నా రైలు ప్రయాణం

0
4

[dropcap]రై[/dropcap]లెక్కడం అంటే ఇష్టం లేని బాల్యమే ఉండదు. మరి మా రోజుల్లో అయితే ఎక్కడికి దూర ప్రయాణాలు చేసేవాళ్ళు కాదు కాబట్టి. అందునా ‘కూ చుక్ చుక్’ అంటూ శబ్దం చేస్తూ పొగను బయటకు వదుల్తూ బోలెడు పెట్టెలతో సాగే రైలు బండి ఎంతిష్టమో. దాంతో పాటు చుక్ చుక్ రైలు వస్తోంది; దూరం దూరం జరగండి; ఆగినాక ఎక్కండి; జో జో పాపా ఏడువకు, లడ్డూ మిఠాయి తినిపిస్తా; ఆంధ్రా కాఫీ తాగిస్తా; అనే పద్యాలు, పాటల్లో రైలు గురించి విన్నాక ఎప్పుడెప్పుడా అనుకుంటారు కదా! నాక్కూడా రైలంటే ఇష్టమే బాల్యంలోనే కాదు పెద్దయ్యాక కూడా!

రైల్వే స్టేషనూ, బస్టాండు ఎదురెదురుగా ఉండే చీరాల మా వూరు. రైల్వే స్టేషను, రైళ్ళు అందుబాటులో ఉన్నా రైల్లెక్కిన సందర్భాలు చాలా తక్కువ. ఎందుకంటే మా బంధువులందరూ చీరాల్లోనే ఉన్నారు. స్కూలు రోజుల్లో  అందరూ శలవులకు చుట్టాలిళ్ళకు వెళ్ళి నాలుగు రోజులు ఉండి వస్తుంటే నాకూ వెళ్ళాలనిపించేది. ఏం చేద్దాం వేరే ఉళ్ళలో ఎవరు లేరు. ఉళ్ళో ఉన్న చుట్టాలింట్లో ఫంక్షన్లయినా కూడా రాత్రికి ఇంటికి వచ్చి పడుకుని తెల్లారి మరలా వెళ్ళేవాళ్ళం తప్ప నాలుగు రోజులూ వాళ్ళిళ్ళలో ఉండేవాళ్ళం కాదు. బాత్రుములు సరిగా ఉండవు పెళ్లి జనంతో అని, పడుకోడానికి మంచాలుండవని మా అమ్మ ఇంటికి తీసుకోచ్చేసేది. కాని పిల్లలకివన్ని తెలియవు కదా! నచ్చేది కాదు.

ఒకసారి తెనాలిలో పెళ్ళికెళ్ళాటానికి రైల్లో వెళ్ళాలని నిర్ణయించుకున్నారు మా అమ్మావాళ్ళంతా. మొత్తం ముప్పై మందిమి అయ్యాం. మాకు చాలా సంబరమేసింది. అందరం సంతోషంగా రైలేక్కాం. పొడవాటి సీట్లలో అందరూ బంధువులే ఉంటే ఆ ఆనందమే వేరు కదా! కిటికీ పక్క సీట్లలో పిల్లలం కూర్చున్నాం. రైలింకా స్టేషన్లో ఉన్నది. మేం ఎక్కేశాం కాబట్టి రైలు కదల్లేదని నిరాశగా చూస్తున్నాం. మా మనసులో భావం కనిపెట్టినట్లుగా మా మావయ్యలు ‘ఏంటి రైలు కదలట్లేడా?’ అనగానే ‘ఊ ఊ’ అంటూ గబ గబా తలుపాము. “మరి మీరు తోస్తే కదా! ఎలా కదులుతుంది? పిల్లల్లారా తోయండి. కిటికీలు గట్టిగ పట్టుకొని తోస్తూ ఉండండి కాసేపటికి కదులుతుంది” అన్నాడు మా మావయ్య. సరేనని వెంటనే మా బలాన్నంతా ఉపయోగించి రైలును తొయ్యడం మొదలు పెట్టాం. కిటికీలు పట్టుకొని ‘ఊ కదులు! కదులు’ అంటూ తోశాం. రైలు కదల్లేదు “మీరు తోస్తూనే ఉండాలి. కొద్దిసేపటికి మీ బలం సరిపోయి కదుల్తుంది” అన్నాడు మావయ్య. మేం శక్తి వంతన లేకుండా తోస్తూనే ఉన్నాం. కొద్ది సేపు తర్వాత రైలుకు సిగ్నల్ వచ్చింది కాబట్టి రైలు నడిచింది. మా మొహాలు ఆనందంలో వెలిగిపోయాయి. మా పిల్లల బలంతోటే రైలు నడిచిందని అనుకున్నాం. అలసిపోయిన మొహాలను కిటికీ దగ్గరగా పెట్టి చల్లటి గాలికి చిరు చెమట అరుతుంటే కేరింతలు కొట్టాం. రైలెక్కినప్పుడల్లా ఈ విషయాలు గుర్తొస్తే ఆనాటి అమాయకత్వం గుర్తొచ్చి నవ్వొస్తుంది.

నేనూ నా పిల్లలకు ఇలాగే చెప్పి అటలడాలనుకున్నాను. కానీ వాళ్ళకు ఊహ వచ్చాక రైలెక్కలేదు. నెలల పిల్లల వయసులో మాత్రమే రైలు ప్రయాణాలు చేశాం. రైల్లోని సీట్లో పసివాడు పడిపోకుండా నేను పడుకుని రాత్రంతా ప్రయాణం చేయడం ఒక టాస్క్ గానే ఉండేది. వాడికి పాలిస్తే పడుకుని ప్రయాణం చేయడం, రైల్లోనే పాల బాటిళ్ళు శుబ్రం చేసుకోవడం, వేడి నీళ్ళలో పాలపొడి వేసుకుని పాలు కలుపుకోవడం, ఇప్పటిలా డైపర్లు లేవు కాబట్టి మాటి మాటికి బట్టలు మార్చడం వంటి పనులన్నీ రైల్లోనే చేసుకోడడం గమ్మత్తుగా ఉండేది. రెండు సీట్ల మధ్యలో చీరతో ఉయ్యాలా వేసి దాంట్లో పిల్లాడిని పడుకోబెట్టి, దానిని ఉపుతూ నిద్రపోవడం అప్పటికి కష్టమైన విషయమే గానీ ఇప్పటికి ఒక తియ్యని జ్ఞాపకం.

మేం హైస్కులు చదువులో ఉన్నపుడు ఒకసారి విజయవాడకు రైల్లో వెళ్ళాం. రాత్రి పది, పదకొండు గంటలకు రైలేక్కాం. మా కుటుంబం, మా పెదమ్మ కుటుంబం కలిసి వెళ్తున్నాం. విజయవాడలో మా పెద్దమ్మ కూతురు ఉంటుంది. ఆ అక్కకు సీమంతం చెయ్యడానికి వెళ్తున్నాం. రైలేక్కగానే నేను మా తమ్ముడు నిద్రపోయాం. ఇక పిల్లలెవరూ లేకపోవటంతో ఆడుకునేందుకు ఎవరూ లేక, పెద్దవాళ్ళు వాళ్ళ మాటల్లో వాళ్ళు పడిపోవటం వాళ్ళ మేం నిద్రపోయాం. బాగా నిద్రలో ఉన్నపుడు మా అమ్మ నిద్రలేపింది. ఏంటని అడిగితే దణ్ణం పెట్టు కోవాలి లే అన్నది అమ్మ. అప్పుడే ఇంటికెళ్ళిపోయామా! రాత్రి రైల్లో పడుకున్నాం కదా! ఇలా ఆలోచనలతో అర్థంకాక నిద్ర లేచాం. మా అమ్మ అర్థ రూపాయి బిళ్ళలు చేతికిచ్చి కిటికీలో నుంచి బయటకు విసిరి దణ్ణం పెట్టుకోమని చెప్పింది ఎందుకో అర్థం కాలేదు. అమ్మ చెప్పినట్లే చేసి దణ్ణం పెట్టుకున్నాం. ఆ తర్వాత గమనిస్తే దడ దడ అంటూ పెద్ద శబ్దం వస్తోంది. కింద కృష్ణానది పారుతోంది. ఇందాక కృష్ణమ్మ తల్లికే మీరు దణ్ణం పెట్టుకున్నది. నీళ్ళ శబ్దం వినబడుతోందా! అన్నది అమ్మ. అప్పుడు గమనిస్తే నీళ్ళ హోరు వినిపించింది. చీకట్లో నీళ్ళ హోరు, బ్రిడ్జి దడ దడలు, రైలు వేగం అన్ని కలగలసి భయమేసింది. ఈ ప్రయాణం కొద్దిగా భయాన్ని కలిగించింది. విజయవాడ దిగాక కూడా భయమేసింది అది జంక్షన్. విజయవాడ పెద్ద ఊరు కాబట్టి అటూ ఇటూ చాలా రైళ్ళు కూ అంటూ హడావిడిగా తిరిగేస్తున్నాయి. చుట్టూ తిరిగి వెళితే చాలా దూరమవుతుందని మా పెదనాన్న రైలు పట్టాలు దాటుకుంటూ తీసుకెళ్ళాడు ఎటువైపు నుంచి రైలు వస్తోందో తెలియడం లేదు. ఒకచోట రైల్వే గార్డు ఇలా పట్టాల మీద నడవకూడదని హెచ్చరించాడు. అదెంత ప్రమాదమో ఇప్పుడు గుర్తొస్తే ఒళ్ళు గగుర్పోడుస్తుంది.

అయితే ఇంత వరకూ రైల్లో ఫస్ట్ క్లాస్‌లో ప్రయాణం చేయలేదు. ఈ మాట ఒకసారి స్నేహితులతో అన్నాను. అయితే వెంటనే ఫస్ట్ క్లాస్ రైలు ప్రయాణం చేద్దామని స్నేహిత కుటుంబం ఏర్పాట్లు చేసింది. అంతే! హైదరాబాద్ నుండి విశాఖపట్నం దాకా దురంతో ఎక్స్‌ప్రెస్‌లో ఫస్ట్ క్లాస్ కూపేలో ప్రయాణం మొదలైంది. దాదాపు పాతికేళ్ళ తర్వాత రైలెక్కాం. కొంచెం ఉద్విగ్నంగా ఉంది. అందరం కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం. నిద్ర పోదల్చుకోలేదు. మామూలు సీట్ల కన్నా నాకిది విచిత్రంగా అన్పించింది. కూపేకు తలుపులు కర్టెన్లు ఉన్నాయి. దుప్పట్లు, దిండ్లు బాగున్నాయి. నేను ఒకసారి బోగీ అంత తిరిగి చూశాను. గ్రీన్ కలర్ కార్పెట్‌తో బోగీ పొడవున సాంప్రదాయ చిత్రకళల పెయింటింగులతో సుందరంగా ఉన్నది రైలు. బాత్ రూమ్, టాయ్ లెట్ లు శుబ్రంగా గీజర్లు, షవర్లతో ఆధునికంగా ఉన్నాయి. సింక్ దగ్గర హాండ్ వాష్ బాటిల్, శానిటైజర్ బాటిల్ ఉన్నాయి. నాకు ఆనందం ఎక్కువై బోగీ అంతా తిరిగి వీడియో తీశాను. ఈ వీడియోను నా యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేశాను. రైల్వే స్టేషన్లో కూడా ఒక ప్లాట్‌ఫారం నుంచి మరో ప్లాట్ ఫారంకు లిఫ్ట్ ఉన్నది. నేనింతకు ముందు లిఫ్ట్‌ను చూడలేదు. కాళ్ళ నొప్పులతో ఆ మెట్లన్నీ ఎక్కడానికి మా అమ్మ పడిన కష్టం గుర్తుకొచ్చి కంట్లో నీరు తిరిగింది.

ఈ ప్రయాణం చేసిన నెలకే మరో రైలు ప్రయాణం వచ్చింది. ఈసారి ప్రయాణం బెంగుళూరు నుండి హైదరాబాద్ వరకు జరిగింది. ఇది మామూలు స్లీపర్ క్లాసు ప్రయాణం. దాదాపు 13, 14 గంటల ప్రయాణం. ఎప్పుడూ ఫ్లైట్‌లో గంటలో వెళ్ళిపోయేదాన్ని! ‘రైలు ప్రయాణమే ఆనందంలో ఇప్పుడు ఇన్ని గంటలు కూర్చోగలవా’ అంటూ మా పిల్లలు వద్దన్నారు. నాకూ భయమేసింది. ఈసారి నాతో ఎవరూ మావాళ్ళు రావటం లేదు. కేవలం స్నేహిత కుటుంబం తప్ప. అందులోనూ అప్పర్ బెర్తులు వచ్చాయి. ఎలహంక నుంచి కాచిగూడ దాకా ప్రయాణం రైలెక్కి సామాను సీట్ల కింద పెట్టి మేం మాట్లాడుకుంటూ కూర్చున్నాం. కిటికీ పక్క బెర్త్‌లో కూర్చుని కబుర్లాడుతున్నాం. ఒక కన్నడ ఫామిలి ఎక్కారు. వాళ్ళతో మాటలు కలిపి కన్నడ భాషలోనే సంభాషించాం. ఇంకో ఫ్యామిలీ తెలుగు వాళ్ళెక్కారు. వాళ్ళు కబుర్లలో పడ్డారు. ఒక తమిళ అబ్బాయి, ఒక హిందీ అబ్బాయి, మల్టి లింగ్యువల్ బోగీ అయింది. కన్నడ ఫ్యామిలీకి భక్తి పాటలిష్టం. నేను పాడిన కన్నడ పాటలు వినిపించాను సంతోషపడ్డారు. ఈ పాటల గోలకి పక్క లైను వాళ్ళు కూడా వచ్చారు. నేను చేసిన వీడియోలు తెలుగు ఫ్యామిలీకి నచ్చాయి. ఒకరు తెచ్చుకున్న ఫుడ్ మరొకరితో షేర్ చేసుకున్నాం. ఎంతో కాలం నుంచి తెలిసున్న స్నేహితుల్లా కబుర్లాడుకున్నాం. ఒకరి ఫోన్ నెంబర్లు మరొకరు తీసుకున్నాం. చాలా సరదాగా అన్పించింది. ఈ కబుర్లలో హైదరాబాద్ ఎప్పుడొచ్చిందో తెలియదు ఎంతో బాగుంది. ఇవి నా రైలు ప్రయాణాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here