నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-7

0
3

[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

[dropcap]1[/dropcap]857లో, దేశంలోని పలు ప్రాంతాలు బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమించినప్పుడు హైదరాబాదులోని ముస్లింలు కూడా ఈ మహాయుద్ధంలో పాల్గొనాలని ఉవ్విళ్ళూరారు. బ్రిటీషువారు ఈ మహా ప్రజా యుద్ధాన్ని ‘సిపాయి తిరుగుబాటు’గా ప్రచారం చేశారు. ప్రజలు హైదరాబాదులో బ్రిటీష్ రెసిడెన్సీపై రెండు మార్లు దాడులు చేశారు.  నిజామ్ దర్బారు వదిలి వెళ్తున్న రెసిడెంట్‌పై కూడా దాడి చేశారు. దాదాపుగా మూడు నెలల పాటు భారతదేశ భవిష్యత్తు హైదరాబాదుతో ముడిపడి ఉంది. హైదరాబాదు కనుక విప్లవంలో పాల్గొని ఉంటే, మద్రాసు, మైసూరు, ట్రావన్‍కోర్, సచిన్ లలో కూడా విప్లవం ఆరంభమయి ఉండేది. కానీ ఆంగ్లేయులకు విధేయుడు, తీవ్ర సమర్థకుడు అయిన సాలార్‌జంగ్ బ్రిటీషువారిని రక్షించాడు.

బ్రిటీషువారు ఈ విప్లవం నేర్పిన పాఠాన్ని మరిచిపోలేదు. సికిందరాబాదులో ఉన్న బ్రిటీష్ సైన్యం నిత్యం సర్వసన్నద్ధంగా ఉండేది. రెసిడెంట్ పరోక్షంగా రాష్ట్రాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని అధికారం చలాయించాడు. ఈ విషయాన్ని బ్రిటీషువారు నిజామ్‍కు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు “బ్రిటీష్ ప్రభుత్వ ప్రతినిధిగా రెసిడెంట్ సర్వాధికారి. ప్రతి సందర్భంలోను, ప్రధాన నిర్ణయాలలో రెసిడెంట్ సలహాను స్వీకరించడం తప్పనిసరి” అన్నారు.

సర్వశక్తిమంతుడయిన రెసిడెంట్ నిజామ్‌ ముఖ్యమంత్రిని నియమించాడు. మంత్రులకు పదవులు ఇవ్వటం, తొలగించటం, రాజ్య పాలన, ఆర్థిక వ్యవహారాలను, సంస్కరణలను రెసిడెంట్ అమలు పరిచేవాడు. హైదరాబాదులో బ్రిటీష్ పాలసీని పరిశీలించిన సర్ ఆర్థర్ లోథియాన్ “ఇతర రాష్ట్రాలలో కన్నా హైదరాబాదు వ్యవహారాలలో  రెసిడెంట్ అధికంగా జోక్యం చేసుకునేవాడు. నిర్ణయాలు తీసుకోవటంలో తెరవెనుకవుండి ఆడించేవాడు.”   [Kingdoms of Yesterday by Sir Arthur Lothian, Page 80].

ఎడ్వర్డ్ థాంప్సన్ ప్రకారం “ప్రస్తుతం ఇతర రాష్ట్రాల కన్నా నిజామ్  ప్రత్యేకమైన రాష్ట్రంగా గుర్తింపు పొందడానికి, నిజామ్‍ను సర్వోత్తమ సార్వభౌముడిగా, బ్రిటీష్ వారికి అత్యంత నమ్మకస్థుడిగా గుర్తింపు పొందడానికి ప్రధాన కారణం ఆరంభంలోనే నిజామ్ రాజ్యం బ్రిటీష్ వారు ఆడించినట్టు ఆడే తోలుబొమ్మ రాజ్యంగా వ్యవహరించటం. మరాఠాలు నిజామ్‍ను ఓడించిన ఒక్క సందర్భంలో తప్ప బ్రిటీష్ వారు మిగతా సందర్భాలలో  నిజామ్‌అండగా   నిలిచారు. టిప్పుతో అంతిమ యుద్ధం ఆరంభమైనప్పుడు నిజామ్ రాజ్యంలో మతపరమైన జాతిపరమైన ఐక్యత లేదు. హైదరాబాదు అంత పెద్ద రాష్ట్రం కాదు. కానీ యుద్ధం పూర్తయిన తరువాత హైదరాబాద్ సరిహద్దులలో మార్పు వచ్చించి. హైదరాబాద్ పరిధి పెరిగింది. ఇప్పుడు హైదరాబాద్ ఫ్రాన్స్ దేశమంత పెద్దది. కానీ ఏ రాష్ట్రం కూడా హైదరాబాద్ లాంటి కుహనా  స్వాతంత్రాన్ని అనుభవించలేదు. ఏ రాష్ట్రం కూడా హైదరాబాద్ లాంటి ఎలాంటి ప్రత్యేకత లేని విధంగా లేదు [Edward Thompson, Making of Indian Princes, Pages 13-15].

1798 నుంచి గడిచిన నూటయాభై ఏళ్ళలో హైదరాబాద్, భారత్ రాజకీయ, ఆర్థిక వ్యవహారాలలో ఇతర రాష్ట్రాల కన్నా అధికంగా కలిసిపోయింది. బొంబాయి, మధ్యప్రదేశ్, మద్రాస్‍ల నడుమ ఉన్న హైదరాబాద్ భారతదేశ ఐక్యతకు కీలకమన్న విషయం అందరూ గుర్తించారు.

1930లో హైదరాబాద్ రెసిడెంట్ విలియం బార్టన్ హైదరాబాద్‍కు సంబంధించి ఒక మెమోరాండంను సమర్పించాడు.

“రాజకీయపరంగా, సైనిక వ్యవహారాల దృష్ట్యా హైదరాబాద్ చాలా కీలకమైనది. అత్యవసర పరిస్థితులలో దక్షిణాదిని, ఉత్తర ప్రాంతాలను వేరు చేసేందుకు హైదరాబాద్ ఉపయోగపడుతుంది.”

అధికారిక ప్రకటనలలోని పదాల వల్ల నిజామ్ అహం దెబ్బతిన్నా బ్రిటీష్‌వారు అవకాశం దొరికినప్పుడల్లా, నిజామ్ తమకు విధేయుడన్న విషయాన్ని నిజామ్‍కు గుర్తు చేస్తూ వచ్చారు. ఒప్పందాలు ఏమేం చేసుకున్నా ఏ భారతీయ రాజులు బ్రిటిష్ రాజుతో సమానం కాలేరన్న విషయాన్ని మార్చి 26, 1926 నాటి ఉత్తరంలో లార్డ్ రీడింగ్ స్పష్టం చేశాడు. వైస్రాయ్ ప్రకారం, ఒక రాష్ట్ర అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకునే హక్కు బ్రిటీష్ వారికి ఉంది. రాష్ట్ర రక్షణ, అంతర్గత భద్రత వ్యవహారాలు బ్రిటీష్ వారి బాధ్యత అవటం వల్ల వారికీ సర్వ సార్వభౌమత్వం సంప్రాప్తిస్తుంది.

నిజానికి, ఏ సమయంలో కూడా ఇతర దేశాలతో హైదరాబాద్‌కు ఎలాంటి సంబంధాలు లేవు. హైదరాబాద్ సరిహద్దుల రక్షణ బ్రిటీష్ ఇండియా రక్షణలో భాగం. భారత సైన్యానికి అనుబంధం లాంటిది నిజామ్ సైన్యం. భారత్ రాష్ట్రాల సైన్య పథకం 1939 ప్రకారం భారత ప్రభుత్వానికి నిజామ్ సైన్యం సంఖ్యను పెంచే హక్కు, తగ్గించే హక్కు ఉంది. భారత ప్రభుత్వం  నిజామ్ సైన్యానికి  ఆయుధ సామాగ్రిని అందజేయవచ్చు. భారత ప్రభుత్వం అనుమతి లేకుండా హైదరాబాద్ ఆయుధాలు కొనుగోలు చేయలేదు, తయారు చేయలేదు.

రాష్ట్రం లోని శాంతి భద్రతలు భారత ప్రభుత్వ బాధ్యత. సమాచార, రవాణా వ్యవస్థల్లో భాగమైన రైల్వేలు, విమానయాన వ్యవస్థ, పోస్టల్, టెలిగ్రాఫిక్, టెలీఫోన్ వ్యవస్థలు అన్నీ బ్రిటీష్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి.

భారత ప్రభుత్వం తన బాధ్యతను సక్రమంగా నిర్వహించేందుకు నిజామ్ సంపూర్ణంగా సహకరించటమే కాదు, అందరి భద్రతకు, ఇతర రాష్ట్రాల భద్రతకు ప్రమాదం కలిగించే చర్యలేవీ నిజామ్ చేపట్టకూడదు.

1935 ప్రభుత్వ చట్టం ప్రకారం భారత ప్రభుత్వం రాజకీయ  వ్యవస్థ  సరిగా పనిచేసేట్టు చూసే బాధ్యత   బ్రిటీష్ రాచ ప్రతినిధి గవర్నర్ జనరల్‌ది.

హైదరాబాద్ వ్యాపార లావాదేవీలే కాదు, హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థ భారత ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉంది. హైదరాబాదులోని బ్యాంకులు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పని చేసే బ్రిటీష్ ఇండియా బ్యాంకుల శాఖలు.  ఆదాయం కోసం  హైదరాబాదు, దేశంలోని ఇతర రాష్ట్రాల వ్యాపారంపై ఆధారపడి ఉన్నాయి. హైదరాబాదుకు ఆహార ధాన్యాలు, హైదరాబాదులో తయారయిన వస్తువులు, ఎగుమతులు, దిగుమతులు సర్వం భారత్ లోని ఇతర ప్రాంతల నుండి హైదరాబాదుకు వచ్చేవి. ఇతర ప్రాంతాల గుండా హైదరాబాద్ చేరేవి. నిజామ్ అహం సంతృప్తి పరచేందుకు బ్రిటీష్ వారు హైదరాబాదు కరెన్సీని చలామణీలో ఉంచారు. ఇందుకోసం హైదరాబాద్ కరెన్సీని భారత కరెన్సీతో ముడిపెట్టారు బ్రిటీష్‍వారు.

హైదరాబాదులో 16,000,000 ప్రజలు – భారత్ లోని ఇతర ప్రాంతాల వారితో సాంఘిక, ధార్మిక, సాంస్కృతిక సంబంధ బాంధవ్యాలున్నవారు. వీరిలో హిందువులు 86%, ముస్లింలు 12 1/2%, క్రిస్టియన్లు ఇతరులు 1 1/2%. హైదరాబాదు ప్రజలలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య 7000,000. మరాఠీ మాతృభాషగా కలవారు 4000,000. కన్నడ వారి సంఖ్య 2000,000. రాష్ట్రంలో ఉర్దూకు ప్రాధాన్యం ఇచ్చి, అందరూ ఉర్దూ వాడాలన్న పథకం అమలు పరిచేంత వరకూ ఉర్దూ భాష, కేవలం పాలకులుగా ఉన్న  ముస్లింలకే పరిమితం.

ఈ హైదరాబాదును నిజామ్ స్వతంత్ర ఇస్లామిక్ రాజ్యంగా ఏర్పాటు చేయాలనుకున్నాడు.

ఆయనకు, ఇది చాలా సులభమైన పనిలా  అనిపించింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here