[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
పగటి కలలు:
[dropcap]ని[/dropcap]జామ్, అతని సలహాదారులు కంటున్న స్వాతంత్రానికి సంబంధించిన పగటి కలలకు ఏ మాత్రం ఆధారం లేదు. చరిత్రలో ఏ సమయంలో కూడా హైదరాబాద్ స్వతంత్రం అనుభవించలేదు.
క్రీ.శ.1707లో శక్తిమంతుడయిన చివరి మొఘల్ రాజు ఔరంగజేబు మరణించాడు. బయటి ప్రపంచానికి మొఘల్ సామ్రాజ్యం శక్తివంతమైన రాజ్యంగా కనిపించినా, ఔరంగజేబు మరణం నాటికి మొఘల్ సామ్రాజ్య పతనం ఆరంభమయింది. నిజానికి, శివాజీ మహారాజ్ కొట్టిన దెబ్బ నుంచి మొఘలులు తేరుకోలేదు.
1713లో, ఢిల్లీ లోని తురానియన్ పార్టీ నాయకుడు అసఫ్ జాహ్‌గా ప్రసిద్ధి పొందిన చిన్ ఖిలిచ్ ఖాన్‍ను దక్కను ప్రాంతానికి సుబేదారుగా నియమించారు. అతనికి ‘నిజామ్-ఉల్-ముల్క్’ అన్న బిరుదును ప్రసాదించారు. ‘నిజామ్-ఉల్-ముల్క్’ అంటే ‘రాజ్య పాలకుడు’ లేక ‘రాజ్యాన్ని నియంత్రించే వాడు’ అని అర్థం. ఉత్తరాన మాల్వా నుంచి, దక్షిణాన తిరుచిరాపల్లి వరకూ ఉన్న దక్కను ప్రాంతానికి ఈ పదవి అత్యంత ప్రాధాన్యం వహిస్తుంది.
కొంతకాలానికి ఢిల్లీలో శక్తివంతమైన సయ్యద్ సోదరులు తెరపైనుంచి నిష్క్రమించారు. ఢిల్లీ మంత్రి పదవిని స్వీకరించమని అసఫ్ జాహ్‍కు ఆహ్వానమందింది. కానీ అసఫ్ జాహ్ తెలివైన వాడు. ఢిల్లీ పదవిని తిరస్కరించి దక్కను చేరుకున్నాడు.
దక్కనులో తన ఆధిక్యాన్ని స్థిరపరుచుకోవటం మొదటి నిజామ్‍కు అంత సులభంగా వీలవలేదు. 1727 నుండి ఓ వైపు నుంచి పీష్వా బాజీరావ్ విశ్వనాథ్, తన సైనిక శక్తితో పలు ప్రాంతాలను ఆక్రమించుకున్నాడు. మరో వైపు బ్రిటీషు వారు, ఫ్రెంచి వారు తమ తమ వ్యాపార కేంద్రాలను బలపర్చుకోవటం కోసం సైన్య సమీకరణ చేస్తు శక్తిమంతులవుతున్నారు. మొఘల్ సామ్రాజ్య రాజకీయ శక్తి ‘పైన పటారం లోన లొటారం’ లాంటిది. శక్తి విహీనం. ఇది గ్రహించిన పలువురు మొఘలు ప్రతినిధులు, స్వతంత్ర రాజ్యాలు ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. అసఫ్ జాహ్ కూడ ఇతరులలా అవకాశాన్ని వినియోగించుకున్నాడు. అయితే, ఆయన ఎన్నడూ మొఘలుల ఆధిపత్యాన్ని ధిక్కరించలేదు. మొఘలులకు విధేయుడిగానే ఉంటూ, ఏదో ఓ నెపం మీద ఢిల్లీకి కప్పం కట్టడం మానేశాడు.
1748లో అసఫ్ జాహ్ మరణించాడు.అతని ఇద్దరి కొడుకుల నడుమ అధికారం కోసం పోరాటం సాగింది. ఈ పోరులో అధికారాన్ని పెంచుకునే అవకాశాన్ని చూసిన ఫ్రెంచ్ వీరుడు డుప్లెక్స్, అధికారం కోసం పోరాడుతున్న సోదరులలో ఒకడైన ‘సలాబత్ జాహ్’కు సమర్థననందించాడు. మరాఠాల నుంచి సలాబత్ ను రక్షించేందుకు జనరల్ బుస్సీని హైదరాబాదులో ఉంచాడు. ఈ సహాయానికి ప్రతిగా ఫ్రెంచి వారికి ఉత్తర సర్కారు జిల్లాలుగా పేరుపొందిన నాలుగు జిల్లాలను ఇచ్చాడు సలాబత్. సరిగ్గా రెండు వందల ఏళ్ళ తరువాత ఈ నాలుగు జిల్లాలు హైదరాబాదుకు చెందినవి అని, వీటిని తిరిగి సంపాదించేందుకు ప్రయత్నించాడు రిజ్వీ.
హైదరాబాదులో నిజామ్ పరిస్థితి ప్రమాదకరంగానే ఉండేది. అప్పుడప్పుడూ ప్రాణాలు అరచేత పట్టుకుని యూరోపియన్ల ఆశ్రయం పొందాల్సి వచ్చేది. కానీ లెక్క ప్రకారం ఆయన మొఘలుల సుబేదార్. మొఘలుల రాజ్య ప్రతినిధి. కాబట్టి, దక్కనులో అతని మాటనే చెల్లేది. అక్రమంగా సంపాదించిన ధనాన్ని పెట్టుబడులు పెట్టి సక్రమంగా మార్చుకునే అనుమతిని అధికారికంగా ఇవ్వగలిగేది నిజామ్ ఒక్కడే!
1763లో ఫ్రాన్స్, ఇంగ్లాండ్‍ల నడుమ జరిగిన పారిస్ ఒప్పందం ఫలితంగా తమ మధ్య యుద్ధం సమసిపోవటంతో, వీరిద్దరు ‘సలాబత్ జాహ్’ను న్యాయబద్ధమైన సుబేదార్‍గా, దక్కను అధికారిగా గుర్తించారు. ఇద్దరూ అతడిపై సమాన స్థాయిలో అధికారం చలాయించాలని ఒప్పందాలు చేసుకున్నారు. పైకి స్నేహం నటించినా, ఇంగ్లాండ్ వారు, ఫ్రెంచి వారు ఒకరినొకరు దెబ్బ తీసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు.
1766లో సలాబత్ జాహ్ సోదరుడు నిజామ్ అలీఖాన్ బ్రిటీషు వారి ఈస్ట్ ఇండియా కంపెనీతో స్నేహం చేశాడు. మరాఠాల నుండి, హైదర్ అలీ నుండి రక్షణ ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నాడు. కానీ నిజామ్ అలీఖాన్ తాను చేసిన ఒప్పందాన్ని ఖాతరు చేయలేదు. హైదర్ అలీతో కలిసి బ్రిటీష్ వారిపై దాడి చేశాడు. దెబ్బ తిన్నాడు. 1768లో మచిలీపట్నం ఒప్పందం ప్రకారం బ్రిటీష్ వారు నిజామ్‍కు రక్షణ కల్పించటమే కాదు, హైదరాబాదులో తమ ప్రతినిధిని ‘రెసిడెంట్’ను ఉంచటం ఆరంభించారు.
అయితే నిజామ్ తన కుట్రలను ఆపలేదు. బ్రిటీష్ వారికి తెలియకుండా, వారిని తరిమివేసేట్టు మరాఠాలతో ఒప్పందం చేసుకున్నాడు. పథకం విఫలమయింది. బ్రిటీష్ వారు నిజామ్ రాజసభలో బ్రిటీష్ సైన్య ప్రతినిధిని ఉంచటమే కాదు, దక్కనుపై తమ పట్టును బిగించటం ప్రారంభించారు. నిజామ్‍ను నిస్సహాయుడిని చేసి తమ గుప్పిట్లో పెట్టుకున్నారు.
భారత్‍పై బ్రిటీషు ఆధిక్యాన్ని సాధించటం ఆరంభించిన వారెన్ హేస్టింగ్స్ నుంచి బ్రిటీష్ ఆధిక్యాన్ని స్థిరపరిచిన వెల్లస్లీ కాలం వరకూ నిజామ్ పరిస్థితి దుర్భరంగా ఉండేది. 1784లో వారెన్ హేస్టింగ్స్ భారత్ వదిలి వెళ్తూ, భవిష్యత్తులో నిజామ్, మరాఠాలకు ఉపగ్రహంగానో, ఈస్ట్ ఇండియా కంపెనీకి విధేయుడి గానో మిగులుతాడని ఊహించాడు. నిజామ్ పరిస్థితిని ఈ రకంగా వివరించాడు.
“నిజామ్ రాజ్యాలు చిన్నవి, వాటి నుంచి వచ్చే ఆదాయం కూడా తక్కువే. సైనిక శక్తి కూడా అంతంత మాత్రమే. తన జీవిత కాలంలో వీరోచిత ప్రవర్తన కానీ, పాలకుడిగా తెలివిని కానీ నిజామ్ ప్రదర్శించలేదు. ఇందుకు భిన్నంగా తన చుట్టూ ఉన్న వారి నడుమ విభేదాలు సృష్టించటం, కుట్రలు చేయటం, ఎదుటివారి బలహీనతల నుండి లాభం పొందడం అతని పద్ధతి. అయితే, ఈ కుట్రలు, కుతంత్రాలలో తన చేతికి తడి అంటకుండా జాగ్రత్త పడతాడు. అవసరమైతే ఎలాంటి అవమానకరమైన షరతులకయినా ఒప్పుకుంటాడు కానీ తన గౌరవన్ని నిలుపుకునేందుకు యుద్ధానికి మాత్రం సిద్ధం కాడు.” [Edward Thompson, Making of the Indian Princes, P.1]
1798 కల్లా భారతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ శక్తివంతమైన సైనికశక్తిగా అవతరించింది. హైదరాబాదులో ఉన్న ఫ్రెంచి సైన్యాన్ని తరిమివేసి, బదులుగా మరింత ఎక్కువ సంఖ్యలో బ్రిటీష్ వారి సైన్యం హైదరాబాదులో ఉండేట్టు నిజామ్‍ను ఒప్పించాడు వెల్లస్లీ. ఇందుకు ప్రతిగా, నిజామ్ రాజ్యంలోని కొన్ని ప్రాంతాలను బ్రిటీష్ వారి పరం చేయాల్సి వచ్చింది.
ఇదే సంవత్సరంలో హైదర్ అలీ కొడుకు టిప్పు సుల్తాన్‍ను దెబ్బ తీశారు బ్రిటీష్ వారు. టిప్పు సుల్తాన్ రాజ్యాన్ని ముక్కలు చేసి, కొంత భాగాన్ని నిజామ్ ప్రదర్శించిన విధేయతకు బహుమతిగా అందజేశారు. నిజానికి నిజామ్‍కు ఇచ్చిన బహుమతి విధేయతకు అనేకన్నా, అలవాటయిన రీతిలో సమయం చూసి శత్రువుకు సహాయం చేయనందుకు అనుకోవచ్చు.
దేశంలో అత్యంత శక్తివంతమైన సైనిక శక్తిగా ఈస్టిండియా కంపెనీ ఎదగటంతో, దేశంలోని పలు రాజ్యాలకు రక్షకుడిగా, ఆయా రాజ్యాల పరోక్ష పాలకుడిగా ఎదిగింది ఈస్ట్ ఇండియా కంపెనీ. 1789లో, అప్పటి గవర్నర్ జనరల్, వెల్లస్లీ నిజామ్‍కు రాసిన ఒక లేఖలో, ఓ పెద్దమనిషికి పెన్షన్ రద్దు చేయమన్న బ్రిటీష్ సూచనను పాటించనందుకు నిజామ్ ప్రవర్తన కంపెనీని అవమానపరిచినట్లుందని, కంపెనీ వల్ల ఆయన పొందిన లాభాలన్నీ గుర్తు తెచ్చుకోమని రాశాడు. నిజామ్‍కు ఏ మాత్రం కష్టం, ధనవ్యయం లేకుండా అతని శత్రువుల బెడదను బ్రిటీష్ వారు తొలగించారనీ, అందువల్ల పతనానికి చేరువై, అందరి హేళనకు గురయ్యే స్థితిలో వుండే నిజామ్, శక్తిని పుంజుకుని, ఈనాడు ఇతర రాజుల నడుమ గౌరవాన్ని పొందే స్థాయికి ఎదిగేడని వెల్లస్లీ నిజామ్‍కు ఆ లేఖలో గుర్తు చేశాడు.
1803లో హైదరాబాదులో అధిక సంఖ్యలో బ్రిటీష్ సైన్యం ఉండేది. దక్షిణ భారతంలో శాంతి స్థాపించే సైనిక కేంద్రంగా సికిందరాబాద్ ఎదిగింది.
బ్రిటీష్ వారి రక్షణలో ఉన్న నిజామ్ తమ సమయమంతా కుట్రలు, కుతంత్రాలు, ఇతరుల అణచివేతలో గడిపేవాడు. నిజామ్ పాలనలో ప్రజల దుర్భర స్థితికి ప్రత్యక్ష సాక్షి అయిన సర్ జాన్ మాల్కమ్ కళ్లకు కట్టినట్టు వర్ణించాడు.
“ఎవరెవరు ఎంతెంత పన్ను చెల్లించాలో, ప్రతి పౌరుడికీ, నిర్దిష్టంగా నిర్ణయించారు. ఆ ధనాన్ని వారి నుంచి రాబట్టేందుకు ఎన్ని రకాల హింసించే శిక్షలున్నాయో అన్నిటినీ అమలు పరిచేవారు. మగ, ఆడ, పేద, ధనిక అన్న తేడా లేకుండా అందరినీ హింసించేవారు. అందరూ బాధలు పడేవారు. బరువైన తుపాకులు కొందరి చెవుల నుండి వేలాడదీసేవారు. వారి గుండెలపై బండలు ఉంచేవారు. కొందరి చేతి వ్రేళ్లను సూదులతో గుచ్చేవారు. బాధతో వారు పెట్టే కేకలు, డబ్బు చెల్లించలేమని వారు చేసే నిస్సహాయ ఆక్రందనలు, హింసించేవారి ఆనందాన్ని ఇనుమడింప చేసి, మరింతగా హింసించాలన్న ఉత్సాహాన్ని కలిగించేవి.”
1843లో బ్రిటీష్ వారి సన్నిహితుడు, నిజామ్‍ను అదుపు ఆజ్ఞలలో ఉంచుకునే చందూలాల్ మరణించాడు. దాంతో నిజామ్‍కు, అతని సలహాదార్లకు, మంత్రుల ద్వారా అధికారం నెరపే బ్రిటీష్ రెసిడెంట్‌కూ నడుమ సంఘర్షణ ఆరంభమయింది.
(సశేషం)