[తెలుగు సామెతల ఆధారంగా అల్లిన చిన్న కథల ఫీచర్ నిర్వహిస్తున్నారు శ్రీమతి మద్దూరి బిందుమాధవి.]
మొగుడ్ని కొట్టి మొగసాలకెక్కిందిట
[dropcap]‘మొ[/dropcap]గసాల’ అంటే ఊరు మధ్యలో తగాదాలు పరిష్కరించటానికి ఉపయోగించే ఒక రచ్చబండ లాంటిది అని నిఘంటు అర్థం. ఇంట్లో భర్తని తనే కొట్టి నలుగురి సానుభూతి పొందటానికి అతని మీద నేరారోపణ చెయ్యటానికి వస్తే ఎలా ఉంటుందో.. అలా తమే తప్పు చేసి నలుగురిలో ఎదుటి వారి మీద నేరం వెయ్యటం అని ఈ సామెతకి అర్థం!
***
ప్రభాకర్ ఆ కాలనీలో ఫ్లాట్ కొనుక్కునేటప్పటికి కాలనీ ప్రశాంతంగా చెట్లతో పచ్చగా కళకళలాడుతూ ఉండేది. వేసవి కాలమైతే అసలు ఎండే తెలిసేది కాదు. చల్లగా హాయిగా ఉండేది.
రోడ్ సైడ్ అయితే.. వాకిట్లో అమ్మొచ్చే కేకలు వినిపిస్తాయని ప్రభాకర్ ఆ వైపు ఫ్లాట్ కొనుక్కున్నాడు.
అసలు అప్పటికి ఆ కాలనీలో ఎక్కువ భాగం.. అంటే 80% ఇండిపెండెంట్ ఇళ్ళే ఉండేవి.
రాను రాను ఆ చుట్టు పక్కల కాలేజిలు, ఆసుపత్రులు.. ఇతర వ్యాపార సముదాయాలు పెరిగి జనాభా ఎక్కువగా ఆ కాలనీలో నివాసాలు వెతుక్కోవటం మొదలు పెట్టారు.
అప్పటికి.. ఆ కాలనీ మొదటి తరం పెద్దలు గతించటమో.. పిల్లల దగ్గరకి విదేశాలు వెళ్ళిపోవటమో జరిగి ఆ ఇళ్ళన్నీ అపార్ట్‌మెంట్స్ అయిపోయాయి.
జనాభా పెరిగి.. వారి నిత్యావసరాల కోసం వచ్చిన సూపర్ బజార్లు, చిన్న చిన్న క్లినిక్కులు, బ్యాంక్స్, ఇతర షాపులతో రద్దీ విపరీతంగా పెరిగి పోయింది.
పగలు.. రాత్రి తేడా లేకుండా టూ వీలర్స్.. కార్లు.. బస్సులు.. ట్రక్స్ వాటి హార్న్స్.. ఒకటే రొద. విపరీతమైన శబ్ద కాలుష్యం! రాత్రుళ్ళు పన్నెండైనా వాహనాల రొద తగ్గేది కాదు. ప్రభాకర్ వాళ్ళకి నిద్ర ఉండేది కాదు.
అంత ఇష్టపడి కొనుక్కున్న ఇల్లు వదిలి మరొక ప్రశాంతమైన కాలనీలో ఇల్లు వెతకటం మొదలుపెట్టాడు.
ఒక ఇల్లు రోడ్డుకి డెడ్ ఎండ్‌లో ఉంది. ఐదు వందల గజాల స్థలాన్ని ఇద్దరు స్నేహితులు కలిసి కొనుక్కుని, మధ్యలో పార్టిషన్ గోడ కట్టి ఇటు పక్కకి ఒకరు.. అటు పక్కకి ఒకరు ఇళ్ళు కట్టుకున్నారు.
అది చూసి “హమ్మయ్యా.. ఇంటి ముందు నించి వెళ్ళే ట్రాఫిక్ ఉండదు. వేళా పాళా లేకుండా హారన్ల రొద ఉండదు. రిటర్మెంట్ లైఫ్ ప్రశాంతంగా గడపచ్చు” అని కాస్త పాతదే అయినా ఆ ఇల్లు కొనాలని నిశ్చయించుకున్నాడు.
ఆలోచన వచ్చిందే ఆలస్యం.. భార్య శ్యామలని ఒప్పించి ఆ ఇల్లు కొని అందులోకి షిఫ్ట్ అయి ఊపిరి తీసుకున్నాడు. కాంపౌండ్‌లో ఒక కారుకి పార్కింగ్ సౌకర్యం ఉంది. అక్కడున్న రెండిళ్ళు అన్ని విషయాల్లోను కవల పిల్లల్లగా ఒకే సౌకర్యాలతో ఉన్నాయి.
ప్రభాకర్ వాళ్ళు ఆ ఇంట్లో చేరిన సంవత్సరానికి.. పక్కన ఇల్లు వెంకట్ కొనుక్కుని అందులో చేరాడు. వెంకట్‌కి ఒక పెద్ద కారు, ఒక చిన్న కారు ఉన్నాయి. తను ఆఫీసుకి వెళ్ళటానికి పెద్ద కారు వాడతాడు. చిన్న కారు భార్య తన షాపింగ్ అవసరాలకి వాడుతుంది. అతను ఆఫీసు నించి తిరిగొచ్చేసరికి పొద్దు పోతుంది.
ప్రభాకర్ వాళ్ళకి ఒకే కారు ఉంది. అది మీడియం సైజ్. ప్రభాకర్ రిటైర్ అయ్యాడు కనుక పగలు బయట పని చూసుకు వచ్చి కారు తన కాంపౌండులో పెట్టేస్తాడు.
రాత్రి వచ్చిన వెంకట్ తన కారు ప్రభాకర్ గేట్ సగం కవర్ అయ్యేలా పార్క్ చేసి పెట్టేసి వెళతాడు. ఉదయమే ప్రభాకర్ బయటికెళ్ళాలంటే తన కారు.. ఇబ్బంది లేకుండా బయటికి తియ్యలేడు. తప్పనిసరి పరిస్థితుల్లో అర్జెంట్ అయి.. కారు తియ్యమని ఎన్ని సార్లు వెంకట్‌కి కబురు పంపినా ‘దున్నపోతు మీద వాన కురిసినట్లే’ ఉలుకు పలుకు ఉండదు.
ఒక రోజు ప్రభాకర్ అత్తగారికి ఊపిరందక ఉక్కిరిబిక్కిరవుతుంటే అర్జెంట్‌గా ఆస్పత్రికి వెళ్ళాల్సి వచ్చింది. ఎన్ని సార్లు కబురంపినా వెంకట్ కానీ, భార్య కానీ స్పందించకపోయే సరికి ప్రభాకర్ కారు బయటికి తీసి అత్తగారిని ఆసుపత్రికి తీసుకెళ్ళాడు.
ఆ ప్రయత్నంలో వెంకట్ కారుకి తన కారు తగిలిందని చూసేటంత అవకాశం ఆ పరిస్థితిలో అతనికి లేదు.
రోజంతా ఆసుపత్రిలో ఉండి ఆ వార్డ్ ఈ వార్డ్ తిరిగి అన్ని టెస్టులు చేయించి.. ఇంటికి తిరిగొచ్చేసరికి సాయంత్రం అయింది. బాగా అలిసిపోయి ఉన్నారు.
ఇంటికొచ్చేసరికి వెంకట్ భార్య ఇంటి ముందు వరండాలో పెద్ద గొంతేసుకుని ఆ కాలనీ అంతా వినిపించేట్లు.. “ఆయన గారు కారు తీసేటప్పుడు తమ బెంజ్ కారు గీరుకు పోయిందని, ఒక చోట సొట్ట కూడా పడిందని.. నష్ట పరిహారం ఇవ్వాలని” గట్టిగా అరుస్తోంది.
“అయినా ఇలాంటి వాళ్ళ పక్కన ఉండటమే తప్పు. ‘పంది పిల్లకేం తెలుసు పన్నీరు విలువ’ అని ఖరీదైన కార్లు ఎప్పుడైనా వాడి ఉంటే కదా! ఆ డొక్కు ‘వాగనార్’ తియ్యటానికి కూడా అంత సీనా? కావాలనే మా కారుని గీసుకుంటూ వెళ్ళాడు. మమ్మల్ని చూస్తేనే అసూయ. చిన్న బతుకులు.. చిన్న బుద్ధులు” అంటూ ఆవిడ వాక్ప్రవాహం సాగిపోతోంది.
తమ కారు దిగుతున్న ప్రభాకర్.. శ్యామలలకి పక్కింటి వెంకట్ భార్య ఉరుములు.. మెరుపులతో మతి పోయింది.
“‘మొగుడ్ని కొట్టి మొగసాలకి ఎక్కటం’ అంటే ఇదే! ఆయన గారు కారు అడ్డం పెట్టి.. అర్జెంట్‌గా బయటికెళ్ళాలి కార్ తియ్యమని ఉదయం ఎన్ని సార్లు కబురు పంపాం? అప్పుడు తలుపన్నా తియ్యకుండా ఇప్పుడు మన మీద విరుచుకు పడుతోంది.”
“వాళ్ళు కారు అడ్డం తీసే వరకు మన అవసరాలు ఆగుతాయా? ప్రశాంతంగా బతుకుదామని ఈ మూలకి వస్తే.. ఇక్కడా ఈ గోల తప్పట్లేదు.”
“అసలు వీళ్ళకి మనుషులతో కలిసి బతకటం రాదు” అని శ్యామల అంటుంటే.. ఆ పక్కింటి రామారావు గారు
“అవునండి. మేము ఇరవయ్యేళ్ళ నించి ఇక్కడుంటున్నాం! మీరొచ్చి ఏడాది దాటింది. మేము గమనిస్తూ ఉంటాం.. ఎప్పుడూ ఇంట్లో మనుషులు ఉన్న అలికిడే ఉండదు. హాయిగా ప్రశాంతంగా ఇండే కాలనీలో వీళ్ళొచ్చాక ప్రతి రోజూ ఏదో ఒక గొడవేనండి.”
“మొన్న నేను వెళ్ళేసరికి సూపర్ బజార్‌లో అరల్లో ఉన్న వస్తువులన్నీ కంగారుగా కెలికేస్తోంది ఈవిడ. ప్యాకెట్స్ కింద పడేది కూడా చూసుకోవట్లేదు. అలా చేస్తూ టొమాటో కెచప్ సీసా కింద పడేసింది. అది కాస్తా పగిలి నేలంతా పాడయ్యింది.”
“పగల గొట్టిన సాస్ బాటిల్‌కి ఎక్కడ డబ్బు కట్టమంటాడో అని క్యాష్ కౌంటర్‌లో గొడవపడింది. పనిమనిషితో రోజూ గొడవేట. అందుకే ఆ అమ్మాయి పని మానేసింది కూడాట” అన్నారు.
“రోడ్డు డెడ్ ఎండ్ అయితే ట్రాఫిక్ డిస్టర్బన్స్ ఉండదని ఏరి కోరి ఇక్కడికొచ్చామండి. ఇంటి ముందు రోడ్డు మీద రెండు కార్స్ పక్క పక్కన పడతాయి. ఇంతంత పెద్ద కార్లు ఆ రోజుల్లో లేవు కదండి. అందుకే వాళ్ళు రెండు చిన్న కార్స్‌కి సరిపోయే రోడ్డు వదిలి ఇల్లు కట్టారు. పెద్ద కారు కాంపౌండ్‌లో పెట్టుకుని చిన్నది బయట పెట్టుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండదు. పక్క పక్కన ఉండే వాళ్ళు సామరస్యంగా ఆలోచించి బతకాలి కానీ.. ఇలాంటివి నిరూపించటం కూడా కష్టమేనండి.”
“అలా సర్దుకుపోలేని వాళ్ళు ఇలాంటి ఇల్లు కొనుక్కోకూడదండి. రోజూ వీరితో గొడవ పడేకంటే ఈ ఇల్లు అమ్మేసి వేరే చోటికి మారిపోవటమే బెటర్” అన్నాడు ప్రభాకర్.
“బావుంది మీరు చెప్పేది! ఇవ్వాళ్ళ ఇదయింది. రేపు ఇంకొక సమస్య వస్తుంది. మనం భయపడిన కొద్దీ భయపెడతారు జనం. మనమే వాళ్ళ మీద పోలీస్ కంప్లెయింట్ ఇద్దాం. చూద్దాం ఏమవుతుందో” అన్నది శ్యామల.
“ఇవన్నీ సివిల్ కేసులు! ఓ పట్టాన తెమలవు. మాటి మాటికి పోలీసులు రావటం.. మనని బేతాళుడి ప్రశ్నలు వెయ్యటం.. ఇదంతా ఓ న్యూసెన్స్! వీలైతే ఎక్కడైనా గేటెడ్ కమ్యూనిటీలో మా ఫ్రెండ్స్ ఉన్నచోట విల్లా దొరుకుతుందేమో చూద్దాం. అప్పటి వరకు బయటికెళ్ళాలంటే ఏ క్యాబో బుక్ చేసుకుందాం. ఈ లోపు తలకాయ నొప్పి భరిద్దాం! ఎటూ వచ్చే నెలలో పిల్లల దగ్గరకి రెణ్ణెల్లు వెళదాం అనుకుంటున్నాం కదా! అప్పటి వరకు ఎలాగో భరిద్దాం. మొండివాడు రాజు కంటే బలవంతుడన్నారు ఇందుకే” అన్నాడు ప్రభాకర్.