ఒక జననం.. ఒక మరణం..!

0
3

[dropcap]ఒ[/dropcap]క జననం
ఒక మరణానికెప్పుడు
ప్రత్యామ్నయం మాత్రం కానే కాదు
ఒక జననమెప్పుడు
ఒక మరణంతో ఖాళీ అయిన
లోటునెప్పుడూ పూరించలేదు
చెట్టుకున్న ఆకులు రాలితేనే కదా
కొత్త చిగుర్లతో పలకరిస్తుంది
ఈ నేలమీంచి
స్ఫూర్తివంతమైన గ్రంథంలా
అక్షరబద్ధం చేసి తప్పుకోవాల్సిందే
ఉత్తేజభరితమై రావాల్సిందే
కొత్త కోణంలో సమరాన్ని సృష్టించడానికి
మానవ జీవన చక్ర భ్రమణమంతే..!

ఒక మరణంతో వచ్చే
దుఃఖం భరించలేనిదే
కానీ అనివార్యమైనది
మనం వాళ్ళతో అనుభవించాల్సిన
జీవితమెంతో మిగిలే ఉంటుంది
గుండెలు పగిలేలా ఏడ్చినా
తలలు చిట్లిపోయేలా
జ్ఞాపకాలను తలపోసినా
ఆ స్మృతుల కన్నీళ్ల వర్షంలో తప్పక
మనమంతా తడవాల్సిందే..!

అపరిమితమైన ఆనందానికి
అసలు సిసలైన చిరునామా
ఒక శిశువు జననం
భవిష్యత్ జీవన కట్టడాల కోసం
చిరునవ్వుల సుమాల మధ్యన
అర్థశతాబ్ది ప్రణాళికను రచిస్తాం
తండ్లాడుతూనే అమలు పరచడానికి
శత ప్రయత్నాలతో సతమతమవుతాం..!

ఆటవిక దశ నుంచి
అత్యాధునికమైన అభివృద్ధి దశ వరకు
అనంతమైన జనన మరణాల గురించి
ఎన్నెన్నో భావోద్వేగమైన
కథనాలను విడమర్చి చెప్పుకున్న
ముచ్చటించుకోవాల్సిన సంగతులు
ఎన్నో మిగిలే ఉంటాయి
జీవన ప్రస్థానాలు మాత్రమే శాశ్వతం
చైతన్యవంతమైన దారిదీపాలైన వాళ్ళే
మనకు వెలుగునిచ్చే ధీరులౌతారు..!

చుట్టూ విస్తారంగా అల్లుకపోయినా
దుఃఖ సముద్రాలను దాటడమెట్లాగో
ఏ నావికుడు వివరించలేదు
మనోధైర్యంతో ఎదురీదాలే తప్ప
తిరోగమన మార్గాలు పనికిరావు
బతికించే క్షణాలే కావాలిప్పుడు
రగిలించే హృదయాలే కావాలిప్పుడు
జనన మరణాలు సహజాతి సహజం..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here