[dropcap]చం[/dropcap]టిపాప ఏడుపు లాంటిది..
మేఘాలనెవరూ ఊపటంలేదు.
గాలిది ఏ భాషో ఎవరైనా చెప్పరూ.
కొన్నంటే కొన్ని లాలిపాటలు పాడేసి
మళ్ళీ వచ్చెయ్యనూ..
నమ్మరే ఎవరూ,!..
మనుషులు మనుషుల్ని నమ్మటం మానేసారెందుకో.
భూమిని తన్నేసి ఎగిరిపోయేంత కృతఘ్నతా..!?
హృదయాల్ని కొలిచో
మనసుల్ని విరిచో
మెదడుల్ని చీల్చో అంటే పర్లేదు..
మనుషులం కదా..
సహజ లక్షణాలు మరువం.
నిజాలకి కాస్త చనువు ఇచ్చి చూడాలి.
అప్పుడవి చెప్పేవి వినడానికి
ఎవరెన్ని చెవులతో వచ్చినా సరే;
ఒకే ఒక్కపాట, రాత్రిని మేఘాలతో సహా
ఊపేసే గాలి పాట..
వెదురుబొంగులోనుండీ వేణువుని వెలికితీసే ఆర్తిపాట..
కాస్త ప్రాణాన్ని ఎవరైనా పోస్తే బావుండు…
జగతినే నిద్రపుచ్చేసే..
ఒక్క లాలిపాట పుట్టడమెంతసేపూ..!?
అయినా, నిషిద్ధస్థలాల్లో జాగారం చెయ్యొద్దని
ఎవరూ చెప్పలేదు.
ఎవరికీ మతి ఉండిఉండదని చెప్పెయ్యాలి.