ఇది నిజంగా జరిగింది

11
4

[dropcap]స[/dropcap]మయం అర్ధరాత్రి దాటి ఉంటుంది. నగరానికి దూరంగా రిసార్ట్, దూరంగా ప్రశాంతంగా ప్రవహిస్తున్న కృష్ణా నది.

దట్టమైన వృక్ష సమూహం మధ్య కొన్ని ఎకరాల మేరా విశాలంగా పరచుకుని ఉన్న ఆ రిసార్ట్ ఇంచుమించు అడవిని తలపింపజేసే వాతావరణం మధ్యలో ఉంది.

ఆరు బయట కాంప్ ఫైర్ తాలూకు నెగడు చుట్టూ మేము పది మంది కూర్చొని ఉన్నాము. మేమంతా రచయితలం. అప్పుడే ఒక భయంకరమైన కథని చెప్పటం ముగించాడు జయరాం. భయంతో అందరికీ పైప్రాణాలు పైనే పోయాయి, ఆ కథని విన్నతర్వాత శ్రోతలందరికీ వెన్నులోంచి వణుకు పుడుతోంది. దానికి తోడు విపరీతమైన చలి.

జయరాం అద్భుతమైన కథకుడు అన్న విషయం తెలుసుకానీ అతనెన్నడూ స్పృశించని భయానక రసాన్ని కూడా అంత అద్భుతంగా ఆవిష్కరించగలడని అప్పుడే అర్థం అయింది.

కాంప్ ఫైర్ తాలూకు జ్వాలలు నాలుకలు సాచి గాల్లోకి ఎగురుతున్నాయి, ఆ జ్వాల తాలూకు కాంతి మా అందరి ముఖాలపై పడి మా మొహాలు వింతగా ప్రకాశిస్తున్నాయి. చితి చుట్టూ కూచున్న కాపాలికులలాగా ఉన్నాం మేమందరం అని తోచింది ఆ క్షణంలో నాకు.

ఇప్పుడు కథ చెప్పటం నా వంతు. మేము అప్పుడప్పుడూ ఇలా కలిసి ఏదో ఒక జానర్ ఎన్నుకొని అప్పటికప్పుడు కథ అల్లి ఒకరితో ఒకరు చెప్పుకోవటం పరిపాటి.

చివర్లో సీక్రెట్ బాలెట్ ఉపయోగించి, ఉత్తమ కథగా ఒకదానిని నిష్పక్షపాతంగా ఎన్నుకుంటాం కూడా ఆ రాత్రే. గెలుపొందిన ఆ రచయిత రిసార్ట్ తాలూకు బిల్లులో తనవంతు షేర్ కట్టనక్కరలేదు. ఇది ఒక సరదా బహుమతి.

మొత్తమ్మీద ఈ ప్రక్రియ వల్ల మాకు కాస్త ఆటవిడుపు, మెదడుకు ఒక ఛాలెంజ్. మేము ఇక్కడ పొందిన ప్రేరణతో ఆ తర్వాత వ్రాసిన కథలు పాఠకులకు కూడా చాలా నచ్చాయి. ఒక విధంగా ఇది మాకు రచయితల వర్క్‌షాప్ లాగా కూడా ఉపయోగపడుతోంది.

ఇన్ని కారణాల వల్ల మేము ఎవ్వరమూ ఈ కార్యక్రమానికి రాకుండా ఉండలేము.

ఈ వేళ్టి జానర్ ‘హారర్’. ప్రతి ఒక్కరూ ఒక హారర్ కథ సృష్టించి చెప్పాలి.

పత్రికా సంపాదకులు పెట్టే నిబంధన ఇక్కడ కూడా వర్తిస్తుంది. ‘ఈ కథ పూర్తిగా నా స్వంతం. ఇది మరే ఇతర రచనలకి అనువాదం కానీ అనుసరణ కానీ కాదు. ఈ రచనని స్వంతంగా ఈ సందర్భం కోసం మాత్రమే సృష్టించి చెబుతున్నాను’ ఇది ఒక అలిఖిత ఒప్పందం మా మధ్య. ఏతావాతా ప్రతి ఒక్కరూ పూర్తిగా స్వంత కథని మాత్రమే చెప్పాలి.

హారర్ రచనలకి సంబంధించినంతవరకు నా నైపుణ్యం అంతంత మాత్రమే. కానీ రోట్లో తలపెట్టాక రోకటిపోటుకు వెరవకూడదు కద. ఏదో ఒకటి చెప్పి తీరాలి.

గొంతు సవరించుకుని చెప్పబోయేటంతలో పెద్ద శబ్దం చేస్తూ దూరంగా ట్రాన్స్‌ఫార్మర్ పేలిన ధ్వని వినిపించింది. ఆ పై కొన్ని క్షణాలు నిశ్శబ్దం. తక్షణమే మా రిసార్ట్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దూరంగా ఉన్న కాటేజిలో లైట్లు ఆరిపోవటం కనిపించింది. దగ్గర్లో ఉన్న హై మాస్ట్ లాంప్ తాలూకు దీపం ఆరిపోవటంతో ఎటు చూసినా చిక్కటి చీకటి ఆవరించింది.

చీకటి సంద్రంలో వెలుగు దీవి అన్న విధంగా నెగడు చుట్టూ మాత్రమే కాస్త వెలుగు ఉంది ఇప్పుడు. చలి తీవ్రత పెరిగింది.

‘గూ..గూ..గూ’ అని గాలి వింత ధ్వనులు సృష్టిస్తోంది. చుట్టూతా ఉన్న వృక్షాలు జడలు విరబోసుకున్న దెయ్యాలలాగా కనిపిస్తున్నాయి.

“అబ్బ సంతోష్! నీవు చెప్పబోయే హారర్ కథకి మంచి నేపథ్యం కూడా కుదిరిందోయి” క్యాంప్ ఫైర్ తాలూకు నెగడుని కాస్తా ఎగదోస్తూ అన్నాడు రాం సరదాగా.

“నేను కథ చెప్పబోవటం లేదు” అన్నాను గంభీరంగా.

“మోసం. అందరూ తలా ఒక కథ చెప్పటం రివాజు. ఒకరు చెప్పిన కథని ఇంకొకరు మెరుగులు దిద్దుతాం కానీ, కాపీ కొట్టం. నీకా భయం అక్కరలేదు. నీవు చెప్పననటం తప్పు. చెప్పి తీరాల్సిందే. చెప్పకపోతే రిసార్ట్ తాలూకు బిల్లు మొత్తం నీవే కట్టాలి సుమా!” రాం తో పాటు అందరూ శృతి కలిపారు.

“నేను చెప్పననటం లేదు నాయనా. చెపుతాను. కాకపోతే కల్పిత కథ కాదు. నా జీవితంలో నిజంగా జరిగిన సంఘటన ఇది” అన్నాను నెమ్మదిగా.

“వావ్! ఇక ఆగకు. తప్పక చెప్పాల్సిందే” అందరూ తొందరించారు.

“కాకపోతే ఇది నాకు వచ్చిన కల. నిజంగా జరిగిన సంఘటన కాదు”

“ఏదో ఒకటి చెప్పవయ్యా స్వామీ! ఊరించి చంపుతున్నావు. ఇక్కడ కూడా నీ శైలీ, సస్పెన్స్ టెక్నిక్స్ వాడుతున్నావు” చనువుగా విసుక్కున్నాడు ప్రేమ్. అతను ఇటీవల అనేక పోటీలలో విధిగా బహుమతి అందుకుంటున్న రచయిత. చాలా చక్కటి రచయిత. అంతకంటే మంచి మిత్రుడు.

మేము గమనించలేదు కానీ ఆకాశంలో దట్టంగా మబ్బులు కమ్ముకున్నాయి. చంద్రుడు ఎప్పుడో మబ్బుల చాటుకు వెళ్లిపోయాడు. చల్లటి వాతావారణం కాస్త తీవ్రమైన చలితో పదునెక్కింది. చలి పులి చంపేస్తోంది.

నేను చెప్పటం ప్రారంభించాను.

ఒక్కో వాక్యం చెప్పేకొద్ది నాకు తెలియకుండానే నా ఒంట్లో కలుగుతున్న ప్రకంపనలు నేనే గమనించాను.

మరి అది సాధారణ సంఘటన కాదు కద. అది జరిగి దాదాపు పాతిక సంవత్సరాలు జరిగినా నాకు ఇప్పుడే జరిగినట్టు ఒళ్ళు జలదరిస్తోంది.

కథ మొదలయ్యింది. అందరూ నిశ్శబ్దంగా వింటున్నారు. ఒక్కో వాక్యం వినేకొద్ది వాళ్ళ కళ్ళలో విస్మయం నాకు తెలుస్తోంది.

***

మృత్యువుని అంత దగ్గరగా చూడటంతో ఒళ్ళు గగుర్పొడిచింది.

అసలు మృత్యువుకి రూపం ఉండటం ఏమిటి?

‘నేను నీ మృత్యువుని. నీకు ఇన్నాళ్ళూ ఉత్తిగా మౌనంగా కనిపించి వెళ్లిపోయాను. ఈ రోజు చెబుతున్నాను స్పష్టంగా! నీకింక కేవలం ఇరవై నాలుగు గంటలు మాత్రమే టైం ఉంది’ అని చెప్పి వెళ్లి పోయాడు. నేను అలానే చూస్తూ ఉండిపోయాను.

తను వెళుతూ వెళుతూ వెనక్కి కూడా తిరిగి చూశాడు ఒకట్రెండు మార్లు.

ఆ రూపం గుర్తు వచ్చిన ప్రతి సారి నాకు ప్రాణం పోయినట్టు అవుతోంది. అసలు అతను ఎలా ఉంటాడో చెప్తాను మీకు మొదట.

ఆరడుగుల పొడవు. తన రూపం మరీ సన్నం కాదు, లావు కాదు. నడి వయస్కుడు అని చెప్పవచ్చు. సూట్ ధరించి ఉన్నాడు. టై కూడా ఉంది. ఆ సూట్ రంగు మాత్రమే కాదు అతని శరీరం రంగు చాలా గమ్మత్తుగా ఉంది. మెటాలిక్ సిల్వర్ అని చెప్పి గన్ మెటల్ అనే మెటీరియల్‌తో నిలువెత్తు విగ్రహాలు కొందరు కళాత్మకంగా పెద్ద పెద్ద బంగళాలలో పెట్టుకుంటారు చూడండి. అలాంటి విగ్రహం ప్రాణం వచ్చి నడిచి వస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు అతను. అతని శరీరం రంగు, సూట్ రంగు, మొత్తం ఒకటేగా ఉంది.

ముఖ్యంగా అతనిలో నన్ను భయపెట్టిన ముఖ్యమైన అంశం ఏమిటంటే, అతను తన కనురెప్పలు కదల్చటం లేదు. రెప్పలార్చకుండా తదేకంగా నా కళ్లలోకి సూటిగా చూస్తూ మాట్లాడాడు.

అది కలా?

ఈ కల రావటం మొదటి సారి కాదు. గత వారం నుంచి ఉండుండి అతను కనిపిస్తున్నాడు నా కలలో. మృత్యువు కనిపించటమేమిటి అని ఆశ్చర్యపోతున్నారా? నేను మొదట అలాగే తేలికగా తీసిపారేశాను. అతడు మృత్యువు అని తెలియక.

కలలో కనిపించిన ఆ వ్యక్తి తనని తాను అలాగే పరిచయం చేసుకున్నాడు కూడా కద. ఇంతకూ అతను వ్యక్తా? అతన్ని ఏమనాలి? అతను ఇంతకూమనిషా, లేదా ఏదైనా దుష్ట శక్తా, మనిషైతేనే కద మనం అతన్ని వ్యక్తి అని అనగలం.

అతను గత వారం నుంచి నాకు ఏదో ఒక టైంలో కలలో కనిపిస్తున్నాడు. ఈ వారం రోజులు వచ్చిన కలలు ఒకెత్తు. ఈవేళ వచ్చిన కలొక్కటి ఒకెత్తు. ఈ వేల్టి కలలో మృత్యువు నాతో మొదటిసారి మాట్లాడాడు.

మెలకువ వచ్చి లేచి కూర్చున్నాను.

నిజంగా అది దేనికైనా సందేశమా? చుట్టూ చూశాను. గది అంతా నీలిరంగు బెడ్ లైట్ కాంతి పరచుకుని ఉంది. గోడ గడియారం తాలూకు సెకండ్ల ముల్లు మంద్రగా చేస్తున్న’టిక్.. టిక్’ మన్న ధ్వని మినహా గదంతా నిశ్శబ్దం.

వీధిలో ఉండుండి కుక్కలు ఏడుస్తున్నట్టు అరుస్తున్నాయి. అది దేనికి సంకేతం? కుక్కలు ఏడవకూడదు అని చిన్నప్పటి నుంచి విన్న పెద్దల మాటలు గుర్తు వచ్చాయి.

తలుపు తెరుచుకుని బాల్కనీలోకి వచ్చి వీధిలో ఉన్న కుక్కల్ని అదిలించాను..

మోర సాచి గాల్లోకి చూస్తూ చాలా నింపాదిగా ఏడుస్తున్నాయి కుక్కలు. అవి నా గది వంకే చూస్తున్నాయి.

అప్పుడు సమయం రాత్రి రెండు దాటి కొన్ని నిముషాలే అయింది. గదిలోకి వచ్చి ట్యూబ్ లైట్ ఆన్ చేశాను.

ఇందాకటి మృత్యువు మాట్లాడిన మాట్లాడిన మాటల్ని గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేశాను.

ఆ మాటల్లో ఏ భావోద్వేగం లేదు. భయపెట్టటానికో, లేదా బెదిరించటానికో చెప్పినట్టు లేదు. అలాగని శాంతంగా అనునయిస్తున్న విధానంలో కూడా కాదు. ఆ చెప్పిన పద్ధతి ఏదైతే ఉందో, అది నిర్లిప్తతకి దగ్గర దగ్గరగా ఉంది. అలా చెప్పటం తన బాధ్యత అన్నట్టు ఉందే తప్ప, ఆ మాటలు కలిగించే ప్రకంపనలు ఆ మాటలు కలిగించే ప్రభావంతో తనకు నిమిత్తం లేనట్టు, కేవలం ఆ మాటలు చెప్పేసి, నిర్లిప్తంగా వెళ్లిపోయాడు. రైల్వే స్టేషన్‌లో ఎంక్వైరీ కౌంటర్‌లో ఉద్యోగి ఎంత భావరహితంగా రైలు వచ్చే సమయం మనకి చెబుతాడో అంత భావరహితంగా అతను ఆ మాటలు చెప్పాడు.

అది అతని విధి నిర్వాహణలో భాగం అనుకుంటా.

వెళుతూ వెళుతూ వీధి చివరికెళ్ళేలోగా వెనక్కుతిరిగి చూసి “నేనే వచ్చి తీస్కువెళతాను” అన్నాడు.

ఆ మాటల్లో ఏదో భరోసా ధ్వనించింది. నేనే దగ్గరుండి తీస్కువెళతాను అన్నట్టు ధైర్యం చెప్పాడు.

***

లేచి బాత్ రూంకి వెళ్లివచ్చాను. కాళ్లు కడుక్కుని, వచ్చి అసంకల్పితంగా దేవుని గది వంక నడిచాను. నెమ్మదిగా దేవుని గది తలుపు తీసి లోనికి చూశాను. ఆ గదిలో నిత్యం వెలుగుతూ ఉండే విద్యుత్ దీపం వెలుగులో భగవాన్ వెంకయ్య స్వామి పటం వంక చూశాను. తంబుర మీటుతున్న గొలగమూడి వెంకయ్య స్వామి పటం నాకు ధైర్యాన్ని ఇచ్చింది. ఆయన వంకే తేరిపారా చూసి, కళ్ళు మూసుకుని మనసారా ప్రార్థించి మళ్లీ పడకగదికి వచ్చాను.

శ్రీమతి డెలివరీకై పుట్టింటికి వెళ్లి ఇంకా నెల కూడా కాలేదు. తను రావటానికి కనీసం అంటే ఇంకో ఆరు నెలలు పట్టవచ్చు. తను లేకుండా ఒంటరిగా ఉండటం ఇదే మొదటి సారి.

అందువల్ల ఒంటరితనం ఫీల్ అయి ఇలాటి కల వచ్చిందా? నాకేం అర్థం కావటం లేదు.

ఇందాకటి కలని మళ్లీ ఒకసారి గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేశాను.

***

ఆ కలలో నేను ఏదో గుర్తు తెలియని వీధిలో నడుస్తున్నాను.

అది ఏ వీధో కూడా నాకు తెలియదు. అలాంటి వీధిలో నేను ఎప్పుడు వెళ్లి ఉండలేదు. అంతా మామూలుగానే ఉంది. అటు ఇటూ ఇళ్లు. అక్కడక్కడా ఇళ్ళ ముందు ఆగిన కార్లు, మోటార్ సైకిళ్ళు.

మీకు మరింత బాగా అర్థం అయ్యేలాగా చెప్తాను. పూర్వం ఈ డిజిటల్ ప్రింట్స్ రాకముందు కెమెరాలలో రీల్ తీసి నెగెటివ్ ప్రింట్ తెచ్చుకునే వారం గుర్తుందా? నెగెటివ్ ఫిల్మ్ నుంచి ఆ తర్వాత పాజిటివ్ ప్రింట్ డెవలెప్ చేసి ఫోటోలు తెచ్చుకునేవారం, అది మీకు తెలిసే ఉంటుంది.

ఆ నెగెటివ్ ఫిల్మ్‌ని పట్టుకుని చూస్తే అందులోని ఆకారాలు ఒక విధమైన భీతి కలిగించేలా ఉంటాయి. అదిగో ఆ కలలో నాకు కనిపిస్తున్న వీధి అలాగుంది. నెగెటివ్ ఫిల్మ్ లోని చిత్రాలలాగా కనిపిస్తున్నాయి అందులోని ఇళ్లు, కార్లు, మోటారు సైకిళ్ళు అన్నీ.

అది రాత్రా పగలా, సాయంత్రమా, ఉదయమా తెలియటం లేదు. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఏ ఇంటి ముందు ముగ్గు కానీ, మంగళకరమైన ఏ అంశం కూడా కనిపించటం లేదు.

ఏదో నీరవ నిశీధిలాంటి ఇబ్బందికరమైన వాతావరణం.

వీధంతా నిశ్శబ్దంగా ఉంది. నిర్మానుష్యమైన ఆ వీధిలో విద్యుత్ దీపాలు కూడా వెలగటం లేదు. పల్చటి వెన్నెల పరచుకున్నట్టు తేలికపాటి వెలుతురు ఎటు చూసినా కనిపిస్తోంది. చిత్రంగా ఆ వెలుతురు ఆహ్లాదాన్ని కలిగించే బదులు ఒక విధమైన గగుర్పాటుని, ఒక విధమైన విషాదాన్ని సూచిస్తోంది.

అప్పుడు ప్రవేశించాడు అతను, ఒక మలుపులోంచి ఆ వీధిలోకి. నిర్మానుష్యమైన ఆ వీధిలో ఒక మానవమాత్రుడు కనపడటం ఆనందించదగ్గ విషయమే కద.

కానీ అతను దగ్గరపడే కొద్ది ఆనందం స్థానే విస్మయం, అదే స్థానంలో భయం కలిగాయి. అతని కళ్లు గాజు గోళాల్లా ఉన్నాయి. ఆ కళ్ళలో ఏదో తెలియని పైశాచికత్వం కనిపించింది నాకు.

అతని వస్త్ర ధారణ ఒక ఆంగ్లేయుడి వస్త్ర ధారణలా ఉంది. సూటూ- బూటూ, మెడలో టై, తలపై హేట్.

ఏ భావం పలకని భావరహితమైన అతనిమొహాన్ని చూస్తే మనకి కలిగే ఒకే ఒక భావం భయం. అతను ఎదురయ్యాడు చూపులో చూపు కలిపి, ఏం పలకరించకుండా నన్నే చూసుకుంటూ వెళ్లిపోయాడు.

ఒక పలకరింపు లేదు.

ఒక తల పంకింపు లేదు.

మనల్ని దాటి వెళ్ళేంతవరకు, క్రౌర్యం నిండిన కళ్ళతో సూటిగా కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటూ వెళ్లిపోయాడు.

ఒక వారం నుంచి ఇదే కల. అదే వీధి. అదే వ్యక్తి. అదే భావరహితమైన ప్రవర్తన.

ఇదిగో ఈ రాత్రి వచ్చిన కలలో మాత్రం అతను మొదటి సారి మాట్లాడాడు. అతను తన నిర్ణయాన్ని స్థిరంగా చెప్పేశాడు.

“నేను మృత్యువుని. ఇంక కేవలం ఇరవై నాలుగ్గంటలే” అతను ఆ మాట చెప్పాక కూడా కల కొనసాగింది. ఇలా కల కొనసాగటం ఈ వారంలో మొదటిసారి. ఇదివరకు కల వచ్చిన ప్రతి సారి, మెలకువ వచ్చేసేది, నాకు భయం కూడా కలిగేది కాదు. ఏదోలే పిచ్చి కల అని అనుకుని నీళ్లు త్రాగి పడుకునే వాడిని.

కానీ ఈ రాత్రి వచ్చిన కల చాలా సేపు కొనసాగింది. ఇదివరకు అతను వెళ్లిపోవడంతో కల ముగిసిపోయేది. ఈ రాత్రి మాత్రం అతను ఎదురుపడి వెళ్లిన తర్వాత కూడా కల కొనసాగింది..

ఆ కొనసాగిన కలలో ఆ నిశ్శబ్దమైన, వింత వీధి నుంచి మామూలు వీధులలోనికి వచ్చాను.

కలలోనే నా ఆఫీస్ కెళ్ళాను. నా రోజు వారి కార్యక్రమాలు చేసుకున్నాను. ఇంటికి వచ్చాను. ఇంట్లో భార్యా ఇతర కుటుంబ సభ్యులతో గడుపుతున్నాను. మోటార్ సైకిల్ నడుపుతున్నాను. అన్ని పనులు చేసుకుంటున్నాను. అందరితో మాట్లాడుతున్నాను.

మృత్యుభయం అనే భావన ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాను ఆ కలలో ఆద్యంతం.

ఎన్ని పనులు చేసుకుంటున్నా, ఎందరితో తిరుగుతున్నా సష్టంగా ఒక కౌంట్ డవున్ మొదలై పోయింది అనేది తెలుస్తూ ఉంది నాలో నాకు.

ఇక ఇరవై నాలుగు గంటలే.

ఇక ఇరవై మూడు గంటాలే

ఇక ఇరవై గంటలే

ఇక పదిహేను గంటలే

ఇక పది గంటలే

ఇక అయిదు గంటలే.

ఇక రెండు గంటలే

అలా సష్టంగా నాకు ఒక్కో గంట గడిచే కొద్ది మృత్యువు దగ్గరపడుతున్నట్టు తెలిసిపోతూ ఉంది ఆ కలలో.

మృత్యువు దగ్గరపడే కొద్ది కలిగే ఆ బాధ మాటల్లో చెప్పలేను.

నిజంగా మృత్యువు దగ్గరపడితే ఒక మనిషి ఎలా బాధపడతాడో అలా స్పష్టాతి స్పష్టంగా బాధపడ్డాను. అయిన వాళ్ళందరితో కలిసిమాట్లాడుతున్నాను కానీ వారికి విషయం చెప్పలేకపొతున్నాను. నాలో నేనే బాధపడుతున్నాను ఇకపై వీరందరికీ దూరం అవుతాను కద. నన్ను ఇక పై వీళ్లు చూడలేరు కద. అని అనిపించసాగింది.

ఇంట్లో ప్రతి వస్తువుని తడిమి చూస్తున్నాను. ఇంట్లో ప్రతి మూలకి నడిచి నడిచి తిరుగుతున్నాను. ఇకపై ఇవేవి నా స్వంతం కాదు కద అనే భావన నన్ను పిండేసింది.

మాటల్లో చెప్పలేని ఒక విషాద భావన నన్ను ఆవరించింది.

ఇంకా అరగంట మాత్రమే మిగిలి ఉంది. నా ప్రమేయం లేకుండానే కాసేపట్లో ఆ నెగెటివ్ ఫిల్మ్ లాంటి ఆ వింత వీధి నా చుట్టూ ఆవరించింది కలలో.

ఆ కలలోనే నేను తిరిగి ఆ నిర్మానుష్యమైన మసకవెలుతురు ఉండే ఆ వీధిలోకి నడుస్తున్నాను.

ఏదో నీరవ నిశీధిలాంటి ఇబ్బందికరమైన వాతావరణం.

వీధంతా నిశ్శబ్దంగా ఉంది. నిర్మానుష్యమైన ఆ వీధిలో విద్యుత్ దీపాలు కూడా వెలగటం లేదు. పల్చటి వెన్నెల పరచుకున్నట్టు తేలికపాటి వెలుతురు. అప్పుడు మళ్లీ ప్రవేశించాడు అతను, ఒక మలుపులోంచి ఆ వీధిలోకి.

అతనికి నాకు మధ్య దూరం క్రమంగా తగ్గిపోతూ ఉంది.

ఇక కేవలం కొన్ని అడుగుల దూరం మాత్రమే మిగిలి ఉంది.

ఇక కేవలం కొన్ని నిముషాల సమయం మాత్రమే మిగిలి ఉంది.

అతను నాకు క్రమక్రమంగా దగ్గరవుతున్నాడు.

సమయం క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంది.

కౌంట్ డవున్ సమయం జీరోకి దగ్గర వచ్చేస్తోంది.

అతనికి నాకు మధ్య ఇక ఏ మాత్రం దూరం లేదు.

అతను యథాప్రకారం తన క్రౌర్యం నిండిన కళ్లతో నా కళ్లలోకి సూటిగా చూస్తూ ఆహ్వానిస్తున్నట్టు దగ్గర దగ్గరకి వస్తున్నాడు. ఇన్ని మార్లు కలల్లో కనిపించినా నా పక్కనుంచి నడుచుకుంటూ వెళ్లిపోయేవాడు. కానీ ఈ మారు ఇదివరకట్లా అతను నన్ను దాటిపోయే ప్రయత్నం చేయటం లేదు. దిశని తిన్నగా నా వంకే మార్చుకుని నా వైపే ఒక్కో అడుగే వేస్తూ వస్తూ ఉన్నాడు. ఎటూ పారిపోలేని జింకకి ఎదురుగా వెళుతూ ఒక విధమైన నిశ్చింతతో నిబ్బరంగా నడిచే పులిలాంటి నడక అది. ఆ నడకలో నింపాదితనం. నిబ్బరం ఉన్నాయి.

ఇంకా చిత్రం ఏమిటంటే భావరహితమైన అతని మొహంలో ఈ సారి పల్చటి చిరునవ్వు కనిపిస్తోంది. శాడిస్టు మొహంపై కనిపించే లాంటి నవ్వు అది.

‘ఇంకేం తప్పించుకుంటావులే. నీ పని అయిపోయింది’ అనే అర్థం ఉంది ఆ నవ్వులో.

ఆ క్షణంలో నేను అనుభవించిన బాధని మాటల్లో వర్ణించలేను. మృత్యువు కి ఇప్పుడు కేవలం ఒకే ఒక అడుగు దూరంలో ఉన్నానిప్పుడు.

ఒళ్ళంతా చెమటలు పట్టాయి.

ఊపిరి ఆగిపోతున్నట్టు ఒక విధమైన సఫకేషన్.

ఏవో అదృశ్య శక్తులు నా గొంతు నులిమేస్తున్నట్టు ఊపిరి ఆడటం లేదు. శ్వాస పీల్చుకోవటానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాను. నోరంతా తెరిచి ‘ఆ.. ఆహ్.. ఆహ్’ అని గట్టిగా కేకలు వేస్తున్నాను. అరుస్తున్నానా? లేదు. నోరు తెరిచి గట్టిగా అరిచే ప్రయత్నం చేస్తున్నాను కానీ గొంతు పెగలటం లేదు.

అతను భావరహితంగా శాడిస్టిక్ చిరునవ్వుతో నా వంకే చూస్తూ మా మధ్యన ఉన్న ఆ చివరి అడుగు దూరాన్ని చెరిపేస్తూ నా వంక అడుగు వేశాడు.

అప్పుడు మెలకువ వచ్చింది.

నిజంగానే ఊపిరి సలపనట్టయిన ఆ గుంజులాటలో బెడ్ షీట్ ని రెండు పిడికిళ్ళతో గుంజేసినట్టున్నాను. పరుపు మొత్తం అస్తవ్యస్తంగా ఉంది.

వళ్ళంతా చెమటతో తడిసిపోయింది. మెలకువ వచ్చేటప్పటికి గదిలో కరెంటు కూడా లేదు. తీవ్రమైన చెమట కారణంగా నా దుస్తులు అన్నీ తడిసిపోయాయి.

నేను కళ్ళు తెరిచిన కాసేపటికి ఫాన్ తిరగటం, నీలిరంగు బెడ్ లైట్ వెలగటం జరిగాయి.

కలలో ఆ రోజంతా అయిన వాళ్ళ మధ్యన తిరుగుతున్నప్పటికీ మృత్యువు తాలూకు చివరి నిమిషాలు లెక్కించుకున్న కౌంట్ డవున్ తాలూకు భయం, ఆ నిర్మానుష్యమైన వీధిలో అతనికి ఒక్కో అడుగే దగ్గరవుతూ అనుభవించిన మృత్యు భయం ఇంకా నా స్మృతిపథంలో తాజాగా ఉంది.

***

నెగడు చుట్టూ కూర్చుని శ్రద్దగా కథ వింటున్న మిత్రులు నేను ఒక్కసారిగా కథ చెప్పటం ఆపేయటంతో “ఆపేశావేం? చెప్పు చెప్పు” అన్నట్టు నా వంక ఉత్కంఠగా చూస్తూ ఉన్నారు.

పక్కనే ఉన్న వాటర్ బాటిల్ అందుకుని నీళ్లు త్రాగి ఒక సారి అందరి వంకా చూశాను.

“కథ అయిపోయిందా ఏమిటి కొంపదీసి? అయినా ఇదేం ముగింపు?” తెల్ల మొహం వేశాడు రాం.

‘ఇష్!. ఉండు. వాడు నీళ్ళు త్రాగి చెబుతాడు’ ప్రేం అంటున్నాడు.

“ఇక్కడ మీ అందరికి గొలగమూడి వెంకయ్యస్వామి గూర్చి చెప్పాలి” నెమ్మదిగా అన్నాను.

“వ్వాట్! ఎవరాయన? ఆయనకి ఈ కథకి ఏమిటి సంబంధం?” ఒక్కసారిగా అందరూ అదే ప్రశ్నని అడిగారు.

“ఆయన ఒక అవధూత. దత్తాత్రేయస్వామి స్వరూపం. ఆయన భుక్తి, ముక్తి ప్రదాత. వాస్తవానికి నాకు ఈ కల వచ్చేనాటికి పదిహేను సంవత్సరాల క్రితమే ఆయన సమాధి చెందారు.

నెల్లూరు జిల్లా గొలగమూడిలో వారి సమాధి మందిరం, ఆశ్రమం ఉన్నాయి. నేను నిజానికి ఆయనని చూసింది లేదు. ఆయన సమాధి మందిరం కూడా దర్శించింది లేదు. మా అన్నయ్య బలవంతం మీద రక్షాదారం కుడి మణికట్టుకు కట్టుకుని ఉంటాను ఎల్ల వేళలా” అంటూ నా చేతికి ఉన్న గొలగమూడి వెంకయ్యస్వామి వారి రక్ష దారం వారందరికీ చూపించాను చేయెత్తి.

శ్రోతలకి ఏమి అర్థం కావటం లేదు. ఈ కథ ఎక్కడ మొదలయి ఎక్కడికి దారి తీస్తోందో వారికి తెలియడం లేదు.

నేను ఈ సారి కాస్త వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను.

“వాస్తవానికి శ్రీ శ్రీ శ్రీ గొలగమూడి వెంకయ్యస్వామి వారు సజీవంగా ఉన్నకాలంలో తన భక్తులని అనుగ్రహిస్తూ వారికి సిరాతో అద్దిన తన వేలిముద్రలు కాగితం మీద వేసి ఇచ్చేవారు, లేదా మామూలు నూలు దారాన్ని తాకి వారికి ఇచ్చేవారు. వారు సమాధి చెందిన అనంతరం కూడా అక్కడి ఆశ్రమనిర్వాహకులు దర్శనానికి వెళ్లిన భక్తులకి ఆ పవిత్ర సమాధిని తాకించి నూలు దారం ఇవ్వడం ఆచారంగా వస్తోంది.

సరే సమాధి మందిరం దర్శించిన భక్తుల చేతికి దారం అందడంలో విశేషం ఏమీ లేదు. ఇక్కడ మన కథలో ఇప్పుడేమి జరిగిందో చెబుతాను”

శ్రోతలందరూ నిశ్శబ్దంగా వింటుండి పోయారు.

“వాస్తవానికి నేను ఎప్పుడూ గొలగమూడికి వెళ్లి ఉండలేదు. మా అన్నయ్య వెంకయ్యస్వామి గారి భక్తులు. ఆయన బలవంతం వల్ల ఆ దారం నా కుడి చేతి మణికట్టుకు కట్టుకుంటూ ఉండేవాడిని.

ఏ మాటకామాటే చెప్పుకోవాలి. ఆ దారం కట్టుకుంది లగాయతు నా జీవితంలో చాలా మంచి మార్పులు జరిగాయి. ఉద్యోగం స్థిరపడటం, పదోన్నతి రావటం వంటి సాధారణ విషయాలే కాక అద్భుతం అని చెప్పుకోదగ్గ అనేక మంచి పరిణామాలు జరిగాయి.

ఇప్పుడు నేను చెప్పబోయే విషయం కూడా ఇంచుమించు అలాంటిదే.

అద్భుతం అనేది జరిగే వరకు గుర్తించలేం, అది జరిగాక ఇది అద్భుతం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అని అంటుంటారు కద.

ఆ కల వచ్చిన రాత్రి ఇక నేను ఇంచుమించు నిద్ర పోలేదు.

నాకు తెలియకుండానే నాలో బలంగా ముద్రించుకుని పోయింది. ఇక నాకు మిగిలిన జీవితం ఇరవై నాలుగు గంటలు మాత్రమే అని.

తెల్లవారింది.

ఆ రోజు మామూలుగానే విధి నిర్వాహణకి వెళ్ళాను, సహోద్యోగులని కలిశాను, క్లయింట్స్‌ని కలిశాను. టిఫిన్, లంచ్ గట్ర అన్నీ యధాప్రకారం చేస్తున్నాను.

పుట్టింటికి వెళ్లిన మా ఆవిడకి ఫోన్ చేసి మాట్లాడాను. కానీ మృత్యువు పరంగా నాలో కలుగుతున్న ఈ భావ సంచలనాన్ని తనతో పంచుకోలేదు. తనతో మాట్లాడుతున్నానే కానీ తీవ్రమైన వేదన. నేను వెళ్లిపోయాక తనకి ఎవరు ఇక దిక్కు అని. అన్యమనస్కుడిగా సంభాషణ ముగించి ఫోన్ పెట్టేశాను.

క్రితం రాత్రి కలలో ఎలాంటి భావ సంచనాలకి గురయ్యానో, మృత్యువు ఖాయం అని తెలిసిన వాడు ఎలాంటి భావనలతో గడుపుతాడో ఆ రోజంతా అలాంటి మానసిక స్థితిలో గడిపేశాను.

ఆ కలలోంచి మెలకువ వచ్చిన సమయాన్ని ప్రాతిపదికగా తీస్కుని, రాత్రి రెండు గంటలకి మృత్యువు ఖాయం అన్న ఆందోళనతో కాలం గడిపేశాను.

తమిళనాడులో ఉండేవాడిని ఆ రోజుల్లో.

ఆ రోజు సాయంత్రం నా ప్రమేయం లేకుండా నా కాళ్లు ఒక గుడికి లాక్కెళ్ళాయి, అది ఒక చిన్న శివుడి గుడి. కోయంబత్తూర్ లోని టవున్ హాల్ నుంచి ఒప్పణకార వీధికి దారి తీసే అత్యంత రద్దీగా ఉండే ఓ సందులో మోటార్ సైకిల్ ఆపి ఆ గుడికి వెళ్ళాను. అక్కడ అంతుతెలియని ప్రశాంతత అనుభవించాను. ఆ చిన్ని శివలింగంని చూడగానే. అక్కడి పూజారి విభూతి చేతిలో పెడుతూ, ‘దీర్ఘాయుష్మాన్ భవ’ అని ఆశీర్వదించారు.

నాలో నేను చిన్నగా నవ్వుకున్నాను.

ఆ రాత్రి భోంచేసి పడుకున్నాను. తప్పదు కద.

నేనూహించినట్టే మళ్లీ ఆ వింత వీధి నా కలలో వచ్చింది.

అదే మసక వెలుతురు. అదే స్మశాన నిశ్శబ్దం. అదే అమంగళకరమైన వాతావరణం. చిన్నగా హోరు గాలి మొదలయ్యింది. ఎండుటాకులు, చిత్తు కాగితాలు ఎగురుతూ ఉన్నాయి.

మెటాలిక్ సిల్వర్ రంగులో ఉన్న గన్ మెటల్తో చేయబడ్డ ఆకారం గల ఆ మృత్యుమూర్తికై ఎదురు చూస్తూ నిర్లిప్తంగా నడుస్తున్నాను నేను.

సరిగ్గా గత రాత్రి కలలో కనిపించిన విధంగానే, అతను హఠాత్తుగా ఒక చిన్నసైడ్ సందులోంచి ఈ వీధిలోకి అడుగు పెట్టాడు.

అతనికి నాకు మధ్య దూరం క్రమంగా తగ్గిపోతూ ఉంది.

నాకూ జీవితానికి మధ్య సమయం సన్నగిల్లిపోతు ఉన్న భావన.

అతను తిన్నగా నా ఎదురుగా వచ్చేశాడు.

ఇంకొక అర అడుగు దూరం మిగిలి ఉంది. అతనికి నాకు మధ్య.

ఇక నేను నిశ్చయించుకున్నాను నాకు మృత్యువు తప్పదని.

అప్పుడు జరిగింది ఆ సంఘటన.

ఎక్కడి నుంచొచ్చిందో మెరుపులా సన్నని వెండి తీగెలా, తటిల్లతలాగా ఒక తెల్లటి నూలు దారం అతనికి నాకు మధ్య వచ్చి గాల్లో నిలిచింది. క్షణంలో వెయ్యవ వంతులో అది నా మెడ చుట్టూ అల్లుకుంది.

అది నాకు మాత్రమే కనిపిస్తోంది.

ఈ లోగా వాడు వచ్చి నా చేయి పట్టుకోబోయాడు. వాడి చేయి నా చేతిని తాకకముందే ఇంకా పది అంగుళాలు దూరం ఉండగానే వాడు వేయి వోల్టుల కరెంట్ షాక్ కొట్టినట్టు కీచుమని అరిచి వెనక్కు నడిచాడు. అంతే కాదు క్షణాలలో బూడిదకుప్పగా మారిపోయాడు.

అంతే అప్పటిదాకా శ్మశానాన్ని పోలిన ఆ వీధి రూపు రేఖలే మారిపోయాయి.

ఇప్పుడు నేను ఒప్పణకార వీధిలోని శివాలయం గర్భగుడి ముందు ఉన్నాను.

అద్భుతమైన పరిమళాలు గాల్లో వ్యాపించి ఉన్నాయి.

చందనం, పసుపు, కుంకుమ, పత్రితో ఆ మృత్యుంజయుడిని పూజిస్తున్నారు పూజారులు. పూజ చేస్తున్న ఆ పూజార్లలో ఒక పూజారి నా వంక చూసి చిరు మందహాసం చేశాడు. ఆయన కళ్ళలో దయ ఉంది. ఆయన నవ్వులో చల్లదనం ఉంది. కర్పూర ధవళకాంతిలో ఆయన మేను మెరిసిపోతూ ఉంది.

ఆయన నవ్వులో కోటి చంద్రుల చల్లదనం, కోటానుకోట్ల మల్లెల తెల్లదనం కనిపించాయి. అలా భావించాను.

ఆ పూజారి మానవమాత్రుడిలా లేడు.

ఆయనే పరమశివుడిలా ఉన్నాడు.

పెద్ద కొప్పులాగా కట్టిన జుత్తు, తెల్లటి ఛాయ, ఆరడుగులకి పైగానే ఎత్తు, చెవులకి బంగారు కుండలాలు, మెడలో రుద్రాక్ష మాలలు, భుజాలకి, తలలో కొప్పుకి రుద్రాక్ష మాలలు. ఆయన ఆకారం ఇప్పటికీ నా కళ్ళముందు నిలిచి ఉంది.

ఓం రుద్రం పశుపతిం స్థాణుం నీలకంఠ ముమాపతిమ్

నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి॥

కాలకంఠం కాలమూర్తిం కాలాగ్నిం కాలనాశనం

నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి॥

వారు ఆ స్తోత్రం చెప్పినంత సేపు ఆ శివలింగాన్ని, ఆ పూజారిని చూస్తూ ఉండిపోయాను.

అన్నింటికన్నా చిత్రంగా చివర్లో ఏమి జరిగిందో నాకు ఇప్పటికీ గుర్తే.

చూస్తూ ఉండగానే నా కళ్ళ ముందే గర్భగుడిలోని ఆ చిన్ని నల్లరాతి శివలింగం మొత్తం కరిగిపోయి, బంగారు రంగు ద్రావణం లాగా రూపు దిద్దుకుని, చూస్తూ ఉండగానే మళ్లీ క్షణాలలో రెండు విడి విడి రాతి గుండ్లలాగా రూపాంతరం చెందాయి.

ఆ చిన్ని రాతి గుండ్ల చుట్టూతా బంగారు తొడుగు దర్శనం ఇచ్చింది.

అదేమిటి అన్నది నాకు ఆ క్షణంలో తెలియదు. ఆ తర్వాత అనేక సంవత్సరాల తర్వాత నేను గాణగాపురం అనే క్షేత్రంకి వెళ్లినప్పుడు అక్కడ గర్భగుడిలో చూసి నిర్ఘాంతపోయాను. ఆరోజు తమిళనాడులోని ఆ చిన్ని గుడిలో శివలింగం కరిగిపోయి బంగారు తొడుగుతో రెండు చిన్న చిన్న రాతి గుండ్లలాగా నాకు దర్శనం ఇచ్చిన ఆ మూర్తులు గాణగాపురంలో వెలిసిన దత్త పాదుకలు.

ఇవన్నీ ఒకెత్తైతే మహాశివుడిలాగా ఉన్న ఆ పూజారి నా ఎదుట నిలబడి తీర్థం ఇస్తూ, “ఓం నారాయణ ఆదినారాయణ” అని చెప్పి తిరిగి గర్భగుడిలోకి వెళ్లిపోయాడు.

***

ఆ రాత్రి మెలకువ వచ్చి చూశాను. గదంతా ఒక విధమైన పరిమళం. మాటల్లో చెప్పలేని అలౌకిక ప్రశాంతత. వెలుగుతోంది జీరోబల్బే కానీ ఆ వెలుగు చాలా ఆహ్లాదంగా ప్రశాంతంగా ధైర్యాన్నిచ్చేదిగా ఉంది.

ఇవన్నీ ఒకెత్తైతే ఇప్పుడు నేను చెప్పబోయేది ఒకెత్తు.

నా మెడలో చూసుకుంటే నూలు దారం. అది ఎలా వచ్చిందో నాకు అంతు చిక్కలేదు. వెండి తీగెలా, తటిల్లతలా, కోటి చంద్రుల చల్లదనాన్ని, కోటానుకోట్ల మల్లెల తెల్లదనాన్ని కలిగిన ఆ తెల్ల దారం నాకు అంతులేని ఆనందాన్ని ధైర్యాన్ని ఇచ్చింది.

ఈ “ఓం నారాయణ ఆది నారాయణ “ అనే ఈ వైష్ణవ మంత్రం ఒక శివాలయం పూజారి చెప్పటమే విచిత్రం అనుకుంటే, ఆ మహా మంత్రం గొలగమూడిలో వెలిసున్న భగవాన్ వెంకయ్య స్వామి వారు తన భక్తులందరికీ చెప్పి భజన చేయించేవారు.

ఇప్పటికీ గొలగమూడిలో ఈ మహామంత్రంతో నిరంతరం భజన జరుగుతూ ఉంటుంది.

కోయంబత్తూరుకి ఆరువందల కిలోమీటర్ల దూరంలో ఉన్న గొలగమూడి సమాధి మందిరం తాలూకు దారం నా కలలో వచ్చి, నిజంగా కూడా నా మెడలో అల్లుకుని ఉండటం ఏమిటి?

కోయంబత్తూరుకి ఎనిమిది వందలా యాభై కిలోమీటర్ల దూరంలో నేను ఎన్నడూ చూడని కర్ణాటకలో ఉన్న గాణగాపురంలో ఉన్న దత్త పాదుకలు నాకు ఆ స్వప్నంలో కనిపించటమేమిటి?

ఇవన్నీ నాకు ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నలు.

ఇది హారర్ కథ కాదు అనే పక్షంలో నాకు ఏమీ అభ్యంతరం లేదు. నాకు కలిగిన ఒక అనుభవాన్ని మీతో పంచుకున్నాను అన్న తృప్తి నాకు చాలు.

ఆ తర్వాత జీవితంలో నాకు ఎన్నడూ భయం అన్నది కలుగలేదు.”

***

చెప్పటం ముగించాను. అందరూ చప్పట్లు కొడుతూ ఉండిపోయారు.

ఆ రాత్రి రిసార్ట్ బిల్లులో నేను షేర్ చేయాల్సిన అమౌంట్ జీరో అని వచ్చింది. ఆశ్చర్యంగా చూశాను.

“అవును సంతోష్. నిస్సందేహంగా నీ కథకే మొదటి బహుమతి. కారణం తెలుసా? ఒక హారర్ కథ భయపెట్టాలి. నిజమే. కానీ అది ఎంత భయపెట్టింది అన్నది ఎంత ముఖ్యమో, ఎంత భరోసా ఇచ్చింది, ఏదైనా గమ్యం చూపించిందా అన్నది కూడా అంతే ముఖ్యం. మన జీవితాల్ని శాసించే ఏదో ఒక అద్బుత శక్తి ఉంది. ఆ పాజిటివ్ ఎనర్జీని మనం ఎంత ఆవహించుకుంటే మన జీవితాలు అంత భరోసాగా ఉంటాయి అన్న ధైర్యాన్ని ఇచ్చింది నీ కథ.” అందరి తరఫునా రాం చెప్పాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here