[dropcap]కా[/dropcap]కితో కబురంపితే నే రాలేనని తెలిసి
కలంలోంచి ఈ కవితగా ఇప్పుడే నే వచ్చేసా..
వీడని బంధమై నీ వెంట ఉండలేనని తెలిసి
నిను వీడని నీడనై నేనెప్పుడో వచ్చేసా..
పరుగు పరుగున పరుగులెత్తి నే రాలేనని తెలిసి
పదే పదే నువ్వు తీసే శ్వాసలో నేనెప్పుడో నిండి ఉన్నా..
నీ కన్నీటి వరదలకి నే కట్ట వేయలేనని తెలిసి
కనికట్టు చేసి నీ కంటి కాటుకలో నే కలిసున్నా..
తలపు తలచినంతనే నీ చెంత చేరలేనని తెలిసి
తలపు తలపుల మధ్య నీలోని నిశ్శబ్దమై నిలిచున్నా..
మరణమే నిను కబళించిన నే చూడలేనని తెలిసి
కాలంతో కాళ్ళ బేరమాడి వైతరిణి ఈవలి ఒడ్డున నే వేచి ఉన్నా..