తనివి తీరని పాటల సృష్టికర్త

1
4

[dropcap]ఆ[/dropcap]యన పాటల తోటమాలి అట! ఎవరో సరిగ్గా ఎంత బాగా చెప్పేరు. అవును అందుకే ఎవరికీ నచ్చిన పాటలు వారు తలచుకుంటూనే వుంటారు, ఆ తోటలోకి వెడుతూనే వుంటారు. వారే వేటూరి సుందరరామ మూర్తి గారు. వారు జనవరి 29వ తేదీ 1936లో జన్మించారు. వారు రాసిన పాటలు సంగీత ప్రియులకు వీనుల విందులుగా స్థిరంగా నిలిచి మనలను అలరిస్తూనే వున్నాయి. ఈనాడు దినపత్రిక, ఈటీవీ ఛానల్ అధిపతి శ్రీ రామోజీరావు గారూ వేటూరి హైదరాబాద్ వచ్చినప్పటి నుంచీ ఆత్మీయ మిత్రులు. ప్రతిభ ఎవరిలో ఉంటే వారిని గుర్తించే నైపుణ్యం, సహజంగా సినిమా సంగీతం అంటే ప్రీతీ ఉన్న రామోజీరావు గారు వేటూరి వారిలోవున్న గొప్పతనాన్ని ఒడిసిపట్టి ప్రముఖ గాయకులు శ్రీ ఎస్. పి. బాలసుబ్రహమణ్యం గారిని సంప్రదించి ‘పాడుతా తీయగా’.., ఆ తర్వాత ‘స్వరాభిషేకం’ వంటి టీవీ కార్యక్రమాలకు అంకురార్పణ చేశారు.

ఆ కార్యక్రమాలు ప్రేక్షకాభిమానులను ఎంతగానో అలరించాయి. సినీ సంగీత అభిమానులకు పాటలు రాసే కవులు చేరువ అయ్యారు. ఈ కార్యక్రమాలలో బాలూ గారు వేటూరివారు రాసిన పాటలలోని పూర్వాపరాలు, అర్థాలు పాట రాయడం వెనుక కష్టం ఇబ్బందులు తెలియచెప్పడం వలన వారిమీద అభిమానం ఇష్టం, గౌరవం, కుతూహలం పెరిగాయి.

ప్రతి సంవత్సరం వేటూరి జయంతిని జరుపుతూ వారి పాటలను వినిపిస్తూ మీడియా పత్రికలూ వారిని మనకు గుర్తు చేస్తూనే వున్నాయి. వారి సినీ సాహిత్య ప్రస్థానం 1974లో వచ్చిన ‘ఓ సీత కథ’ చిత్రం లోని హరికథతో మొదలైంది.

ఆ హరికథను ప్రముఖ నటుడు N.T.R. విన్నారు. ‘అడవి రాముడు’ చిత్రానికి వేటూరి చేత పాటలు రాయిద్దాం అన్నారుట. ..అంతే వేటూరి రాసిన ఆ పాటలు ఎంతటి పేరు తెచ్చుకున్నాయి అంటే మాకు తెలిసిన పెద్దావిడ ఒకరు ‘దేవుడి పాటగా వరుసకట్టి రోజూ పాడుతూ ఉండేవారు’. అదేమిటీ అంటే ‘హరి హారి హరి హారి హరి.. హరి!’ అంటూ (ఆరేసుకోబోయి పారేసుకున్నాను). మాకు విన్నప్పుడు ఒకటే నవ్వు వచ్చినా ఆ పాట ఆవిడను అంతగా ఆకట్టుకోడం ఆశ్చర్యం కలిగించింది. అర్థం తెలియని పిల్లలే కాదు అన్ని వయసుల వారిని నోరారా పాడుకునేటంత మాయ చేసింది.

‘అడవి రాముడు’ మొదలుకుని పెండ్యాల నాగేశ్వర రావు, ఎస్ రాజేశ్వర రావు, కేవీ మహదేవన్, ఆదినారాయణరావు, రమేష్ నాయుడు, రాజన్-నాగేంద్ర, చక్రవర్తి, ఇళయరాజా, కీరవాణి, ఏఆర్ రహమాన్ వంటి ప్రముఖ సంగీత దర్శకులతో కలిసి పనిచేసి అపురూపమైన గీత సాహిత్యాన్ని విని మైమరచి పోయే పాటలను మనకు అందించారు.

వారి పాటలు నచ్చినవి ఎన్నో వున్నా ‘మానసవీణా మధుగీతం’, ‘మల్లెలు పూచే’, ‘ఎన్నెన్నో అందాలు’, ‘మాటరాని చిన్నదాని’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’, ‘కరిగిపోయాను’ లాంటి పులకరింత కలిగించే తనివి తీరని పాటలు వున్నాయి.

అప్పుడే కాదు ఎప్పటికి వన్నెతరగని గొప్ప సాహిత్యం. వారిని గురించి అందరికి తెలిసినా మరోసారి పంచుకోడం అంతే!

ముఖ్యంగా చెప్పాల్సింది సుందర రామమూర్తి గారి పేరు ప్రఖ్యాతులలో వారి సతీమణి శ్రీమతి సీతామహాలక్ష్మి గారు కూడా భాగస్థురాలే అన్నది నిజం. ఆవిడ గురించి కూడా మీకు చెప్పాలని వుంది. 2015 అక్టోబర్ 11వ తేదీ ఈటీవీ స్వరాభిషేకంలో వేటూరి గీతాల కార్యక్రమం ప్రసారం అయినప్పుడు బాలూగారు వేటూరివారి కుటుంబాన్ని వేదికమీదకు ఆహ్వానించి సీతగారి గురించి కొన్ని మాటలు చెప్పేరు. ఆ వీడియో యుట్యూబ్‌లో చాలాసార్లు చూసాను.

మరోసారి 2018 సంవంత్సరం సత్యసాయి నిగమాగమం థియేటర్‌లో ‘వేటూరి గీతాంజలి’ కార్యక్రమం, బాలు గారు ‘పాడుతా తీయగా’ మొదటి విజేత పార్ధు కలిసి నిర్వహించినపుడు ప్రత్యక్షంగా సీతగారిని చూసాను. ఆ తరువాత నేను అమెరికా వెళ్లి నాలుగేళ్లు వుండిన తర్వాత వచ్చినపుడు వాకింగ్‌లో అనుకోకుండా సీతగారిని చూసినపుడు చాలా సంతోషంగా పలకరించాను.

మా ఇల్లు వారి ఇంటికి చాలా దగ్గర. అలా వారి పరిచయం కొనసాగిస్తూ వచ్చాను.

ఒకరోజు వాళ్ళ ఇంటికి రమ్మని పిలిస్తే వెళ్ళాను. వారి కుమారుడు రవిప్రకాష్ కూడా వున్నారు. రెండు గంటలపాటు వేటూరి సుందర రామమూర్తిగారి గురించి ఎన్నో అనుభవాలు మాటాడుకున్నాం.

సుందరరామ మూర్తి 2001లో హైదరాబాదు వచ్చి స్థిరపడ్డారు. దగ్గిరలో వున్న నాగార్జున కమ్యూనిటీ లైబ్రరీకి వెళ్లి పుస్తకాలు తెచ్చుకుని చదవడం, రోజూ వార్తాపత్రిక, వార మాస పత్రికలూ చదవడం ఆవిడకు ఇష్టమైన హాబీ. వయసుతో సంబంధం లేకుండా స్వంతంగా పనులు చేసుకుంటూ చక్కగా మాటాడుతారు.

అప్పటి తరం ఇల్లాలిగా ఇంటిని కుటుంబాన్ని చక్కదిద్దుకుని సాహిత్యమే స్నేహంగా చేసుకుని కాలాన్ని సద్వినియోగం చేసుకోడం వారిని చూసి నేర్చుకోవాలి. సీతగారితో స్నేహం నాకు అపురూపంగా తోచింది.

వాకింగ్‌లో మొదటిసారి పలకరిస్తే “మాస్క్‌లో ఉన్న నన్ను ఎలా గుర్తుపట్టారు?” అని అడిగారు.

“మిమ్మల్ని వీడియోలో చూసాను ఎన్నోసార్లు. అందుకే గుర్తుండిపోయారు. వేటూరివారి పాటలకు అభిమానిని. మిమ్ములను చూసాక మీ మీద అభిమానం ఏర్పడింది. ఇప్పుడు ఇలా నాముందు అనుకోకుండా కలిశారు.” అని చెప్పినపుడు ఆవిడ వదనంలో ‘సంతోష వీచిక’. అదే నన్ను సీతగారిని దగ్గిర చేసింది. నా ఈ సంతోషాన్ని వేటూరివారి జన్మదినం సందర్భంగా పాఠకులతో వేటూరివారి అభిమానులతో పంచుకోడం సముచితంగా భావిస్తున్నాను.

ప్రముఖ దర్శకుడు విశ్వనాధ్ వేటూరి వారిని ‘అన్నా’ అని పిలిచేవారు.

శేఖర్ కమ్ముల ‘నా గురువు వేటూరి’ అంటారు.

తనికెళ్ళ భరణి ‘సాక్షాత్తు పురుషరూపంలో ఉన్న అపార సరస్వతి’ అంటూ అభివర్ణించారు.

గీతాంజలి దర్శకుడు మణిరత్నం ‘నాకు తెలిసిన ఓకే ఒక అత్యుత్తమ వ్యక్తిత్వంగల వ్యక్తి వేటూరి’ అని ప్రశంసించారు.

వేటూరి సుందర రామమూర్తి గారి మాట తీరు, వ్యక్తిత్వం సరళంగానూ ఆత్మీయపూర్వకంగాను ఉండటం వలన సినీకళాకారులు, దర్శక నిర్మాతలు సంగీత దర్శకులు వారిపట్ల ఎనలేని స్నేహభావంతోను గౌరవ భావంతోను ఉండేవారని వారిని తెలిసినవారు చెప్పేరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here