జ్ఞాపకాల తరంగిణి-78

0
3

మంత్రకవాటం తెరిస్తే మహాభారతం మన చరిత్రే

[dropcap]శ్రీ [/dropcap]కల్లూరి భాస్కరం రచన నావంటి వారికి కొత్తచూపును ప్రసాదించింది. మన ప్రాచీన కావ్యం రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలు, భాగవతం వంటి అష్టాదశ పురాణాలను భక్తి శ్రద్ధలతో చదవడం, వాటిలోని విషయాలను సంపూర్ణంగా విశ్వసించడం ఒకటి, వాటిని ఆధునిక సామాజిక శాస్త్రాలు, జన్యుశాస్త్రం వంటి శాస్త్రాల పరిశోధనల వెలుగులో అనుశీలించడం ఒకటి. భాస్కరం ఈ రెండో మార్గాన్ని అనుసరించి మహాభారత కథలను విశ్లేషించారు.

ఆర్యులెక్కడి నుండో రాలేదని, వారు అనాదిగా ఈ దేశీయులేనని, వేదాలు ఈ దేశంలోనే ఆవిర్భవించాయని మన పెద్దలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఆర్యులు మధ్యప్రాచ్యం నుంచి వచ్చారని, వారితో పాటు సంస్కృత భాష మన దేశంలోకి వచ్చిందని, సంస్కృతం ఎల్ల భాషలకు జనని కాదని, అది ఇండో యూరోపియన్ భాషా కుటుంబానికి చెందినదని, ఇరాన్‍లో ప్రజలు వ్యవహరించే పార్సి సంస్కృతం లాగా ఇండో-యూరోపియన్ కుటుంబానికి చెందినదని నా తరం వాళ్ళు పాఠాల్లో చదువుకున్నారు.

తెలుగు ఎంత సంస్కృత భాషా పదభూయిష్టమైనా, అది ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన బాష అనీ, ద్రావిడులు కూడా కైబర్, బోలన్ కనుమల గుండా భారతదేశంలోకి ఆర్యుల కంటే ముందే ప్రవేశించారని భాషా శాస్త్రవేత్తలు నిరూపించారు. పాకిస్థాన్ లోని ఫక్తూన్ ప్రాంతంలో రాజమహల్ అనే ద్రావిడ భాష ఇప్పుడు కూడా వాడుకలో ఉందని, ఆ భాషలో 37% ద్రావిడ పదాలు, మిగతా పదాలు అరబ్, పార్సి, ఉర్దూ పదాలే అయినా, వ్యాకరణం, వాక్య నిర్మాణం ద్రావిడ భాషలకు సంబంధించినదే అని నిరూపణ అయింది.

భాస్కరం ‘మంత్రకవాటం తెరిస్తే’ అనే 800 పుటల గ్రంథంలో మనం సత్యాలని విశ్వసించిన అనేక విశ్వాసాలను పటాపంచలు చేసి, పురాణ వాఙ్మయాన్ని కొత్త, శాస్త్రీయ దృష్టితో విశ్లేషిస్తారు.

“హేతుబద్ధతకు అతీతంగాను, ఘనీభవించిపోయిన పురాణాలను ఉన్నవి ఉన్నట్లుగా తీసుకోవడానికి అలవాటు పడిపోతాం. వాటిని తార్కికంగాను, హేతుబద్ధంగానూ పరిశీలించడం ఎప్పుడైతే ప్రారంభిస్తామో ఘనీభవించిన స్థితి నుంచి అవి కరగడం ప్రారంభించి కొత్త అన్వయాలను బయటపెడుతూ కొత్త రూపాలు తీసుకొంటాయి.” (పుట 416).

మన సమాజం గణ సమాజం నుంచి పితృస్వామ్య సమాజంగా మార్పు చెందే క్రమంలో పురాణల కథలను భాస్కరం ఈ గ్రంథంలో చక్కగా విశ్లేషించారు. శాపాలు, వరాలు, మహిమలు, ఋషులు సంతాన ప్రాప్తి కలిగించడం వంటి అనేక విషయాల చుట్టూతా కమ్ముకొన్న మార్మికత అనే పొరను తొలగించి, అసలు వాస్తవాన్ని పాఠకుల ముందు ఆవిష్కరించారు.

నలదమయంతి ఉపాఖ్యానాన్ని, యయాతి శర్మిష్ఠ, దేవయానుల కథలను శాస్త్రీయ విమర్శకు తట్టుకొనే పద్ధతిలో విశ్లేషిస్తారు. యూరప్ సమాజంలో క్రైస్తవ మత ఆవిర్భావం అనంతరం పాత సమాజం, ఆచార వ్యవహారాలు, జీవన విధానం అన్నీ మరుగున పడిపోయాయి. అదృష్టవశాత్తు భారతీయుల గతం, ఆనాటి సమాజాల ఆచార వ్యవహారాలు, రీతి రివాజులు వర్తమానంలో ఏదో ఒక రూపంలో శిలాజాల వలె మారి ఉండిపోయాయి. మన విశ్వాసాలు, మాట, యాస, భాష అన్నింటిలో గతం ఏదో ఒక రూపంలో నిలిచిపోయిందని ప్రసిద్ధ చరిత్రకారులు డి.డి. కొశాంబీ అంటారు. కోశాంబీ రచనలను  అధ్యయనం చేసిన రాంభట్ల కృష్ణమూర్తి 1950 దశకంలో రచించిన ఋగ్వేదార్యులు, జనకథ; సోషల్ ఆంత్రొపాలజిస్టు (పురామానవ శాస్త్రవేత్త) మోర్గాన్ ప్రతిపాదించిన సిద్ధాంతాల వెలుగులో కల్లూరి భాస్కరం ఈ ప్రామాణిక గ్రంథాన్ని రాశారు.

వ్యాస వాల్మీకులు మౌఖిక సంప్రదాయానికి చెందినవారు. మహాభారతం చాలాకాలం వాగ్రూపంలో ప్రచారంలో ఉండి, తర్వాత లిఖిత రూపం ధరించింది. సంస్కృత భారతంలో కనిపించే అనేక గణ సమాజ లక్షణాలను నన్నయ అనువాదంలో తీసుకొని రాలేదు. పురా చరిత్ర, మానవ పరిణామచరిత్ర దృష్టి కోణం నుంచి చూస్తే, తెలుగు భారతం కన్నా సంస్కృత భారతం ప్రాముఖ్యం అధికమంటూ, పురాణ కథలకూ, వాస్తవికతకూ నడుమ ఉన్న మార్మికత అడ్డుగోడలు తొలగిస్తే ఆ పాత్రలు మానవ జీవితంలో తారసపడే వ్యక్తుల మాదిరే కనిపిస్తారు.

గ్రీకు, పశ్చిమ ఆసియా దేశాల సమాజాలు వేల సంవత్సరాల క్రితం జరిగిన చారిత్రక సంఘటనలను వివిధ రూపాల్లో భద్రపరుచుకొన్నాయి. అయితే పాశ్చాత్య సమాజం క్రైస్తవం వచ్చాక, పనిగట్టుకొని తన వైవిధ్యాన్ని తుడిచి వేసుకుని ఏకశిలా సదృశ సమాజంగా మార్చుకుంది.

ఆఫ్ఘనిస్థాన్ నుంచి వాయువ్య ఉత్తర భారతం వరకు ఆయుధోపజీవులైన ప్రజలు నివసించిన ప్రాంతమట. అతి ప్రాచీన కాలంలో జరిగిన ఒక యుద్ధం దశరాజ యుద్ధంగా ఋగ్వేదంలోకి ఎక్కింది. ఆ యుద్ధంలో తృష్టస్ అనే భరతులలోని ఉపగణానికి చెందిన సుదాసు విజయుడయ్యాడు. జలవనరుల ఆధిపత్యం కోసం జరిగిన యుద్ధం అది.

ధృతరాష్ట్రుడు గాంధారిని, ఆమెతో పాటుగా ఆమె చెల్లెళ్ళు పదిమందిని అదే లగ్నంలో పెళ్ళాడాడు. భీష్ముడు మరో నూరు మంది ఉత్తమకుల సంజాతలను కూడా దృతరాష్ట్రుడికిచ్చి చేశాడు. నేటి ఆఫ్ఘనిస్థానమే నాటి గాంధారం.

కర్ణుడి అంగరాజ్యం నేటి బీహారు తూర్పు భాగంలో ఉండేది. దీని రాజధాని చంపా నగరం. కర్ణుడి పెంపుడు తల్లి రాధ, పెంపుడు తండ్రెవరో తెలియదు. శల్యుడు కులం వల్ల ఉన్నత స్థానం ఆక్రమిస్తే, కర్ణుడు ప్రాంతం రీత్యా ఉన్నత స్థానంలో ఉన్నాడు. శల్యుడు కర్ణుడి కులాన్ని ప్రస్తావించి కించపరిస్తే, శల్యుణ్ణి క్షత్రియాధముడని సంబోధించి కర్ణుడు అవమానించాడు. ఇట్లా చాలా సూక్ష్మమైన అంశాలను భాస్కరం ఈ పుస్తకంలో పాఠకుల దృష్టికి తెస్తారు.

ఒక సందర్భంలో పితృస్వామ్యం స్త్రీకి తనదైన భాషను, అభివ్యక్తిని లేకుండా శాసించిందని, స్త్రీ పితృస్వామ్యంలో పురుషుడి హృదయంతో ఆలోచించి, పురుషుడి దృష్టి కోణం నుంచే స్పందించి, పురుషుల భాషలోనే మాట్లాడిందని వ్యాఖ్యానిస్తారు. యజమాని అనేవాడు బానిసలకు, దాసీలకే కాక శిష్యులకూ ఉంటాడని, అటువంటి దాసీలను, శిష్యులను ‘నాథవంతులు’ అని అంటారని వివరిస్తారు.

శ్రీ కల్లూరి భాస్కరం

మహాభారతం చదువుతున్నప్పుడు ఎన్నో ధర్మసందేహాలు ఎదురవుతాయి. కుంతి కన్యగా గర్భం దాల్చడం, ద్రౌపది ఐదుగురిని వివాహమాడడం వంటివి. అసందర్భంగా కనిపించే, అనిపించే ఘట్టాలలో వరాలు, శాపానుగ్రహాలు, మహిమలు వగైరా మాట్లు వేసి, వాటిని సమర్థించి, పౌరాణికులు వాటికి సంబద్ధత కల్పించడం జరిగింది. పురాణాలకు సహజమైన మాంత్రికశైలి ఇందుకు ఉపయోగపడింది.

“కాస్త హేతుబద్ధంగా ఆలోచించేవారికి పాండవుల పుట్టుకపై తప్పనిసరిగా సందేహాలు కలుగుతాయి” అంటూ పాండురాజు కన్నా మంచి వర్చస్సుతో కన్పిస్తున్న పాండవులు అతని కుమారులెట్లా అవుతారని కొందరు, కుంతి మాద్రి పతివ్రతలే కనుక పాండురాజు కుమారులేనని మరికొందరు పౌరులు అభిప్రాయపడ్డట్టు సంస్కృత భారతంలో ఉందట! పాండవుల పుట్టుకపై ఆనాడే అనుమాన పడినట్లు కల్లూరి భాస్కరం పేర్కొంటారు. మంత్రకవాటం తెరిస్తే ప్రతి పుటలోనూ ఇటువంటి సందేహాలు, సందేహాలకు తార్కిక పద్ధతిలో సమాధానాలు కన్పిస్తాయి. ప్రశ్నించే గుణం ఉన్న పాఠకులు తప్పక చదవవలసిన గ్రంథం ‘మంత్రకవాటం తెరిస్తే!’.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here