[dropcap]మా[/dropcap]నవ మస్తిష్కం పరిపక్వ దశకు రావటానికి కొంచెం అటూ ఇటూగా 10 సంవత్సరాల వయసు రావాలి. కానీ దాని పని సామర్థ్యం సమయానుకూలంగా నిరంతరం కొనసాగుతూ ఉండే నాడుల అనుసంధాన ప్రక్రియ కారణంగా జీవితాంతం కొనసాగుతూనే ఉంటుంది. ప్రతి క్రొత్త సందర్భానికి అనుగుణంగా తనను తాను మార్పులు చేసుకుంటూ పోగల అద్భుతమైన సామర్థ్యం మెదడుకు ఉంటుంది.
అయితే 40 సంవత్సరాలు దాటాకా మెదడు సైజు తగ్గడానికి, హార్మోన్స్ లెవెల్స్ తగ్గడానికి, న్యూరో ట్రాన్స్‌మిషన్ మందగించడానికి మెదడుకు రక్తం సరఫరాలలో హెచ్చుతగ్గులు ముఖ్య కారణంగా చెప్పవచ్చు. పై కారణాల వలన క్రొత్త విషయాలు నేర్చుకునే సామర్థ్యాలూ సహజంగానే తగ్గుతాయి. ఇది నివారించలేని సమస్య ఏమీ కాదు.
క్రొత్త విషయాలను నేర్చుకుంటూ ఉండే సామర్థ్యం కొనసాగాలంటే మన మెదడులో క్రొత్త అనుసంధానాలు ఏర్పడే ప్రక్రియ కొనసాగుతూ ఉండాలి. ఈ లక్షణాన్ని ‘న్యూరో ప్లాస్టిసిటీ’ అంటారు. వయసు పైబడే కొద్దీ జ్ఞాపకశక్తి తగ్గుతూ వస్తుంది. ఆ కారణంగా ఏక కాలంలో పలు విధులను నిర్వర్తించడానికి ప్రణాళికను రచించడం, అమలు పరచడం వంటి సామర్థ్యాలూ తగ్గుతాయి. దానికి కారణం మెదడులో అనుసంధాన ప్రక్రియ కుంటుపడడమే.
తీవ్రంగా గాయాల పాలైనప్పుడు, స్ట్రోక్స్ వంటివి వచ్చినపుడు మెదడు లోని కణాలు హెచ్చు స్థాయిలో చచ్చిపోతాయి. అయినా క్రమక్రమంగా చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ పోవడం ద్వారా మెదడు కోల్పోయిన ఆ సామర్థ్యాలను పాక్షికంగా కానీ, పూర్తిగా కాని పునరుద్ధరించుకోగలుగుతుంది. ఆరోగ్యకరమైన జీవన శైలి, సమతులాహారం వంటి వాటితో తగిన సహకారాన్ని అందించడం జరిగితే మెదడు పని మరింత సులువు అవుతుంది.
హిప్పోకాంపస్:
ఇది మనిషికి అవసరమైన ప్రాంతాలనూ, జ్ఞాపకాలనూ, చుట్టూ ఉన్న పరిసరాలను, వాటికి సంబంధించిన వివరాలను భద్రపరిచి ఉంచడంలో కీలక పాత్ర వహిస్తుంది. హిప్పోకాంపస్ సామర్థ్యం సైతం మనుషులలో ఒకేలా ఉండకుండా వేరు వేరుగా ఉండుందని అధ్యయనాలు చెప్తున్నాయి. మనుషుల వృత్తి, ప్రవృత్తులను బట్టి, జీవనశైలిని బట్టి వారి జ్ఞాపకశక్తి లోనూ అంతరాలు ఉంటున్నాయి. కొందరు ఎంత వయసు వచ్చినప్పటికీ, జ్ఞాపకశక్తిలో చిన్నవారితో పోటీపడుతు ఉండడం తెలిసిందే.
వ్యాయామం:
ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం 65 సంవత్సరాలు పైబడిన వాళ్ళు వారానికి కనీసం 5సార్లు 30 నిమిషాల చొప్పున ఆగకుండా నడవాలి. గుండె బలహీనపడటం, రక్తపోటు వంటి వాటిని వ్యాయామం తగ్గిస్తుంది. వ్యాయామం చేసే అలవాటు ఉన్నవాళ్ళకు యాంగ్జైటీ, డిప్రెషన్ వంటివి తక్కువని సర్వేలు చెప్తున్నాయి. పై బలహీనతలన్నీ మతిమరపుకూ ప్రమాదమే. చక్కటి ఆహారం, వ్యాయామం, జీవనశైలిలో క్రమశిక్షణ – న్యూరో ప్లాస్టిసిటీని పెంపొందించడానికి దోహదం చేస్తాయని పలు పరిశోధనలు చెప్తున్నాయి.
ధ్యానం:
ధాన్యాన్ని గురించి, దాని వలన ఒనగూడే ప్రయోజనాల గురించి జరిగిన అనేక పరిశోధనలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం వెలువరించిన ఫలితాలు ధ్యానం జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తున్నట్లు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా వయసు పైబడిన వారిలో ధ్యానం జ్ఞాపకశక్తి తగ్గడాన్ని అరికట్టుతోంది. ఔషధాలతో సంబంధం లేకుండా ఈ ప్రయోజనం ఒనకూడటం విశేషం. అంటే ధ్యానంతో హిప్పోకాంపస్‍కు మేలు జరుగుతున్నట్లే.