[శ్రీ శివానంద మహారాజ్ రచించిన వ్యాఖ్యానం, వ్యాసాశ్రమ శ్రీ మలయాళ స్వామివారి వ్యాఖ్యానం ఆధారంగా శ్రీమతి సంధ్యా యల్లాప్రగడ అందిస్తున్న ఆధ్యాత్మిక సుమమాలిక ‘నారద భక్తి సూత్రాలు’]
నారద భక్తి సూత్రాలు
30. స్వయం ఫలరూపతేతి బ్రహ్మకుమారః
అర్థం: ఈ భక్తి స్వయంగా మోక్షదాయిని అని బ్రహ్మకుమారుడైన నారదుల వారి ఆలోచన.
భక్తే ముక్తి యని నారదుల వారు చెబుతున్నారు. మునుపు సూత్రాలలో ఎందరో మహర్షులు వారి వారి భావనలు చెప్పారు.
కాని నారదుల వారి ప్రకారం భక్తి కలిగిన జీవుడు ముక్తి పొందుతాడు.
భక్తే ముక్తి, భక్తే ఫలము. భక్తిని మించినది మరోటి లేదు.
“త్వత్పాదభక్తి యుక్తానాం విజ్ఞానం భవతి క్రమత్।
తస్మాత్త్వద్భక్తియుక్తా యే ముక్తి భాజస్త ఏవ హి॥”
భగవంతుని మీద భక్తి కలిగిన వారికి ఆత్మజ్ఞానం క్రమంగా కలుగుతుంది. అందుకే భక్తి కలవారు ముక్తి పొందుతున్నారు. అందు సందేహం లేదు.
అందుకే భగవద్గీతలో
“తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం।
దదామి బుద్ధియోగం తం యేన మాముసయాన్తి తే॥”
ఎప్పుడూ భగవంతుని యందు భక్తి కల వారు భగవంతుని చేరుతారు. వారికి ముక్తిని ఆయనే ఇస్తాడు. “నన్ను భజించు భక్తుడు దేని వలన మోక్షం పొందగలడో అటు వంటి జ్ఞానము అతనికి నేనే ఇస్తాను..” అని చెప్పాడు భగవంతుడు గీతలో.
కాబట్టి భక్తి ప్రేమలతో భగవంతుని అర్పిస్తే ముక్తి తథ్యమని చెబుతున్నారు.
31. రాజగృహ భోజనాదిషు తథైవ దృష్టత్వాత్।
రాజు గృహాలలో, లేదా భోజనశాలలో మధుర ఫలాలు చూసినంత మాత్రాన సంతోషం కలగదు. వాటిని ఆస్వాదించాలి. అలాగే భగవంతుని మీద ప్రేమ లేక కేవలం భగవంతుని కథలు చదువుతూ, వింటూ ఉంటే ప్రయోజనం లేదు. ఒకరికి వాటిని అనుభవించే అనుష్ఠానం కావాలి.
పరమ భక్తులుగా లేదా సాధు పురుషులుగా వేషం వేసినంత మాత్రాన లాభం ఉండదు. భక్తి ప్రేమలు ఉండాలి.
నారదులవారు ఉదాహరణలు ఇస్తున్నారు ఇక్కడ-
ఒక రాజు అడనికి వేటకు వెళ్ళాడు. అక్కడ పసివాడైన తన కుమారుడిని కోల్పోతాడు. ఒక అటవికుడు రాకుమారుని చూసి తెచ్చి పెంచుతాడు. కొంతకాలానికి ఆ పిల్లాడికి తాను రాజకుమారుడ్ని అని తెలుస్తుంది. అతను నగరానికి వెడతాడు. అడవిలో ఉన్నా, రాజగృహానికి వెళ్ళినా అతను అతనిలా ఉంటాడు. రాజుకుమారుడైనా అటవికుడైనా అతను అతనే. అలాగే భక్తుడు ముక్తి వచ్చినా అతను భక్తునిగానే మిగులుతాడు.
భక్తునిలో ఆత్మ సచ్చితానందం సదా ఉంటుంది. అతని భక్తి వలన దానిని అడ్డుకునే ఇబ్బందులు మాయమైయి భక్తుడు స్వాత్మాను చూడగలుగుతాడు. అంతే.
32. న తేన రాజపరితోషః క్షుచ్చాన్తిర్వా
అర్థం: రాజు చక్కగా ఉన్నాడన్న జ్ఞానం వలన రాజప్రీతి కలగదు. అలాగే భోజన పదార్థాలు బాగున్నాయని తెలిసినంత మాత్రాన క్షుద్బాధ తీరదు.
రాజు ప్రీతి కోసం ఏమైనా చెయ్యాలి కాని రాజు బాగున్నాడని అని కూర్చుంటే రాజుకు ప్రీతి కలగదు. భోజనం చేస్తేనే ఆకలి తీరుతుంది కాని గాజు అలమారలో పదార్థాలు చూసినంత మాత్రాన తీరదు.
భక్తితో భగవంతుని ధ్యానించినంతనే ముక్తి కలుగుతుంది. చీకటి పోవాలంటే దీపం వెలిగించాలి. అలాగే వాక్కులతో అజ్ఞానం పోదు. అనన్య భక్తితో అనుష్ఠానం చెయ్యాలి. భక్తి గొప్పది అని వినటంతో సరిపోదు. భక్తితో అనుష్ఠానం చేసి జ్ఞానం పొంది ఆత్మజ్ఞాని కావాలి.
33. తస్మాత్సైవ గ్రాహ్యా ముముక్షుభిః
ముముక్షువులకు అంటే అన్ని బంధనముల నుంచి విడుదల కావాలనుకునే వారిచే గ్రహించబడేది దైవభక్తి.
ముక్తి కోరే వారు యోగమార్గమవలంబించినా, జ్ఞానమార్గమవలంబించినా, తపోమార్గమవలంబించినా భక్తి మార్గం తప్పక అవలంబించాలి.
పరాభక్తి అత్యంత ఉత్కృష్టమైనది. ఏ మార్గమైనా తుదకు భక్తి మార్గములోకి రావాలి. అది పరాభక్తి వైపు దారి చూపుతుంది. భవబంధాలను త్రుంచుతుంది.
భాగవతపు ఈ పద్యాలు పరమాత్మను గురించి చెబుతాయి
“సంసారజీమూత సంఘంబు విచ్చునే
చక్రి దాస్య ప్రభంజనము లేక
తాపత్రయాభీల దావాగ్నులారునే
విష్ణు సేవామృత వృష్టిలేక
సర్వంకషాఘౌఘ జలరాశులింకునే
హరి మనీషా బడబాగ్ని లేక
ఘన విపద్గాఢాంధకారంబులడగునే
పద్మాక్షనుతి రవిప్రభలు లేక
నిరుపమాపునరావృత్తి నిష్కళంక
ముక్తినిధి గానవచ్చునే ముఖ్యమైన
శార్జ్గకోదండ చింతనాంజనము లేక
తామరస గర్బునకునైన దానవేంద్ర॥”
బ్రహ్మకైనా పరమాత్మ చింతతోనే ముక్తి అని చెబుతున్నారు భాగవతంలో. అందుకే భక్తే ముక్తి.
ఈ సూత్రం తదనంతరం నారదులవారు భక్తి ఎలా పెంచుకోవాలో, భక్తి సాధనము గురించి చెబుతున్నారు. 34 నుంచి 50 వరకూ సూత్రాలు భక్తి పెంపుదల సాధనం గురించి మాట్లాడుతాయి..
34. తస్యాః సాధనాని గాయన్త్యాచార్యాః
భగవద్భక్తి కలగటానికి పూర్వ మునులు ఆచార్యులు ఎన్నో ఉపాయాలు చెప్పారు.
“స్తుతిస్మరణపూజాభిర్వాజ్మనఃకాయకర్మభిః।
సునిశ్చలా భవేద్భక్తి రేతదీశ్వరపూజనమ్॥”
స్తుతి, స్మరణ, పూజాదులు వాజ్మనఃకాయ కర్మలలో కలగటము ఈశ్వరభక్తి.
కొందరు భగవంతుని స్తోత్రాలతో పూజిస్తారు. కొందరు మననం చేస్తారు. కొందరు సాకారమూర్తిని పూజిస్తారు. ఇవ్వన్నీ కూడా భక్తికి గుర్తులే.
కొందరు కర్మలను శ్రద్ధగా ఆచరించటము భక్తి అనుకుంటారు.
ఏదైనా నియమాన్ని తీసుకు పాటించటము భక్తి అంటారు.
“యథా తోయ ప్రవాహానాం సముద్రః పరమావధిః।
తథైవ సర్వమార్గాణాం సాక్షాన్నిష్ఠా మహేశ్వరః॥”
నదులన్నీ సముద్రంలో కలిసినట్లుగా ఏ విధమైన ఉపాసనలో ఉన్నా చివరకు పరమాత్మలో చేరవలసినదే.
ఎవరు కర్మలను భగవంతునికి అర్పిస్తారో వారు ఆయననే చేరుతారు.
అభ్యాసముతో వైరాగ్యంలో పరమాత్మను అర్చిస్తే ఆయనను చేరుతామని గీతలో చెప్పాడు పరమాత్మ.
నిష్కామ కర్మల వలన కూడా అదే జరుగుతుంది.
“మోక్షసాధనసామగ్ర్యాం భక్తిరేవ గరీయసీ।
స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే॥”
మోక్షసాధనలో భక్తియే ముఖ్యమైనది. స్వస్వరూపాను సంధానము భక్తి అంటున్నారు.
35. తత్తువిషయత్యాగాత్సంగత్యాగాచ్చ
భగవంతుని మీద భక్తి ప్రపంచ విషయాలపై వైరాగ్యం చేత, ప్రాపంచిక జన పరిత్యాగం వలన కలుగుతుంది.
నేనూ నాది అన్నది సర్వ బంధాలకు కారణము.
ఇంద్రియ సుఖాలు మనసును చెదరగొడతాయి. ఆ సుఖాలు పరమాత్మను చేరే మార్గం నుంచి దూరంగా పడవేస్తాయి.
మనస్సులో కోరిక ఉంచుకొని విషయత్యాగం చేసాననటం సమంజం కాదు. కోరికలను త్యజించటము ముఖ్యమైన పని. అలా కోరికలు లేని స్థితికి చేరటమే నిజమైన వైరాగ్యం. అట్టి వైరాగ్యం కలిగినవారే పరమానందం పొందగలుగుతారు.
విషయవాసనలు పంచేంద్రియాలతో వస్తున్నాయి. అవి శబ్ద స్పర్శ రూప రస గంధాలు.
విషయవాసనలు మీద వైరాగ్యం కలగటానికి వాటి గురించి ఆలోచించి వాటిలోని దోషాలను చూసినట్లైతే మనకు వైరాగ్యం కలుగుతుంది.
కామి కాని వాడు మోక్షకామి కాడు అని కోరికలను తీరుస్తూ పోతూ ఉంటే వాటికి అంతు ఉండదు. కాబట్టి కోరికలలో దోషాలను గురించి విచారం చేసి వాటిని తొలగించుకోవటమే ఉత్తమమైన మార్గం.
“వైరాగ్యం పుష్కలం స్యాన్నిష్పలం బ్రహ్మదర్శనమ్।
తస్మాద్రక్షేత విరతిం బుధో యత్నేన సర్వదా॥”
సంపూర్ణ వైరాగ్యం లేనిదే భగవంతుని దర్శనం కలగదు. కాబట్టి బుద్ధి పూర్వకంగా వైరాగ్యం కోసం కృషి చెయ్యాలి.
జరిగిపోయిన కాలములోని సంతోషకరమైనవి తలవటం వైరాగ్యాన్ని ఇవ్వదు. కాబట్టి అటువంటి వాటిని మర్చిపోవటం ఉత్తముల లక్షణం.
ఆ సంతోషాలు క్షణికాలు. ఎండమావులలో జలం వంటివి.
“ఏతయోర్మన్దతా యత్ర విరక్తత్వ ముముక్షయోః।
మరౌ సలిలవత్తత్ర సమాధేర్బానమాతత్రా॥”
ఎవరికి వైరాగ్యం కలుగుతుందో వారికి ముముక్షత్వం కలిగి దైవ దర్శనం కలుగుతుంది.
విషయాలయందు త్యాగము వైరాగ్యము సాధకులు తప్పక సాధించాలి.
మానసిన బాహ్య వైరాగ్యాలు భక్తికి సోపానాలు. భగవద్భక్తులు సంఘం కోరరు.
“సంగన్న కుర్యాదసతాం శిశ్నో దరతృషాం క్వచిత్।
తస్యానుగస్తమస్యంధే పతత్యంధానుగాంధవత్॥”
గ్రుడ్డివాడిని అనుసరించరాదు. వాడు గోతిలో పడితే మనము పడతాము. అలాగే సన్మార్గ ప్రవర్తన లేని వారిని అనుసరించరాదు. మోహమన్న గోతిలో పడతాము.
పరమాత్మను గురించి వినటం, భక్తుల సంఘం, పూజ చెయ్యటము, మంత్రాలను ఉచ్చరించటము, త్యాగము, ఇంద్రియ నిగ్రహం వంటి వాటితో భక్తి దృఢమవుతుంది.
“ముక్తిం దదాతి వైరాగ్యం రాగో యచ్చతి బంధతామ్।
మతంవై సర్వశాస్త్రాణాం యథేచ్చసి తథా కురు॥”
వైరాగ్యం మోక్షం కలగచేస్తుంది. విషయాల మీద కోరిక బంధానాలను కల్పిస్తుంది.
సర్వ శాస్త్రాల సారమిదే. కాబట్టి రాగం వీడి విరాగం కోరటం, వైరాగ్యము సాధనతో, భక్తి కలిగి పరమాత్మను చేరవచ్చును.
36. అవ్యావృత భజనాత్
అర్థం: ఎడతెగని భజన వలన మోక్షం పొందుతారు.
పూర్వ సూత్రంలో సంఘత్యాగము, వైరాగ్యంతో భగవంతుని చేరవచ్చని చెప్పారు. అలా అన్నింటి మీద వైరాగ్యం ఎలా కుదురుతుంది అంటే మన కోరికలలో దోషాలను చూస్తే వాటి మీద వ్యామోహం పోయి వైరాగ్యం కలుగుతుందని అనుకున్నాము. అంతే కాదు ఈ సూత్రం ప్రకారం ఎడతెగని నిరంతర పరమాత్మ చింతన, భజన వలన కూడా విషయవాసనల మీద వైరాగ్యం కలుగుతుంది అని నారదుల వారు సూచిస్తున్నారు. అలా పరమాత్మ మీద ప్రేమ కలుగుతుంది.
ఓపికతో, ఎదురయ్యే అడ్డంకులను, జబ్బులను, దుఃఖాలను నిరంతర పరమాత్మ నామముతో దాటవచ్చు.
గీతలో భగవానుడు చెప్పాడు “నిరంతరము నన్ను ధ్యానించు యోగులకు నేను సదా అందుబాటులో ఉంటాను అని”
ఇసుక నుంచి నూనె తీయ్యవచ్చు, ఇసకను తాడుగా పేనవచ్చు కాని సంసారం మాత్రం దాటలేము. కేవల భగవంతుని ధ్యానము వల్లనే అది సాధ్యం.
“తైలధారామివాచ్చిన్నం దీర్ఘ ఘంటానినాదయత్।
ఉపాస్యం ప్రణవస్యాగ్రం యస్తం వేద సవేదవిత్॥”
ఒక గిన్నె నుంచి మరో గిన్నె లోకి నూనె పోసినప్పుడు ధార ఎలా ఉంటుందో, ఘంటానాదం చేసినప్పుడు నాదం ఎలా ఉంటుందో అలా భగవంతుని భజనము నిరంతరాయంగా సాగాలి.
భగవన్నామం నిరంతరాయంగా సాగినప్పుడు మోక్షానికి అర్హుడవుతాడా భక్తుడు.
37. లోకేఽపి భగవద్గుణ శ్రవణ కీర్తనాత్
లోకములో భగవంతుని యొక్క గుణాలు వినటం వలన, కీర్తనము చేయటము వలన భక్తి కలుగుతుంది.
నారాయణుడు నారదులవారితో “ఓ నారదా! నేను వైంకుఠములో లేను, యోగుల హృదయాలలో లేను. నేను నా భక్తులు ప్రియంగా పాడే కీర్తనలలో నివసిస్తాను” అని చెప్పాడు.
భగవంతుని కీర్తనలు అంత శక్తివంతమైనవి. వాటిని పాడినవారికే కాదు విన్నవారికీ భగవద్భక్తి తద్వారా మోక్షం కలుగుతాయి.
భగవంతుని కోసం భజనము ప్రార్థన సామాన్య జీవితం నుంచి వేరు కాదు. అది జీవితంలో మమైక్యమవ్వాలి.
గాలి మేఘాలను చెదరగొట్టినట్లు, సూర్యుడు చీకటిని తీసివేసినట్లుగా భక్తి మనస్సులోని చెడును తీసివేస్తుంది.
జపము, భజనము, కీర్తనము మున్నగునవి వయస్సు, జాతి మతాలకతీతంగా మానవులందరూ చెయ్యతగినటువంటిది.
సంసారమన్న దావాగ్నిలో చిక్కుకున్న జీవులకు భగవత్ నామము వినటం తప్ప మరో తరుణోపాయం లేదని గీతలో చెబుతాడు పరమాత్మ.
నిరంతర జపము వల్ల హృదయం శుద్ధమవుతుంది. మౌనం అలవాటుగా మారుతుంది.
జపము తదనంతరం ధ్యానము చెయ్యటం వలన చేసే వారు మంత్రాన్ని తన శరీరమంతా నింపుతారు.
మంత్రము మూలంగా ఉత్పన్నమయ్యే తరంగాలు ప్రత్యేకమైనవి. అవి శరీరాన్ని మనస్సునే కాక ఆ ప్రదేశాన్ని ఆ భక్తుని చుట్టు ప్రక్కలా కూడా శుభ్రపరచి గొప్ప ఆధ్యాత్మిక అభివృద్ధిని ఇస్తాయి.
భగవంతుడు నిరాకారుడు అయినా మన కోసం రూపం తీసుకున్నాడు. లీలను చేస్తున్నాడు.
నీటికి ఎటు వంటి రూపము లేకపోయినా మంచుగా అదే గడ్డకట్టి ఉంటుంది. అదే పొగమంచుగా ఆవిరవుతుంది.
భగవద్భక్తుల కొరకు పరమాత్మ రూపం, నామము గ్రహించి వచ్చి కాపాడుతూ ఉంటాడు.
(సశేషం)