కల్పిత బేతాళ కథ-1 తగిన శిక్ష

0
3

[ప్రముఖ బాలసాహితీవేత్త డా. బెల్లంకొండ నాగేశ్వరరావు రచించిన ‘కల్పిత బేతాళ కథలు’ చదవండి.]

[dropcap]ప[/dropcap]ట్టువదలని విక్రమార్కుడు చెట్టు పైనున్న శవాన్ని భుజం పై వేసుకుని మౌనంగా నడవసాగాడు.

విక్రమార్కుని భుజంపై ఉన్న శవాన్ని ఆవహించి ఉన్న బేతాళుడు “మహిపాలా, భిండివాలము-అసి-కోదండము-భల్లాంతకము-నారాచకము-వజ్రము – ముష్టి – ముద్గరము – శూలము – ముసలము – భూసుండిక – ప్రాసము – ప్రకూర్మము-కప్పటము-కటారి-కాగరము-అయోదండము-కణయము – కుంతము – ఈటి – అంతలము – పరుశువు – తోమరము – చక్రము -పరిఘటము – పట్టిసము – వంకిణిక – సబళము – చిన్వి – సెలకట్టె – ఆశానిపాతము – శక్తి- గధ – బిండివాలము – ఘోరశరము – భూఘండి – వత్సదంతం- కర్మీరము – నఖరము – వెడదవాతియమ్ము వంటి పలు ఆయుధాలతో యుధ్ధం చేయగలిగే వీరుడివి అయిన నీ గురించి నాకు బాగా తెలుసు. మన ప్రయాణంలో నీకు అలసట తెలియకుండా ‘తగిన శిక్ష’ అనే కథ చెపుతాను విను.

అమరావతి రాజ్యాన్ని చంద్రసేనుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతని మంత్రి పేరు సుబుద్ధి. రాజుకు పలు రకాల వస్త్రాలు సేకరించి తను ధరించేవాడు.

ఒకరోజు రాజుగారు సభలో ఉండగా ఇద్దరు యువకులు రాజ సభలో ప్రవేశించి “ప్రభువులకు వందనాలు. మా పేర్లు రామ లక్ష్మణులు, నేత పనిలో ఈ భూమండలంలో మమ్ము మించినవారు ఎవ్వరూ లేరు. దేవగురు ముఖంగా అభ్యసించిన నేతవిద్యను ప్రదర్శిస్తూ తొలిసారిగా మేము తయారుచేసిన వస్త్రాన్ని ఎందరో రాజులు కోరినా త్రోసిపుచ్చి, వస్త్ర ప్రియులైన తమకే ఇవ్వలని నేరుగా తమరి కొలువుకే వచ్చాం” అన్నారు.

“చాలా సంతోషం. ఎందరో రాజులను కాదని అదే వస్త్రం నాకే ఇవ్వలి అన్న మీ నిర్ణయం అభినందనీయం. ఆ వస్త్రం తయారికి మీకు ఎంత ధనం కావాలో తీసుకొండి. మీరు నేసే వస్త్రం విశిష్టత ఏమిటో కాస్త వివరించండి” అన్నాడు చంద్రసేన మహారాజు.

“ప్రభూ ఆ దివ్యవస్త్రం తయారీకి మూడు సంవత్సరాల కాలం పడుతుంది.. కానీ..” అంటూ ఆగిపోయారు రామలక్ష్మణులు.

“ఏం ఆగిపోయారే, ధనం గురించా?” అన్నాడు మహారాజు.

“కాదు మహారాజా! ఆ దివ్యవస్త్రం ప్రత్యేకత ఏమిటంటే, ఆ వస్త్ర తయారీదార్లకు, మరియు పుణ్యాత్ములకే కనిపిస్తుంది. పాపాత్ముల కంటికి కనిపించదు. ధర్మప్రభులు, దయార్ద్ర హృదయులు అయిన మీరు తప్పక పుణ్యాత్ముల కోవలోకే వస్తారు. మిగిలిన వారి సంగతి మాకు తెలియదు” అన్నారు రామలక్ష్మణులు.

“భయపడకండి మీకు కామలసిన మగ్గం, నూలు, ధనం అన్ని సౌకర్యాలు ఏర్పాటు మీరు కోరిన విధంగా ఏర్పాటు చేయబడతాయి. మా వసంతమండపం మీకు విడిదిగా ఈ మూడు సంవత్సరాలు ఏర్పాటు చేయబడుతుంది. మీ నేత పనికి ఎటువంటి అంతరాయం, ఆటంకం కలగుకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయిస్తాను. మీ నేత పని ప్రారంభించండి” అన్నాడు చంద్రసేన మహారాజు.

“ధన్యులం ప్రభు” అన్నారు రామలక్ష్మణులు.

అలా రోజులు, వారాలు, పక్షాలు, మాసాలు గడచి పోయాయి.

రామలక్ష్మణులు కోరిన మూడు సంవత్సరాల కాలం గడచి పోయింది.

సామంత రాజులు, పురప్రముఖులు, తన పరివారంతో తను వస్తున్నట్లు రామలక్ష్మణులకు కబురు పంపిన రాజు, దివ్యవస్త్రం చూడటానికి వచ్చి వసంత మండపంలో ఆసీనులై ఉన్నారు.

రాజుగారికి నమస్కరించిన రామలక్ష్మణులు ఉట్టి చేతులు ముందుకు చాపుతూ “తిలకించండి మహారాజా! ఈ దివ్యవస్త్రాన్ని నేయడానికి మూడు సంవత్సరాలు కష్టపడ్డాం!” అన్నారు.

రామలక్ష్మణుల చేతులపై రాజుగారికి కానీ ఆయనతో పాటు వచ్చిన వారికి గాని ఎవ్వరికి ఎటువంటి వస్త్రం కనిపించలేదు. ఆ దివ్యవస్త్రం తమకు కనిపించలేదంటే తము ఎక్కడ పాపాత్ముల లెక్కలోనికి వస్తామని అందరూ మౌనం వహించారు.

రామలక్ష్మణులు తెలివిగా తమను మోసగించారని రాజు, మంత్రి గ్రహించారు.

ఏం చేయాలో తెలియని రాజు గారు జరిగిన మోసాన్ని గ్రహించి, నలుగురిలో నవ్వులపాలు కాకుండా ఉండాలని “భళా! మీ కళా చాతుర్యం, నీలిరంగు వస్త్రానికి సింధూరపు రంగు అంచు ఎంత అందంగా ఉందో” అన్నాడు.

“అవును దివ్యవస్త్రం రమ్యంగా, కళాత్మకంగా ఉంది” అని రాజు గారి వెంట వచ్చినవారంతా వంతపాడారు.

“చల్లని ప్రభువుల పాలనలో మీ రాజ్యంలో అందరూ పుణ్యాత్ములుగానే కనిపిస్తున్నారు” అన్నారు రామలక్ష్మణులు.

“కళాకారులారా! ఏం కావాలో కోరుకొండి” అన్నాడు రాజుగారు.

“దానకర్ణులు, లక్ష వరహాలు ఇప్పించండి మహాప్రభు” అన్నారు రామలక్ష్మణులు.

రాజు గారి చెవి వద్ద గుసగుసలాడాడు మంత్రి సుబుద్ది.

తక్షణమే స్పందించిన రాజు “భటులారా ఈ రామలక్ష్మణులను జీవిత ఖైదీలుగా చెరసాలకు తరలించండి” అన్నాడు.

అప్పటి వరకు కథ చెపుతున్న బేతాళుడు “విక్రమార్క మహారాజా, రాజుగారి చెవిలో మంత్రి ఏం చెప్పాడు? రామలక్ష్మణులకు రాజు జీవిత ఖైదు ఎందుకు విధించాడు నాకు తెలియాలి. నా ఈ ప్రశ్నలకు తెలిసి సమాధానం చెప్పకపోయావో తల పగిలి మరణిస్తావు” అన్నాడు.

“బేతాళా, మంత్రి సుబుధ్ధి చాలా తెలివైనవాడు. సాటివారి ముందు రాజు మోసపోయినట్లు తెలియకుండా, రాజు గారి చెవిలో ‘ప్రభూ రామలక్ష్మణులు కోరిన ధనం ఇచ్చి మన రాజ్యం దాటి పోనిస్తే వీళ్లు లోకం అంతటా పలు రాజ్యాలలో తమ దివ్యవస్త్ర ప్రదర్శన చేస్తారు. అప్పుడు దివ్యవస్త్రం అందరి వద్ద ఉంటుంది. అప్పుడు మన వద్ద ఉన్న దివ్యవస్త్రానికి విలువ ఉండదు. అందుకు వీరిని బ్రతికినంతకాలం ఖైదీలుగా మన వద్దే ఉంచుకుంటే ఆ దివ్యవస్త్రం మన వద్ద మాత్రమే ఉంటుంది. ఆ ఖ్యాతి మనకు దక్కాలి అంటే మరో దారి లేదు వీరిని చెరసాలకు పంపవలసిందే!’ అని రామలక్ష్మణులు చేసిన మోసానికి దెబ్బకు దెబ్బ అనేలా మంత్రి సుబుధ్ధి ప్రవర్తించాడు” అన్నాడు విక్రమార్కుడు.

విక్రమార్కునికి మౌనభంగం కావడంతో శవంతో సహా మాయమై చెట్టు పైకి చేరాడు బేతాళుడు.

పట్టువదలని విక్రమార్కుడు బేతాళునికై వెనుతిరిగాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here