[dropcap]వ్రా[/dropcap]సుకొన్నాము రాజ్యాంగము-
తిరగేసి మరీ, దేశ దేశాలవి,
తలచి ఉండాలని మనది మన్నికైన రీతిన.
అంటాము గొంతు కలిపి అందరిలో-
మన రాజ్యాంగము మహా పవిత్రమని.
చవిచూస్తే తెలుస్తుంది జీవితాన-
మనవి వఠ్ఠి చౌకబారు చట్టాలని,
అన్నిటికన్నియూ –
చిల్లులున్న జల్లెడలేనని.
సూర్య, చంద్రుల్లా-
కనీస ప్రేక్షకుల్లానూ ఉండవని,
నిజాన్ని నిర్దయగ, నిర్భయంగ-
గల్లంతు చేయగలవని.
దోషులను నిర్దోషులుగ-
ఇట్టే చూపగలవని,
కనీస ప్రాథమిక హక్కులూ…
బీద బిక్కికి, బాధిత జీవికి-
కనుల దోబూచులాడే ఎండమావులేనని.
***
అన్య దేశ రాజ్యాంగ రీతులు,
శాసన సుపర్యవసానములు,
కాలయాపనకు తావులేని వైనములు,
పోల్చి పోల్చి చూసి, తరచి తరచి పరిశీలించి,
తేవాలి మన సంవిధానమున
పలు సమకాలీన పెను మార్పులు –
నిజము, నిజాయితీ – ఏనాటికీ, గెలిచి నిలిచే రీతిన,
ధర్మము- జనస్వామ్య దరికీ చేరు తీరున,
కాలము అతీతము కాని శోభన.