[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
సంగీతం లతాజీ తో ప్రారంభం, లతాజీ తోనే సమాప్తం – నితిన్ ముకేష్:
(లతా మంగేష్కర్‌కు నివాళిగా నితిన్ ముకేష్ – భారతి ఎస్. ప్రదాన్ గారితో జరిపిన సంభాషణ నుంచి)
***
28 సెప్టెంబరు 2019న లతాజీ 90వ జన్మదినం సందర్భంగా నేను – ‘నా వరకు నాకు సంగీతం లతాజీ తో ప్రారంభం, లతాజీ తోనే సమాప్తం’ అని అన్నాను.
ఆ వ్యాఖ్యలు నేరుగా నా హృదయం నుండి వచ్చాయి.
నాకు లతాజీ నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి తెలుసు. మా నాన్న స్వర్గీయ ముకేశ్ గారు లతాజీ కి అత్యంత ఆప్తులు. ఆవిడతో కలిసి నాన్న ఎన్నో మ్యూజిక్ షోలు చేశారు. వారిద్దరూ కలిసి ప్రయాణించారు, కలిసి పాటలు పాడారు. ఒక్కోసారి వారి వెంట అమ్మ కూడా వెళ్ళేది. నేను కడుపులో ఉండగా, ఒకసారి అమ్మ వాళ్ళిద్దరితో పాటు వెళ్ళింది. అప్పటి ఫోటో భద్రంగా ఉంది. అందుకే నేను లతాజీ నాకు నేను అమ్మ కడుపులో ఉన్నప్పటి నుండి తెలుసు అని అన్నాను.
ఆమెతో కలిసి ఎన్నో హిట్ పాటలు పాడే అదృష్టం నాకు దక్కింది. నా కెరీర్ లోనే అత్యధిక యుగళగీతాలు లతాజీ తోనే పాడాను. ‘క్రాంతి’ సినిమాలోని నాలుగు పాటలు ఇష్టం; ముఖ్యంగా ‘జిందగీ కీ నా టూటే లడీ’ బాగా ఇష్టం.
‘నూరీ’ కూడా ఇష్టమే. ఇంకా ‘మేరీ జంగ్’ లోని ‘జీత్ జాయెంగే హమ్’ నాకు బాగా ఇష్టం. ముఖ్యంగా కోవిడ్ సమయంలో ఈ పాటని ఎన్నిసార్లు పాడుకున్నానో లెక్కేలేదు. ఈ పాటలోని ‘జిందగీ హర్ కదమ్ ఏక్ నయీ జంగ్ హై, జీత్ జాయేంగే హమ్’ అనే పదాలు నాకే కాదు, ఎందరికీ ప్రేరణనిచ్చాయి. ‘అనారి’ సినిమాలో నాన్న పాడిన ‘కిసీ కె ముస్కురాహటోంపే హో నిసార్’ పాటని అప్పట్లో డాక్టర్లు, నర్సులు, సైనికులు, ఇంకా ఎందరో పాడేవారు, ఆ పాట నేటికీ బావుంటుంది.
నాన్న లతాజీతో పాడిన యుగళ గీతాలు గొప్పవి. రాజ్ కపూర్ ‘ఆహ్’ చిత్రంలోని పాట ‘ఆజా రే అబ్ మేరా దిల్ పుకారా’, ‘సావన్ కా మహీనా’ (మిలన్), ‘ఓ మేరే సనమ్’ (సంగమ్) – ఇలాంటి ఆణిముత్యాలెన్నో. ‘షోర్’ సినిమాలో ‘తూఫాన్ కో ఆనా హై, ఆకర్ చలే జానా హై.. తేరీ మేరీ కహానీ హై’ పాట నా ఫేవరెట్. ‘జిస్ దేశ్ మే గంగా బహతీ హై’ కోసం ‘ఆ అబ్ లౌట్ చలే’ పాటకి తన ‘ఆలాప్’ల ద్వారా ప్రాణం పోశారు లతాజీ. అది గొప్ప పాట. ఆ పాటకోసం హిందీ సినీ పాటల చరిత్రలోనే అత్యంత పెద్ద ఆర్కెస్ట్రా వాడారని తెలిసింది (శంకర్ జైకిషన్ ఈ గొప్ప పాటని రికార్డు చేశారు, కోరస్ గాయకులు మెట్ల మీద వరకూ నిలబడ్డారట. సౌండ్ రికార్డిస్ట్ మినూ కాత్రక్ అందరికీ మైక్‍లు అందేలా చూసి, ప్రతీ ధ్వనినీ అద్భుతంగా రికార్డు చేశారట).
నాన్న పాడిన ప్రతీ ‘అంతర’ తర్వాత లతాజీ ‘ఆజా రే’ అన్న పదాలతో ‘ఆలాప్’ల పాడారు. అవి రెండు పదాలే కావచ్చు.. కానీ ఆత్మాన్వేషణకి ప్రోత్సహిస్తాయి. ఎందరికీ ప్రీతిపాత్రమైన పాట. నేటికీ ఆకట్టుకునే పాట.
లతాజీ నాన్నని ‘ముకేశ్ భయ్యా’ అని పిలిచేవారు. నాన్న ఆమె కంటే ఆరేళ్ళు పెద్ద. అయినా ఆమెని ‘దీదీ’ అనేవారు. నాకు ఆశ్చర్యంగా ఉండేది, చిరాకుగానూ ఉండేది, వయసులో మీకన్నా చిన్నావిడని ‘అక్కా’ అని ఎలా పిలుస్తారని. ఆవిడని పేరు పెట్టి పిలవ వచ్చుగా అని నాన్నని అడిగితే, ఆయన చెప్పిన మాటలు నా మనసులో నిలిచిపోయాయి. “నేను ఆవిడని ‘దీదీ’ అని ఎందుకు పిలుస్తానంటే, ఆవిడ ఆ గౌరవానికి అర్హురాలు. ప్రతి ఒక్కరు ఆమెను అలా గౌరవించాలి” అన్నారు. తనొక్కరే కాక, మొత్తం ప్రపంచమంతా ఆవిడని అదే విధంగా గౌరవించాలని నాన్న భావించారు. అందుకే నేనూ కూడా ‘దీదీ’ అనే సంబోధించేవాడిని.
నాన్న చివరి కన్సర్ట్ టూర్ లో – 1976 నాటి ఆ దురదృష్టకరమైన పర్యటనలో నాన్న కన్నుమూశారు – మేం కెనడా వెళ్ళాం. అప్పట్లో టొరంటో లోని సిఎన్ టవర్ అత్యంత పొడవైన టవర్‍గా ఉండేది. ఆ టవర్ పై అంతస్తులో ఒక రెస్టారెంట్ కూడా ఉండేది. మేమంతా సైట్ సీయింగ్‍కి వెళ్ళినప్పుడు నాన్న తన రోలీఫెక్స్ కెమెరా తీసుకువచ్చారు. లతాజీని టవర్ ముందు నిలబెట్టి ఫోటో తీశారు. దానికి ‘The tallest tower in Canada with the tallest tower in the world’ అని కాప్షన్ పెట్టారు.
టొరొంటో లో నాన్న చివరి ప్రదర్శన ఇచ్చారు. డెట్రాయిట్ లో తదుపరి కచేరి చేయాల్సి ఉండగా నాన్న చనిపోయారు.
లతాజీ వారానికి రెండు షోలు మాత్రమే చేసేవారు. మిగతా రోజుల్లో రిహార్సల్స్ చేసేవారు లేదా సైట్ సీయింగ్‍కి వెళ్ళేవారు. నేను నాన్న వెంటే ఉండేవాడిని. సి.ఎన్.టవర్ వద్ద నాన్న లతాజీని ఫోటో తీసిన రోజున వారికి షో లేదు. అది 24 లేదా 25 ఆగస్ట్ 1976 కావచ్చు. లతాజీ కెనడా, అమెరికా పర్యటనలకి రావడం వెనుక ఓ కథ ఉంది.
అంతకు ముందు 1973, 1974లలో నాన్న ఒక్కరే అమెరికా సోలో ప్రదర్శనలు చేశారు. అక్కడి ప్రమోటర్లు ఇద్దరు యువకులు. ప్రదర్శనలు విజయవంతమయ్యాయి. నాన్నని బాగా చూసుకున్నారు. నాన్న కూడా వారి ప్రణాళికలను, నిర్వహణను మెచ్చుకున్నారు.
ప్రదర్శన ముగియడానికి వచ్చినప్పుడు వారిద్దరూ నాన్న దగ్గరకు వచ్చి కాస్త సంశయంగా, “లతాజీని అడిగితే అమెరికా షోలో పాల్గొంటారా?” అని అడిగారట.
లతాజీ అప్పుడే ఇంగ్లండ్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ప్రదర్శన ముగించుకుని వచ్చారు. ఇక ఏ షో చేసే ఉద్దేశంలో లేరు. సినిమాలకి పాడాల్సిన పాటలపై దృష్టి పెట్టాలనుకున్నారు.
కానీ నాన్న ఆ ప్రమోటర్లకి మాట ఇచ్చేసారు “అలాగే, ఎందుకు రారు? నేను ఆవిడతో మాట్లాడతాను. నా మాట కాదనరు” అన్నారు.
అదే జరిగింది. “మీరు మాట ఇచ్చినట్లయితే, నేను ఎందుకు కాదంటాను? పైగా మీరు చెప్పారుగా ఆ ప్రొమోటర్లు మంచివాళ్ళని, ఇంక నాకే ప్రశ్నలు లేవు” అన్నారు.
కానీ ఒక షరతు పెట్టారు. నాన్న లతాజీ సోలో ప్రదర్శనల గురించి ప్రమోటర్లతో మాట్లాడారు. “అయితే, మీరు నాతో పాడితేనే, నేను ఈ కచేరి చేస్తాను” అన్నారామె నాన్నతో.
ఇలా 1975 నుంచి నాన్న, లతాజీ కలిసి విదేశాల్లో ప్రదర్శనలిచ్చారు
ఆ ఏడాది ప్రదర్శన గొప్పగా జరిగింది. ఎంత విజయవంతమైందంటే, మరుసటి సంవత్సరం కూడా కచేరి నిర్వహించేంత. కానీ ఆ మరుసటి ఏడాది పర్యటన మధ్యలో నాన్నని పోగొట్టుకున్నాం. డెట్రాయిట్ లోనూ, ఫిలడెల్ఫియా లోను కచేరీలు రద్దు చేయాల్సి వచ్చింది. డెట్రాయిట్ కచేరీ కన్నా ముందు నాన్న అనారోగ్యానికి గురైనప్పుడు, ఆసుపత్రికి తీసుకువెళ్ళడానికి సుమారు 35-40 నిమిషాల సమయం మాత్రమే దొరికింది.
ఆ సమయంలో లతాజీ మాతోనే ఉన్నారు. నాకు ధైర్యం చెబుతూనే ఉన్నారు. కానీ నాన్న ఇక లేరనే వార్త అందింది.
గుండె పగిలిన లతాజీతో మేమంతా బసకి తిరిగి వచ్చాం. కానీ ఆవిడ చాలా ఉన్నతురాలు. తాను మళ్ళీ వచ్చి మిగిలిన ఆ రెండు షోలు చేస్తానని ప్రమోటర్లకు మాట ఇచ్చారు. ఎందుకంటే నాన్న పనిని అసంపూర్తిగా వదలకూడదని ఆమె అభిమతం. ఆ తరువాత మేం మరో రెండు షోలు చేశాం.
ఆ ప్రదర్శనలలో ఆమె “ముకేశ్ భయ్యా ఈ ప్రదర్శనలకి ముందు పరమపదించారు. నేను వారి అబ్బాయి నితిన్ ముకేశ్‍ని తీసుకువచ్చాను” అని చెప్పారు.
ఆమె నన్ను శ్రోతలకి పరిచయం చేసేవారు. కచేరీలలో నేను ఆమెతో కలిసి పాడేవాడిని. ఆ తరువాత నేను ఆవిడ బృందంలో ఓ భాగమైపోయాను. ఆవిడ ఏ కచేరీ చేసినా అందులో పాల్గొన్నాను.
లతాజీ ఏయే దేశాలలో పాడారో నేను జాబితా ఇవ్వలేను. ఆవిడ నన్ను తనతో పాటు అమెరికా, కెనడా, వెస్ట్ ఇండీస్, రష్యా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, ఫిజీ, దుబాయ్, మొత్తం యుఎఇ, మస్కట్, బహ్రైన్, యుకె, హాలండ్, బెల్జియం, ఫ్రాన్స్ తీసుకువెళ్లారు. ఇక మన దేశంలో కూడా చాలా ప్రాంతాలు కలిసి వెళ్ళాము.
ఆమె కచేరీ చేసే అన్ని చోట్లకి నన్నూ తీసుకువెళ్ళారు. మేం ఎక్కడికి వెళ్ళినా, తను బస చేసిన హోటల్ లోనే నాకు గది ఇచ్చేట్టు చూసేవారు. పైగా అవెంతో ఉత్తమమైన హోటళ్ళు. ఆమె కళ్ళ ద్వారా నేను ప్రపంచాన్ని చూశాను. నాకు దక్షిణాఫ్రికా వంటి దేశంలో 15,000 – 20,000 మంది ముందు పాడే అవకాశం వచ్చిందంటే, అది లతాజీ బృందంలో ఒకడినైనందువల్లే.
ఆ కాలంలో నేను చేసిన కృషి, ప్రపంచ వ్యాప్తంగా పాలొన్న అనేకానేక కచేరీలు – నన్ను – ముకేశ్ గారి కొడుకుగా – లతాజీ ప్రపంచానికి పరిచయం చేయబట్టే సాధ్యమైంది.
మేం వెస్ట్ ఇండీస్ వెళ్ళినప్పుడు – ఎయిర్ పోర్ట్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న జార్జిటౌన్ (అప్పట్లో దాన్ని బ్రిటీష్ గయానా అనేవారు) లో ఒక హోటల్‍లో బస ఏర్పాటు చేశారు. మేము వెడుతుంటే దారికి రెండు వైపులా మానవ సముద్రాలు! ఆ రోజు చంటి పిల్లాడు కూడా నిద్రపోయి ఉండడు – రోడ్డు మీదే ఉన్నాడంటే అతిశయోక్తి కాదు.
అక్కడి వాళ్లు భోజ్‍పురి హిందీలో మాట్లాడుతారు. స్థానిక మహిళలు “దీదీ, దీదీ, ఇస్ తరఫ్ దేఖో” అని అరుస్తున్నారు. మగవాళ్ళు కారు ముందు సాష్టాంగ ప్రణామాలు చేస్తున్నారు. మా బండ్లు నత్తనడక నడుస్తున్నాయి, కారును అసలు ముందుకు సాగనివ్వడం లేదు అభిమానులు. మా ముందూ, వెనుక పోలీస్ ఎస్కార్ట్ కూడా ఉంది. అయినా ఉపయోగం లేకపోయింది. చివరికి కారు హుడ్ పైకెత్తి లతాజీ లేచి నిలబడి, చేయి ఊపుతూ అందరికీ అభివాదం చేశారు. జనాలు ఆమె పైకి పూలు, పూల రేకలు విసిరారు.
ఎలిజబెత్ రాణికి లేదా మరే ఇతర గొప్పవారికి కూడా ఇటువంటి స్వాగతం లభించలేదని ప్రమోటర్లు, స్థానికులు తెలిపారు. నేను స్వయంగా చూశాను, చూడకపోతే నేను నమ్మకపోదును. 60 కిలోమీటర్ల దూరం వెళ్ళడానికి మాకు కొన్ని గంటల సమయం పట్టింది. ఎప్పుడు చూసినా హోటల్ బయట జనాలు నిలబడి ఉండేవారు. ఆమె కచేరీ టికెట్లన్నీ వారాల ముందే అమ్ముడుపోయేవి.
ఆమె ఎక్కడికి వెళ్ళినా, పాడడానికి కొన్ని క్షణాల ముందు హాలంతా నిశ్శబ్దమైపోయేది. పాట పూర్తయ్యాకా, గట్టి చప్పట్లతో హాలంతా దద్దరిల్లిపోయేది. ఆమె పాడిన ప్రతీసారి గట్టిగా అభినందించక తప్పదు.
నాకు ఆమె పట్ల ఇష్టం, గౌరవం నాకు సంగీతం పట్ల ఆసక్తి కలగగానే ప్రారంభమయ్యాయి. అప్పుడు నా వయసు ఐదేళ్ళు. బడి మానేసి నాన్నతో కలిసి రికార్డింగులకి వెళ్ళేవాడిని. నాన్న కూడా సంతోషంగా తీసుకువెళ్ళేవారు.
ఇతరులకి కాస్త కష్టం కలిగినా, నాకు లతాజీ పాటలు తప్ప మిగతావారివి వినడం ఇష్టం ఉండదనే చెప్పాలి. సాయంత్రపు నడకలో లేదా రాత్రి పడుకునే ముందో, లేదా మధ్య రాత్రి మెలకువ వచ్చినప్పుడో, ఏదైనా పాట వినాలనిపిస్తే, అది ఆవిడ పాటే అవుతుంది. నాకు సాంత్వన కలిగిస్తుంది. నా ప్లే లిస్ట్‌లో అన్నీ ఆవిడ పాటలే. ఈ భావన నాకొక్కడికే కాదని, నాలాంటి వారు ప్రపంచంలో ఎందరో ఉంటారని నాకు అనిపిస్తుంది.
ఆవిడ పాటల భాండాగారంలోంచి ఏదైనా ఫేవరెట్ పాటని ఎంచుకోవడం చాలా కష్టం. నా ప్లేలిస్ట్ లో లతాజీవి దాదాపు 500 పాటలున్నాయి. ‘మధుమతి’ సినిమాలోని ‘జుల్మీ సంగ్ ఆంఖ్ లడీ’, ‘షాగిర్ద్’ లోని ‘రుక్ జా యే హవా’ వీటిలో ప్రధానమైనవి. ‘అనుపమ’ లోని ‘కుఛ్ దిల్ నే కహా’ తప్పనిసరిగా వినాల్సిందే. ఆవిడ పాడిన వేలాది పాటల్లోనుంచి ‘గైడ్’ చిత్రం లోని ‘పియా తోసే నైనా లాగే రే’ కూడా నాకు బాగా ఇష్టం.
‘దిల్ అపనా ప్రీత్ పరాయా’ చిత్రంలో లతాజీ పాడిన ‘అజీబ్ దాస్తాన్ హై యే’ మా ఇంట్లో అందరికీ నచ్చే పాట. నా మూడేళ్ళ మనవరాలు (నీల్ నితిన్ ముకేశ్ కుమార్తె) నుర్వి కి కూడా ఈ పాట కంఠతా వచ్చు. చిన్నప్పుడు నాన్న వెంట రికార్డింగులకి వెళ్ళి ఆమె గాత్ర మాధుర్యం పట్ల ఆకర్షితుడనయ్యాను. చిన్నపిల్లాడి నుంచి యువకుడిగా, యువకుడి నుండి సీనియర్ సిటిజన్‍గా మారినా, ఆమె పట్ల ఆరాధన తగ్గలేదు. ఆమె నిరాడంబరత, ఆమె హుందాతనం, ఆమె పొడవాటి కేశాలు – నాకు అన్నీ నచ్చేవి.
తనతో కలిసి అత్యధిక కచేరీలు చేసిన గాయకుడిని నేనేనని ఆవిడ నాతో ఒకసారి అన్నారు. నాన్న రెండే విదేశీ పర్యటనలు చేశారు, కొన్ని ప్రదర్శనలే ఇచ్చారు. ఆయన చనిపోయాకా, లతాజీ చాలా స్టేజి షోలు చేశారు, 1990ల చివరి వరకూ కూడా చేశారు. దేశంలోనూ, విదేశాలలోనూ జరిగిన ఆమె కచేరీలలో నేనూ భాగమయ్యాను. ఈ కచేరీలలో నాతో లతాజీ ఎక్కువ పాటలు పాడారని నేను సొంత డబ్బా కొట్టుకోను. కాని ఆమెను నేను అత్యంత సన్నిహితం చూశానని, ఆమె నుంచి ఎంతో నేర్చుకున్నానని మాత్రం చెప్పగలను.
ఆమెది దివ్యమైన స్వరం మాత్రమే కాదు. ఆమె నుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉంది. ఆమె సమయపాలన, పర్ఫెక్షనిజం, నిబద్ధత. స్టేజి మీద ఆమె ప్రదర్శనలు, ఆమె వ్యాఖ్యానం నిస్సందేహంగా దోష రహితంగా ఉండేవి.
విజయ శిఖరాలకు చేరాకా కూడా, పర్యటనలలో కచేరీలు ఉన్నాయంటే, ఆవిడ ప్రతీ రోజూ ఉదయం తప్పకుండా సాధన చేసేవారు. ఉదాహరణకి షో సాయంత్రం ఆరున్నరకి అనుకోండి, ఆవిడ మేం బస చేసిన హోటల్‍లోని బాంక్వెట్ హాల్‍లో ఉదయం తొమ్మిదిన్నరే పూర్తి స్థాయి రిహార్సల్స్ చేయించేవారు.
విదేశాలలో కచేరీ ఉంటే, పర్యటనకి నాలుగు నెలల ముందు బొంబాయిలో రిహార్సల్స్ ప్రారంభించేవారు. ప్రతీ రోజు కాకపోయినా, వారాంతాలలో ఒక స్టూడియో గాని లేదా తమ భవనంలోనే హాల్ బుక్ చేసి వాద్యకారులను, తదితరులను పిలిపించి సాధన చేసేవారు. దేన్నీ తేలికగా తీసుకునేవారు కాదు. అది అంతకు ముందు చాలా సార్లు పాడిన పాట అయినా సరే, సాధన సాగవలసిందే. అదే ఆమెను తోటివారి కన్నా భిన్నంగా నిలిపింది, ఆమెను పరిపూర్ణురాలిగా చేసింది. నేను లక్ష తప్పులు చేసేవాడిని, కానీ లతాజీ ఒక్క తప్పు కూడా చేసేవారు కాదు. శ్రుతి తప్పడం కానీ, పొరపాటు దొర్లడం కానీ జరిగేది కాదు.
‘దీదీ’ నుంచి నేను సమయపాలన నేర్చుకున్నాను. ఆమెను చూసి మన గడియారాన్ని సరి చేసుకోవచ్చు. ఒక షో సందర్భంగా, మమ్మల్ని 5.30కి లాబీలో ఉండమన్నారనుకొందాం, లతాజీ 5.29కే వచ్చేస్తారు, మేం ఎవరైనా 5.31కి చేరితే, ‘ఆలస్యమైంది’ అన్నట్లుగా చూసేవారు.
టికెట్ మీద ప్రదర్శన సమయం 6.30 అని ముద్రించి ఉంటే, ఆవిడ 5.45 కల్లా ఆడిటోరియంలో ఉంటారు. 6.20కి మైక్ ముందు నిలుస్తారు. ఖచ్చితంగా 6.30కి తెర లేస్తుంది. తన సోదరుడు హృదయనాథ్ స్వరపరిచిన భగవద్గీత శ్లోకంతో లతాజీ గానం ప్రారంభిస్తారు.
ఆమె స్థాయికి ఆమె కాస్త రిలాక్స్ కావచ్చు అని కొందరు అనుకోవచ్చు, కానీ ఆవిడ ఎంతో క్రమశిక్షణ కలవారు. మచ్చల్లేని తెల్లటి చీర ధరించి, స్టేజి మీదకు వెళ్ళేటప్పుడు చెప్పులు విడిచి వెళ్ళేవారు. వాతావరణం బాగా చల్లగా ఉంటే, ఆమె నిలుచునేందుకు స్టేజి మీద చిన్న చాపలాంటిది ఉంచేవారు. ఆమె స్టేజిని పూజించేవారు, అందుకని స్టేజి పైన చెప్పులు వేసుకునేవారు కాదు. ఎన్నో ఏళ్ళ పాటు నేను దాన్ని పాటించాను.
ఆమె వంటి గురువులు మీ ముందు ఉన్నప్పుడు, వారు కూర్చుని మీకేమీ నేర్పించరు. వారిని గమనించి, వారు ఎందుకు నాయకులయ్యారో మీరే గ్రహించాలి. ఒక పెద్ద క్యూ లైన్‍లో వారు మీ ముందు ఎందుకున్నారు? వారి గొప్ప లక్షణాల వల్లే!
ఆమె స్వరాన్ని ఎవరూ అనుకరించలేరు, అనుసరించలేరు అన్న విషయాన్ని మరిచిపోకూడదు. ఆమె నుంచి నేర్చుకోవలసిన లక్షణాలు ఎన్నో ఉన్నాయి. తన తండ్రి గారంటే ఆమెకి ఎంతో గౌరవం. అయితే ఆమె ‘తండ్రిని ప్రేమించాలి’ అని నాకేమీ నేర్పలేదు. ప్రతిభాపాటవాలలో అందరినీ దాటి ముందుకు వెళ్ళిపోయినా, ఎంతో వినమ్రంగా “ఈ రోజు నేనిలా ఉన్నానంటే అందుకు కారణం మా తండ్రి గారే” అని చెప్తారు.
శిఖరాగ్రంపై నిలిచి ఉన్నప్పుడు ఇలా చెప్పడం చాలా గొప్ప విషయం.
వినాయక చవితి పండుగ సందర్భంగా ఇంట్లో గణపతి పూజ చేయడం మాకు ప్రతీ సంవత్సరం ఓ ఆనవాయితీ అయింది. ఇంటికి గణపతిని తేవడం – నేను నా చిన్నప్పుడు లతాజీ నుంచి, లక్ష్మీకాంత్ (సంగీత దర్శకులు) ఇళ్ళలో పండుగ గొప్పగా చేయడం చూసి నేర్చుకున్నాను. వాళ్ళల్లా పండుగకి ఇంట్లో పూజ చేయడం అలవాటు చేసుకున్నాను. గణపతి ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని లోయర్ పరేల్ లోని మా కొత్త ఇంటిని డిజైన్ చేయిస్తున్నాడు మా అబ్బాయి నీల్.
లతాజీకీ నాకూ పెర్ఫ్యూమ్స్ అంటే బాగా ఇష్టం. 1976లో లతాజీ వెంట విదేశీ పర్యటనలకి వెళ్ళడంతో ప్రారంభయింది ఈ ఇష్టం.
విమానం బయల్దేరగానే, నేను నాకిష్టమైన ‘Diorissimo’ అనే పెర్ఫ్యూమ్ కొని ఎయిర్‌హోస్టెస్‌తో ఫస్ట్ క్లాస్‌లో ఉండే లతాజీకి పంపేవాడిని. అప్పట్లో మేము ఎయిర్ ఇండియా విమానాలలో ప్రయాణించేవారం. అందుకని చాలామంది సిబ్బందికి ఆమె తెలుసు. “ఆవిడకి ఇవ్వండి, ఎవరు పంపించారో ఆవిడకి అర్థమవుతుంది” అనేవాడిని. లతాజీ ఎంతో థ్రిల్ అయ్యేవారు.
ఒక్కోసారి మేమిద్దరం ఒకరికొకరు కానుకలుగా పెర్ఫ్యూమ్స్ ఇచ్చి పుచ్చుకునేవారం. మా అమ్మకి కాని నా భార్యకి గాని, నాకు గాని ఆవిడ ఓ పెర్ఫ్యూమ్ తెచ్చేవారు. ఓ పదేళ్ళ క్రితం, నేను అమెరికా నుంచి ఆవిడకి ఫోన్ చేసి “దీదీ షాపింగ్‍కి వెడుతున్నాను, మీకు ఏ పెర్ఫ్యూమ్ తీసుకోను?” అని అడిగాను.
ఆవిడ సిగ్గుగా, “వదిలేద్దూ, నా దగ్గర ఇప్పటికే చాలా ఉన్నాయి” అన్నారు. అయినా నేను ఆమెకు ప్రతీసారి ఏదో ఒక పెర్ఫ్యూమ్ కొనేవాడిని.
వజ్రాల వ్యాపారంలో భారతీయులు ముందున్నారు. గుజరాతీలు, జైనులు, మరి కొందరు భారతీయులు ఈ వ్యాపారంలో ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉన్నారు. వారివి ఉత్తమమైన దుకాణాలు, వారు అత్యంత నిజాయితీపరులు కూడా. న్యూయార్క్ లో వజ్రాల వ్యాపారి అయిన నా మిత్రుడి దుకాణానికి ఆవిడని తీసుకువెళ్ళాను.
నేను ఆవిడని అక్కడికి తీసుకువస్తున్నానని తెలిసిన నా మిత్రుడు సంతోషంతో గంతులు వేశాడు. మిగతా సమయమంతా ఆఫీసు మూసేశాడు. అందరినీ అక్కడ్నించి పంపివేశాడు. లతాజీ పక్కనే ఉండి అన్నీ ఉత్సాహంగా చూపించాడు. ఆమెకి ఆ షాపింగ్ నచ్చింది. లతాజీకి వజ్రాలంటే బాగా ఇష్టం, కానీ తానే ఓ కోహినూర్ వజ్రం లాంటివారన్న సంగతి ఆమె మర్చిపోయారు.
ఆమె భోజనప్రియురాలు. ఆమె తినే ఆహారం ఎంతో రుచిగా ఉండాలి. లేకపోతే ఆ పదార్థాన్ని పక్కన పెట్టేస్తారు. ఆమెకి సన్నిహితులైన మేనకోడళ్ళు, మేనల్లుళ్లకి (ఆశా గారి అబ్బాయి నందూ లాంటి వాళ్ళు) లతాజీ కోడ్ లాంగ్వేజ్ బాగా అర్థమవుతుంది. ఆమె సంకేతం గ్రహించగానే, ఆమెకు నచ్చని పదార్థాన్ని టేబుల్ మీద నుంచి తీసేసేవారు. రుచికరమైన ఆహారాన్ని ఎంతో ఇష్టంగా తినేవారామె.
43 ఏళ్ళ క్రితం నేను నా సోదరి నీలూని కోల్పోయిన రోజు నుంచి నేను శాకాహారిగా మారాను. అంతకు ముందు ఒకసారి లతాజీ కోల్హాపూర్ తీసుకువెళ్ళి ‘పంధర రస’ అనే ఓ పదార్థాన్ని రుచి చూపించారు. తెల్లటి కోకోనట్ గ్రేవీలో మాంసాన్ని ఉడికించిన వంటకం అది. ఆవిడకి వంట చేయడం కూడా ఇష్టం. ఆమె నివాసమైన ప్రభుకుంజ్ లోని హాల్‍లో మేము రిహార్సల్స్ చేసినప్పుడు ఒక్కోసారి ఆమె, నాతో “ఆజ్ తూ ఊపర్ హీ ఖానా ఖానా” (ఈ రోజు నువ్వు పైన భోం చెయ్యి) అనేవారు. అంటే ఆ రోజూ ఆమె స్వయంగా ఏదో ఒక వంటకం తయారు చేశారన్న మాట.
ఒకసారి బాగా తలనొప్పిగా ఉందని, ఐస్ క్రీమ్ తినాలని ఆమె అంటుండగా విన్నాను. అయితే తన స్వరం కోసం తగు జాగ్రత్తలు తీసుకునేవారు, తన దినచర్యని ఖచ్చితంగా పాటించేవారు. ఐస్ క్రీమ్, ఆహారం, పచ్చళ్ళను ఎంతో ఇష్టపడేవారు.
కుటుంబాన్ని అమితంగా ప్రేమించి, కుటుంబ సభ్యులని సన్నిహితంగా ఉంచినవారిలో ఆమె ఒకరు. ఈ విషయం గురించి చెప్పడానికి నా స్థాయి సరిపోదు. అయితే కుటుంబం పట్ల ఆమె నిబద్ధత ఎలాంటిదంటే, పెళ్ళి చేసుకోకుండా అవివాహితగానే ఉండిపోయారు. ఆమె చెల్లెళ్ళు, తమ్ముడు, వాళ్ళ పిల్లలే ఆమె లోకం. వాళ్ళల్లో ప్రతి ఒక్కరి కోసం ఆమె ఎంతో చేశారు. వారికి ప్రపంచాన్ని చూపారు.
కుటుంబం ఎంత ముఖ్యమో, కుటుంబం పట్ల ఎంత బాధ్యతగా ఉండాలో నేను ఆమె నుంచీ నేర్చుకున్నాను. నన్ను కూడా తన కుటుంబంలో ఒకరిగా పరిగణించారు లతాజీ. ఏదైనా పండగ వచ్చినా, లేక ఏదైనా విదేశీ పర్యటన అయినా నన్ను పిలిచేవారు. అమెరికాలో షోలు ముగిసాకా, మేం లాస్ వేగాస్, లాస్ ఏంజిలిస్, డిస్నీలాండ్ వెళ్ళాము. డిస్నీలాండ్‌లో లతాజీ చిన్నపిల్ల అయిపోయారు. అక్కడ కూడా ఆమె తన భారతీయతని మరువలేదు. సల్వార్ కమీజ్ ధరించి, పైన లెదర్ జాకెట్ వేసుకున్నారు.
ఆమెకి ఫొటోగ్రఫీ కూడా చాలా ఆసక్తి. గొప్ప ఫొటోగ్రాఫర్ కూడా. ఆవిడ దగ్గర రకరకాల కెమేరాలు ఉన్నాయి. కెమేరాలను కానుకగా ఇచ్చిపుచ్చుకునేవారు. ఆమె స్వయంగా ఓ ప్రపంచస్థాయి ఫొటోగ్రాఫర్. ఆమె స్థాయి నైపుణ్యం ఉన్నవారు ఆయా రంగాలలో నాయకులై ఉంటారు. ఆమె కనుక డాక్టర్ అయి ఉంటే, ప్రపంచంలో నెంబర్ వన్ డాక్టర్ అయి ఉండేవారు. ఎందుకంటే ఆమె నిబద్ధత అలాంటిది, ఆమె ఫర్ఫెక్షనిజం అలాంటిది.
నాన్న చనిపోయాకా, తాను తీసిన నాన్న ఫొటోలను ఆమె నాకు పంపించారు. ఆవిడకి సైట్ సీయింగ్ అన్నా, వన్యప్రాణుల సందర్శన అన్నా బాగా ఇష్టం. నన్ను ఆవిడ కెన్యా (ఈస్ట్ ఆఫ్రికా) తీసుకువెళ్ళి ఎన్నో సఫారీలు చూపించారు. ‘మసాయి మారా’ లోని మౌట్ కెన్యా సఫారీ క్లబ్‍కి తీసుకెళ్లారు. నిజానికి ప్రదర్శన ముగిసాకా, నాకు విమానం టికెట్ తీసి నన్ను ఇండియాకి పంపించేయవచ్చు, కానీ ఆవిడ అలా చేయలేదు. నన్ను సొంతమనిషిలా చూసుకున్నారు.
ఆమెకి వయసు మీరుతున్న కొద్దీ మేము వ్యక్తిగతంగా కలవడం తగ్గింది. గత అయిదారేళ్ళుగా మేం వాట్సప్ ద్వారా మాట్లాడుకుంటున్నాం. 2019లో ఆవిడకి 90 ఏళ్ళు పూర్తయ్యాయి. ఆమె జన్మదినం నవరాత్రుల మొదటిరోజున వచ్చింది. సాధారణంగా, నేను నవరాత్రుల సందర్భంగా మాతా అంబాజీ మొదటి దర్శనం చేసుకుంటాను. లతాజీకి ఫోన్ చేసి, శుభాకాంక్షలు చెప్పి, ‘మాతా అంబాజీ దర్శనానికి వెడుతున్నాను, మీకోసం ఏమైనా చేయాలా’ అని అడిగాను. ఆమె కొంత మొత్తం చెప్పి, ఆ మొత్తాన్ని తన పేరిట అమ్మవారికి విరాళంగా అర్పించమన్నారు. అలాగేనని చెప్పి, ఆమె పేరిట పూజ చేయించి, ప్రసాదం కోసం కూపన్ తీసుకున్నాను. పేరు రాయాల్సిన చోట, ‘లతా మంగేష్కర్, భారతదేశపు పుత్రిక’ అని వ్రాశాను. దాన్ని ఫొటో తీసి ఆవిడకి వాట్సప్‍లో పంపాను.
ఏప్రిల్ 2021లో సెకండ్ వేవ్‍లో, నాకూ, మా మొత్తం కుటుంబానికి కోవిడ్ సోకినప్పుడు ఆమె మాకెంతో చేశారో ఎలా మర్చిపోగలం? ఈ సంగతి ఆవిడకి టివీ వార్తల ద్వారా తెలిసింది. మా ఆరుగురికి పాజిటివ్ అని తేలడంతో మేమెంతో భయపడ్డాం. సెకండ్ వేవ్, ఎంతో ఉధృతంగా, భయానకంగా ఉంది.
ఆవిడకి ఈ విషయం తెలియగానే, నాకు ఫోన్ చేసి, “మీ కుటుంబానికి ఏమీ కాదు. మీ అందరి కోసం నేను ప్రార్థిస్తాను” అన్నారు.
ఆమె నోట ఆ మాట రావడమే మాకు ఓ దీవెన అని భావించాను. “ముకేశ్ భయ్యా గొప్ప రామభక్తులు. అందుకని నేను మీకు ‘రామదర్బార్’ ప్రతిమ పంపిస్తాను. దాన్ని మీ మందిరంలో పెట్టుకోండి. రాముడు మీ కుటుంబాన్ని కాపాడతాడు” అన్నారు
తన కంసాలితో ఒక వెండి ‘రామదర్బార్’ ప్రతిమ తయారు చేయమని పురమాయించారు. ఒకటి రెండు రోజులలో అది సిద్ధం కాగానే మా డ్రైవర్‍ని పంపించాను. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి దాన్ని తీసుకుని మా ఇంటికి వచ్చాడు. కోవిడ్ కేసులు అధికంగా ఉన్నందువల్ల ముందు జాగ్రత్తగా వారి ఇంట్లో మొదటి అంతస్తుకి బయటి వాళ్ళని ఎవరినీ పంపడం లేదు. ఆ ‘రామదర్బార్’ ప్రతిమ మాకెంతో భరోసానిచ్చింది.
అప్పటి నుంచి మేం ఏదో ఒక ప్రార్థనాగీతాన్నో లేదా భజనని గాని, లేదా నాన్న ఫోటోలు గాని లేదా లతాజీ నేను ఉన్న ఫోటోలు గాని షేర్ చేసుకునేవాళ్ళం. ఒక్కోసారి ఆవిడ నాకు నాన్న పాడిన పాటల లింక్ లేదా వాళ్ళిద్దరూ పాడిన యుగళగీతాల లింక్ పంపేవారు. ఒక్కోసారి “మీరంతా ఎలా ఉన్నారు? గుర్తొస్తున్నారు. అందరూ బాగున్నారు కదా. మీకు దీవెనలు” అని వాయిస్ మెసేజ్ పెట్టేవారు.
అంత వయసులోనూ ఆవిడ మానసికంగా ఎంతో దృఢంగా ఉండేవారు.
పాండమిక్ కాలంలో మేం తరచూ వాట్సప్‍లో మాట్లాడుకున్నాం. దీదీ నుంచి నాకు 4 జనవరి 2022 నాడు చివరి మెసేజ్ వచ్చింది – ‘జిందగీ కీ నా టూటే లడీ’ అని.
అయితే 4 జనవరి 2022 నుంచి ఆవిడ నుంచి నాకే మెసేజ్ రాలేదు. నాకు కాస్త కంగారుగా అనిపించింది. ఎందుకంటే, ఆవిడ అన్ని రోజుల పాటు నాతో మౌనంగా లేరు.
ఓ రోజు నీల్ ఫోన్ చేసి, “నాన్నా మీకీ విషయం తెలుసా? దీదీకి ఒంట్లో బాలేదట” అని చెప్పాడు.
అప్పుడు నేను దీదీ మేనకోడలు రచనకి ఫోన్ చేసి అడిగాను. ముందు జాగ్రత్తగా లతాజీని ఆసుపత్రిలో చేర్చామని చెప్పింది. ఆసుపత్రిలో ఆమె ఆరోగ్యం దృష్ట్యా ఎవరినీ ఆమె దగ్గరికి వెళ్ళనివ్వలేదు.
అయితే 4 జనవరి తర్వాత నాకెందుకో అపశకునంగా తోచింది. ఆవిడ దగ్గర నుండి మెసేజ్ లేకుండా ఇన్ని రోజులు ఎప్పుడు గడవలేదు.
నా జీవితంలో దీదీ ఒక దివ్య వనిత. లతా మంగేష్కర్ లేని ప్రపంచాన్ని ఊహించలేను.