నియో రిచ్-34

0
3

[ప్రసిద్ధ రచయిత చావా శివకోటి గారి చివరి నవల ‘నియో రిచ్’‍ను ధారావాహికంగా అందిస్తున్నాము.]

[హోటల్‍లో కలిసిన సారంగపాణిని దొంగ వ్యాపారాలు మానేయమని హెచ్చరిస్తాడు జయంతి. అతని ఆలోచనలలో మార్పు మొదలవుతుంది. వ్యవస్థలో నల్లడబ్బు ఎలా స్వారీ చేస్తోందో తలంపుకొస్తుంది. శివరాం వచ్చి జయంతిని హైదరాబాదు తీసుకువెళ్తాడు. అక్కడ ఇమాం, నీలిమ జయంతిని కలిసి మాట్లాడుతారు. తిరిగి ఇంటికి చేరుతారు. శారద గురించి అడుగుతాడు. తమ ఇంట్లోనే ఉందని చెబుతుంది పార్వతి. కాఫీ త్రాగి శారదని పలకరిస్తాడు. ఇక తప్పు చేయను అని చెప్పాలనుకుంటాడు జయంతి. శారద కళ్ళు మూసుకునే ఉంటుంది. మర్నాడు తలారా స్నానం చేసి, పట్టు చీర కట్టుకుని గుడికి తీసుకువెళ్ళమని జయంతిని అడుగుతుంది శారద. గుడిలో పూజ చేయించాకా, కాసేపు జయంతితో తన తల్లి గురించి చెబుతుంది. అపస్మారకంలోకి వెడుతుంది. తమ ఇంటికి తీసుకువెడతాడు జయంతి. పూజ గదిలో కూర్చుంటాను అంటుంది శారద. అలాగే అని తాను వెళ్ళి నిద్రపోతాడు జయంతి. తెల్లారాక లేచి చూస్తే, శారద ఇంకా పూజగదిలోనే అమ్మవారికి సాష్టాంగంలో ఉండి ప్రణామం చేస్తున్నట్టుగా పడి ఉంటుంది. ఆమె ప్రాణం పోయిందని కాసేపటికి అర్థమవుతుంది జయంతికి. సృహ తప్పుతాడు. స్పృహ వచ్చాకా పార్వతి, శివరాం కనిపిస్తారు. శారద గురించి అడిగితే, ఆసుపత్రిలో ఉంది, తీసుకొద్దాం అంటాడు శివరాం. నాలుగు రోజులయ్యాకా, శారద ఇక లేదనీ, అంత్యక్రియలు కూడా అయిపోయాయని తెలుస్తుది. రోదిస్తాడు. క్రుంగిపోతాడు జయంతి. తనని కల్సిన హరేరామ్‌ని – చెడు మార్గాలు వదిలేయమని నచ్చజెబుతాడు జయంతి. లాయర్ ముకుందం వచ్చి పరామర్శిస్తాడు. రామలింగానికి పడ్డ శిక్ష సరైనదేనా అని అడుగుతాడు జయంతి. ఇక చదవండి.]

[dropcap]“అం[/dropcap]టే అది మీ వైపుననే ఉందన్న మాట” అని పెద్దగా నవ్వాడు మొహాన నరాలు తేలుతుండగాను.

ముకుందానికి నరక బాధ ఏంటో అర్థమైంది. “మళ్లా కలుస్తాను” అని లేచి వెళ్లాడు.

మళ్ళీ అటేపు తిరిగి చూడలేదు.

మర్నాడు సాయంత్రం అయిదింటికి మాత్రం పెంచలయ్యా, నళినీ రెడ్డి జయంతి దగ్గరకు వచ్చారు, పరామర్శించి వెళ్దామని.. అప్పుడే ‘శివరాం’ జయంతి దగ్గర కనిపించాడు. వచ్చి కూర్చున్నారు.

“స్కూటరు ప్రాజెక్టు ఎలా ఉంది?” అడిగాడు జయంతి.

“పర్వాలేదు” అంది నళిని.

“ఎన్ని కోట్లు వచ్చినయి బుకింగ్‌లో.. మీ షేరెంతో చెప్తారా?”

“నాకు లేదు.” అన్నాడు పెంచలయ్య.

“పైకం మాత్రం వస్తుంది గదా.”

“రాదు, finance ఉంటుంది.”

“కంపెనీయే నీది అయినప్పుడు, అదే financeలో ఉన్నప్పుడు నీకు safety గదా!” అన్నాడు జయంతి.

ఇక పెదవి విప్పలేదు పెంచలయ్య. చూస్తూ ఉండిపోయాడు. ఈ సంభాషణ కొనసాగడం మంచిది కాదు అనిపించింది. ఓ రకమైన ‘జంకు’ కల్గింది. జయంతి ఆగి నళిని రెడ్డి వైపు చూసాడు. నవ్వింది. నళిని మనస్ఫూర్తిగా నవ్వినప్పుడు స్వచ్ఛత కనిపిస్తుంది. ఆ నవ్వు ఎవరికైనా ఆహ్లాదాన్ని పంచుతుంది.

“మిమ్మల్ని సుమంగళిగా చూడాలని ఉంది” అన్నాడు జయంతి.

పెంచలయ్య ఉలిక్కిపడ్డాడు. ఆమె తల దించుకుంది.

“ఇక వస్తాము” అని లేచాడు పెంచలయ్య.

“ఎటు?” అడిగాడు జయంతి.

“నీకెలా ఉందో చెప్పు. ఆ ఆందోళన భరించలేక వచ్చాను.” అన్నాడు.

“మనస్సు బాగోలేదన్న మాట” అన్నాడు జయంతి – పెంచలయ్య లేస్తుంటే అతని కళ్ళలోకి చూసి.

“మంత్రిగారు అని పిలవనా?.. పెంచలయ్యా అంటే సరిపోతుందా?” అడిగాడు జయంతి.

“నీ యిష్టం” అన్నాడు నవ్వి.

“పెంచలయ్య మీరు ప్యాక్టరీ పెట్టరు, చావరు.. మరీ ఇంత public దోపిడి మంచిది కాదు. ఎవరి డబ్బు వారికి ఇచ్చేయండి. స్థిమితంగా ఉంటుంది.”

“అలాగే. ఆలోచిస్తాను.” అంటూ నడవబోయాడు పెంచలయ్య, మంచులో చెప్పులు లేకుండా నడిచినట్టు.

“నువ్విప్పుడు మంత్రివి. అంటే నీ ధ్యేయం జనం శ్రేయస్సు” అని నవ్వాడు జయంతి

 “Yes. Yes. చక్కగా చెప్పావు” అంటూ వెళ్లబోయాడు.

“ఒక్క నిముషం ఆగు వెళ్లుదువు గాని. మన రూపాయ విలువ పది పైసలకు దిగజారుతున్నది.. డీవాల్యూ అవుతున్నది. నిరోధించాలి..” అంటూ..

“ఇలాంటి నిలువ డబ్బుతోనే గదా! ఇదిగో, నేను రోజుకు ‘వెయ్యి’ తీసుకొని పని చేస్తాను. నా పరిధి అది. కూలికి రోజుకు ఏభై, గుమస్తాకి నూరు. బడిపంతులుకు నూటపాతిక. నాపై వాళ్ళకు వెయ్యి నుంచి, అయిదు వేలుదాకా. ఆపైన ఉన్నా అడ్డం ఉండదు. లెక్కకు ఇలా లెక్క తప్పిన డబ్బు. తిరిగి జనం లోకి రావడానికి చాలా తంతు కావాలి. నీకు తెల్సు. అయినా ఈ సమాజపు సమాధులపై మీకు మహళ్ళు కావాలి. వాటి కోసం జనాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. అది తప్పు. సమాధులలో మీరూ కూరుకుపోతారు. మహళ్ళు ఉండవు. అయినా ఈ సమాజం లేంది అసలేమి మిగిలి ఉంటుంది? ఏభై రూపాయలు తెచ్చుకునే వాడు తనూ పెళ్లామూ పని చేసినా పొరళ్లకు తిండివ్వలేని ఖరీదైన పరిస్థితిని తేవద్దు. నెలకు ‘నూరు’ రూపాయల జీతంతో తెల్లవాని పాలనలో నిశ్చింతంగా బ్రతికిన మనిషి. ఇవ్వాళ ముప్పై వందలతో బ్రతుకీడ్వడానికి క్రిందా మీద అవుతున్నాడు. ఎందుకు? అధికారం అలోచించ నీయడం లేదా? దాని పర్యవసాన భయంకర రూపం మీకెప్పుడైనా తలపుల్లోకి వచ్చిందా?” అన్నాడు జయంతి

ఇద్దరూ తెల్లబోయి అవాక్కయి చూస్తున్నారు.

“మీ తలపుల్లోకి రాకపోవడమే మంచిది. వస్తే ఇంకా భ్రష్టు పట్టేస్తారు. కోమాలోకి నెడతారు” అని time చూసుకొని “ఇక వెళ్లు. కార్యక్రమాలు ఉండే ఉంటయి. మంత్రవి గదా” అని నవ్వాడు. బ్రతుకు జీవుడా అని పట్టిన చెమటను తుడుచుకుంటూ కారెక్కారు. కారు చాలా వేగంగా కదిలి కనుమరుగయియంది.

విన్న జనం మాత్రం ‘అరే మంత్రితో ఇట్టా మాటాడవచ్చా, ఎంత సావాసగాడైతే మాత్రం’ అనుకున్నారు. కొందరేమో శారదమ్మ పోయిన షాక్‍లో మతి స్థితిమితం పోయినట్టుంది అనుకున్నారు. గానీ నిజంగా మనని వాళ్లు ఎటు నెడుతున్నారు? అని ఆలోచనలో పడ్డవారు లేరు. శివరాం మాత్రం ప్రేక్షకునిలా విన్నాడు. పెంచలయ్య వెళ్లిపోయాక వాలు కుర్చీలో కూర్చున్నాడు జయంతి.

“మంచి నీళ్లివ్వనా?” అడిగాడు శివరాం.

కళ్లు తెరచి శివరాంను చూసాడు.

“నీకు బాగా విశ్రాంతి కావాలి. ఇట్టా మాటాడడం బాగోలేదు.” అన్నాడు.

“శరీరం పోయాక అంతా విశ్రాంతే” అన్నాడు జయంతి నవ్వి.

“ఏమిటా మాటలు?” అన్నాడు శివరాం.

“ప్రేమించడం తప్పు కాదు. కానీ ప్రేమించబడడం చాలా అరుదైన విషయం.” అని క్షణం ఆగి “శివరాం, శారద నన్నిలా చేసి వెళ్లడం న్యాయమేనంటావా? మనం మనుషులం. సమగ్రత ఉండదు. మంచీ చెడు కలమెలిగి ఉంటుంది. పొరపాటును దిద్దుకునే అవకాశం ఇవ్వలి గదా! ఇంత శిక్ష వేయడం? నీకేమనిపిస్తున్నది!” అని ఉబికిన కన్నీటిని తుడుచుకున్నాడు. శివరాంకూ ఏడుపు వచ్చింది. ఆగలేదు. ఇద్దరూ మూమూలు స్థితికి రావడానికి టైం పట్టింది.

జయంతి చేతిని పట్టుకొని “లే ఇంటికెళ్దాం” అన్నాడు శివరాం.

“ఈ కొంపలో దీపం వెలిగించే వారు కరువయ్యారు గదా!” అన్నాడు లేస్తూ.

“అలా ఎందుకనుకోవాలి?”

“అవును. అనుకోవడమెందుకు, కనిపిస్తుంటే.” అని అదోలా నవ్వాడు.

తరువాత మాటాడకుండా ‘రా’ అన్నాడు శివరాం.

“నేను ఎక్కడికి రాను శివరాం.”

“నా మాట విని ఈ ఒక్కరోజూ నాతో రా. రేపటి నుంచి పార్వతి నేను నీతోనే ఉంటాం.”

“శారదతో మాటాడాలిరా! ఇక్కడికి వస్తుంది.”

“ఏమిట్రా ఇదీ!” అని దుఃఖాన్ని దిగమింగి. ఫోను దగ్గరకెళ్లి పార్వతికి ఫోను చేసాడు.

“నేను రావడం లేదు.” అని చెప్పి, లాన్‍లో కొచ్చి ఒంటరిగా కూర్చున్నాడు, జయంతిని వదిలేసి. జయంతి ఎప్పుడు ఎలా దగ్గరయ్యాడోగాని కుటుంబ సభ్యుడయ్యాడు. దాదాపు బరువంతా మోసాడు. ఒకసారి అదే జయంతిని తాను ‘పెళ్లి చేసుకోరాదూ?’ అనడిగాడు.

‘పెళ్లా’ అని నవ్వి నాకు జంఝాటం ఇష్టం లేదు అన్నాడు. అలాంటిది శారదను కోరి చేసుకున్నాడు. శారదే అంతా అన్నట్లు ప్రేమలో మునిగిపోయాడు. పాలూ తేనెలా కలిసి బ్రతికారు కొద్దికాలమైనా.

“అరె! శివరాం కూడా ఇక్కడే ఉన్నాడు.” అన్న మాటలు వినిపించడంతో ఆలోచనలకు స్వస్తి చెప్పి అటుగా చూసాడు.

Dr.హర్ష. సింహాద్రినాయుడు. శివాజీ లోనికి వస్తూ కనిపించారు. వచ్చారు గనుక కుర్చీలు చూపాడు.

కాఫీ తెమ్మని పనిమనిషికి చెప్పాడు.

కాఫీ త్రాగాక “జయంతి కనిపించడేం?” అన్నాడు శివాజీ.

“ఉన్నాడు.”

“నిద్రలో లేడు గదా? “

“లేడు.”

“అయితే పలకరించి వస్తాం” అంటూ లేచారు.

“ఏమని” అడిగాడు శివరాం.

“సానుభూతిగా.”

“ఎవరికి? “

“ఇంకెవరకి!”

“ఎందుకో?”

“శారద పోయిందిగదా!”

“అందుకేగా upset అయింది. మళ్లా గుర్తు చేయడమెందుకు? మంచిది కాదు గదా!”

 “స్నేహితులం గనుక.”

“అందుకే చెప్పింది” అన్నాడు శివరాం.

అయినా లేచారు. ముగ్గురూ గదిలోకి నడిచారు.

యోగిలా కళ్లు మూసుకొని కనిపించాడు జయంతి.

ఎదురుగా కుర్చీలు జరుపుకుని సఖాసీనులయ్యారు.

చప్పుడుకు కళ్లు తెరిచాడు జయంతి.

త్రిమూర్తులు కనిపించారు.

ఈ ముగ్గరినీ ఒకేసారి చూడడం జంయితికి మొదటిసారి.

‘ప్రళయం వచ్చే సూచనలేం లేవుగదా!’ అని అనుమానించాడు.

“పోయినవారు తిరిగి వస్తారా?” అన్నాడు నాయుడు.

“రారు. సృష్టికి విరుద్ధం. సైన్సూ ఒప్పుకోదు” అన్నడు హర్ష.

నవ్వొచ్చింది వాళ్ల మాటలకు.

“పోయిన వాళ్లు తిరిగి వస్తారనీ, నేను చూసాననీ నీతో అన్నానా నాయుడూ?” అడిగాడు జయంతి.

ఉలిక్కి పడ్డారు ముగ్గురూ.

‘చచ్చినా పులే’ అనుకున్నాడు శివాజీ.

“ఈ పాయింటును విప్పకుంటే పేచీ లేదు” అన్నాడు నాయుడు భయంగా చూసి.

“పేచీ దేనికి?” అడిగాడు హర్ష.

“ఇగో సతీసావిత్రి నాటకాన్ని నేను ఎన్నోసార్లు చూసాను. సత్యవంతుణ్ణి సావిత్రి బ్రతికించుకున్నట్టు దాఖలా ఉంది. అంటే తిరిగి రావడమే గాదా!” అని అడిగాడు..

“ఓరి నీ బండబడ. ఈడ పతివ్రతే పోయిందా గదా! తిరిగిరాలే” అన్నాడు నాయుడు.

“మీరు కొంచెం ఆగండి” అన్నడు హర్ష.

ఆగారు.

“బావున్నారా? ఇప్పుడు ఎలా ఉంది? తేలికగా ఉంటున్నదా?” అడిగాడు హర్ష.

“మీరు బావున్నారు గదా?” అని నవ్వి “ఎందుకొచ్చారు?” అడిగాడు.

“మిత్రుని బాధను పంచుకొందామనీ..”

“మీకు నాలా జరిగిందా?”

“ఛీ ఛీ అట్టాటిదేమీ లేదు” అన్నాడు సింహాద్రి నాయుడు.

అతని వైపే చూసి “అసలు మనం ఎందుకు పుడతామో, ఎందుకు చస్తామో ఎప్పుడైనా ఆలోచించారా?” అడిగాడు జయంతి.

“నువ్వు చెపితే గదా ఆలోచించేది!”

“అయితే చెప్పనా! ఈ దేశంలో పుట్టిన మనిషి బ్రతుకును బండలు చేసేందుకు..”

“అంటే” అన్నాడు శివాజీ.

“చెప్తా, నువ్వు విను శివాజీ. రూపాయకి బీడీకట్టలు ఎందుకు రావడం లేదో అర్ధరూపాయకు చుట్ట.. ఎందుకు రాదో కూలోనికి తెల్సు. మూడు రూపాయలకైనా కిలో బియ్యం ఎందుకు రాదో గుమస్తాకు తెలుసు. కానీ, నూరు రూపాయలు పెట్టినా ‘ఎరువుల’ బస్తా ఎందుకు రాదో రైతుకు తెలీదు. అన్నదాత అనీ, వెన్నెముక అనీ, జీవగర్ర అనీ ఉబ్బేసినారు గదా. రోజల్లా అడుక్కుంటూ గంజి మెతుకులకెందుకు సరిగ్గా సరిపోదో యాచకునికీ తెల్సు. వస్తువు ధర తెల్లోడు పోయాక ఇంతయి వటుడింతయి ముప్పై రెట్లు పెరుగుడం ఇక్కడి వ్యాపారికి తెల్సు. మధ్య తరగతి, దిగువ మధ్యతరగతుల జనానికి తెలీదు.

నేను నిరంతరం శ్రమించి ‘నూరు’ సంపాదిస్తే, కష్టపడక పదివేలు సంపాదించిన వారి ముందు శ్రమ భరితమైన రూపాయి పైసాకు దిగి ఎందుకు తెల్ల మొఖం వేస్తుందో జనానికి తెలియదు. డాక్టరుగారు, మనిషికి రోగం ఎందుకు వస్తుందో.. తెలీకున్న వచ్చిన రోగం నీకు అర్థమవుతది. ఫలానా మందుతో ఇది తగ్గుతుందని మందుల తయారీవాడు చెప్పుతాడు. కానీ రోగం వచ్చి బాధతో నీ దాపుకొచ్చాకా మనిషిని వ్యాపార వస్తువుని చేసి వాడుకోనడం నీకు తెల్సు.

పాపం రోగికి తెలీదు. వాడు వ్యాపార వస్తువైనట్లు. ‘స్టెత్’ వంటి మీద పెట్టినపుడు మొదయిన వ్యాపారం నీకు వ్రాసిన పరీక్షలలో ప్రిస్కిప్షన్‌లో, వాళ్లచే no.2 వార్డులో మనకు వారు కల్గించిన నమ్మకంతో చివరకు శవాల్ని కూడా ఎలా వ్యాపారం చేసుకొనాలో మీకు తెల్సు. మనిషి పుట్టుక మొదలు వేసే ప్రతి అడుగునా ఎంత మూలం చల్లిస్తున్నాడో గణాంకాలలోనికి ఎక్కించి విచిత్రానందం పొందడం తెల్సు.

దీన్ని ఎక్కడ ఆపాలో రెండు రూపాయల వైపు ఎట్లా మళ్లించాలో ఈ బ్యూరోక్రాట్లకు తెలుసు. కానీ కానీ ఛ” అని

“డాక్టర్, నా శారద చనిపోయింది. మనమూ పోతాం. పుట్టుక చావు అనివార్యం. దాన్నిలా వదిలెయి. జాతిని చంపకండి. ఈ జాతి చావకూడదు. సహజంగా నందనవనంలా ఉండాలి. అందుకు తోడ్పాటుగా స్పూర్తిని ఇవ్వండి. ఇకనైనా అక్రమార్జనను ఆపండి. మీరు ఎనలేని అయాచిత సేవ దేశానికి చేసినట్లు. ఇక మీరు వెళ్లొచ్చు” అని గది తలుపులు మూసేసుకున్నాడు.

ఒకరి మొఖాలు ఒకరు చూసుకుని వెనుతిరిగారు.

బయట శివరాం కనిపిస్తున్నా ‘వెళ్తున్నాం’ అని చెప్పలేదు.

వెళ్లిపోయారు.

శివారం వారిని గమనించనూ లేదు.

లేచి చూస్తే తలుపులు మూసి ఉన్నాయి.

నెమ్మదిగా తెరచి లోనకు చూసాడు.

“శివరాం నువ్వేనా?” అడిగాడు జయంతి.

“ఆఁ! “

“రా”

“అలాగే.”

“వచ్చి నా దగ్గర కూర్చో.”

కూర్చొని “ఏంటి చెప్పు” అనడిగాడు.

శివరాం గొంతు పూర్తిగా పూడిపోయి ఉన్నది.

“శివరాం” మళ్లా పిలుపు.

“ఆఁ! “

“ఎందుకురా బాదపడుతావూ? మనిషి బాధ ప్రపంచం బాధయితే అందులో భరించేందుకు మనం ఉన్నాం అనే భావన నాకుండేది. కానీ నా అన్నీ భావనలను తలక్రిందులగా చేస్తూ తనకు తాను చంపుకుంది. అసలు లంపటం అంతా ఎందుకు? అన్నది ఇప్పుడే కల్గుతున్నది. అర్థమూ అవుతుంది.

నిజాయితీ వెంటనే విశ్వాసం. ధైర్యం ఉంటయి. నిజాయితీకి భయం ఉండదు.

నిజంగా ఈ ఆలచనలతో నా తల పోటెక్కుతున్నది. తెచ్చి పెట్టుకున్నా అనిపిస్తున్నది” అని జుత్తులోనికి రెండు చేతులు వేళ్లను పొనిచ్చి దఫదఫాలుగా లాక్కున్నాడు.

“జయంతీ please control yourself” అని అక్కున చేర్చుకున్నాడు శివరాం.

శివరాం కన్నీరు జయంతి భుజాన్ని తడుపుతున్నది. గబుక్కున వెనక్కు జరిగి “ఏంట్రా! ఇదేం పని. నాకంటే ముందు నన్ను చూస్తూ పోయేట్లున్నావే? నేనొకవెళ పోయినా శారద ఆశయాన్ని నువ్వే గదా పూర్తి చేయాలి. నేనింకా పోనే లేదు. నేనేం చేయదలచానో నీకింకా చెప్పనూ లేదు. నాకు ధైర్యంగా నిలబడేవాడివి నువ్వే ఇలా అయితే ఎలా చెప్పు. నువ్వు వెళ్తే నాకు ఒంటరిగా ఉండాలనిపిస్తున్నది. శివరాం, నీకు నేనుగా పిలిచి అప్పగించాల్సినది చాలా ఉందయ్యా. నిన్ను పిలచిందాకా మాత్రం నన్ను వదిలెయ్యి. ఇదిగో ఇవ్వాళ్లే నా శారద పుట్టిన రోజు. రాత్రి గుర్తుకొచ్చింది. నేనుగా ఒక్క పుట్టినరోజు కూడా జరపలేదు. చనిపోయిన రోజును చేసే అదృష్టమే నాకు మిగిలింది. ఇంకో అదృష్టం ఏమిటో తెలుసా? శారద చనిపోయింది కూడా తెలీకపోవడం. చివరి చూపును చూసుకోలేకపోవడం” అని శివరాం ఒళ్లో తల పెట్టి ఏడ్చాడు పిచ్చిగా.

ఏడుస్తూనే మగతలోకి వెళ్లాడు.

జయంతిని నెమ్మదిగా ప్రక్క పైకి జరిపి తాను వాలు కుర్చీలో కూర్చుండిపోయాడు.

తెల్లవారింది. పార్వతి కాఫీ టిఫిను పట్టుకొని అక్కడికే వచ్చింది.

ఇద్దర్ని చూసింది. ఆవిడకు దుఃఖం ఆగింది కాదు. కడుపు చెరువయింది కూడా. కుప్పకూలిపోయిందిక్కడే.

“పార్వతీ పార్వతీ” అని ఒళ్లోకి తీసుకొని చల్లటి నీళ్లు ముఖాన చల్లాడు జయంతి. నెమ్మదిగా కళ్లు తెరచి లేచి జయంతి ఒళ్లంతా తడిమి చూసింది ఆప్యాయతగా. “అన్నయ్యా ఏమిటిది? నువ్విలా అయితే శారద వస్తుందా? ఒకరి అక్కర లేకుండా నువ్వు ధైర్యంగా ఉండాల్సిన వాడివి ఇలా?” అని చెప్పి,

“మన రవి రాత్రి నిద్రపోలేదయ్యా. అంకుల్ అక్కడంటే మనమిక్కడా అని ఒక్కటే గొడవ. ఇప్పుడూ రడీ అయ్యాడు. బతిమాలి మాయ చేసి కూర్చో బెట్టి వచ్చాను. అంకుల్‍ను నేను తీసుకొస్తాను అని. నీ వాలకం ఇలా ఉంది నిన్ను చూసి వాడెలాగవుతాడో.” అంది.

“ఏమండీ మీరు నిన్నటి నుంచీ ఇక్కడే ఉండి కూడా” అంది శివరాంని చూస్తూ..

సమాధానం ఇవ్వలేదు శివరాం. గోడకానుకొని కూర్చుని కళ్లు మూసుకునే ఉన్నాడు.

“మాటాడరేమిటి” అంది పార్వతి.

“ఏం మాటాడమంటావు? నేనేం చెయ్యను చెప్పు. వాణ్ణి ఓదార్చబోయి నేను ఏడుస్తున్నను. ఇక నా నుంచి ఏమీ కాదు. అశక్తుణ్ణి,” అని మొఖం ప్రక్కకు తిప్పుకున్నాడు వేదనగా.

“ఇదిగో మళ్లా మీరు..” అని మందలించి “ఇక రండి మన ఇంటికి వెళ్దాం” అంది. ఇద్దర్నీ లేపింది.

పార్వతిలో దృఢ నిశ్చయం కనిపించింది. అయినా జయంతిలో మార్పు కనిపించలేదు.

“ఏమండీ రవిని తీసుకుని రండి. ఇంటికి తాళం వెయ్యండి. మనం ఇక్కడనే ఉంటున్నాం” అన్నది.

శివరాం ‘అలానే’ అని లేచాడు. నడిచాడు. నడుస్తుండగానే “ఆగు శివరాం, నేను మీతోనే వస్తాను. అందరం అక్కడే ఉందాం.” అని లేవబోయి తూలాడు జయంతి.

పార్వతే పట్టుకొని ఆపింది.

జయంతి బయలుదేరాడు.

పార్వతికి అంత దుఃఖం లోనూ కొండత ధైర్యం. గబగబా ఎక్కడ వక్కడ సర్దింది ఇంట్లో.

కారును జయంతే డ్రైవ్ చేసాడు. శివరాం ఇంటి ముందాగింది.

కారు శబ్దం విని రవి పరుగెత్తుకొచ్చాడు. ముగ్గురూ కారు దిగాక ముఖం విప్పారింది. పరుగున జయంతి దగ్గరకొచ్చాడు.

“నేను శ్రీరామచంద్రుణ్ణి కాదు” అన్నాడు రవి తల నిమురుతూ జయంతి.

“రామచంద్రుడు ఎవరు అంకుల్” అడిగాడు రవి, గొంతు వణుకుతుండగా.. వాని కళ్లు నీళ్లు నిండాయి.

“అంకుల్” అంటూ వాటేసుకుని పెద్దగా ఏడ్చాడు.

“రవీ! రవీ! ఏంటిరా?” అంటూ, ఎత్తుకొని “నేను వచ్చిందే నీ కోసంరా” అన్నాడు జయంతి వాని కళ్లు తుడుస్తూ.

“సీతను ఎత్తుకెళ్ళాకా రాముడెలా ఉన్నాడో – ఆ పరిస్థితి నాది. నువ్వు హనుమంతునిలా ఆసరా అవుతావని వచ్చాను. సుగ్రీవునిలా ధైర్యం ఇస్తావనీ, తారలా మార్గం సుగమం చేస్తావనీ వచ్చాను” అన్నాడు దుఃఖాన్ని పూర్తిగా ఆపుకొని.

జయంతి రవిని ఎత్తుకొనే లోనకొచ్చాడు. పార్వతి శివరాం వారి వెనక నడిచారు.

నాలుగు నిముషాలలో మంచి కాఫీ అందించింది పార్వతి. త్రాగారు మౌనంగా. ఒకర్నొకరు చూసుకొనడానికి కూడా బెరుకు పడుతున్నారు. దుఃఖం ఎప్పుడు ఎలా ఉబుకుతుందో అర్ధం గాని స్థితి. జ్ఞాపకాల దొంతర ఎలా కుదుపుతుందో.

మధ్యాహ్నానికి కొంచెం స్వస్థత ఏర్పడింది. సాయంత్రం అయిదు గంటలకు అవధాని వచ్చాడు.

పరామర్శ తరువాత ‘నా పైకం’ అనడిగాడు.

“ప్రభుత్వానికి అప్పగించాను”

“బంగారం”

“హుండీ. కోనేటి రాయుడికి.”

ఒక్క నిముషం పిచ్చోణ్ణి చూసినట్టు చూసాడు జయంతిని.

ఆనక విరుచుకుని పడిపోయాడు.

అవధానిని నర్సింగ్ హోంకు చేర్చాడు శివరాం. డాక్టరు రాకముందే శ్వాస ఆగిపోయింది హంస వెళ్లిపోయింది. కారులో తీసుకొచ్చి అవధాని వాళ్ల ఇంట అప్పగించారు. రిపోర్టులో ‘గుండె ఆగడాన చావు కల్గినట్లు’ ఉంది. ‘గుండె ఆగుకుండా కూడా చస్తారా?’ అనిపించి నవ్వొచ్చింది.

ఎందుకు చచ్చాడని మాత్రం ఎవ్వరూ అడగలేదు.

చచ్చాడంటే- చచ్చాడు అన్నారు అనాసక్తంగా.

అవధాని బంధువులు మాత్రం – ఉన్న ఇంటిని తవ్వారు. డబ్బు ఎక్కడైనా దాచాడేమోనని.

ఒకడికి దొరికిందని అనుమానమొచ్చి వాణ్ణి అందరూ కలసి చావ చితకబాదారు ఆనక.

డబ్బు ఎక్కడ దాచాడో అర్థం గాక, శవాన్ని అట్టాగే వదలి నానా కంగాళీ మాటలంటూ.. ఎవరి దోవన వారు వెళ్ళిపోయరు. కూలికి బ్రాహ్మణులను పిలిపించి క్రతువు ముగించాల్సి వచ్చింది.

కూలిపోయే దశ దాకా త్రవ్విన ఆ ఇంటిని బాగు చేయించాలంటే అందులో కొంత మళ్లా అమ్మాల్సి వచ్చింది.

***

కాలగమనంలో.. జయంతిలో.. రానురాను కొంచెం కొంచెం.. మార్పు ప్రారంభమైంది.

అయితే మౌనంగా గడపడానికి అలవాటు పడుతున్నాడు.

పార్వతికి జయంతితో మాటడే అవకాశం అరుదుగా దొరుకుతున్నది.

అంతా రవే.

“శ్రీరాముని చూసిన వారెవరైనా ఉన్నారా డాడీ?” అని అడిగాడొకనాడు.

“ఆఁ!”

“ఎవరు? “

“వాల్మీకి.”

“ఇంకా?”

“శ్రీరాముడు రాజు. అంటే అప్పటి జనమంతా చూసే ఉంటారు.”

“రామరాజ్యం అని గాంధీగారు కూడా అన్నారు. రామరాజ్యం అంటే?”

“జయంతి అంకుల్ ఉన్నాడు గదా అడుగు, చెపుతాడు” అన్నాడు శివరాం.

తల ఊపి “అంకుల్” అంటూ మేడెక్కాడు.

“రా! రా! “

“వస్తున్నా.”

“రవి అంటే ఏమిటి తెలుసా?” అడిగాడు జయంతి

‘ఇదేదో ఎదురు వస్తున్నాడు’ అనుకొని సీరియ‍స్‌‍గా చూసాడు రవి.

“నువ్వు ఎప్పుడూ స్మరించే శ్రీరాముడు ఆ సూర్యవంశంవాడు. రవి అంటే సూర్యుడు. సూర్యుడు చరాచర వర్తనానికి ఎంతో, శ్రీరాముడు అంతే. రామరాజ్యం ఇప్పటిది కాదు, త్రేతాయుగం నాటిది. రామ పాదుకలతో ఈ భూమిన భరతుడు రాజ్యం చేసాడు. రామరాజ్యాన మా రాముడున్నాడు అన్న ధైర్యం సర్వే సర్వత్రా ఉంది. అదే వారికి శ్రీరామ రక్షయింది. సర్వజనులకూ సుఖసంతోషానిచ్చిన రాజ్యమే రామరాజ్యం” చెప్పాడు జయంతి.

“అంకుల్” అన్నాడు రవి జయంత్‍ను తదేకంగా చూస్తూ.

“అడుగు.”

“ఏం లేదు.”

“అనుమానాన్ని దాచుకోవద్దు.”

“నాకు రాముడ్ని చూడాలని ఉంది” అన్నాడు రవి.

రవిని దగ్గర తీసుకొని ఎత్తుకొని ముద్దు పెట్టి.. “రామచంద్ర ప్రభువును చూస్తావా?” అన్నాడు.

“ఎలా? ఎక్కడ?”

“చూడవచ్చు.” అని చెబుతూ..

“ఆయన పైన ఊహించుకోని ధ్యానముద్రకెళ్లు. కనిపిస్తాడు. ధ్యానంలో అయితే నీతోనే ఉంటాడు. మనకున్న నమ్మకంలోనూ చూడొచ్చు. తప్పక కనిపిస్తాడు.” అన్నాడు జయంతి.

(అయిపోయింది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here