[ప్రసిద్ధ రచయిత్రి కలవల గిరిజారాణి గారు అందిస్తున్న ఫీచర్ ‘కలవల కబుర్లు’.]
సొంత ఇంటి కడగండ్లు..
[dropcap]తె[/dropcap]లివి తక్కువ వాడు ఇల్లు కట్టించుకుంటే.. తెలివైన వాడు అందులో అద్దెకి వుంటాడట.
మీ సొంత ఇంటి కల సాకారం చేస్తాం.. మీ ఇంటికి ఆకారం తెస్తాం.. మా వెంచర్‌లో కొనండి. మీ ఆశలకి రెక్కలు తొడగండీ.. అంటూ రంగు రంగుల బ్రోచర్లు కళ్ళ ముందు గాలికి ఎగురుతూ.. మనల్ని గాలిలో ఓలలాడిస్తాయి. ఆ ఏజెంటు మనలకి ఊపిరి పీల్చుకునే అవకాశం ఇవ్వకుండా, ఊపిరి బిగబట్టి బడబడా, గబగబా చెపుతూ పోతూనే వుంటాడు.
ఎక్కడో ఊరవతల గేటెడ్ కమ్యూనిటీ.. వరుస గృహసముదాయాలు.. ఇంట్లోంచే సోపానాలు.. మేడ మీద కళ్ళు చెదిరే హంగులు, వసతులు.. ఓహో.. వాళ్ళు కొన్నారు.. వీళ్లు కొన్నారు.. రీసనబులే అట.. మా వాళ్ళందరూ అంటూంటే.. చూడ్డానికి వెళ్ళాము. మచ్చుకి ఒక ఇల్లు కట్టిపెట్టాడు అద్భుతంగా.. ఇంకేముందీ.. రేపు మనం వుండబోయేదీ ఇలాగే వుంటుందని తెగ ముచ్చట పడిపోయాము. అన్ని బేంకులతోనూ మాకు అనుసంధానం వున్నాయీ.. లోను సంగతి మేం చూసుకుంటాం.. వడ్డీ రేట్ మీరు చూసుకోండి.. ఏడాది కల్లా.. విల్లా గృహప్రవేశం డేట్ చూసుకోండి.. ఒకవేళ ఆలస్యమయితే.. అప్పటినుండీ.. పూర్తయేదాకా.. ఇప్పుడు మీరుండే ఇంటికి అద్దె మేమే చెల్లిస్తాము.. ఆ కంపెనీ కుళాయిలు పెడతాము.. ఈ కంపెనీ వాష్ బేసిన్‌లు పెడతాము.. అదిరిపోయే పెయింట్లు వేస్తామూ.. అంటూ ఊపిరి తిప్పుకోనీకుండా చేసి.. పదిలక్షలు అడ్వాన్స్ తీసుకుని.. ఐదేళ్ల పైమాటే. ఆ తర్వాత అనుకున్న మొత్తం కూడా మెత్తగా పుచ్చేసుకున్నాక..
అప్పటిదాకా మా వెనక వాడు పడితే.. అప్పటినుండీ వాడి వెనక మేము పడ్డాము. పంచవర్ష ప్రణాళిక ప్రకారం.. కిందా మీదా పడితే.. ఇప్పటికి ఓ రూపు వచ్చింది. అయినా ఇంకా హమ్మయ్య అనుకోలేదు.. మరో పంచవర్షాలైనా కావొచ్చేమో.. ఏడిపించి.. విసుగు తెప్పించడంలో.. బిల్డరూ, ప్లంబరూ, కార్పెంటరూ, ఎలక్ట్రిషియనూ.. ఇలా వరసగా క్యూ కట్టి వుంటారు. హాయిగా అద్దె ఇంట్లో వున్నంత హాయి మరోటి వుండదేమో.. ఇష్టమొచ్చినన్ని ఇళ్లు ఇష్టమొచ్చినట్లు మారిపోవచ్చు ఎంచక్కా.. ఇష్టమైన ఇంట్లో ఇష్టంగా వుండొచ్చు. పెట్టిన లోనులకి నెలనెలా వడ్డీలు వెడుతున్నా.. చలనం లేకుండా అసళ్ళు ఏంటో అక్కడే కనపడుతున్నాయి.
ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అని అనేవారు పెద్దలు.. ఇప్పుడు పెళ్లి చేయడమే ఈజీ అయిపోయింది.. ఇల్లు కట్టడం మాత్రం మరీ కష్టమయిపోతోంది..
ఏంటో.. సీత కష్టాలు సీతవి.
పీత కష్టాలు పీతవి.. ఇలాంటి ఇంటి బాధితుల స్వగతాలన్నీ ఇలాగే వుంటాయి కదూ!
తీరా కిందా మీదా పడి ఓ రూపు తీసుకొచ్చి.. ఉండేది మరో ఊరు అయేసరికి ఇక్కడ దీన్ని అద్దెకిస్తామా? ఆ తర్వాత కష్టాలు మరో మోపెడు.. చక్కని రంగులు ఎంపిక చేసి గోడలకి వేస్తామా? అద్దెకున్నవారి పిల్లల చేతిలో ఈ అందాల గోడలు కాన్వాసులే అయిపోతాయి.. ఇహ నాలుగు మూలల నుంచి వేలాడే బూజులు చెపుతాయి వాళ్ళ శ్రద్దాసక్తులు.
జిడ్డోడుతూ పొయ్యి గట్టు.. నెలకోసారి కూడా కడగడం లేదని ఒట్టేసి మరీ చెపుతుంది.
ఫోటోల కోసం, వేలాడే పాత కేలండర్ల కోసం గోడకి అడ్డదిడ్డంగా కొట్టిన మేకులు.. చేతబడి చేసే బొమ్మకి కొట్టినట్టే ఎగుడు దిగుడూ మేకుల్లా.. ఎక్కడపడితే అక్కడ. చివరకి ఏకై వచ్చినవారు మేకులా స్ధిరపడిపోతారు. మళ్లీ నెలకో ఫిర్యాదు.. ఆ తలుపు సరిగ్గా లేదు, ఈ గొళ్ళెం పడ్డం లేదు, గీజర్ ఆన్ అవడం లేదు.. ఏం? ఇంట్లో వుండేది వాళ్ళేగా? బావుచేయుంచుకోవచ్చుగా? అబ్బే.. పైసా ఖర్చు పెట్టకుండా.. ఓనర్ మీద పెట్టించాలి.. లేదంటే మేం చేయించుకుని అద్దెలో కోసుకుంటామని బెదిరింపులోటీ.. ఒక రకంగా ఏడిపించరు సుమండీ! ఆ బాధ పడలేక, సొంతిల్లు ఎందుకు కొన్నామురా భగవంతుడా? అనుకునే పరిస్థితి వస్తుంది. ఏ మూడేళ్ళకో, అద్దె పెంచామని మొహమాటంగా చెపితే, ఇక మొహం చాటేస్తారు. అన్న టైముకి అద్దె డబ్బు పంపరు. నలుగురం వుంటామంటారు కానీ అరడజను మంది వుంటారు. కుళాయిలు సరిగ్గా కట్టరు. నీళ్ళు వృథా చేస్తారు. అలా అని..
ఖాళీ చేయించాలంటే తాతల తాతలే దిగిరావాలి.
ఇవండీ సొంతింటి కష్టాలు. ఇవి కల్పికలు కాదు నిజాలే..
వీటి మీద గల్పికలేంటీ.. కథలకి కథలే వ్రాసేయవచ్చేమో కదూ!!