[వాల్మీకి రామాయణం ఆధారంగా శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘ఆదికావ్యంలోని ఆణిముత్యాలు’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]
ఆదికావ్యంలోని ఆణిముత్యాలు
135. శ్లో.
ఇహోపయాతః కాకుత్థ్స! దేవరాజశ్శతక్రతుః।
ఉపాగమ్య చ మాం దేవో మహాదేవస్సురేశ్వరః।
సర్వాన్ లోకాన్ జితానాహ మమ పుణ్యేన కర్మణా॥
తేషు దేవర్షిజుష్టేషు జితేషు తపసా మయా।
మత్ప్రసాదాత్ సభార్యస్త్వం విహరస్వ సలక్ష్మణః॥
అహమేవాహరిష్యామి స్వయం లోకాన్ మహామునే।
ఆవాసం త్వహమిచ్ఛామి ప్రదిష్టమిహ కాననే॥
(అరణ్యకాండ, 7. 11, 12, 14)
సుతీక్ష్ణ మహాముని శ్రీరామునితో: దేవేంద్రుడు నా పుణ్యకర్మల ప్రభావమున నేను సకల లోకములను జయించినట్లు తెల్పెను. దేవతలును, ఋషులును సేవించునట్టి ఆ లోకములన్నింటిని నీకు సమర్పిస్తున్నాను. నీవు సీతాలక్ష్మణ సహితుడవై అందు విహరింపుము.
శ్రీరాముడు: ఈ లోకములన్నింటినీ నేను సులభముగానే పొందగలను. ఈ వనమున ఒక కుటీరమును నిర్మించుకుని నివసించుటకు అనువగు ప్రదేశమును నీవు తెల్పిన చాలు!
136. శ్లో.
త్రీణ్యేవ వ్యసనాన్యత్ర కామజాని భవంత్యుత।
మిథ్యావాక్యం పరమకం తస్మాద్గురుతరావుభౌ।
పరదారాభిగమనం వినా వైరం చ రౌద్రతా॥
సత్యసంధ! మహాభాగ! శ్రీమన్ లక్ష్మణపూర్వజ!।
త్వయి సత్యం చ ధర్మశ్చ త్వయి సర్వం ప్రతిష్ఠితమ్॥
(అరణ్యకాండ, 9. 3, 7)
దండకారణ్యం లోకి వెళుతున్నప్పుడు సీతాదేవి శ్రీరామునితో అంటుంది: ఈ లోకమున ప్రధానమైన కామజములగు వ్యసనములు మూడు – అబద్ధమాడటం మొదటిది. పరస్త్రీ వ్యామోహం రెండవది. తనకు ఎట్టి వైరభావము లేకున్నను ప్రాణిహింసకు పూనుకొనుట మూడవది. చివరి రెండును మిథ్యావచనము కంటెను మిగుల ప్రమాదకరమైనవి.
ఓ రాజకుమారా! నీవు పరమ ధార్మికుడవు, సత్యసంధుడువు. తండ్రి మాటను జవదాటనివాడవు. సత్యము, ధర్మము నిన్నే ఆశ్రయించుకుని యుండును.
137. శ్లో.
క్షత్రియాణాం తు వీరాణాం వనేషు నిరతాత్మనామ్।
ధనుషా కార్యమేతావత్ ఆర్తానాం అభిరక్షణమ్॥
క్వచ శస్త్రం క్వచ వనం క్వచ క్షాత్రం తపః క్వచ।
వ్యావిద్ధమిదమస్మాభిః దేశధర్మస్తు పూజ్యతామ్॥
తదార్య కలుషా బుద్ధిః జాయతే శస్త్ర సేవనాత్।
పునర్గత్వా త్వయోధ్యాయాం క్షత్రధర్మం చరిష్యసి॥
అక్షయా తు భవేత్ ప్రీతిః శ్వశ్రూశ్వశురయోర్మమ।
యది రాజ్యం పరిత్యజ్య భవేస్త్వం నిరతో మునిః॥
ధర్మాదర్థః ప్రభవతి ధర్మాత్ ప్రభవతే సుఖమ్।
ధర్మేణ లభతే సర్వం ధర్మసారమిదం జగత్॥
ఆత్మానం నియమైస్తై స్తైః కర్షయిత్వా ప్రయత్నతః।
ప్రాప్యతే నిపుణైర్ధర్మో న సుఖాల్లభ్యతే సుఖమ్॥
నిత్యం శుచిమతిస్సౌమ్య! చర ధర్మం తపోవనే।
సర్వం హి విదితం తుభ్యం త్రైలోక్యమపి తత్త్వతః॥
స్త్రీచాపలాదేత దుతాహృతం మే
ధర్మం చ వక్తుం తవ కస్సమర్థః।
విచార్య బుద్ధ్యా తు సహానుజేన
యద్రోచతే తత్ కురు మా చిరేణ॥
(అరణ్యకాండ, 9. 26-33)
సీతాదేవి శ్రీరామునితో: తపస్సాచరించే వారిని రాక్షసాదులు హింసించినప్పుడు, వారిని రక్షించవలసిందే (అలా కాకుండా ఎట్టి వైరిభావం లేకున్నా రాక్షసులందరినీ సంహరించటం సమంజసం కాదు). శస్త్రధారణ ఎక్కడ? వనవాసమెక్కడ? మనం వన జీవన ధర్మమైన తపః ప్రవృత్తినే కలిగి యుండవలెను. వనవాసం ముగిసిన తరువాత అయోధ్యకు వెళ్ళినప్పుడు క్షత్రియ ధర్మం అవలంబించవచ్చును. ఇప్పుడు పూర్తిగా మునివృత్తిలో నిమగ్నులైతే అత్తమామలకు ప్రీతి కలుగును. ధర్మాచరణము వలన సంపదలు సమకూరును. ధర్మము వలననే సుఖశాంతులు అబ్బును. ధర్మము వలన జ్ఞానము, తద్వారా ముక్తియు లభించును. ఈ జగత్తునకు ధర్మమే ఆధారము. శరీర సుఖములకు మాత్రమే పరిమితమై జీవయాత్ర గడిపినచో ముక్తి లభించదు.
నిర్మల బుద్ధితో నిత్యము తపోవన ధర్మమునే ఆచరించింపుము. ముల్లోకములకు సంబంధించిన పురుషార్థములు అన్నియును పూర్తిగా మీరు ఎరిగినవే. స్త్రీ చాపల్యముచే ఇలా పలికాను గాని ధర్మమును గూర్చి మీకు తెల్పగల సమర్థులెవరు? సోదరుడగు లక్ష్మణునితో వెంటనే బాగుగా ఆలోచించి మీ ఇష్టానుసారం చేయుము.
138. శ్లో.
మయా చైతద్వచః శ్రోత్వా కార్త్స్న్యేన పరిపాలనమ్।
ఋషీణాం దండకారణ్యే సంశ్రుతం జనకాత్మజే॥
సంశ్రుత్య చ న శక్ష్యామి జీవమానః ప్రతిశ్రవమ్।
మునీనామన్యథా కర్తుం సత్యమిష్టం హి మే సదా॥
అప్యహం జీవితం జహ్యాం త్వాం వా సీతే! సలక్ష్మణామ్।
న తు ప్రతిజ్ఞాం సంశ్రుత్య బ్రాహ్మణేభ్యో విశేషతః॥
తదవశ్యం మయా కార్యమృషీణాం పరిపాలనమ్।
అనుక్తేనాపి వైదేహి! ప్రతిజ్ఞాయ తు కిం పునః॥
మమ స్నేహాచ్చ సౌహార్దాత్ ఇదముక్తం త్వయానఘే।
పరితుష్టోస్మ్యహం సీతే! న హ్యనిష్టోనుశిష్యతే॥
సదృశం చానురూపం చ కులస్య తవ చాత్మనః।
సధర్మచారిణీ మే త్వం ప్రాణేభ్యోపి గరీయసీ॥
(అరణ్యకాండ, 10. 17-22)
శ్రీరాముడు చెప్పిన సమాధానం:
నన్ను ఆశ్రయించిన ఈ ఋషుల విరోధులు నాకును శత్రువులే. అందువలన రాక్షసులను పూర్తిగా పరిమార్చి, దండకారణ్యమున ఈ మునులను కాపాడతానని ప్రతిజ్ఞ చేశాను. నా బొందిలో ప్రాణములుండునంత వరకు నేను చేసిన ప్రతిజ్ఞను విడవజాలను. ఋషుల కిచ్చిన మాటను నిలబెట్టుకుని తీరెదను. సత్యపాలనయే సర్వదా నాకు ఇష్టము.
ఓ సీతా! మాటను నిలబెట్టుటకై నా ప్రాణములను కూడా ఒడ్డెదను. అంతే గాదు, అందులకు నిన్నును, లక్ష్మణుని సైతము పరిత్యజించుటకు వెనుకాడను. ఎట్టి పరిస్థితులలోనూ చేసిన ప్రతిజ్ఞను మాత్రము విడువను. అందునా బ్రహ్మజ్ఞానులైన బ్రాహ్మణులకు ఇచ్చిన మాటను ఎన్నడూ మరువనే మరువను.
ఓ వైదేహీ! ఋషీశ్వరులు నన్ను అడగకున్నను ఎల్లవేళలా వారిని రక్షించుట నాకు అవశ్య కర్తవ్యము. ప్రతిజ్ఞ చేసి యున్నప్పుడు ఇక చెప్పవలసినదేముంది?
పవిత్రాత్మురాలైన ఓ సీతా! మన ప్రేమానురాగముల వలనను, సుహృద్భావ కారణమునను నీవు ఈ విషయాన్ని ప్రస్తావించి యుంటివి. ఇందులకు నేను ఎంతో సంతోషించాను. ఆత్మీయులు కాని వారితో ఎవ్వరునూ ఇలా ప్రస్తావించరు గదా!
నీవు నీ స్వభావమునకును, మీ వంశమునకును తగినట్లుగా పలికావు. నీవు నాకు ప్రాణముల కంటెను మిన్న. నీవు నా సహధర్మచారిణివి గదా! కావున ధర్మాచరణమున నాతో పాలు పంచుకొనుము!
సీతాదేవి భర్తతో ధర్మం విషయంలో పలికిన తీరు, శ్రీరాముడు మృదువుగా ఆమెను మెచ్చుకుంటూనే సత్యవాక్యపరిపాలన విషయంలో చెప్పిన దృఢమైన నిర్ణయం భార్యాభర్తల విషయంలో ఆదర్శప్రాయమని గమనించాలి. ‘మాట నిలబెట్టుటకు నిన్నును, లక్ష్మణుని కూడా త్యజించగలను’ అని చెప్పి, మరల ‘నీవు నాకు ప్రాణముల కంటెను మిన్న’ అని చెప్పడం విశేషం! సహధర్మచారిణివి కావున ధర్మాచరణలో పాలుపంచుకోమని చెబుతున్నాడు శ్రీరాముడు. ఈ సంవాదం పలుమార్లు చదువుకోదగ్గది!
139. శ్లో.
జగామ చాశ్రమాన్ తేషాం పర్యాయేణ తపస్వినామ్।
యేషాముషితవాన్ పూర్వం సకాశే స మహాస్త్రవిత్॥
తథా సంవసతస్తస్య మునీనామాశ్రమేషు వై।
రమతశ్చానుకూల్యేన యయుః సంవత్సరా దశ॥
(అరణ్యకాండ, 11. 25, 28)
శ్రీరాముడు పూర్వము తాను నివసించిన మున్యాశ్రమములకు వరుసగా మరియొక మారు వెళ్ళెను.
ఆ విధంగా సీతారామలక్ష్మణులు ఆశ్రమాలలో హాయిగా నివసించుచుండుగా పది యేండ్లు గడిచెను.
(మహర్షి పదియేండ్ర వ్యవధి ఒక్క శ్లోకంతో పూర్తి చేశాడు).
140. శ్లో.
అగస్త్య ఇతి విఖ్యాతో లోకే స్వేనైవ కర్మణా।
ఆశ్రమో దృశ్యతే తస్య పరిశ్రాంతశ్రమాపహః॥
యదా ప్రభృతి చాక్రాంతా దిగియం పుణ్యకర్మణా।
తదా ప్రభృతి నిర్వైరాః ప్రశాంతా రజనీచరాః॥
(అరణ్యకాండ, 11. 81, 84)
తన తపః ప్రభావము చేత వింధ్య పర్వతమును స్తంభింప జేసినందున ఆ మహర్శి ‘అగస్త్య’ నామముతో విఖ్యాతుడైనాడు. ఆయన ఆశ్రమమున చేరిన వారందరి శ్రమలను తొలగించి హాయిని కూర్చుచుండును.
అగస్త్య ముని ప్రభావము చేత వింధ్య పర్వతమునకు దక్షిణ దిశ యందు గల ఈ ఆశ్రమ ప్రాంతమంతయును సురక్షితముగా నున్నది.
ఆ మహర్షికి భయపడి రాక్షసులు ఇచట నున్నవారి నెవ్వరినైనను హింసింపరు సరికదా, వారు ఈ వైపునకు కన్నెత్తియైనను చూడజాలరు.
141. శ్లో.
తద్ధనుస్తౌ చ తూణీరౌ శరం ఖడ్గం చ మానద।
జయాయ ప్రతిగృహ్ణీష్వ వజ్రం వజ్రధరో యథా॥
ఏవముక్త్వా మహాతేజాః సమస్తం తద్వరాయుధమ్।
దత్వా రామాయ భగవానగస్త్యః పునరబ్రవీత్॥
(అరణ్యకాండ, 12. 36, 37)
అగస్త్యుడు: ఓ పూజ్యుడా! ఈ ధనస్సును (విష్ణువు, ఒకప్పుడు ధరించినది), తూణీరములను, అమోఘమైన ఖడ్గమును, ఇంద్రుడు వజ్రాయుధమును స్వీకరింపుము. నీకు జయము తథ్యము.
ఆ ఆయుధములన్నింటినీ శ్రీరామునకు సమర్పించాడు అగస్త్య మహాముని.
142. శ్లో.
సోహం వాససహాయస్తే భవిష్యామి యదీచ్ఛసి।
ఇదం హి దుర్గం కాంతారం మృగరాక్షస సేవితమ్।
సీతాం చ తాత! రక్షిష్యే త్వయి యాతే సలక్ష్మణే॥
(అరణ్యకాండ, 14. 33)
జటాయువు: నీవు సమ్మతించినచో మీ నివాస స్థలమును రక్షించుటకు తోడ్పడుచుందును. నాయనా! ఇది దట్టమైన కీకారణ్యము. క్రూరమృగములు, దుష్ట రాక్షసులు ఈ ప్రదేశమున సంచరించుచుందురు. నీవును, లక్ష్మణుడును మీ కుటీరమునకు దూరముగా వెళ్ళినప్పుడు సీతాదేవిని నేను రక్షించుచుందును.
143. శ్లో.
కృతాభిషేకస్స రరాజ రామః
సీతాద్వితీయః సహ లక్ష్మణేన।
కృతాభిషేకో గిరిరాజ పుత్ర్యా
రుద్రః సనందీ భగవానివేశః॥
(అరణ్యకాండ, 16. 43)
సీతాలక్ష్మణులతో గూడి గోదావరి జలములతో స్నానమొనర్చిన శ్రీరాముడు పార్వతీదేవితో, నందీశ్వరునితో కలిసి గంగాజలంలో స్నానమాచరించిన పరమశివుని వలె విరాజిల్లెను.
144. శ్లో.
తథాసీనస్య రామస్య కథాసంసక్త చేతసః।
తం దేశం రాక్షసీ కాచిత్ ఆజగామ యదృచ్ఛయా॥
(అరణ్యకాండ, 17. 5)
శ్రీరాముడు సుఖాశీనుడై పురాణ కథా ప్రసంగములలో మునిగియుండగా విధివశమున ఒకానొక రాక్షసి ఆయన కడకు వచ్చినది.
.. ఇక్కడ ‘యదృచ్ఛయా’ అన్నది కీలకం.
ఇది చిన్న సహజమైన, యాదృచ్ఛికమైన సంఘటన అని తెలుపుతూనే, ఈ సంఘటన కథను ఎలా మలుపు తిప్పిందో మనకు వివరిస్తున్నాడు మహర్షి!
145. శ్లో.
తతస్సభార్యం భయమోహమూర్ఛితా
సలక్ష్మణం రాఘవమాగతం వనమ్।
విరూపణం చాత్మని శోణితోక్షితా
శశంస సర్వం భగినీ ఖరస్య సా॥
(అరణ్యకాండ, 18. 26)
ఖరుని సోదరియు, రక్తముతో తడిసి యున్నదియు, భయముతో ప్రాణములు అన్నుబట్టియున్నదియు ఐన ఆ శూర్పణఖ శ్రీరాముడు భార్య యగు సీతతో, లక్ష్మణునితో దండకారణ్యమున నివసించుచున్న విషయమును, ఆయన వలన తన ముక్కు చెవులు తెగి, తాను విరూపమయిన వృత్తాంతమును పూర్తిగా ఖరునకు వివరించెను.
(చాలామంది శూర్పణఖ సూటిగా రావణుని వద్దకు వెళ్ళినట్టు భావిస్తారు).
(ఇంకా ఉంది)