మానవత్వం (స్త్రీ పాత్ర లేని నాటిక)

    0
    4

    [box type=’note’ fontsize=’16’] “మనిషి పుట్టి పెరగడం, సభ్య సమాజంతో కలిసి జీవించడం ఒక ఎత్తైతే… తను జీవించిన ఆ జీవితాన్ని నలుగురికి వుపయోగపడేలా చేసుకోవడం మరో ఎత్తు. అది నిస్వార్థంగా సాగి అవతలి వాళ్ళకు ఆదర్శప్రాయంగా వుంటే మంచి మనుగడకు, మానవత్వానికి దారి తీస్తుంది” అని చెబుతుంది బొందల నాగేశ్వరరావు నాటిక “మానవత్వం“. [/box]

    వ్యాఖ్యానం: రసజ్ఞులైన ప్రేక్షక మహాశయులకు నమస్సుమాంజలి.

    మా ఈ గంగా కళాలయం సమర్పిస్తున్న “మానవత్వం” నాటిక డాకే.ఎల్.వి.ప్రసాదు, హనుమకొండ వారి “మనీషి” కథకు నాటకీకరణ.

    మంచితనం, మానవత్వం బహు అరుదుగా కనబడుతున్న ప్రస్తుత సమాజంలో భిన్న వృత్తులు, ప్రవృత్తులు కలిగిన ఓ నలుగురు వ్యక్తుల మధ్య జరిగిన ఓ చిన్న సంఘటనే నాటికగా మలచబడినది.

    ఆ నలుగురి స్వభావాలలో ఎలాంటి మార్పులు చోటు చేసుకొన్నాయోనన్నది తెలియజేసే క్రమంలో ఈ “మానవత్వం” నాటిక మీ ముందుకు తేబడినది.

    మా యీ చిరు ప్రయత్నానికి మీ ఆదరణ, అభిమానం, ఆశీస్సులను అందించగలరని ఆశిస్తున్నాము. ఇక దయతో వీక్షించండి.

    ఈ నాటికలో పాత్రలు…

    మల్లయ్య (చెప్పులు కుట్టుకునేవాడు): ॥ వయసు 35 సం ॥

    రాములు (పోలీసు):   ॥ 55 సం॥

    ప్రసాదరావు (ప్రభుత్వపు కార్యాలయంలో అధికారి):॥ 37 సం॥

    బండి తాత (చేతిబండి లాగే ముసలాడు): ॥ 60 సం॥

    శివుడు (బిక్షగాడు):   ॥ 57 సం॥

    ***

    (అది కలెక్టరేటుకు వెళ్ళే దారి. ఆ దారిలో ప్లాట్‌ఫాంను ఆనుకొని చిల్లర దుకాణాలు వున్నాయి. వాటిలో మల్లయ్య మరమ్మతు చేసే చెప్పుల దుకాణం ఒకటి. ఆ కొట్లో ఓ నాలుగు జతలు చెప్పులు, ఇనుప గూటం, ఆరె, పాలీష్ డబ్బాలు వరుసగా వున్నాయ్. వెనుక ఓ గుంజకు ఓ సంచి, అందులో ఓ నీళ్ళ బాటిల్ వుంది. ఇక తెర లేస్తూనే మల్లయ్య ఓ చెప్పును కుడుతున్నాడు. అంతలో శివుడు తూలుతూ వచ్చి చెప్పుల కొట్టు ముందు పడ్డాడు. తన చేతిలో వున్న పళ్ళెం క్రింద పడి అందులోని చిల్లర డబ్బు చెల్లాచెదురౌతోంది.. మల్లయ్య లేచి దగ్గరకు వెళ్ళి చెదరిన చిల్లరను ఏరి పళ్ళెంలో వేసి చేతికిచ్చాడు)

    మల్లయ్య:        ఏమిటీ? బాగా మందు కొట్టావా… తూలుతూ వచ్చి నా కొట్టు ముందు పడ్డావ్!

    శివుడు:          మందా…. లేదు బాబూ! కడుపుకు తిండి లేక కళ్ళు బయర్లు కమ్మి మైకంతో వచ్చి పడ్డాను. నేను మెతుకు ముఖం చూసి మూడు రోజులైందయ్యా!

    మల్లయ్య:       అయ్యో… అలాగా! లే… ఇలా కూర్చో (సంచిలోని బ్రెడ్డు, అరటి పళ్ళను తీసిస్తూ). ఈ బ్రెడ్డు, అరటి పళ్ళు నాకోసం తెచ్చుకున్నా. నువ్వు తిను. ఆకలి తీరుతుంది. (స్టూలు మీద కూర్చోపెట్టాడు. శివుడు అబగా తిన్నాడు. నీళ్ళు తాగాడు)

    శివుడు:          (పైకి లేచి) ఆకలి తీర్చావు బాబూ! నీకు దణ్ణం. నేనొస్తాను (వెళ్ళబోయాడు).

    మల్లయ్య:        ఆగు! ఆకలి తీరుతూనే వెళ్తానంటావేంటి? నా సందేహాలకు సమాధానం చెప్పు!?

    శివుడు:           ఏమిటి బాబూ!

    మల్లయ్య:        కాదూ… మనిషివి బాగానే వున్నావు! ఎంచక్కా ఏదేని పని చేసుకొని బ్రతకొచ్చుగా? మార్కెట్టులో మూటలు మోసినా నీ భోజనానికి సరిపడ డబ్బులొస్తాయి. ఆ డబ్బుతో ఆకలి తీర్చుకోవచ్చు. (అలా మల్లయ్యను చూశాడు శివుడు) ఏంటలా చూస్తున్నావ్? నీకు కష్టపడాలని లేదా? మోసాలు, దొంగతనాలు చేయడం తప్పు, కాని ఏదేని పని చేసుకొని బ్రతకటం న్యాయం కదా!?

    శివుడు:      నిజమే బాబూ! కాని పనులు చేయ లేకే…ఈ భిక్షాటనతో బ్రతుకుతున్నాను. అంత కవలం దొరికిన రోజు తింటాను. దొరకని రోజు నా వద్ద డబ్బులుంటే టీ, బన్నుతో సరి పెట్టుకుంటాను. ఆ డబ్బూ లేక పోతే నీళ్ళు తాగి ఆ గుళ్ళో పడుకుంటాను.

    మల్లయ్య:        ఏం నీకు కుటుంబం లేదా?

    శివుడు:         వుంది బాబూ! నాలో ఓపిక, శక్తి వున్నన్నాళ్ళు గానుగెద్దులా బండ కష్టం చేసి భార్య పిల్లాడిని పోషించాను. వయస్సు భారం వల్ల ఏ పని చేయలేని పరిస్థితి కొచ్ సరికి నా వల్ల వాళ్ళకు ఎలాంటి లాభం లేదన్న నిర్ణయానికొచ్చి నన్ను ఇంటి నుంచి గెంటేశారు.

    మల్లయ్య:      (ఆశ్చర్యంతో) భగవంతుడా! ఏమిటీ అన్యాయం. కట్టుకున్న భార్య, కన్నకొడుకే ఇంటి నుంచి తరిమేశారా! ఎంతటి దారుణమిది? జనం ఇలా కూడా వుంటారా? పోనీ… మళ్ళీ నీకు ఇంటికి వెళ్ళాలనిపించలేదా?

    శివుడు:        లేదు బాబూ! నేను ఇంటినుంచి బయట పడ్డాక వాళ్ళు సంతోషంగా వున్నట్టు తెలుసుకున్నాను. మళ్ళీ ఇంటికి వెళ్ళి వాళ్ళకు ఇబ్బంది కలిగించి, భారంగా మారకూడదనుకున్నాను. అందుకే ఈ భిక్షాటనతో పొట్ట పోసుకొంటూ వాళ్ళ కంట పడకుండా బ్రతుకుతున్నాను.

    మల్లయ్య:        రోషగాడివేలే! మరి ఏదేని పని చేసుకొని బ్రతకొచ్చుగా! భిక్షం అడుక్కోవడమేంటి?

    శివుడు:       నేను కష్టమైన పనులు చేయలేను బాబూ! అవును బాబూ! వయస్సు భారం ఓ ప్రక్క, ఆస్థుమా రోగం మరో ప్రక్క నన్ను కృంగదీస్తున్నాయి.

    మల్లయ్య:      సరిసరేలే! నాకంతా అర్థమైంది. రేపట్నుంచి ఇక్కడికే…. నా వద్దకు రా! నువ్వు కష్టపడకుండా సంపాయించుకొని తినే మార్గాన్ని ఏర్పాటు చేస్తా! అవును. షూలకు, చెప్పులకు పాలీష్ పట్టడం నేర్పుతా. ఆ పనిలో కనీసం రోజుకు ఏభై రూపాయలు వస్తాయి. కూర్చొని సంపాయించుకోవచ్చు. వాటితో నీ జీవనం సాగించుకోవొచ్చు.. ఇదిగో! ఇప్పటికి ఈ పదుంచుకో! (జేబులోంచి తీసి శివుడి చేతిలో పెట్టాడు. శివుడు కళ్ళకద్దుకొని పళ్ళెంలో వేసుకున్నాడు).

    శివుడు:         వస్తాను బాబూ!

    మల్లయ్య:      వెళ్ళు. అయితే రేపు ఖచ్చితంగా రావాలి. నీ పొట్టకూటికి నువ్వే సంపాయించుకోవాలి. ఏం?

    శివుడు:         అలాగే బాబూ! వస్తాను (అడుగులో అడుగు వేసుకొంటూ వెళ్ళి పోయాడు శివుడు. మల్లయ్య కూర్చొని చెప్పును కుడుతున్నాడు).

    రాములు:       (లాఠికర్రతో ప్రవేశించి) ఆఁ… ఏరా మల్లయ్యా! ఇవాళ వుదయాన్నే కొట్టు తెరచినట్టున్నావ్!?

    మల్లయ్య:        లేదయ్యా…! వొంట్లో బాగో లేక ఆలస్యంగా ఇప్పుడే… యింతకు ముందే తెరిచాను.

    రాములు:       అవునా?! అంటే బేరాలు ఇంకా తగల్లేదంటావ్… అంతేగా…!?

    మల్లయ్య:       అవునయ్యా… కూర్చొండి! (మల్లయ్య తన ప్రక్కనున్న స్టూలులాంటి పీటను పోలీసు రాములు వద్దకు నెట్టాడు)

    రాములు:       ఏంట్రోయ్…! తీరిగ్గా కూర్చోమన్నట్టు స్టూలునిస్తున్నావ్. నేనసలే స్ట్రిక్టు. పైగా డ్యూటీ మీదున్నా. కనుక ఇక్కడ కూర్చొని నీతో తీరిగ్గా మాట్లాడ్డానికి రాలా! (ఒక్క సెకనాగి) ఆఁ… ఇచ్చేయ్! ఏంటలా చూస్తున్నావ్! అదేరా… నా మామూలు నాకిచ్చేయ్! నేనెళ్ళిపోతా!

    మల్లయ్య:       మామూలా… అప్పుడే ఎక్కడివయ్యా! గిరాకీలు తగలాలిగా!

    రాములు:       ఏం… నిన్నటి సంపాదనలో పదో పరకో లేదా జేబులో… (జేబును పట్టుకు చూశాడు)

    మల్లయ్య:      ఎక్కడివయ్యా! మేము ఏపూటకాపూట పొయ్యిలో పిల్లిని తోలుకునేవాళ్ళం. నిన్నొచ్చిన కూలీ డబ్బులు నిన్ననే అయిపోయాయి! అవునయ్యా… నా రెక్కల కష్టంతో నలుగురం తింటూ బతకాలి. ఏ రోజు కష్టం ఆ రోజుదే మరి. ఇక పైసా వెనకేసుకోవడం ఎలా సాధ్యమో చెప్పండి? (తల గొక్కొంటూ) ఓ పది రూపాయలుంటే నాలాంటోడొకడు భిక్షాటనకొస్తే… పాపం అతన్ని చూళ్ళేక యిచ్చి పంపాను.

    రాములు:     అబ్బో… నువ్వు భిక్షం వేసేంతగా ఎదిగావట్రా మల్లయ్యా! భలే… భలే! సరే… ఆ సంగతెందుగ్గాని అదిగో అక్కడున్న ఆ డబ్బుల డబ్బానిలా తే! అందులో డబ్బులుంటాయోమో నేను చూసుకుంటా!

    మల్లయ్య:      లేవయ్యా! నేను అబధ్ధం చెప్పను.

    రాములు:      ఓహో… సత్య హరిశ్చంద్రుడవేలేరా! అయినా నేను చూసుకొంటానంటే నీకేంటి బాధ? నేనసలే స్ట్రిక్టు. ఇవ్వరా ఆ డబ్బుల డబ్బాను. ఇవ్వమంటుంటే… (క్రిందికి వొంగి తనే డబ్బాను అందుకొని అందులో వున్న ఒక్క రూపాయి బిల్లను తీసుకొని) నిజం చెప్పావురా మల్లయ్యా! నువ్వు నిజాయితీపరుడవే! అయినా ఇందులో ఓ రూపాయుందిరోయ్! ఆ సంగతి చెప్పకుండా దాచావ్! ఇక నేనూ వూరికే వెళ్ళడం ఎందుకాని ఈ రూపాయిని తీసేసుకొన్నాను. (నవ్వి) ఇవాళ్టికి నాకు ఇదేరా బోణి (అప్పుడు మల్లయ్య పోలీసు రాముల్ని ఏహ్యభావంతో చూశాడు).

    రాములు:    (కదలబోయి తన ‘షూ’ వంక చూసుకొని ఆగి) మల్లయ్యా! ఇందా… ఈ ‘షూ’ని కాస్త పాలీష్ చేసి పెట్టమ్మా! (కాలిని స్టూలు మీదుంచాడు. మల్లయ్య తను చేస్తున్న పనిని పక్కన పెట్టి ‘షూ’కి పాలీష్ పడుతున్నాడు) మల్లయ్యా… అరేయ్ మల్లయ్యా!

    మల్లయ్య:       చెప్పండయ్యా!

    రాములు:      నా ఖాళీ కడుపు అదోలా అరుస్తోందిరా! నేనిప్పుడు ‘టీ’ తాగాలి. (మల్లయ్య మౌనంగా వున్నాడు) ఒరేయ్…! ఏంట్రా మౌనంగా వున్నావ్! నేను ఇప్పుడు ‘టీ’ తాగాలి ఆఁ…

    మల్లయ్య:        అంటే తమకిప్పుడు ఆ భాషన్న’టీ’కొట్లోని మసాలా ‘టీ’ కావాలంటారు. అంతేగా!?

    రాములు:       అవునురా! అలవాటుపడ్డ ప్రాణం. అదేంటో నీవద్దకొస్తే ఈ టైంకి ఆ ‘టీ’ తాక్కపోతే నాకదోలా వుంటుందిరా! అదీ… ఎంచక్కా తేయాకు మార్చి చిక్కటి పాలతో కలిపి, అందులో రెండు యాలకులు తగిలించి అదేదీ… నువ్విప్పుడన్నావే మసాలా టీయని…. ఆ మసాలా ‘టీ’ యిప్పించావంటే తాగేస్తాను. అప్పుడుగాని ఈ ప్రాణానికి హాయిగా వుండదురా! ఇదిగో… నేనసలే స్ట్రిక్టు. తెప్పించరా ‘టీ’ ని.

    మల్లయ్య:       (నవ్వి) ఈ మండుటెండకు ‘టీ’ మంచిది కాదయ్యా!

    రాములు:       ఏంట్రా నువ్వంటుంది?

    మల్లయ్య:     అవునయ్యా! ఎండకు బండలు సైతం బ్రద్దలై పోతున్నాయ్! ఈ వేళప్పుడు తమరు ‘టీ’ తాగడం కన్నా ఏ మజ్జిగనో.. షర్బత్తునో తీసుకుంటే మంచిదయ్యా !

    రాములు:      ఏటేటీ…అంటే నీకు ఆ మజ్జిగ కొట్లోనూ ఖాతా వుందన్న మాట. భలే… అయినా నేను ఇవాళ మజ్జిగ తాగనురా! నువ్వంటున్న మజ్జిగ కోటాను రేపటికి పెట్టుకొందాం. నాకు మసాలా ‘టీ’ ని తీసివ్వు చాలు.

    మల్లయ్య:      అది కాదయ్యా… మజ్జిగ తాగితే కడుపు చల్లగా వుంటుందని…

    రాములు:    అంటే… ఏంట్రా నీ ప్లాను? మజ్జిగను నా పైసలతో కొనుక్కొని తాగమంటావేటి కొంపదీసి. అది కుదరదమ్మా! ఆ మజ్జిగ లేక షర్బత్ ప్రోగ్రామును రేపటికి పెట్టుకొందాం! ఇవాల్టికి ‘టీ’ తెప్పించు. చాలు. అవునురా మల్లయ్యా నీ ఖాతాలో ‘టీ’ తాగితే నాకు అదో రకమైన ఆనందం రా! నిజం చెపుతున్నా… నన్నీయెండ ఏమీ చేయదు. నాది ఉక్కు శరీరంరా…. తెలుసాగా! నేనసలే స్ట్రిక్టు. టీ తెప్పించరా!

    మల్లయ్య:    (నవ్వి) అలాగేనయ్యా! మొత్తంలో తమరు తమ జేబులోని పైసల్ను ఖర్చు పెట్టరు. నా ఖాతాలో టీ తాగడమే ఎంతో హాప్పీ అంటారు. అంతేగా?

    రాములు:    ఎట్టకేలకు అర్థం చేసుకున్నావురా! తెప్పించరా ‘టీ’! మొత్తానికి అదేంటో నా పైసలతో ఏదేని కొనుక్కొని తినాలన్నా, తాగాలన్నా అదోలా వుంటుందిరా!

    మల్లయ్య:     (నవ్వి) అదంతేనయ్యా! మీలాంటోళ్ళకు అలాగే వుంటుంది. (అటు తిరిగి) ఓ భాషన్నా! పిల్లోడితో ఓ స్పెషల్ స్ట్రాంగ్ మసాలా ‘టీ’ని పంపించు.

    రాములు:    నీకురా మల్లయ్యా!

    మల్లయ్య:     నాకొద్దయ్యా! కడుపునిండా సద్దన్నం తినొచ్చా!

    రాములు:    (అంతలో పిల్లాడు తెచ్చి యిచ్చిన టీ ని తీసుకొని చేత్తో తిప్పుతూ, ఆర్పుకొంటూ తాగాడు. గ్లాసును ప్రక్కన పెట్టి తన ‘షూ’ వంక చూసుకొన్నాడు) మల్లయ్యా! భలే చేశావురా పాలీష్. ఇప్పుడు ‘షూ’ అద్దాల్లా మెరిసి పోతున్నాయ్! నా ముఖం ఆ ‘షూ’లో కనబడుతుందిరోయ్! వస్తాను. (రెండడుగులు ముందుకేసి ఆగి) ఇదిగో…! ‘షూ’కు పాలీష్ పట్టావని మామూలు యివ్వను మరిచిపోకు. అది వేరు. ఇది వేరు. దానికదే దీనికిదే! తెలిసిందా. మళ్ళీ వస్తాను… మామూలు తీసి రడీగా వుంచు. ఆఁ. (పోలీసు రాములు వెళ్ళిపోతుంటే అతని వేపే చూస్తూ తన చేత్తో నొసటిమీద కొట్టుకొని మళ్ళీ పనిలో నిమగ్నమైయ్యాడు మల్లయ్య)

    ప్రసాదరావు:    (ప్లాస్టిక్ సంచితో ప్రవేశించి) ఏం మల్లయ్యా… బాగున్నావా?

    మల్లయ్య:        బాగున్నా సారూ! కూర్చొండి. (స్టూలుని గుడ్డతో తుడిచి చూపాడు) చెప్పండి సారూ… ఏంటి సంగతి?

    ప్రసాదరావు:   నీతో మాట్లాడే సంగతులేముంటాయ్ మల్లయ్యా! (సంచిలోని షూ తీసి మల్లయ్య చేతికిచ్చి) ఇది మా అబ్బాయి షూ. బాటం వూడిపోయింది. మరో రెండురోజుల్లో పూర్తిగా పాడైపోయి దేనికది విడిపోయేలా వుంది. అందుకనీ…

    మల్లయ్య:      చక్కగా అతికించి కుట్టి పాలిష్ చేసి యివ్వాలంటారు. దానికేం… బ్రహ్మండంగా చేసి పెడతానయ్యా!

    ప్రసాదరావు:    చేసిపెట్టు మల్లయ్యా! లేకపోతే నేను ఇంటికి పోలేను. నిజం చెప్పాలంటే ఇవాళ ఆదివారం. సెలవు రోజు కనుక మా వాడి వద్ద బ్రతికిపోయాన్నేను. లేకుంటే చిరిగి పోయిన ఈ షూ సాకుతో రేపు స్కూలుకు ఎగనామం పెట్టేస్తాడు వాడు. ఇంకా చెప్పాలంటే కొత్త షూ కు డిమాండ్ చేస్తాడు. అవును మల్లయ్య… వాడు అలాంటి వాడే! జిడ్డోడు.

    మల్లయ్య:     వూరుకొండి సారూ! కడుపున పుట్టిన బిడ్డను అలా అనకండి. చిన్నపిల్లల మనస్తత్వమే అంత. పైగా అది మీలాంటి గొప్పోరు చదువుకునే స్కూలాయే!

    ప్రసాద రావు:  అది నిజమేలే! కాని కొత్త షూ కొనడానికి నావద్ద యిప్పుడు పైసలుండాలిగా! అసలే నెలాఖరు. ప్రతి రూపాయి ఆచి తూచి ఖర్చుపెట్టే సమయం కదా యిది.

    మల్లయ్య:     (చిన్నగా నవ్వి) అలాగే వుంటుందిలే సారూ! అయినా ఎలాగూ గడిచిపోతుందిలే!…

    ప్రసాదరావు:   అది నిజమేలే! ఇంతకు ఎంతిమ్మంటావ్ ?

    మల్లయ్య:     రెండు షూల బాటం సోల్ వూడిపోయింది. గట్టిగా పేస్టు చేసి కుట్టి చక్కగా పాలీష్ చేసి మరో సంవత్సరం వరకు కొత్తవి కొనకుండా వుండేలా చేసి పెడతాను. ఓ వందిచ్చుకొండి.

    ప్రసాదరావు:   మై గాడ్… వందా… ఓర్ నీ….

    మల్లయ్య:   తక్కువే అడిగాను సారూ! ఇదిగో… కొత్తవి కొనాలంటే ఓ ఏడెనిమిది వందలవుతాయి. తమర్ని నేనడుగుతోంది వందేగా!…(బ్రతిమాలుతూ) చక్కగా చేసి పెడతాను సారూ! దయతో యిచ్చుకొండి. చూస్తారుగా నా పనితనాన్ని.

    ప్రసాదరావు:   నీ పనితనాన్ని గూర్చి నాకు తెలీదా ఏంటి! అందుకేగా మా అపార్టుమెంటోళ్ళందరం వెతుక్కొంటూ నీ వద్దకొచ్చేది. నిజం చెప్పాలంటే అవతలి వాళ్ళు చెప్పుకు రెండు మేకులు కొట్టి పదులు, ఇరవైలని గుంజుకొంటారు. నువ్వలా కాదుగా మల్లయ్యా! చెప్పు…ఇంకో మాట చెప్పు.

    మల్లయ్య:     ఏం చెప్పమంటారు సారూ! బజారులో ఈ షూలకు పేస్టు పాలీసులే కాక ఎదవది ఈ నూలుకండె రేటు కూడా పెరిగి పోయింది. ఇక రెక్కాడితే కాని డొక్కాడదని ఈ పనిమీదొచ్చే పైసలతో నేనూ, నా పెళ్ళాం పిల్లలని నలుగురం తింటూ బ్రతకాలి. కాస్త ఆలోచించండి.

    ప్రసాదరావు:   అంటే ఏంటీ… నీ ఇంటి తిండికి ఓ వారానికి సరిపడే డబ్బుల్ని నేనే యివ్వాలంటావా? ఉహుఁ… అదేం కుదరదు. ఇంకో మాట చెప్పు?

    మల్లయ్య:     మళ్ళీ మాటేంటి సారూ! చెప్పానుగా!

    ప్రసాదరావు:   నేను అది కుదరదన్నానుగా!

    మల్లయ్య:     మీరెప్పుడూ యింతే సారూ! బేరమాడి కాస్తో కూస్తో తగ్గించుకుంటే కాని తృప్తిపడరు.అయినా పది పరక్కు పాత చెప్పులు మరమ్మతు చేసుకు బ్రతికేవాణ్ణి.., నా వద్ద బేరమా?

    ప్రసాదరావు:   అదంతే! చెప్పు… ఎంతో కొంత తగ్గించి చెప్పు?!

    మల్లయ్య:     నా వంతు అయిపోయింది సారూ… ఇక తమరే చెప్పాల!

    ప్రసాదరావు:   అయితే ఓ ఎనభై రూపాయలిస్తాను చేసిపెట్టు.(మల్లయ్య ఏదో చెప్పబోయాడు) ఆగు. ఇంకేం మాట్లాడకు. ఇచ్చేది తీసుకో! పని చేసి పెట్టు. ఇదిగో పైసలు తగ్గస్తున్నానని చేసే పనిలో నాణ్యతా లోపం వుండకూడదు సుమా! (ప్రసాదరావు పైకి లేచాడు)

    మల్లయ్య:     అలాగే సారూ!(షూని పేస్టుతో అతికిస్తూ) అప్పుడే లేచారేంటీ? మజ్జిగ తెప్పిస్తాను కూర్చొండి తాగుదురు.

    ప్రసాదరావు:  నువ్వు తెప్పించే రోడ్డమ్మటి మజ్జిగను నేను తాగను మల్లయ్యా! నాకదోలా వుంటుంది. అటు దుర్గాభవన్ కెళ్ళి ఫిల్టర్ కాఫీ తాగొస్తాను! ఈ లోపు నీ పని ముగించి షూని రడీగా వుంచు. ఏం? (ప్రసాదరావు లేచి తన మాటల్ని మల్లయ్య చెవిన పడ్డాయో లేదో నన్న సందేహం రాగా అక్కడే నిలబడ్డాడు. మల్లయ్య షూని చేతుంచుకుని పరిశీలనగా చూసి పేస్టు చేసి దాన్ని తనకాళ్ళ మధ్య ఇరికించుకొని కుట్లు వేస్తూ అటు రోడ్డు వేపు చూసి చేస్తున్న పనిని ఆపాడు)

    ప్రసాదరావు:    మల్లయ్యా…. (కాస్త గట్టిగా) ఓయ్ మల్లయ్యా! ఏమిటి చేస్తున్న పనిని ఆపావు.

    మల్లయ్య:      (ఉలిక్కి పడ్డట్టు) ఏమిటి సారూ! తమరు కాఫీ తాగడానికి వెళ్ళలేదా!

    ప్రసాదరావు:    వెళుతున్నానులే…. అసలు నా సందేహమంతా నేను చెప్పిన మాటల్ని చెవిన వేసుకున్నావో… ..లేదోనని! ?

    మల్లయ్య:      విన్నాను సారూ! తమరు కాఫీ తాగి వచ్చే లోపు షూ రడీగా వుంచాలన్నారు. చేసి పెడతానులే తమరు వెళ్ళి రండి. (ప్రసాదరావు వెళ్ళబోయాడు) సారూ! కాస్త ఆగండి.

    ప్రసాదరావు:    ఏమిటి మల్లయ్యా మళ్ళీ…

    మల్లయ్య:      అటు…అదిగో…అటు ఆ రోడ్డు వేపుకు దృష్టి సారించి చూడండి.

    ప్రసాదరావు:    ఆఁ…. చూశాను. ఏముందక్కడ!?

    మల్లయ్య:     బాగా చూడండి సారూ!

    ప్రసాదరావు:    ఏమిటి మల్లయ్యా చూసేది… ఎండకు కళ్ళు మూసుకు పోతుంటే!

    మల్లయ్య:     అదే సారూ! కళ్ళు మూసుకుపోతున్నై, కాళ్ళూ మండి పోతున్నై. అయినా కాళ్ళు బొబ్బలుకట్టే పరిస్థితుల్లో పది మంది కలిసి మోసే బరువును తనొక్కడే చేతి బండిమీద లాక్కొస్తున్నాడు ఆ ముసలాడు. బాగా చూడండి.

    ప్రసాదరావు:   ఆఁ … చూశాను. ముసలాడు బండిని లాక్కొంటూ ఇటే వస్తున్నాడు. అయితే ఏమిటి?

    మల్లయ్య:     అదే… అదే… అదేసారూ… మాలాంటి బడుగుల జీవితం. తన జానెడు పొట్టకోసం ఎంతగా శ్రమపడుతున్నాడో చూస్తున్నారుగా! బాగా చూడండి. ఆ ముసలాడి కాళ్ళకు చెప్పులు లేకపోయినా పొట్టకూటికోసం బ్రతుకు జీవుడా అంటూ బండిలోని సరుకును గమ్యానికి చేర్చే నిమిత్తం ఎర్రని ఎండకు కాళ్ళు కాలుతున్నా అతి కష్టంమీద వంతెన పైకి బండిని లాకొస్తున్నాడు. ఆ ముసలాడ్ని చూస్తుంటే నా మనసు బాధకు గురౌతోంది సారూ!

    ప్రసాదరావు:   (అటు చూసి) ముసలాడికి చెప్పులున్నాయి మల్లయ్యా! పిచ్చికాకపోతే… వాడేంటి చెప్పుల్ని చేత పట్టుకొని బండిని లాగుతున్నాడు పిచ్చాడు. ఆ చెప్పులను కాళ్ళకు వేసుకోవచ్చుగా!

    మల్లయ్య:     మీ కళ్ళకు అలా కనిపిస్తున్నాడా! ఏమో సారూ! నాకైతే… మరోలా కనిపిస్తున్నాడు. బహుశా తన చెప్పులు తెగిపోతే వాటిని పారేయలేక… ఇప్పుటికిప్పుడే కొత్తవి కొనుక్కునే శక్తి తనలో లేక సవారీమీద కూలి డబ్బులు వచ్చిన తరువాత ఆ చెప్పులను మరమ్మతు చేయించుకోవాలన్న వుద్దేశంతో వాటిని చేత పట్టుకొని వస్తున్నాడనిపిస్తోంది.

    ప్రసాదరావు:  అంటే అవసానదశకు చేరిన ఆ చెప్పుల్ని వదిలేయలేక మరమ్మతు చేసి వాడుకోవాలను కొంటున్నాడనా నీ వుద్దేశం!

    మల్లయ్య:    అవును సారూ! ఖచ్చితంగా అంతే అయి వుంటుంది. కాకపోతే మండిపోతున్న ఈ ఎండకు వయస్సులో వున్న మనం సైతం చెప్పులు లేకుండా ఒఠ్ఠి కాళ్ళను నేలమీద మోపలేక పోతున్నాం. కాని ముసలాడు పట్టుదలతో, దీక్షతో వడగాలులను సైతం భరిస్తూ కాళ్ళు బొబ్బలెక్కుతున్నాసరే… ఆ బండి లాగుతున్నాడు. అలా చూడండి. పాపం… అన్నం లేకనేమో ముసలాడి డొక్క తన వెన్నెముకకు అతుక్కు పోయినట్టుంది. అందుకే తడబడుతూ బండి లాగుతున్నాడు పాపం! తన్ను చూస్తుంటే బహుశా మరో రెండు మూడు నిముషాల్లో మైకం కమ్మి బండితోపాటు క్రింద పడిపోయేలా వున్నాడు. సారూ! తమరు మరోలా అనుకోకపోతే కొట్టును చూస్తూ వుండండి. నేను వెళ్ళి ముసలాడికి సహాయపడి తన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఈ నీడన కాస్త సేద తీరేలా చేస్తాను. వస్తాను. (మల్లయ్య కదలబోయాడు)

    ప్రసాదరావు:   (కోపంగా) మల్లయ్యా… ఆగవయ్యా! ఏంటి నువ్వంటుంది? కాఫీ తాగడానికి వెళ్ళేవాణ్ణి ఆపి ముసలాడి వూసునందుకొన్నావ్! అసలేమనుకొంటున్నావ్ నువ్వు? మొదట నా పని చేసి పెట్టి నువ్వెక్కడికైనా వెళ్ళు. నాకెలాంటి అభ్యంతరం లేదు.ఆఁ.

    మల్లయ్య:     అది కాదయ్యా!

    ప్రసాదరావు:   ఏది కాదు. పని చేసి పెట్టవయ్యా బాబూ!.. ఛీ… నన్ను వెళ్ళనీవు… నువ్వూ పని పూర్తి చేసి పెట్టవు. ఏంటిది?

    మల్లయ్య:     క్షమించు సారూ…ఇవాళ ఆదివారమే కదా! బడి కూడా లేదాయే! వెంటనే వచ్చి రెడీ చేసి యిస్తాను. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి.

    ప్రసాదరావు:   అసలు నువ్వేమనుకొంటున్నావ్ మల్లయ్యా! ఇంట్లో మాకేం పనులు లేవనా నీ వుద్దేశం? (ఒక్కసారి ముఖంలోకి చూసి) సరే వెళ్ళు! ఆఁ…

    మల్లయ్య:     ఇప్పుడే వస్తాను సారూ! మీ పని పూర్తి చేస్తానులే… కూర్చొని వుండండి.

    ప్రసాదరావు:   అంటే… అప్పటికి నువ్వేదో గొప్ప మానవత్వమున్న మనిషివని ఋజువు చేసుకోవాలను కొంటున్నావులా వుంది.

    మల్లయ్య:     కాదు సారూ! మీరన్న మాటకు నాకు అర్థం కూడా తెలీదు. నాకు తెలిసిందల్లా ఒక్కటే… ఇబ్బందుల్లో వున్న సాటి మనిషికి చేతనైన సహాయం చేయడం! అందునా ఆ ముసలాడు నాలాంటి బడుగుజీవి. అలా బండి లాగలేక చెమటలు కక్కుతున్న ముఖంతో ఎండకు బొగ్గై పోతున్నాడు. తన్నలా చూస్తూ నేను వూరుకోలేను. నా చేతనైన సహాయం చేస్తాను. మీరటు కూర్చొండి. ఇప్పుడే వచ్చేస్తాగా (లేచి తలకు గుడ్డ చుట్టుకొని బయటికి నడిచాడు మల్లయ్య)

    ప్రసాదరావు:    ఇదిగో మల్లయ్యా… మల్లయ్యా…! ఛీ… చేస్తున్న పన్ని పక్కనపెట్టి వెళ్ళి పోయాడు దరిద్రుడు. అందుకే ఇలాంటి వాళ్ళ జీవితాలు ఎలాంటి ఎదుగు బొదుగూ లేకుండా అలాగే వుండి పోతున్నాయ్! (విసుక్కొని స్టూలుమీద కూర్చొని చేతిలో వున్న దినపత్రికను చూస్తున్నాడు. అంతలో ముసలాడ్ని ఓ చేత్తో పట్టుకొని తీసుకువచ్చాడు మల్లయ్య. అప్పుడు ముసలాడి చేతిలో తెగిన చెప్పులున్నాయ్. ప్రసాదరావు ముసలాడ్ని చూస్తూనే అసహ్యించుకొన్నట్టు లేచి పత్రికను మడుచుకొన్నాడు. మల్లయ్య తన సంచిలో వున్న నీళ్ళ బాటిల్ తీసి ముసలాడికి అందివ్వగా కాసిన్ని నీళ్ళతో ముఖం కడుక్కొని తతిమ్మా నీళ్ళను గటగటతాగి కండువాతో ముఖం తుడుచుకొన్నాడు ముసలాడు).

    బండి తాత:   దణ్ణం బాబూ! దాహంతో నాలుక పీక్కు పోతున్న సమయాన మంచి నీళ్ళిచ్చి దాహాన్ని తీర్చావు. నువ్వు చల్లగా వుండాలయ్యా.

    మల్లయ్య:     ఆఁ… ఆఁ …నేను చల్లగానే వుంటానులే! ఆ చెప్పులిలా తే తాతా!

    బండి తాత:    ఎందుకు బాబూ!

    ప్రసాదరావు:   ఎందుకేమిటి…అవి తెగి వున్నైగా! కుట్టిస్తాడేమోలే పాపం! అంతేగా మల్లయ్యా!

    మల్లయ్య:     అవును సారూ!

    బండి తాత:    మీరెవరు బాబూ!

    ప్రసాదరావు:   నేనా… నేనూ.. .నేనూ…ప్చ్… నా సంగతి నీకెందుకులే…

    మల్లయ్య:    అయ్యగారు ప్రసాదురావుగారని పేద్ద ఇంజినీరు. దాదాపు పదేళ్ళనుంచి నా కస్టమరు తాతా! అదిగో ఆ అపార్టుమెంటులో వుంటున్నారు. సారే కాదు… అపార్టుమెంటులో వున్న వాళ్ళంతా నా కస్టమర్లే! వాళ్ళందర్ని ఈ సారే నాకు పరిచయం చేశారు. నేనూ ఈ వృత్తితో వాళ్ళకు న్యాయం చేస్తూ భృతికి కావలసిన డబ్బును సంపాయించు కొంటున్నాను. వాళ్ళెవరైనా సరే చెప్పుల్ని మరమ్మతు చేయాలనుకుంటే నావద్దకే వస్తారు. ఇవిగో! ఇవి సారుగారి అబ్బాయి స్కూలు షూ రిపేరు చేస్తున్నాను!

    బండి తాత:     మంచిది బాబూ! ఇంకా మీలాంటి దయగల మహారాజులు అక్కడక్కడ వుండబట్టే మాలాంటి కూలి జనం బ్రతుకు తున్నారు.

    మల్లయ్య:     ఖచ్చితంగా చెప్పావు తాతా! ఈ సారులాంటి వాళ్ళ దయతోనే నాకు పస్తులు లేకుండా పూట గడుస్తోంది. సారు మనసున్నమహరాజు.

    ప్రసాదరావు:   నన్ను పొగడ్డం ఆపు మల్లయ్యా… పనిచూడూ!

    బండి తాత:   నమస్తే బాబూ!

    ప్రసాదరావు:  (నిర్లక్షంతో) ఆఁ…ఆఁ…(తలూపాడు)

    బండి తాత:   ఇక నేనొస్తాను బాబూ!

    మల్లయ్య:    అరే… అక్కడికి నిన్నెవరో బంధించినట్టు. వెళుదువులే తాతా! ముందా చెప్పులను ఇలా తే! కుట్టిస్తాను.

    బండి తాత:  వొద్దుబాబూ! నా వద్ద కూలీగా నీకివ్వటానికి డబ్బుల్లేవు.

    మల్లయ్య:   ఏంటలా అంటావ్! మండి పోతున్న ఈ ఎండకు చెప్పులు లేకుండా ఎలా వెళ్ళగలవు? పైగా పదిమంది మోతను బండి మీదేసుకొని ఒక్కడివే లాగుతున్నావు! ఆ కడుపేమో నీ వెన్నునంటుకొని వుంది. అసలు ఉదయం ఏదైనా తిన్నావో.. లేదో?

    బండి తాత: నాకలవాటే బాబూ! ఎండయినా… వానయినా… తిన్నా… తినక పోయినా బండి లాగాలి. అప్పుడే మాకు కవలం. అయినా దరికి చేర్చి చల్లటి నీళ్ళిచ్చావు. తాగాను. సేద తీరాను. ఇప్పుడు ప్రాణానికి హాయిగా వుంది. బయలుదేరుతాను బాబూ!

    మల్లయ్య:   అదే నేనడుగుతోంది… చెప్పులు లేకుండా ఎలా వెళతావని! అటు రోడ్డు వేపు చూడు. జనాలు ఎండకు తట్టుకోలేక ఎలా పరుగులు తీస్తున్నారో!? అటు ఆ కొట్టు వేపు చూడు. జనాలు కూల్ డ్రింక్సనీ, కొబ్బరి బోండాలని ఎలా అబగా తాగుతూ షెల్టర్ క్రింద నిలబడ్డారో! నీకు అవేవీ లేకపోయినా నీళ్ళు తాగావు. ఇక ఆ చెప్పులను ఇటిచ్చి, కాస్సేపు అటు కూర్చో! కుట్టిస్తాను. వేసుకు వెళుదువుగాని.

    ప్రసాదరావు:  అవును పెద్దాయనా! ఇవాళ ఎండ నూటా ఆరు డిగ్రీలు. తెలుసా?!

    మల్లయ్య:   ఏంటోలే బాబూ! ఎండ ఎన్ని డిగ్రీలున్నా పొట్ట కోసం నాకీ తిప్పలు తప్పవుగా! ఎలాగోలా నడిచి వెళ్ళి సరకు యజమానికి అందజేస్తాను. ఆయనిచ్చే కూలీ డబ్బులతో అక్కడే… చెట్టుకిందున్న సరోజమ్మ హోటల్లో ఓ సంగటి ముద్ద తిని ఎల్లిపోతాను. ఈ చెప్పుల్ని రేపు బాగు చేయించుకొంటానులే!

    ప్రసాదరావు:  సరోజమ్మ హోటలా…అదెక్కడ?!

    బండి తాత:  అవతలూరి పెద్ద బజారు దాపులో మర్రి చెట్టు క్రింద వుందిలే! మాలాంటి కూలి జనానికి తక్కువ ధరలకే కడుపునిండా భోజనాన్ని అందిస్తుంది మహాతల్లి.

    ప్రసాదరావు: అలాగా… అయినా అందాకా వెళ్ళాలిగా! అక్కడి వరకూ నువ్వు బండి లాగేసరికి నీ కాళ్ళు బొబ్బలతో పుండ్లు పడిపోతాయ్ పెద్దాయనా!

    మల్లయ్య:   అలా చెప్పండి సారూ! ఇదిగో… సారు చెప్పిన మాటలు విన్నావుగా తాతా!

    బండి తాత: విన్నాను బాబూ! ఆయనంది అక్షరాల నిజం. అయినా నాకు తప్పదుగా! (నిట్టూర్చి) మాలాంటి పేదోళ్ళ బ్రతుకులు యిలా తెల్లారాల్సిందే!

    ప్రసాదరావు: ఇదిగో పెద్దాయనా! ఏమిటి వేదాంతాన్ని వల్లిస్తున్నావ్! చెప్పిన మాట విను. తను చెప్పులు కుట్టిస్తానంటున్నాడు. ఇవ్వచ్చుగా!?

    మల్లయ్య:  వుత్తినే కుట్టి పెడతాను తాతా! నాకు డబ్బివ్వనక్కరలేదు.

    బండి తాత: కుదరదు బాబూ! వుత్తినే కుట్టి పెడతానన్న ఆ మాట నాకు అదోలా అనిపిస్తోంది.

    ప్రసాదరావు: ఎలా అనిపిస్తోంది పెద్దాయనా! వుత్తినే చేసి పెడతానన్నందుకు బాధనిపిస్తుందా?!… చెప్పు?

    బండి తాత: అవును బాబూ! నేను నాలాంటి వాళ్ళ శ్రమను దోచుకొనే వ్యక్తిని కాను.

    ప్రసాదరావు: అంటే నీ మాట ప్రకారం తతిమ్మా వాళ్ళు ఈ మల్లయ్య శ్రమను దోచుకొంటున్నారనేగా అర్థం.

    మల్లయ్య:  అలాని కాదులే సారూ! నేను వుత్తినే అని అన్నానుగా… అందుకోసం ఆ మాటన్నాడు తాత. ఏం తాతా!?

    బండి తాత:  కాదు బాబూ! నిజంగానే అన్నాను.

    ప్రసాదరావు: అంటే….

    బండి తాత: అంటే మాయపుచ్చో లేక దౌర్జన్యంతోటో, అదీ కాకపోతే అస్సలు పైసలివ్వకుండా పని చేయించుకోవడమనేది శ్రమను దోచుకోవడమే అవుతోంది. తన శ్రమకు తగ్గ ఫలితం యివ్వడానికి ఇప్పుడు నావద్ద డబ్బుల్లేవు.. అందుకే ఆ మాటన్నాను,

    ప్రసాదరావు: మల్లయ్యా! వింటున్నావా పెద్దాయన అంటున్న మాటల్ని!? ఇదిగో పెద్దాయనా… నా మటుకు నేను బేరమాడి డబ్బు తగ్గించుకొన్నాను కాని… నువ్వన్నట్టు శ్రమను దోచుకోవడంలేదు. కనుక నువ్వంటున్న మాటలు నాకు పూర్తిగా సంబంధం లేదు సుమా!

    మల్లయ్య:   ఏదోలే సారూ! మీరు పట్టించుకోకండి. ఇదిగో తాతా! అవి పెద్ద పెద్ద మాటలు. ఆ మాటల్నీ అలాంటి వాళ్ళ ముందు మనం వాడకూడదు. నీ చెప్పులనివ్వు కుట్టిస్తా!

    బండి తాత: బాబూ! నీ మంచి మనస్సుతో నీలాంటి వాడనైన నాకు సహాయ పడాలని అడుగుతున్నావ్. నాకు సంతోషమే! అయితే నాకోసం నువ్వు చేసే పనికి పదో పరకో విలువుంటుంది, ఆ డబ్బు నీకో పూటకు తిండికొస్తుంది. అది నేను ఇప్పుడే యివ్వాలి తప్ప నీచేత ఆ పని చేయించుకొని ఆ డబ్బివ్వకుండా వెళితే నా మనసు పదే పదే బాధ పడుతుందయ్యా! వుచితంగా నీ చేత ఆ పని చేయించుకోలేను. నన్ను వొదిలేయ్!

    మల్లయ్య:  నేనలా అనుకోవడంలేదు తాతా! నేను నాలాంటి వాడికి సహాయ పడుతున్నానని తృప్తి పడతాను. నీకు చేసి పెట్టే ఈ పని నా కన్న తండ్రికి నేను చేసుకొన్నట్టు భావిస్తాను. (ముసలాడి చేతిలో నుంచి చెప్పుల్ని లాక్కొని ప్రక్కన పెట్టుకొని ప్రసాదరావుగారి అబ్బాయి షూ ని మరమ్మతు చేశాడు.) సారూ! ఇవిగో షూ. బాగా చేశాను. ఇంకో సంవత్సరం వరకూ దిగుల్లేదు. (షూని అటు ముందుంచి ముసలాడి చెప్పుల్నికుడుతున్నాడు)

    ప్రసాదరావు:  (మల్లయ్యను తదేకంగా చూసి) అవునూ… నిన్నోమాట అడగాలి మల్లయ్యా!

    మల్లయ్యా:   అడగండి సారూ!

    ప్రసాదరావు:  (జేబులో నుంచి డబ్బులు తీస్తూ) ఆఁ… ఏమీలేదు. నావద్ద అంతగా బేరమాడిన నువ్వు ఆ బండి తాతకు బ్రతిమాలి మరీ… వుత్తినే చెప్పులను మరమ్మతు చేసి యిస్తున్నావ్! నీ లాజిక్కు ప్రకారం అందులో న్యాయముందనుకొంటున్నావా!?

    మల్లయ్య:   న్యాయ అన్యాయాల గూర్చి నాకు గొప్పగా తెలియదు సారూ! అయితే వున్నోళ్ళ వద్ద ఓ పావలా అడిగి తీసుకోవాలి. లేనోడివద్ద వొదిలేసుకోవాలన్నది నా సిధ్ధాంతం, పధ్ధతీనూ. మీరు వున్నోళ్ళు. ప్రభుత్యోద్యోగులు. జీతంగా ప్రతి నెల వేలల్లో తీసుకునేవారు. నిత్యం డబ్బును చూస్తుండే వారు. మీ వద్ద నా శ్రమకు తగ్గ ఫలితాన్ని ఆశించడంలో తప్పులేదు. పైగా అది నా వృత్తి ధర్మం.

    ప్రసాదరావు:  అయితే పెద్దాయనకు నువ్వు చేస్తోంది శ్రమ కాదా? అది నీ వృత్తి ధర్మంలోకి రాదా!?

    మల్లయ్య:   నా దృష్టిలోఅది శ్రమకాదు సారూ! సాటిమనిషిని ఆదుకోవటం. అదీ… నాలాంటి పేద వాడికి నేను చేస్తున్న చిన్న సహాయం. అందులోని తృప్తి నాకు అంతులేనిది. అవును సారూ! మీ కోసం నేను చేసిన పనికి ఎనభై రూపాయలు తక్కువని భావించాను. కానీ… నా పొట్ట కూటికోసం ఆ డబ్బు అవసరమని ఒప్పుకొన్నాను. ఇక బండి తాత వద్ద డబ్బు తీసుకోకుండా పని చేసి పెడుతున్నానంటే అందుకు కారణం ఈ ఎండలకు తను మూల పడిపోయి సంపాదన ఆగిపోతే తన కుటుంబం పస్తులతో వుండాల్సి వస్తుందన్న వుద్దేశంతోనే! అందుకే ఆ పని నా కన్న తండ్రికి చేసుకొంటున్నట్టు ఫీలయి సంతోషంగా చేశాను. ఈ అనుభూతిని మీరు అనుభవిస్తే మీకూ అర్థమౌతుంది. ఆ తాత బండి లాగితే పైసలు, వాటితో తనిల్లు గడవాలి. ఆ బండి ఒక్క రోజు ఆగిపోతే….

    ప్రసాదరావు:  ప్రపంచం స్తంభిస్తుందా! నువ్వేమంటున్నావో నాకు అస్సలు అర్థం కావడంలేదు మల్లయ్యా!

    మల్లయ్య:    అదే సారూ! తను బండి లాగడం ఒక్క రోజు ఆగిపోతే తనకొచ్చే కూలీ డబ్బులు రావు. ఇక తనింట్లో పొయ్యికి పనుండదు! అలాగే తనకు చెప్పులు కుట్టినందుకు కూలీగా ఓ ముప్పై రూపాయలు నాకిస్తే తనింటిల్లపాది ఒక పూట తిండి మానుకోని పస్తు వుండవలసి వస్తుంది. అర్థమైందా సారూ!

    ప్రసాదరావు: (ఆలోచన ధోరణితో) అర్థమైంది మల్లయ్య! నాకు ఇప్పుడర్థమైంది. నువ్వంటున్న ఈ మాటల్లో గూడార్థంతో కూడికొన్న న్యాయపరమైన ధర్మం దాగుందని ఇప్పుడు అర్థమైంది.. నువ్వు సామాన్యుడవే అయినా… నాకు… ఇందులో దాగున్న నిగూఢమైన జీవిత సత్యాన్ని చెప్పావు! నిన్ను హర్షించక తప్పదు.

    మల్లయ్య:   ఏదోలే సారూ! మేము ఏ పూటకాపూట తిండికి వెతుక్కునేవాళ్ళం. మీరైతే… తిన్నది పోను మిగిలింది కుప్ప తొట్టి పాలు చేస్తారు. మీరు మీ పిల్లల భవిష్యత్తును వూహించుకొని ఆర్థికంగా వాళ్ళెప్పుడూ కష్టపడకూడదన్న వుద్దేశ్యంతో పైసకు పైసా చేరవేసుకొంటారు. మాకు వెనుకేసుకోవడానికి అసలు పైసలే వుండవు. మా ఈ పోరాటం కూటికోసం. మీ ఆరాటం భావి తరాల మీ పిల్లల భవిష్యత్తు కోసం.

    ప్రసాద రావు: ఒప్పుకొంటున్నాను మల్లయ్యా! నువ్వు చెబుతుంది అక్షరాలా నిజమని ఇప్పుడు ఒప్పుకొంటున్నాను. నిజం చెపుతున్నా… నీలో ఇంతటి మహనీయమైన మానవత్వం వుంటుందని నేను యెప్పుడూ అనుకోలేదు. నాతో అంతగా బేరమాడినా నీకు డబ్బు అవసరమని తగ్గించుకొని చేసిన నా పనిని, అస్సలు డబ్బు తీసుకోకుండా ముసలాడి చెప్పుల్ని మరమ్మతు చేసిచ్చి తృప్తిపడ్డ ఆ పనితో పోల్చుకొని లోతుగా ఆలోచిస్తే అందులో నీ త్యాగ బుద్ది, అంతకు మించి ధర్మగుణాలు కనబడుతున్నాయ్! నువ్వు నిజంగా ఓ మహోన్నతమైన మంచి మనసున్న మహా మనిషివి. నీతో నన్ను పోల్చుకోలేను మల్లయ్యా! (మల్లయ్య నవ్వుతూ బండి తాత చెప్పులు ఆయనకు అందించాడు)

    బండి తాత: అవును బాబూ! నేనూ అంతే! మల్లయ్యలోని మంచితనాన్ని అర్థం చేసుకొని రాజీ పడ్డాను. అందరూ మల్లయ్యలా వుండరు బాబూ! మల్లయ్య మానవత్వమున్న మహా మనిషే! మల్లయ్యా! నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా బ్రతకాలయ్యా! వస్తాను, వస్తాను బాబూ!(చెప్పులను కాళ్ళకేసుకొని వెళ్ళి పోయాడు)

    ప్రసాదరావు: (మల్లయ్య షూని సంచిలో పెట్టి యివ్వగా తీసుకొని) ఇదిగో మల్లయ్యా! నువ్వు బేరం కుదుర్చుకోక ముందు అడిగినట్టు నీ శ్రమకు తగ్గట్టు ఫలితంగా వందరూపాయలు యిస్తున్నాను. తీసుకో!

    మల్లయ్య: వద్దు సారూ! నేను బేరం కుదుర్చుకున్న ఆ ఎనభై రూపాయలు మాత్రం ఇవ్వండి చాలు. వాటిలో ఆ పోలీసు రాములుకి ఇరవై రూపాయలు మామూలు పోను నా ఇల్లు ఓ పూట గడవడానికి తతిమ్మా డబ్బు వుంటుంది. అవి చాలు నాకు.

    రాములు: (ప్రవేశించి) అఖ్ఖరలేదు మల్లయ్యా! నాకూ ఇక నువ్వు మామూలు యివ్వఖ్ఖరలేదు.

    మల్లయ్య: అయ్యా… మీరు… మీరు….

    రాములు: నేనే మల్లయ్యా! మామూలు కోసం నీ వద్దకొస్తున్న వాడినల్లా అక్కడే ఆగిపోయి మీ సంభాషణలను మొత్తం విన్నాను. విన్న తరువాత నీ పట్ల నా ప్రవర్తనను తలచుకొని నాకు నేనే సిగ్గుపడ్డాను. ఆ మరునిముషమే మనిషిగా మారిపోయాను. అవును. ఇన్నాళ్ళు డబ్బుకోసం కక్కుర్తి పడి ఓ జలగలా మీలాంటోళ్ళ కష్టార్ఙితాన్ని పీల్చుకు తిన్నందుకు యిప్పుడు బాధపడుతున్నాను. నేను మనిషిలా కాకుండా మరోలా బ్రతికినందుకు సిగ్గు పడుతున్నాను. ఇవాల్టితో ఆపుకొంటున్నాను మల్లయ్యా! నా హోదాను చూపి మామూలన్న పేరుతో మీలాంటోళ్ళ సంపాదన్ను ఎగరేసుకుపోయే ఆ దుశ్చర్యలను ఇక ఆపుకొంటాను. అవును. ఇక నాకొచ్చే జీతంతోనే చక్కగా, చిక్కగా సంసారాన్ని సంతోషంగా గడుపుకొంటాను. మల్లయ్యా! ఇన్నాళ్ళు నిన్నింతగా పీడించుకు తిన్నానే నామీద నీకెప్పుడూ కోపం రాలేదా?

    మల్లయ్య:  లేదయ్యా! మీలోనూ ఎక్కడో కాస్త మంచి మనస్సుందని గమనించాను. అది ఏదో ఒక రోజు బయటపడి మీరు మామూలు మనిషి అవుతావని నమ్మాను.

    రాములు:  అది ఈ రోజే మల్లయ్యా! నీ మాటలతో నేను పూర్తిగా మారిపోయాను.

    ప్రసాదరావు: అది నిజం మల్లయ్యా! నువ్వు నిరక్షరాస్యుడవైనా కష్టించి నిజాయితీగా బ్రతికే శ్రమజీవివి. నీ మంచి చేతలను తలచుకుంటే వాటికీ అతీతుడుగా వున్న నేను నీ ముందు ఓ మరగుజ్జునై పోయానంటే నమ్ము. బండి తాతను ఒప్పించి తన చెప్పుల్ని మరమ్మతు చేసి యిచ్చి ఆయన ప్రేమాభిమానాలకు, దీవెనలకు పాత్రుడవైన నీలో ఓ మహాత్ముడ్ని, ఓ కరుణామూర్తిని చూస్తున్నాను. నీలోని మానవత్వానికి నా జోహార్లు. ఇక నేనూ ప్రతి దానికి బేరమాడి పైసలు తగ్గించుకోవాలన్న ఆ నీచ స్వభావానికి నేటితో తిలోదకాలనిస్తున్నాను. ఇది సత్యం.. (మల్లయ్య చేతిలో చెయ్య వేసి విడిపించుకొని అటు తిరిగాడు ప్రసాదరావు. స్థబ్దత)

    వ్యాఖ్యానం: మనిషి పుట్టి పెరగడం, సభ్య సమాజంతో కలిసి జీవించడం ఒక ఎత్తైతే… తను జీవించిన ఆ జీవితాన్నినలుగురికి వుపయోగపడేలా చేసుకోవడం మరో ఎత్తు.

    అది నిస్వార్థంగా సాగి అవతలి వాళ్ళకు ఆదర్శప్రాయంగా వుంటే మంచి మనుగడకు, మానవత్వానికి దారి తీస్తుంది.

    (అయిపోయింది)

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here