యువభారతి వారి ‘విశ్వనాథ కవితా వైభవం’ – పరిచయం

0
9

[తెలుగు సాహిత్యం పట్ల కొన్ని తరాలలో ఆసక్తి రగిలించి, ఆధునిక తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తూ, యువతకు ఉత్తమ సాహిత్యం ద్వారా ఉత్తమ వ్యక్తిత్వాన్నివ్వాలని నిరంతరం తపించే యువభారతి సంస్థ స్థాపించి వచ్చే దసరాకు 60 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సాహిత్యానికి, సమాజానికి యువభారతి చేసిన సేవను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశంతో ప్రతి ఆదివారం సంచికలో యువభారతి ప్రచురించిన పుస్తకాల పరిచయం వుంటుంది. ఈ శీర్షిక వచ్చే సంవత్సరం విజయదశమి వరకూ సాగుతుంది.]

విశ్వనాథ కవితా వైభవం

[dropcap]ప్రా[/dropcap]చీన/అర్వాచీన సాహిత్యాలతో దిగ్మాత్రంగానైనా పరిచయం కలిగించాలనే ఉద్దేశంతో, సమకాలీన సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను సునిశితంగా, సమవేదనా దృక్కోణంతో పరిచయం కలిగించాలనే ఉద్దేశ్యంతో యువభారతి ‘సాహితీ వాహిని’ పరంపరను ప్రచురించింది.  ఈ పరంపరలో ఏడవ తరంగంగా వెలువడింది – ‘విశ్వనాథ కవితా వైభవం’.

విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రతిభ సర్వతోముఖం.  సాహిత్యం బహుముఖీనం. తెలుగు సాహిత్యంలోని అన్ని ప్రక్రియలను ఆయన తన అతిలోక ప్రతిభతో సుసంపన్నం చేశారు.  విశ్వనాథ వారు conscious artiste.  యువభారతి ప్రచురించిన ‘మహతి’ లోని తన వ్యాసంలో “నేను ఏమి వ్రాస్తానో నేను తెలిసికొని వ్రాస్తాను కనుక, నేను వ్రాసిన దానిలో అనంత విషయములను నేను చొప్పించి వ్రాస్తాను కనుక, అనాదినుంచీ ఈ దేశంలో ఒకటి జ్ఞానం అనిపించుకుంటూ వస్తున్నది; ఆ జ్ఞానం నా పాఠకులకు కల్పించి నేను సఫలుడినై వాళ్ళని జ్ఞానవంతులను చేస్తున్నాను అనే భావం నాకున్నది కనక, ఈ భావం ఉన్నవాళ్లు చాలామంది ఉన్నారని తెలుసును కనక.. “ అంటూ వ్యంగ్యంగా మహోన్నత ఆదర్శ శిఖరాలను అందుకొన్న ఒక మహా రచయిత లక్షణాలను పేర్కొన్నారు.

మన ప్రాచీన సాహిత్యంలోని విలువలను, అందాలను, రహస్యాలను సమకాలీన పఠితృలోకానికి సమర్థవంతంగా అందించిన మనీషి ఆయన. ఆయన నవలలు కానీయండి, కథలు కానీయండి, వ్యాసాలు కానీయండి, ఉపన్యాసాలు కానివ్వండి, మహాకావ్యాలు కానీయండి, ఖండ కావ్యాలు కానివ్వండి – పఠితలకు ఆనందాన్నే కాదు విజ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తాయి. ఆయన వాక్కులో, వాక్యంలో, శబ్దంలో, సమాసంలో, భావంలో, భావనలో, దర్శనంలో, విమర్శనంలో, భాషణంలో, భూషణంలో ఒక  వైలక్ష్యం వెల్లివిరుస్తుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వనాథ వారి సాహిత్యం భారతీయ ఆత్మావిష్కరణానికి ప్రతీక.  విశ్వనాథ వారి సాహిత్యంతో పరిచయం – విజ్ఞానప్రదమైన ప్రతిభతో పరిచయం.  భారతీయ సాహిత్యకులలో ఆయన సంపాదించుకున్నా స్థానం ఎంత సమున్నతమైనదో ఆయనకు లభించిన జ్ఞానపీఠం పురస్కారమే తెలుపుతోంది.

తెలుగు బావుటాను విశ్వసాహిత్యంలో ఎగురవేసిన కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రతిభా సర్వస్వమని చెప్పదగిన ‘శ్రీమద్రామాయణ కల్పవృక్షం’ నుండి కొన్ని పద్యాలకు శ్రీ జువ్వాది గౌతమరావు గారి కమనీయ వ్యాఖ్య ఈ పుస్తకం. అనంతముఖమైన విశ్వనాథ ప్రతిభను గురించి ఎంత చెప్పినా తక్కువే! విరాడ్రూపానికి ఎంతపీట వేసినా చిన్నదే !

క్రింద ఇవ్వబడిన link ను క్లిక్ చేసి ఈ పుస్తకాన్ని ఉచితంగానే చదువుకోండి.

https://archive.org/details/YuvaBharathi/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%A8%E0%B0%BE%E0%B0%A5%20%E0%B0%95%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4%E0%B0%BE%20%E0%B0%B5%E0%B1%88%E0%B0%AD%E0%B0%B5%E0%B0%82/

లేదా క్రింద ఇవ్వబడిన QR code ను scan చేసినా ఆ పుస్తకాన్ని ఉచితంగా చదువుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here