[ప్రముఖ రచయిత శ్రీ సిహెచ్. సియస్. శర్మ రచించిన ‘డాక్టర్ అన్నా బి.యస్.యస్.’ నవలని ధారావాహికంగా పాఠకులకు అందిస్తున్నాము.]
[తనతో పాటు లాస్యని కూర్చోబెట్టుకుని ఆచార్య వ్యవహారాల గురించి చెబుతూ, శ్లోకాలు పాడుతూ పూజ చేయిస్తుంది మాధవి. నేటి యువతీయువకుల ప్రవర్తన ఎలా ఉందో చెప్పి, భారతీయ ధర్మాన్ని పాటించడం మనకి గౌరవం అని లాస్యతో చెబుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ధర్మతేజకు, అన్నాకు తీర్థప్రసాదాలు ఇస్తుంది. టిఫిన్ తిన్నాకా, లాస్య ఆధునిక వస్త్రధారణలోకి మారి తన ఊరికి బయల్దేరుతుంది. లాస్య వెళ్ళిపోయిందని ఆమె తండ్రి భార్గవకి ఫోన్ చేసి చెప్తాడు ధర్మతేజ. తాము ఆమెను తమ కోడలిగా చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్తాడు. లాస్య ఎం.ఎస్. పూర్తి చేసేవరకు ఆగుదాం అంటాడు భార్గవ. అన్నా కూడా మరో ఏడాది వరకు పెళ్ళి వద్దంటాడు. లాస్య తన తండ్రికి ఫోన్ చేసి అన్నా ఇంట్లో తన అనుభవాలను చెప్తుంది. ఆయన తన పెద్దల్లుడు అన్నానే అని ఫిక్స్ అయ్యాను అని అంటాడు. తండ్రి నిర్ణయం లాస్యకు రుచించదు. ధర్మతేజ, మాధవిల తీరు ఆమెకు నచ్చదు. అన్నా స్తబ్ధుగా ఉండే మనిషని భావిస్తుంది. తను ఆ ఫ్యామిలో సరికాదని అనుకుంటుంది. ఇక చదవండి.]
[dropcap]అ[/dropcap]న్నా సెల్‌లో మెసేజ్ చేసేవాడు..
తనూ క్లుప్తంగా జవాబు ఇచ్చేది..
అన్నా.. ఆమె అభిరుచులు గురించి అడిగే వాడు..
లాస్య.. తన అభిరుచులను తెలియచేసేది.
ఆమె మాటల్లోనూ అర్ధం అయింది.. తాను మోడరన్ తయారు కావాలన్నది. అంటే.. క్లబ్బులు.. పబ్బులు.. కార్లు..
తన తల్లిదండ్రులకు ఆమె అంటే ఎంతో ఇష్టం.. కాబట్టి తాను లాస్య ఇష్టానుసారంగా నడచుకొని.. ఆమెకు అనందాన్ని కలిగించాలని.. నిర్ణయించుకొన్నాడు. మిల్‌బ్రేమ్‌కు లీవ్ డేస్‍లో వెళ్లేవాడు. లాస్య కోరిన విధంగా ఆమెతో పబ్బులు.. షికార్లు చేసేవాడు.
“ఓ ఆరునెలలు మనం డేటింగ్ చేయాలి..” అంది లాస్య.
“ఓకే!.. నీ ఇష్టం.. కానీ..”
“కానీ!..” అశ్చర్యంతో అన్నా ముఖంలోకి చూచింది లాస్య..
“ఆరు నెలలు కుదరదు..”
“మై ప్రొఫెషనల్ డ్యూటీ.. బ్రేక్ అవుతుంది. అది నాకు ఇష్టం లేదు. ఐ లవ్ మై ప్రొఫెషన్..”
“ఓకే.. మీ ఇష్టం.. రావాలనుకొన్నపుడు ఫోన్ చేసి రండి..” చిరునవ్వుతో చెప్పింది లాస్య.
ఇరువురూ .. పబ్‌కు వెళ్లారు.. సరదాగా కబుర్లు.. జోక్స్.. త్రాగారు.. డాన్స్ చేశారు.. హోటల్ రూమ్‌కు వెళ్లిపోయారు. లాస్య మందును ఆర్డర్ చేసింది.
బేరర్ తెచ్చి.. కలిపి.. రెండు గ్లాసులు టీపాయ్‍పై వుంచి వెళ్లిపోయాడు.
ఒక గ్లాసు అన్నాకు అందించింది. తను ఒక గ్లాసు చేతికి తీసుకొంది.
“మై డియర్ అన్నా!.. లైఫ్ ఈజ్ వెరీ స్మాల్. దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు. ఆనందంగా అనుభవించాలి. గడచిన క్షణం జీవితంలో తిరిగిరాదు. నా దృష్టిలో ఆడా మగా సమానం.. వాట్ డూ యూ సే?..”
“ఎస్.. యు ఆర్ రైట్ లాస్యా!.. బట్ !..”
“వాట్.. బట్!.. టెల్ మీ?..”
“మగాడు తాను చేసిన తప్పును కడిగి వేసుకోగలడు.. కానీ స్త్రీ కడిగేసుకోలేదు.. నేరస్థురాలు అవుతుంది.. సమాజం దృష్టిలో.. స్త్రీకి శీలం ఎంతో ముఖ్యం.. గౌరవప్రదం..”.
లాస్య విచిత్రంగా నవ్వింది.
“మీ భావాలు.. మీ అమ్మలాగే .. పాత వూరగాయలే!..” గలగలా నవ్వింది.
“స్త్రీ కడిగేసుకోలేదన్నది ఒకనాటి మాట.. టుడే దట్ కెన్ బి వాషబుల్.. వైజ్ మేన్!..”
“అది తప్పు.. పాపం..”
“తప్పు.. ఒప్పు.. అని అనకు మైడియర్ ఫ్రండ్!.. ఎవ్విరిథింగ్ డిపెండ్ అన్ యువర్ .. అవర్.. విజన్.. వెన్ వుయ్ టు అగ్రిడ్.. నో ప్రాబ్లమ్.. నో సిన్..” అందంగా నవ్వింది లాస్య.
అన్నా.. ఆ క్షణంలో లాస్యను పరీక్షగా చూచాడు.. మల్లెల వంటి పలువరుస మెరుపు.. ‘వా.. వా.. గ్రేట్.. దేవకన్య.. సూపర్.. అమ్మకు అందుకే ఈ పిల్ల అంత ఇష్టం..’ అనుకొన్నాడు అన్నా..
లాస్య రెండు గ్లాసులు నింపి ప్రక్కన కూర్చుని బలవంతంగా అన్నా చేత త్రాగించింది.
తూలుతున్న అన్నాను లేపి నడుం చుట్టూ చేయివేసి బెడ్‌రూమ్‌కి చేర్చింది.
తాను రెస్ట్ రూమ్‌కి వెళ్లివచ్చి తన గ్లాసులోని ఆ అమృతాన్ని త్రాగి.. వివస్త్ర అయి అన్నా పక్కన పడుకొంది.
***
జరిగినదానిలో లాస్యదే ప్రమేయం. అనుభవం.. శాన్ ఫ్రాన్సిస్కోకు అన్నా ఎంతో అశాంతిగా తిరిగి వచ్చాడు. ఆ సంఘటన గురించి అన్నా చాలా బాధపడ్డాడు. తప్పు చేశానని కుమిలిపోయాడు. క్షమాపణ తెలియచేస్తూ లాస్యకు మెసేజ్ పంపాడు.
జవాబుగా లాస్య.. “వెన్ ఆర్ యు కమింగ్?..” అంటూ మెసేజ్‌ను పంపింది.
అన్నా.. అవమానం.. లజ్జ.. సిగ్గుతో ఎంతో ఫీలయ్యాడు.. లాస్య తనను చాలా నీచంగా భావించి వుంటుందని అనుకుంటున్న అన్నాకు లాస్య మెసేజ్ అమృతంలా తోచింది. ఆమె పట్ల అభిమానం.. అనురాగం.. ప్రేమ ద్విగుణీకృతం అయింది. హాస్పటల్ వ్యవహారాల వలన ఒక నెలరోజులు లాస్యను మిల్‍బ్రేమ్‌కు వెళ్లి కలవలేకపోయాడు.
తన డ్యూటీ అంతా ముగిశాక.. ఫోన్ చేసేవాడు..
ఆ సమయంలో లాస్య ఎన్నోసార్లు ఫోన్ రిసీవ్ చేసేది కాదు. ఒక్కోసారి ఎత్తినా.. “ఎపుడు వస్తావు.. ఎప్పుడు వస్తావు..” అంటూ అడిగి అన్నా రాలేనని సమాధానం విని.. ఫోన్ కట్ చేసేది లాస్య..
అన్నాకు దిన దినానికి లాస్య మీద ప్రేమాభిమానాలు పెరిగాయి.
ధర్మతేజ.. మాధవీలు.. ఇరువురూ పనిచేసేవారే కనుక ఉదయం హడావిడిగా టైమ్ ప్రకారం ఎవరి కార్లో వారు కార్యాలయానికి వెళ్లిపోయేవారు. సాయంత్రం కలుసుకొనేవారు. లాస్య ఆ టైములో అన్నా చెప్పగా నెలకు ఐదారు సార్లు మధవికి ఫోన్ చేసి కుశల ప్రశ్నలడిగి.. తన చదువును గురించి చెప్పి కట్ చేసేది.
కాలం గడిచేకొద్ది.. మాధవికి లాస్యకు మధ్యన ఫోన్ కాల్స్ తగ్గిపోయాయి. చదవుతో బిజీ అయిపోయిందనుకునేది
తన ఉద్యోగ ధర్మానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చే అన్నా.. లాస్య పిలిచినపుడల్లా పోలేకపోయేవాడు. చాలా ఘాటైన మెసేజ్‌లు పంపేది లాస్య. చదువుకొని చిరునవ్వుతో అనునయంగా జవాబులు పంపేవాడు అన్నా.
ఒకటిన్నర సంవత్సరం సాగిపోయింది.. అప్పటికి అన్నా లాస్యల సమావేశం మూడుసార్లు సాగింది. దాదాపు తొమ్మిది నెలలుగా అన్నా ‘నేను ఫ్రీ.. రానా’ అని పంపిన మెసేజ్‌కు జవాబుగా ‘ఐయామ్ నాట్ ఫ్రీ.. రావద్దు..’ అనే జవాబు వచ్చేది. లాస్యపై పిచ్చి ప్రేమలో ఉన్న అన్నా.. చదువు రీత్యా బిజీ అని భావించి సలహాలను.. శుభసందేశాలను.. పంపేవాడు. ‘మరో ఆరునెలలతో నీ యం.యస్., అయిపోతుందిగా.. ఆ తర్వాత వెంటనే.. మన వివాహం.. ఇక ఎపుడూ నీవు నా దగ్గరే వుంటావ్.. నాదానిగా!..’ అనే అభిమాన పూర్వక సందేశానికి.. లాస్య నుంచి సమాధానం రాలేదు.
లాస్యకు తనపై చాలా కోపం కలిగిందని.. వెళ్లి ఆమె ఇష్టానుసారంగా ఒకటి రెండు రోజులు గడపి.. లాస్యకు సంతోషం కలిగించాలని.. అన్నా మిల్‍బ్రేమ్‌కు బయలుదేరాడు. ఇంటికి వెళ్లి విచారించాడు. లాస్య ఇంట్లో లేదు. వాళ్లు ఏకాంతంగా కలసికొనే హోటల్‌కి ఫోన్ చేసి లాస్యను గురించి విచారించాడు. ఉదయం తొమ్మిదికి రూమ్ తీసుకొన్నట్టుగా తెలిపారు.
అన్నా.. హోటల్‍కు చేరి సెకండ్ ఫ్లోర్లోని రూమ్ నెంబర్ 201 కాలింగ్ బెల్ నొక్కాడు.. మరోసారి నొక్కాడు.. టవల్ చుట్టుకొని ఒక అరడుగుల ఆఫ్రో-అమెరికన్ తలుపు తెరిచాడు.. లోనవున్న లాస్య అన్నా కంటపడింది.
విషయం అర్ధం అయిన అన్నా..”సారీ!.. మిస్టేక్.. నెక్స్ట్ డోర్.. ప్లీజ్ క్లోజ్ ది డోర్.. సారీ.. సారీ..” ప్రాధేయపూర్వకంగా చెప్పాడు అన్నా..
ఆ వ్యక్తి.. “ఆర్ యు బ్లైండ్!.. ఇడియట్!..” అంటూ ఆవేశంతో డోర్‌ను మూశాడు.
అన్నాకు.. తలపై పిడుగు పడినట్లయింది. తాను ఎన్నడూ వూహించని స్థితిలో ఆ గదిలో వున్న లాస్యను చూచాడు.. కానీ .. అవునా.. కాదా!.. అనే సందేహం!..
రిసెప్షన్ కౌంటర్ సమీపించి రూమ్ 201 ఎవరి పేరుమీద బుక్ అయిందని అడిగాడు.
“అబ్రహామ్..” మేనేజరు జవాబు.
ఆ కౌంటర్లో మేనేజరు పేరు విల్సన్. అన్నా గతంలో లాస్యతో వచ్చినపుడల్లా అతనే కౌంటర్లో వుండేవాడు. అతను అన్నాను గుర్తుపట్టాడు.
ఆలోచనగా మౌనంగా నిలబడిన అన్నాను చూచి విల్సన్..
“సార్.. ఎనీ ప్రాబ్లమ్?..” మెల్లగా అడిగాడు.
“యస్.. ఐ వాంట్ వన్ ఇన్ఫర్మేషన్..”
“ప్లీజ్.. అస్క్ మి సర్!..”
లాస్య ఫొటోను.. విల్సన్‍కు తన సెల్ లో చూపించి “యూ నో హర్?..” అడిగాడు.
విల్సన్ చిరునవ్వుతో.. “వన్స్ షి వజ్ యువర్ లవర్.. షీ ఈజ్ నౌ విత్ అబ్రహామ్..”
“హౌలాంగ్ దే ఆర్ కమింగ్?..”
“ఫాస్ట్ నైన్ మంత్స్.. ఆర్.. సో..”
అన్నా సందేహాలన్నీ తీరిపోయాయి.. తల ముక్కలయిన బాధ..
“ప్లీజ్.. ప్రొవైడ్ మీ ఏ రూమ్ ..”
“థర్డ్ ఫ్లోర్!..”
“ఎనీ ఫ్లోర్!..”.
“థర్డ్ ఫ్లోర్.. రూమ్ నెంబర్ 301..”
బేరర్ ముందు వెనుక అన్నా లిఫ్ట్‌లో థర్డ్ ఫ్లోర్ చేరారు. బేరర్ 301 రూమ్ డోర్ తెరిచాడు. ఇరువురూ లోనికి వెళ్లారు.
ఫ్యాన్, ఏసీ, లైట్లు.. టీవీ బేరర్ ఆన్ చేశాడు.
అన్నా.. “స్టాప్ ది టీవీ. ప్లీజ్ గెట్ స్కాచ్ విస్కీ ఫుల్!..” అన్నాడు.
బేరర్ వెళ్లిపోయాడు. అన్నా మంచంపై వాలిపోయాడు. కళ్లల్లో కన్నీరు..
పది నిముషాల్లో బేరర్ ఆ సామాగ్రి తెచ్చాడు.
“ప్లీజ్ గివ్ మీ వన్ గ్లాస్!..”
బేరర్ గ్లాసులో విస్కీ.. ఐస్ క్యూబ్స్.. వాటర్ పోసి చేతికి అందించాడు.
లాస్య జ్ఞాపకాలను తలచుకొంటూ.. అన్నా త్రాగాడు.. తెలివి తప్పి మంచంపై వాలిపోయాడు.
మరుదినం.. తొమ్మిది గంటల ప్రాంతంలో బేరర్ వచ్చి తట్టి తట్టి లేపగా అన్నా లేచాడు.
ఆ రోజు లాస్య వస్తుందేమో.. ఒక్కసారి కలసి మాట్లాడాలని.. అతని భావన.. వాళ్ల పినతండ్రిగారింటికి వెళ్లడం అతనికి ఇష్టం లేదు.
లాస్య రాక కోసం రోజంతా త్రాగుతూ కూర్చున్నాడు. పిచ్చివాడిలా.. కాని ఆ రోజు లాస్య రాలేదు.
సాయంత్రం ఐదు గంటలదాకా లాస్య కోసం ఎదురు చూచి.. ఫోన్ చేశాడు.
లాస్య ఫోన్ రిసీవ్ చేసింది.
“హలో!..”
“హలో!..”
“అన్నా!..”
“తెలుసు..”
“కలవాలనుకుంటున్నాను..”
“కుదరదు..”
“ఏం?..”
“కుదరదన్నానా ?..”
“కారణం?..”
“నీవంటే నాకు ఇష్టం లేదు..”
“ఏమీటి?..” ఆశ్చర్యంతో అడిగాడు అన్నా..
“నీకు ఒకసారి చెబితే అర్ధం కాదా!.. ఐ హేట్ యు.. డోన్ట్ కాల్ అగైన్!..” ఎంతో ఆవేశంగా చెప్పింది లాస్య.
అన్నాకు విషయం.. పూర్తిగా అర్థం అయింది. లాస్య ఆ ఆఫ్రో-అమెరికన్ వలలో పడిపోయిందనుకున్నాడు.. రూమ్ ఖాళీ చేసి శాన్ ఫ్రాన్సిస్కోకు బయలుదేరాడు.
అంతకుముందు మిల్‌బ్రేమ్ వెళ్లి లాస్యను కలసి వచ్చాక.. అమ్మా నాన్నలతో లాస్యను గురించి ఎంతో ఆనందంగా.. గొప్పగా.. చెప్పేవాడు.. కానీ..
ఈసారి రావడంతోటే నేరుగా తన రూమ్లోకి వెళ్లి తలుపు బిగించుకున్నాడు.
ఎదురుచూస్తూ వుండి ధర్మతేజ.. మాధవీలు ఆందోళనతో తలుపు తట్టినా అన్నా తలుపు తెరవలేదు.
ప్రయత్నం ఫలించనందున ఆ భార్యాభర్తలు విచారంగా వారి గదికి వెళ్లిపోయారు.. పడుకొన్నారు.. అశాంతిగా..
ఏ మనిషినైనా ఎక్కువగా అభిమానిస్తే.. కాలగమనంలో పరిస్థితుల రీత్యా.. అతనిలో మార్పులు కలిగినపుడు.. అతని ప్రవర్తన రీత్యా ఎదుటివారు ఎంతగానో విచారపడతారు.. బాధపడతారు. ధర్మతేజ మాధవిల పరిస్థితి ప్రస్తుతం అంతే..
కొడుకు ప్రవర్తనలోని మార్పుకు ఆ దంపతులు ఆశ్చర్యపోయారు.. అతనిలోని ఈ మార్పుకు కారణం ఏమై వుంటుందని పరిపరి విధాల యోచించారు. కానీ వారికి సరైన సమాదానం దొరకలేదు. ఆ రాత్రంతా విచారంగా జాగరణ చేశారు.
మేడపై తన గదిలో వున్న అన్నాకు.. లాస్య.. తనతో చేసిన సంభాషణ.. అంతకుముందు ఆమె గదిలో చూచిన ఆఫ్రో-అమెరికన్.. ఆమె వాలకం.. వారిరువురి సంబంధాన్ని గురించి హోటల్ మేనేజరు విల్సన్ చెప్పిన మాటలు.. పదే పదే గుర్తుకు వచ్చి అతన్ని సతమతం చేశాయి. అశాంతితో కూడిన ఆలోచనలతో.. వేదనతో.. చాలా ప్రొద్దుపోయాక అలసి సొలసి నిద్రపోయాడు.
మరుదినం.. లేచి ఫ్రెష్ అయి ప్రశాంతంగా క్రిందకు వచ్చాడు. హాల్లో సోఫాలో కూర్చునివున్న తల్లిదండ్రులను చూచాడు. చిరునవ్వుతో వచ్చి ఇద్దరి మధ్యన కూర్చున్నాడు.
“అమ్మా.. నాన్నా..! మీరు నాకు చిన్నతనంలో ఎన్నోసార్లు చెప్పిన మాటలు ఇవి.. ‘మ్యాన్ ప్రపోజ్.. గాడ్ డిస్పోజ్..’. అమ్మా!.. ఆ మాట పరమ సత్యం. నేను.. మీరు లాస్యపై .. ఎంతో ప్రేమను.. అభిమానాన్ని పెంచుకొన్నాము. ఆమెను మన కుటుంబ సభ్యురాలుగా చేసుకోవాలని నిర్ణయించుకొన్నాము. కానీ గాడ్ డిస్పోజ్డ్.. మన భావనకు వ్యతిరేకంగా.. ఆమె మరొకరిని ప్రేమించింది. ఆ విషయం నాకు నిన్న తెలిసింది.. ఆశ్చర్యపోయాను. బాధపడ్డాను.. మాట్లాడాను.. ఆమె ఇచ్చిన సమాదానం.. నేను ఆమెకు తగనట..” చెప్పడం ఆపి.. తల్లి తండ్రుల ముఖాల్లోకి చూచాడు.
ధర్మతేజ.. మాధవీలు ఆశ్చర్యంతో అన్నా ముఖంలోకి చూచారు. వారి ముఖాల్లో ఆవేదన..
“అమ్మా.. నాన్నా.. నాకు ఇపుడు లాస్య అంటే ఇష్టం లేదు.. నన్ను కాదన్నదనే బాధ లేదు. జరిగిందంతా దైవ నిర్ణయం అని అనుకొన్నాను. ఆ గతాన్ని మరచి పోవాలని ప్రయత్నిస్తున్నాను..
దయచేసి.. అనవసరంగా అలోచించి మీరు బాధ పడకండి.. మన సంకల్పం.. ఆ దైవానికి ఇష్టం లేదు.. కొలాప్సయింది. జీవిత గమనంలో మిట్ట పల్లాలు.. చీకటి వెలుగులు.. సంకల్ప వికల్పాలు సహజమే కదా నాన్నా.. అమ్మా!.. అలాంటివాటిని మీరు మీ గత జీవితంలో ఎన్నో చూచివుంటారు.. మీ సహజీవనంతో మీ బిడ్డనైన నాకు మీ సహనం.. సమయస్ఫూర్తి.. సచ్చింతన.. అలవడ్డాయి..
అమ్మా.. నాన్నా .. వచ్చే సంవత్సరంలో.. మీరు ఆశించిన రీతిగా మీకు నచ్చిన అమ్మాయితో నా వివాహాన్ని జరిపించండి.. లాస్య కధను మర్చిపొండి.. బీ..చియర్‍ఫుల్.. అండ్ బీ హ్యాపీ..” అంటూ నవ్వుతూ లేచి తన గదికి వెళ్లిపోయాడు అన్నా..
ధర్మతేజ ఆవేశంగా.. “నేను భార్గవకు ఫోన్ చేస్తాను..మధూ !..” అన్నాడు.
“ఏమండీ!..”
“చెప్పు.. మధూ!..”
“ఫోన్ చేయకండి..”
“ఫోన్ చేసి జరిగిన విషయాన్ని భార్గవకు చెబుతాను.. మధూ!..”
“వారికి మనం చెప్పవలసిన అవసరం లేదు.. మనం అడపిల్లవాళ్లం కాదు.. పులిలాంటి మగ బిడ్డకు తల్లిదండ్రులం.. వాడు చెప్పినట్టుగా.. అ లాస్యను గురించిన ఆలోచనలను మన మస్తిష్కం నుంచి తొలగిద్దాం..” కాస్త ఆవేశంగానే చెప్పింది మాధవి..
కొన్ని క్షణాలు మాధవి ముఖంలోకి చూచిన ధర్మతేజా..
“సరే.. మధూ!.. నీ యిష్టమే నా యిష్టం..!” సాలోచనగా చెప్పాడు ధర్మతేజ.
అన్నా రెడీ అయి కిందికి దిగివచ్చాడు.
“అమ్మా!.. టిఫిన్!..” అన్నాడు.
“రా నాన్నా!.. లక్ష్మి అన్నింటినీ డైనింగ్ టేబుల్‌పై పెట్టింది.. ఏమండీ.. లేవండీ.. టిఫిన్ చేద్దురుగానీ!..”
“ఆ.. సరే.. పద..”
ముగ్గురూ డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు. లక్ష్మి ప్లేట్లు వారి ముందు వుంచి పెసరట్టు కొబ్బరి చెట్నీ, అల్లం పచ్చడి వడ్డించింది.
ముగ్గురూ టిఫిని తిని కాఫీలు త్రాగారు.. వారి వారి కార్లలో డ్యూటీలకి వెళ్లిపోయారు.
(ఇంకా ఉంది)