నియో రిచ్-33

0
3

[ప్రసిద్ధ రచయిత చావా శివకోటి గారి చివరి నవల ‘నియో రిచ్’‍ను ధారావాహికంగా అందిస్తున్నాము.]

[గర్భం కోల్పోయి ఆసుపత్రిలో ఉంటుంది శారద. ఆమెను చూడడానికి రావద్దని జయంతికి చెప్తుంది డాక్టర్. అయినా వెళ్తాడు. దూరం నుంచి చూస్తాడు. ఇంటికి వచ్చి మద్యం తాగుతాడు. శారద ధ్యాస వదలక మత్తు ఎక్కదు. ఆమెకి ఎలా నచ్చచెప్పాలో అర్థం కాదు జయంతికి. హరేరామ్ మీద కోపం వస్తుంది. శారదకి ఉత్తరం రాసిన ఉమ ఎవరా అని అనుకుంటాడు. శివరాంకి ఫోన్ చేస్తే – వెంటనే ఇంటికి రమ్మంటాడు. ఇంటికి వెళ్ళాకా, శారదకి ఒంట్లో బాలేక ఆసుపత్రిలో చేరిస్తే తమకి తెలియపరచనందుకు కోప్పడతాడు శివరాం. ఆ సమయంలో ఏం చేయాలో తనకి తోచలేదని చెప్తాడు జయంతి. శారదని చూడడానికి పార్వతి ఆసుపత్రికి వెళ్ళిందని చెప్తాడు శివరాం. జయంతిని ధైర్యంగా ఉండమంటాడు. తాను ధైర్యంగానే ఉన్నాననీ, శారదని ఎలా ఓదార్చాలో తెలియడంలేదని అంటాడు జయంతి. జయంతిని మామూలు మనిషిని చేయాలని బయల్దేరదీసి కారులో తిప్పి తీసుకొస్తాడు శివరాం. రాత్రంతా మాట్లాడుకుంటూనే ఉంటారు. తెల్లవారాక పార్వతి వచ్చి శారద ఆరోగ్యంపై వివరాలు చెప్తుంది. శారద ఎవరితోనూ మాట్లాడడానికి ఇష్టపడడం లేదని, చాలా మానసిక వ్యథ అనుభవిస్తోందని చెబుతుంది. జయంతికి అక్కడి బయల్దేరి సారంగపాణి హోటల్‍కి వెళ్ళి అతన్ని కలుస్తాడు. అతని దగ్గర ఏం మాట్లాడకుండా మౌనంగా కూర్చుంటాడు జయంతి. పాణి నెమ్మదిగా ఓదారుస్తూ, ఏం జరిగిందో చెప్పమని అడుగుతాడు. ఇక చదవండి.]

[dropcap]ఈ [/dropcap]లోపు స్కాచ్ వచ్చింది. కలిపి చేతికిస్తూ “చెప్పు పెదవి విప్పు, నన్ను చంపకు” అంటూ ఎదురుగా చతికిలపడ్డాడు.

లాగి కొట్టాడు సారంగపాణిని. చెంప చెళ్ళుమంది. అయిదు వేళ్లు అచ్చులు పడ్డాయి. దిమ్మెరపోయాడు. ఉలిక్కిపడట్టు లేచి ఎదురుగా నిల్చొని “జయంతీ ఏమైంది? అసలుదా నువ్వు జయంతివేనా?” అన్నాడు గుడ్లు ఎరుపెక్కుతుండగా.

“రా! ఇటు వచ్చి కూర్చో” అన్నాడు ప్రశాంతంగా జయంతి.

ప్రక్కన కూర్చున్నాడు భయంగా చూస్తూ..

“నీతో ఓ మాట చెప్పిపోదామని వచ్చాను” అన్నాడు భుజం పై చేయి వేసి.

“చెప్పుదా చెప్పు.”

“మన టౌనులో black money ఎంత ఉంటుందంటావు?”

అంత భయం లోనూ నవ్వొచ్చింది. నవ్వాడు పైకే. ‘ఇదేం ప్రశ్న’ అనుకుంటూ.

“ఎందుకు నువ్వుతున్నావు?” అడిగాడు జయంతి.

“నీకు తెలీకుండా నాకు తెల్సునా అని?”

“ఉన్నదేమేరా?”

“అది కుదరని పని గానీ ఇక్కడదా ఉన్నవారు అరవై మందిది దొరుకుతారు.”

“డబ్బు ఎంతుంటుంది?”

“వెయ్యి నూట ఏభై కోట్లుండ వచ్చు.”

“మన రాష్ట్రంలో మన లాంటి టౌనులు ఎన్ని ఉంటాఅయి?”

తెల్లపోయి చూసాడు. భయపడ్డాడు కూడా.

“అంటే దేశంలో ఉన్న నల్ల డబ్బెంత..”

“లక్షల కోట్లు ఉంది డబ్బు. నాక్కూడా ఇంత ఆలోచన ఎప్పుడూ రాలే” అన్నాడు.

“ఇది ప్రభుత్వం దృష్టికి రానిది.”

“దీన్ని ప్రభుత్వానికి అప్పగిస్తే?”

‘అమ్మో వీనికి పిచ్చిదా లేచినట్లున్నది’ అని జయంతిని పరిశీలనగా చూసాడు సారంగపాణి.

“ఇప్పడు మన రూపాయి విలువ ఎంత?”

“పదారు పైసలు.”

“మనం ఈ డబ్బును ప్రభుత్వ పరం చేస్తే?”

“అంతా 60 పైసలవుతుంది.”

“Yes correct” అన్నాడు జయంతి.

“ఇక వెళ్తాను” అని లేచి క్రిందకి దిగాడు.

పాణి వెంట రాబోతే వారించాడు.

కారు స్టార్ట్ చేశాడు. అయోమయంగా ఊర్ని రెండు సార్లు చుట్టి వచ్చాడు. చివరకు ఇంటికి చేరాడు. ఇల్లు బావురు మంటున్నది. అవుట్  హౌజ్‌లో దీపాలున్నాయి. ఇంట్లోకి నడిచాడు. మనసంతా బోసి పోయినట్లు మసక కాగితంలా ఉంది. ఫోను దగ్గర ఆగి ఆసుపత్రికి తిప్పాడు. ఎవ్వరూ ఎత్తడం లేదు.,

సోఫాలోనే పడుకుని సీలింగ్ వైపు చూసాడు. అట్టా చూస్తూనే నిద్రలోకొచ్చాడు. నిద్రలో కూడా డబ్బు.

ఈ పెరిగిన డబ్బు  మామూలు మనిషి జీవనాన్ని ఛిద్రం చేస్తున్న డబ్బు. సంపాదించుకొనవచ్చుగాని, వాళ్ల జీవితాల్ని అలా మార్చే హక్కు ఎవడికైనా ఎక్కడిదీ. ప్రభుత్వాలు దీన్ని ఎందుకు అరికట్టులేకపోతున్నయి.

తగిన యంత్రాంగం ఉంది కదా. ఉండీ ఇంత బలహీనంగా, బేలగా. ఛ. దానికున్న లొసుగు ఈ అక్రమార్జనే. ఆమ్మో దీని roots ను కనుక్కోగలగాలి.

ఈ వ్యవస్థనున్న అందరూ ఇట్టాగే అయ్యారెందుకు. తల అంతా చిందరవందర. గందరగోళం. అంతలో మెరుపు. Yes. ఇందుకు ప్రధాన కారణం. బలహీన స్వార్థపూరిత రాజకీయ వ్యవస్థ అని అనుకున్నాడు. వాళ్ల కోసం వాళ్లు అస్తిత్వాల కోసం ఏర్పాట్లు చేసిన అంతిమ వ్యవస్థలా అనిపించింది. ఓ పనికి ఒక్క చోట వెయ్యి అని fix చేస్తే ఎవరిది వారికి  చేరుతూ ఉంటుంది. కనుక డబ్బు ఎవడికి లేదు. అందుకే దీన్ని భద్రంగా కాపాడుతున్నారంతా.

ఇక్కడ ఉన్నది అంతా దొంగలు. దొంగతనం చేయించేవాడు, చేయడానికి అనుమతులూ ఇచ్చేవాడు, చేసే వాడు ఇలా మూడు భాగాలుగా కనిపించినా వీరంతా ఎక్కడో ఒక చోట వాటాదారులుగా కనిపించడంతో అసలు దీన్ని సరిచేయడం సాధ్యమా? అనిపించుతుంటుంది. అడుగు ఎటు కదిపితేనేం?

ఈ root తెగనంత కాలం ఈ run ఆగదు. అన్నం నీళ్లు లేకున్నా నడుస్తూ ఉంటుంది. ఎక్కడో ఓ పెద్దమారాజు ఉండొచ్చు. వానికి పిచ్చెక్కించడానికి ఈ వ్యవస్థ అర నిముషం ఖర్చు పెడితే చాలు. వాడు  మెంటలు ఆసుపత్రిలో shocks తింటుంటాడు.

మెలకువ వచ్చింది. మంచి నీళ్లు త్రాగాలనిపించింది. కానీ సోఫా నుంచి లేచే ఓపిక లేదు. అలాగే మళ్లా కళ్లు మూసుకున్నాడు. మళ్లా కల. ఈసారి శారద. దేవకన్యలా, అప్సరసలా తన కోసమే దిగివస్తూ తన కౌగిలిలోకే వస్తూన్నట్లుగా ఆనందంగా కళ్లు మూసుకున్నాడు. ప్రక్క నుంచి వెళ్లిపోయింది. కనీసం పలకరించలేదు. ‘శారదా’ అని పిలిచాడు గొంతు పెగలేలా. వినిపించుకోలేదు. ఆగనూ లేదు.

కసిగా ఆవిడను అందుకునేందుకు పరుగెత్తాడు. పరుగెత్తడం ఆపలేదు. అనేక సార్లు క్రింద పడ్డాడు. దెబ్బలు తగిలినయి. అలసట వచ్చింది. రొప్పుతున్నాడు. ఇక పరుగెత్తలేను అనుకొని అక్కడే తోవనే పడిపోయాడు. తలెత్తి చూసాడు. శారద లేదు. నాల్గు వైపులా చూసాడు. ‘శారదా శారదా ఆగు’ అంటూ అరిచాడు బిగ్గరగా.

వెనక్కు మళ్లీ సోలుతూ. అడవి. ఓ తుప్ప తగిలి బొక్కబోర్లా పడ్డాడు. మెలకువ వచ్చింది. ‘శారదా’ అంటూ సోఫాన లేచి కూర్చున్నాడు. ఒళ్ళంతా చెమట. నెమ్మదిగా లేచి మంచినీళ్ళు త్రాగాడు. అక్కడే కూర్చొవాలనిపించింది. ఎట్లాగో మంచం పైకి చేరాడు. తెల్లవారింది.

శివరాం వచ్చాడు. మాటాడలేదు. తయారయ్యాడు జయంతి. ఇద్దరూ కలిసి బయటకొచ్చారు. కారెక్కారు. నంజప్ప హోటలు దగ్గర ఆగారు. టిఫిన్ చేసారు. దగ్గరుండి పెట్టాడు నంజప్ప. చాలా మంచి ఫిల్టర్ కాఫీ ఇచ్చాడు. పాన్ వేసుకొన్నారు. కారెక్కారు.

“ఎక్కడికి?” అడిగాడు శివరాం.

“నీ యిష్టం” అన్నాడు ఎటో చూస్తూ.

“హైద్రాబాదు వెళ్దివద్దాం. శారద ఇంటికి వచ్చే సరికి వస్తాం” అన్నాడు.

మాటడలేదు జయంతి. కారు హైద్రాబాద్ చేరేసరికి మధ్యాహ్నం దాటింది.

అశోకాలో దిగి భోం చేసారు. జయంతిని రూంలోనే ఉంచి శివరాం బయటకొచ్చాడు. రాత్రి తొమ్మిదింటికి దాక తిరిగిరాలేదు. T.V చూస్తూ పడుకున్నాడు జయంతి.

రాత్రి పదకొండు గంటలకు బజ్జర్ మోగింది. వెళ్లి తలుపులు తీసాడు శివరాం.

“జయంతిగారూన్నది ఇక్కడేగదా? నన్ను ఇమాం అంటారు” అన్నాడు నవ్వుతూ ఆ వచ్చినతను.

“ఉన్నారు” అని లోనకొచ్చాడు. ఇమాం పేరు విని లేచి కూర్చున్నాడు జయంతి.

“మీరు వచ్చారని ఇప్పుడే తెల్సింది. ఇక్కడే ఉంటారని వచ్చాను. ప్రయాస బడలిక తీరిందా?” అన్నాడు నవ్వుతూ.

“ఎలా ఉన్నారు?” అడిగాడు జయంతి.

“నీ దయవల్ల బావున్నాను.”

“పిల్లవాడు.”

“MBA చేస్తున్నాడు.  Inter లో గోల్డు మెడలిస్టు” అన్నాడు గర్వంగా.

“Very good. సుమేరా ఎలా ఉంది?”

“బాగానే ఉంది. చాలా సార్లు మిమ్మల్ని తలుచుకుంటుంది. ఒక్కసారి చూడవెళ్దామా.”

“కాళ్లు అలాగే ఉన్నాయా? నడవడం లేదా?”

“ఇక నడవలేరు. కాళ్లు ఎండిపోయినయి. కూర్చోలేని స్థితి.”

“మీ కోసమని 201 book చేసి ఉంచాను. మీరు వస్తానంటే అక్కడకెళ్దాం” అన్నాడు ఇమాం.

“వెళ్లు” అన్నాడు శివరాం.

ఇద్దరు నడిచారు. గదిలోకెళ్లారు. నీలిమ కనిపించింది. లేచి నమస్కరించింది.

లోగా కంటే కొంచెం లావు అయింది. “నువ్వు ఇక్కడ?” అడిగాడు.

“ఇమాం ఫోను చేస్తే వచ్చాను.”

“బావున్నావు గదా?”

“మీరు బాగు చేసిన పాదే గదా?” అంది నవ్వి.

“ఇక వెళ్లవా?” అన్నాడు నీలిమను చూస్తూ

“వెళ్తాను కనిపించావు గదా చాలు” అని దగ్గరకొచ్చి జయంతి రెండు చేతులూ పట్టుకొని ముద్దు పెట్టుకొని వెనక్కు తిరిగింది.

“నీలిమ వెళ్లాక రెజానీ రమ్మన్నాను.” అన్నాడు ఇమాం.

“రంజని గా సినిమాల్లోకి వెళ్లింది అన్నావుగదా.”

“బెంగాల్ సినిమాలలో తెరవెలుపుగా ఎదిగింది.”

అలాగా అంటుండగానే రెజా వచ్చింది తలుపు తట్టి..

జయంతి కనిపించగానే పరుగున వచ్చి క్రింద కూర్చుని “మళ్లా కనిపించారు” అంది.

“చనిపోతే తప్ప కనిపించను గదా?” అని నవ్వాడు. ఆ మాట అంటున్నప్పుడు చేతిని నోటికి అడ్డం పెట్టింది. “నువ్వు ఉంటే ఎందరి బ్రతుకులో బాగుపడుతాయి. అయోమయం నుంచి బైట పడుతాయి” అంది.

“అది సరే సేఠ్ ఇంకా బాకీ మిగిలి ఉందంటున్నాడా?”

“వాడే ఇప్పుడు మనకు బాకీ” అంది నవ్వి.

“ఎలా ఉన్నావు?”

“తెరపై రాణిని. ఒంట్లో అందం ఉన్నంత కాలం ఉంటాను రాణిలానే.”

“ఆనక.”

“శాంతినికేతన్ వెళ్తాను.”

“నిన్ను చేర్చుకుంటానన్నారా?”

“మారు పేరుతో మామూలు ఆయాగా చేరతాను. అప్పుడు నువ్వు నన్ను గుర్తించలేవు. నేను మాత్రమే ఈ లోకన్నంతటని గమనించగలను” అని నవ్వింది.

సమ్మోహనంగా చూసాడా నవ్వును. గబుక్కున దగ్గర తీసుకొని “రెజా నీ నవ్వు శాశ్వతమైతే ఈ సృష్టికే అందంగా మిగులుతావు. కానీ ఇది మిగలదు. దేవుడు ఉన్నా లేకున్నా ఈ సృష్టికి అడ్దుకొట్టడు. ప్రకృతిలో ఉన్న మంచిని భద్రపరచలేనితనం సిగ్గు అనిపిస్తున్నది. ఆ దేవుడే ఉన్నా ఇక్కడ అసమర్థుడే మరి. నువ్వే శాశ్వతం గాదు, నీ నవ్వు ఎలా మిగుల్చుకొనడం” అని ఆవిడ పెదవుల్ని చేతులతో సున్నితంగా తాకాడు. “రెజా నేను చాలా అదృష్టవంతుణ్ని సుమా! ప్రపంచం సమ్మోహనపడే ఆ నవ్వును నేను తాకగలిగాను” అని వదిలేసాడు.

లేచాడు. “ఇమాం నేను వెళ్తాను” అని శివరాం దగ్గరకొచ్చి తలుపులు బిగించాడు.

తల్లవారుతుండగా ఇంటికి బయలుదేరారూ. పది గంటలకల్లా శివరాం ఇంటి ముందాగింది కారు. హాలులో పార్వతి కనిపించింది.

“శారదేది?” అనడిగాడు జయంతి ఆరాటంగా,

“ఆఁ!”

“అయితే వెళ్తాను ఒక్కర్తే ఉంటుంది” అని వెనక్కు మళ్లాడు. ఆగి “నువ్వు ఇక్కడున్నావే? ఒక్కదాన్నీ వదిలి ఎలా రాగలిగావు” అంటుండగా.

“ఇక్కడే ఉంది” అంది.

“ఇక్కడా? ఎందుకు?”

“మేడపైన ఉంచాను.”

అంతే, పరుగులాంటి నడకతో మెట్లెక్కబోయాడు.

“ఒక్క నిముషం” అంది పార్వతి.

ఆగాడు అసహనంగా.

“నిద్రలో ఉంది.” అంది.

వెనక్కు వచ్చి సోఫాలో కూలబడ్డాడు.

“కాఫీ కలిపిస్తాను” అంటూ లోనకు నడిచింది పార్వతి. రెండు నిముషాలలోనే తెచ్చిచ్చింది.

మౌనంగా కూర్చుని కాఫీ త్రాగారిద్దరూ. శారద ఎప్పుడు  లేస్తుందోనన్న ఆరాటం జయంతిలో అణువణువున కలుగుతున్నది. కాలం ఆగినట్టుగా ఉంది. రవి వచ్చాడు మేడపై నుంచి

“రవీ, ఆంటీ” అన్నాడు జయంతి.

“ఆఁ!” అనడమే ఆలస్యం ఒక్క ఊపున శారద దగ్గర వాలాడు.

దూరంగా నిల్చుని నీళ్లు నిండిన కళ్లతో చూసాడు. శారదా చూసింది. కళ్లు తుడుచుకుంటున్నాడు. మళ్లా నిండుతున్నాయి. శారద బూజరగా కనిపిస్తున్నది.

దగ్గరికి నడిచాడు. బావున్నావా అన్నట్లు చూసాడు. ఉన్నాను అన్నట్లు తల ఊపి కళ్లు మూసుకుంది.

చాలా సేపు అక్కడే శారదను చూస్తూనే నిల్చున్నాడు జయంతి. శారద చేతిని తన చేతిలోకి తీసుకొని ధైర్యం చెప్పాలనిపించింది. ఓదార్చాలనుకున్నాడు. మన్నించమని అడగాలని, ఇక పొరపాటు చేయనని.. ఎన్నెన్నో!అవకాశం దొరకలేదు. ఇంతలో శివరాం పార్వతి వచ్చారు. జయంతిని ఓదార్చారు. ఆ ఓదార్పున ఆరాటం పెరిగిందే తప్ప ఆగలేదు.

జయంతి మాట వినిపిస్తే చాలు కళ్లు మూసుకొనడమో, మౌనం పాటించడమో చేస్తున్నది శారద.

రెండో రోజు డాక్టరు వచ్చి చూసి “కొంచెం కొంచెం నడిపించండి” అని చెప్పి వెళ్లింది.

తెల్లవారింది. బాగా పొద్దు పోయిందాకా ఉండి వెళ్లాడు జయంతి. శివరాం ఎంత ఉండమన్నా ఆగలేదు. మళ్లా పొద్దు పొడవకుండానే వచ్చాడు. పార్వతి శారదకు కుంకుడుతో తలకు పోసింది. పట్టు చీర కట్టింది. నెమ్మదిగా క్రిందకు నడిపించుకొని వచ్చింది.

శారదను చూసి ఆశ్చర్యపోయాడు జయంతి. నీరసపడింది. తలారా స్నానం చేసింది, ఎటు వెళ్తుందని పట్టు చీర అనుకున్నాడు కానీ చాలా బాగుంది చీరలో అనీ అనిపించింది.

నెమ్మదిగా జయంతి ముందుకే వచ్చి ఆగింది. కానీ అతని కళ్లతో కళ్లు కలపలేదు.

“గుడికెళ్లాలని ఉంది” అంది జనాంతికంగా.

“పద” అన్నాడు జయంతి దగ్గరయి.

కారు దాకా పట్టుకొని నడిపంచుకొనిపోయాడు. డోరు తెరచాడు. నెమ్మదిగా కూర్చుండబెట్టాడు. డోరు వేసి కారెక్కాడు. చిత్తరువులా శివరాం పార్వతి చూస్తుండిపోయారు

కారు స్టార్టయింది. అమ్మవారి గుడి ముందు ఆపాడు. డోరు తీసి నెమ్మదిగా పట్టుకొని నడిపించాడు. మెట్లెక్కించాడు. ఎక్కవ జనం లేరు. అనాయసంగానే అమ్మవారి దర్శనం దొరికింది.

అమ్మవారి ముందు సాష్టాంగ పడింది. నెమ్మదిగా లేచింది. జయంతి సహకారంతో అక్కడ కూర్చుని “కుంకుమార్చన చేయాలి” అంది.

“అలాగే” అని పూజారితో చెప్పాడు. పూజ పూర్తయ్యాక నెమ్మదిగా లేచింది.

గంట దగ్గర ఆపాడు. మూడు సార్లు మ్రోగించి వెనక్కు తిరిగి అమ్మవార్ని చూసింది.

“క్రిందికి దిగదాం” అన్నాడు.

తల అడ్డంగా ఊపి “ప్రదక్షిణ చేయాలి” అంది.

చిత్రంగా చూస్తూ వెంట నడిచాడు. మూడు సార్లు చాలా ఓపికగా శరీరం అదుపు తప్పుతున్నా చేసింది.

గుడి ముందుకు వచ్చాక “నమస్కారం చేయండి” అంది.

ఒక్కసారి శారదను తేరపార చూసి నమస్కరించాడు.

చప్టాపైన నాల్గు నిమిషాలు కూర్చుంది. లేచింది. ఇంకా రెండు మెట్లు ఉండగానే గుడి శిఖరాన్ని చూసింది వెనక్కు మళ్లి. అప్పుడు పూర్తిగా జయంతి భుజంపై చేయి వేసింది. చంపన ముద్దెట్టుకుంది. శారద కళ్లు తేలిపోతున్నట్లుగా గమనించాడు జయంతి. ‘శారదా’ అన్నాడు గట్టిగా పట్టుకుని.

నవ్వింది  సమ్మోహనంగా. నెమ్మదిగా “ఈ విషయం తెలుసా?” అంది ఇంకా దగ్గరయి.

“ఏమిటి?”

“మా అమ్మ ఈ పై మెట్ల నుంచి జారి ఇక్కడిదాక దొర్లి ఇదిగో ఇక్కడే చనిపోయింది.” అంది.

“నువ్వు చూసావా?” అడిగాడు కళ్ళలో కళ్ళు కలిపి నీరూరుతుంటే.

“చూశాను, చూశాను. నేను చూస్తుండగానే, అమ్మా అమ్మా అని పిలుస్తుండగానే అమ్మ మట్టిలో కలిసిపోయింది.”

వింటున్నాడు జయంతి. ఇది ఎందుకు చెపుతున్నాదో అనుకున్నాడు. ఆగి జయంతికేసి చూసి “ఇక్కడ కూర్చుందామేం” అంది అభ్యర్ధనగా చూసి.

“అలానే అలానే కూర్చుందాం” అని నెమ్మదిగా కూర్చుండబెట్టి ఆనుకొని కూర్చున్నాడు.

జయంతి చేతిని గట్టిగా పట్టుకొని ‘అమ్మా’ అని అమ్మవార్ని చివరిసారి పిలవడమూ, జీరగా గొంతు ఆగిపోవడమూ. ఆగి కొంచెం జరిగి అమ్మవార్ని చూసి తిరిగి జయంతిని ఆనుకుంది. నెమ్మదిగా లేపి కారు దగ్గరకు తీసుకెళ్లి ఎక్కించాడు.

కారు స్టార్ట్ చేసి “ఒంట్లో బావుందా శారదా, అపస్మారకపు స్థితిలో మాటాడుతున్నావు?” అన్నాడు. ఎగతట్టిన భుజాన్ని బలిమిన ఆపుకుని. జయంతి వైపు చూసింది. నవ్వింది అదోలా.

“నాతో మాట చెప్పేందుకు మనస్సంగీకరించడం లేదా?” అడిగాడు నిష్ఠూరంగా.

ఇంటి దగ్గర కారు ఆపాడు. నెమ్మదిగా నడిపించాడు. “పూజ గదిలో కాసేపు కూర్చోవాలని ఉంది” అంది.

“మంచిది” అని మంటపం ఎదురుగా కూర్చోబెట్టాడు. ప్రక్కనే కూర్చోబోయాడు.

“మీరు వెళ్లి పడుకోండి. నిద్ర అనిపిస్తే ఈ రాత్రికి ఇక్కడే పడుకుంటాను” అంది.

మాటాడక లేచి వెనక్కొచ్చాడు. సోఫాలో కూర్చున్నాడు. అలా కూర్చునే నిద్రపోయాడు.

బాగా తెల్లవారాక గానీ మెలకువ రాలేదు. నీరెండ జీబురుగా అనిపించింది.

తెల్లవారగానే ‘శారదా’ అంటూ పూజ గదిలోకి చూసాడు. తలుపులు తెరిచి అమ్మవారికి  సాష్టాంగంలో ఉండి ప్రణామం చేస్తున్నట్టుగా పడుకొని ఉంది.

నిబ్బరపడి ఆగాడు.

ప్రార్థనలో ఉందేమో ఆగుదాం అనుకుని అట్టాగా నిలబడ్డాడు ఓ క్షణం.

ఎంతసేపటికి కదలిక కనిపించక అనుమానమనిపించి ‘శారదా’ అని పిలిచాడు నెమ్మదిగా.

సమాధానం గానీ కదలిక గానీ లేదు. ‘శారదా’ అని వంగి పట్టుకొన్నాడు.

చలికట్టె పడిన శరీరంలా అనిపించి భయంగా ఒళ్ళోకి తీసుకున్నాడు.

ఎప్పుడో ప్రాణం పోయినట్టనిపించింది. “శారదా ఇలా..” అంటూనే స్పృహ కోల్పోయాడు జయంతి.

జయంతికి స్పృహ వచ్చేసరికి పార్వతి శివరాం కనిపించారు. అసలు జరిగిందో ధ్యాసకు తొందగరగా లేదు. పార్వతి దగ్గరికొచ్చింది.

“శారదేది” అడిగాడు.

దూరంగా ‘రవి’ బితుకు బితుకుమంటూ కూర్చుని కనిపించాడు. పార్వతి గోడకు జారిగిలపడింది. శివరాం దూరంగా నిల్చుని కళ్లు తుడుచుకుంటున్నాడు. అప్పుడు గుర్తుకొచ్చింది జరిగింది.

“శారదా” అని పెద్దగా అరచి స్పృహ తప్పాడు.

***

“రేపటిదాకా స్పృహ రావడం కష్టం” డాక్టరు అనటం లీలగా వినిపించింది.

జయంతికి స్పృహ వచ్చేసరికి శివరాం ప్రక్కనే ఉన్నాడు.

“శారదేది?” అడిగాడు దగ్గరకి రమ్మని.

“ఆసుపత్రిలో ఉంది.”

“ఎలా ఉంది?”

“అంత బాగా లేదు.”

“ఏమయింది?”

“నేను డాక్టరునా తెలవడానికి” అన్నాడు దుఃఖాన్ని ఆపుకుంటూ.

“మనం వెళ్దాం పద” అని లేవబోయాడు జయంతి.

“నువ్వు బావున్నావా? లేవకు” అని అరిచాడు శివరాం.

“నేనేమైతే ఏంలే శారదను చూపించరా” అన్నాడు

“చూడాలి, చూద్దువుగాని కాని నువ్వు చూసి ఏం చేస్తావు? బ్రతికిస్తావా? నీ గతే అర్ధం కావటం లేదు. అక్కడకెళ్లి చూస్తాడట!” అని “అరేయ్ అక్కడ పెద్ద డాక్టరున్నాడు, చూస్తున్నాడు. నువ్వు ఇప్పుడు అక్కడ కెళ్లడమంటే ఆదొక చికాకక్కడ. నీవు బాగుపడు. ఆనక వెళ్దాం, శారదను తీసుకొచ్చుకుందాం” అన్నాడు శివరాం. పార్వతి గది బయటకి వచ్చి ఏడ్వసాగింది.

“శివరాం పార్వతి ఏడుస్తున్నదిరా.”

“నువ్వూ శారదా బోల్డు సుఖపడిపోతున్నారని” అన్నాడు కోపంగా రుమాలు ముఖానికి అడ్డం పెట్టుకుని.

“ఏమిట్రా అట్లా మాటడుతావు.”

“అరేయ్ నీకు బుద్ధి లేదు. మాటడకురా అంటే ఆగవు. అక్కడ శారదా ఇదే తంతు. మీ ఇద్దరి మధ్యన మేము నలిగిపోతున్నాం.”

చిన్నబుచ్చుకున్నాడు జయంతి.

“అరేయ్ తలకు పని చెప్పకు. ఆలోచనల్ని ఆపి నిద్రపో. నీ ఆరాటానికి ఇతరులకు బాధలు”  అని లేచి బయటకు నడిచాడు శివరాం. ఆనక కొంత నిగ్రహంగానే ఉన్నాడు జయంతి.

నాల్గురోజులు యుగాలుగా గడచినయి. అయిదో నాడు పూర్తిగా స్వస్తత చిక్కింది. ‘ఇక వెళ్లి శారదను చూడాలి’ అనుకుంటుండగా జరిగింది తెల్సింది. అచేతనుడయ్యాడు.

శివరాం కూడా అబద్ధాలు చెప్పాడు అనుకొని ఏడ్చాడు.

‘శారదా నువ్వేం తప్పు చేయకుండా ఇంత శిక్ష ఎందుకు వేసుకున్నావు. నేను దోషిని. నేను చావాలి. నేను నేను’ అని ఏడ్వసాగాడు. అది అంత త్వరగా ఆగేది కాదు, ఆగదు.

***

శివరాం పూర్తిగా ప్యాక్టరీ వ్యవహారాలలో మునిగి ఉన్నాడు.

పార్వతి రవీ నిత్యం జయంతిని చూసి ఎక్కువ సేపు అక్కడే గడిపి వస్తున్నారు.

ఏది ఏమైనా జయంతి మనుషులలో కలిసేందుకు నెల పట్టింది. జుత్తు, గడ్డం బాగా పెరిగింది. బట్టలూ సరిగ్గా వేసుకొనలేకపోతున్నాడు.

శారదను గురించిన ఆలోచనల్లోకెళ్లిపోతున్నాడు. ఆకలి లేదు. నీళ్లు త్రాగాలనే ధ్యాస కూడా అంతగా రావడం లేదు. చివరకు అత్యధికంగా ప్రేమించే పార్వతిని కూడా ఖాతరు చేయడం లేదు. అంతంత మాత్రంగా ఎదురుగ్గా ఉన్నప్పుడు ‘ఆఁ, సరే’ అంటున్నాడు. ఇట్టాంటి స్థితిన జయంతి కొట్టుమిట్టాడుతున్నాడు. హరేరామ్ వచ్చాడు. దగ్గర కూర్చున్నాడు. చాలా బాధపడ్డాడు. నీకలా జరగడం దురదృష్టమని ఏడ్చాడు. చివరగా ఏ ఏ పద్ధతులలో అచ్చు ప్రారంభించాలో చెప్పబోయాడు. అంతే లాగి చెంప పగిలేట్టు కొట్టాడు జయంతి. ఎంత దెబ్బ కొట్టాడో అర్థమే కాలేదు హరేరామ్‌కు. దిమ్మెరపోయాడు రెండు మూడు నిమషాల మేర. అసలు బొత్తిగా ఏమీ కనిపించలేదు. గూబ గుయ్ మన్న హోరు వదిలేసరికే చాలా సేపు పట్టింది. తేరుకుని జయంతిని చూసాడు. అంతమాలిన కోపంతో ఊగిపోతూ కనిపించాడు. జయంతి పైన మాత్రం కోపం రాలేదు. శారదను ఎంతగా ప్రేమించాడో అర్థమైంది. యెగి వేమన గుర్తులోకొచ్చాడు. హరేరామ్‌కు బ్రతుకులో ఎక్కువ భాగం బంగారం మొత్తాన్ని సాధించడానికే నానా అగచాట్లు పడి క్రియ ప్రక్రియలను కూలంకుషంగా అవగతం చేసుకొని సిద్ధ యోగాన్ని సాధించి. ఇక గుట్టలను సైతం బంగారంగా మార్చవచ్చుననుకొని మొత్తం జగత్తును బంగారు యోగంతో పాదాక్రాంతం చేసుకోవాలనుకొని, హాయిగా ఆదమరచి నిద్రించి పొద్దు పొడపుతో ఏ భాద లేని నిశ్చల మనస్సుకు ఆధీనమైపోయాడు. బంగారు యోగాన్ని సిద్ధాన్నంగా మార్చేందుకు మనస్సు నిరాకరించింది. రక్తి నుంచి విరక్తికి నడిచాడు. ఎన్నో ఏళ్లు అదే ధ్యాసలో పని చేసి సాధించిన అనితర సాధ్యమైన విద్యను వినియోగించుకొనలేకపోయాడు. విరాగయ్యాడు. పరమ భోగిగా అందలాలెక్కాలన్న అతని ఆకాంక్ష మరుగునపడి జీవితసారాన్ని పాఠాలుగా చెపుతూ అనంత యాత్ర మొదలెట్టాడు. సంచారిగానే కాలగమనంలో కల్సిపోయాడు.

“ఇక నీ పని ప్రారంభించు” అన్న ఒక్కమాటను జయంతి అనలేకపోయాడు.  పైగా “హరేరామ్ ఇక నా దాపుకు రాకు” అని బయటకు తోవ చూపాడు. నిజంగా ఈ స్థితి హరేహామ్‌కు పిచ్చి పట్టేలా చేసింది. జయంతి పాదాల దగ్గర చతికలపడి జయంతిని “ఏమిటిది?” అనడిగాడు.

ఇంకా అర్థం కాని దేముంది అన్నట్టు చూసాడు జయంతి.

“జయంతిని నేను నీ హరేరామును. నన్ను నిర్దేశించు. చావమంటే చస్తాను. ఏదో ఒకటి చెప్పు” అని ఏడ్చాడు.

“నువ్వు ఇక్కడనుంచి వెళ్లిపో” అని దూరంగా నడిచాడు జయంతి.

ఇక హరేరామ్‌తో మాటాడేందుకు కూడా సుముఖత చూపలేదు.

నెమ్మదిగా లేచాడు హరేరామ్. “మంచిది. వెళ్తున్నాను. వెళ్తున్నాను” అని నమస్కరించి బయట కొచ్చాడు. లాన్‍లో కొచ్చాక మళ్లా ఒక్కసారి జయంతిని చూడలనిపించింది. లోనకొచ్చాడు. చూస్తూ పదినిముషాలు నిల్చున్నాడు.

హరిని గమనించి “హరీ నువ్వు ఆగకు. వెళ్లు. నా దగ్గరకు మళ్లా రాకు. నువ్వు  ఏం చేస్తావో నాకు చెప్పకు, నీ యిష్టం. నీపై నాకు ఎలాంటి ఆంక్షా లేదు. కానీ నాకు తెల్సిన మేర ఏమీ చేయకు వెళ్లు” అన్నాడు.

తల ఊపాడు కానీ అక్కడే ఆగాడు.

దగ్గరకొచ్చాడు జయంతి. భుజం పై చేయి వేసాడు.

“ఇట్టాటి డబ్బు వల్లే మంచి సమాజంగా ఎదగాల్సిన ఈ సమాజం భ్రష్టు పట్టింది. ఈ దేశాన పుట్టిన అత్యధికులను నికృష్టంగా బాధించేది ఈ అక్రమార్జనే. అతి తేలికగా విలువలను చంపుతున్నది. ధర్మాన్ని చెరపుతున్నది. దురాశకు నిచ్చెన వేస్తున్నది. మంచి కనిపించకుండా పోతున్నది. ఉజ్వల భవిష్యత్తు ఉన్న మనిషి సజీవ సమాధికి తన గొయ్యి తానే తవ్వుకొనడంగా మారుతున్నది. ఈ అధోగతికి నువ్వు కారణం కాకు. వెళ్లు” అన్నాడు.

“అలాగే నువ్వు చేసిన బొమ్మను” అన్నాడు. నమస్కరించి వెల్లిపోయాడు.

ఎక్కడి వెళ్లాడో తెలీదు. కానీ మళ్లా కనిపించలేదు. అతని జీవితాన అత్యంత ఆసక్తితో శ్రమించి పలితం పొంది సాధించుకున్న దాన్ని అనాసక్తంగా వదిలి వెళ్లిపోయాడు.

ఆ మరునాడే హరేహామ్ ప్రాజెక్టు అగ్నికి ఆహుతయి బూడిదయిందనుకున్నాడు.

మకుందం వచ్చాడొకనాడు. జయంతి ఎదురుగా కూర్చున్నాడు

“ఎంతకాలమిలా దీర్ఘ రోగిలా పడి ఉంటావు. దేశంలో మరీ ఆడపిల్లలు కరువు కాలేదు గదా. మనిషి అన్నాక చస్తాడు, చచ్చిన వాళ్ల కోసం బ్రతుకున్న వాళ్లు ఇలాగయితే ప్రపంచం అగుతుందా” అని నవ్వాడు.

ఇతని మాటలు విన్నాడో లేదో అర్ధం కాలేదు కానీ ముకుందాన్ని చూసి..

“రామలింగం ఏడి? ఎక్కడ?” అని అడిగాడు నెమ్మదిగా.

“ఇంకెక్కడి రామలింగం? నేను ఏమీ చేయలేకపోయాను. ఓడిపోయను. వానికి ఉరి శిక్ష పడింది” అన్నాడు అదోలాగయి.

“ముకుందం” అని, ఒక్కసారి తేరపార చూసి “రామలింగానికి శిక్ష పడక ఎవనికి పడ్తుంది.” అన్నాడు జయంతి.

“ముకుందం, నువ్వు న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నవాడివి గదా. ఏ నేరానికి ఏ శిక్ష వేస్తే సరిపోతుందో తెల్సిన వాడివి గదా. రామలింగం చేసినదానికి మేజిస్ట్రేటు ఇప్పుడు వేసిన శిక్ష సరిపోతుందంటావా?” అనడిగాడు.

ముకుందానికి జయంతి మాటలు పుండుకు కారం రాసినట్లు, ఎద్దు పుండును కాకి పొడిచినట్లు అనిపించింది. తిక్కరేగింది. అంతులేని ఆవేశం కట్టలు తెగిన కోపం ముకందంలో కనిపించింది. అన్నది జంయింతి కనుక మింగాలో కక్కాలో చావాలో అంతు దొరక్క నిభాయించుకున్నాడు.

“ముకుందం లా పరీక్ష ప్యాసయిన వాడల్లా ప్లీడరు అవుతాడంటావా? నిత్యం కోర్డుకెళ్లే నల్ల కోటు మునుషులలో ఎందరు లాయర్లు కనిపిస్తారంటావు? చెట్ల క్రింద పైరవీలు తప్ప..”

“కాలేకపోవచ్చు. అయితే ఏంటంట?” అన్నాడు ముకుందం.

“న్యాయశాస్త్రం తెలీని చదవని నాబోట్లకు న్యాయం ఏమిటో తెలీదనీనా.”

“నీ ఉద్దేశం స్పష్టంగా లేదు” అన్నాడు ముకందం తల బిరుసుగా.

“ముకుందం నువ్వు ఇక్కడ పెద్ద లాయరువు. నేను నీతో వాదించగలనంటావా?” అని నవ్వి, “అయినా ఒకవేళ నాకేదయినా మనస్సున ఉన్నాదే అనుకో ఉపయోగమేంటి? నాకు లా పుస్తకాలలో ఉన్న న్యాయం తెల్సు. నాకు లోకన్యాయం తెల్సు. జన జీవితాన జరిగినది కళ్లబడితే న్యాయం చెప్పగలదని? మనం సాక్షులం గనుక.

మీ న్యాయం న్యాయమైనా సాక్ష్యం లేనిది నిల్వదు. అస్తిత్వాన్ని కోల్పోతుంది. సాక్షి అనేవాడొకడు మీకు ఆసరాగా నిలబడి సకాలంలో మీకు సహకరిస్తే తప్ప మీ న్యాయం ఆవిరయిపోతుంది” అని ఓ క్షణం ఆగి “ముకుందం నీకు బాగా తెల్సు నాకు తెల్సిన న్యాయమేమిటో. నాకు తెల్సిన న్యాయానికి పుస్తకాల ప్రమాణం నక్కరలేదు. నేరం జరిగితే అది నేరమే. అయితే నేర ప్రవృత్తి అందులో కనిపిస్తే దాన్ని సమూలంగా ప్రక్షాళన చేసే యత్నమే శిక్ష. అంతేనంటావా?

నేను నేరం చేసాను. చేసింది నేనే, కానీ నాతో నేరం చేయించనవాడు వేరే ఉన్నాడు. నేను పగ తోనో ద్వేషం తోనో స్వార్థం తోనో చేసింది కాదిది. నన్ను నేరం చేసేందుకు పురికొల్పిన వాని ప్రయోజనం కోసం మాత్రమే చేసినది. వాడు విదిలించే ఎంగిలి మెతుకుల్ని ఇవ్వలేక సమాజాన బ్రతకీడుస్తున్నాను గనుక బ్రతకడం కోసం చేసిన పని.

మరి మీ న్యాయం న్యాయ శాస్త్రం శిక్ష వేసే దెవరికి? నేరం జరిగిన మరు క్షణం నుంచీ లాభం పొందేదెవరు?

వాడు కోర్టుకు కనపడడు. చేసినవాడు మీ పాలపడతాడు. బోనెక్కుతాడు. నేరం తనే చేసాడు గనుక సరే నంటాడు. మీరు శిక్ష చదివి వినిపిస్తారు. అనుభవిస్తాడు.

ఇదంతా జరిగినా నేర ప్రవృత్తి కల్గినవాడు, నేరం చేయించిన వాడు అయితే అసలు నేరస్తుడు మీకు బొత్తిగా ట్రేస్ కాడు. అతనీ సమాజంలో ‘దొర’. గౌరవనీయుడు. పెద్దమనిషి. మనం ఈ తెగ మనుషులం అవునా!” అనడంతో ముకుందం కూర్చున్నవాడు లేచి నిల్చున్నాడు. ఒంటికి చెమట మొదలైంది. ఉక్కగా అనిపించింది. దస్తీ తీసి ముఖం గట్టిగా తుడుచుకొని కోటు తీసి భుజాన వేసుకున్నాడు. ముళ్ల కంచపైన నడుస్తున్న భావనలో కనిపించాడు. “ఇక వెళ్తాను. పని ఉంది” అని నడిచాడు బెరుకుగా.

“ముకుందం ఆగు” అన్నాడు.

ఆగాడు. “ఇట్రా” పిలిచాడు.

మళ్లాడు.

“కూర్చో” అన్నాడు.

జయంతినే అయోమయంగా చూస్తూ “నా కోసం వచ్చిన వాడు నిన్ను కలవకపోతాడంటావా? నువ్వు వాణ్ణి రేపేం చేసినా ఇప్పటి ధైర్యం అదే గదా. ఆ తృప్తి కోసమన్నా నిన్ను కలవంది ఎక్కడికి పోగలడు?” అన్నాడు.

“ముకుందం నేనడిడిగిన దానికి సమాధానం కావాలి.” అన్నాడు జయంతి.

“ఏంటది?”

“అదే రామలింగానికి పడ్డ శిక్ష సంగతి”

చాలా చాలా చికాకుగా, అసహనంగాను చూసాడు ముకుందం. నరాలు చిట్లేంత కోపం వచ్చింది. ఇదే మరొకడు మరొకడుయితే మెడ కొరికి కర్కశంగా చంపేసేవాడే. కానీ ఆగాడు చాలా ప్రయత్నాన.

“కోర్టు తీర్పు అయింది కదా. మళ్లా మనం విశ్లేషించుకొనవద్దు. అందు వల్ల వచ్చేదీ ఏమీ ఉండదు.” అన్నాడు.

“Yes yes, నువ్విప్పుడు అన్నమాట నిజం” అని, “ఇదిగో  ఉరిశిక్షను మించిన శిక్ష మన న్యాయంలో ఉందా” అడిగాడు జయంతి

“లేదు.” అన్నాడు ముకుందం.

(ముగింపు వచ్చే వారం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here