వాన కురిసిన రాత్రి

3
4

[సంచిక 2022 దీపావళి పోటీకి అందిన కథ.]

[dropcap]రా[/dropcap]త్రి పది దాటింది..

హోరున కురుస్తున్న వాన.. కటిక చీకటి.. రోడ్డు కిరువైపులా దట్టమైన చెట్లు కూడా ఉండటంతో.. డ్రైవింగ్‌ చాలా కష్టంగా ఉంది. కారు హెడ్‌ లైట్ల వెలుతురు సరిపోవడం లేదు. కళ్ళు చించుకుని రోడ్డుని చూస్తూ డ్రైవ్‌ చేస్తున్నాను. పక్క సీట్లో నా భార్య. వెనక సీట్లో నిద్రపోతున్న పిల్లలు. హైదరాబాద్‌‌లో సాయంకాలం బయలుదేరాము. అర్ధరాత్రి టైముకి గుడివాడ చేరుకోవచ్చని మా ఆలోచన. కారు అద్దాలన్నీ ఎక్కించి ఉండటం వల్ల.. బయట వర్ష భీభత్సం మాకు తెలీడం లేదు. ఉండుండి ఆకాశంలో ఉరుములు, మెరుపులు. బయలుదేరే ముందు వెదర్‌ ఫోర్‌కాస్ట్‌ చూసుకోకపోవడం మేము చేసిన తప్పు. అయినా ఇంటెర్నెట్‌లో చూపించే వెదర్‌ ఫోర్‌కాస్ట్‌ చాలా సార్లు కరెక్ట్‌ అవదు కదా.. హైదరాబాద్‌లో సాయంత్రం బయలుదేరిన మేము.. డిన్నర్‌ టైముకి విజయవాడ చేరుకున్నాము. కొండ మీదకు వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని, కిందకు వచ్చి హోటల్‌ మనోరమలో డిన్నర్‌ చేసి గుడివాడ వైపు బయలుదేరాము. సిద్ధార్ధ కాలేజ్‌ దాటగానే నెమ్మదిగా మొదలైన వర్షం.. కాసేపటికి భారీగా మారింది.

అసలు ఈ ప్రయాణం ఇంత సడన్‌గా పెట్టుకోవడానికి కారణం ఆస్తి గొడవ. గుడివాడ దగ్గర ఉన్న ఊళ్ళో పొలాల్ని పంచుకోవడానికి వెళ్ళాల్సి వస్తోంది. ‘రేపటికల్లా ఊళ్ళో ఉండాలి’ అని దాయాదుల నుండి కబురు రావడంతో అర్జంటుగా బయలుదేరాల్సి వచ్చింది.

ఇలా ఆలోచనల్లో పడి కారు డ్రైవ్‌ చేస్తున్నా. “మనం వేరే రూట్లో వెళ్తున్నామండీ” అని నా భార్య గట్టిగా అరవడంతో టక్కున బ్రేక్‌ వేసాను.

విజయవాడ దాటగానే కంకిపాడు దగ్గర లెఫ్ట్‌ టర్న్‌ తీసుకుని లూప్‌ లైన్‌లో.. గ్రామాల గుండా వెళ్దామని మా ఆలోచన.

చీకటి, వర్షం వల్ల, మనసులో ఏవేవో ఆలోచనలు మెదులుతూ ఉండటం వల్ల ఆ టర్న్‌ లోకి వెళ్ళకుండా తిన్నగా ముందుకు చాలా దూరం డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్ళిపోయాను. నా మీద నమ్మకంతో నా భార్య కూడా అది గమనించలేదు.

కారు రోడ్డుకి ఒక పక్కగా ఆపాను. ఇలా తిన్నగా వెళ్తే ఉయ్యూరు వస్తుంది. అక్కడి నుండి మేము వెళ్ళాలసిన ఊరు వెళ్ళవచ్చు. కానీ బాగా లాంగ్‌ అవుతుంది. పైగా వర్షం. చీకటి. అందుకే రివర్స్‌ తీసుకుని కంకిపాడు దాకా వెళ్ళి, మేము అనుకున్న రూట్‌లో వెళ్ళవచ్చు. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. రివర్స్‌ తీసుకుని వెనక్కు వెళ్దామా.. లేక ఇలాగే ముందుకు వెళ్దామా అన్న డైలమాలో పడిపోయాము. లేదా ఇంకొక షార్ట్‌కట్‌ ఏదైనా ఉంటే ఆ రూట్లో వెళ్ళడం మంచిదేమో అని ఆలోచిస్తున్నాము.

ఇంతలో.. ఎవరో ఒక వ్యక్తి నడుచుకుంటూ మా కార్‌ దగ్గరికి వచ్చాడు. వర్షంలో బాగా తడిసిపోయి ఉన్నాడు.

“సార్‌.. ఎక్కడికి వెళ్ళాలి” అని అడిగాడు దగ్గరికి వచ్చాక.

నేను గ్లాసు దించి “గుడివాడ..” అని చెప్పాను “మరి కంకిపాడు దగ్గర టర్న్‌ అవకుండా ఇంత దూరం ఎందుకు వచ్చారు..”

“సరే.. ఏదో వచ్చాంలే.. ఇంకో రూట్‌ ఏమైనా ఉందా..” అని అడిగాను

“అవును.. ఇంకో రూట్‌ ఉంది.. ఊళ్ళ మధ్యలో నుండి వెళ్తుంది. నన్ను మీతో పాటూ తీసుకెళ్ళండి.. దారి చూపిస్తాను” అన్నాడు. కాసేపు ఆలోచనలో పడ్డాము. అపరిచిత వ్యక్తిని మాతో తీసుకెళ్ళడం మంచిదేనా?.. నా భార్య వైపు చూసాను. తను కూడా ఏమీ చెప్పలేకపోతోంది. పోనీ స్మార్ట్‌ ఫోన్‌లో రూట్‌ వెదకవచ్చు. కానీ దానికంటే ఈ ప్రాంతం తెలిసిన మనిషిని నమ్మడం బెటర్‌ అని అనిపించింది. అందుకే –

“సరే.. రండి” అని కార్లోకి ఆహ్వానించాము. అతడు గబా గబా ఎక్కి ముందు సీట్లో కూర్చున్నాడు. “కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్‌ తీసుకోవాలి.. పదండి” అని చెప్పాడు. అతడిని నమ్మి కారు ముందుకు కదిలించాను. అదే నేను చేసిన తప్పు!

***

ఎక్కడో వైజాగ్‌లో పుట్టి పెరిగి హైదరాబాద్‌లో జాబ్‌ చేస్తున్న నాకు కృష్ణా జిల్లా లోని ప్రాంతాలు అంతగా తెలియవు. గుడివాడ దగ్గర ఉన్న ఒక పల్లెటూరు, మా అత్తగారి ఊరు. అప్పుడప్పుడు వచ్చి పోవడం తప్పితే అంతగా తిరిగింది లేదు. పైగా ప్రతీసారి ఒకే రూటు అంటే కంకిపాడు మీదుగా వెళ్ళడం, మళ్ళీ అదే రూట్లో వెనక్కు రావడం. అందుకే ఇంత కంఫ్యూజన్‌.

అతడు చూపించిన దారిలో వెళ్ళడం మొదలు పెట్టాం. అది ఒక సన్నటి రోడ్డు. చుట్టూ పొలాలు. కటిక చీకటి. దూరంగా ఉన్న ఊళ్ళల్లో వెలుగుతున్న స్ట్రీట్‌ లైట్లు.

“అదేంటయ్యా..ఈ రూట్‌ ఇలా ఉంది” అన్నాను

“ఇలాగే ఉంటుంది సార్‌.. కానీ దగ్గర దారి.. అదిగో ఆ లైట్లు కనిపిస్తున్నాయి కదా.. ఆ ఊరి దగ్గర మీరు రోడ్డు ఎక్కితే కంకిపాడు నుండి గుడివాడ వెళ్ళే రూట్‌కి కలుస్తారు.” అని చెప్పాడు.

అంటే నేను కంకిపాడు నుండి వెళ్దామనుకున్న రూటు, ఒక ట్రయేంగిల్‌ లోని రెండు సైడ్స్‌ అయితే, ఇప్పుడు వెళ్తున్న రూట్‌ డయాగ్నల్‌ అన్న మాట. ఆ విధంగా అనుకుని సంతృప్తి పడ్డాను. ముందుకు వెళ్తుంటే అంతా మట్టి రోడ్డు. వర్షం పడుతుండటం వల్ల పొలాల్లో నుండి నీరు ఆ రోడ్డు మీదకు ప్రవహిస్తోంది. అక్కడక్కడ కారు టైర్లు మునిగిపోతున్నాయి.

“నువ్వెక్కడి దాకా వెళ్ళాలి” అడిగాను నేను.

“మా వూరు ఇదే దార్లో ఉంటుంది సార్‌..” అని చెప్పాడు. కొంత దూరం వెళ్ళాక , ఏదో ఊరు వస్తున్నట్టుగా అనిపించింది.

సడన్‌గా ఆ వ్యక్తి నా మెడ మీద కత్తి పెట్టి “కారు ఆపు” అని అరిచాడు. షాక్‌ అయ్యాము మేము. టక్కున బ్రేక్‌ వేసాను. కాసేపు ఎలా రియాక్ట్‌ కావాలో అర్థం కాలేదు. హెడ్‌ లైట్‌ వెళుతురులో వర్షం విచిత్రంగా కనపడుతోంది. వైపర్స్‌ కారు అద్దం మీద నిరంతరాయంగా కదులుతున్నాయి. ఇంతలో.. అతనే బాధతో గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. నా మెడ మీద అతను పెట్టిన కత్తి జారిపోయింది. కాళ్ళూ చేతులూ చిత్రంగా ఆడిస్తున్నాడు. తలతిప్పి చూస్తే వెనక నుండి నా భార్య అతని మెడ చుట్టూ తన చున్నీ బిగించి గట్టిగా పట్టుకుంది. అందుకే ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటున్నాడు. కాసేపటికి అతనిలో చలనం ఆగిపోయింది.

వెంటనే కారు హెడ్‌ లైట్లు ఆపి, ఇంజన్‌ ఆఫ్‌ చేసేసాను. అతని ముక్కు దగ్గర వేలు పెట్టి చూసాను. కొన ఊపిరి ఉంది. స్పృహ తప్పినట్టున్నాడు. అతడిని కారులో నుండి నెమ్మదిగా దించి రోడ్డు పక్కనే ఉన్న పొలం గట్టు మీద పడుకోబెట్టాము నేనూ నా భార్య. పిల్లలు భయంగా మమ్మల్ని చూడసాగారు. కానీ తప్పదు కదా.. మేము చొరవ తీసుకోకపోతే మా ప్రాణాలకే ప్రమాదం కదా..

తర్వాత కార్లులో కూర్చుని మొబైల్‌లో రూట్‌ చూసాము. మేము వెళ్తున్న రూట్‌ కరెక్టే కానీ, రూట్‌ అంత బాగా లేదని, మధ్య మధ్యలో చిన్న చిన్న బ్లాకేజ్‌లు ఉన్నాయని చూపెడుతోంది. అయినా తెగించి ఆ రూట్‌ లోనే వెళ్ళాలని నిర్ణయించుకున్నాము. పైగా దూరంగా కనబడుతున్న స్ట్రీట్‌ లైట్లు మాలో ఆశలు రేకెత్తిస్తున్నాయి.

కారుని నెమ్మదిగా ముందుకి దూకించాను. మనసులో మాత్రం వెనక వదిలేసిన వాడు మళ్ళీ లేచి వస్తాడేమో అని భయం పీకుతోంది. వర్షం ఆపకుండా కురుస్తూనే ఉంది. తడిచిన మా శరీరాలు చలికి చిన్నగా వణుకుతున్నాయి. పిల్లల్ని నిద్రపొమ్మని చెప్పాము. వాళ్ళు కళ్ళు మూసుకుని పడుకోవడానికి ట్రై చేస్తున్నారు.

కొంచెం దూరం వెళ్ళాక రోడ్డు కొంచెం డౌన్‌ అయింది. ఆ డౌన్‌ లోకి దిగగానే నీళ్ళు తగిలాయి కారుకి. అలాగే ముందుకు పోనిస్తే బురదలో దిగబడింది టైరు. ఏక్సిలేటర్‌ బలంగా నొక్కాను. అయినా కారు ముందుకు కదలడం లేదు. గింజుకుంటోంది. ఇంతలో వెనక అద్దం మీద ఎవరో గట్టిగా కొడుతున్న చప్పుడు. వెనక్కు చూసిన మేము భయభ్రాంతులమయ్యాము.

***

కారు ఇంజన్‌ ఆఫ్‌ చేసాను. వెనక నుండి ఆ ఆగంతకుడు అద్దం మీద కొడుతూనే ఉన్నాడు. ఆలోచనలో పడ్డాను. కిందకు దిగి కారుని నెడదామనుకున్నాను. కానీ ఆ ఆగంతకుడు నా మీద పడి దాడి చేస్తే.. అసలే దెబ్బ తిన్న పులిలా ఉన్నాడు! అందుకే దిగకూడదు అనుకున్నాను. కానీ అతన్ని గమనిస్తే.. ఇందాక మేము పొలం గట్టు మీద వదిలిన వాడు కాదు. వీడు ఇంకో వాడు. మరి మాతో పనేమిటి వాడికి. ఎందుకు అద్దం మీద కొడుతూ ఉన్నాడు?

కారు లోపలి నుండి సైగలతో అడిగాను “ఏం కావాలి నీకు?” అని.

వాడు కూడా చేత్తో సైగలు చేస్తూ ఏదో చెబుతున్నాడు. నాకేమీ అర్థం కాలేదు. కారుని వెనక నుండి నెట్టమని చెప్పి ఇంజన్‌ ఆన్‌ చేసాను. వెనక నుండి కారుని నెట్టసాగాడు. ఫస్ట్‌ గేర్‌ వేసి ఏక్సిలేటర్‌ బలంగా నొక్కాను. నెమ్మదిగా కారు డౌన్‌లో నుండి అప్‌కి ఎక్కసాగింది. కాసేపటికి పైకి వచ్చింది కారు. వెనక నుండి వాడు ముందుకి వచ్చి బోనెట్‌ మీద కొట్టి ఏదో అడుగుతున్నాడు. సాయం చేసాడు కదా అని సాఫ్ట్‌ కార్నర్‌ ఉంది నాకు. నా భార్య వారిస్తున్నా వినకుండా డోర్‌ కొంచెం తెరిచాను. అంతే.. డోర్‌ మొత్తం లాగి, నా మీద పడి నన్ను బయటకు లాగాలని ట్రై చెయ్యసాగాడు. ఇంకో చేతిని నా భార్య మెడ వైపు సాచి ఆమె నగలను తెంపాలని ప్రయత్నిస్తున్నాడు. పిల్లలు హాహాకారాలు చేస్తున్నారు. సీట్లో కూర్చొని ఉండటం వల్ల నేను గట్టిగా రెస్పాండ్‌ అవలేకపోతున్నాను. ఇంతలో అతనే కెవ్వుమని అరిచి కారుకి దూరంగా వెళ్ళిపోయాడు. అతడి చేతి భుజం నుండి కారుతున్న రక్తం. అరుచుకుంటూ కాలు జారి పక్కనే ఉన్న కాలవలో పడిపోయాడు. వెంటనే నేను డోర్‌ లాక్‌ చేసి కారుని ముందుకి దూకించాను. వెనక్కి తిరిగి చూస్తే నా భార్య చేతిలో రక్తమోడుతూ కత్తి.. అదే కత్తి.. మొదట కారు ఎక్కిన ఆగంతకుడు కార్లో జారవిడిచిన కత్తి. ఈ విధంగా పనికి వచ్చింది అన్న మాట! మా గుండె దడ ఇంకా తగ్గలేదు.

“దేవుడా.. ఇదేం రూట్‌ రా బాబూ.. అందరూ ఇలాంటి వాళ్లే తగులుతున్నారు” అనుకున్నాను.

వాచీ చూస్తే టైము రాత్రి పన్నెండు దాటిపోయింది. అలా కొంత దూరం వెళ్ళాక చిన్న గ్రామం వచ్చింది. వీధి దీపాలు వెలుగుతున్నాయి. ‘హమ్మయ్య’ అనుకున్నాం. అయితే అక్కడి నుండి ఎలా వెళ్ళాలి అన్నది మాకు అర్థం కాలేదు. సెల్‌ తీసి చూస్తే చార్జింగ్‌ అయిపోయింది. అలా ఊళ్ళోంచి ముందుకు వెళ్ళాక ఊరి చివర.. లెఫ్ట్‌కి ఒక రూట్‌, రైట్‌కి ఒక రూట్‌ వచ్చాయి. ఎటు వెళ్ళాలో మాకు అర్థం కాలేదు. వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. అందరూ తలుపులు బిగించి నిద్రపోతున్నట్టున్నారు. అంతా నిర్మానుష్యంగా ఉంది. ఏం చేద్దామా అని అనుకుంటుండగా దూరంగా ఒక పాడుబడిన ఇంటి చూరు కింద అరుగు మీద నిద్రపోతున్న ఒక వ్యక్తి కనిపించాడు. కొంచెం రిస్క్‌ అయినా అతన్ని దారి అడుగుదామని అనుకున్నాము. గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది కదా..!

***

చాలా పాడుబడిన ఇల్లు అది. ఆ ఇంట్లో ఎవరూ ఉంటున్న దాఖలాలు లేవు. ఆ చుట్టుపక్కల ఇళ్ళు కూడా లేవు. అక్కడ నిద్రపోతున్నాడు అంటే భిక్షగాడేమో. చింపిరి జుట్టు.. మాసిన బట్టలతో అతని అవతారం అలాగే ఉంది మరి. ఎవరైతే మనకేంటి.. అవసరం మనది అనుకుని

“బాబూ.. ఓ.. బాబూ..” అంటూ తట్టి లేపాను అతన్ని. మంచి నిద్రలో ఉన్నట్టున్నాడు. చిన్నగా కదిలాడు. మళ్ళీ తట్టి లేపసాగాను. “ఎవురది..” అని విసుక్కుంటూ లేచాడు. కళ్ళు నులుముకొని నన్ను చూడటానికి ప్రయత్నిస్తున్నాడు.

“ఇక్కడి నుండి గుడివాడకు ఎలా వెళ్ళాలి బాబూ..” అని అడిగాను.

“ఎక్కడికి.. గుడివాడా..” అన్నాడు.

“అవును..” అన్నాను. అతడు పూర్తిగా తేరుకుని నన్ను, కార్లో ఉన్న నా కుటుంబాన్ని పరిశీలనగా చూడసాగాడు. నా మనసు మళ్ళీ కీడు శంకించసాగింది.

“తొందరగా చెప్పు బాబూ.. ఇప్పటికే లేట్‌ అయింది” అన్నాను

“ఇక్కడి నుండి ఎడమ వేపు ఎల్లండి.. గుడివాడకు ఎల్లొచ్చు” అని చెప్పాడు. కార్లో నుండి నా భార్య “తొందరగా రండి..” అని పిలుస్తోంది. నేను గబ గబా కార్లోకి వచ్చి స్టార్ట్‌ చేసాను. అతన్ని చూస్తే ఎందుకో నవ్వుతున్నట్టు అనిపించింది. అదేమీ పట్టించుకోకుండా కారుని ముందుకి ఉరికించి లెఫ్ట్‌ టర్న్‌ తీసుకున్నాను.

క్రమంగా చీకటి ఎక్కువయింది. వర్షం సంగతి సరే సరి.. ఈ రాత్రంతా కురిసేలా ఉంది.

ఆ చీకట్లో అలా ముందుకు వెళ్ళాము. ఎందుకో ఆ రూట్‌ సరిగ్గా లేదు. అయినా అలాగే వెళితే ఒక పెద్ద కాలువ లాంటిది వచ్చింది. అప్పుడు అర్థం అయింది. ఆ కాలువ కంకిపాడు మీదుగా గుడివాడకు వెళ్ళే మార్గంలో రోడ్డు వెంబడి సాగిపోతూ ఉంటుంది. అంటే మేము ప్రతీసారి వెళ్ళే ఆ రోడ్డుకి దగ్గరగా వచ్చేసామన్నమాట. ఆనందంగా అనిపించింది కాసేపు.. ఈ కాలువ దాటాలంటే వంతెన ఉండాలి కదా అని చుట్టూ చూసాను. ఎక్కడా వంతెన కనబడలేదు. కానీ మా పక్కనే ఉన్న స్మశానం కనబడింది. అంటే వాడు చెప్పిన రూటు స్మశానానికా! ఎందుకో భయం వేసింది. టక్కున బ్రేక్‌ వేసి కారు ఆపాను. ఇంతలో మా కారుకి దగ్గరగా ఆ భిక్షగాడు.  ‘హి..హి..హి..’ అని నవ్వుతున్నాడు. గుండెల్లో దడ పెరిగింది మాకు.

కారు రివర్స్‌ చేసాను. హఠాత్తుగా మా కారు ముందు ప్రత్యక్షమయ్యాడు. “ఎక్కడికి వెళతారు.. ఆ కాలవ లోకి రారా.. నేను ఆ కాలవ లోనే ఉంటా..” అని కళ్ళు పెద్దవి చేసి పిలుస్తున్నాడు. కారు చుట్టూ అరుస్తూ తిరుగుతున్నాడు. బహుశా పిచ్చివాడేమో.. లేక ఏ మంత్ర తంత్రాలు సాధన చేస్తున్నావాడేమో! వీడిని ఎలా వదిలించుకోవాలో అర్థం కాలేదు నాకు. అతను కారుకి అడ్డం పడుతుండటంతో స్పీడ్‌ పెంచలేకపోతున్నాను. అతడు నా భార్య ఉన్న వైపు వచ్చాడు. ఆమె గ్లాస్‌ దించి చటుక్కున ఏదో విసిరింది. అంతే.. “నన్ను వదిలేయండి.. నన్ను వదిలేయండి..” అని కీచుగా అరుస్తూ వాడు ఆ కాలువ వైపు పారిపోయాడు. హమ్మయ్య అనుకుని నేను కారును ముందుకు ఉరికించి ఆ పాడుబడిన ఇంటి నుండి రైట్‌ టర్న్‌ తీసుకున్నాము. ఆ రూట్లో అలా వెళ్ళగానే ఒక వంతెన కనబడింది. ‘కలవపాముల’ అన్న బోర్డ్‌ దాని పక్కనే ఉంది. ఆ వంతెన మీద నుండి వెళ్ళి దిగి గుడివాడ వైపు వెళ్ళే రూట్‌ మీదికి వచ్చాము. అంటే మేము ఎప్పుడూ వెళ్ళే కరెక్ట్‌ రూట్‌ లోకి వచ్చామన్న మాట. అది నాకు చిరపరిచితమైన రూట్‌ కాబట్టి ‘ఇక ఏ భయమూ లేదు’ అనుకుని ప్రశాంతంగా డ్రైవ్‌ చేస్తూ – “వాడి మీదకు ఏం విసిరావు..” అని అడిగాను నా భార్యను.

“అమ్మవారి సన్నిధిలో ఉంచిన కుంకుమ.. మంత్రించిన నిమ్మకాయి అండీ.. పొద్దున్న గుడిలో తీసుకున్నాను కదా” అంది. మనసులోనే దుర్గమ్మ తల్లికి నమస్కరించుకుని డ్రైవింగ్‌ మీద కాన్సంట్రేట్ చేసాను. చిత్రంగా వర్షం కూడా తగ్గిపోయింది.!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here