డాక్టర్ అన్నా బి.యస్.యస్.-13

0
3

[ప్రముఖ రచయిత శ్రీ సిహెచ్. సియస్. శర్మ రచించిన ‘డాక్టర్ అన్నా బి.యస్.యస్.’ నవలని ధారావాహికంగా పాఠకులకు అందిస్తున్నాము.]

[కొన్నాళ్ళ పాటు అన్నా, లాస్య ఒకరి నొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆమెది మరీ ఆధునిక స్వభావం. అన్నాది సాంప్రదాయ వైఖరి. ఓ ఆరు నెలలు డేటింగ్ చేద్దామంటుంది లాస్య. అయితే తన వృత్తికి ఆటంకం కలగకుండా తాను వచ్చి ఆమెను కలుస్తానని అంటాడు. సరే అంటుంది లాస్య. కొన్నాళ్ళు కలిసి తిరుగుతారు. ఓ రాత్రి మైకంలో ఇద్దరూ శారీరకంగా కలుస్తారు. అన్నా గిల్టీలా ఫీలవుతాడు కానీ లాస్య అదేం పట్టించుకోదు. అయితే కొన్నాళ్ళకి లాస్య అన్నా మెసేజ్‍లకి స్పందించడం మానేస్తుంది. ఫోన్‍లు ఎత్తదు. తన మీద లాస్యకి కోసం వచ్చి ఉంటుందని, సర్ది చెప్పాలని ఆమె ఊరు వెళ్ళి, అక్కడ తరచూ తాము దిగే హోటల్‍కి వెడతాడు. అక్కడ లాస్య ఓ ఆఫ్రికన్-అమెరికన్‍తో కనబడుతుంది. ఫోన్ చేస్తే, అన్నా అంటే తనకి ఇష్టం లేదని చెప్తుంది. రూమ్ ఖాళీ చేసి శాన్ ఫ్రాన్సిస్కోకు వచ్చేస్తాడు అన్నా. లాస్య మరొకరిని ప్రేమించిందన్న విషయం తల్లిదండ్రులకు చెప్పి, వృత్తి మీద దృష్టి సారిస్తాడు అన్నా.  ఇక చదవండి.]

[dropcap]అ[/dropcap]న్నా.. మనశ్శాంతి కోసం.. దైవ స్మరణం.. ‘ఓం నమశ్శివాయ.. ఓం నమోనారాయణాయ..’ను తీరిక సమయాల్లో నిరంతరం చేసేవాడు. డ్యూటీ లేని వేళల్లో తల్లిదండ్రుల సన్నిధిలో ఎక్కువ సమయం గడిపేవాడు. క్రమం తప్పకుండా వుదయాన్నే జాగింగ్, యోగ చేసేవాడు. ఏ పని చేస్తున్నా మదిలో దైవస్మరణ జరుగుతునే వుండేది.

మాధవి.. ధర్మతేజలు.. తమ తనయుడు లాస్య జ్ఞాపకాలతో కుంగిపోకుండా.. తన వృత్తిని ఖచ్చితంగా నెరవేర్చుతూ.. తమతో కలసి ఆనందంగా కాలం గడపటంవలన.. వారూ ఎంతో ఆనందించేవారు.

లాస్య స్టడీ యం.ఎస్., ముగిసింది.. అబ్రహామ్ కలసి సౌత్ ఆఫ్రికాకు వెళ్లిపోయింది.

ఆ విషయాన్ని లాస్య పినతండ్రి సుధీర్ ఫోన్ చేసి ధర్మతేజకు చెప్పాడు. ఆ సమయంలో వారు యూనివర్సిటీలో వున్నారు. సుధీర్ మాటలకు ఆశ్చర్యపోయారు. ఇంట్లో అప్పటికి లాస్య ప్రసక్తి ముగిసి దాదాపు తొమ్మిది నెలలు. జ్ఞాపకాలు ముగ్గురి మనసుల్లో మరుగున పడిపోయాయి. ఆ కారణంగా తాను నేడు విన్న విషయాన్ని భార్యకు కుమారుడికి చెప్పదలచుకోలేదు ధర్మతేజ..

తాను సుధీర్ ద్వారా విన్నది ఈ చెవిలో వేసుకొని ఆ చెవి ద్వారా గాల్లోకి వదిలేశాడు. ‘పీడకల’ అనుకొన్నాడు. కాల గతిలో రెండున్నర సంవత్సరాలు గడచిపోయాయి. ధర్మతేజ ప్రాణమిత్రుడు.. నారాయణ మూర్తి.. చెన్నై వాసి..

ఉదయం ఎనిమిదిగంటల సమయంలో ఫోన్ చేశాడు. అమెరికాలో వుదయం ఎనిమిది గంటలంటే భారత్‌లో దాదాపు మధ్యాహ్నం ఒంటిగంట సమయం.

దాదాపు సంవత్సరం రోజుల తర్వాత నారాయణమూర్తిగారి నుంచి ధర్మతేజకు ఫోన్..

సంవత్సరం క్రిందట.. ధర్మతేజ.. మాధవి.. భారత్‌కు వచ్చి నెలరోజులు దక్షిణదేశ క్షేత్రాలన్నింటినీ.. మిత్రుడు అతని సతీమణి ఇంద్రజతో కలసి మహదానందంగా తిరిగి, అమెరికా చేరారు.

“హలో!..”

“ఒరేయ్!.. ధర్మా.. నేను!..”

ధర్మతేజ.. “ఎవరూ?..”

“నేనురా.. నారాయణమూర్తిని..”.

“ఓ.. ఓ.. నారాయణా నీవా!.. ఒరేయ్!.. సంవత్సరం పైన అయిందిరా.. మనం కలసి.. ఆ చెప్పు.. చెల్లెమ్మ.. కూతురు.. కొడుకు.. ఎలా వున్నారు?..” ఆనందంగా అడిగాడు ధర్మతేజ.

“ఆ భగవానుల దయవలన అంతా కుశలం.. మరి నీ విషయం?.. చెల్లెమ్మ.. అబ్బాయి ఎలా వున్నార్రా?..” అడిగాడు నారాయణమూర్తి.

“ సర్వేశ్వరుని దయవలన అంతా క్షేమం..”

“కొడుకు ఏం చేస్తున్నాడు?..

“పి.హెచ్.డీ. అయిపోయింది. హాస్పటల్లో సర్వీస్.. ఆ.. అవునురా.. నేను వున్నట్లుండి ఇపుడు నీకు ఎందుకు జ్ఞాపకం వచ్చానురా!..” అడిగాడు ధర్మతేజ.

“నేను నిన్ను చూచేదానికి వస్తున్నాను..” నవ్వాడు నారాయణమూర్తి.

“ఏంట్రా నీ ఒక్కడవే వస్తున్నావా?..”

“కాదురా!..”

“మరేంటి..”

“అందరం వస్తున్నాము..”

“ఆ..”

“అవును.. మన ఇంద్రజ.. తమ్ముడు జయదేవ్.. అక్కడ శాన్ ఫ్రాన్సిస్కోలో వున్నాడు కదా!.. మన అమ్మాయి పార్వతి నాట్యాభ్యాసం పూర్తి అయింది. అరంగేట్రం.. కొన్ని ప్రదర్శనలు తమిళనాడులో ఇవ్వటం జరిగింది. జయదేవ్.. మమ్మల్ని అక్కడికి రమ్మని ఆహ్వానించాడు. వాడు అమ్మాయి ప్రోగ్రామ్స్ గురించి కల్చరల్ అసోసియేషన్ ప్రెసిడెంట్లు కొంతమందితో మాట్లాడాడుట.. వారు అంగీకరించారట. ఆ కారణంగా ఓ నెలరోజులు మేము నలుగురమూ అమెరికా టూర్.. నా ప్రాణమిత్రుడివి కదా నీవు.. అందుకే తెలియజేశాను.” చిరునవ్వుతో చెప్పాడు నారాయణమూర్తి.

“ఎప్పుడు వస్తున్నారు?..”.

“ఈ రోజు ట్వంటీ థర్డ్ కదా!.. ఫస్ట్‌కు బయలుదేరుతున్నాము. సెకండు అక్కడికి చేరుతాము..”

“ఓకే..రా!.. అయామ్ వెరీ హ్యాపీ.. వుయ్ విల్ మీట్.. బై..”

ఇంటికి వచ్చి ధర్మతేజ.. మాధవికి అన్నాకు తన మిత్రుని రాక గురించి చెప్పాడు. వారు ఆనందించారు.

***

నారాయణమూర్తి.. భార్య ఇంద్రజ.. కూతురు పార్వతి.. కొడుకు మాధవ్ లతో తన బావమరిది జయదేవ్ ఉన్న శాన్ ఫ్రాన్సిస్కో డెలాయ్‌ట్ సిటీకి చేరారు.

జయదేవ్.. వారిని శాన్ ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ ఎయిర్‍పోర్టులో రిసీవ్ చేసుకొన్నాడు.. తాను వారి రాకకు ముందే పది నగరాల్లో పార్వతి నృత్య ప్రదర్శనకు అక్కడి స్థానికులతో మాట్లాడి.. ఏర్పాటుచేసిన ప్రకారం.. పార్వతి నృత్య ప్రదర్శనలు జరిగాయి.

పలువురు భారతీయులు.. హైందవ కళలపట్ల అభిమానం వున్న అనేకమంది అమెరికన్సు పార్వతి ప్రోగ్రాము చూచి అభినందించారు. సత్కరించారు. పార్వతి తన కళాకౌశలంతో పలువురి ప్రశంసలు అందుకొంది.

ప్రదర్శన ముగిసిన తర్వాత.. నారాయణమూర్తి తన కుమార్తె ఫొటోలను, వీడియోలను ధర్మతేజకు పంపేవాడు. మాధవి ధర్మతేజలు ఆయా వీడియోలలో పార్వతి యొక్క నాట్య ప్రతిభను చూచి ఎంతగానో ఆనందించారు.

ఓ తల్లికి యుక్తవయస్కుడైన కొడుకు వుంటే.. అందమైన అమ్మాయిని చూచిన ఆ తల్లి మనుసున కలిగే భావం.. ‘ఆ అమ్మాయి చాలా బాగుంది.. నా కొడుక్కు తగిన జోడి..’ అనే మధుర భావన.

వీడియోలన్నీ చూచిన మాధవి అదే భావనతో.. తన మనస్సులోని మాటను ధర్మతేజకు తెలియచేసింది.

ధర్మతేజ.. చిరునవ్వుతో.. “నా మదిలోని భావననే నీవు నాకు చెప్పావు మధూ!.. వస్తారుగా.. నారాయణ.. ఇంద్రజలు.. మాట్లాడుదాం..” అన్నాడు.

నారాయణమూర్తి ఫోన్..

“ఓ గంటలోపల నీ ముందువుంటానురా!..” నవ్వుతూ చెప్పాడు.

“ఏమిటిరా!.. నీవు ఒక్కడివే వస్తున్నావా ?..” ధర్మతేజ ప్రశ్న.

నారాయణమూర్తి నవ్వుతూ.. “లేదురా.. నలుగురమూ వస్తున్నాం..” అన్నాడు.

“ఓకే!.. ఓకే!.. చాలా సంతోషం.. వెల్‍కమ్.. వెల్‍కమ్..” ఆనందంగా చెప్పాడు. సెల్ కట్ చేశాడు.

“ఎవరండీ!.. నారాయణ అన్నయ్యగారేనా!..”

“అవును మధూ.. గంటలోపల వస్తున్నారట..”

“అలాగా!..”

“అవును..”

“లక్ష్మీ!” పిలిచింది మాధవి..

“ఏం అమ్మగారూ!..”

“మన బంధువులు నలుగురు వస్తున్నారు. వంట వారికీ చేయాలి..”

“ఓ.. దానికేముందమ్మా.. అరగంటలో చేసేస్తాను..” నవ్వుతూ చెప్పింది లక్ష్మి.

“సరే.. వెళ్లి పనిచూసుకో!..”

లక్ష్మి లోనికి వెళ్లిపోయింది.

డ్రస్ చేసుకొని అన్నా కిందకు వచ్చాడు.

“నాన్నా!.. నారాయణమూర్తి అంకుల్ ఫ్యామిలీ మెంబర్స్‌తో వస్తున్నాడు..” నవ్వుతూ చెప్పాడు ధర్మతేజ.

“అలాగా!!..”

“అవును..”

“ఎపుడు?..”

“గంట లోపల..”

“ఓకే నాన్నా!.. నేను సాయంత్రం వస్తాను. అమ్మా.. నాన్నా!.. నేను బయలుదేరుతాను..” అని చెప్పి నవ్వుతూ వరండాలో ప్రవేశించి.. కార్లో కూర్చొని ‘బై’ చెప్పి హాస్పటల్‌కు వెళ్లిపోయాడు అన్నా.

ధర్మతేజ.. మాధవీలు కొడుక్కి ‘టాటా’ చెప్పి, హాల్లోకి వెళ్లి సోఫాలో కూర్చున్నారు. ఇరువురూ వారివారి కార్యాలయాలకు. ఫోన్ చేసి ‘బంధువుల రాక కారణంగా ఆఫీసుకు రావటంలేదని’ తెలియచేశారు.

లక్ష్మి ఇచ్చిన కాఫీ త్రాగి వరండాలోకి వచ్చి కూర్చున్నారు.

నారాయణమూర్తి ఫోన్..

“పది నిముషాల్లో వస్తున్నాం రా!..”

“ఓకే.. ఓకే.. నీ రాక కోసం.. ఎదురుచూస్తున్నాను.. మిత్రమా!..” నవ్వుతూ చెప్పాడు ధర్మతేజ.

మాధవి.. ధర్మతేజ నాటకీయంగా చెప్పిన డైలాగ్‌కు నవ్వుతూ అతని ముఖంలోకి చూచింది.

వీధిలో కారు హారన్..

ఇరువురూ లేచి వీధి గేటు వైపుకు నడిచారు.

నారాయణమూర్తిగారి కారు వాకిట ఆగింది. ధర్మతేజ గేటును తెరిచాడు.

కారులోనికి ప్రవేశించింది. పార్టికోలో ఆగింది.

నలుగురు కారునుండి దిగారు.

ధర్మతేజ.. మాధవీలు వారిని సమీపించారు.

నారాయణ కరచాలనం చేసి.. ధర్మతేజను ఆనందంగా తన హృదయానికి హత్తుకున్నాడు.

మాధవి నవ్వుతూ ఎంతో ఆప్యాయంగా ఇంద్రజ చేతులను తన చేతుల్లోకి తీసుకొంది.

“వదినా!.. బాగున్నారా?..”

“ఆ.. మేము కుశలమే.. మీరు?..”

పార్వతి.. మాధవ్.. పెద్దవారినీ.. వారి అప్యాయతలను చిత్రంగా చూస్తున్నారు.

“అంతా క్షేమమే వదినా!..” నవ్వుతూ చెప్పి మాధవి పార్వతి ముఖంలోకి చూస్తూ..

“పార్వతీ.. నీ ప్రోగ్రామ్స్ అన్నీ చాలా బాగున్నాయమ్మా.. నేను మామయ్య రెండు మూడు సార్లు చూచామమ్మా..” నవ్వుతూ చెప్పింది మాధవి.

“మధూ.. లోనికి పద.. కూర్చుని మాట్లాడుకుందాం..” నవ్వుతూ చెప్పాడు ధర్మతేజ.

అందరూ చిరునవ్వుతో హాల్లో ప్రవేశించారు.

ఆకుపచ్చరంగు కాటన్ చీర.. అదే రంగు జాకెట్.. పొడుగాటి జడ.. తల్లో పూలు.. కళ్లకు కాటుక.. నొసట రెడ్ స్టిక్కర్ బొట్టూ.. కుడిచేతికి నాలుగు బంగారు గాజులు.. ఎడంచేతి గోల్డు ఫ్రేమ్ రిస్ట్వచ్.. మెడలో బంగారు చైన్..

పార్వతి అలంకరణ.. మాధవికి ఎంతో నచ్చింది.

“ఇంద్రజా!.. మన పార్వతి.. ఆంధ్రుల ఆడపడుచుకు ప్రతిరూపం..” ఆనందంగా నవ్వుతూ .. పార్వతి చేతిని తన చేతిలోకి ప్రీతిగా తీసుకొంది.

అందరూ సోఫాల్లో కూర్చున్నారు.

ఇంద్రజ ఆనందంగా పార్వతిని చూస్తూ నవ్వింది.

మంచి మనస్సుతో పలికిన మంచి మాటలు.. ఎదుటివారికి ఆనందాన్ని కలిగిస్తాయి.

“అన్నా! ఎన్ని గంటలకు వస్తాడు వదినా!..” అడిగింది ఇంద్రజ.

“అరున్నరకు వస్తాడు వదినా!..” సెల్‌లో అన్నా కోసం ప్రయత్నించింది.

అన్నా సెల్ ఆఫీసులో ఉంది.

కొద్ది నిముషాల్లో అన్నా కాల్ చేశాడు.

లక్ష్మి ఆహార పదార్థాలను డైనింగ్ టేబుల్ పైన అమర్చింది.

హాల్లోకి వచ్చి.. “అమ్మా!.. మీరు భోజనానికి రావచ్చు..” మెల్లగా చెప్పింది.

ధర్మతేజ.. “నారాయణా!.. ఫ్రష్ అవండి.. భోంచేద్దాం..” అన్నాడు.

పార్వతి.. లేచి మాధవిని సమీపించి.. ఆమె ముఖంలోకి చూచింది.

ఆమె ముఖ భావనను గ్రహించిన మాధవి.. ఆమె చేతిని తన చేతిలోనికి తీసుకొని గెస్ట్ బెడ్ రూమ్ వైపుకు తీసుకెళ్లింది. ఇంద్రజ వారిని అనుసరించింది.

ధర్మతేజ.. నారాయణకు మరో బెడ్రూమ్ చూపించాడు. ముందుగా మాధవ్ రెస్ట్ రూమ్ లోకి దూరాడు. ఆ తర్వాత నారాయణ మూర్తి..

ఫ్రష్ అయి అందరూ డైనింగు టేబుల్ చుట్టూ కూర్చున్నారు. లక్ష్మి వడ్డించటం ప్రారంభించింది.

మాధవి సెల్ మ్రోగింది.

చిరునవ్వుతో చేతికి తీసుకొంది మాధవి.. “హలో..” అంది.

“అమ్మా!.. ఆపరేషన్ థియేటర్లో వున్నాను..”

“వూహించాను నాన్నా!..

“మనవాళ్లు వచ్చారా!..”

“అ.. నలుగురూ వచ్చారు..”

“అంకుల్ చేతికి ఫోన్ ఇవ్వు అమ్మా!..”

“ఆ..” నారాయణ ముఖంలోకి చూస్తూ “అన్నయ్య గారూ.. అన్నా మీతో మాట్లాడుతాడట..” అంటూ సెల్‌ని నారాయణమూర్తికి అందించింది మాధవి. స్పీకరు ఆన్ చేశాడు నారాయణమూర్తి.

“హలో!..” చిరునవ్వుతో పలికాడు నారాయణమూర్తి.

“హలో.. అంకుల్!.. ప్రయాణం బాగా సాగిందా!..”

“ఆ.. ఆ.. సూపర్ అన్నా!..”.

“ఓకే!.. ఆంటీ పిల్లలు అంతా కులాసానేగా?..”

‘ఆ.. పిల్లలా!.. మేము వారి దృష్టిలో పిల్లలమా!..’ పార్వతి అనుకొంది.

“ఆ.. ఆ.. అంతా బాగున్నారు..”

“ఆరున్నరకు వస్తాను.. మీరు భోంచేశారా!..”

“ప్రారంభించపోతున్నాం.. మీ కాల్ వచ్చింది.”

“ఓకే.. సార్! అంకుల్ స్తిమితంగా భోం చేయండి.. సాయంత్రం కలుద్దాం..” అన్నా సెల్ కట్ చేశాడు. నారాయణమూర్తి.. తృప్తిగా అందరి ముఖాల్లోకి ఆనందంగా.. చూచాడు.

మాధవి.. నారాయణ ముఖ భావాలను గ్రహించి సంతోషంతో భర్త ధర్మతేజ ముఖంలోకి చూచింది. ఆ చూపుల్లో తన బిడ్డ ఎంతో వున్నతుడనే గర్వం.. తృప్తి వున్నాయి.

సరదా కబుర్లు.. భారత రాజ్యాంగ విధానాలు.. నాయకులు.. రాష్ట్రపాలనా విధానాలను గురించి మాట్లాడుకొంటూ భోంచేశారు. లేచారు.. అందరూ హాల్లో కూర్చున్నారు.

“నారాయణా!.. రెండు గంటలు విశ్రాంతి తీసుకోండి..”

“అలాగే!..”

ధర్మతేజ నారాయణకు బెడ్ రూమ్ చూపించాడు.. తండ్రీ కొడుకులు డన్లప్ కాట్ పై వాలిపోయారు.

“వదినా!.. అమ్మా.. పార్వతీ!.. మీరూ కొంతసేపు విశ్రాంతి తీసుకోండి..” అంది మాధవి.

“అలాగే వదినా!..” ఇంద్రజ.. పార్వతిలు మాధవి చూపించిన గదిలో ప్రవేశించారు. తలుపు మూసుకొన్నారు.

ధర్మతేజ.. మాధవీలు వారి బెడ్ ‍రూమ్‌లో ప్రవేశించారు.. ధర్మతేజ మంచంపై వాలాడు. ప్రక్కన మాధవి సాలోచనగా.

“పడుకో మధూ!..”

“నేను ఓ మాట అడగనా?..”

“ఏమిటా మాట!.. ఎందుకా సందేహం మధూ!..” ప్రీతిగా చిరునవ్వుతో అడిగాడు ధర్మతేజ..

“నారాయణ అన్నయ్యతో మన అన్నాకు పార్వతిని ఇచ్చి పెండ్లి చేయవలసిందిగా అడుగుదామా?..”

“మధూ.. నీకు పార్వతి నచ్చిందా!..”

“ఈనాడు కాదండీ.. పదినెలల క్రిందట చెన్నై వెళ్లి వాళ్ల ఇంట్లో వున్నామే.. అపుడే ఆమె నాకు నచ్చింది..”

“నారాయణ నా మాటను కాదనడు.. అన్నా ఏమంటాడో అనేదే నా అనుమానం.. లాస్యను వాడు..” చెప్పడం ఆపేశాడు ధర్మతేజ.

సాలోచనగా మాధవి .. “నేను వాడితో మాట్లాడతానండీ..” అంటూ మంచంపై వాలింది..

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here