలబడకూడదు. మనల్ని కూడా అదే దృష్టితో చూస్తారు. మరోసారి ఇంత ముందుగా స్టేషనుకు వచ్చే ప్రోగ్రాం పెట్టకు. శుభమా అని గుడికి బయలుదేరుతూ ఈ పాపాలను చూడవలసి వచ్చింది” అంది కోపంగా రజని.

“ఇదిగో, నీకు ప్రయాణాలలో అతి జాగ్రత్త అలవాటుగా. ఈ తాళాలు నీ హాండ్ బ్యాగులో వేసుకో. ఇంటికి వచ్చేటప్పుడు నాకు తిరిగి ఇవ్వు” అని ఓ కొత్త రకం లాకర్ తాళాలు భారతి చేతిలో పెట్టింది రజని.

మనసులోని చేదు నుండి బైటపడటానికి ఆమె వైపుకు చూస్తూ “ఓ రెండు రోజుల ప్రయాణానికి ఈ బీరువా తాళాలు ఇంత జాగ్రత్తగా తెచ్చుకోవడం అవసరమా. పైగా అవి కనిపించలేదనే అనవసరమైన టేన్షన్ ఒకటి. అరవింద్ కిచ్చి వస్తే అయిపోయేదిగా” అంది భారతి.

“అదే తల్లి నా బాధ ఇవి అతని చేతిలో పడితే ఇక అంతే” అంది రజని

“ఏం చాటుగా నువ్వు కొనుక్కున్న చీరలు, నగలు చూసేస్తాడా” నవ్వుతూ అంది భారతి.

“అది కాదే తల్లి నెల నుండి నరకం చూపిస్తున్నాడు. నా బాధ నీకేమని చెప్పను” నిట్టూరుస్తూ అంది భారతి.

“ఏంటీ అరవింద్ నీకు నరకం చూపిస్తున్నాడా” ఆశ్చర్యంగా రజనిని చూస్తూ అంది భారతి. అరవింద్ స్వభవం భారతికి బాగా తెలుసు. పైగా అతను రజనిని ఎంతగా ప్రేమిస్తాడో, బాధ్యతగా ఉంటాడో చాలా సంవత్సరాల నుండి గమనిస్తుంది కూడా. అతనంటే భారతికి చాలా గౌరవం.

చిన్నప్పుడే తండ్రి చనిపోతే అన్నగారి సంరక్షణలో చాలా బాధ్యతగా పెరిగిన వ్యక్తి అరవింద్. అరవింద్ కోసం ఆ అన్న వదినలు చాలా కాలం తమకు పిల్లలు వద్దనుకున్నారు. పెళ్లయిన ఏడు సంవత్సరాల దాకా పిల్లలను కనలేదు ఆ దంపతులు. తరువాత వాళ్లకు పుట్టిన ఓ ఆడపిల్లంటే అరవింద్‌కు చాలా ప్రేమ. అరవింద్ వివాహం అయిన సంవత్సరమే అతని అన్నకు బాంబే ట్రాన్స్ఫర్ అయింది. రజని పేద ఇంటి అమ్మాయి అయినా తమ కులం కాకపోయినా, అరవింద్ ఆమెను ప్రేమించాడన్న సంగతి తెలుసుకుని అతని వదిన అత్తగారిని ఒప్పించి దగ్గరుండి వీరి పెళ్లి జరిపించింది. కొన్నాళ్లు అత్తగారిని తమ దగ్గరే పెట్టుకుంది కూడా. తెలుగువారు తక్కువగా ఉన్న ఉత్తరాది ప్రాంతాల్లో ఉండడానికి అమ్మ ఇబ్బంది పడుతుందని అర్థం చేసుకుని అరవింద్ తల్లిని ఓ సంవత్సరం క్రితం తన దగ్గరకు తెచ్చుకున్నాడు. భార్యను తల్లిని ఎంతో అపురూపంగా చూసుకుంటాడు. పుట్టిన ఇద్దరు పిల్లలనూ మంచి స్కూలులో వేసి చదివిస్తున్నాడు. పిల్లల పని అంతా ఇంచుమించు అరవిందే చేస్తాడు. అలాంటి వాడు భార్యను సతాయిస్తున్నాడా.

ఆశ్చర్యంగా చూస్తున్న భారతిని చూసి రజని “నువ్వెప్పుడు అరవింద్ పక్షమే. అయనతో నేను పడుతున్న ఇబ్బంది ఏం చెప్పను. ఇంటి గుట్టు బైట పెట్టుకోవడం ఎందుకని నా బాధ నాలోనే దాచి పెట్టుకుంటున్నాను” అంది రజని.

‘రజనిని అరవింద్ కష్టపెడుతున్నాడా? ఎంత గౌరవిస్తుంది తాను అరవింద్‌ని అతనిలోకూడా మరో కోణం ఉందా? ఇంత అమాయకమైన భార్యని క్షోభ పెడుతున్నాడా అరవింద్?’ ఆలోచనలో పడింది భారతి

రజని చేతిపై ఆప్యాయంగా చేయి వేస్తూ “ఏం జరిగింది రజని. నాతో చెప్పలేని కష్టాలున్నాయా నీకు” అని మృదువుగా అడిగింది.

“అరవింద్‌కి ఎంతకీ అన్న వదినలు తప్ప నేను పిల్లలు పట్టరే. మా పాట్లేవో మేమే పడాలి. ఆ అన్న వదినలకో కూతురుందిగా”.

“అవును హిమజ. తనకేం అయ్యింది” అడిగింది భారతి.

హిమజ బాంబేలో మాస్ కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ చేస్తుంది. ఆమె అంటే అరవింద్‌కి ప్రాణం అని భారతికి తెలుసు.

“ఆ మహాతల్లికేం జరగలేదే. ఓ సంబంధం చూసాను దానిపై ప్రేమతో. కట్నం తీసుకోకుండా పెళ్ళికి ఒప్పుకున్నారు వాళ్లు. అబ్బాయి బ్యాంకు ఉద్యోగి. బాగా ఆస్తిపరులు. హిమజ కూడా తెల్లగా ఉంటుందని చూసి పైసా ఖర్చులేకుండా చేసుకుంటాను అన్నాడు ఆ అబ్బాయి.”

“హిమజకు పెళ్ళి కుదిరిందా, అరవింద్ నాకు చెప్పలేదే” ప్రతి విషయం ఏదో సందర్బంలో తనకు చెప్పే అరవింద్ ఈ విషయం నాకెందుకు చెప్పలేదబ్బా అనుకుంది భారతి.

“ఏం చెబుతాడే. అది పెళ్ళి చేసుకోవడం ఈయనకే ఇష్టం లేదు. బావగారు కూతురి పెళ్ళికి సిద్ధపడినా ఈయన మాత్రం దానితో కలిసి ఈ సంబంధం తప్పించేసాడు” అంది రజని.

“ఏదో కారణం ఉండే ఉంటుంది లేవే” అంది భారతి

“ఆ ఉంది కారణం. ఆవిడ గారికి ఏదో ఫారిన్ యూనివర్సిటీలో సీట్ వచ్చిందట. ఆమె ఇంకా చదువుతుందట. అందుకని ఇప్పుడే పెళ్ళి వద్దంట. అంత దూరం పంపి చదివించాలంటే ఓ ఇరవై లక్షలు కావాలి. బావగారికేమో లోన్ వచ్చే అవకాశం లేదు. అంతకు ముందు ఆయన చేసిన లోన్లే తీర్చుకుంటూ ఉన్నాడు. అందుకని ఒంగోలులో ఉన్న ఇల్లు అమ్మేస్తాడట ఈయన. అది అమ్మి అన్న కూతురుని ఫారిన్ పంపుతాడట”

ఒంగోలులో అరవింద్ తండ్రి పేర ఓ చిన్న ఇల్లు ఉంది. ఆ ఇంటిపై హక్కు ఇద్దరు అన్నదమ్ములది. ఎన్ని కష్టాలు వచ్చినా అరవింద్ అన్నగారు తండ్రి గుర్తుగా ఉన్న ఆ ఇల్లు అమ్మడానికి ఇష్టపడలేదు. అరవింద్ చదువుకు, హైదరాబాదులో సొంత ఇల్లు కట్టుకుంటున్నప్పుడు కూడా ఆయనే లోన్లు తీసుకున్నారు కాని ఆ ఇల్లు అమ్మలేదు. అరవింద్ ఉద్యోగస్థుడయిన తరువాత అతనిపై ఆ భారం పడనివ్వలేదు.

“ఆ ఇంటిపై ఇద్దరు అన్నదమ్ములకు హక్కు ఉంది కదా” అడిగింది భారతి.

గోడ పక్కనుండి ఆ గులాబీ చీర ఈసారి ఒక్కత్తీ నీరసంగా వచ్చి వీరి ముందర ఉన్న ఖాళీ స్థలంలో చతికిలబడింది. కాళ్ళు ముడుచుకుని మొహాన్ని కాళ్ళ మధ్యన పెట్టుకుని మౌనంగా కూర్చుంది. ఆ అమ్మాయిని చూడగానే ముఖం చిట్లించింది రజని “ఏయ్ ఇక్కడి నుండి వెళ్ళు” గట్టిగా అరిచింది.

ఆ అమ్మాయి విననట్లు ఒంచిన తల ఎత్తకుండా అలాగే కూర్చుంది. “ఏయ్ చెబుతుంది నీకే” గట్టిగా కసురుకుంది రజని. ఆ అమ్మాయిలో చలనం లేదు. “పక్కకు వెళ్లమని చెబితే నీక్కాదు” ఇంకా గట్టిగా అంది రజని. కూర్చున్న పిల్ల అలాగే జరుగుతూ రెండడుగుల దూరం జరిగింది. కాని ఒంచిన తల ఎత్తలేదు. “చీ చీ పాడు జాతి. ఎలా బతుకుతారో ఇలా” అసహ్యంగా మొహం పెట్టుకుని చీర కొంగు మడుచుకుని ముఖం చిట్లించింది రజని.

“అవునే ఒంగులులో ఇల్లు ఇద్దరి పేరున ఉంది. ఇక్కడి ఇల్లు కూడా అన్నదమ్ములిద్దరి పేరు మీదే ఉంది. బావగారికి రిటైర్ అవడానికో సంవత్సర కాలం మాత్రమే ఉంది. తరువాత ఒంగోలులో సెటిల్ అవ్వాలని కదా వాళ్ల ప్లాన్. మరి అప్పటికి వారికో ఇల్లు ఉండాలిగా. అది పిల్ల చదువు కోసం అమ్మితే ఎలా?” అంది రజని.

బావగారి కోసం అంతగా ఆలోచిస్తున్న రజని అంటే ఇంకా ఇష్టం పెరిగింది.

“మరి అదే అరవింద్‌కి చెప్పలేకపోయావా. ఇల్లు అమ్మకుండా ఇంకో మార్గం చూసేవారుగా” అంది రజని

“ఆ చెప్పాను. అందుకని లోను తీసుకుంటానని ఈయన గొడవ”.

“మంచిదేగా” అంది భారతి.

“అసలేం ఎక్కదానే నీకు. మాకూ ఇద్దరు పిల్లలున్నారు. ఇప్పటినుంచే లోన్లు అంటే వాళ్ల భవిష్యత్తు ఏంటీ” చర్రున లేచింది రజని

“అదేంటే మీ బావగారు తీసుకున్న లోన్లు అరవింద్ కోసమేగా. అరవింద్ చదువుకు ఆయన చాలా ఖర్చుచేసారు. తరువత ఓ ఇల్లు అమర్చడానికి కష్టపడ్డారు. అదే ఇంట్లో కదా ఇప్పుడు మీరు ఉంటుంది.”

“ఆ చేసారులే అది ఆయన బాధ్యత. తండ్రి చనిపోయాక ఉన్న ఒక్క తమ్ముడి బాధ్యత ఆ మాత్రం తీసుకోకపోతే లోకం ఊరుకుంటుందా. అయినా ఈ ఇల్లు కూడా ఇద్దరి పేరునే ఉందిగా. అక్కడ ఊరిలో ఇంటిని అమ్మినా దానిపై అరవింద్‌కీ హక్కు ఉంది. మరి అది మాకు నష్టం కాదా”

షాక్ కొట్టినట్లు రజనిని చూసింది భారతి.

రజని తండ్రి కూతురుని ఇల్లు కూడా లేని వాడికి ఇచ్చి పెళ్లి చేయనంటే, తాను లోను తీసుకుని కట్టిన ఇంటిపై తమ్ముడికి హక్కు ఇచ్చి వారికి పెళ్లి జరిపించిన అరవింద్ అన్న మంచితనాన్ని పెళ్లైన కొత్తల్లో ఎన్నోసార్లు తనతో గొప్పగా చెప్పుకున్న రజని ఇవాళ ఇంత స్వార్ధంగా ఆలోచించడం భారతికి మింగుడు పడట్లేదు.

“ఏమైనా ఇల్లు అమ్మకూడదే. రిటైర్ అయ్యాక బావగార్లు ఒంగోలు వెళ్ళే ఆలోచనలో ఉన్నారు. అప్పుడు ఆ ఇంట్లో వారు ఉంటే, హైదరాబాద్‌లో ఈ ఇల్లు మా పిల్లల కోసం అడగవచ్చు. రిటైర్ అయ్యాక కొద్దో గొప్పో వచ్చే డబ్బుతో హిమజ పెళ్ళి చేస్తే బావుంటుంది. అలా కాకుండా ఇప్పుడు ఆమెగారిని అన్ని లక్షలు ఖర్చుపెట్టి ఫారిన్ పంపించి సాధించేది ఏముంది? ఎలాగూ పెళ్ళయి ఆత్తగారింటికి వెళ్ళెదేగా. ఇంత ఖర్చు అవసరమా? అయినా అదేదో బావగారు చూసుకుంటారుగా. ఈయనని ఆయనేమీ సహాయం అడగలేదు. హిమజే తెలివిగా బాబాయికి ఫోన్ చెసి సీటు గురించి చెప్పుకుంటే ఈయన పొలోమని ఇల్లు అమ్ముతానని లేదా లోను తీసుకుంటానని గొడవ మొదలెట్టారు. నేను ససేమిరా అన్నాను”

“ఈ బీరువా తాళాలు” అడిగింది భారతి

“అదేనే ఆ ఇంటి కాగితాలు ఆ బీరువాలో లాకర్లో ఉన్నాయి. నేను లేకుండా అవి ఆయన తీసుకుంటే ఇక అంతే సంగతులు” విజయ దరహాసంతో నవ్వింది రజని.

“తాళాలు నువ్వు తెచ్చుకుంటే అరవింద్ లోను తీసుకోడా” అడిగింది భారతి

“ఆయన లోను తీసుకుంటున్నాడని అది నా కిష్టం లేదని. పిల్లలకు స్కూలు మార్చే ఖర్చు కూడా ఇప్పుడు ఉందని, నా ఆరోగ్యం కూడా బావోలేదు కాబట్టి ఉద్యోగం చేయలేకపోతున్నానని, రిజైన్ చేసే ఉద్దశంలో ఉన్నానని దానికి అరవింద్ ఇష్టపడట్లేదని, ఇలాంటి సమయంలో పెద్ద మనసుతో బావగారే అరవింద్‌కు నచ్చ చెప్పాలని నేను సాయంత్రమే బావగారికి ఫోన్ చేసే చెప్పేసా. రేపు ఆయన ఫోన్ చేసి అరవింద్‌తో మాట్లాడతారు. అప్పుడు నేను ఇంట్లో ఉండకపోవడమే మంచిది” అంది రజని విజయగర్వంతో నవ్వుతూ.

“ఏంటి రిజైన్ చేస్తావా” అడిగింది భారతి

“ఆ నా ముఖం చైల్డ్ కేర్ లీవ్ ఓ మూడు నెలలు పెట్టేస్తా. వేడి తగ్గాక తిరిగి చేరితే సరిపోతుంది” ముసిముసిగా నవ్వుతూ చెప్పింది రజని.

చొక్కా లేని ఓ చిన్న పిల్లవాడు పదేళ్ల వయసుండవచ్చు, నేల మీద ముడుచుకు కూర్చున్న ఆ అమ్మాయి దగ్గరకు వచ్చాడు. ఆమెను చూసి నవ్వుతూ తనూ క్రింద కూర్చున్నాడు. ఆమైపై చేయి పడగానే తలఎత్తి చూసిన ఆమె ఆ పిల్లవాడిని చూసి నీరసంగా నవ్వింది. దగ్గరకు తీసుకుంది. ఆమె భుజంపై తల పెట్టుకున్నాడు వాడు కొంచెం సేపు.

భారతి దృష్టి ఆ ఇద్దరిపై పడింది. ఏదో అసహనం లోపల. ఈ లోగా ఆ పిల్లవాడు లేచి మరో పక్కకి వెళ్లిపోబోయాడు..

ఆ అమ్మాయి తల ఎత్తి “ఏంది రా” అంది

“పోతా” అన్నాడు వాడు

“సరే’ అని తల ఊపింది. గెంతుకుంటూ రెండు అడుగులు వేసాడు వాడు.

“అరే ఆగురా” అని నీరసంగా పిలిచింది.

వెనక్కు తిరిగి చూసిన వాడు ఏంటని ఆమె దగ్గరకు వచ్చాడు.

నడుం పక్కన చేయి పెట్టి ఓ పర్సు తీసింది బైటకు. అందులో ఓ యాభై రూపాయల నోటు కనిపించింది. అది తీసి ఆ పిల్లవాడికి ఇచ్చి “ఏమైనా తిను పో” అంది. డబ్బు చూడగానే ఉత్సాహంగా దాన్ని అందుకున్న వాడు పోబోతూ “నీకేం కావాలే” అన్నాడు. ఆమె పర్సులో వెతికి కొంత చిల్లర తీసిచ్చి “చాయ్ తీసుకురా పో” అంది. “అదేంది తినవా” అడిగాడు వాడు. “ఐతలేదురా చాయ్ తేపో” అని మళ్ళీ తల క్రిందకు పెట్టుకుంది ఆ అమ్మాయి.

కాస్త దూరంలో ఆటోలో నించి సరిత అప్పుడే దిగింది. అటూ ఇటూ నేస్తాల కోసం వెతుక్కుంటున్న తన దగ్గరకు చేయి ఊపుతూ రజనీ పరుగెత్తింది. ఇంటికి వెళుతుందనో ఏమో చాలా లగేజి పట్టుకొచ్చింది. ఆ లగేజి దించడానికి రజని సహాయం చేస్తుంది.

గులాబీ చీరనే చూస్తుంది భారతి. ఆమెలో ఓ అలజడి. సరిత ఉత్సాహంగా భారతి దగ్గరకు వచ్చి “ఏంటే చాలా లేట్ చేసానా” అంది. ఆ అమ్మాయినే చూస్తున్న భారతి నవ్వి “లేదులే” అంది.

రజని ఉత్సాహంగా “ఎంత దరిద్రపు చోటులో నిల్చున్నామో తెలుసా నీ కోసం. ఇంకోసారి ఇలా వెయిట్ చేయించకే” అంది

“సారీ తల్లి. ఈ సారికి క్షమించేయ్” అంటూ డిస్‌ప్లే వైపుకు రజనికి లాక్కుపోయింది సరిత.

సికింద్రాబాద్ రేపల్లె పాసింజర్ ప్లాట్ ఫారం నంబర్ తొమ్మిది అన్న డిస్‌ప్లే చూసాక భారతి తన బ్యాగు తీసుకుని బైలుదేరింది. ఆ గులాబీ చీర కాళ్ల మధ్య తల పెట్టుకుని అలాగే ఉంది. ఆమెను దాటుకుని ముందుకు నడిచింది భారతి.

ప్లాట్ ఫారం మీదకు రాగానే కుడివైపు టీ స్టాల్ కనిపించింది. “ఇంకా ఇరవై నిముషాలు ఉందిగా టీ తాగుదాం” అంది భారతి. సరిత “ఇప్పుడా. ఇంత రాత్రి టీ తాగితే నాకు పడదు” అంది.

రజని కూడా “ఏం టీ పిచ్చే తల్లి. మేం కంపార్ట్మెంట్‌లో ఉంటాం. నువ్వు టీ తాగి రా” అంటూ స్టెయిర్‌కేస్ వైపుకి నడుచుకుంటూ సరితతో వెళ్ళిపోయింది.

టీ స్టాల్ దగ్గరకు వెళుతున్న భారతికి ఆ షర్టు లేని పిల్లవాడు కనిపించాడు. వాడేదో కావాలని అడుగుతున్నాడు. స్టాల్‌లో ఉన్న అతను వీడిని గదమాయిస్తున్నాడు. భారతి ఆ పిల్లవాడి వెనుక నిలబడి ఓ టీ కావాలని అడిగింది. ఆ పిల్లవాడు ఏదో అడిగినట్లున్నాడు. పేకెట్లు వెతుకుతున్నాడు స్టాల్‌లో ఉన్న వ్యక్తి.

“డబ్బులున్నాయా” గట్టిగా అడిగాడు.

గులాబీ రంగు చీర ఇచ్చిన యాభై రూపాయల నోటు చూపించాడు ఆ పిల్లవాడు. తనకిచ్చిన పాకెట్ తీసుకుని ఓ టీ కూడా కావాలని అడిగాడు వాడు. చేతిలో ఉన్న చిల్లర ఇచ్చాడు.

“ఎనిమిది రూపాయలే ఉంది. ఇంకో రెండు రూపాయలివ్వు లేదంటే చాయ్ రాదు” అన్నాడు టీ స్టాల్ వ్యక్తి.

“అన్నా తరువాత ఇస్తానే” అంటున్నాడు వాడు. భారతి దగ్గరకు రమ్మని వాడిని పిలిచింది.

వాడు వచ్చి “ఏంటీ” అన్నాడు.

“బైట ఉన్న అమ్మాయి నీకు ఏం అవుతుంది” అడిగింది భారతి.

“ఎవరు” అడిగాడు వాడు.

“అదే బయట నీకు డబ్బు ఇచ్చిందే ఆమె” అంది భారతి వాడి మొహంలోకి చూస్తూ.

వాడు అనుమానంగా భారతిని చూస్తూ “ఏమీ కాదు, ఎందుకు” అన్నాడు

“మీ అక్కనా నిన్ను తినమని పైసలిచ్చిందిగా” అడిగింది.

షాపు బైట కట్టిన చిప్స్ పాకెట్లను ఆశగా చూస్తున్నాడు. వాడు. “అవి కావల్నా” అడిగింది భారతి. అవునని తల ఊపాడు వాడు. ఓ రెండు చిప్స్ పాకెట్లు తీసుకుని, వాటితో పాటు ఓ బిస్కెట్ పాకెట్ కొని వాడి చేతిలో పెట్టింది.

“ఇవి నువ్వు తిను, ఈ బిస్కెట్ పాకెట్ మీ అక్కకివ్వు” అంది.

వాడు నవ్వుతూ అవి తీసుకుని “ఆమె మా పద్మక్క. జరంగుంది ఆమెకు. చానా మంచిది” అన్నాడు.

“మీ అక్కకు నువ్వంటే చాలా ఇష్టం కదా” అంది భారతి.

వాడు వింతగా భారతిని చూసి “అక్క గాదు ఇంటి పక్కన ఉంటది. అమ్మ దోస్తు. అమ్మ చచ్చిపోయాక ఈ అక్కనే నాకు రాత్రి డబ్బులు ఇచ్చి అన్నం పెడతది” అన్నాడు వాడు.

“రోజూనా” అడిగింది భారతి.

“ఆ ఈ కేంటిన్ లో అన్నకి చెప్పి రోజూ రాత్రి అన్నం పాకెట్ ఇప్పిస్తది” అని ఆ కేంటీన్‌లో ఉన్న అబ్బాయి వైపు చూపించాడు. వాడు ఇది విని ఏదో పని ఉన్నట్లు లోపలికి వెళ్లిపోయాడు.

“ఆ బిస్కట్లు మీ అక్కకి ఇవ్వు. జ్వరం అన్నావుగా” అంటూ తీసుకున్న వాటికి డబ్బులిచ్చి మెట్లవైపు నడిచింది భారతి.

తను ఎక్కవలసిన బోగీలోకి వెళ్లి సరిత పక్కన కూర్చుంది. ఎంతో ఉత్సాహంగా మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. రజని భారతిని చూసి “వచ్చావా తల్లి ట్రైన్ కదలబోతుంది అయినా రోజుకెన్ని సార్లు టీ తాగుతావే నువ్వు” అంది.

సరిత భారతిని చూస్తూ “ఏయ్ చూడవే ఇది కొత్తగా రవ్వ కమ్మలు కొనుక్కుంది. దీని ముఖానికి ఎంత అందంగా ఉన్నాయో. ఆ కమ్మలకే అందం వచ్చింది ఇది పెట్టుకుంటే. అందగత్తెవే నీవు” అంటూ రజనిని హత్తుకుంది.

భారతి వైపు చూస్తూ “ఏయ్ ఇది ఈ కమ్మలతో ఇంకా అందంగా ఉంది కదా” అంది. ఇద్దరిని చూస్తూ చిరునవ్వు నవ్వింది భారతి.

రజని ముఖం కళ కళలాడుతుంది. ఆ గులాబీ రంగు చీర అమ్మాయి గుర్తుకు వచ్చింది. ఎందుకో ఈ రోజు రజని భారతికి అందంగా కనిపించట్లేదు. గులాబీ రంగు చీర కట్టుకున్న ఆ అమ్మాయే పదే పదే గుర్తుకు వస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here