చిరుజల్లు-54

0
3

ది గేమ్

[dropcap]సూ[/dropcap]పర్నెంటు సుందరరావు రాధారాణికి ‘కంగ్రాట్స్’ చెప్పాడు. రాధారాణి ఆశ్చర్యపోయింది.

“దేనికి కంగ్రాచ్యులేషన్స్ చెబుతున్నారు?” అని అడిగింది.

“దేనికీ నీకు తెలియదా? నువ్వు చెప్పకపోయినంత మాత్రాన మాకు తెలియదునుకున్నావా?” అన్నాడు సుందరరావు.

ఆయన ఎందుకు కంగ్రాట్స్ చెప్పాడో అన్నది సస్పెన్స్ గానే ఉండిపోయింది. కొంతసేపటి తరువాత మళ్ళీ మళ్ళీ అడిగినా ఆయన దాటేస్తునే ఉన్నాడు.

ఇంటికి వెళ్ళబోయే ముందు అడిగింది “ఇప్పుడైనా చెప్పండి. లేకపోతే రాత్రంతా ఇదే మనసును తొలుస్తూ ఉంటుంది. నిద్ర పట్టదు” అని.

“ఇలా నిద్ర పట్టకపోవటం ఇంకెంతో కాలం ఉండదులే. నీకు పెళ్ళి నిశ్చయమైందట గదా. ప్రేమ వివాహం అట. అదృష్టవంతురాలివి” అన్నాడు సుందరరావు.

రాధారాణి నివ్వెరపోయింది. అప్పుడే ఈ విషయం ఈయనకు ఎలా తెల్సింది? ఆ మాటే అడిగితే, “ఆ ఒక్కటీ అడక్కు” అనీ అన్నాడు.

“ప్లీజ్.. దయ చేసి చెప్పండి. మీకు ఎవరు చెప్పారీ విషయం?” అని దాదాపుగా బ్రతిమిలాడుతూ అన్నది.

“నాకు ఎలా తెలిస్తేనేం లే? నిజమే గదా.. అందుకనే అందరి కన్నా ముందుగా నేను అభినందనలు చెప్పాను. ఇంతకీ ముహూర్తాలు ఎప్పుడు? పెళ్ళి ఎక్కడ? హైదరాబాదు లోనా, విశాఖ లోనా?” అని అన్నాడు.

“అవన్నీ ఇంకా నిర్ణయం కాలేదు గానీ, ఈ విషయం మీకు ఎలా తెలిసిందో చెప్పరా? లేకపోతే ఇదొక మిస్టరీలా మిగిలిపోతుంది నాకు” అన్నది రాధారాణి.

“నీ కాబోయే భర్త నీ గురించి ఎంక్వయిరీ చేశాడు. అతని ఫ్రెండ్ ఒకతను నాకు తెల్సిన వాడులే. అతని ద్వారా విషయాలు సేకరించాడు. నేను నీకు మంచి సర్టిఫికెట్ ఇచ్చాను. అందుకు మంచి పార్టీ ఇవ్వాలి మరి” అని నవ్వాడు సుందరరావు.

“అంటే ఏం ఎంక్వయిరీ చేశాడు?”

“నీ జీతం ఎంత? పై సంపాదన ఎంత ఉంటుంది? అంటే లంచాలు పట్టే పోస్టులోనే ఉన్నావా లేదా?.. నీకు ఇంకా ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా?.. ఇలాంటివే ఏవో అడిగాడు. నువు వజ్రం లాంటిదానివని చెప్పాను. చంద్రుడికైనా మచ్చ ఉందేమో గానీ, నీకు వంక పెట్టడానికి వీల్లేదని చెప్పాను.. ఇదంతా మామూలే. పెళ్ళి అంటే నూరేళ్ళ పంట – అంటారుగా. పెళ్ళికి ముందు మంచీ చెడూ విచారించుకోవటం సహజమే” అని ఆయన ముక్తాయింపు ఇచ్చాడు.

రాధారాణి జీవం లేని నవ్వు నవ్వింది. తన గురించి ఎంక్వయిరీ చేస్తున్నాడా – తన సంపాదన గురించి?.. పై సంపాదన గురించి?..

అంటే సుదర్శన్ తన సంపాదన కోసమే తనను ప్రేమిస్తున్నాడా? డబ్బు కోసమే తనను పెళ్ళి చేసుకుంటున్నాడా? నెల నెలా వేలకు వేలు తెచ్చి ఇచ్చే ఒక బంగారు బాతుగానే తనను చూస్తున్నాడా?.. ఎన్నో ప్రశ్నలు ఎదురైనయి. ఒక వేళ ఈ ఉద్యోగం పోతే? నాలుగు నెలలు జీతం రాకపోతే? తన పరిస్థితి ఏమిటి?

ఆలుమగల మధ్య ఉండవల్సిన అనుబంధం అందమైన పుష్పం లాంటిది. ప్రేమ, ఆదరణ, పరస్పర సహాకారం లాంటివన్నీ ఆ అందమైన పుష్పానికి ఉండవల్సిన రేకల్లాంటివి. డబ్బు కూడా వాటిల్లో ఒకటి. డబ్బు అందరికీ ఆరో ప్రాణం. అయితే సుదర్శన్ లాంటి వాళ్ళు, తమ పంచ ప్రాణాలనూ కూడా ఆరో ప్రాణం మీదనే పెట్టుకుంటారు. అలాంటివాళ్ళతో వేగటం కష్టమే.

రాధారాణి ఇంటికి వచ్చిన తరువాతా కూడా ఈ విషయమే ఆలోచిస్తోంది. సుదర్శన్ తన గురించి తన వెనుక ఎంక్వయిరీ చేశాడన్న విషయం ఆమెకు మింగుడు పడడం లేదు. తను ముందు జాగ్రత్త పడుతున్నాడని అనుకోవటానికి ఆమె మనసు అంగీకరించటం లేదు. తన మాట మీద నమ్మకం లేదన్న మాట.

ఇతను ఎవరో ముక్కూ మొహం తెలియని వ్యక్తి, పెళ్ళిచూపుల పేరుతో వచ్చి పది నిమిషాలు అందరి ముందూ కూర్చుని మొక్కుబడిగా చూసి వెళ్ళిన వ్యక్తి కాదు. చూసీ, వలచీ, వలపింప చేసుకున్న వ్యక్తి ఈ సుదర్శన్.

గుంటూరులో బంధువుల ఇంట్లో పెళ్ళికి వెళ్ళింది. అక్కడ తారసపడ్డాడు. అప్పటి నుంచీ వెంటపడ్డాడు. ప్రేమించుకున్నవాళ్ళ పరిస్థితి వేరుగా ఉంటుంది. నోటితో మాట్లాడేది తక్కువగానూ, కళ్ళతో మాట్లాడేది ఎక్కువగానూ ఉంటుంది.

రాధారాణి తల్లిదండ్రులు విశాఖపట్టణంలో ఉంటారు. ఆమె ఉద్యోగ రీత్యా హైదరాబాదులో ఉంటోంది. విడిగా ఒక అపార్ట్‌మెంటు అద్దెకు తీసుకుని అందులో తను ఒక్కతే ఉంటోంది.

గుంటూరులో కలిసినప్పుడు సుదర్శన్ మాటలు కలిపి అన్ని విషయాలు తెలుసుకున్నాడు. తన ఫోన్ నెంబరు తీసుకున్నాడు. వాట్సప్‍లో మెసేజ్‍లతో మొదలుపెట్టాడు. వారానికోసారి మాట్లాడేవాడు. తన అభిరుచులు, అభిప్రాయాల గురించీ, సినిమాల గురించీ, హీరోల గురించి మాటలు మొదలయ్యాయి. అక్కడి నుంచి నెమ్మదిగా మలయ మారుతాల గురించీ, ఎండల గురించీ, కురిసే వానల గురించీ, విరిసే పూవుల గురించీ, వెన్నెల రాత్రుల గురించీ, ఒంటరితనం కోరుకునే తోడు గురించీ, వయసు పోరాటం గురించీ, మనసు ఆరాటం గురించీ, ఎన్నో విషయాలు దొర్లుతుండేవి తమ మధ్య. క్రమంగా పైత్యం ముదిరి ఒక మాదిరి కవిత్వంలోకి దిగుతుందేది అతని ధోరణి.

ఒక అబ్బాయి, ఒక అమ్మాయితో కవిత్వం వల్లించటం మొదలుపెట్టాడంటే ప్రేమలో కూరుకుపోయాడనే అర్థం. మబ్బుల గురించీ, చంద్రుని గురించీ, చుక్కల గురించీ మానేసి ఆమెను పొగడ్తలతో ముంచెత్తటం మొదలెట్టాడు.

నిశ్శబ్దంలోనూ నీ పద ధ్వనులే, కన్నులు మూసినా తెరిచినా, నీ గురించిన కలలే, వలపు విసిరిన వలలే, నీలాంటి దానితో సహజీవనం చేయాలంటే ఎన్ని జన్మల పుణ్యఫలమో కల్సి రావాలనీ అన్నాడు.

మొదట్లో వారానికి ఒకసారీ, రెండుసార్లతో మొదలైన ఫోన్ సంభాషణ దినచర్యగా మారింది. పొగడ్తలకు, నిత్య స్తోత్ర పారాయణలకూ దేవుడు కూడా పొంగిపోయి కోరిన వరాలు ఇచ్చేస్తాడు గదా.. రాధారాణి లాంటి సుతిమెత్తని మనసున్న మోహనాంగి ఉబ్బితబ్బిబ్బు అవటంలో ఆశ్చర్యమేముంది?

“మీరోసారి వస్తే ముఖాముఖీ మాట్లాడుకోవచ్చు గదా..” అన్నది.

“ఆ పిలుపులో స్వర్గ సౌఖ్యాల గుసగుసలు వినిపించాయి” అన్నాడు.

“స్వర్గాలు, సుఖాలు అవన్నీ ఏం ఉండవు. ఉత్తినే ఊసుపోక కబుర్లు మాత్రమే ఉంటాయి” అని నవ్వింది రాధారాణి.

“నీ నవ్వుల కురిసిన పువ్వుల వానలో తడిసి ముద్ద అయిపోతున్నాను. జన్మజన్మల తపస్సు ఫలించింది” అన్నాడు.

అతను వచ్చాడు. రెండు రోజులు హోటల్లో ఉన్నాడు. సాంగత్యం వల్ల సమకూరిన సామీప్యం వల్ల మరింత సాన్నిహిత్యం సమకూరింది.

పెళ్ళి ప్రసంగం వచ్చింది.

“పెళ్ళి విషయంలో నిర్ణయం నాదే. నా మాట మావాళ్ళు కాదనరు. కానీ ఇది జీవితాన్ని మలుపు తిప్పే ముఖ్యమైన ఘట్టం గనుక మా అమ్మానాన్నలతో సంప్రదించాలి. అంతవరకూ, ఇంతవరకూ చాలు..” అన్నది రాధారాణి.

“మహారాణి వారి ఆజ్ఞ. నీ మాటే నాకు వేదవాకు. శిరోధార్యం..” అన్నాడు.

మర్నాడు వెళ్ళిపోయాడు.

పెద్దల సంప్రదింపులు అయిపోయాయి. వీళ్ళ వాళ్ళూ, వాళ్ళ వాళ్ళు కలుసుకున్నారు. ‘మిగిలిన విషయాలు’ మాట్లాడుకున్నారు. అంతా నిశ్చయమైపోయింది. ఇంక ముహూర్తాలు పెట్టుకోవడమే తరువాయి. మంచి రోజుల కోసం మరికొన్ని రోజులు ఆగవలసి వచ్చింది. వచ్చే నెల దాటితే గాని ముహూర్తాలు లేవన్నారు.

ఇంతలోనే అనుకోకుండా ప్రియూడూ, కాబోయే విభుడూ మళ్ళీ ప్రత్యక్షమైనాడు. హోటల్లో దిగి ఫోన్ చేశాడు.

“ఏమిటింత సడెన్‍గా సాక్షాత్కారం లభించింది?” అని అడిగింది.

“కొంచెం ఆఫీసు పని తగిలింది. ఇంకొంచెం నిన్ను మళ్ళీ చూడాలనిపించింది. అందుకని ఉన్న పళంగా బయల్దేరి వచ్చేశాను..” అన్నాడు సుదర్శన్.

ఇద్దరూ కల్సి కాఫీ తాగారు. భోజనం చేశారు. సినిమా చూశారు.

కలల ప్రపంచం కళ్ళముందు సాకల్యం కావటానికి ఇంక ఎంతో కాలం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఆనందం నిండిన డెందం నిలువనీయటం లేదు. రంగుల హరివిల్లు మీద కూర్చున్న భావన. దిగంతాల కావలకు చెట్టాపట్టాలుగా నడిచి వెళ్ళిన అనుభూతి. కాలం అలల మీద, ఆశల పడవల పైన పయనిస్తున్న ఫీలింగ్. శ్రావ్యమైన ప్రేమ గీతం ఏదో నిరంతరం వినిపిస్తూనే ఉంది.

అంతా అయ్యాక ఇంక వెళ్ళిపోతున్నాను – అన్నప్పుడు రాధారాణి స్పష్టంగా చెప్పింది.

“ప్రేమ మైకంలో ఉన్నప్పుడు పొగడ్తలతో అగడ్తలను దాటించటం మామూలే. కల్సి జీవించబోయేటప్పుడు స్పష్టంగా తెల్సుకోవాల్సిన విషయాలు కొన్ని ఉంటయి. ఇప్పుడు వాటి గురించీ ముచ్చటించుకోవాలి. పెళ్ళి అయిన తరువాత కల్సి జీవించడం మొదలుపెట్టాక, ప్రేమికులే ఒకరికొకరు రంగు వెలసిన బొమ్మల్లా కనిపిస్తారు. ప్రేమ మరిగిపోయి, కనుమరుగైపోయి, చీటికీ మాటికీ చికాకులూ, పరాకులూ, కలహాలూ మొదలవుతయి. కానీ మన విషయంలో అలాంటి పరిస్థితి రాకూడదు. ఈ ప్రేమ ఆలుమగలమైన తరువాత దినాదినాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. కొన్ని తప్పులు జరగవచ్చు, పొరపాట్లు జరగవచ్చు. సర్ది చెప్పుకొని, సరిదిద్దుకోవాలి. ముఖ్యంగా మన మధ్య రహస్యాలు ఉండకూడదు. ప్రతీదీ మనసు విప్పి మాట్లాడుకోవాలి. ఇది నాకున్న నిశ్చితాభిప్రాయం” అని.

“అవునవును. నాదీ అదే అభిప్రాయం. మన ప్రాయమూ, అభిప్రాయమూ పాలూనీళ్ళు లాగా విడదీయలేనంతగా కల్సిపోయాయి..” అన్నాడు.

తరువాత ఇంకో గంటలో తన ఊరికి వెళ్ళిపోవాలంటూ “విడిపోవాలంటే బాధగా ఉంది” అన్నాడు.

“విడిపోయేది తిరిగి కల్సుకునేందుకే గదా..” అన్నది రాధారాణి.

“తిరిగి కల్సుకునేందుకే అయినప్పుడు విడిపోవటం ఎందుకు?”

“విడిపోకపోతే, కల్సుకోవటం ఎలా?” అన్నది.

ఇద్దరూ నవ్వుకున్నారు.

మరునాడు –

రాధారాణి ఆఫీసులో అంతా ఆటవిడుపుగా ఉంది. ఎవ్వరూ ఆఫీసు పని చేయటం లేదు. ఆఫీసరుకి మనవడు పుట్టాడు. ఆయన సాయంత్రం ఒక హోటల్లో పార్టీ ఇస్తున్నాడు. స్టాఫ్ అందరినీ పిలిచాడు. అందరూ ఆఫీసులోనే కొంచెం సేపు ఆలస్యంగా కూర్చుని అక్కడి నుంచే పార్టీకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు.

రాధారాణి ఆటోలో వెళ్ళాలని అనుకున్నది.

“నీకు అభ్యంతరం లేకపోతే, నా వెనుక కూర్చోవచ్చు” అన్నాడు సూపర్నెంటు సుందరరావు.

ఆయన తండ్రి లాంటి వాడు. అంతటి చనువూ ఉన్నది. అందుచేత ఆయన టూవీలర్ మీద, ఆయన వెనుక కూర్చుంది.

మధ్యలో ఒక చోట ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగారు కొద్ది క్షణాలు. అనుకోకుండా పక్కకు తిరిగి చూసింది. పక్కనే ఆగిన ఆటోలో సుదర్శన్ కనిపించాడు. ఆమె కంట పడకుండా ఉండటం కోసం వెనక్కి జరిగి మొహం పక్కకు తిప్పుకున్నాడు. కానీ ఆమె దృష్టి నుంచి తప్పించుకోలేకపోయాడు.

నిన్ననే వెళ్ళిపోతాను – అన్నవాడు ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళకపోతే తనకు ఎందుకు ఆ విషయం చెప్పలేదు? ఇప్పుడు తనను ఎందుకు వెంబడించాడు? సమాధానం దొరకని ప్రశ్నలే అన్నీ.

మర్నాడు రాధారాణి ఇంట్లోనే ఉంది. పక్క అపార్ట్‌మెంటులో ఉంటున్న వేణు ఆమె దగ్గరకు వచ్చాడు. తమ్ముడి లాంటి వాడు. అతని కుటుంబంతో ఆమెకు సన్నిహితమైన స్నేహబంధం ఏర్పడింది. బయట పనులు ఏమన్నా ఉంటే వేణుకు చెబుతుంది.

“అక్కా ప్రేమ వివాహాలు ఎందుకు ఫెయిల్ అవుతుంటాయి?” అని అడిగాడు వేణు.

“ప్రేమకు నమ్మకం పునాది. ఒకరి మీద మరొకరికి అచంచలమైన విశ్వాసం ఉండాలి..”

“మీ ప్రేమకు పునాది సరిగా లేదేమో అనిపిస్తోంది అక్కా. నిన్న నీవు లేనప్పుడు అతను వచ్చాడు. నువ్వు లేవని చెప్పాను. వీధి చివర ఇరానీ కేఫ్‍కి తీసుకెళ్ళాడు. నీ గురించి అడిగాడు. నీ ఇంటికి ఎవరన్నా వస్తుంటారా – అని అడిగాడు. నీకు ఎవరన్నా ఫ్రెండ్స్ ఉన్నారా అని అడిగాడు. మీ ఇంట్లో వాళ్ళతో ఎలా ఉంటుందీ – అని అడిగాడు. నీ మీద అనుమానం రాకుండే ఉండేలా చూస్తూనే నీ గురించి కూపీ లాగాలాని చూశాడు” అన్నాడు వేణు.

ఒక గంట తరువాత అతను ఉన్న హోటలుకు ఫోన్ చేసి, రూమ్ నెంబరు టూ జీరో టూ లో ఎవరున్నారని అడిగింది. సుదర్శన్ ఉన్నాడని చెప్పారు.

రాధారాణి సుదర్శన్‍కి ఫోన్ చేసింది.

“ది గేమ్ ఈజ్ ఓవర్” అని ఒకే ఒక ముక్క చెప్పి ఫోన్ నొక్కేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here