భర్తలే కాదు.. భార్యలు కూడా..!!
[dropcap]‘వి[/dropcap]వాహము అన్ని విషయములలోనూ ఘనమైనది’ అని బైబిల్ చెబుతున్నది.
పెళ్లి విషయంలో ఏ మత గ్రంథమైనా ఇదే అర్థం స్ఫురించేలా చెప్పి ఉండవచ్చు.
అందుచేతనే జీవితంలో ప్రతి వ్యక్తికీ వివాహానికి, వివాహ బంధానికి, వైవాహిక జీవితానికీ ఎంతో ప్రత్యేకతా, ప్రాముఖ్యతను కలిగి వున్నాయి. అందుకేనేమో ‘పెళ్లంటే నూరేళ్ళ పంట’ అంటారు. దీనికోసం ముహూర్త బలం చూసుకుంటున్నాము, మంచి రోజు ఎంచుకుంటున్నాం, మంచి సమయాన్ని కోరుకుంటున్నాం. కావలసిన బంధుమిత్ర శ్రేయోభిలాషుల మధ్య ఘనంగా వివాహం జరిపిస్తున్నాం.
ఇదంతా ఎందుకు? వారి సంతోషమయ జీవితం కోసం, అలాగే సుఖ సంసారం కోసం, ఆ తర్వాత పిల్లలు, వాళ్ళ పెంపకం, వారి భవిష్యత్తు, సమసమాజ నిర్మాణం కోసం ఈ పెళ్లి అనే భార్యాభర్తల కలయిక. ప్రేమ వివాహం అయినా, పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినా, ఆ వైవాహిక జీవితం శుభప్రదంగా నిలబడాలాంటే, భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండాలి, ప్రేమ ఉండాలి, సంతోషమయ సుఖ జీవనం పట్ల మంచి అవగాహన ఉండాలి. అప్పుడే ఆ సంసారాలు బ్రతికి బట్టకడతాయి. సమాజంలో మాదిరిగా నిలుస్తాయి. ఇలా వుండాలనే ప్రతివాళ్ళూ కోరుకుంటారు.
అయితే ఈ వివాహ వ్యవస్థలో అప్పటినుండి ఇప్పటివరకూ మగాడిదే పై చేయిగా చెబుతూ వచ్చింది. భార్య అంటే కేవలం వంటింటికే పరిమితం అని, పిల్లల్ని కనే యంత్రం మాత్రమే అని భావిస్తూ వచ్చారు, ఇది కాదనలేము. కొన్ని వర్గాలలో భార్య అంటే కేవలం ఒక బానిస, నాలుగు గోడల మధ్య నలిగిపోయే మానవ జంతువు. అలా స్త్రీ మానసికంగానూ, శారీరకంగానూ, మగాడి చేతిలో హింసకు గురి అవుతూ వచ్చింది. ఎన్ని హింసలకు గురి అయినా భర్త కాళ్ళ వద్ద పడి ఉండాల్సిన దౌర్భాగ్యపు పరిస్థితి అది. శరీరం సహకరించక పోయినా, స్వయంగా ఇష్టం లేకపోయినా భర్త సుఖం కోసం బలి పశువుగా, చిత్ర హింసలు లేదా గృహ హింసలు మౌనంగా భరించాల్సి వచ్చింది స్త్రీకి. పిల్లలు పుట్టకపోతే గొడ్రాలు అని ఎత్తి పొడవడం, మరో పెళ్లి చేసుకుంటానని భర్త బెదిరించడం, కట్నం తేలేదనీ, తెచ్చింది సరిపోలేదని పెట్టే హింసలకు అసలు కొదవు లేదు. ఈ చరిత్రను ఎవరూ కాదనలేరు. అందువల్లనే వీటికి చెక్ పెట్టడం కోసం, కొన్ని మహిళాసంఘాల ఉద్యమాల వల్లనైతేనేమి, మరో కారణాల వల్లనైతేనేమి, ఈ స్త్రీమూర్తుల రక్షణ కోసం ప్రభుత్వం కొన్ని చట్టాలు తెచ్చింది. ప్రాథమిక దశల్లో ఈ చట్టాలు చాలా ఉపయోగపడ్డాయి. ఎప్పుడయినా, ఎక్కడైనా, ఒక మంచి జరిగితే, దానికి సమానంగా చెడు కూడా కలసి ప్రయాణిస్తుంది. ఈ చట్టం విషయంలో కూడా అదే పని జరిగింది, క్రమంగా చట్టం దుర్వినియోగం కావడం మొదలుపెట్టింది. అయినదానికీ, కానీ దానికీ భర్తల మీద కేసులు పెట్టడమే కాదు, భర్త కుటుంబ సభ్యుల మీదా సన్నిహితుల మీదా కేసులు పెట్టి జైలుకు పంపి కసి తీర్చుకోవడం అలవాటుగా మారింది. చట్టం దుర్వినియోగానికి తలుపులు బాహాటంగా తెరుచుకున్నాయి. ఇదుగో ఇలాంటి సందర్భంలోనే ‘భార్యా బాధిత సంఘాలు’ ఆవిర్భవించడం మొదలైంది. అసలు విషయంతో పాటు, తెరచాటున ఉంటూ వచ్చిన భార్యల హింసలు కూడా బయటకు రావడం మొదలు పెట్టాయి. అయినా సమాజం స్త్రీనే వెనకేసు కొచ్చింది.
గతంలో స్త్రీ పరిస్థితి పక్కన పెడితే, నేటి మహిళల పరిస్థితి అప్పటికంటే చాలా మెరుగ్గానే ఉందని చెప్పాలి. దానికి కారణం, విద్య, తద్వారా, ఉద్యోగం, సంపాదన, తన కాళ్ళమీద తాను నిలబడగలననే గట్టి నమ్మకం. ఇది ఆహ్వానించదగ్గ విషయమే! కానీ ప్రస్తుత పరిస్థితిలో యువతులు వివాహ వ్యవస్థ పైన ఏమాత్రం గౌరవం లేకుండా ప్రవర్తించడం బాధాకరమైన విషయం. అయితే ‘యువకులకు వివాహ వ్యవస్థ పట్ల గౌరవం ఉందా?’ అని కొందరు ప్రశ్నించవచ్చు. అయితే మగాడికి ఎలాగూ చిరకాలం నుండి ప్రత్యేకమైన ముద్ర పడిపోయి వుంది కాబట్టి వాడి గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదనుకుంటాను.
ఈ రోజున ఫ్యామిలీ కోర్టుల నిండా ఇలాంటి వారితోనే కిటకిట లాడడం ఆశ్చర్యాన్నీ బాధనూ కలుగజేస్తాయి. పెళ్లయిన మూన్నాళ్లకే పెటాకులు కావడం ఆహ్వానించదగ్గ విషయం కాదు కదా! ఒకప్పుడు ఈ తొందరపాటు చర్యలకు మగపిల్లలే ముందుండేవారు. ఇప్పుడీ అన్నిరంగాలలో మాదిరిగానే ఆడపిల్లలు కూడా మేము సైతం అంటున్నారు.
అమెరికాలో వున్న ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడం కోసం, మరో అమెరికాలో ఉంటున్న అబ్బాయిని పెళ్ళి చేసుకుని, తద్వారా విదేశాలకు వెళ్లి పెళ్లి చేసుకున్న అబ్బాయి మీద రకరకాల నిందలు మోపి, అతనితో సంసారం చేయక, చివరకు అవసరమైన విడాకులు పొంది, ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకున్న సందర్భాలు ఎన్నో వింటున్నాము. అలాగే, ఒక విదేశంలో పర్మనెంట్ రెసిడెన్సీ సదుపాయం పొందడానికి, అదే దేశంలో ఉంటున్న ఒక అబ్బాయిని పెళ్ళి చేసుకుని, ఆనక పి.ఆర్. వచ్చాక అర్థం లేని గొడవలు పెట్టుకుని, విడాకులు తీసుకుని, వచ్చిన డబ్బుతో సకల భోగాలూ అనుభవిసున్న వాళ్ళు వున్నారు.
కొందరు కలిసి వున్నా బలవంతంగా సంసారం చేస్తూ భర్తలను ముప్పతిప్పలు పెట్టే ఆడపిల్లలూ తయారైనారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఆడపిల్లలైనా మగపిల్లలైనా, వారి జీవితాన్ని అంతా సుందరమయంగా ఊహిస్తారు. అందరికీ వాళ్ళు ఊహించిన జీవితం అందుబాటులోకి రాకపోవచ్చు. అలా అని నిరుత్సాహపడడం సరికాదు. కొన్ని విషయాలలో త్యాగం తప్పదు. అనుకున్నవి దక్కడం అందరికీ సాధ్యం కాదు. చిన్న చిన్న త్యాగాలతో ఆనందమయ జీవితం కోసం శ్రమించాలి గాని, క్షణికోద్రేకంతో ప్రేమలో పడ్డట్టే క్షణికమైన నిర్ణయాలతో జీవితాలు పాడు చేసుకోకూడదు. ఇది ఆడ మగ ఇద్దరికీ వర్తిస్తుంది. సుఖంగా, సంతోషంగా సాగవలసిన జీవితాలు కేవలం స్త్రీల (భార్యలు) వల్ల, ఎలా నాశనమై పోతాయో ఒక ఉదాహరణ (నాకు అతి సమీప బంధువుల ఉదంతం) ఇక్కడ వివరిస్తాను.
వాళ్లిద్దరూ దగ్గర బంధువులే! వాళ్లిద్దరూ (ఆమె భ్రమింప జేసింది అతగాడిని) ప్రేమించుకున్నారట! పేద అమ్మాయిని చేసుకుంటే జీవితం బాగుంటుందని, తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. అప్పటికి అతడు ఉద్యోగం చేస్తున్నాడు, ఆమె మాత్రం నిరుద్యోగి. ఆమెకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఆమె వ్యవహారం పూర్తిగా మారిపోయింది. పనులన్నీ అతని చేతనే చేయించేది. సందర్భం లేకపోయినా చీటికీ మాటికీ రుసరుసలాడడం, అతని తల్లిదండ్రులను, తోబుట్టువులను ప్రతి దానికి దెప్పిపొడవడం, ఇక చెప్పకూడనివి బోలెడన్ని. అతను మాత్రం తమ బ్రతుకు బస్టాండ్ కాకూడదని ఇద్దరు పిల్లలూ డిగ్రీకి వచ్చేవరకూ చాలా ఓపిక పట్టాడు. ఈ లోగా ఆమె చేయవలసినంత నష్టం చేసేసింది. పిల్లలకి తండ్రి గురించి వున్నవి, లేనివి చెప్పి, అతడిని వాళ్ళ దృష్టిలో ఒక విలన్‍గా మార్చి, వాళ్ళ మస్తిష్కాలను విషతుల్యం చేసింది. పిల్లలు పెద్ద వాళ్ళయినా, తల్లి తప్పుడు ఆలోచనలకు లొంగిపోయారు, వాళ్లకి ఆలోచించే మెదడు మొద్దు బారిపోయింది.
తల్లి మాదిరిగానే, పిల్లలు కూడా తండ్రి మీద పగ పెంచుకున్నారు. అది ఎందుకో పిల్లలకి కూడా తెలియకుండానే అది జరిగిపోయింది. జరగవలిసిన దానికంటే నష్టం ఆ కుటుంబానికి జరిగిపోయింది. కేవలం ‘ఆమె’ వల్ల. ఇప్పుడు వారి జీవితాలు చెల్లాచెదురు అయ్యాయి. ఎవరికి వారే యమునాతీరే అన్న చందం అయింది. కేవలం ఆమె కసి (ఎందుకో మరి ఆమెకే తెలియదు), అహంకారం, బాధ్యతా రాహిత్యం సంసారాన్ని చెరువులో తొక్కేసినట్టయింది. సుఖంగా బ్రతకవలసిన వాళ్ళు అయోమయంలో పడ్డారు. ఇది వింటే చాలా బాధ అనిపిస్తుంది. కేవలం ఇది ఒక ఉదాహరణ మాత్రమే! మన సమాజంలో మనకు తెలియకుండా ఇంకా ఎందరో.. అన్యోన్య జీవితాలకు ఇరువైపులా నుండీ ఏంతో కొంత త్యాగం అవసరం. లేకుంటే అనవసరంగా చక్కగా సాగవలసిన సంసారాలు కుప్పకూలిపోతాయి. ఇక్కడ స్త్రీలను (భార్యలను) గురించి మాత్రమే ప్రత్యేకించి చెప్పడంలో నా ఉద్దేశం, కుటుంబంలో హింసించే భర్తలే కాదు భార్యలు కూడా వివిధ రూపాల్లో ఉన్నారని.
అవగాహన పెంచుకో
ప్రేమను పంచుకో!..
అన్యోన్య సంసారిక జీవితానికి
పునాదిని ఎంచుకో..!!
(మళ్ళీ కలుద్దాం)