ఆదికావ్యంలోని ఆణిముత్యాలు-15

0
4

[వాల్మీకి రామాయణం ఆధారంగా శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘ఆదికావ్యంలోని ఆణిముత్యాలు’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

ఆదికావ్యంలోని ఆణిముత్యాలు

126. శ్లో.

అధిరోహార్య! పాదాభ్యాం పాదుకే హేమభూషితే।

ఏతేహి సర్వలోకస్య యోగ క్షేమం విధాస్యతః॥

స పాదుకే తే భరతః ప్రతాపవాన్

స్వలంకృతే సంపరి పూజ్య ధర్మవిత్।

ప్రదక్షిణం చైవ చకార రాఘవం

చకార తే చోత్తమ నాగ మూర్ధని॥

(అయోధ్యకాండ, 112. 21, 29)

భరతుడు: పూజ్యుడవైన ఓ అన్నా! నీ పాదుకలు బంగారముతో తాపబడినవి. ఆ పాదరక్షలను ఒక్కసారి నీ పాదములకు తొడుగుకొని నాకు అనుగ్రహింపుము – అవియే సమస్త లోకములకును యోగక్షేమములను సమకూర్చును.

భరతుడు ఆ పాదుకలను భక్తితో పూజించెను. వాటికిని, శ్రీరామచంద్రునకును ప్రదక్షిణపూర్వకంగా ప్రణమిల్లెను. ఆ పాదుకలను రాజు అధిరోహించెడి ‘శత్రుంజయము’ అనెడి శ్రేష్ఠమైన ఏనుగు అంబారిపై ఉంచెను.

127. శ్లో.

ఏతద్రాజ్యం మమ భ్రాత్రా దత్తం సంన్యాసవత్ స్వయమ్।

యోగ క్షేమ వహే చేమే పాదుకే హేమభూషితే॥

క్షిప్రం సంయోజయిత్వా తు రాఘవస్య పునః స్వయమ్।

చరణౌ తౌ తు రామస్య ద్రక్ష్యామి సహ పాదుకౌ॥

(అయోధ్యకాండ, 115. 14, 18)

భరతుడు అయోధ్యకు వెళ్ళినప్పటికీ శ్రీరాముడు లేని అయోధ్యలో క్షణం కూడా ఉండలేనని చెప్పి, నందిగ్రామం చేరి అక్కడ శ్రీరాముని పాదుకలను ప్రతిష్ఠించి ఇలా అన్నాడు:

‘పూజ్యులరా! మా అన్నయ్య శ్రీరాముడు స్వయముగా ఈ రాజ్యమును న్యాసముగా నాకు అప్పగించెను. బంగారముతో అలంకరించబడిన ఈ పాదుకలను కూడా ఇచ్చెను. ఇవి ఈ రాజ్య ప్రజల యోగక్షేమముల భారమును వహించుచుండెను. ఈ విషయమున నేను నిమిత్తమాత్రుడను, శ్రీరాముని బంటును. శ్రీరాముడు తిరిగి వచ్చిన పిమ్మట ఆయన పాదములకు ఈ పాదుకలను నేను స్వయముగా తొడిగెదను. అనంతరము పాదుకలను ధరించియున్న ఆ ప్రభువు పాదములను నేను భక్తితో దర్శించెదను.’

128. శ్లో.

దశ వర్షాణ్యానావృష్ట్యా దగ్ధే లోకే నిరంతరం।

యయా మూల ఫలే సృష్టే జాహ్నవీ చ ప్రవర్తితా॥

ఉగ్రేణ తపసా యుక్తా నియమైశ్చా ప్యలంకృతా।

దశవర్ష సహస్రాణి యయా తప్తం మహత్తపః॥

అనసూయా వ్రతైః స్నాతా ప్రత్యూహాశ్చ నివర్హితాః।

దేవకార్య నిమిత్తం చ యయా సంత్వరమాణయా।

దశరాత్రం కృత్వా రాత్రిః సేయం మాతేవ తేనఘ॥

(అయోధ్యకాండ, 117. 9 – 11)

అత్రి మహర్షి అనసూయ గురించి చెబుతాడు: ఒకానొక సమయమున వరుసగా పది సంవత్సరముల పాటు వర్షములు కురవలేదు. అప్పుడు అనసూయాదేవి తీవ్రమైన తపస్సు చేసి కందమూలాలను సృష్టించుటయే గాక గంగానదిని ప్రవహింపజేసింది. పదివేల సంవత్సరాలు తపమాచరించి చాంద్రాయణాది వ్రతములను నిర్వర్తించి ఋషీశ్వరుల తపశ్చర్యలకు ఎదురైన విఘ్నములను తొలగించెను. దేవకార్య నిమిత్తమై పది రాత్రులను ఒక రాత్రిగా మార్చి సహాయపడెను.

129. శ్లో.

దుశ్శీలః కామవృత్తోవా ధనైర్వా పరివర్జితః।

స్త్రీణామార్య స్వభావానాం పరమం దైవతం పతిః॥

(అయోధ్యకాండ, 117. 22)

అనసూయ సీతతో: పతి చెడు స్వభావము గలవాడైనను, స్వేచ్ఛాచారియైనను, ధనహీనుడైనను ఉత్తమ స్వభావము గల స్త్రీకి అతడే దైవము.

అనంతరము సీతను అడిగి – శివధనువు గూర్చి, శ్రీసీతారామ వివాహం గురించి అనసూయ అడిగి తెలుసుకుంటుంది.

శ్లో.

ఇత్యుక్తస్తేన విప్రేణ తద్ధనుః సముపానయత్।

నిమేషాంతర మాత్రేణ తదానమ్య స వీర్యవాన్।

జ్యాం సమారోప్య ఝడితి పూరయామాస వీర్యవాన్॥

(అయోధ్యకాండ, 118. 47, 48)

ఆ మహాధనుస్సు అక్కడికి (శ్రీరాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు ఉన్న చోటుకి) చేర్చబడెను. శ్రీరాముడు ధనుస్సును వంచి అల్లెత్రాడును సంధించి బలంగా లాగెను.. లాగుచుండగానే అది మధ్యకు విరిగి రెండు ముక్కలయ్యెను!

130. శ్లో.

అలంకురు చ తావత్ త్వం ప్రత్యక్షం మమ మైథిలి।

ప్రీతిం జనయ మే వత్సే! దివ్యాలంకారశోభితా॥

(అయోధ్యకాండ, 119. 10)

అనసూయ: అమ్మా సీతా! నేనొసంగిన దివ్యమైన వస్త్రములు, ఆభరణములు అన్నింటిని నా యెదుటనే అలంకరించుకొనుము. అలంకారముతో శోభిల్లెడి నిన్ను చూసి ఎంతయో ఆనందించెదను.

అయోధ్యకాండ చివర అనసూయ, సీత – ఇద్దరి కలయిక, పాతివ్రత్యం మీద చర్చ అనునవి విశేషార్థముతో కూడినవి. జరగబోయే కథలో దీని మహిమ వలననే సకారాత్మకమైన పరిణామాలు సంభవించగలవనే సూచన ఉన్నది. చివరగా..

131. శ్లో.

ఇతీవ తైః ప్రాంజలిభిస్త పస్విభిః

ద్విజైః కృతః స్వస్త్యయనః పరంతపః।

వనం సభార్యః ప్రవివేశ రాఘవః

సలక్ష్మణః సూర్య మివాభ్రమండలమ్॥

(అయోధ్యకాండ, 119. 21)

శ్రీసీతారామలక్ష్మణులకు బ్రాహ్మణోత్తములు ప్రయాణములు హాయిగా సాగుటకై శుభాశీస్సులు పలికారు. శత్రుదమనుడైన శ్రీరాముడు సీతాలక్ష్మణులతో గూడి, మేఘమండలుడయిన సూర్యుని వలె ఆ దట్టమైన వనమున ప్రవేశించెను!

..రాబోవునది చీకటికి సూచకం. కానీ అందులోకి ప్రవేశిస్తున్నది మహాపతివ్రత, మెరుపుతీగె వంటి సీతాదేవి, సత్యపరాక్రముడైన శ్రీరాముడు, ఆయన సోదరుడైన లక్ష్మణుడు! ఈ ముగ్గురు ఎలా ఈ చీకటిని ఛేదిస్తారు అన్నది నాటకీయమైన కథా ప్రస్తానం కావున ‘సలక్ష్మణః సూర్య మివాభ్రమండలమ్’ అన్నాడు మహర్షి!

***

132. శ్లో.

ధర్మపాలో జనస్యాస్య శరణ్యస్త్వం మహాయశాః।

పూజనీయశ్చ మాన్యశ్చ రాజా దండధరో గురుః॥

ఇంద్రస్యేహ చతుర్భాగః ప్రజా రక్షతి రాఘవ।

రాజా తస్మాద్వరాన్ భోగాన్ భుంక్తే లోకనమస్కృతః॥

తే వయం భవతా రక్ష్యా భవద్విషయవాసినః।

నగరస్థో వనస్థో వా త్వం నో రాజా జనేశ్వరః॥

న్యస్తదండా వయం రాజన్ జితక్రోధా జితేంద్రియాః।

రక్షిత వ్యాస్త్వయా శశ్వత్ గర్భభూతాస్తపోధనాః॥

(అరణ్యకాండ, 1. 17-20)

దండకారణ్యంలో మునులంతా శ్రీరామునితో అన్న మాటలు: స్వామీ! ఆర్తులైన మునులందరికీ శరణ్యుడివిగా ఖ్యాతికెక్కినవాడవు. ఎల్లరకునూ పూజ్యుడవు, మాన్యుడవు. నిగ్రహానుగ్రహ సమర్థుడవు. ఓ రాఘవా! ఇంద్రాది లోకపాలురలో చతుర్థాంశమే భూపతి. అందువలన అతడు ప్రజారక్షకుడై వారిచే పూజింపబడును. సకల భోగభాగ్యములను అనుభవించుచుండును. సామాన్యమైన రాజు విషయం ఇలా ఉండగా, అవతార పురుషుడవైన నిన్ను గూర్చి ఇక చెప్పవలసినదేమి?

నగరమునందున్నను, వనము నందున్నను నీవే మాకు ప్రభువుడవు.

మేము శాపాయుధములను పక్కన పెట్టాము. తపోవిధులకు శత్రువైన క్రోధమును పరిత్యజించాము. తపస్సులే మా సంపదలు. కనుక గర్భస్థ శిశువును తల్లి వలె అనుక్షణము మమ్ము నీవే కాపాడవలెను.

133. శ్లో.

అహం జ్ఞాత్వా నరవ్యాఘ్ర! వర్తమానమదూరతః।

బ్రహ్మలోకం న గచ్ఛామి త్వామదృష్ట్వా ప్రియాతిథిమ్॥

త్వయాహం పురుషవ్యాఘ్ర! ధార్మికేణ మహాత్మనా।

సమాగమ్య గమిష్యామి త్రిదివం దేవసేవితమ్॥

అక్షయా నరశార్దూల! మయా లోకా జితాశ్శుభా।

బ్రాహ్మ్యాశ్చ నాకపృష్ఠ్యాశ్చ ప్రతిగృహ్ణీష్వ మామకాన్॥

(అరణ్యకాండ, 5. 29-31)

శరభంగ మహర్షిని బ్రహ్మలోకానికి తీసుకుని వెళ్ళుటకు ఇంద్రుడు వచ్చాడు. శ్రీరాముని చూసి, వేళ కాదని వెనక్కి వెళ్లాడు. శరభంగుడు శ్రీరామునికి ఆతిథ్యం ఇచ్చి తరించాడు (అదే బ్రహ్మలోక ప్రాప్తిగా భావించాడు). ఆ పరబ్రహ్మతో అంటాడు:

ప్రియమైన అతిథివగు నీ దర్శనమును పొందిన పిమ్మటనే నిత్యమూ దేవతలచే సేవింబడు సత్యలోకమునకు వెళ్లెదను. ఓ మహాపురుషా! నా తపశ్శక్తి ప్రభావమున అక్షయములైన బ్రహ్మలోక, స్వర్గాది సమస్త లోక శుభ ఫలములన్నియు నాకు లభించినవి. అన్నింటిని అతిథివై ఇచటికి విచ్చేసిన నీకు సమర్పించుచున్నాను.

[శ్రీరాముని పరబ్రహ్మగా ఎరిగి అతిథిగా ఆయనను పొందడమే తపస్సుకు అసలైన ఫలితంగా గుర్తించి ఆ తపః ఫలాన్ని ఆయన పాదాలయందు సమర్పించుకున్నాడు శరభంగుడు. ఆయన తపశ్శక్తిని శ్రీరామునికి ఇచ్చివేసి శ్రీరాముడిని శక్తిమంతునిగా చేసినట్లు కొందరు వ్యాఖ్యలు చేసియున్నారు. అది సరైన మాట కాదు. శ్రీరాముడు అసహాయశూరుడన్న విషయం ఎన్నడూ మరువకూడదు.]

134. శ్లో.

పరా త్వత్తో గతిర్వీర! పృథివ్యాం నోపపద్యతే।

పరిపాలయ నః స్సర్వాన్ రాక్షసేభ్యో నృపాత్మజ॥

నైవమర్హథ మాం వక్తుమ్ ఆజ్ఞాప్తోహం తపస్వినామ్।

కేవలేనాత్మకార్యేణ ప్రవేష్టవ్యం మయా వనమ్॥

విప్రకారమపాక్రష్టుం రాక్షసైర్భవతామిమమ్।

పితుస్తు నిర్దేశకరః ప్రవిష్టోహమిదం వనమ్॥

భవతామర్థసిద్ధ్యర్థమ్ ఆగతోహం యదృచ్ఛయా।

తస్య మేయం వనే వాసో భవిష్యతి మహాఫలః॥

తపస్వినాం రణే శత్రూన్ హంతుమిచ్ఛామి రాక్షసాన్।

పశ్యంతు వీర్యమ్ ఋషయః సభ్రాతుర్మే తపోధనాః॥

దత్త్వాభయం చాపి తపోధనానాం ధర్మే ధృతాత్మా సహ లక్ష్మణేన।

తపోధనైశ్చాపి సభాజ్యవృత్తః సుతీక్ష్ణమేవాభిజగామ వీరః॥

(అరణ్యకాండ, 6. 20, 22-26)

మునీశ్వరులందరూ శ్రీరాముని వేడుకున్నారు: ఈ భూమండలమున నీవు దప్ప మమ్ము రక్షింపగల సమర్థులు మరి యెవరు లేరు. అందుచేత ఆ రాక్షసుల బారి నుంచి మమ్మల్నందరిని రక్షించి ఆదుకొనుము.

శ్రీరాముడు: నన్ను ఇలా ప్రార్థించటం ఏ మాత్రం తగదు. నేను తాపసుల ఆజ్ఞను పాటించవలసిన వాడను. నేను కేవలం నా కార్యం కోసమే వనమున ప్రవేశించాను. కాకపోతే ఈ రాక్షసులను రూపుమాపుటకే కాబోలు ప్రితృవాక్య పరిపాలనగా ఈ వనంలోకి వచ్చాను. మీ కార్యసిద్ధికి తోడ్పడటం దైవికము. అందుచేత నా ఈ వనవాసం మహా ఫలప్రదం కాగలదు!

తాపసుల శత్రువులైన రాక్షసులను పరిమార్చుట నేను కోరుకొనుచున్నాను. మా అన్నదమ్ముల  బల పరాక్రమములను ఇక చూస్తారు.

స్థిరమైన ధర్మబుద్ధి గల వీరుడు శ్రీరాముడు ఆ తపోధనులకు అభయమిచ్చి వారితో పాటుగా సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమానికి బయలుదేరాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here