జీవనవాస్తవికతకే చాసో పెద్ద పీట

0
3

[‘సాహితీ స్రవంతి’ విజయనగరం వారు 2-1-23న నిర్వహించిన సభలో చాసో వర్ధంతి సందర్భంగా శ్రీ మల్లాప్రగడ  రామారావు చేసిన ప్రసంగ పాఠం]

ఉపోద్ఘాతం

[dropcap]రా[/dropcap]జమహేంద్రవరంలో మేము 1980 డిసెంబర్ 25న ప్రారంభించి, కొన్నేళ్లు ఘనంగా నిర్వహించిన ‘సాహితీవేదిక’ గత నెల 25, 26 తేదీలలో జరిగిన సమాగమ సభలతో తిరిగి ప్రాణం పోసుకుంది. అప్పటి ‘వేదిక’ సమావేశాలలో, నెలలో ఒకసారి ఏదైనా రచన లేదా రచయిత పైన ‘సమాలోచన’ కార్యక్రమం ఉండేది. అందులో ప్రసంగ వ్యాసాలు చదవడమే గాని ప్రసంగించడం నిషిద్ధం. ఆ సంప్రదాయాన్నే ఇక్కడా పాటిస్తాను.

కథలలోకి వెళ్లే ముందు కమామిషు

నేను చాసో గారి వీరాభిమానిని.

ఉహుఁ కాదు. చాసో గారి అసంఖ్యాక వీరాభిమానులలో ఒకడిని. 70 లకి ఎలా వ్రాయాలో, ఎందుకు వ్రాయాలో, కొంత తెలుసుకున్నాననుకున్న వాడిని. కానీ తొలి తరం అభ్యుదయ కథకుల కృషి గురించి అంతగా తెలియనివాడిని. ఆ రోజులలో ‘ఆంధ్రజ్యోతి’ వారపత్రికలో రెండు అద్భుత కథలు చదివాను. ‘ఎవరీ కుర్ర రచయిత చెయ్యి తిరిగిన రచయితలనే మించిపోయాడ’ని అబ్బురపడ్డాను. ఇంతలో ‘జ్యోతి’ మాస పత్రికలో పడిన మరో కథకు ఆరుద్ర గారి స్పందన ‘చాసో, శభాషో!’ కళ్ళబడింది. ‘కుర్రాడు ఇంత బాగా రాస్తుండబట్టే పెద్దలు కూడా మురిసిపోతున్నార’ని సంబరపడ్డాను.

కాలచక్రం తిరుగుతుంది కదా. క్రమంలో ‘విశాఖసాహితి’ ఏర్పడింది. కీర్తిశేషులు అంగర వెంకట కృష్ణారావు గారు నన్ను ఆ సంస్థకు కార్యదర్శిని చేశారు. ఆ కారణంగా కొన్నాళ్లకు మరో యశఃకాయులు భమిడిపాటి రామగోపాలం గారితో పరిచయం, క్రమేణా స్నేహం ఏర్పడ్డాయి. వారికి చాసో గారి కథల పట్ల నా అతిమక్కువ తెలుసు. అందుకని ఒకరోజు “చాసో గారు మా ఇంటికి వస్తారు. కలుస్తారా?” అని అడిగారు.

గారె విరిగి నేతిలో పడడమంటే ఇదే కదా!

ఒక సాయంకాలం, అప్పుడు విశాఖపట్నంలోని కృష్ణానగర్‌లో ఉంటున్న రామగోపాలం గారి మేడ మీద వాటాకు నేను, మరో ఇద్దరో, ముగ్గురో ‘విశాఖసాహితి’ సభ్యులం, బహుశా ఆనాటి ‘విశాఖ సాహితి’ సంయుక్త కార్యదర్శి అంగర వెంకట శివప్రసాద రావు గారు, ‘శివ్రాజు’ పేరుతో కథలు వ్రాసే కోశాధికారి వై.వి.ఎస్. నూకరాజు గారు, సభ్యుడు నవులూరి వెంకటేశ్వర రావు గారు చేరుకున్నాం. చిరునవ్వుతో “వీరేనండి మీ కుర్ర రచయిత” అంటూ చాసో గారి పరిచయ భాగ్యం కలిగించారు భరాగో. మేం అప్రతిభుల మయ్యాం.

ఇది సహజోక్తే.

నవ్వు ముఖం. పంచ, లాల్చి, నోట్లో కాలుతున్న చుట్ట.

పనిలో పనిగా ఆ మాటా చెప్పేస్తాను. మా అప్పగారి, అంటే మా నాన్నగారి, వేషధారణ అదే. వారు కాల్చేది చుట్టలే. కొంత అజ్ఞానం తొలగిందనుకున్నాక నే రాసిన మొదటి కథ శీర్షిక కూడా ‘చుట్టలు’.

చెప్పాల్సింది ఇంకా ఉంది.

‘శాఖసాహితి’ ప్రచురించిన తొలి కథాసంకలనం ‘ప్రతిబింబాలు’ ఆవిష్కరించినది కూడా చాసో గారే.

ఆనాటి వారి ప్రసంగంలో మొదటి వాక్యమే “అద్దంలో ప్రతిబింబాలు కుడి ఎడమలుగా కనబడతాయి”. నా గుండె గుభేల్మంది. విశాఖ సాహితి ప్రథమ వార్షికోత్సవ సందర్బంగా ప్రచురిస్తున్న తొలి కథాసంకలనం చాసో గారు ఆవిష్కరించాలన్నది నా ప్రతిపాదనే. ఒక్కక్షణం విరామం తర్వాత “కానీ, ఈ పుస్తకంలో కథలు సమాజ వాస్తవ రూపాన్నే చిత్రిస్తున్నాయి” అని వారనడంతో తేరుకున్నాను.

ఇంతటితో అయిపోలేదు.

‘విశాఖ సాహితి’ సభ్యులు దివంగత ఎస్. కాశీవిశ్వనాథం గారు ఈ విషయం ‘ఆంధ్రజ్యోతి’ వారపత్రిక కార్యాలయంలో కీర్తిశేషులు పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి దగ్గర ప్రస్తావించడంతో, ఆ వారపత్రికలో ‘ప్రతిబింబాలు’ పుస్తక సమీక్ష ఆ వాక్యంతోనే మొదలెట్టారు శర్మ గారు.

ఇక కథాయాత్ర

అన్ని కథల గురించి చెప్పడం కుదరదు కదా. అందుకని కథలన్నిట్లోనూ ఉండే కొన్ని సామాన్య లక్షణాలతో మొదలెడతాను.

తన కథల్లో ఏ సందేశాన్నీ వాచ్యంగా చెప్పలేదు. వాస్తవ జీవన చిత్రణే చాసో ప్రాధాన్యం. ‘గుడిసె దీర్ఘ రోగి’ కథలో మనిషిలో సౌందర్య పిపాస అంతర్గతమై ఉంటుందన్న సత్యాన్నీ వెల్లడించారు.

కథకు సంబంధించిన అన్ని విషయాలలో లాగే, శీర్షిక నిర్ణయించడంలో కూడా చాసో గారి అనన్య ప్రతిభను చూడగలం. ‘బదిలీ’కథకు ఆ పేరు పెట్టడంలోనే కథకుడి తీర్పు కనిపిస్తుంది.

‘బొండుమల్లెలు’ కథకు సాధారణ వామపక్ష రచయితలు ఆ పేరు ఉంచరు.

పలువురు ప్రసిద్ధ రచయితల చిరునామా వారి శైలిలోనే ఉంటుంది. ఉదాహరణకి శ్రీపాద, రావిశాస్త్రి, మధురాంతకం రాజారాం. అలా దొరకరు చాసో. కథా ఇతివృత్తమే చాసో శైలి నిర్ణయిస్తుంది. ఆ విషయంలో ఆయన ప్రమేయం కనబడదు.

అంతేకాదు. కథల ఇతివృత్తాలలో ఇంత వైవిధ్యం ఎక్కడా చూడం. జీవితంలోని అన్ని దశలు, మానవులలో అన్ని తరగతులు, వైయక్తిక సంఘర్షణలు, సామాజిక సంబంధాలు ఇతివృత్తాలుగా చాసో స్వీకరించారు. అణగారిన వర్గాల జీవన స్థితి గతులను కథా వస్తువుగా పరిగణించిన వారు అరుదైన ఆ కాలంలో ఆ బాధ్యత చాసో గారు తలకెత్తుకున్నారు. ఈ సందర్భంలో నాకు ఇంకొకరు గుర్తొస్తున్నారు. వారే ‘కరుణకుమార’ గా ప్రసిద్దులైన కీ.శే. కందుకూరి అనంతం గారు.

బాల కథా రచయితలను ఆలా ఉంచితే పిల్లల కథలు వ్రాసిన వారిలోనూ చాసో గారు ముఖ్యులు. కొన్ని గంభీరమైన ఇతివృత్తాలు (కుంకుడాకు, ఎందుకు పారేస్తారు నాన్నా). అందులో కొన్ని కథలు పిల్లలు కూడా ఆస్వాదిస్తారు (బొమ్మల పెళ్లి, బబ్బబ్బా).

కొన్ని కథలు వ్యంగ్య ప్రధానం (బూర్జువా కుక్క, ఫారిన్ అబ్బాయి)

ఇక వర్ణనల విషయానికొస్తే.. ఎక్కడ ఆకారాలు వర్ణించాలో, ఎక్కడ అంతరంగాలను ఆవిష్కరించాలో, ఎక్కడ పరిసరాలను కళ్ళకు కట్టించాలో చాసో గారికి తెలుసు.

చాసో కథలలో పాత్రలు వాటి గొంతుతో మాట్లాడుతాయి. ఆ స్వరం వారి జీవన నేపథ్యం వల్ల వచ్చినది. విభిన్న ఆనువంశిక, సామాజిక సాంప్రదాయాలలో పెరిగిన మామూలు మనుషుల మాటలు పట్టుకోవడంలో చాసో ఉద్దండులు.

ఉదాహరణకి ‘కర్మ సిద్దాంతం’ కథలో పుల్లమ్మ, పేరక్క.

వారిద్దరి మాటలు అత్యంత సహజంగా, వారి కుటుంబ నేపథ్యానికి, సంస్కారానికి తగినట్టు ఉంటాయి. నాటి బ్రాహ్మణ స్త్రీల పలుకుబడి ఇంతగా పట్టుకున్న మరొకరు ప్రాతః స్మరణీయులు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. అయితే శాస్త్రి గారు మాటలు పొగిడిస్తారు. చాసో తూకం పాటిస్తారు.

పాఠకుల తెలివి మీద నమ్మకం ఉంచి, గుంభనంగా కథ చెప్పడం చాసో విధానం. ఊరంతా పెళ్ళాంతో సహా కొడుకుని పట్టణానికి చదువుకి పంపించమని ఎన్నివిధాల చెప్పినా వెలం వెంకడు వినడు. కథ ముగియనుండగా “నువ్వు బూమి బద్దలు చేసుకుంటూ సవ్వు. నా కూర్మిగాడు పట్నం ఎల్తాడు” అని గుడిసెలో నుంచి నాయురాలు వచ్చింది. “నువ్వు పంపి తీరాలి. సచ్చి తీరాలి’. అని ధ్వనించింది. అదీ ఖాతరు చెయ్యని వెంకడు “ఓలెల్లే ఇక్కణ్ణించి” అన్నాడు.

“అందరూ ఎల్లండి” అని మెడ తణువుకుంది నాయరాలు. నాయురాలి మెడనిండా మెడ తిరగని బంగారం. ఆ దెబ్బతో వెంకడి బుద్ధి మారిపోయింది. ‘వెలం వెంకడు’ కథలో ఇదే కొసమెరుపు.

కొన్ని కథల గురించి.

“గర్జించు రష్యా! గాండ్రించు రష్యా!” అని అభ్యుదయ కవులు కేకలు వేస్తున్న ఏడాదికే చాసో గారి తొలి కథ ‘చిన్నాజీ’ అచ్చయింది. “తెలుగు కథా సాహిత్యానికి మార్క్సిస్ట్ దృక్పథాన్ని అద్దిన మొట్టమొదటి కథా రచయితను నేను” అని చాసో స్పష్టం చేశారు. అంతవరకే. ఎప్పుడూ ఆ సిద్ధాంతాన్ని రుద్దలేదు. అద్దడానికి, రుద్దడానికి తేడా తెలియాలంటే, ‘బొండు మల్లెలు’ చదవాలి. కథా ఇతివృత్తంలో విశేషమేమీ లేదు. సూక్ష్మంగా ఇదీ కథ.

ఊళ్ళో పువ్వులకి మంచి ధర వున్నది. వూరికే వుంది కథకుడి ఇంటి వెనక పెరడు. మల్లెలమ్మి డబ్బు చేయడంలో కొంత దోపిడీ వున్నా ఆ దోపిడీ న్యాయంగా కనబడ్డది. ప్రజలను దోపిడీ చేసి ఐశ్వర్యవంతులైన వాళ్ళే మల్లెలు కొంటారు కాబట్టి. గోతులు త్రవ్వడం దగ్గర్నుంచి మల్లెలు అమ్మడం వరకు చేయడానికి ఒక తాతని కుదుర్చుకుంటాడు తేరగా. ఆ తోటవల్ల కథకుడికి మూడు వందల రూపాయల లాభం వచ్చింది. తోట పనిచేసి జీతం ఇంట్లో ఇచ్చినన్నాళ్ళు తాతని కూతురు బాగానే చూసింది. తర్వాత వదిలేసింది. దరిమిలా ఆ తాత చనిపోయాడు. తాత వృత్తాంతం ఆలోచించిన కొద్దీ కథకుడికి తాను చేసిన ద్రోహం తెలిసొచ్చింది. అలాగే తెలుసుకోగల పాఠకుడికి శ్రమ దోపిడి, అదనపు విలువలంటే ఏమిటో బోధపడుతుంది.

ఇంకొక కథ.

నాకు నచ్చడం కాదు. నా నమ్మకానికీ ఒక ఊతం ఇచ్చిన కథ ‘కర్మసిద్ధాంతం’.

ఈ కథలో రెండే ముఖ్య పాత్రలు. పుల్లమ్మ, పేరక్క. పేరక్క మాటల్లో చెప్పాలంటే.. ‘పుల్లమ్మ ఎప్పుడూ వెధవ సంసారంలో జలగలాగ కొట్టుకు చస్తుంది’. ఎంత చీకటితో లేచినా ఆమెకు ఇంటి పనులు తెమలవు. పేరక్క విషయం వేరు. ఆమె మహావేదాంతి. ఇంట్లో కోడళ్ళకి పనిపాటలలో పూచిక పుల్ల సాయం చెయ్యదు. నోములు, వ్రతాలు, యాత్రలు అన్నీ చేసింది. భారత, భాగవత పురాణాలు, సూక్తులు, కీర్తనలు వగైరా వందలు, వేలు కంఠతా. కానీ ఆమెకూ గుళ్లో పురాణ పఠనం చేసే ఉర్లాం పండితుడికీ.. (ఆ వున్నదేమిటో పాఠకుల ఊహకే వదిలేసారు చాసో).

ఈ కథలో పేరక్క భాగోతం పూర్తిగా తెలిసిన పాత్ర ఇరుగమ్మ. ‘పిల్లలకి ఇంత అన్నం పెట్టి, ఒకరికింత సాయం చేయాలన్న’ది ఆమె మతం. అది నా అభిమతం కూడా.

తప్పక ప్రస్తావించవలసిన కథ మరొకటుంది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని నిర్ద్వంద్వంగా ప్రకటిస్తుంది ‘బండపాటు’ కథ. బండ పడి క్వారీ కూలి రామి గాడు మరణిస్తాడు. ఆ మరణం వెనక ఉన్న అనేక అతిక్రమణల నుండి తనను కాపాడుకోవాల్సిన అగత్యం కాంట్రాక్టర్‌ది.

అదును చూసి సొమ్ము చేసుకునే నేర్పు మేస్త్రీ సత్యంది. అదంతా అయిన తర్వాతే కథ మొదలవుతుంది. “పనిచేస్తూ సచ్చాడు. పని సేయించునోణ్ని నిలదీసి అడగొద్దా” అని ప్రశ్నిస్తాడు అంతవరకు కనబడని నోరున్న నాగన్న. “కాంట్రాక్టర్ డోలు చించుతానన్నాడు సత్తెం” అన్నాడో వందిమాగధుడు. “వదుల్తామురా?

ఎర్రప్పా!” అన్నాడు మేస్త్రీ.

“పాకలో ఉంది బేగెళ్ళు” అన్నాడు మరో పనివాడు. పాకనగానే పరిగెట్టాడు నాగన్న తానూ పట్టు పట్టడానికి. అందర్నీ మేపిన మేస్త్రీ రామిగాడి భార్య పార్వతికీ మూడు వందలు ఇప్పించాడు. అంతటితో అయిపోయిందా! వారం తిరగకుండా దిగిపడ్డాది చచ్చిన వాడి తల్లి దామాలు. దామాలు కొడుకుని చూసి ఐదారేళ్లయింది. ఆమె పోరు పడలేకనే రామిగాడు పార్వతిని వెంటబెట్టుకుని కొండల మధ్య రాళ్లు కొట్టుకొని బతుకుతున్నాడు. కాంట్రాక్టరిచ్చిన దాంట్లో “తల్లికింత అనొద్దా” అని అడిగిన దామాలుకు ఉన్న నాలికకు మందు వేస్తే కొండనాలిక పోయేటట్టు ఒక బాంబు పేల్చాడు మేస్త్రీ. “చచ్చిన వాడి పెళ్ళానికి మీరుండే ఇంట్లోనూ, కుండ, నులకా ఏటుంటే ఆట్లోనూ వాటా వస్తుంది”. దాంతో నెత్తిన చేతులు పెట్టుకుని ఎవ్వరి ముఖం చూడకుండా వెళ్ళిపోయింది దామాలు.

పార్వతి ఏమీ తీసిపోలేదు. భర్త ఉండగానే పార్వతికి ఇంకో మొగుడున్నాడు. ఆడు మొన్న రాత్రే ఆమె గుడిసె చేరుకున్నాడు. “ఆడు పాలెంలో గేదెను బేరవాడుతున్నాడు”.

కథలో ఆది నుంచి అంతా కనిపెడుతున్న కనకమ్మ కూడా ఉంది. జరిగిన ఘోరం వల్ల మేస్త్రీ నొక్కిన రెండు వందలలో కనకమ్మకొక కోక కూడా దక్కింది.

వామపక్షభావాలతో రచన చేసే వాళ్ళలో, ఇలా జీవనవాస్తవానికి ద్రోహం చేయని ఒక నవల ‘గెద్దలాడతండాయి’ చదివే అదృష్టం నాకు కలిగింది. వ్రాసిన వారు బండి నారాయణస్వామి గారు.

సిద్ధాంతం ప్రధానమైన కథ ఇందుకు భిన్నంగా వుంటుంది. ఒక ఉదాహరణ.

‘అదిగో నవలోకము’ అని, ‘కొత్త జీవితం’ కథలో ప్రసిద్ధ రచయిత, మేధావి కొడవటిగంటి కుటుంబరావు గారు మురిసి పోయారు.

కథానాయకుడైన కార్మికుడికి తన గ్రామంలో ఉన్న, తన వర్గానికే చెందిన వాళ్లంతా ఒట్టి ఆశాపాతకులగాను, దోపిడీగాళ్లు గాను, ఇతరుల కష్టసుఖాలు తెలుసుకోలేని వాళ్లు గానూ కనిపించారు. అతని సహ కార్మికులే మనుషుల్న నిర్ధారణకు వచ్చి, “నిజమైన పారిశ్రామిక కార్మికుడిగా పట్నం ప్రవేశిస్తాడు”.

ఇలాంటి అమాయకత్వం కనబడదు చాసో గారి కథలలో. భిన్నంగా వుంటుంది.

చాసో గారు తక్కువ కథలే రాయడానికి కారణం ‘చిన్నాజీ’లో వారన్న క్రింది మాటలు కూడా కావచ్చు:

“విప్లవ బీజాలంటూ మనుషుల్లో ఉంటే, వీరగేయాలు పాడాలా, వెర్రి కేకలెయ్యాలా?”

ఒక అభిప్రాయభేదం

వివాహేతర సంబంధాలు ఏర్పడిన ముగ్గురు స్త్రీల కథలు చాసో రాశారు. ఇంతవరకే పోలిక.

వారి నేపథ్యాలు వేరు. ఒకరు గతిలేక (‘ఏలూరెళ్ళాలి’లో మాణిక్యమ్మ). ఇంకొకరు కోరి (‘బదిలీ’లో యువతి). మరొకరు ధనార్జనకై (‘లేడీ కరుణాకరం’). అయితే ఈ మూడు పాత్రలను ఒకే గాటను కట్టేసి “ఈ మూడు కథల్లోని ఆడవాళ్ళూ సమాన ఫాయిదా కలవాళ్ళని తెలుస్తుంది. నీతులూ, అవినీతులూ తాత్కాలిక విలువలనీ, సుఖంగా జీవించడం ఒక్కటే పారమార్థిక విలువ అనీ వీళ్ళ జీవితవేదాంతం.” అని పెద్దలు వెల్చేరు నారాయణరావు గారు సూత్రీకరించడం సబబు కాదని నాకనిపిస్తుంది. అయితే అందుకు కారణం చాసో కథలను వారు ఇలా అర్థం చేసు కోవడంలోనే ఉంది:

“చాసో కథల్లో ఉన్న మనుషులకి అంటే ప్రధాన పాత్రలకి ఆవేశాలుండవు; కామం, ప్రేమ, ఈర్య్ష, క్రోధం, ఇలాంటి ఉద్రేకాలుండవు. వాళ్ళు ఏ కోరికకీ లొంగిపోరు ఒక్క బతకాలనే కోరిక తప్ప.”

ఇందుకు బదులుగా ఒక్క ‘వాయులీనం’ కథ సరిపోతుంది.

ఈ మూడు కథలే తీసుకున్నా, ఈ సూత్రీకరణకు భిన్నంగా సాగుతాయి ‘’ఏలూరెళ్ళాలి’, ‘బదిలీ’ కథలు. సమయం పరిమితం కదా. ఒక్క ‘ఏలూరెళ్ళాలి’ కథ గురించే మాట్లాడుకుందాం.

సంగ్రహంగా ఈ కథ వెల్చేరు వారి మాటల్లోనే.. ఒక వూళ్ళో వున్న ఒక వయస్సు మళ్ళిన ఆడిటరు గారికి మాణిక్యమ్మ గారు అని ఒక ముఫ్ఫై ఆరేళ్ళ రెండో పెళ్ళాం ఉండేది. అవిడకి పిల్లలు లేరు. ఆ వూళ్ళోనే కాలేజీలో చదువుకుంటూ తన ఇంటి పక్క అద్దెకుంటున్న ఒక పద్ధెనిమిదేళ్ళ కుర్రాడితో చనువుగా మాట్లాడుతుండేది. ఓ రోజున మాణిక్యమ్మ గారు ఆడిటరు గారు ఇంట్లో లేని సమయంలో ఆ కుర్రాణ్ణి మచ్చిగ్గా ఇంటికి పిలిచి గదిలోకి తీసికెళ్ళి కావిలించుకుని, ముద్దులు పెట్టి కామోద్రేకం కలిగించి సిగ్గు పడుతున్న ఆ అబ్బాయి సిగ్గుపోగొట్టి ప్రోత్సహించి అతనితో రహస్యంగా సంబంధం పెట్టుకుంటారు.

మాణిక్యమ్మ గారు ఎందుకలా చేయ వలసి వచ్చిందో, ఆవిడ మాటల్లోనే “ఎలాగో నన్నుద్ధరించావు. ఈ వరప్రసాద్ ఉండబట్టి ఆయన గణితం డబ్బు, పిత్రార్జితం దాఖలు పడ్డాయి. లేకపోతే నా మరుదులు ముండను చేసి మూల కూచో పెడుదురు”.

అంతమాత్రాన “ఆవిడ దృష్టిలో పురుషోత్తం కాసిన్ని వీర్యకణాలు సకాలంలో సమకూర్చి పెట్టిన ఒక మొగకుర్రాడు. అంతే” అని సూత్రీకరించడం సబబు కాదు.

కథ మొదటి భాగంలో పురుషోత్తం తనను గుర్తుపట్టలేనప్పుడు, “అవును మగాళ్ళవి రాతి గుండెలు. నెరరాపేక్షలు ఉండవు. జ్ఞాపకా లుండవు. ఆడవాళ్లు మనసులో ఉంటారా?” అన్న మాణిక్యమ్మ గారి మాటలను “లోకతీరుగా గమనించాలన”డం మరీటా బేసబబు.

అదే నిజమైతే తన పిల్లడు “నీ మూడు మూర్తులూ” అంటూ పురుషోత్తంతో చెప్పి మురిసిపోవడం ఎందుకు? దైవికంగా ఇన్నాళ్ళకి కలిసాం గదా అని పొంగిపోవడం, పెట్టె మీద పేరు చదివి నిర్ధారణ చేసుకుని మరీ పై బెర్త్ మీద పడుకున్న పురుషోత్తమాన్ని మహా స్వతంత్రంగా గుంజి, గుంజి లేపడం,

“బియ్యే పాసయావా” అని సంబరపడడం, “ఆదివారం రావాలి సుమా” అని కళకళ్ళాడడం పురుషోత్తం పట్ల మాణిక్యమ్మ గారికి నెరరాపేక్షలు ఉండబట్టే కదా.

చివరాఖరిగా

కీర్తిశేషులు అంగర వెంకట కృష్ణారావు గారు ఎప్పుడూ అనే మాట.

“ఒకసారి కథ రాసి లోకం మీద వదిలాక, ఎవరికి తోచినట్టు వారు అర్థం చేసుకుంటారు. మనం చేయగలిగింది ఏమీ లేదు.”

చాసో గారి ‘ఎంపు’ కథ బహు ప్రసిద్ధం. ఇది ముష్టి వాళ్ల కథ. తండ్రి కుష్ఠురోగి. అతడి కూతురు ఎర్రిని, మనువాడాలని కుంటాడి కోరిక. తండ్రి పట్టుదల. అందుకని కూతురికి ఇలా హితబోధ చేశాడు:

“సొట్టాడితోటెల్లినావా, నీకు కూడు నేదు సొట్టాడేగుమ్మమెక్కినా ధడీమని తలుపేసుకుంటారు. నిన్నాడికీ, ఈడికీ కుదిర్సి బతుకుతాడు. గుడ్డోడు మారాజు. కళ్ళు లేని కబోది. ఆణ్ణి సూస్తే జాలి పుడతాది. ఆడు అడ్డుమాలిన పాటగోడు. ఆడు సితారట్టుకొని డోలు వోయిస్తూ పాడినాడంటే రూపాయి డబ్బులకి నాగారాదు”.

ఎర్రి ఒప్పుకుంది.

 కానీ ‘ఎంపు’ కథ “తన కూతురికి ఎవరినిచ్చి పెళ్లి చేయాలో తెలివిగా నిర్ణయించిన తండ్రి లాగ, ప్రజలు ఎవరి చేతుల్లో దేశాన్ని పెట్టాలో ఆలోచించమని” చెప్పడానికి చాసో ‘ఎంపు’ కథ రాసారంటే, ఎవరం మాత్రం ఏం చేయగలం!

చెప్పాల్సిన విషయం

ఇది చాసోగారి స్మారకోపన్యాసం. కాబట్టి ఈ విషయం చెప్పడం నా బాధ్యత. నాస్తికులుగా, హేతువాదులుగా ప్రకటించుకున్న కొందరు జీవిత చరమాంకoలో ఆస్తికులయ్యారు. చాసో గారు మాత్రం కడవరకు హేతువాదిగానే ఉన్నారు.

తన సప్తతి సభలో చాసో గారు ప్రకటించిన విధంగానే, వారి కుటుంబ సభ్యులు చాసో పార్థివ దేహాన్ని వైద్యశాలకు అప్పజెప్పారు. నేత్రాలను దానం చేశారు.

మీకు తెలుసు శ్రీశ్రీ గారి విషయంలో అలా జరగలేదు. అందుకు కారణం ఒక ముఖాముఖిలో సరోజా శ్రీ శ్రీ గారు ఇలా వివరించారు.

“మరణించాక ఆయన శరీరాన్ని విశాఖపట్టణంలో ఆసుపత్రి వారికి ఇవ్వాలని శ్రీశ్రీగారి ఆకాంక్ష. కాని నేను ఆయన శరీరాన్ని ఇవ్వలేకపోయాను. మెదడు దగ్గర నుంచి ఒక్కో భాగాన్ని వాళ్లు కోసేస్తారనే వాస్తవాన్ని నేను తట్టుకోలేకపోయాను. పిల్లలు కూడా వారించారు. అలా ఆయన చివరి కోరికను నేను ధిక్కరించాను.”

ఇంక సెలవు

మహాకవి గురజాడగారి స్వగృహాన, వారి వారసులు చాసో గారి వర్ధంతి దినాన వారిని స్మరించుకునే అవకాశం నాకు ప్రసాదించిన విజయనగరం సాహితీ స్రవంతికి అందుకు కారణభూతులైన తండ్రికి తగ్గ తనయ తులసి గారికి నమస్కారం. నా ప్రసంగం విన్న మీకందరికీ ధన్యవాదాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here