[dropcap]జో[/dropcap]రున కురుస్తున్న గొంతులో
ఇరుక్కుని మొదటి వాక్యం
చిరిగి గాయమై కుంటుతూ
అక్కడక్కడే తిరుగుతుంది.
వేళ్ళ రాపిడిలో
ఒళ్ళు నలిగిన పేజీలు
ఒకటినొకటి నడుములు వంగినా
భుజాలపై చేతులు వేసుకుంటూ
ఆఖరి అక్షరం వద్ద
చివరి పేజీ చూరు చేరి
కురిసి చిత్తడైన అర్థాలలో
వెనక్కి చూస్తున్నాయి..
ఎవరి మనసులోనైనా
మెతకపడ్డ ముద్రల్ని కనిపిస్తే
చెవుల కరుచుకుని
తనను విని పొంగాలని
ముఖచిత్రం మొత్త చాటుగా
మెత్తగా ముడుచుకు కూర్చొంది
కన్నీటి ముడిద్రవంగా
మరిగిన అనుభవం..