[తెలుగు సాహిత్యం పట్ల కొన్ని తరాలలో ఆసక్తి రగిలించి, ఆధునిక తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తూ, యువతకు ఉత్తమ సాహిత్యం ద్వారా ఉత్తమ వ్యక్తిత్వాన్నివ్వాలని నిరంతరం తపించే యువభారతి సంస్థ స్థాపించి వచ్చే దసరాకు 60 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సాహిత్యానికి, సమాజానికి యువభారతి చేసిన సేవను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశంతో ప్రతి ఆదివారం సంచికలో యువభారతి ప్రచురించిన పుస్తకాల పరిచయం వుంటుంది. ఈ శీర్షిక వచ్చే సంవత్సరం విజయదశమి వరకూ సాగుతుంది.]
ప్రజా సూక్తం
[dropcap]సా[/dropcap]మెతలు మన దైనందిన వాడుక భాషలో భాగం. కొంతమంది తమ సంభాషణల్లో ఈ సామెతలను విరివిగా వాడుతూ ఉంటారు. మరికొంతమంది మాట్లాడుతున్నప్పుడు “ఏదో సామెత చెప్పినట్లు” అని, ఏ సామెతా చెప్పకుండానే మాట్లాడేస్తూ ఉంటారు. కొన్ని సామెతలు నన్నయ, తిక్కన, పోతన వంటి మహాకవుల కావ్యాలలో జాతీయాలుగా చోటు చేసుకుంటే, మరికొన్ని ‘అపౌరుషేయాలు’ గా ప్రజల నోళ్ళలో నలిగి, తర తరాల వారసత్వ సంపదగా మనకు లభించాయి.
అపౌరుషేయాలు అని ఎందుకన్నాను అంటే, ఏరుల పుట్టుక, మునుల పుట్టుక లాగే, సామెతల పుట్టుక కూడా ఎవరికీ తెలియదు. వాటి కర్త కూడా ఎవరో తెలియదు కనుక వాటిని ‘అపౌరుషేయాలు’ అంటే తప్పు కాదని నా భావం. సామెతలు కూడా, వేదాలవలెనే ఒక తరం వారు మరొక తరం వారికి అందిస్తూ ఉంటే, రాతపూతలకు నోచుకోక, జనసామాన్యం నోళ్ళలో భద్రంగా భద్రవాసం చేస్తూ ఉన్న భాషా సంపద.
ఈ సామెతల పుట్టుక ఎలా జరిగి ఉంటుందో ఒక్కసారి ఊహించండి. తన అనుభవాల్ని ఏ జానపదుడో, పండితుడో భావావేశంలో అని ఉంటాడు. భావావేశంలో వెలువడినవి కాబట్టే, వాటిలో లయ వుంది. విన్నప్పుడు చెవికి హాయిని గొలిపే శబ్ద సౌందర్యమూ ఉంది. అందరికీ అర్ధం అయ్యే భాషా ఉంది. నిర్భరమైన సంక్షిప్తత వుంది. అందుకే అవి సూటిగా తుపాకి గుండు లాగా గుండెను తాకుతాయి. వాటికి వేరే వ్యాఖ్యానం అక్కరలేదు. వంద మాటల్లో చెప్పాలనుకున్న భావాన్ని ఒక్క సామెతతో తెలియజేయవచ్చు. చెప్పే విషయాన్ని అందంగా, ఆసక్తి కరంగా చెప్పడానికి సామెతలు ఎంతగానో ఉపయోగపడతాయి.
కొండంత విషయాన్ని సూక్ష్మంగా చెప్పేందుకు, మన మనోగతాన్ని ఎదుటి వారికి స్పష్ట పరిచేందుకు ఈ సామెతలు మనకు బాగా ఉపకరిస్తాయి. ఎంతో పెద్ద కథను ఒక్కొక్కసారి మూడు మాటల్లో ముచ్చటగా తెలుపుతాయి – “కట్టె – కొట్టె – తెచ్చె” అన్న మూడు ముక్కల్లో రామాయణాన్ని చెప్పినట్లు. చాలా సందర్భాలలో భావప్రకటనకు దోహదం కల్గిస్తాయి. ఒక్క సామెతైనా రానివాడు నిజంగా ఒక రకంగా మూగవాడే. యతైనా, ప్రాసైనా ఈ సామెతల్లో వుంటుంది. కొన్ని చోట్ల రెండూ ఉంటాయి.
తెలుగు సామెతలు సముద్రంలా అంతులేనన్ని ఉన్నాయి. కొందరిని కదిలిస్తే ‘సామెతల పుట్ట’ అన్నట్లుండేవారు. ముఖ్యంగా స్త్రీలు – అందునా అమ్మమ్మలు, నాయనమ్మలు వంటివారు – ఈ సామెతలను ఉపయోగించడం ఎక్కువగా ఉండేది. వాళ్ళు ఎక్కువగా చదువుకోక పోయినా, జీవితానుభవం నుండి వారు ఉదహరించే సామెతలు వారి జ్ఞానానికీ, తెలివితేటలకూ దాఖలాలుగా ఉండేవి.
భాష లోని గొప్ప సొగసు గా భావించబడుతున్న ఈ సామెతల సంపదను ఈతరం కోల్పోకుండా అంది పుచ్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంతులేని సముద్రమంతటి సామెతల సంపదలో కొన్నింటిని ఏర్చి కూర్చిన సంకలనమే – ఈ ‘ప్రజా సూక్తం’. ఈ ప్రజాసూక్తాన్ని రచించినది ప్రజలే కాబట్టి ఇది అందరి సొత్తూ .!! అచ్చయిన తరువాత నాలుగు సార్లు పునర్ముద్రణకు నోచుకున్నది ఈ ప్రజాసూక్తం – తెలుగు భాషాభిమానులకు ఎంతటి ప్రీతి పాత్రమో చెప్పకనే చెప్తోంది.
ఈ పుస్తకాన్ని పూర్తిగా చదువుకోవాలంటే ఈ క్రింద ఇచ్చిన link ను ఉపయోగించుకోవచ్చు.
https://archive.org/details/praja-suktham/mode/1up
లేదా క్రింద ఇచ్చిన QR code ను scan చేసి అయినా ఈ పుస్తకాన్ని చదువుకోవచ్చు.