[మత్స్యకారుల జీవన విధానాన్ని, వారి జీవితాలలోని ఒడిదుడుకులను పద్య కావ్యం రూపంలో అందిస్తున్నారు శ్రీ ఆవుల వెంకట రమణ.]
పరిచయం:
[dropcap]స[/dropcap]ముద్రాలు! చూడడానికి చాలా ప్రశాంతంగానూ, గంభీరంగాను కనిపిస్తాయి. నగర పౌరులకు ఆ ఒడిలో సేద తీరాలని చాలా ఉబలాటం. సముద్రం కూడా అలల చేతుల్ని చాచి రా రమ్మని ఆహ్వానిస్తుంది. ఆ చల్లని సముద్రంలో దాగిన బడబానల మెంతో! ఆ సముద్రం పై ఆధారపడిన మత్స్యకారుల కుటుంబాలు ఎన్నో! ఎండకు ఎండి, వానకు తడిసి గంగమ్మ కరుణ కోసం సాగిలపడే వాళ్ళు నాగరిక ప్రపంచానికి కూతవేటు దూరంలో ఉన్నా, తమదైన కట్టుబాట్ల చట్టంలో జీవిస్తుంటారు. వారి ప్రతి ఆచారం ఆశ్చర్యకరం! ప్రతి కదలిక సాగరం మీదనే!
వారి జీవన విధానాల్ని వెలికి తీసి, వారి వృత్తిలో సంభవించే ప్రమాదాల్ని ‘కుసుమ వేదన’ అనే కావ్యం లోని పద్యాల ద్వారా మనకు వెల్లడిస్తున్నారు ‘మత్స్య కవి మిత్ర’ శ్రీ ఆవుల వెంకట రమణ.
ప్రథమాశ్వాసము – మొదటి భాగము
కథా ప్రారంభము
కం॥
శ్రీ శేష శైలవాసా
నీ సేవయె సుగతి నాకు నిక్కము జగతిన్
శ్రీశా తిరుమల గిరి ని
వాసా కావ్యం గొనుము వాసిగ ధరలో.
ఉ॥
శ్రీకరమైన బారతికి జెన్నుగ తూరుపు దిక్కునందునన్
ప్రాకటమైన రీతిగను బంగళ ఖాతమటంచు బిల్వరే
సాకెను జాలరుల్ జగతి; సర్వజనంబులు స్నానమాడగన్
యా కరవాక యందుననె యన్యపు జాతులు విశ్రమించగన్ (1)
ఉ॥
చల్లని పిల్ల దెమ్మెరలు చాలగ వీచున పయోధి తీరమున్
పల్లెల పట్నపుం బ్రజలు బాగుగ జేరి షికార్లు సల్పగన్
కొల్లలు కొల్లలై అలలు కొండొక రీతిని హాయి గూర్ప, యా
అల్లదె సంద్రతీరము మహాద్భుతమై యిల పెంపు నొందగన్. (2)
ఉ॥
రవి దొలి నేత్రముల్ దెరచు రాజిత కీర్తిని రంగరించగన్
యవిరళ కాంతి రేఖలతో యంతట లోకము వెల్గు పంచగన్
భువికిని జీవజాలముల భుక్తికి ముక్తికి లోటు కల్గగన్
భవితకు లోటు లేక నవ భారత జాతిని బెంపు జేయగన్. (3)
ఉ॥
దీరము నుండు జాలరుల తీర్చును యాకలి దప్పికాదులన్
దీరులు దెన్నులన్ గనక దాపున జేరగ నాదరించుచున్
కూరిమి మత్స్య సంపదల కూర్చుచు బెస్తల కుక్షి నింపుచున్
ధారుణి యన్నపూర్ణయని ధన్య్లు గొల్చెడి నీకు మ్రొక్కెదన్. (4)
సీ॥
ఎచ్చోటనో బుట్టి ఎచ్చటనో దిర్గి
ఇచ్చోటకై బర్వులెత్తు నదులు
కమలబాంధవు కాంతి కరమెత్తి ప్రసరించు
కమనీయ కోమల కల్పమిదియె
వరుణుండు కరుణించి వానల్లు గురిపించ
ఒడి చేర్చుకొనువాడు ఓర్మితోడ
కడుపు లోపల గొప్ప కాఠిన్యమును దాల్చి
కట్ట దాటక యుండు కడలి యతడు
తే.గీ.॥
ఎన్ని నోములు నోస్తిమో కన్నతల్లి
కడుపు పంటగ మమ్ముల గావు మమ్మ
కరుణ గురిపించు యమ్మరో కనికరమున
అవని జనులకు ధరలోన యమ్మలాగు. (5)
చం॥
సెలవులు నీయగన్ మదిని చెంగున గెంతుచు తృళ్ళిపాటుగన్
కలయుచు వత్తురీ బ్రజలు కయ్యము నెయ్యము గోరకుండ; యా
శెలవులు దప్పి వచ్చెదరు ఎక్కడి ఎక్కడొ మానవార్యులున్
అలలను జేరి మాటలతో యా జలరాశి జేరి జూడగన్. (6)
సీ॥
రత్నగర్భ యనుచు రత్నాకరంబని
ఎల్లవారలు బిల్వ వేడ్కతోడ
ముత్యాల సౌరులు ముంగిళ్ళ దొరలించు
కళల కాణాచి యా కడలి గాదె
‘అంబర’నెడి సుగంధంబును సృజియించు
సృష్టికర్తయు గాదె సూక్ష్మముగను
నాటికిన్ నేటికే నాటికైనను గాని
సాటి రాదింక యీ సాగరముకు
తే.గీ.॥
బలు దెరంగుల మేలును బ్రజకు జేసి
వారికానంద బంధుర వైననములను
మోదములరగ చేకూర్చు నాదరమున
జనని సాగర మాతరొ జయము కలుగు. (7)
కం.॥
తిరముగ నుండక జలములు
దరికిని కదలుచు నలలుగ ధారుణిలోనన్
పరిపరి విధముల జూసిన
జరజర ప్రాకెడు విధమున జారును వేగన్. (8)
సీ॥
గంగ కలసినంత గంగమ్మ తల్లిగా
చేరి మునుగుదురింక సారగుణులు
సెలవు దినములందు చెలగి తీరమునకు
చేర వచ్చెదరింక చెన్నలలర
సకుటుంబముల తోటి సపరివారంబుగా
తీరసాగరము చేరవచ్చు
అడుగు బెట్టిన తోడ యానందమును గూర్చు
ఆహ్లాద భరితయా అవని కడలి
తే.గీ.॥
మునిగినంత సేపు మదికి మోదమునిడి
ఐహిక సుఖమిచ్చి జనులకు ఆశజూపు
కనుకనౌ కద సాగర కర్రవాక
యనగ జనులకు మిగుల యానందమిచ్చు. (9)
సీ॥
సాగరమున రత్న సానువులుండును
తరచి జూడ నదియు తప్పుగాదె
సాగరమున మత్స్య సంపదలుండును
అదియు నిజము గదా యంతటయును
సాగరమున గొప్ప సౌగంధముండును
ఇది గూడ వాస్తవం బింపు మీర
సాగరమున బహు అచలంబులుండును
పరికించి జూడగా ప్రతిఫలించు
తే.గీ.॥
దీని ధాటికి వడకును దిక్కులన్ని
ఇతర జాతులు గూడను యిడుమలొందు
ఏమి చిత్రము నీ కడ లేమ నందు
ఆదమరిచెడి వేళ నసువు దీయు. (10)
ఉ.॥
అంతటి ఖ్యాతి గాంచినది యా మహనీయపు గొప్ప సాగరం
ఇంతగ చింతనొందెగద భీకర నీచపు మానవాళిచే
సుంత నెరుంగ లేకను సుశోభిత యంబుధి మస్కబారుచున్
అంతము నయ్యె మత్స్యములు; అయ్యయొనేమిటి? దుష్టకృత్యముల్. (11)
చం.॥
చెలియలి కట్టలంచుననె చేరెను బెస్తలనంత కాలమున్
చెలిమి యొనర్చి సంద్రమున చేపలు బట్టుచు పొద్దుబుచ్చగన్
బలయుతులేమి గారు బహు బాధల నొందుచు బత్కుచుండగన్
కలిమియు లేక లేమిబడి కాలము వెళ్ళగదీయుచుండిరే. (12)
చం.॥
అదియొక పల్లెటూరనగ యందున చేపలు పట్టుయూరు; యా
పదిలము నైనయూర బహు ప్రాకటమైన విధంబుగాను; పెం
పొదవెడు రీతి నిల్సె మరి పూని యెరుంగరు బాహ్యలోకమున్
సదమలమైన తీరుగను సాగెను వారల జీవితాలిలన్. (13)
సీ॥
కడు బీదరికముతో గడలంచులందున
గుడిసెల్ని బేర్చిన బడుగువారు
ఆకలి దప్పుల యారని మంటకున్
కడలిపై యాశతో గదలువారు
ఆరైన ఋతువుల అదనైన జగతిలో
ప్రతిరోజు వేటకు పయనమౌతు
చేపలవేటలో చెలగి సంద్రముపైన
సంధించి విడిసిన శరము లగును
తే.గీ.॥
ఇన్ని బాధల కోర్చుచు ఇల్లు జేరి
తెచ్చు చేపల నన్నియు తెంపు మీర
తగిన విలువను బొందెడు తెలివి లేక
అముకొందురు యీ రీతి అవని యందు. (14)
ఆ.వె.॥
ఇన్ని వందలేళ్ళు వెడలిపోగ
మార్పు లేదు వీరు మౌనమీడి
ముందు జేరి జనుల ముఖము మీద
అడుగరైరి మనసు నలుక వీడి. (15)
(సశేషం)