మేనల్లుడు-17

0
3

[ఇండియాకి ఫోన్ చేసి నారాయణరావుతో మాట్లాడుతారు అమ్మూ, వివేక్. తాను వివేక్‍కి వండి పెడుటున్నట్లు నాన్నతో చెబుతుంది. నీకు వంట రాదుగా, అమ్మని పంపించనా అని ఆయన అంటాడు. లేదు, తను చేసిన వంటని వివేక్ ఇష్టంగా తిన్నాడని చెబుతుంది అమృత. కాసేపు మాట్లాడాక ఫోన్ పెట్టేస్తారు. అక్కడ అమృత తల్లి కూతురు వివేక్‍కి వండి పెడుతున్నందుకు ముచ్చట పడుతుంది. అది ఆడపిల్లల గొప్పతనం అని సుమిత్ర అంటుంది. నారాయణరావు సంతోషిస్తాడు. తనని తన స్నేహితురాలు సౌమ్య ఇంటికి తీసుకువెళ్లమని అడుతుంది అమృత. కొన్నాళ్ళు ఫోన్‍లో మాట్లాడుకున్నామనీ, ఈమధ్య తన ఫోన్ ఎత్తడం లేదని అంటుంది. అడ్రసు కనుక్కుని వాళ్ళింటికి వెళ్తారు. సౌమ్య అమ్మూని చూసి విసుక్కుంటూ తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంటుంది. ఆమె ప్రవర్తనకీ, క్రుంగుబాటుకి కారణం చెప్తాడు ఆమె భర్త పవన్. మేనరికం వివాహం వల్ల వాళ్ళ బాబు లోపాలతో జన్మిస్తాడు. బాబుని చూసినప్పటి నుండి సౌమ్య డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిందని పవన్ చెప్తాడు. అమృత, వివేక్ బాధపడతారు. వివేక్ డాక్టర్ అని తెలుసుకుని, సౌమ్య బాగయ్యే అవకాశం ఉందా అని, మరో బిడ్డ పుడితే ఆరోగ్యంగా పుట్టే అవకాశం ఉంటుందా అని పవన్ అడుగుతాడు. ముందు సౌమ్య మామూలుగా కావడం ముఖ్యమని, ఆమెని చూసిన డాక్టరు వివరాలు, రిపోర్టులు అవీ తనకి పంపితే పరిశీలిస్తానని అంటాడు వివేక్. కారులో తిరిగి వస్తుండగా అమృత, వివేక్ మాట్లాడుకుంటారు. మేనరికాల గురించి తెలిసి కూడా తనని పెళ్ళి చేసుకోడానికి వివేక్‍ ఒప్పుకున్నాడని అంటుంది అమృత. తాను ఏం చేసినా మావయ్య కోసమే అంటాడు. వివేక్‍ని తప్పుగా అర్థం చేసుకున్నానని అంటుంది అమృత. – ఇక చదవండి.]

[dropcap]ఇ[/dropcap]ల్లు చేరారు. వాళ్ళ సంభాషణ కొనసాగుతోంది.

“కాని.. నువ్వు నాకొక మాట ఇవ్వాలి.” అంది అమ్మూ.

అర్థం కానట్లు చూసాడు వివేక్.

“చెప్పు వి.వీ!..” అని గభాలున చెయ్యి చాచి “ప్రామిస్ చేయి.. ప్లీజ్ ప్రామిస్ చెయ్యి మామూ!” అంది..

“దేని గురించి అమ్మూ?” అన్నాడు.

“ఏం? దేని గురించో చెబితే గాని ప్రామిస్ చెయ్యవా?.. సరే!.. నేనే చెప్పేస్తాను.. నువ్వు అర్జంటుగా పెళ్ళి చేసుకోవాలి.. ”

కంగారుగా అన్నాడు.. “నేను పెళ్ళి చేసుకోవడం ఏమిటి?..”

“నువ్వే మామూ!.. నువ్వే అర్జంటుగా పెళ్ళి చేసుకోవాలి. నీకు పెళ్ళయిపోతే నాకు నిశ్చింతగా ఉంటుంది” అంది.

“నేను పెళ్ళి చేసుకుంటే నీకు నిశ్చింతగా ఉంటుందా?”

“అవును.. నేను నిజం చెబుతున్నాను మామూ!.. నా కోసం.. నువ్వు అర్జంటుగా పెళ్ళి చేసుకో!.. నేను దగ్గరుండి నీ పెళ్ళి జరిపిస్తాను..” అని గభాలున వివేక్ భుజం మీద చెయ్యి వేసి.. “ప్లీజ్ మామూ! అమ్మూ అంటే నీకు ప్రాణం, నా కోసం ఏదైనా చేస్తావు కదా?” అని ఏదో గుర్తు వచ్చిన దానిలా.. “అన్నట్లు నువ్వు ఎవరినైనా ప్రేమించావా? హుఁ.. నువ్వు.. అలాంటి వాటి జోలికి పోవులే!.. ఎందుకంటే.. నువ్వు USA వెళ్ళాక ఎన్నో సార్లు అడిగాను.. వి.వీ.. ఎవరినైనా లవ్ చేస్తున్నావా?. అలా అడిగితే నువ్వు చెప్పిన సమాధానానికి ఎంత సేపు నవ్వుకున్నానో తెలుసా?”

“ఏం చెప్పాను? అస్సలు నాకు గుర్తు లేదు.”

“అయ్యో!.. గుర్తు లేదా?.. లవ్ చేయడానికి టైమ్ ఎక్కడుంది?.. అన్నావు, సరే.. నేనే మంచి అమ్మాయిని.. నీకు సూట్ అయ్యే అమ్మాయిని చూసి నీకు పెళ్ళి చేస్తాను. ఈ రోజు నుండి పెళ్ళి సంబంధాల వేటలో ఉంటాను. Don’t worry మామూ!.. నీ గురించి నాకు బాగా తెల్సు కదా?.. నీకు ఎలాంటి అమ్మాయి కావాలో నాకు బాగా తెలుసు.. Don’t worry వి.వీ!..” అంది.

కంగారుగా అన్నాడు వివేక్..

“అమ్మూ!.. అసలు నీకు ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి?.. అసలు సౌమ్య వాళ్ళ ఇంటి నుంచి వచ్చాకా, చాలా upset అయిపోయి ఉంటావు. ఎలా నిన్ను ఆ బాధ నుండి బయటకు తీసుకురావాలని నేననుకుంటూ ఉంటే.. నాకు పెళ్ళి చేస్తానంటునావు ఏమిటి? ”

“సౌమ్య పరిస్థితి చూసినాకే, ఏ కారణాల వలనో, మొన్న ఎంగేజ్‌‌మెంట్ జరిగినట్లు, మన పెళ్ళి కూడ జరగవలసిన పరిస్థితి ఏర్పడిందనుకో,.. అది నేను వివాహ బంధం ఎంత మాత్రం కాదు రక్షా బంధం అని నేననుకుంటాను.. పవన్, సౌమ్యా.. వాళ్ళకు పుట్టిన బిడ్డ గుర్తు వస్తే నా శరీరం భయంతో వణికిపోతుంది. నాలో ఏర్పడిన ఈ భయం పోవాలంటే, నా మనసు కుదుట పడాలంటే.. నీకు పెళ్ళి కావాలి.. నిన్ను పెళ్ళి చేసుకునే అమ్మాయితో మన మధ్య జరిగినదంతా చెబుతాను” అని అమృత అంటుండగానే..

బాధగా అన్నాడు.. “నన్ను ఇంతేనా అర్థం చేసుకున్నావు?” అని

“మనిద్దరం.. మావయ్య పరిస్థితి చూసి బాధపెట్టడం ఇష్టం లేక.. ఎంగేజ్‌మెంట్‍కి తలవంచాం!.. పులి లాంటి మావయ్య పిల్లిలా.. కళ్ళల్లో నీళ్లతో.. కన్న కూతురు జీవితం మేనల్లుడితో మాత్రమే బాగుంటుందన్న భ్రమతో చివరి కోరిక తీర్చమన్నాడు.. మన ముందున్న సమస్యకి మంచి పరిష్కారం ఏమైనా దొరుకుతుందా? అని ఇద్దరం ఆలోచించాలి గాని.. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడతావు ఏమిటి అమ్మూ?.. ఒక్కటి గుర్తు పెట్టుకో!.. నా వలన.. నీకు ఎప్పటికి ఎటువంటి ఇబ్బంది కలగదని హామీ ఇస్తున్నాను.. అందరు మన బంధం గురించి ఏమనుకున్నా.. ఈ చేతులతో నీకు గౌనులు తొడిగేవాడిని, బూట్లు వేసేవాడిని, రిబ్బనులు ఊడిపోతే ముడి వేసే వాడిని.. అన్నం తినిపించేవాడిని. నిన్ను వేరే దృష్టితో ఎలా చూడగలననుకుంటున్నావు.. నీకా భయం అక్కరలేదు” అన్నాడు ఆవేశంగా వివేక్..

“వి.వీ!..” అని గభాలున దగ్గరకు వెళ్ళి వివేక్ గుండె మీద వాలిపోయి..“నాన్న.. మనిద్దరికి ఒకరంటే ఒకరు ఇష్టం ఉంది కాబట్టి పెళ్ళి చేయాలనుకున్నాడు.. అందరూ కూడా అలానే అనుకున్నారు..”

“ఇష్టం అంటే ఒక్క ప్రేమకే పరిమితమా?”

“ఇష్టం అన్నది ఒక లవర్స్ వరకేనా?.. ఇక తక్కిన మనుషులు అమ్మా, నాన్నా, అన్నా.. తమ్ముడు.. చెల్లెలు.. ఇలాంటి బంధాల మధ్య ఇష్టం ఉండదా?..”

“ఒకరికి.. మంచి ఫ్రెండ్ ఉన్నాడంటే.. ఆ ఫ్రెండ్ మీద ఎంతో ఇష్టం ఉంటేనే బెస్ట్ ఫ్రెండ్ అవుతాడు.. లేదా.. బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది.”

“ప్చ్!.. ఎన్ని అనుకున్నా.. ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం..”

“అమ్మూ!.. ప్లీజ్! మనిద్దరం.. అర్థం కాని వయసులో ఎంతో సంతోషంగా పెరిగాం. అన్నీ అర్థమయి.. మనకంటూ కొన్ని అభిప్రాయాలు.. ఆలోచనలు ఏర్పడ్డ సమయంలో.. మన మనసులో అలజడి, కళ్ళల్లో నీళ్ళు.. జీవితం అంటే.. ఇదేనేమే! ఏది ఏమైనా.. మన భయాలు, ఆలోచనలు.. అన్నీ మనసులోనే ఉంచుకోవాలి.. మావయ్య కోసం మనం భరించాలి.. కాని నా వలన నీకు ఎటువంటి ఇబ్బంది కాని.. బాధపడే పరిస్థితిగాని రానివ్వను.. సరేనా?” అన్నాడు..

చిన్నపిల్లలా.. తల ఊపింది అమృత. “మామూ!.. ఈ ఒక్క రోజు నీ గదిలోనే పడుకుంటాను.. ఎందుకంటే.. మాటి మాటికీ.. సౌమ్యకి పుట్టిన బిడ్డే గుర్తు వస్తున్నాడు” అంది..

“ఈ రోజు కాదు.. రోజు పడుకున్నా.. అమ్మూని కంటికి రెప్పలా చూసుకుంటాడు ఈ మేనమామ.. ఈ వివేక్..”

ఆత్మీయత నిండిన కళ్ళతో చూసి.. “వి.వీ.. ఆకలి వేస్తుంది..” అని అమృత అనగానే “పద!.. అమ్మూ!..” అని చెయ్యి పట్టుకొని డైనింగ్ టేబిల్ దగ్గరకు నడిపించాడు వివేక్..

మంచం మీదపడుకున్న వివేక్‍కి నిద్ర పట్టలేదు. అమృత అన్న మాటే పదే పదే గుర్తు రాసాగింది..

“నువ్వు ఎవరిని ప్రేమించలేదా?..”

గభాలున కళ్ళల్లో దివ్య కనబడింది.. బాధగా కళ్ళు ముసుకున్నాడు.

“ఎవరిని ప్రేమించలేదని చెప్పాడా?.. ఎందుకు అలా అబద్దం చెప్పాడు?..”

‘నో.. నో.. అలా చెప్పలేదు.. అంత టైమ్ లేదన్నాడు.. అది నిజమే కదా?.. దివ్యని ఎంతో లైక్ చైసాడు.. అందరితో కన్నా దివ్యతో చాలా comfort గా అనిపించి.. తన బిహేవియర్.. అన్నీ తనకి నచ్చి లైక్ చేసాడు.. దివ్య తనని లైక్ చేస్తుందని అర్థమయింది.. కాని.. తను బయటపడలేదు.. దివ్యా అంతే!.. ఇద్దరూ థీసిస్(thesis) సబ్‍మిట్ చేయాలన్న తొందరలో టెన్షన్లో ఉన్నారు..’

‘ఒ.కే.. ఒ.కే.. నువ్వు చెప్పింది కరక్టే కావచ్చు. కాని దివ్యని ప్రేమిస్తున్నాను అన్న నిజాన్ని ఎందుకు చెప్పలేకపోయావు?’

త్రుళ్ళిపడ్డాడు వివేక్..

తన మనసు ఎందుకు ఇలా ఆలోచిస్తుంది? తనని ఎదురు ప్రశ్నలు వేస్తూంది..

తన మనసు అడిగిన ప్రశ్న.. కరక్టే కదా? దర్జాగా దివ్యని ప్రేమిస్తున్నానని ఎందుకు అమృతతో చెప్పలేకపోయాడు.. అబద్ధం చెప్పినట్లే కదా?

అవును చెప్పాలి.. అబద్ధం చెప్పాలి.. లేకపోతే దివ్యని ఇష్టపడ్డాను.. తను నన్ను ఇష్టపడుతుంది అని ఎలా చెప్పగలడు?..

అమ్మూకి తనంటే ప్రాణం.. తనంటే ఇష్టం!.. తన కోసం ఏం చేయడానికైనా అమ్మూ సిద్ధపడుతంది.. నీ ప్రేమని మనసులో దాచుకొని.. నాన్న ఏమయిపోతాడో అన్న భయంతో నాతో పెళ్ళికి ఒప్పుకున్నావా? అని బాధపడడం అయినా చేస్తుంది లేదా మావయ్యతో తన గురించి చెప్పేయవచ్చు.. పరిస్థితుల దృష్ట్యా తను దివ్య గురించి అమృతతో చెప్పలేదంటే!.. అని పరిపరి విధాల ప్రశ్నలు వేస్తున్న తన మనసుకి సమాధానాలు ఇచ్చాడు వివేక్.

***

మంచం మీద పడుకుందేగాని అమృతకి నిద్ర పట్టలేదు.. సౌమ్య ఇంటికి వెళ్ళి వచ్చిన దగ్గర నుండి తన మనసు భయందోళనకు గురి అయింది..

ఎంత మంది మేనరికాలు చేసుకోవడం లేదు. దురదృష్టం!.. సౌమ్యకి అంగవైకల్యం గల బిడ్డ పుట్టాడు.. బ్రతికి ఉన్నంత కాలం ఆ తల్లిదండ్రులకు.. నరకం!.. మానసిక క్షోభ.. ఆ బిడ్డను చూస్తూ ఎలా బ్రతకగలరు?.. ఎలా సంతోషంగా ఉండగలరు? పాపం పవన్, సౌమ్య!.. బాధగా కళ్లు మూసుకంది అమృత.

***

పిన్ని వాళ్ళ ఇంట్లో కూడా ఉండలేకపోయింది దివ్య. వివేక్ దూరంగా, వెళ్ళాలి అనుకుంది.. తన ప్రేమ ఫెయిల్ అయిందని తాతయ్య బాధపడిపోతూ, తనని సముదాయించాలని చూస్తాడు.. ఆ సముదాయించడం, ఫ్రెండ్స్ తన పట్ల చూపే జాలి అనుకోవచ్చు లేదా అభిమానం అనుకోవచ్చు.. తన ప్రేమ గురించి.. తిరిగి ప్రస్తావించడం.. తనకి ఇష్టం లేదు.. అందుకే పిన్ని వాళ్ళ ఇంటి నుండి బైటకు వచ్చేసింది. ఇలా ఎన్నాళ్ళు అందరికి దూరంగా ఉండడం?

కష్టంగా ఉన్నా అందరికి దూరంగా ఉండడమే బెటర్! ఈ సమయంలో ఒంటరితనమే మంచిదేమో అనిపిస్తుంది.

తన మనసుని బాధపెట్టే వాళ్ళు ఉండరు. బాధలో తను ఏమన్నా ఇంకొకరు బాధపడే పరిస్థితి ఉండదు.

బాధలో ఉన్నా ఏ మనిషైనా.. ఒంటరిగా ఉండడం మంచిదని.. తను ఒంటరిగా ఉన్నాకే తెలిసింది.

మనసులో భారం దిగే వరకు ఏడవచ్చు.. తనని తను ఎంతైనా ఓదార్చుకోవచ్చు.. ఎవరి పలకరింపులు గాని, ఎవరి సానుభూతి గాని, ఎవరి ఓదార్పు గాని ఉండదు.. అవన్నీ ఉన్నా.. బాధ మరింత ఎక్కువ అవుతుందే తప్ప తగ్గదు.. ఒంటరిగా ఉంటే అన్నీ తనై, తన మనసుని సమాధాన పరచుకోగలదు..

అంతే!..

వివేక్ తనని మోసం చేయలేదు..

అమృత అంటే ప్రాణం అని చెప్పాడు.. మేనమామ లేకపోతే తను సాధారణ మనిషిలా బ్రతికే వాడినని చెప్పాడు..

ఏ ఆడపిల్లకైనా పెళ్ళి చేసి అత్తారింటికి పంపితే.. పండగలకో, ఫంక్షన్స్‌కో పుట్టింటికి వెళతారు.. ఇక అన్న, తమ్ముళ్ళ ఇళ్ళకి వెళ్ళే వాళ్ళని వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. కాని తన మేనమామ, అత్తయ్య, అమ్మని, తనని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి బ్రతుకు మీద ఆశని అమ్మకి కలిగించారు.. తనని అల్లారు ముద్దుగా పెంచారు.. తన కళ్ళెదుటే.. అమృత పుట్టింది.. తనతో ఆడుకోవడానికి బుజ్జి పాప పుట్టిందని పొంగిపాయేవాడు.. స్కూలికి రాను అని అమ్మూ ఏడుస్తుంటే బుజ్జగించి తన ఒళ్ళో కూర్చో బెట్టుకొని అమృతని స్కూలుకి తీసుకువెళ్ళే వాడినని వివేక్ చెప్పాడు.

కాని పరిస్థితులు తారుమారు కావడంతో చావు, బ్రతుకుల మధ్య ఉన్న మామ చివరి కోరిక తీర్చడానికి అమృతని పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు..

నువ్వు మరొకరి భర్తవి అవుతున్నా కూడా నీ మీద కోపం నాకెందుకు రావడం లేదు..

వివేక్!.. మన ప్రేమ బ్రేకప్ అయితే బాధపడవలసిన అవసరం లేదు.. ఎందుకంటే మనం డేటింగ్‌లు చేయలేదు.. చాటింగ్‌లు చేయలేదు. లాంగ్ డ్రైవింగ్ లకు వెళ్ళలేదు.. ఇన్నేళ్ళ పరిచయంలో కనీసం ఒకరితో ఒకరు I love you కూడ చెప్పకోలేదు, కాని అవన్నీ నా విషయంలో అక్కరలేదు వివేక్!..

ఎందుకంటే.. నిజమైన ప్రేమ అవతల వ్యక్తి మీద మొదట నమ్మకం ఏర్పడ్డాక చిగురించడం మొదలు పెడుతుంది.. ఆ చిగురు కాస్త మహా వృక్షం అవుతంది.. కాని ఆ ప్రేమ మధ్యలో కొన్ని కారణాల వలన తెగిపోయినప్పుడు ప్రేమించిన వ్యక్తిని.. ద్వేషించదు. ఆ వ్యక్తి మీద ఉన్న నమ్మకం ఇంకా ప్రేమించేలా చేస్తుంది. క్షమించేలా చేస్తుంది. ప్రేమించిన వ్యక్తిని మనసులో నుండి తొలగించడానికి సమయం పడుతుంది.. ఆ సమయం ఎంత అన్నది చెప్పడం కష్టమే!..

దివ్య కళ్ళలో నీళ్ళు నిండాయి.. ఆ కన్నీళ్ళలో అస్పష్టంగా వివేక్ కనిపించాడు..

బాధగా కళ్ళు మూసుకొని.. వెంటనే గభాలున కళ్ళు తెరిచి ‘ప్లీజ్ వివేక్.. నాకు కనిపించకు.. ఒకొక్కసారి మంచితనం కూడా మనిషిని బాధపెడుతుందని అర్థమయింది. నీ మంచితనం.. నీతో spend చేసిన కాలం.. పదే పదే గుర్తు వచ్చేలా చేస్తుంది. కాని అది తప్పు.. తొందరగా నిన్ను మరిచిపోవడానికి ప్రయత్నిస్తాను’ అని మనసులో దివ్య అనుకొంది.

అమ్మ, నాన్నని చిన్నతనంలోనే పొగొట్టుకున్నా, చిన్నతనం నుండి, చదువులో, sports, అన్నింటిలో గెలుస్తూనే వచ్చాను..

‘బంగారం! నువ్వు ఇప్పుడే కాదు ఎప్పుడు విజేతవే!..’ అని తాతయ్య బొటనవేలు చూపెడుతూ thumps up అనేవాడు… కాని ప్చ్.. జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం ‘ప్రేమ’ విషయంలో ఓడిపోయాను.

ఇక జీవితంలో ముందడుగు వేయలేక.. చతికిలబడిపోతాను ఏమో!.. ఓడిపోతాను ఏమో!.. అనిపిస్తుంది.

లోకంలో ప్రేమించుకున్న పెళ్ళి చేసుకున్నాక డివోర్సులు ఎందుకు జరుగుతున్నాయి?.. ఒకరి మీద ఒకరు ద్వేషంతో ఒకరిని ఒకరు ఎటాక్ చేయాడమో? హత్య చేయడమో? ఆనక జైలు పాలు కావడమో ఎందుకు జరుగుతున్నాయి?

వాళ్ళ ప్రేమలో కల్మషం ఉందా? వాళ్ళ మధ్య ఉన్నది ప్రేమ కాదు, తొందరపాటా? ఎట్రాక్షనా?..

ఏమో!.. అవేవి తనకి తెలియదు.. తనకి, వివేక్ మధ్య ఏర్పడదు. అసలు సిసలైన ప్రేమ.. 100 ఏళ్ళు కాదు 1000 ఏళ్ళయినా ఆ ప్రేమ అలానే ఉంటుంది..

ఏదో పాత సినిమాలో హీరోయిన్ మళ్ళీ పుట్టి హీరోకి దగ్గరవుతుంది.

తను మళ్ళీ, మళ్ళీ పుట్టినా.. వివేక్ వైఫ్ గానే పుట్టాలని కోరుకుంది.

ఎందుకంటే వివేక్ తన ప్రాణం.. కాని జరిగింది ఏమిటి? ఎడతెరిపిలేని ఆలోచనలతో దివ్య కళ్ళ నుండి ముసురు పట్టిన వర్షంలా కన్నీళ్ళు జారుతూనే ఉన్నాయి.

ఒకటి మాత్రం తనకి అర్థమయింది.

శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే ఉంటుంది. కాని ప్రేమించిన వ్యక్తికి.. ప్రేమ దూరం అయితే ఆ వ్యక్తి బ్రతికి ఉన్నంత కాలం మరణిస్తూ బ్రతుకుతుంటాడు జీవచ్ఛవంలా!

ఏమిటీ ఎడతెరిపి లేని ఆలోచనలు.. ఈ ఆలోచనలు తన చుట్టూ ఉన్న వాళ్ళని.. ముఖ్యంగా తాతయ్యని బాధపెట్టడానికి దారితీస్తాయి..

అలా ఎప్పటికి చేయకూడదు.. తను.. తన మనసుకి నచ్చ చెప్పుకోవాలి.. ధైర్యం తెచ్చుకోవాలి..

జీవితంలో ఎందరో తమకి ప్రియమైన ఇష్టమైన, ప్రాణమయిన వ్యక్తులను కోల్పోతుంటారు.. దూరం అవుతుంటారు..

పడి లేచిన కెరటంలా తను.. మామూలు కావాలి!.. అంతే!.. గభాలున కళ్ళ నుండి కారుతున్న కన్నీళ్ళను తుడుచుకొంది..

సెల్ తీసి.. రింగ్ చేసి “తాతయ్యా!.. వస్తున్నాను” అని చెప్పి ఫోను పెట్టేసింది దివ్య.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here